పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, సెప్టెంబర్ 2012, శనివారం

మూర్తిరాజు అడ్లూరి // లైక్ //


ఏ డిగ్రీలు లేని కాలంలో
గుండెలలో రసవద్భాండాలు
కుమ్మరించినప్పుడు
నా అంతరాత్మ లైక్ చేసినా
నా అహం చూపుడు వ్రేలు
మౌస్ నొక్క డానికి మొరాయించింది

ఇప్పుడు గీటురాయు కాని పట్టా ఒకటి
నీపేరుకు కొక్కెంగా వేసుకున్నావు

పదవి కుర్చిపై కూర్చొని
ఏమి చెప్పినా లైక్ కొట్టుతున్నాను

అందుకే లైక్ ఒక ఒక సారి నాకు అన్ లైక్
07/0902012

యల్లాప్రగడ రాజా రవి శ్రీనివాస్ - "పరుగు"


అతడు పరిగెడుతున్నాడు
కాళ్ళు సాగదీసి.. శక్తినంతా కూడదీసి
అదే పనిగా..ఎక్కడికో తెలుసో లేదో
...
అతడు పరిగెడుతున్నాడు
అనుభవాల్ని లెక్కించుకుంటూ
భావాల్ని ఆరబోసుకుంటూ
అంధకారమైనా తడుముకుంటూ

అతడు పరిగెడుతున్నాడు
అప్పుడప్పుడూ ఆవేశాన్ని
అక్షరాలుగా మారుస్తూ
అదే పరుగని తలుస్తూ
వళ్ళు మరచి కళ్ళు మూసి

అతడు పరిగెడుతున్నాడు
సుఖంచుక్కను చూసి
అటువైపే వెలుగనుకుంటూ
పక్కవాడు పడుతుంటే
తానుముందుకెళ్తానని ఊహిస్తూ

అతడు పరిగెడుతున్నాడు
కష్టం గోడోస్తే దూకడం మాని
తన దారిని మళ్ళిస్తూ
బతకితే ఇలాగే బతకాలని
పక్కవారికి స్ఫూర్తితో నేర్పిస్తూ

అతడు పరిగెడుతున్నాడు
జీవితం ఆఖరయ్యే సమయానికి
లెక్కేసుకున్నాడు పయనమెంతని
తెలుసుకున్నాడు ఉన్నదక్కడేనని

అతడు పరిగెడుతున్నాడు
మళ్ళీ పుట్టి..ఈసారి కొంచెం వేగంతో
కాళ్ళు సాగదీసి.. శక్తినంతా కూడదీసి
అదే పనిగా..ఎక్కడికో తెలుసో లేదో
అతడు పరిగెడుతున్నాడు 06SEP12

కర్లపాలెం హనుమంత రావు॥లెక్కలు అప్పుడు…ఇప్పుడు॥


+1/-1
చిన్నప్పుడు
లెక్కలంటే భలే సరదా నాకు
కూడికలంటే చేగోడీలు తిన్నంత ఇష్టం
తీసివేతలు పచ్చిబాదం కాయల్లా వగరు
ఇప్పుడో
తినే ముందు తీసేయక తప్పని బెడ్డలు తీసివేతలు
కూడికలంటే తేలికే కానీ తెలీని అదో చిన్నచూపు
అంకెలు అప్పచ్చుల్లా నొరూరించేవప్పట్లో
సంఖ్యల్లా వాటిని పెంచమంటే
ఖాళీఅగ్గిపెట్టల్ని రైలు బండిగా మార్చడమంత హుషారు
ఇప్పుడో
ఏ చుట్టం కంటపడ్డా పక్కిట్లో నుంచి అప్పుతెచ్చుకోడానికొచ్చిన చిన్నంకెను చూసినంత చిరాకు

2x1=2
2x2=4
ఎక్కాలు పైకీ కిందకీ…కిందకీ పైకీ గుక్క తిప్పుకోకుండా వప్పచెప్పక పోతే పడేది వీపుమీద మాసారు పిడిగుద్దు
మా ఐదో అంతస్తు ఫ్లాటుకు ఇప్పుడెన్నివందల సార్లు ఎక్కిదిగుతున్నానో చెప్పద్దు

