23, ఆగస్టు 2012, గురువారం
దాము॥పురుగులు॥
కమ్మినపుడు
నేను జీవిస్తాను
నిగూఢ గాడాంధకారపు కౌగిలిలో
మేలుకొంటాను
స్వీయ దేహాన్ని వొరసుకుంటూ
ప్రవహిస్తాను
హఠాత్తుగా యెవరో నా లోపలి
నుంచి దూసుకెల్లిపోతారు
ఖాళీతనపు నైరాశ్యంతో
రోజుల వెంట నడుస్తాను
నేను మోస్తున్న దేహం నాదేనని
తెలుసుకునేందుకు బద్దకిస్తాను
వొకానొక చాలా కాలం తర్వాత
గుర్తు తెలియని నా శవం
యెవరికో దొరుకుతుంది
శవాన్ని వదలి జ్ఞాపకాల్ని
తింటుంటాయ్ పురుగులుచింతం ప్రవీణ్|| మౌనం||
మౌనం అక్షరాల్లేని లిపి
ధ్వనిలేని సంగీతం
మౌనం పెదవికదిలితే మాట
గొంతెత్తితే పాట
మౌనం నినాదానికి రిహార్సల్
ఉద్యమానికి వ్యూహం
మౌనం మాటకు తొలిరూపం
బతుకు చివరిరూపం
నీ ||"ఖాళీ"||
నీ చెతిలో విస్కీ గ్లాసు...
నాలాగే ఏడ్చెయ్,
కన్నీళ్ళు కార్చెయ్ !
ప్రేమించినోళ్ళను కాలం దారుల్లో పారేసుకున్నొళ్ళం
బతుకంతా.....
బరువుగా వెతుక్కుందాం!
చేతిలో విస్కీ గ్లాసు! ..పొన్లే ఖాళీ కానీ..
ఓపిగ్గా ఓచోట కూర్చుందాం
గుండెల్లో ఖాళీ కాని "వాళ్ళ" గదుల్ని
చూసుకుంటూ..బావురమందాం...
కానీ ఏదైతే అదవనీ..
ఒక ఒంటరి బొంగురు గొంతు ఫొన్లో
నిన్నెంత వెంటాడిందో తెలిసినోన్ని
నిన్ను నువ్వే మెలిపెట్టి..
ఏడ్చుకోటం చూసినోణ్ణి
ఈసారికి కానీ...
అక్కడెలావుందో, అసలేం జరిగిందో..
నీ మనసు-ఈ సీసా....
రెండింట్లొ ఒకే ఖాళీ!
విస్కీలో నీళ్ళు కలిపినంత తేలిగ్గా..
నీ ఏడ్పుల్లో నవ్వుల్ని కలిపేవాడివి
కానీ.. ఖాళీ.. కానీ
చెరో లేఖను మళ్ళీ రాద్దాం..!
బోర్ కొట్టినప్పుడొ,
ఖాళీగున్నప్పుడొ,
నచ్చినప్పుడో
ఎప్పుడో ఒకప్పుడు
రెండు తిరుగు సమాధానాలు
చెత్తబుట్టలో
చాక్లెట్ కాగితాలా విసిరితే
అందుకుని సంబరపడదాం..
భూమిని,ఆకాశాన్ని
విస్కీని-నీళ్ళని కలిపేద్దాం
ఎలాగూ ఓటమిని వాటేసుకున్నోళ్ళం
అందుకే ఖాళీతనాన్ని నింపేందుకు ఖాళీ చెయ్
గొంతు దిగకపొయినా
గుండె ఆగిపొయినా.....
"ఖాళీ చెయ్!"
.................
(ఒక మిత్రుడి కోసం)
అవ్వారి నాగరజు||ముఖాలు||
రోజులు ఉద్విగ్న క్షణాలుగా చీలి
పదును అంచులతో రాసిన రాతలు ముఖం మీద అనేక గీతలు గీతలుగా మారి
తను తన ఆధారాన్ని తన భర్తను తన శత్రువును
కోల్పోయినాక జీవితంలో ఊహ తెలిసాక
తెలిసి తెలిసి బహుశా తెలియక కూడా
తనను రాటుదేల్చుకున్న యుద్ధాల గురుతులుగా
ఆమె నిలబడి నీకేసి చూసి
రోజుల శూన్యతను కన్నులతో నింపి నీ మీద కుమ్మరించినపుడు
మనుషులు దూరమైనపుడు ప్రేమికులు మిత్రులు శత్రువులు ఆధారమైనవారు
దూరమైనపుడు
పదుల ఏళ్లగా అలవాటైన జీవితం తనకు తాను ఒక కొత్త ముఖంతో తనకెంత మాత్రం సమ్మతం కాని ముఖంతో తన ముందు నిలబడినపుడు
పాలిపోయిన పలుచని పసుపు రంగు ఆమె ముఖం మీద
నీకు మాత్రమే తెలిసిన మృత్యువు నెమ్మది నెమ్మదిగా రూపొందడం చూసి
ఏమని ప్రార్థిస్తావు నీవు
ప్రభూ
ఈవిడకొక విరోధిని ప్రాణశ్వాసగ ఆధారమై నిలిచే వారిని
ఒక తోడును ఆశ్వాసాన్ని మనిషిని ప్రసాదించు
జాన్ హైడ్ కనుమూరి |నీవు వెళ్ళాక|
నీకేం!
