పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

21, జులై 2012, శనివారం

కె క్యూబ్ వర్మ || ఫీనిక్స్ లా... ||

ఇక్కడే
ఆగిపోయానుకదా?
నువ్వు చూసిన
ఈ మలుపు దగ్గరే...

స్మృతులన్నీ
ఒక్కోటీ ప్రతిసారీ
లోపలంతా
కోస్తూనే వున్నాయి...

నెత్తురంటిన
అక్షరాలన్నీ
పాట కట్టకుండానే
పారబోసావు కదా?

ఏదీ వదిలేయనూ లేక
ఏదీ అందుకోనూ లేక
ఓ చెట్టు మొదలులా
అటూ ఇటూ ఊగుతూ పాతబడి...

రాపిడవుతున్న
క్షణాలన్నీ లోలోన
దహిస్తూ అణువణువూ
బూడిదలా రాలుతోంది...

రాకపోతుందా
ఓ వాన మబ్బు!!
చినుకు పడి
మళ్ళీ ఫీనిక్స్ లా లేస్తా??
*20-07-2012

మెర్సీ మార్గరెట్ కవిత

ఊయలలో ఉన్నప్పటినుంచే
ఊహతెలిసినప్పటి నుంచే ..
ఊగిసలాటలో గెలిచే
ప్రయత్నం చేస్తూ

పాకులడుతున్నప్పటినుంచి
పాదాలు స్థిరంగా నిలవడం నేర్పిననుండి
పరుగెడుతూనే ఉన్నా
గమ్యం వైపు ఇదేగా అని

తాతత్త అనే పదం నుంచి
దొర్లి దొర్లి పడుతున్న మాటల వరకు
మాటలన్నీ మూటలు కడుతూనే ఉన్నా
ఎంత స్వాంతన పొందానో ..
ఎంత మందిని సపాందిన్చుకున్నానో
తెలుసు కుందామని

కళ్ళు మూసుకునే చూస్తున్నా
కట్టెలపై నుంచి లెక్క పెట్టుకుందామని
"నా "అన్న వాళ్ళని ...
*20-07-2012

వల్లూరు మురళి || నేడేమైనాయి? ||

తొలకరి వాన చినుకు కోసం ఎదురు చూసే
రైతు కళ్ళల్లో కన్నీరు ఏమయింది?
పొలం లో పగడాలు పండాయ అన్నట్లు
ఆరుద్ర పురుగుల అలికిరి ఏమయింది?

గట్లపై వెళుతుంటే కళ్ళకు అడ్డం పడే
గుట్ల కొద్ది రోకలి బండి పిల్లల ఏమయ్యాయి?
వర్షపు నీటిలో ప్రాకే కర్షక మిత్రులు ఎక్కడ?
దీపపు కాంతికి ఎగిరోచ్చే రెక్కల పురుగు లేవి?

సెలవోచ్చిందంటే చాలు నేరేడు చెట్ల పైనే కొలువు
వేడి పళ్ళు కావాలా, చల్లని పళ్ళు కావాలా అంటూ
మిత్రుల నాటపట్టించే రోజులేమయ్యాయి?
మోదుగ దొప్పలలో తెచ్చిన నేరేల్లేమైనాయి?

పిల్ల కాలువ లో పట్టి తెచ్చిన చేప పిల్లలేవి?
జల కలతో నిండుగా ఉండే చెరువులు
చెరువులలో కొట్టే ఈత పందేలు నేడేమైనాయి?
కోనీటిలోని నల్ల కలువలు ఏమయ్యాయి?
ఏ చేతి వాటానికి బలై చెరువులే కనుమరుగైనాయో?

ఊరిచివర ఊడలమర్రి చెట్టు నీడలో చేరి
నేస్తాలతో కూడి ఆడిన ఊసులు నేడేమైనాయి?
కిలకిల రావాల పక్షుల అలజడి ఏమైంది?
ఏ సామిల్లో, ఏ ప్రోక్లినరో నమిలేసి ఉంటుందా?

నల్ల ధనాన్ని తెల్లగ చేయగ పేదల పొలాలను
కబలించి పచ్చని పంట పొలాలను సైట్ లుగా చేసారా?

