పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

27, సెప్టెంబర్ 2012, గురువారం

పీచు శ్రీనివాస్ రెడ్డి || ఉచిత దొంగలు


లెక్కలింకా తేలడం లేదు

ఉన్నవి ఊడేవెన్నో

కొత్తవి వచ్చేవెన్నో

ఎవడి లెక్కలు వాడివే

ఎవడి గోల వాడిదే

ఉచితానుచితాలెంచక

ఉచితాల పేరు చెప్పి

ఎన్ని కూతలు కూసారో

ఎన్ని కోతలు కోసారో

అప్పటి ఓట్ల మరకలు

ఇంకా చెరిగిపోనేలేదు

భయంకరంగా దాడి చేస్తున్నాయి

బ్రతుకు మీద

భవిష్యత్తు మీద

ఓట్లు తెచ్చు కోవాలన్నా

కోట్లు దండుకోవాలన్నా

ఇప్పుడు " ఉచితం " ఒక ఎజెండా

అటువైపుకు వెళ్ళామా ఖర్సైపోతాం

వాళ్ళు ఖరీదైన కూలీలు

వాళ్ళు ఖరీదైన బిచ్చగాళ్ళు

ఐదేళ్ళు పనుండదు

చేతివాటం తప్పితే

వీధులన్నీ తిరుగుతూ

ముఖం నిండా చిరు నవ్వు వొలకబోస్తూ

మళ్ళీ కూలీకి వస్తారు

చేతులు జోడించి బిచ్చానికి వస్తారు

మనం మహారాజులమే

వాడు మనముందు

చేతులు జోడించిన మూడు క్షణాలవరకు

ఆపై బ్రతుకంతా బానిసలమే

దొంగలు రాబోతున్నారు జాగ్రత్త !

24-09-2012

యల్లాప్రగడ రాజా రవి శ్రీనివాస్ || ఎక్సెంట్రిక్ ఫెలో


ఇతడు ఖచ్చితంగా..మూర్ఖుడో..పిచ్చివాడ
ఏదేమైతేనేం తప్పనిసరిగా
మట్టుబెట్టి సమాధి చెయ్యాల్సినోడు

లేకుంటే..
దేవుడికి ప్రతిరూపం మనిషంటాడు
దేవుడొక్కడేననీ..ఎక్కడోలేడనీ
సరిగ్గా వెతికితే నువ్వే దేవుడంటాడు
హుండీల ఆదాయం కొల్లగొట్ట చూస్తున్నాడు

ప్రతి బంధం వెనుక స్వార్థమే ఉందనీ
ప్రేమిస్తే అది మటూమాయమంటాడు
ఇచ్చిపుచ్చుకోవడాలొద్దంటాడు
ప్రేమ పేరిట వ్యాపారాలన్నీ మూతబడ చూస్తున్నాడు

పగ ప్రతీకార జ్వాలల్ని
క్షమా వర్షంతో ఆర్పొచ్చంటాడు
కోట్ల విలువైన ఆయుధ సంపత్తికి చెదపట్టించేట్టున్నాడు
మానవులంతా ఒకటయ్యే విపత్తు తెచ్చిపెట్టేట్టున్నాడు

ప్రపంచం అంతా వెతికితే లోనే ఉందంటాడు
విద్యకు మూలం స్వీయశోధనంటాడు
కళాశాల వ్యాపారాల్లో పెట్టుబడులన్నీ
మునిగిపో చూస్తున్నాడు

ఙ్ఞానమైనా సత్యమైనా
నీలోనే కనుక్కునే ప్రయత్నం చెయ్యమంటాడు
గురువైనా స్వామైనా నువ్వేనంటాడు
భక్తజనకోటి ఆదర్శాలను కాలరాయ చూస్తున్నాడు

ఏమాత్రం మన్నించాల్సినోడు కాడు
ప్రపంచం చివరివరకూ తరిమి తరిమి కొట్టాల్సినోడు!! 
24SEP12

భాస్కర్ ॥ పవిత్ర మనసు


ఎవ్వరూ ఇక్కడ,
ఎవరికి, ఎప్పటికి నచ్చరు,
ఏదో ఒక పని వుంటే తప్ప.

ఏదీ ఎక్కడా,
ఎప్పడూ,ఉచితంగా ఇవ్వబడదు,
ఏదో విధంగా నిన్ను ,
లోభరుచుకోవాలనుకుంటే తప్ప.

