కరేనా జగ్ మేం అలావ్ తో షేర్ కిస్ మస్రఫ్
కరేనా షహర్ మేం జల్ తాల్ తో చష్మె ఇనామ్ క్యాహై
ప్రపంచంలో వెలుగు నింపని వాక్యమెందుకు
ఊరిని ముంచెత్తని కన్నీరు ఎందుకు
ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఎలాంటి కవి అన్నది చెప్పడానికి పై కవిత చాలు. నూరేళ్ళ క్రితం జన్మించిన ఫైజ్ నేటికి కూడా కవిత్వ ప్రేమికుల మనసుల్లో సజీవంగా నిత్య యవ్వనుడిగానే ఉన్నాడు. ఫైజ్ గొప్ప కవిగా కేవలం భారత ఉపఖండంలో మాత్రమే కాదు యావత్తు ప్రపంచంలో పేరు ప్రతిష్ఠలు పొందాడు. ఫైజ్ తండ్రి గురించి చాలా మందికి తక్కువ తెలుసు. కాని వాస్తవానికి ఆయన కూడా మంచి కవి, పండితుడు. నిజానికి ఫైజ్ కన్నా ఆయన తండ్రిగారి జీవితం మరింత సవాళ్ళతో కూడుకున్న జీవితం. సియాల్ కోట్ (ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది)లో ఒక నిరుపేద పశుకాపరి కొడుకు సుల్తాన్ ముహమ్మద్ ఖాన్. ఈయనే ఫైజ్ తండ్రి. సుల్తాన్ ముహమ్మద్ ఖాన్ తెలివితేటలు గమనించి అక్కడి ఒక ఉపాధ్యాయుడు ఆయనకు చదువు చెప్పించాడు. సియాల్ కోట్ లో చదువు ముగిసిన తర్వాత సుల్తాన్ ముహమ్మద్ ఖాన్ లాహోర్ వెళ్ళి చదువు కొనసాగించాడు. అక్కడ నిరుపేద, అనాథ పిల్లలతో పాటు మస్జిదులో ఉండి చదువుకున్నాడు. ఉర్దూ, పర్షియన్, ఇంగ్లీషు భాషల్లో తిరుగులేని ప్రావీణ్యం సంపాదించాడు. అదృష్టవశాత్తు ఒకరోజు ఆప్ఘన్ రాజు దర్బారులో అధికారి హబీబుల్లా ఖాన్ ను కలవడం జరిగింది. సుల్తాన్ ముహమ్మద్ ఖాన్ భాషా ప్రావీణ్యం చూసి ముచ్చటపడిన ఆ అధికారి ఆయన్ను ఆఫ్ఘన్ రాజదర్బారుకు తీసుకెళ్ళాడు. క్రమేణా సుల్తాన్ ముహమ్మద్ ఖాన్ ఆఫ్ఘన్ రాజుకు వ్యక్తిగత అనువాదకుడిగా, మంత్రిగా ఎదిగాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ కేంబ్రిడ్జిలో న్యాయశాస్త్రం చదివాడు. అక్కడే ఇక్బాల్ వంటి మహాకవిని, తాత్వికుడిని కలిశాడు. చివరకు సియాల్ కోట్ లోనే స్థిరపడి న్యాయవాద వృత్తి కొనసాగించాడు. ఫైజ్ గారి తండ్రి కథ ఇది. సియాల్ కోట్ లో స్ధిరపడిన తర్వాత ఆయన ఫైజ్ తల్లిని పెళ్ళి చేసుకున్నాడు. ఫైజ్ జన్మించిన తర్వాత సయ్యద్ మీర్ హసన్ వంటి పండితుల వద్ద విద్యాభ్యాసం చేయగలిగాడు. ఫైజ్ ఒక నాస్తికుడన్న ఆరోపణలు ఉన్నాయి. కాని సంప్రదాయిక ముస్లిమ్ కుటుంబాల్లో పిల్లలు ఖుర్ఆన్ కంఠస్థం చేసిన విధంగానే ఫైజ్ కూడా ఖుర్ఆన్ కొంతభాగం కంఠస్థం చేశాడు. ఫైజ్ నాస్తికుడన్న ఆరోపణలు బలంగా వినిపించింది 1951లో ఆయన అరెస్టయిన తర్వాత. రావల్పిండి కుట్ర కేసులో పాకిస్తాన్ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసింది. నాలుగేళ్ళు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈ ఆరోపణలు చాలా బలంగా వచ్చాయి. టర్కీలో ముస్తఫా అతా తుర్క్ చేసిన మాదిరిగా పాకిస్తాన్ లో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని కొందరు వామపక్ష భావాలతో ప్రభావితులైన సైనికాధికారులు ప్రయత్నించిన కేసు రావల్పిండి కుట్ర కేసుగా చరిత్రకెక్కింది. ఈ పథకంలో ఫైజ్ కూడా భాగస్తుడే. ఫైజ్ జైల్లో ఖైదీలకు ఖుర్ఆన్ చదవడం నేర్పేవాడు. ఇది చూసి జైలర్లు ఆశ్చర్యపోయేవారు. ఈ కుట్ర కేసులో నిందితులందరూ నాస్తికులు, కమ్యునిస్టులని ప్రభుత్వం వారికి చెప్పింది. ఇక్కడేమో ఫైజ్ కూర్చని కొందరికి ఖుర్ఆన్ బోధనలు చేస్తున్నాడు.
