చదివారా ?! ............ విశ్వమానవ స్వప్నాన్ని ఆవిష్కరించిన 'దేవరాజు మహారాజు ’ January 10th, 2010 : ఆంధ్రభూమి సుధామ ---------- కవిగా, విమర్శకునిగా, కథా రచయితగా, అనుసృజనశీలిగా ఇప్పటికే సుప్రతిష్ఠితుడైన దేవరాజు ‘్భషకనే కల- కవిత్వం’ అంటూ విశ్వమానవ స్వప్నాన్ని ఆవిష్కరించాడు. మహారాజు మానవతా విలువలకు పట్టంకట్టాడు. ‘‘అనువాదానికి గ్రామ్యదృష్టి, జాతీయదృష్టి మాత్రమే సరిపోదు. అవి ఉంటూనే విశ్వదృష్టి కూడా ఉండాలి. విశ్వమంతా నాది అనే భావనకి ఎదిగినవాడే అనువాదానికి పూనుకుంటాడు. ప్రపంచ ప్రజలంతా నావాళ్లు, ప్రపంచ సాహిత్యమంతా నాది అనే భావన అనువాదానికి తప్పనిసరి. కవిత్వం, కథ మొదలైన సృజనాత్మక ప్రక్రియలన్నీ ఎగసిపడ్డ మనిషి చైతన్యానికి ప్రతీకలు. దాన్ని నిలుపుకోవాలనుకునేవారే అనువాదాలవైపు ఆకర్షితులౌతారు’’ అంటూ తన అనుసృజన వెనుకగల అనుభూతి లక్ష్యాన్ని ఆవిష్కరించాడు. అంతేకాదు! అనువాదంలోని, అందునా కవిత్వానువాదంలోని సమాంతర సృజనాత్మకతను ఎరిగినవాడు కనుకనే- ‘‘ఒక భాషలోని మాటల్ని మరో భాషలోకి మార్చడమే అనువాదం కాదు. మాటల్లో అంతర్గతంగా దాగిన స్పర్శను, స్పృహను స్ఫూర్తిని, ఆర్తిని, అనుభూతిని మార్చగలగాలి’’ అని గుర్తించి, ఆ పనే నిజాయితీగా చేసాడు. దేవరాజు మహారాజు మునుపే భారతీయ కవితాత్మను ‘కవితా భారతి’గా ఆయా మూల కవులను చాలామటుకు నేరుగా సంప్రదించి మరీ అనువదించి, ఆవిష్కరించి అందించాడు. ఇప్పుడీ కవితా ప్రపంచంలో అర్జెంటీనా, ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, చైనా, చెకొస్లొవేకియా, డెన్మార్క్, ఫ్రాన్స్ జర్మన్, ఇండొనేషియా, ఇటలీ, జపాన్, లాటిన్ అమెరికన్, లెబనాన్, మెక్సికో, పాకిస్తాన్, పోలెండ్, రష్యా, సౌత్ ఆఫ్రికా, దక్షిణకొరియా, స్పెయిన్, సిరియా, అమెరికా, యుగోస్లేవియా దేశాల కవితలను కవితా ప్రపంచంగానూ, రెండవ భాగంలో ‘కవితా భారతీయం’గా గుజరాతి, హిందీ, కన్నడ, కాశ్మీరి, కొంకణి, మలయాళం, మరాఠి, ఒరియా, పంజాబి, ఉర్దూ కవుల కవితలను, మూడవ భాగంలో ప్రత్యేకించి భారతీయ కవయిత్రుల అనువాదాలను కవితా భారతీయం-3గా, అస్సామీ, బెంగాలీ, డోగ్రీ, గుజరాతి, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, తమిళ, ఇండియన్ ఇంగ్లీష్ భాషలనుంచి అనువదించడం ఈ సంపుటికి ఒక విస్తృతిని, వైశిష్ట్యాన్ని సంతరించింది. మరే భాషలోనూ ఇలాంటి అనుసృజన కృషి జరగలేదేమో! నిజంగా ప్రపంచాన్నీ, ప్రపంచ మానవాళి ఆలోచనానుభూతుల సరళినీ ప్రతిబింబించే మానవాత్మ దర్పణం ఈ సంపుటి- ‘నీకూ నాకూ మధ్య ఒక రంగుల నది.’ సహచరి క్రిషి (కృష్ణకుమారి)కి ఈ కృషిని అంకితం చేయడం ఇంకా బాగుంది. మూలాలు మనకు తెలియకపోయినా- ఆ మూలాగ్రం ఆ కవుల అక్షరాల్లోని కవిత్వ స్పృహను, స్పర్శను, అనుభూతిని అందించేందుకు దేవరాజు పడిన శ్రమ ఈ కవిత్వం చదువుతుంటే ఫలిస్తుంది అనడానికి పఠితకు కలిగే స్పందనలే ప్రబల తార్కాణాలు. దేవరాజు చిత్తశుద్ధి, నిజాయితీ వున్న కవి. ఇతర భాషాభినివేశం వున్న కొందరు ప్రముఖ కవులే, ఆయా మూల భాషల కవిత్వ సృజనను తెలుగు చేసుకుని, మూలాలను విస్మరించి తమదిగా మూలమూలల్లో నిస్సిగ్గుగా చెప్పుకుంటున్న వంచనా సందర్భంలో నేడు ఆయా భాషా కవుల సృజనాత్మకతను సంరక్షించడానికే, తెలుగులో అనుసృజనచేసి, కొన్నిచోట్ల ఆ భావాలకు మెరుగులు దిద్దినట్లుగా కూడా చేసినా, తాను ఆ కవుల కవితాత్మ ముందు ఒదిగే వుండడం నిజంగా ఎదిగిన లక్షణం. అమ్మ చివరి క్షణాలను అమెరికాలోని తమ్ముడు అద్భుతమైన వీడియోగా తీసి పంపించమని ఫాక్స్ పంపిన అయ్యప్ప ఫణిక్కర్ మలయాళ కవితను దేవరాజు లేఖగా అనువదించిన తీరు- మానవ సంబంధాల పరిణామాల తీరు గ్రహించాక, నిజంగానే హృదయాన్ని కలచివేస్తుంది. * నీకూనాకు మధ్య ఒక రంగుల నది (కవితా ప్రపంచం) డా. దేవరాజు మహారాజు జీవన ప్రచురణలు
by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PdbAqj
Posted by
Katta