కల్మషమే సోకని,
ఏ పవిత్ర మనసు,
ఎదురవ్వదు,సుమా, నీకిక్కడ,
ఆత్మగా మారి సంచరిస్తే తప్ప.

చింతం ప్రవీణ్ || నేను-నువ్వూ


ఎన్నివేల ఏండ్ల అనుబందమో
మనిద్దరిది_

నాలా నువ్వు
నీలా నేను
ఎన్ని వేలసార్లు రూపాంతరం చెందామో!

నాకు నువ్వు లేకపోతే
నింగి నీరు నిప్పు గాలి అన్నీ
శూన్యమే కదా_

ఎన్ని వేల సముద్రాలను
ఎన్ని లక్షల నదులను నీలో దాచుకున్నా
ఎన్ని అగ్నిపర్వతాలను గుండెల్లో మోస్తున్నా
ఎప్పుడు నిర్మలవదనంతో ఉంటావ్
చూడగానే చేతులెత్తి మొక్కేలా_

నేను లేనప్పుడు నీలో
ఎన్ని విస్ఫొటనాలు సంభవించలేదు
ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలవ్వలేదు
నువ్వెన్ని గ్రహాల చుట్టూ తిరగలేదు
నా తోడు కావాలని_

ఎప్పుడైతే నేను వచ్చానో
ఎంతగా మురిసిపోయావో
ఇంకెంతగా ముద్దాడావో
తోడు లేక గడిపిన క్షణాలు గుర్తొచ్చి_

నన్ను నువ్వు గాఢంగా ప్రేమిస్తావ్
నాకోసమే కొన్ని యుగాలు ఒంటరి జీవితం గడిపావ్ కదా

నువ్వు కార్చిన కన్నీళ్ళు సముద్రాలై
నువ్వు చిందించిన ఆనందబాష్పాలు నదులై ప్రవహించాయ్
నీ ప్రేమకు గుర్తులుగా
కొండలు కోనలు చెట్టు చేమా అవతరించాయ్
ఒక్కటేమిటి నీ అణువణువు ప్రేమమయం...

నీ తనువులో
ఏ అణువును తాకినా
పులకించిపోయాను
తన్మయత్వం చెందాను_
నన్నింత వెర్రిగా ప్రేమిస్తున్న నిన్ను
కౌగిలించాలనీ
ముద్దులాడాలనీ
నా చేతుల్లోకి నిన్ను తీసుకోని మురిసిపోవాలని
నాకనిపించని క్షణం లేదు

ఐతే నేనేమి చేస్తున్నాను?
నిన్ను అనుభవించే వరకే నటిస్తున్నాను

నీతో సహజీవనం చేస్తూనే
నీలో అణువణువు చరిస్తూనే
నీనుండి దూరంగా జరిగిపోతున్నాను
ఓ పక్కన ఒరిగిపొతున్నాను
నీ కోపానికి గురౌతున్నాను

నీ ప్రేమే కాదు
నీ కోపం నాకు తెలుసు...

ఒక్కసారి నువ్వు శివాలెత్తితే
కంపించిపోతాను
భయంతో పరుగులు తీస్తాను
బిక్కుబిక్కుమంటు నిన్ను వేడుకుంటాను
నువ్వు వెంటనే శాంతిస్తావ్

మళ్ళీ షరా మామూలే!
నిన్ను గాలికొదిలేస్తాను

నా పెంపుడు జంతువులే నాకన్నా
నయమనిపిస్తున్నాయ్
చివరి శ్వాస వరకు నీకు విశ్వాసంగా ఉంటున్నాయ్

ఓ భూకామాంధు నిన్ను రంపపుకోత కోస్తున్నా
ఇంకో దుర్మార్గుడు నీ అణువణువూ కబలిస్తూ
నిన్ను మరు భూమిలా మారుస్తున్నా
నాకు స్పందనుండదు

ఛీ! వెదవ జన్మ
దేన్ని పొందుతున్నామో
దేన్ని పంచుకుంటున్నామో
దాన్ని కాపాడలేకపోతున్నాం_

నీకు దూరంగా
ఎన్ని వేలమైళ్ళు నడిచినా
ఒక్క అడుగైనా
నీకు తెలియకుండ వేయగలిగానా?

(భూమిని రక్షించండి)

20.09.2012