పుట్టల పై వెతికి పట్టుకొచ్చిన పుట్ట గోడుగులేవి?
పొదల్లో దూరి ఏరుకోచ్సిన బలుసుపల్లేవి?
మెరక పొలం లో కాల్చిన వేరుశనగ కాయలేవి?
ఆ మెరక పొలాలు మరి ఏమయ్యాయి?
రియల్ ఎస్టేట్లు, సెజ్ లుగా మరిపోయవా?
*20-07-2012

జయశ్రీ నాయుడు || మనసు పతంగం ||

ఆకాశం లో మబ్బుకీ..
నేలమీద గరిక కీ..
నడుమ గిరికీలు కొట్టే
పతంగం మనసు..

పంతం వస్తే..
నామాటకూడా వినదు..
అసలు మాటకూ..
మనసుకూ పొంతన
అనాది నుంచీ గగన కుసుమమే..

అరచేతిలో అన్నీ ఇమడాలి
అరక్షణం చాలదా అంటుంది
తలపుల్లో తలుపులే వుండవు..
దూసుకుపోయే తోక చుక్క మరి..

వజ్రం ఇచ్చినా..
వద్దని విసిరేసే
విరజాజిని చూసి
మురుస్తుంది..
వలపు కలలు కళ్ళ నింపుకుని
వాన లో తడుస్తుంది..

ప్రేమని పరిమళించినా
నువ్వని కలవరించినా
నీ కౌగిట్లో అన్నీ మరిచినా
నన్ను చేరి నువ్వెందుకు
లేవని మారాం చేస్తుంది..

ఓ మనసా... నీకోసమే యోగమూ..
నీ పరుగు ఆపడమే యాగమూ
ఎంత పట్టు పడితే
అంత గింజుకుంటావు
పోనిమ్మని వదిలేస్తే
పరుగులు తీస్తావు..

నువ్వే బానిసవి..
నువ్వే యజమానివి..
మరి నేనెవరూ..
నీ యజమానిని
అని తలపోసే బానిసని..
*20-07-2012

-శాంతిశ్రీ || ‎'లక్ష్యం' పేట కావాలి..! ||


రక్తపు వాసనల్లో లక్షింపేట
మరోసారి రాబందుల రెక్కల చప్పుడు
వివక్షతా వికటాట్టహాసం
అంతరాల అగాథాలు పూడిస్తేనే
రహదారి ఏర్పడుతుంది
సూర్యుని చుట్టూ భూమిలా
ఎన్నికలప్పుడు ఆలింగనలు, సహపంక్తులు
మౌనంగా మిన్నకుంటే
దురహంకార ఊడలు పెరుగుతూనే ఉంటాయి
తక్షణం పూనుకోకపోతే మిగిలేది శూన్యం
అదనులో వర్షం లేక విత్తని విత్తనమంత సత్యం
మిత్రులెవరో శత్రువులెవరో తెలుసుకో
పక్షుల గుంపుల్లా నీ తోటివారితో పయనించు
ప్రపంచం పిక్కటిల్లేలా నినదించు
లక్ష్యం సాధించేవరకూ పిడికిళ్లు తెరవొద్దు
వివక్ష విముక్తికి లక్ష్మింపేట 'లక్ష్యం'పేట కావాలి!
*20-07-2012

కె. కె. || ప్రశ్న ||

ప్రశ్నలు ఎన్నెన్నో మనిషి మస్తిష్కంలో
ప్రతిక్షణం, ప్రతీదినం..అడుగడుగునా
ప్రతీరోజు మారే తేదీ, ఆరోజు పరీక్ష కోసం
హాల్ టికట్ నెంబర్ లా కనిపిస్తుంది.
క్యాలెండర్ వైకుంఠపాళిలా కనిపిస్తుంటుంది.