3x3=9
హెచ్చవేతలంటే చెయ్యి వెచ్చబడేదే గానీ
చేస్తున్నకొద్దీ ఉత్సాహం రెట్టింపయ్యేది
మొక్క చెట్టవడానికి పాదుల్లో నీళ్ళు పోస్తున్నంత ఉల్లాసం ఆ పిచ్చి వయసది
ఇప్పుడో
బ్యాంకుడబ్బు వడ్డీలెక్కలప్పుడు తప్ప గుణకారమంటేనే వళ్ళుమంట

1033/7
భాగహారం చెయ్యాలన్నా భలే భయం బాబూ ఆ రోజుల్లో!
పదొందలముప్పైమూడులో ఏడు ఎన్ని సార్లు పోతుందో తెలీక ఏడుపు
సున్నా శేషంగా వచ్చిందా పరుగుపందెంలో కప్పుగెల్చినంత ఆనందం
పదహారు నుంచి అరవైఆరునైనా సరే
ఎన్ని సార్లైనా పంపించగల గడుసుదనం ఇప్పటిది

0
సున్నా అంటే ఏమీలేదనుకునే ఆమాయకత్వం ఆ చిన్నతనానిది.
సున్నాలోనే అన్నీ వున్నాయని అర్థమయిన పెద్దమనిషిత్వం ఇప్పటిది.
లెక్కలంటే మేథకు తొడిగిన రెక్కలు ఒకప్పుడు
లెక్కలంటే కాకులైనా చేయగల ట్రిక్కులు నాకిప్పుడు.


07-09-2012

కన్నా రాజేష్ ‎|| స్వేద సముద్రం ||


ఈమట్టిలో యింకా ప్రానం వుంది
అందుకే
వోల్గా వరదలతో కలుషితమైనా
యింకా
అక్కడక్కడ తేటగా ప్రవహిస్తున్న నదులున్నై
ఈ మట్టిలో యింకిన నాతల్లుల స్వేద సముద్రం వున్నది
అందుకె
ఈ నేల నేలంతా ప్రక్రుతి పచ్చగా పరుచుకున్నది
వొరిగిన వీరుల ఆగని శ్వాసలున్నై
అందుకే
ఈమట్టిలొ యింకా చలనం వుంది
రండి చెవులని నేలకానించి
మన రాక్షస వీరులు చేస్తున్న రహస్యొపన్యాసాల్ని విందాం
మన రాజ్యం పై
అడుగులు మోపిన వాడి పాదాల్ని నరికి
వాడి సంకలొ పెట్టి వాడి దేశం పంపడానికి
వానికివాడె ఆపాదించుకున్న దైవత్వాన్ని
వాడి చెత్త రాతల్ని మహిమలని
వొక్కపెట్టుతో సమూలంగా సం హరించే
సాంస్క్రుతిక యుద్దతంత్రమేదో తెలుస్తున్నది
మూలవాసులార రండి
కులాలుగా విడగొట్టబడిన ఈ మట్టిని
తడిపి కలిపి పిసికి ముద్దచేసి పోతపోసి
ఐక్యమైన మన సమూహపు స్తూపాన్ని
ఆకాశపుటంచులదాక నిర్మిద్దాం
మన దేహపు మెరుపులనిద్దాం
ఎవడు కన్నెత్తి చూడలేని ప్రకాశవంతంగా
మన నిచ్వాసపు నెగల్లలొ ఎర్రగా కాలుద్దాం
యింకెవడు పగలగొట్టలేనంత ద్రుఢంగా..,...

రాఖీ || యదార్థ జీవిత వ్యదార్థ గాధ ||


అంతా సజావుగానే..సాగుతున్నట్టుంది..
అంతా సవ్యంగానే..జరుగుతున్నట్టుంది..

కానీ ఏదో..తెయని శూన్యం-
కానీ అంతు దొరకని అగాధం-

ఉదయాలు..సుప్రభాతాలు..
కాలకృత్యాలు..అన్నపానీయాలు..
కార్యాలయాలు..కార్యక్రమాలు..

అంతా సజావుగానే..సాగుతున్నట్టుంది..
అంతా సవ్యంగానే..జరుగుతున్నట్టుంది..