ఫైజ్ విద్యాభ్యాసం విషయంలో అల్లమా ఇక్బాల్ స్వయంగా శ్రధ్ధ తీసుకున్నడన్నది చాలా మందికి తెలియదు. లాహోరులో అప్పట్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కళాశాలలో ఫైజ్ కు అడ్మిషన్ లభించేలా ఇక్బాల్ సిఫారసు చేశారు. అల్లమా ఇక్బాల్ వంటి కవిని అప్పటి ఫైజ్ కవితలు ఆకట్టుకున్నాయి. ఆయన చేతులమీదుగా ఫైజ్ బహుమతి కూడా అందుకున్నాడు. మీర్ తకీ మీర్, మీర్జా రఫీ, సౌదా, అసదుల్లా ఖాన్ గాలిబ్ వంటి క్లాసికల్ ఉర్దూ కవుల కవిత్వాన్ని చిన్నప్పటి నుంచి ఇష్టపడే ఫైజ్ కు ఉర్దూ కవిత్వంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. క్లాసికల్ గజల్ కు, ఆధునిక గజల్ కు మధ్య వారధిగా పేరు పొందాడాయన.
ఆయన కేవలం కవిత్వాన్ని సాహిత్యసేవగా భావించలేదు. ఆర్ట్ ఫర్ ఆర్ట్ సేక్ అన్న భావాన్ని బలంగా తిరస్కరించిన కవి ఫైజ్. కవిత్వాన్ని సామాజిక చైతన్యానికి సారధిగా మార్చాలని ప్రయత్నించాడు. భారత స్వతంత్ర పోరాటాన్ని అతి దగ్గరగా చూడడమే కాదు అందులో భాగస్వామి కూడా అయిన ఫైజ్ దేశవిభజనను తీవ్రంగా నిరసించాడు. ఈ నిరసనన పట్ల కొందరు పాకిస్తానీ మిత్రులు ఆగ్రహించినా ఆయన లెక్కచేయలేదు. స్వతంత్ర ఉదయం – అన్న కవితలో అతి తీవ్రంగా ఈ నిరసనను ప్రకటించాడు.
ఈ మచ్చపడిన పగలు, ఈ చీకటి నిండిన ఊరు
మనం ఎదురు చూసిన ఉదయం ఇది కాదు...
అన్నాడు.1947లో ఇంగ్లీషు పత్రిక పాకిస్తాన్ టైమ్స్ కు సంపాదకుడిగా పనిచేశాడు. పాకిస్తాన్ లో శ్రామికులు, మహిళలు, నిరుపేదలు, కూలీల హక్కుల కొరకు పోరాడే పత్రికగా దాన్ని తీర్చి దిద్దాడు. రావల్పిండి కుట్ర కేసులో అరెస్టయిన తర్వాత, ప్రభుత్వం ఆయనకు మరణశిక్ష విధించే అవకాశాలున్న పరిస్థితిలో కూడా జైలు జీవితం మళ్ళీ ప్రేమలో పడడంలా ఉందని వ్యాఖ్యానించాడు.
ఆ కుట్ర కేసు నుంచి బయటపడిన తర్వాత ఫైజ్ ప్రతిష్ఠ మరింత పెరిగింది. 1962లో ఆయనకు ప్రతిష్ఠాత్మక లెనిన్ శాంతి బహుమతి లభించింది. సోవియట్ బ్లాకులో ఇది నోబెల్ బహుమతికి సమానమైన బహుమతిగా పేరుపొందింది. ఈ అవార్డుకు దూరంగా ఉండాలని సైనిక ప్రభుత్వం ఆయన్ను హెచ్చరించింది. ఎందుకంటే అప్పటికి పాకిస్తాన్ అమెరికాతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుంది. మరోవైపు భారతదేశం సోవియట్ కు దగ్గరయ్యింది. పాకిస్తాన్ లో వామపక్ష భావాలపై తీవ్రమైన అణిచివేత అమలవుతున్న కాలమది. ఫైజ్ ఈ హెచ్చరికలు ఖాతరు చేయలేదు. మాస్కో వెళ్ళి అవార్డు స్వీకరించడమే కాదు అక్కడ ఆయన చేసిన ప్రసంగం చరిత్రలో ఒక గొప్ప ప్రసంగంగా నమోదయ్యింది.
