అవినీతి భారతభూమి కేవలం దేశం, మట్టి కాదు ధర్మభూమి, జ్ఞానభూమి, కర్మభూమి వేదభూమి, వేదాంత తర్క మీమాంస శాస్త్రాలకు కాణాచి, దిక్సూచి తలమానికం వేదోపనిషత్తులు, ప్రస్థాన త్రయాలు ఇతిహాస పౌరాణిక కావ్య ప్రబంధాదులు సంస్కృతీ నైతిక మానవతా విలువల వలువలను మన దేహానికే కాదు మేథస్సుకి, హృదయానికి ముడిపడిన వైనం హితోపదేశ నీతిచంద్రికలు, భర్తృహరి, వేమన్న కవి చౌడప్పాది కవనమూర్తులు నిర్దేశకులు. బానిసతనం, పరాయితనం అనుభవించి స్వేఛ్ఛా స్వతంత్ర వాయువుల్ని శ్వాసించడం కనీసం శతాబ్దకాలమైనా నోచుకోని నడమంత్రపుసిరి ఆలోచనలో ముందుతనం ఆచరణలో మందతనం ఆవేశోద్రేకాల్లో సరిసములులేని ఘనాపాటీలం ముందుకు దూసుకుపోవడమే కాని ముందుచూపు లేని మందభాగ్యులం సమన్వయం చేసుకోలేని సంకరమూర్తులం మహాభారతపు విదురనీతి పర్వాలు అపర చాణక్యపు ఎత్తుపైఎత్తులు పరమ సహనమూర్తి అహింసాయుధమూర్తి విశ్వాన్నే ప్రభావితం చేసిన మహాత్ముడు అన్నీ ఉన్నాయి; కాని అల్లుడి నోట్లో శని రాజ్యాలున్నాయి, రారాజులున్నారు అధికార రాజ్య చట్ట న్యాయ వ్యవస్థలున్నాయి ప్రజాస్వామ్యముంది, ప్రతిజ్ఞలు, ప్రమాణాలున్నాయి ఆత్మసాక్షి, అంతరాత్మ, దైవభీతి ప్రీతి పరంపర ఏమీ అక్కరకు రాని వ్యవస్థ, దురవస్థ, దుర్నీతి స్వోత్కర్ష, స్వలాభం, స్వార్థం, స్వాహాకారం బాధ్యతారాహిత్యం, దురహంకారం, దుస్సాహసం విడివిడిగా, సంయుక్తంగా అవినీతితనమే సమాజపు అంతర్భాగంగా స్త్రీ పురుషులైతే ఒకరిపై యింకొకరు, ఒకరి వల్ల మరొకరు అవినీతి పరులవుతున్నారు, అహంకారులవుతున్నారు సౌందర్యం, ప్రేమ, అనుబంధం తారుమారవుతున్నాయి సమాజము యావత్తూ సమజసమూహమవుతోంది నిలవవున్న నీటిలో పాచి నాచు మాదిరి నేటి సమాజంలో, జీవితాల్లో పేరుకున్న అవినీతి ఆకలి, అధికార హోదాల, సుఖ పర్వాల ప్రలోభం సమస్యల చీకటి గదుల్లో ముసుగుతన్నుల నిద్రావస్థలు న్యాయమైనా, అన్యాయమైనా, మంచి చెడులేమైనా అందరూ కాదన్నది చేస్తే అవినీతి, నీతిబాహ్యం అందరూ ఒప్పుకొన్నది నీతి అన్న ధోరణి చట్టబద్ధమై సుప్రతిష్టమయిపోయిన అవినీతి బల్లలకింది చేతులు మరీ పొడుగై బల్లలపైకి ఎగబ్రాకి బాహాటంగా కదం తొక్కుతున్న వైనాలు మంచి మనిషి చుట్టూ వల పన్ని తిష్ట వేసే అవినీతి మనకు అపకారం జరిగితే అవినీతి మన శతృవుకి అదే జరిగితే మహానీతి ఇష్టంలేని పనుల పద్దుల జమలు