కొన్ని ప్రశ్నలు తటాలున పుడతాయి
వాటి సమాధానాలు అంతే వేగంగా తడతాయి
ఆకాశంలో మెరుపు మెరిసినట్లు
సముద్రం లో అల ఎగిసినట్లు

కొన్ని ప్రశ్నలు గొంతు దాటేందుకు సంశయిస్తాయి
వాటి సమాధానాలకు రూపముండదు, ఊహలు తప్ప
ఇవి వేదిస్తాయి...అప్పుడప్పుడు బాధిస్తాయి
ఆకాశం ఎత్తు కొలిచినట్లు
సముద్రం లోతు తెలుసుకున్నట్లు

కొన్ని ప్రశ్నలు సూటిగా ఉంటాయి
చెప్పాలంటే సూదిగా ఉంటాయి
అవి తిన్నగా మనసు పొరలను తాకుతాయి
వీటి సమాధానం కోసం మేధోమదనం జరగాలి
వీటికి సమాధానం చిక్కేది ఆలోచనా శక్తిమీదే
అవి తాకే గాలిలా కనిపించకున్నా కదిలిస్తుంటాయి

కొన్ని ప్రశ్నలు అంతరంగ అంతర్జాలంలో
కొన్ని ప్రశ్నలు బాహ్యవ్యక్తుల వ్యాఖ్యానంలో
కొన్ని ప్రశ్నలు పసిపిల్లల అమాయకత్వంలో
కొన్నిప్రశ్నలు కనిపించే,వినిపించే ప్రకృతిలో
ఇలా ఎన్నెన్నో...వెంటాడుతూనే ఉంటాయి
మనిషి జీవనయాత్రలో, మరణశయ్య చేరేవరకు

ప్రశ్నలతోనే మనిషి పరిణితి, ప్రగతి
ప్రశ్నలే లేవంటే... చలనమున్నా జీవం లేనట్లే
*20-07-2012

కట్టా శ్రీనివాస్ || వర్షం వెలిశాక.||


ఊగి ఊగి ఆగిన
మొరటు తూగుడు బల్లలా
కురిసి కురిసి వెలిసిన వర్షం.

చూరు చివరి నుండి
ఒక్కో చినుకు రాల్తోంది.

చెదిరిన స్వప్నాల్లాంటి గందరగోళంలో
ఉక్కిరి బిక్కిరయిన భూమి
ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నట్టు
వీస్తున్న ఓ మంద్ర పవనం.

ముడి చెదిరిన జడలా
రెప రెపలాడుతున్న కొబ్బరాకుల సవ్వడి.

చీకటి బాహువుల్ని చాచి
యిప్పటిదాకా స్వైర విహారులైన మేఘాలు.
ఓపిక లేక ఉస్సురంటూ ఓ దిక్కుకి వాలి సోలిన వైనం
కూనిరాగాల పాటలా మదిలో కదుల్తూ
నిద్రపోతున్న భావాల్ని తట్టిలేపితే
పల్లవి లేని చరణాలు, చరణాలే లేని దేహంలా
స్తబ్దంగా పయనాన్ని ఊహల్తో నెమరేసుకుంటూ
గాంభీర్యాన్ని బ్రేవుమని తేన్చుతున్నాయి.

*20-07-2012
సిరి.కట్టా.

జగతి జగద్దాత్రి || ఆంతర్య ఛిద్రం... ||

అప్పుడే ఆ క్షణం లోనే
అంతరాంతరాల్లో
భావ బీజావాపన జరిగే
ఆ దివ్య క్షణం లోనే
అధాటుగా ...
అతను నా దేహాన్ని
ఆక్రమించుకున్నాడు
వారించానా....
తగవును వరించానన్న మాటే
అందుకే నిశ్సబ్దంగా
నాలోకి నేను జారుకున్నా ...

నాలో కలిగే భావ స్పందనల్ని
అర్ధం చేసు కోలేడని నాకు తెలుసు
చెప్పాలని ఉన్నా
నా లోకం లో నేనున్నా
నా మనో రోదసి లో
వ్యోమగామినై
మెరుస్తోన్నకవిత్వ పాలపుంతను
ఆవాహన చేస్తున్నా
ఉరికి దూకుతోన్న
ఉల్కలై జారిపడుతోన్న
పద నక్షత్రాలను
మరుపు కృష్ణ బిలం లోకి
జారి పోకుండా నా
అంతరంగపు జోలిలో నింపుకుంటూ
తలుచుకుంటూ పరవశిస్తూ
నే చేసిన కూజితం
అతని నఖ క్షత గిలిగింత
అనుకున్నాడు కాబోలు
మురిసిపోతూ నవ్వుతున్నాడు