జనరల్ అయ్యూబ్ ఖాన్ కాలంలో ఫైజ్ అనేకసార్లు అరెస్టయ్యాడు. ముఖ్యంగా 1965లో భారత పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఫైజ్ విచిత్రమైన సంఘర్షణకు గురయ్యాడు. మిత్రులు ఆయన్ను దేశభక్తి పాటలు రాయమని అడిగారు. కాని ఫైజ్ మాత్రం ఒక మరణించిన సైనికుడి కోసం విషాదగీతం రాశాడు.
చిన్నపిల్లవాడిని ఇంటికి రమ్మని లాలిస్తున్నట్లుగా ఆ కవిత సాగింది. ఈ రాతలు చాలా మందికి కోపాన్ని కలిగించాయి. 1971లో బంగ్లాదేశ్ వేర్పాటు, రక్తపాతం, ఆ తర్వాత పాకిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రబుత్వం ఏర్పడినప్పడు ఫైజ్ సాంస్కృతిక సలహాదారుగా నియమితుడయ్యాడు. ఆయన ఉన్నప్పుడే పాకిస్తాన్ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఆర్ట్స్, లోక్ విర్సా పేరిట జానపద కళల కేంద్రం ఏర్పాటయ్యాయి. అంతర్యుద్ధం, బంగ్లాదేశ్ ఏర్పాటుల తర్వాత పాకిస్తాన్ లో ముజీబుర్రహ్మాన్ ప్రభుత్వం బంగ్లాదేశ్ తో సంబంధాలు పునరుద్ధరించుకోడానికి చేసిన ప్రయత్నాల్లో ఫైజ్ కూడా పాలుపంచుకున్నాడు. నిజానికి బంగ్లాదేశ్ ప్రధాని ముజీబుర్రహ్మాన్ ఆయనకు మంచి మిత్రుడు. ముజీబుర్రహ్మాన్ ఒక కవిత రాయమంటే - మనం అపరిచితులమయ్యాం – అన్న కవిత రాశాడు. 1977లో పాకిస్తాన్ లో సైనిక తిరుగుబాటు తర్వాత ఆయన బీరుట్ వెళ్ళిపోయాడు. అక్కడ పాలస్తీన లిబరేషన్ ఆర్గనైజేషన్ అధినేత యాసర్ అరఫాత్ తో కలిసి పనిచేశాడు. ఆఫ్రో ఆసియన్ రైటర్స్ అసోసియేషన్ వారి పత్రిక లోటస్ కు అక్కడ ఎడిటర్ గా ఉన్నాడు. బీరుట్ లో పలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ స్థావరాలపై ఇస్రాయీల్ హెలికాప్టర్లతో బాంబుల వర్షం కురిపిస్తున్నప్పడు ఆయన పలస్తీనా పిల్లల కోసం ఆయన రాసిన జోలపాట లాంటి కవిత చూడండి.
మత్ రో మేరే బచ్చే
రోరో కే అబీ తేరే అమ్మీ కీ ఆంఖ్ లగీ హై
మత్ రో బచ్చే
కుఛ్ హీ పహలే
తేరే అబ్బా నే అప్నే గమ్ సే రుక్సత్ లీ హై
ఏడవకు చిన్నారీ..ఏడవకు
ఏడుస్తూ.. ఇప్పడే నీ తల్లి నిద్రపోయింది
ఏడవకు చిన్నారీ .. ఏడవకు
ఇప్పుడే నీ తండ్రి విషాదాలకు సెలవు చెప్పాడు.
1982లో ఇస్రాయీల్ ట్యాంకు దాడుల్లో అదృష్టవశాత్తు బతికి బయటపడిన ఫైజ్ తన తుది రోజుల్లో తిరిగి లాహోర్ వచ్చాడు. ఉపఖండమంతటా ఫైజ్ అభిమానులున్నారు. ఫైజ్ నిత్య అసంతృప్తికి సంకేతంగా జీవించాడు. తాను ఎంత రాసినా ఆయనకు సంతృప్తి లేదు. ఇంకా రాయాలి. తనను ఇంతగా అభిమానించే వారి అభిమానానికి తగిన విధంగా తాను రాయలేదనే భావించేవాడు.