ఇలావచ్చి
అలా వెళ్ళిపోతావు
ఆశేదో గూడుకట్టిన మేఘమౌతుంది
నువ్వెళ్ళాక వర్షించడం మొదలౌతుంది
నీ బాల్యాన్ని భుజంపై మోస్తూ
నా పనులు చేసున్నప్పుడు
నీవు చేసిన సవ్వడులు
ఇప్పుడు జ్ఞాపకాలై రాల్తుంటాయి
ఎదో మిషతో
నువ్వెళ్ళకుండా బంధించాలని చూస్తాను
బాధ్యతల గుమ్మానికి
ప్రాణాలు తగిలించివచ్చావని గుర్తొస్తుంది
బంధించాలనే వూహలన్నీ
పురిలేని దారాలయ్యాయి
చిన్నిచిన్ని పక్షుల్ని చూసి
ఎగరటం ఎలా అడిగిన నువ్వు
అనురాగాలన్నీ
ప్రక్కనపెట్టి
హఠాతుగా ఎగిరేందుకు సన్నద్దమౌతావు
నీకేం!
ఇలావచ్చి
అలా వెళ్ళిపోతావు
నీవు చెప్పిన ఊసుల్తో కొన్నిరోజులు
దిగమింగిన బాధల్ని తలపోస్తూ మరికొన్నిరోజులు
నళ్ళీ వచ్చేదెపుడోనంటూ
ఎదురుచూపుల్ని వాకిట్లో ఆరబెట్టి
కేలండరును కత్తిరిస్తుంటాము
అప్పుడప్పుడు
ఇంటిపైన ఎగిరే విమానం చప్పుడులో
నీవున్నావని భ్రమపడి
బయటకొచ్చేలోగా
విశాలాకాశంలో
అదృశ్యమౌతుందా తలపు
నీకేం!
ఇలావచ్చి
అలా వెళ్ళిపోతావు
తలపుల్తో పాటు
తలపుల్ని మూసి
చెమ్మగిల్లిన కన్రెప్పల్తో
నిద్ర రాక తూగుతుంటాము
**************
అమ్మలందరికి అంకితం
**************
ప్రవీణ కొల్లి రాసిన |ఇంటికెళ్ళి వచ్చాక| చదవగానే మా అమ్మ గుర్తుకొచ్చింది
తక్షణం అక్షరాలిలా ప్రవహించాయి
జ్ఞాపకంగా తొలి ప్రతినికూడా ఇక్కడపెడుతున్నాను
నీకేం!
ఇలావచ్చి
అలా వెళ్ళిపోతావు
ఆశేదో గూడుకట్టిన మేఘమౌతుంది
నువ్వెళ్ళాక వర్షించడం మొదలౌతుంది
నీ బాల్యాన్ని భుజంపై మోస్తూ
నా పనులు చేసున్నప్పుడు
నీవు చేసిన సవ్వడులు
ఇప్పుడు జ్ఞాపకాలై రాల్తుంటాయి
ఎదో మిషతో
నువ్వెళ్ళకుండా బంధించాలని చూస్తాను
బాధ్యతల గుమ్మానికి
ప్రాణాలు తగిలించివచ్చావని గుర్తొస్తుంది
బంధించాలనే వూహలన్నీ
పురిలేని దారాలయ్యాయి
చిన్నిచిన్ని పక్షుల్ని చూసి
ఎగరటం ఎలా అడిగిన నువ్వు
అనురాగాలన్నీ
ప్రక్కనపెట్టి
హఠాతుగా ఎగిరేందుకు సన్నద్దమౌతావు
నీకేం!