దేహాన్ని విడిచి నేను
ఉన్నానని తెలుసుకోలేదతను
దేహం నాది కానట్టే ఆవహించిన నిర్లిప్తత
నా మది లో కైత రస ఝరీ ప్రవాహం
నా ఎదనిండా కావ్య సాగరతరంగాలు
ఎగసి ఎగసి పడుతూ
నన్ను ఉద్దీప్తిస్తూ .....ఉత్తేజిస్తూ....
ఆ సమ్మోహన సమాగం లో నాకు నేనై
పలవరిస్తూ ....కలవరిస్తూ
నా దేహ సాన్నిహిత్యం లో అతను
ఉద్విగ్నుడౌతూ....ఉద్రేక పడుతూ
సహకరించని నా దేహాన్ని
మైమరుపని తలుస్తూ

ఎవరి వారి భ్రమలో ...వారి వారి లోకం లో
ఇరువురమూ రమిస్తూ ...
ఎగసి ఎగసి ....కెరటాలై
మిన్నును తాకిన
ఆ చివ్వరి లిప్త ....
అద్వైతానంద అనుభూతి లో నేను
స్ఖలించిన మగటిమి తో తాను
ఆనందం తో తృప్తిగా
విడివడిన ఇరు దేహాలు ...
భావ ప్రాప్తిలో తాను
మేధో భావ ప్రాప్తి లో నేను
అలసటగా వాలిపోయాడతను
ఆనందంతో ....
చిదానందానుభుతి తో ...నేను
వెదికాను కాగితం, కలం కోసం

ఇద్దరి మొహలలోనూ
ఆనందం , తవిదీరిన సంతృప్తి
అతనికి దైహికం
నాకు ఆత్మికం
ఇద్దరి వదనాలలో విరిసిన
చిరు నగవులు ఒకటే
కారణాలు వేరు అంతే ....
స్రవించిన వాంఛా వాసన తనది
ఫలించిన రస సిద్ధి నాది ...

ఇక మౌనంగా నా అక్షర సాధన ....
ఆతని నిద్రలోని అలసిన గురక వింటూ ...
నాలోకి నేనే పయనించేందుకు
కలం చుక్కాని పట్టి
కాగితం పడవలో నా అంతర్యానం ..
అనంత యానం ....
మనిషిగానే కాక ....
మనిక సార్ధకం చేసుకునేందుకు....
*20-07-2012

శ్రీనివాస్ వాసుదేవ్ || ఓ మరణం తర్వాత.....||

ధర్మజుడూ లేడు, యక్షప్రశ్నలూ లేవు
ఓ అగమ్యగోచరం...ఓ దిగులు

ఇవాళ్టి వర్షాన్ని నువు చూడలేదనో
రేపటి సూర్యోదయం నిన్ను తాకదనో.....

మరణాన్నీ ప్రేమించావేమో
అది నీ గుమ్మంలో నిలబడ్డా
అటు ఒత్తిగిలిపడుకోలేకపోయావు
ఉత్తచేతుల పంపలేకపోయావు

నీముఖంలోకి చూడలేక, నిన్ను కబళించలేకా
కాలాన్ని వెంటతెచ్చుకుందటగా
ముఖం చాటేసిన మృత్యువు

ఈ మరణం తర్వాత--
నువ్వూ ఓ నిరాకార జ్ఞాపకంలా
మిగిలిపోతావేమో!
విషాదాన్నంతా చీకటి గుడ్డలో మూటకట్టేసాను
బరువైన రాత్రి నాకు తోడుగా---
ఓ ఖాళీ కుర్చీ, ఓ ఖాళీ ఇల్లు
జ్ఞాపకాలన్నీ ఖాళీ చేసాక మిగిలిన గుండెలా!
గడ్డకట్టిన దు:ఖంతో బరువైన కళ్ళు
ఏ కథలూ చెప్పలేకపోయాయి