కానీ ఎక్కడో ఏదో..మెలిక..
కానీ ఏదో మ్రింగుడు పడని గుళిక..

స్నేహితాలు, బంధుత్వాలు
పండగలు పబ్బాలు
ఉత్సవాలు పర్వదినాలూ
వివాహాలూ ,వేడుకలూ..
విందులూ వినోదాలు...

అన్నీ సజావుగానే..సాగుతున్నట్టుంది..
అన్నీ సవ్యంగానే..జరుగుతున్నట్టుంది..

పులుముకొన్న బాడీ స్ప్రేలు..
అతికిన్చుకొన్న నవ్వులు..
కరచాలనాలు,క్షేమ సమాచారాలు..
కడుపులో లేకున్నా కావలించుకోవడాలు..
లేని ప్రేమంతా ఒలకబొయ్యడాలు..

అంతా కృత్రిమత్వమే..
అంతా యాంత్రికత్వమే...

ఎక్కడలేని..సందడి..ఒకటే హడావుడి..
ఎవరో తరుముతున్నట్టు...
జాగిలాలు వెంటబడ్డట్టు...
బొక్కబోర్లా పడుతూ లేస్తూ..
పరుగెత్తి పాలు త్రాగడాలు..
మితిమీరిన ..ఆగడాలు..ప్రతిదానికీ..జగడాలు..

అంతా సజావుగానే..సాగుతున్నట్టుంది..
అంతా సవ్యంగానే..జరుగుతున్నట్టుంది..

కానీ ఎవరూ పూడ్చలేని అగడ్త..
ఎవరూ తీర్చలేని..వ్యధ..

స్కానింగ్ లకు చిక్కని...స్కాం..
ఏమ్మరైలకు..దొరకని..క్యాన్సర్ కణం..
ఏదో మాయరోగం..
ఏదో వింత విక్షోభం..( విక్షోభం=యాతన=పెయిన్..)

మృగ్యమైన ఒక మానవీయ బంధం..
అంతరించి పోతున్న హృదయ గత బంధం..

నిన్ను నువ్వు అమ్ముకొన్నప్పుడు....
నీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకొన్నప్పుడు...

సరిగ్గా అదే వెలితి..
నిజంగా.. అదే..దుస్థితి..
కక్కలేని మ్రింగలేని..పరిస్థితి..
ముందుకెళ్ళలేని..వెనక్కి మళ్ళలేని..దుర్గతి..
పశ్చాత్తాప పడినా..ప్రయోజన..రహిత స్థితి
ప్రాయశిత్తం..చేసుకొందామన్నా...కుదరని..స్థితి

అంతా సజావుగానే..సాగుతున్నట్టుంది..అలాగా !..
అంతా సవ్యంగానే..జరుగుతున్నట్టుంది..ఔనా ..?!

తెలుస్తోందా...
విలువలు వలువలు కోల్పోయి
నగ్నంగా నర్తిస్తున్నాయి..
ఎరుకయ్యిందా..
అనుబంధాలు ధనార్జన కాళ్ళక్రింద నలిగి
మూగగా రోదిస్తున్నాయి..
గ్రహిస్తున్నవా...
వైఖరులు ఉన్నస్థితి..ఉన్నతిని..గుర్తించలేక..
విదేశీ వికృత సంస్కృతిని..ఒంట బట్టి౦చుకుంటున్నాయి..

ఒక సంతృప్తి వైపు సాగాలి కదా మన పయనం...!
ఒక ఆత్మానందం కావాలి సదా మన గమ్యం..!!

06-09-2012.

పద్మా శ్రీరామ్ || వినుము చెలీ...ఈ ఒక్కసారి...||


మా మీద కోపమెందుకు చెప్పు ఓ ఇంతీ పూబంతీ!
మిము ప్రేమిస్తూ ఉన్నామనా...

మా మీద ద్వేషమేలనే చెప్పు పడతీ ! ఓ యువతీ!
మీపై రాజ్యం చేస్తున్నామనా...

పురుషుడు వర్గ శతృవా చెప్పు???
పలకరిస్తే ప్రతి పలుకులోనూ మాధుర్యం చిందించడూ?