ఇలావచ్చి
అలా వెళ్ళిపోతావు
నీవు చెప్పిన ఊసుల్తో కొన్నిరోజులు
దిగమింగిన బాధల్ని తలపోస్తూ మరికొన్నిరోజులు
నళ్ళీ వచ్చేదెపుడోనంటూ
ఎదురుచూపుల్ని వాకిట్లో ఆరబెట్టి
కేలండరును కత్తిరిస్తుంటాము
అప్పుడప్పుడు
ఇంటిపైన ఎగిరే విమానం చప్పుడులో
నీవున్నావని భ్రమపడి
బయటకొచ్చేలోగా
విశాలాకాశంలో
అదృశ్యమౌతుందా తలపు
నీకేం!
ఇలావచ్చి
అలా వెళ్ళిపోతావు
తలపుల్తో పాటు
తలపుల్ని మూసి
చెమ్మగిల్లిన కన్రెప్పల్తో
నిద్ర రాక తూగుతుంటాము
**************
అమ్మలందరికి అంకితం
**************
ప్రవీణ కొల్లి రాసిన |ఇంటికెళ్ళి వచ్చాక| చదవగానే మా అమ్మ గుర్తుకొచ్చింది
తక్షణం అక్షరాలిలా ప్రవహించాయి
జ్ఞాపకంగా తొలి ప్రతినికూడా ఇక్కడపెడుతున్నాను
రాళ్ళబండి కవితాప్రసాద్॥కొత్త కొత్త కొత్త గా ......॥
ఈ పదాలు
ఇంతటి అర్ధాన్ని దాచు కున్న సంగతి
నేను
కవినైనదాకా తెలియదు!
మట్టి ఇప్పుడు నాకో
కొత్త అర్ధాన్నిస్ఫురింపజేస్తుంది.
మనిషి ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాడు.
నిఘంటువుల పరిమాణం
ఆకాశాన్ని మించి
పెరిగిపోయింది.
ఒక్క కన్నీటి చుక్క
వేయి పదకోశాల సారాంశమౌతుంది.
అక్షరం
సరికొత్త కాంతి కణమై వెలుగుతోంది !
మోహన్ రుషి //అలాగ..! //
బొమ్మవీ కావొద్దు
బొరుసువీ కావొద్దు
నాణెంగా ఉండిపోవడం నేర్చుకోవాలి!
ప్రేమించొద్దు
ద్వేషించొద్దు
అంగీకరించడం అభ్యసించాలి!
తండ్రి నిజం కాదు
కొడుకు అబద్ధం కాదు
బంధానికీ బంధనానికీ మధ్య తేడాను
గుర్తించగలగాలి!
వెంటపడుతున్నకొద్దీ
దూరమయ్యేది లక్ష్యం,
కంటపడేదల్లా ఆశించేకొద్దీ
భారమయ్యేది జీవితం అనే
మెలకువతో మెలగాలి...
మెలాంఖలీ మేఘం వెనుక మెరిసే
ప్రభాత రాగాన్ని దర్శించగలగాలి!
Mercy Margaret ll లెక్క చూసుకున్నా ఇవ్వాల్టి ప్రేమ ll
ఇప్పుడే
లెక్క చూసుకున్నా
ఇవ్వాల్టికి
ఎంత ప్రేమ వెనకేసుకున్నా
అని
ఆవర్జా ముగిసినా
ఇంకా ఎదో
అస్పష్టపు లెక్క
అంకెల గీతలు దాటి
రేపటికై లాభాల
మిగుళ్ళు చూడడానికి
నష్ట పోయిన ప్రేమ
నటనకి అమ్ముడుపోయిన ప్రేమల్ని
బేరీజు వేసుకొని
తెలివి తెచ్చుకోడానికి
చేతిలో నిలుపుకుకున్న ప్రేమ
ఎంతో
రేపటికి తీసుకెళ్లే, మోసుకెళ్లే
ప్రేమెంతో
ఖర్చు చేసిన
ప్రేమెంతో అని
హృదయంలోని ఎడమవైపు
గదుల్ని డెబిట్ అంటూ
ఖాళీ తనంతో ఒంపేస్తూ
ప్రశ్నల మరకలతో
నింపేస్తుంటే
ఆ వైపుకు ఈ వైపుకు
సరి సమానం కాక
క్రెడిట్ అయ్యె ప్రేమ లేక
హృదయం పై ప్రశ్నలని
తుడిచేసే, కొట్టేసే ప్రేమ
డిపాజిట్ అవ్వక
ఇన్ని రోజులూ
లోటు చూపించింది
ఇవ్వాలే
నాకు తెలియని
జీవితాంతం సరిపోయే
ప్రేమ మొత్తాన్ని
క్రెడిట్ చేసారు
అది నీవేనా?