ప్రతీ మరణం తర్వాతా---
జీవితవాగు దాటుతూ
ఏ మరణమూ వేరుకాదా నీభాషలోనే
చెప్పమన్నా ఆ ఒంటరి కాపర్ని....
విభూదంటిన తన వేళ్ళను
నిట్టూర్పుల తడిలో కడుగుతూ--
ఆత్మ కాల్తున్న ఈ పదకొండురోజులూ
ఈ వాసనుంటుందన్నాడు....మరణం కాలుతున్న వాసన.....
నిష్కామంగా నిష్క్రమించే ఆ నిముషం కోసం
మిగిలే ఉంటాను....
చిల్లుపడిన మొక్కలగోలెంలా.....
ఏం ఇంకిందో....ఏం వొలికిపోయిందో!
**
ఎంత అందమైన పువ్వైనా వాడిపోకతప్పదన్నట్టు...
కహీ దూర్ జబ్ డిన్ డల్ జాయె....

(కొన్ని మరణాలు జీవితాన్ని ప్రశ్నిస్తాయి, కొన్ని జీవితాన్ని నిర్వచిస్తాయి...మరికొన్ని మనల్ని సమాయత్తపరుస్తాయి...)
*20-07-2012

కట్టా సుదర్శన్ రెడ్డి || అతనూ- నేనూ- నువ్వూ !! ||

నాటి సిటిజెన్లే
నేటి నెటిజెన్లు
అలనాటితరం కాదిది
నవమేటితరం తీరిది
వీరివి ఏకార్ధశోధన మేధస్సులు కావు
బహుళార్ధసాధకపు ఉషస్సులు వీరు
.. .. ..

"అతను" రూపంలో కర్రెమల్లే
మనసంతా పున్నమి వెన్నెలే
వెన్నముద్ద కన్నా ఎంతో చల్లన
హృదినిదోచాడులే మెలమెల్లన
.. .. ..
"నీ" దెంతో మురిపించే అందం
నన్నెంతో మైమరిపించే బంధం
తనివితీరనిది ఈ అనుబంధం
చెరగనీయదులే నాలోఆనందం
.. .. ..
నాలో ఆశలు మెండు
నాకు కావాలి 'రెండూ'
పండు వెన్నెలా రావాలి
నిండు వన్నెలూ కావాలి
అవ్వా కావాలి! బువ్వా కావాలి!
అవ్వే లేకుంటే బువ్వెలా చెయ్యాలి!!
.. .. ..
అందుకే
మనసులో "అతన్నే" ప్రేమగా వరిస్తున్నా
తనువుతో "నీతోనే" కోరికగా నర్తిస్తున్నా!
నాది ప్రేమంటారో
కోరికనుకుంటారో
ఐ డోంట్ కేర్
సిస్టంస్ అన్నీ మీవైనా
ఇష్టాలన్నీ నావేగా ! .
*20-07-2012
 సు.రె.క.....

సుధామ || భావ శకలం ||

కలను దోపుకున్న కళ్ళు
కన్నీటితో వదులయ్యాయి.

వర్ణించిన కనులతో ఎదలు
ఎడతెగని బరువయ్యాయి.

బరువెక్కిన హ్రుదయాలే
ఓ భారమైన కలగన్నాయి.
*20-07-2012

అనిల్ డాని || కవి -- రవి నాడైనా నేడైనా ||

ఒక స్వాప్నికుడు స్వప్నిస్తే గతంలో
అది సాకారం అవుతుంది వర్తమానం లో
ఎందరో కవులు శ్రమించి పరిచిన ఎర్రటి తివాచీపై
ఈనాడు మనం హుందాగా నడుస్తున్నాం
స్మరిద్దాం వారిని ఓసారి గతానికి వెళ్లి
తవ్వుకుందాం మన మూలాలను వేర్ల కోసం

అరిగో వారే తెలుగు దిగ్గజ కవులు కవిత్రయం
తెలుగు భాష కవితకు బాటలు వేసిన సారధులు
చంపకమాల,ఉత్పలమాల,మత్తేభం,శార్దూలం తో కవిత
భవనాలు కట్టిన కవితా శ్రామికులు
సంస్క్రుతాంద్ర పండితులు, తెలుగు మహాభారత శిల్పులు

