పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

9, జులై 2012, సోమవారం

పూర్ణిమ సిరి॥తెలిసి..తెలిసీ॥

ఆసాంతం విరబూసిన రెమ్మని
అడిగావా ఎప్పుడైనా
నిన్నటి మొగ్గలు ఏమయ్యాయని
మరి నన్నెందుకు అడుగుతావ్
ఈ వేళ మాటలు కరువయ్యాయా అని...

అమావాస్యరోజున నక్షత్రాలతో మెరిసే
ఆకాశాన్ని అడిగావా ఎప్పుడైనా
ఆ చంద్రుడు లేకున్నా నీకేం లోటనీ
మరి నన్నెందుకు అడుగుతావ్
నీవు లేని క్షణం ఎలా ఉందనీ

నీవన్నీ ప్రశ్నలే ఎప్పుడూ
సమాధానాలన్నీ నీతోనే... నీలోనే..
ఏం కాదంటావా? నా మాటల్లోనిజం లేదంటావా??
ఇదిగో మళ్ళీ నేను కూడా ప్రశ్నిస్తున్నా
సమాధానం తెలిసి తెలిసి...
*8.7.2012

పూర్ణిమ సిరి॥ముంగిలి॥

దారి పొడవున
జారి పడిన వరి గింజలను
ఒడుపుగా ఏరి తెచ్చి
గొలుసులుగా కడతాను
గుమ్మానికి వేలాడదీస్తాను..

వచ్చీ పోయే ఓ పిచ్చుక
నీకెలా చెప్పేదే-
అలా జారిపడిన గింజలపై జాలి కానీ
నాకై నువ్ ఎగిరి ఎగిరి రావాలనే ప్రేమ కానీ
నాకేమి లేవని...

ఏటి ఒడ్డున చేరి
అందమైన గులకరాళ్ళూ ఏరి
పలురకాల జలపుష్పాలు తెచ్చి
గాజు పెట్టె లో అమరుస్తాను
ముంగిలిని అలంకరిస్తాను

చూడగానే ముద్దులిస్తూ
మురిపించే సజీవ జలపుష్పమా!
నీకెలా చెప్పేదే..
నాలోకం నీవే అని భ్రమించే నిన్ను
అందంగా బంధించానని
నీలోకాన్ని నే కుదించానని..

నాకోసమే అన్నీ చేస్తూ...
నావల్లే అన్నీ అని తలచే నేను
అన్నింటికన్నా తక్కువే అని
తెలిసినా ఎలా ఒప్పుకునేది..
ఈ తలపులనుండి ఎలా తప్పుకునేది...
*8.7.2012

ప్రవీణ కొల్లి॥నిశ్శబ్దం॥


నా చుట్టూ నిశ్శబ్దపు రాజ్యం
రాణిని నేనే, దాసిని నేనే!
ఆలోచనల అలల్లో తీరం చేరితే
సామ్రాజ్యమంటాను!
ఆశల వలలో చిక్కుకుపోతే
నడిసముద్రమంటాను!

నుదుటి స్వేదం
గుండెలపైకి జారి
నిశ్శబ్దాన్ని చిద్రం చేస్తుంది
అంతే వేగంగా
తటాకంలోని గులకరాయి
బుడుంగున మునిగిపోతుంది….

ఏ పలకరింపో
ఓ శబ్ద తరంగాన్ని అలా మోసుకొచ్చి
చుట్టపుచూపులా ఇలా తరలిపోతుంది….

దివారాత్రుళ్ళు లోలకానికి అతుక్కుపోయినట్టున్నాను!
అవును కాదుల నడుమ
ఊపిరి సలపనంత ఊగిసలాట…
గడియారపు టిక్కుటిక్కులే మిగిలిందిక

కనురెప్పల కదలికలలో సవ్వడేది?
కన్నీటి సుడులలో హోరు, మీరెవరన్నా విన్నారా?