నువ్వూ నేనూ కలిస్తేనే కదా మహిళా అవుతుంది ప్రకృతి
మనం విడిపోతే అదే అవుతుందిగా వికృతి

నువ్ బలహీనపడి నన్ను బలహీనుణ్ణి చేయకే ముదితా

అనాదిగా మిమ్మణచి మేం ఎంత గా భేషజాలు చూపినా
చివరకు అంగనల కొంగుకు వేలాడుతున్న మమతలు మావేగా

భీముడైనా రాముడైనా సంగరానికి సన్నద్ధమైనది
అతివ కొసకంటి కొసరు కోరికకే కదా

తన జీవన స్వరాలలోని మధుర గానాలన్నీ
సృష్టించేది మగాడు మీ కొరకే కదా

అందుకే చెలీ చెల్లీ తల్లీ తెలుసుకో…మగవాడు పగవాడు కాదు
ప్రేమతో పొదుగుకొంటే పొత్తిళ్ళలోని పసివాడు

07 Sep 12

కట్టా శ్రీనివాస్ || కాగ్ తున్న దేశం ||


రాజకీయాలు కాగుతున్నవేళ
బుగ్గవుతున్న ప్రజాస్వామ్యం చెంతన
బొగ్గుకూడా భోజన పదార్ధమే!

తనదాకా వస్తే
హితవాక్యమైనా అతిచేదు మాత్రే !

వెళ్తున్న దారి తప్పన్నందుకు
మెదడుని వెక్కిరిస్తున్న కాళ్లు
దొడ్డిదారి వీధిలో కుంటుతున్నాయి.

స్వామిభక్తిని ప్రదర్శించే తొందరపాటులో
రాజ్యాంగ రచనలైనా సరే
మతగ్రంధం పాటి విలువలో తూగలేకపోతున్నాయి.

ఒకనాటి తనచేతి అస్త్రమైన ఆయుధమే
నేడు గుడ్డిగవ్వపాటి విలువ చెయ్యటం లేదు.

తలపై రూపాయిలు పేర్చుకుంటున్న వేళ
కళ్లముందు గోడు కనిపించటం లేదు

కన్నీళ్లతో కడగటం కుదరనపుడు
కడుపుమంటతో కాల్చాల్చిందే
పట్టిపీడిస్తున్న కుళ్ళుని.

07-09-2012
http://antharlochana.blogspot.in/2012/09/blog-post_3080.html

కెక్యూబ్ వర్మ ॥ మువ్వల సవ్వడి॥


నీ మనసు
నీ వేలి చివర మెరుస్తోంది...

అలా తాకగానే
గుండెలో సూటిగా....

రారమ్మని నీ పిలుపు
నీ ఊపిరి స్వరంలో వినిపిస్తోంది...

ప్రియా
అలిగిన వేళ
నీ అరిపాదంపై నా కన్రెప్పల
స్పర్శతో చక్కిలిగిలి కానా??

రహస్యాలన్నీ పాతరేసి
మనసు ఐమూలల దాగిన
భావ ప్రకంపనలను పంచుకో చెలీ...

నీ పాపిట తాకిన
నా పెదవినంటిన సింధూరం
నీ కళ్ళలో జ్వలిస్తూ
వెచ్చని ఆవిరిలూదుతోంది....

నా గత జన్మల బాకీనంత తీర్చగ
నా గుండె లయలో ఆలాపన కావా??

రాగ రంజితమైన వేళ
వెన్నెల స్నానమాడుతూ
నీ కాలి మువ్వ సవ్వడినవుతా....
(07-09-2012)

మెర్సి మార్గరెట్ ll చెదురుతున్న చిత్రం ll


ముఖం తడుముతున్న గాలికి
హృదయపు కాన్వాస్ పై
నీ చిత్రం
చెదురుతున్నట్టు
కనిపించిందట

ఎన్నెన్నో కలల రంగులు
పులిమి
ఊహలన్నీ ఊసులన్నీ
సమపాళ్ళలో కలిపి
మనసునే కుంచెగా మార్చి
చిత్రించుకున్నా
ఎంతో పవిత్రంగా మరి
ఏం చేయను ?