అదిగో రాయలు తెలుగు లెస్సని పలికిన రేడు
అష్టదిగ్గజాలు మన జాతి రత్నాలు
తెలుగు సుగంధాన్ని సాహితీ పొలంలో చల్లిన కర్షకులు

ఆ వినిపించేవి శ్రీనాధ కవి చాటువులు, శివగీతికలు
సరస సల్లాపాల సరిగమలు
బమ్మెరపోతన కృష్ణ లీలామృతం పరవశం
అద్బుతం ,అసమాన్యం

అడుగో ఆద్యాత్మిక గీతాల అన్నయ్య అన్నమయ్య
వేంకటేశుని పొగిడి పోగిడిన్చుకున్న భక్త ప్రవీణ
రామదాసు భజన కృతులు
తెలుగు నాట పండిన వరి కంకులు

ఆయన వేమన విన్నావా ఆయన మాట
తేనెల వరాలమూట,గొప్ప తత్వవేత్త
మనవ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త
ఆ మెరిసేవే సుభాషితాలు
మీకు లేదా సుమతీ శతక కారుడు పెట్టిన వాత

ఆ ఎగిరేది జాషువా గబిలం ప్రశ్నిస్తుంది
విశ్వనరుడు ఎక్కడా అని, సమాధానం తెలుసా?
ఆ వేయి పడగల నీడ విశ్వనాదునిది
ఆ నీడలోకి వెళ్తే చాలు కవిత్వం ఆవాహం అవుతుంది

అదిగో మెరుపు జ్వలిస్తుందే అక్కడే పుట్టింది
మానవ పిడుగు శ్రీ శ్రీ, ధైర్యం వుంటే పలకరించు
లేకుంటే అనుసరించు మౌనంగా
ఆ విశాల "మైదానం" యజమాని చలం
మనవ సంబంధాలు వలయంలోనుంచి
బయటకే రాము అందులోకి వెళితే

ఇది గురజాడ నడిచిన బాట
ఇది బోయిభీమన్న మాట
అడివి బాపిరాజు నవల
శేసెన్ గారి కవితా సుగంధం ఓ పట్టాన వదలవు

ఇవి భావుకత చివుళ్ళు వీటి రుచి తెలియాలి అంటే
దేవులపల్లి కృష్ణ శాస్త్రిని అడుగు వివరిస్తాడు

ఈ విశ్వం పుట్టుక మూలాలు తెలుసా, సినారె
విశ్వంభర చదువు, పదం పదం కలిపి కదం తొక్కి
ముందుకు నడుపుతాయి తెలుసుకునేందుకు

ఒక నక్షత్రం ఆరుద్ర , ఒకభావం ఆత్రేయ
ఒక కొంటెతనం వేటూరి
ఆచంద్రార్కం వెలిగే తారాలోకపు కవి పుంగవులు

రాలే ఆకు రాలుతుంది నూతన చిగురు వచ్చేందుకు
రాలే ప్రతీ ఆకును గౌరవించాలి వచ్చే చిగురు
ప్రతి కవి మండుతున్న రవి అది ఆనాడైనా
ఈ నాడైనా ఏనాడైనా
*20-07-2012

పరమేశ్వరి.పులిపాటి హైకూలు

ప్రవహించే
జ్ఞాపకలతో
అదే వాగు

చెట్లెక్కడనేర్చాయో
పూల రెక్కల్ని
కలిపి కుట్టడం

ఏది దేన్ని
మెరిపిస్తుందో
చీకటి వెన్నెల

మృత్యువు
ఏం చేయలేకపోయింది
సీతాకోక రెక్కల్ని..

బడి పిల్లలు
నా బాల్యాన్ని తెచ్చారు
కాగితపు పడవలతో..