నాకనిపిస్తోంది , నిశ్శబ్దమే శాశ్వతం……..కాదంటారా?
*9.7.2012

నరేష్ కుమార్॥ఒక తుఫాన్॥


మనసులో ఒక టోర్నడో

ఎక్కడో సుడి తిరిగే ఆలోచనలన్నీ
లోచనాలెగరేసి చేస్తున్న
ఓ హల్లీసకం 

గుండెల్లో రక్త నాళాలన్నీ
ఉద్వేగాగ్నిలోకాలిపోతూ కాగిపోయిన
నెత్తుటిని ఉమ్మేస్తూ..
ధ్వాంతాన్ని ధిక్కరిస్తూ దీపమై ప్రజ్వలిస్తూ
సుడిగాలిగా రేగుతున్నాయ్
మస్తిష్కాన్ని బద్దలు కొట్టే ఢంకారవం
గూబలు పగిలేలా ద్వనిస్తూ
సుప్త కంకాళాలలో జీవాన్ని వొంపుతూ
కరాళ నృత్యాన్ని చేయిస్తోంది 

పారిపో...! పారిపో...!
నానుండి నువ్వు నీ స్వార్థాన్ని తీసుకొని
ఇప్పుడిక్కడ
స్వచ్చమైన మనసె మిగులుతుంది..
*8.7.2012

ఉషారాణి కందాళ ॥ప్రతి చూపుకి ఒక పదునుంది!॥

ఎగిరే గాలిపటానిది ఎప్పుడూ పై పై చూపే!
కట్ కొట్టే పతంగులను పట్టించుకోదు, కరెంటు తీగలను లెక్కచెయ్యదు!!


ఉరికే అలది ఎప్పుడూ మునుముందు చూపే!
అడ్డొచ్చే రాళ్ళను చూడదు,
 విరిగే కెరటాల్ని గమనించదు!
వేటాడే చిరుతది ఎప్పుడూ వాడిచూపే!
పొంచిన శతృవులకు భయపడదు, బంధించే వలలకు వెరువదు!
విలుకాడికి ఎప్పుడూ ఎదురు చూపే!
బాణం గురి తప్పనీడు

దృష్టి లక్ష్యంనుంచి మరల్చడు!
కత్తి పట్టిన వీరునికెప్పుడూ కరుకు చూపే!
రక్తానికి జడిసిపోడు, 

ఆయుధాలకి హడలిపోడు!

ఆశావాదిది ఎప్పుడూ రేపటి చూపే!
నిరాశలకు భయపడడు, నిరీక్షణలు మానుకోడు! 


కలం పట్టిన వాడిదీ  ఎప్పుడూ చుట్టూ చూపే!
విమర్శలకు భయపడరు, విసుర్లకు విరుచుకుపడరు!
కంటతడో, గుండె దడో..

ఆ చూపులని లొంగదియ్యలేవు!

ప్రతి చూపు కి ఒక పదునుంది!

ప్రతి చూపుకి ఒక పరుగుంది!


* 9.7.2012

జయశ్రీ నాయుడు॥ కల్లోల జగతి॥

కాలమెందుకు
కదిలిపోతుంది..
అదృష్టాన్నీ
ఆనందాన్నీ
దోచుకు పోతుంది..

ఆనందమెంత అమాయకం
ఎప్పుడూ వుండిపోతాననే...
ఆశ కి ఎంత ఆశ
కల నుండి నిజమౌదామనే..

నీకైనా తెలుసా
ఆ నువ్వుగా వుండవనీ
తెలియకుండా వుంటుందా
అది నువ్వేగా...

గుప్పిట మూసిన కాలమే
తెరవగానే ఎంత ఉలికిపాటో
గుండె నుండి కన్నీరు
కంటిలో ఆవిరైనట్టు

భగ్గుమన్న ప్రతిక్షణమూ
హృదయపు ఆర్తనాదం
నీకు చేరని దూరంలోనే
మెరుపుల్లో మాయం

చిరునవ్వులన్నీ నిజమూ కాదూ
మౌనాలన్నీ మూగవీ కావూ
తెలిసినా ఉలకని నిన్ను
పలకరించి మరీ నవ్వుతాను..

నాలోనే మౌనం
నాలోనే మధనం
నాలోనే గరళం
ఆన్నిటా హాలాహలం

అమృతమెందుకు
అమరత్వం వద్దు
నిశ్చలత్వం చేదించి
కల్లోల జగతి లోనే
నా కలల కుటీరం

 *08-07-2012

సుజాత సుజాతతిమ్మన॥అటూ...ఇటూ....॥


ఙ్ఞాపకాల సమాదులవెంట
ఆగని పరుగులు
శిధిలాల కాలవాలమయినా
వీడని పచ్చివాసనలు

క్షణికమయిన ఆలోచనల
నీటిబుడగలో....
బ్రతుకు చిద్రమై
భవిష్యత్తును కాల్చేసిన
చితిమంటలు

అర్థమయీ...అవక
నలుగుతున్న భావం
ఒకటే...జీవితం..
అటూ...ఇటూ.....
*6.7.2012