గాలి
చెవులలో చేరి
ఏవో కుశల ప్రశ్నలడిగి
హృదయాన్ని ఎందుకు
చేరిందో
తెలియదు కాని
కదులుతున్న నీ రూపం
ఏదో చెప్పాలనుకుంటునట్టు
నాకు
చెప్పకనే చెప్పింది

రోదిస్తున్న
నీ చిత్రంకన్నీళ్లు
నా ప్రేమ రంగులని
చెరిపేసుకుంటూ
తనకు తానే రూపం కోల్పొతుంటే
చూడలేక
నా కళ్లు కూడా
నదులకు స్థానాలయ్యాయి

కారణం ఏంటని
దాన్నే అడిగా !?

మనసు మరో దారి వైపు
మళ్ళింది
ఏం చేయను ?
అని
సమాదానం ఇచ్చింది
కొత్త రంగులెత్తుక్కుంటుందట..

అందుకే
కన్నీళ్లతో
కడిగేసుకుంటున్నా
నాకు కొంచెం
దైర్యం చెప్పరూ..!!

BY-Mercy Margaret (6/9/2012 )

నరేష్ కుమార్ // ఎందుకన్న గుస్సా //


నీ పుణుకులకి
నా తాటికల్లుకి
సెనితం గుదిరిన్నాణ్ణాడే...
మన దోస్తాన్
లాగులేస్కుంది..,

సమోసా
ఆల్గడ్డనేస్కున్నట్టు
నీ మిర్చ్ బజ్జి
నా
లాలా జలాన్ని
బొక్కెనేశి
తోడింది.....,

నీ ఇడ్లివెట్టి
మా పానం
గుంజినవ్
దిల్ కుష్గ తిన్నం
దిల్ నీకిచ్చినం...

తమ్ముడైనవ్ మంచిగుంది గని
తేపతేపకు ఎందుకన్నా
నీ బుజం
జూసుకుంటవ్....?

నా కోపం
నీ కర్రీ పాయింట్మీన్నో.,
నీ చాయ బండి మీన్నో
ఆరేసుకోలే.....!

భూముల్నూకి కొలువుల్నాకి...,
పట్నంల
నన్ను నిన్ను
ఇయాల
దుశ్మంగాల్లను
జేశిన
ఆంద్ర దొర గాని మీద
పారేస్కున్నం....!

గప్పట్ల మాకు అంగ్రేజ్
రాదు
ఉర్దు తప్ప...!
నువ్వచ్చినవ్....!
మమ్మల్ని
స్పార్టకస్లంజేశినవ్...!

గిప్పుడు మాకు
ఓ రాలె జెట్టుకింద
తెలివి తెల్లారింది
సిద్దార్తున్లెక్క

ఇగ వో నీతానికి....
మా కొలువ్లు మాకిచ్చి..
అంటే..
ఎందుకన్న గుస్సా.?

కమ్మటి రుచుల
నీ శాకం నాలికకి
ఆందాన్నిచ్చి నట్టు...
నీ ఆదిపత్యపు
నిశ్క్రమణ
మన తోడబుట్టిన తన్నాన్ని
దూరం జెయ్యది
దగ్గర దప్ప...

ఇగ బైలెలెల్లు...
అనేది చెట్టుకింది అన్నా.....!
నిన్ను గాదు
మా తల్లిని చెర బట్టిన ఆంద్రదొర గాన్నే...
06.09.12

ఆర్.దమయంతి // మల్లె పూవంత సంతకం! //


కవిత్వమంటే - కాదు..
చందోబధ్ధ రూపకం.
వ్యాకరణా సంబంధం
నిఘంటు పదాల సమీకరణం.

కవిత్వమంటే కాదు -
భాషా పరిజ్ఞాన కేం ద్రం.
భావ గాంభీర్యతా నిదర్శనం.
కలం బలనిరూపణం.

కవిత్వమంటే కాదు -
పరిజ్ఞాన పరిపుష్టం
శాస్త్ర విజ్ఞాన ప్రదర్శితం
డాంభిక ఘన ఉపన్యాసం.

నిజమైన కవిత్వం -
జనిస్తుంది.
జ్వలింప చేస్తుంది.