అవినీతిలోకే. మొగాడికయినా, ఆడదానికైనా నీతుండాలి కాని ఎవరి నీతి వారిదే; నిండుకున్న సంయుక్త నీతి తనకు పనికిరానివి అందరికీ నీతులు వారరమణికైవడి బహురీతి మన రాజనీతి నీతులు డబ్బా పోతపాల వంటివి; సహజత్వానికి సుదూరం బలిమి కన్న నీతి బలిమి లెస్స కలికాలపు బలిమి మాత్రం పుష్కళ అవినీతి బలిమి భగవంతుడు ఒక్కడే, నీతిమార్గం ఒక్కటే ఆవినీతినైజాలు మాత్రం బహుబహు విధాలు పసువులు నోర్లేని సొమ్ములు, నీతివంతాలు చదువుకున్నా, చదవకపోయినా నీతిలేని జనం పశుపక్ష్య కీటకాదులు పాటించే నీతి పరంపర మనుషులకు మాత్రం పట్టనితనం, నీతిమాలినతనం గాడిద యోరిమి, పిపీలకం దూరదృష్టి సాలెపురుగు పట్టుదల, శునకపు విశ్వాసం గువ్వ పాటించే ఏకపత్నీవ్రతం - సృష్టి అద్భుతాలు బుద్ధిహీన, అవినీతిమయ జీవనం మనుజునిదే ఎవ్వరూ గమనించరని, గమనిస్తేమాత్రమేమిటని ముంతలో మార్జాలం మాదిరి తలుపుసందు నీతి మనది. ఒప్పుకోవడానికి వీల్లేని నీతి అవినీతే మనకు. కడుపు కాలనంతవరకూ సర్వం నీతిమయమే కోర్కె మంట సమానం, నీతి కట్టె సమానం మనకు చదువు నీతులు వేరు, కుటుంబ నీతులు అసలే వేరు సంసారపు నీతులు జాయా పతులకు వేరు వేరు తరాలు మారుతున్న కొద్దీ నీతుల్లో, అవినీతుల్లో అంతరాలు మనకు నీతి, న్యాయం ద్వందపదజాలం, అర్థంకాని అనర్థాలు నీతి కేవలం రెండక్షరాల నుడి, నీతికి కేవలం ముందుమాట అవినీతి అందరికీ విక్రయపు నీతి - అదే అవినీతి, దుర్నీతి మన దుస్థితి సంపాదించలేని సన్యాసులు బతకడానికి పెట్టుకున్న నికృష్టపు గోడలు, గోడులు మన నీతినియమాలు నీతి నేడొక ప్లేగు అని ఓ గెడ్డపు కవి అంటే నీతి ముసుగులో ఆడే దొంగాటలో సయ్యాట అవినీతి. నీతి నియమాలు కేవలం ధర్మపన్నాల ప్రవచనాలు కాకూడదు అవినీతిపై సమర శంఖారావాల్ని పూరించండి నీతిమాలినతనాల్ని నీరసపరచండి; నీచుల్ని వేరు పరచండి నీ నా తలపుల్ని విడనాడి, మనం జనంతో మమైకమవండి నీతివిక్రమస్థిరత్వాన్ని పెంపొందించేలా నేను సైతం అంటూ అవినీతి ధోరణుల్ని అణచివేసే క్రతువులో సంకల్ప దీక్షా భాగస్వామ్యం వహించండి. (వర్తమాన ఎన్నికల సందర్భంగా భారతదేశ ప్రజ దృష్టి పెట్టాల్సిన ఏకైక అంశం - అవినీతిని ఎలా ఎదుర్కోవాలి అన్నదే.) కొంపెల్ల శర్మ
by Kompella Sarmafrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pyPhvK
Posted by
Katta