*20-07-2012

శ్రీనివాస్ దెంచనాల కవిత


పులిపాటి గురుస్వామి || నాలుగు మహా సముద్రాలుతం ||

అనుకోకుండా అక్కడికి చేరుకున్నాక మనసు వాలిపోయి
ఒకప్పటి పురివిప్పుకున్న నది ఎముకలు తేలిపోయి
పక్కనే పద్యాలతో భారతాన్ని చెక్కిన గది పాలిపోయి
దుఃఖానికి చేరగిలి ,మహాకవి ఘంటం సాక్షిగా
అక్షరాలు నడిచిన ప్రదేశం ఒంటరిగా తలుపులు బిగించుకొని
మన చేతగాని తనాన్ని ప్రశ్నించిన తిక్కన మహా సముద్రము

మహా మహా సత్య పురుషుడు తిరుగాడిన మట్టిమీద
చల్లని గాలి కూడా జ్ఞాపకాలు మోసుకొని సోయగాలు పోయి
చింత చెట్ల చిగురు బాల్యాన్ని గిలిగింతలు చేస్తుంది
పచ్చని గడ్డితో పాతకాలపు ముచ్చట్లు పెట్టే
పసి నవ్వుల్ని పూయించే వృద్ధుల్ని వెంటేసుకున్న
మౌనశక్తి కేంద్రం విరిసిన పల్లెపాడు గాంధీ ఆశ్రమ మహా సముద్రము

అక్కడ నిలబడ్డాను...తన భాషలో తాను అంగలు వేసుకుంటూ కుంటూ
ఒడ్డుకు వచ్చేసరికి ఒదిగిపోయి ,నా మనసును నురుగుతో కలిసి ,
తడిమి సుతారంగా వెనక్కి ...ఆకృతి లేని అలలు ,అవి పిలిచిన ఆలోచనలు
దూరంగా చూస్తే నిశ్చింత ,ఎగుడు దిగుడులే లేని సమతల తళతళలు
కొంచెం ముందర ఎగిసిపడే యవ్వనపు ఉబలాటాలు
నత్తగుల్లల చేమ్కీ అంచుల్లో పసిపాదాల మెత్తని ఇసుక అడుగులు
మానవ జీవితాన్ని ప్రవచించే మహాశాస్త్రవేత్త
ప్రపంచ దేశాల ప్రజలతో ఒకే భాషలో మాట్లాడే మహా సముద్రము

చల్లని గుండె పలకరింత ,నా తప్పి పోయిన శరీర భాగం దొరికిందా!
ఆలింగనంలో స్పర్శకు పులకింత కలిగింది .
ఇటూ అటూ ఉత్సాహానికి వయసొచ్చి ఉరకలెత్తుతుంటే
వయసు సిగ్గుతో తల దిన్చుకోక తప్పలేదు .
అనర్ఘల వాగ్ధాటి అందర్నీ వశపరుచుకొని తల్లికోడిలా
రెక్కలపోట్ట కిందికి నులి వెచ్చదనం తో కప్పుకుంది .
ప్రేమకు ఎన్ని ఋతువులో,ఎన్ని దిక్కులో,వెలువడే శక్తికి ఎంత పరిమళమో!
హద్దులు చెరిపిన భాస్కర కణాల పవిత్ర మహా ప్రేమ సముద్రము.
*20-07-2012

వర్ణలేఖ || మనసు బొమ్మ ||

మా తాత
తగిలించిన
గోడ మీది బొమ్మ

మా మనసులకి
గొలుసులేసి
లాగే బొమ్మ

మా అమ్మ
రాక మునుపే
వేలాడుతున్న బొమ్మ

మా మేనత్త
మారాం చేస్తే
కొన్న బొమ్మ

తుమ్మలపల్లి
జాతర గురుతు
ఆ బొమ్మ

నార తాళ్ళతో
అందమైన
అల్లిన బొమ్మ

సాదా రంగునద్దినా
సొగసులు
విరజిమ్మే బొమ్మ

మేం అన్నం
తినడానికి
అమ్మ చూపే బొమ్మ

అపురూపంగ
ఆడుకున్న
జ్ఞాపకపు బొమ్మ

మా మనసులకి
గొలుసులేసి
లాగే బొమ్మ

*20-07-2012

పులిపాటి గురుస్వామి || అంతే కానీ ..... ||


అంతేలేని
అంతేనని

అంతని
ఇంతని

అంతా ఇంతేనని 
*20-07-2012

ఎంతా కాదని