కవిత్వమంటే -
ఆవేదనా బడబాగ్నులు పగిలి ప్రవహించు
పొగల గక్కు నిప్పు సెగల నదులు.
పర్వతాల మీంచి దూకు
ఉధృత జలపాతాలు

కవిత్వమంటే -
రగిలిన యెదల పై చిలుకు
తొలి తొలకరి చినుకులు.
సిరి చందనాల పరిమళాలు.

కవిత్వమంటే -
కను కొలకుల వొలుకు మధురాశ్రువులు
మనసంతా జల్లుకు పోయే పన్నీటి జల్లులు.

కవిత్వమంటే -
ఒక మదిని చూపడం.
ఒక హృది ని కదిలించడం.
ఒక కరుణ చిలికించడం.
ఒక జడాన్ని చైతన్య పరచడం.
ఒక సరి కొత్త జగాన్ని సృష్టించడం.

కవిత్వం -
ఓ సముద్రం. నిశ్శబ్ద ఏకాంతం.
సమ భావనా స్వీకారం
సుజల హృదయ భాష్పం
సకల జనుల సమైక్యా రావం.

ఇక పై కావాలి కవిత్వం
ప్రతి గుండె మీద -
ఓ మల్లె పూవంత సంతకం.
**
date: 07.09.2012.

శ్రీ || దేవుడి స్థానమెక్కడ, ||


ఏడి ఎక్కడ కనపడడే
ఏ గుడిలో దాక్కుని ఉన్నాడు
ఏ నైవేద్యాల ఇంపైన రుచిని ఆశ్వాదిస్తున్నాడు
ఏ భక్తుల గోడుని వింటూ నవ్వుక్కుంటున్నాడు
రాడా రాలేడా అసలున్నాడా

దేహి అని దైర్యం కోసం చేయి చాస్తే
దొంగలా తప్పించుకుంటున్నాడే తప్ప
దొరలా దర్శనమివ్వడే
మా కష్టాలంటే తనకు కూడ భయమా
ఆపదమొక్కులవాడు
కరుణామయుడు
అల్లా దేవుడు
ఇంత మంది ఉన్నారే
మా కన్నీటి సంద్రపు కెరటాల తడి తగిలైనా
ఉచ్చలించలేరా....
---------------------------------------------------------
చలనం లేనిది చలించలేనిది
పరమాత్ముడు కాదన్న సత్యాన్ని
మనస్సాక్షైనా నాకే ఎందుకు తెలుస్తుంది
బయటకు కనిపించే వీరు గ్రహించలేరా
గ్రహించినా నిబద్ధిని జీర్ణించుకోలేరా
జీర్ణించుకున్నా కూడా బ్రహ్మాత్మతో వాదిస్తారా
ఏమో ఈ మానవాలి మనుగడ కోసం మాట్లడలేని
దైవాన్ని కూడ తమ పాపాలకు తమ దుఖ్ఖాలకు
కారనభూథుడ్ని చేస్తారు.......

నా వాడకాన్ని పొదుపు చేస్తారు
ఆ నిరంజనుడితో బేరసారాలెందుకు చేస్తారు?
నన్ను వినియోగిస్తే చాలదా మీ అభివౄద్ధికి
నన్ను ఉపయోగించుకుంటే చాలదా మీ భాగ్యానికి
భగవంతుని పాత్ర పదినిముషాలే మీ జీవితపు చలన చిత్రంలో
జీవితాన్ని ప్రసాదించి తప్పుకుంటాడు ఆ తప్పు చేసినందుకేనేమో
మీరు చేసే ప్రతి తప్పుకి తన హుండిలో మీరు హుందాగా వేసే చందాలను తీసుకుంటాడు...

మానవత్వం వచ్చేది నాలోంచే
పాప పుణ్యాల చిరునామా నా ఇల్లే
కనుగొనండి మీలో ఉన్న నా ఉనికిని
కారణాన్ని చేయకండి మీ చేతకానితనానికి ఆ పరమాత్మని....

కొనకంచి కవిత్వం


నువ్వు నన్ను వదిలేసి
.నీకు నువ్వే
ఓ..హిరోషిమా అయ్యావు.
కానీనువ్వు వదిలెసిన చోట

నాకు నేనే
ఓ తాజ్ మహల్నై..
నీకొసం ..నిలుచున్నా