అలాంటి ఫైజ్ రాసిన ఒక కవిత ఇప్పడు చూద్దామా:
ప్రతి చెట్టు ఒక మందిరమే
శిధిలమైన కాంతిహీన మందిరమే
పతనానికి కారణాలు వెదుకుతోంది ఎప్పటి నుంచో
ప్రతి ఇల్లు, ప్రతి కప్పు తుదిశ్వాసలు వదులుతోంది.
ప్రతి కప్పు కింద ఆకాశమే పూజారి
భస్మం పూసుకున్న దేహం, నుదుట సింధూరం
మౌనంగా తలవాల్చి ఎప్పటి నుంచి కూర్చుని ఉన్నదో
ఒక మౌనమంత్రగత్తెలా
ప్రపంచంపై పెద్ద మంత్రజాలన్నే పరచింది
మలిసంధ్య కొంగును కాలం పైటకు కట్టేసింది
ఇప్పుడు సంధ్య కొడిగట్టదు, చీకటి కమ్ముకోదు
రాత్రి వాలి పొద్దు పొడవదు
ఈ మంత్రజాలం బద్దలు కావాలని ఆకాశం ఆశిస్తోంది
మౌన సంకెళ్ళు తెగాలని, కాలం పైట వదిలించుకోవాలని
ఎవరైనా శంఖం పూరించాలని, కాలిగజ్జలు ఘల్లుమనాలని
ఏదైనా విగ్రహం మేల్కోవాలని,
ఉషోదయ చామన సుందరి మేలిముసుగు తొలగాలని...
ఇస్ తరాహ్ హై కి హర్ ఇక్ పేఢ్ కోయీ మందిర్ హై
కోయీ ఉజడా హువా బే నూర్ పురానా మందిర్
ధూంఢ్తా హై జో ఖరాబీ కె బహానే కబ్ సే
చాక్ హర్ బామ్, హర్ ఇక్ దార్ కా దమె ఆఖిర్ హై
ఆస్మాం కోయీ పురోహిత్ హై జొ హర్ బామ్ తలే
జిస్మ్ పర్ రాఖ్ మిలే మాథే పర్ సింధూర్ మిలే
సర్నిఘూం బైఠాహై చుప్ చాప్ న జానే కబ్ సే
ఇస్ తరాహ్ హై కె పస్ పర్దా కోయీ సాహిర్ హై
జిస్ నే ఆఫాక్ పె ఫైలాయా హై యుం సహర్ కా దామ్
దామనె వక్త్ సె పుయూస్త్ హై యుం దామనె షామ్
అబ్ కభీ షామ్ బుఝేగి న అంధేరా హోగా
అబ్ కభీ రాత్ ఢలేగీ న సవేరా హోగా
ఆస్మాం ఆస్ లియే హై కి యే జాదూ టూటే
చుప్ కి జంజీర్ కటే, వక్త్ కా దామన్ ఛుటే
దే కోయీ శంఖ్ దుహాయీ కోయీ పాయల్ బోలే
కోయీ బుత్ జాగే కోయీ సాంవలీ ఘూంఘట్ ఖోలే
ఈ రోజు ఒక కవిత కాదు, మరో కవిత కూడా చూద్దాం
వో లోగ్ బహుత్ ఖుష్ కిస్మత్ థే
జో ఇష్క్ కో కామ్ సమఝ్తే థే
యా కామ్ సే ఆషిఖీ కర్తే థే
హమ్ జీతే జీ మస్రూఫ్ రహే
కుఛ్ ఇష్క్ కియా, కుఛ్ కామ్ కియా
కామ్ ఇష్క్ కే ఆడే ఆతా హై
ఔర్ ఇష్క్ సే కామ్ ఉలఝ్తా హై
ఫిర్ ఆఖిర్ తంగ్ ఆకర్ హమ్నే
దోనోం కో అధూరా ఛోడ్ దియా
ప్రేమను పనిగా భావించిన వారు
లేదా పనిని ప్రేమించిన వారు
అదృష్టవంతులు
బతకడమే మన పని
కాస్త ప్రేమ, కాస్త పని
పని ప్రేమకు అడ్డొస్తుంది.
ప్రేమతో పని పాడవుతుంది
చివరికి విసిగి
రెండింటిని అసంపూర్ణంగా వదిలేశాం
కవిత్వమంటే ప్రేమ మాత్రమే కాదు, ప్రపంచంలో ప్రేమ ఒక్కటే కాదు ఇంకా చాలా బాధలున్నయని నిష్కర్షగా చెప్పిన కవి ఫైజ్.
వచ్చే శుక్రవారం మళ్ళీ కలుద్దాం.. అంతవరకు అస్సలాము అలైకుమ్.
- అబ్దుల్ వాహెద్