పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

16, అక్టోబర్ 2012, మంగళవారం

నందకిషోర్ । చక్రవ్యూహం


1

ప్రతీ అనుభవం నేర్పేదే.
ఎంతో కొంత.
కొంచెం జ్ఞానం.
అంతే అజ్ఞానం.

ప్రతీ మనిషిదీ స్వార్ధమే.
ఎంతో కొంత.
కొంచెం నీకోసం.
మిగతా తనకోసం.

2

అవకాశం ఉన్నన్ని రోజులు
నియమాలమీద సావాసం.

తీరికలేక,ఓపికలేక ఒకరోజు-
అన్నీ మలిపి ఆనందిస్తాం.
ఒకే జీవితమని గుర్తించేస్తాం.

ఒక్కరోజన్న గడుస్తుందో లేదో-
ముందే చేస్తే బాగుండని ఎవడో
భుజాలుపట్టి ఊపేస్తాడు.
తలలోకి దూరి గోలచేస్తాడు.

ఇంకేం!
ఓ కొత్త పత్రం తయారవుతుంది.
నువ్వెప్పుడు ఆనందించవు.

3

అభిమానం దొరికినన్ని రోజులు
మనసుల మీద వీరంగం.

పొడిబారి,పొగరు తగ్గి ఒకరోజు
ఎవరూ లేరని ఏడ్చేస్తుంటాం.
బతుకిదికాదని తేల్చేస్తుంటాం.

కన్నీటి చుక్కైనా రాల్తుందో లేదో-
హత్తుకొని తిరుగుదాం రమ్మంటు ఎవరో
తెగిపడిన చేత్తో పిలుస్తుంటారు.
పగిలిన గుండెతో పాటకడతారు.

ఇంకేం!
ఓ కొత్త భయం పరుగుతీస్తుంది.
నువ్వెప్పుడు కలిసిపోలేవు.

4

సంజాయిషీ ఇవ్వాల్సిన నిమిషాలు
ఎప్పటిలాగానే మిగిలేఉంటాయ్.
వినాల్సిన మనుషులుండరు.

ఎక్కడున్నారో తెలిసీ-
నడిచే ధైర్యం నీకూ ఉండదు.

సందేహాలు తీర్చాల్సిన మనుషులు
ఎప్పటిలాగానే మిగిలేఉంటారు.
చెప్పాల్సిన నిమిషం మిగలదు.

ఎక్కడికిపోయిందో తెలిసీ-
వెతికే కోరిక నీకూ ఉండదు.

5

ఒప్పుకుంటానంటే నిజం చెప్తా!

రోజోసారి రోజుల్ని లెక్కేస్తామేగాని
నీకు,నాకు,మనలాంటి అందరికీ-
సుఖానికి,సంతోషానికి తేడా తెలీదు.
అవసరానికి,ఆశకి గిరిగీయడం తెలీదు.

ఋతువుకోతీరుగా దుప్పట్లు మారుస్తాంగాని
నీలో,నాలో,మనలాంటి అందరిలో-
ఊహల కొత్తదనం- ప్రయత్నాలకు అంటదు.
నవ్వుల తడితనం-గుండెలకు తాకదు.

15-10-12

వంశీ | క్షుద్రం


రమించు.. రమించు,
శవాల్నీ, గాయాల్నీ, అశుభాల్ని, అస్ఖలితాల్నీ,
పగలుచూడని రాత్రులతో, పదాలు చెప్పలేని విన్యాసాలతో..
ఇంకా.. ఇంకా..
రక్తమంతా చెమటలు కక్కేవరకూ
రిక్తమంతా గావుకేకలు పెట్టేవరకు,
ఎవరది..చంపెయ్.. చంపెయ్ వాడిని,
నీతిభోదలుచేస్తూ నిన్నాపుతున్నాడెవడో,
మనస్సాక్షా...
ముక్కలు ముక్కలుగా నరికెయ్, వీలైతే తినెయ్,
ఏ మీమాంసలెందుకు
నీ మాంసపు రుచి అలవాటేగా..

శరీరం బుధ్దినోడించి
రోజురోజుకూ అతిక్షూద్రుడివైపోయి
నీకు నువ్వే శత్రువై
దారితెలీని లోయల్లో గమిస్తూ
నోరుతిరగని మంత్రాలేవో జపిస్తూ
సున్నితత్వాన్నీ మనిషిమూలాల్నీ సమాధిన తోసి..

పువ్వులన్నీ ఫలాలవకమునుపే చిదిమేసి కార్చిన తేనెలో
విషాలోచనలని ముంచుకు తిని కాలకూటభాష్పాల్ని త్రేన్చు,
రజస్వలించలేక ద్రవించిన స్రావాల తావితో
నాసికను తాటించి వికృతాకారిడివై భ్రమించు..

తొందరగా.. తొందరగా...
ఔషధాల్లేని జాడ్యాన్ని వెంటేసుకుని ధర్మాల్ని వినిర్మించు,
ఉపాసించని దైవత్వాన్ని పురాణాల్లోకి విసిరి
నిర్వేదాలకు భాష్యం రాయి,

నీదైన రసాతలానికి
నీదవని భూతలాన్ని ప్రక్షేపించి ఆఙ్నాపించు..
నువ్వే రాజువి

రమించు.. రమించు..
భూతగణాలతో, దైత్య కణాలతో,
నీలాంటి మరో అష్టావక్రుడు భవించేట్టు
అంధయుగపు రేతస్సు జ్వాజ్వలించేట్టు...

13.10.12