* * * * *
ఒక్కసారిగా
నా ఆవర్జా తల క్రిందులయ్యింది
ఎప్పూడూ రేపటికోసం
నన్ను నేను ఖాళీ చేసుకునే
లోటు ప్రేమ
నుంచి
అందరికి పంచమని ఒకేసారి
ప్రేమే ప్రేమగా
తనని తాను నాకు దానమిచ్చింది
ఇప్పుడే ముగిసింది
ఈవ్వాల్టి లెక్క
ఆశా నిరాశల మధ్య
ధైర్యానికి పిరికితనానికి
గెలుపు ఓటముల మధ్య
నాణానికి రెండువైపులా నేనై
అటూ ఇటూ గా
సమానమవుతూ
అసమానతల్లో
ప్రేమనే చూస్తూ
నా అస్తిత్వాన్ని ప్రేమకొసమే
అప్పగించుకుని
తృప్తిని ప్రేమ భాషల
లెక్కలో మిగుల్చుకొని
వ్యాపారిని కాకపోయినా
తరహాననుసరించి నడుస్తున్న
మనసున్న మనిషిని
అంకెల్లో లెక్కలు చూపలేని
ప్రేమ పొంది ధనవంతున్ని అని
తృప్తి కోసం ఆశపడే మనసువాదిని
అఫ్సర్||An Empty Episode-3||
మూడో సన్నివేశం: మాటని శంకించకుండా వుండలేను, వ్యక్త శబ్దాల అపనమ్మకం నన్ను వెంటాడకుండా వుండదు ఎప్పుడూ – “నేనె”ప్పుడూ అవ్యక్తమని చెప్పను కానీ, అవ్యక్తంలోని శబ్దరాహిత్యం నాకెందుకో పెనుకేకలా వినిపిస్తూనే వుంటుంది. కలవరింతల భాష తెలీకపోతే నీకు/ పలవరింతల నిట్టూర్పులు నీలోపల ప్రతిధ్వనించకపోతే ఎందుకో నేనొక దిగులు విగ్రహమై నిలిచిపోతా వొక్క మాటా అనలేక.
1
నువ్వు నన్నెలా కదిలిస్తావో, అదిలిస్తావో ఇంకా ఆ రహస్యం నాకు తెలీదు. నేను నేర్చుకున్న/ నేర్చుకోలేని భాషల్లో ఎక్కడా ఎప్పుడూ నీ రహస్యాలు తర్జుమా కావు. నీకేదో వొక భాష ఇద్దామనే నా వెర్రి ప్రయత్నం వుందే, దాని మీద నాకెప్పుడూ కొండంత జాలి. ఎన్ని కొండలు ఎక్కాలి నీ ఆకాశంలోకి గిరికీలు కొట్టడానికి? ఎన్ని ఎత్తుల మీంచి జారిపడాలి నీలోపలికి వొక పక్షి ఈకనై అతి తేలికగా అలవోకగా, ప్రాణమూ దేహమూ శూన్యమయి పోయినంత హాయిగా రాలి పడడానికి?
2
కలవరింతల రుతువులో నీ పేరు వొక్కటే నాకు మిగిలిన భాష. నిజం కాదని బాగా తెలిసి తెలిసీ నీ చిర్నవ్వు కొసన వేలాడుతూ వుండిపోతా తెల్లారే దాకా-- మళ్ళీ పొద్దు వాలే దాకా. ఈ మధ్యలో వచ్చివెళ్లిపోయే లోకానికి నేనొక వున్మాది వూహని.
3
అబద్దం ఇప్పుడు సయించదు కాబట్టి, వొక్క నిజం చెప్పనా? అప్పుడప్పుడూ నీలోపలి స్త్రీత్వంలో ఎలాగోలా కాసేపయినా బస చేద్దామనుకుంటా. కనీసం వొక జీవితకాలమంత గాఢమయిన కొన్ని క్షణాలు. ఎందుకలా పూల నవ్వుల పక్కనా, తుంటరి ఏరు పక్కనా, చెదిరిన ఆకాశం కిందా, పెంకి మబ్బుల్లోనో కనిపిస్తావ్?! మల్లెలూ, కనకాంబరాలూ, సిందూరాలన్నీ బోసిపోయే రంగుల్ని ధరించి ఎందుకలా వస్తావ్ నా నిద్రారాహిత్యాన్ని ఇంకాస్త పొడిగించే చలికాలపు రాత్రిలాగా.
నేనందుకోలేని ఎత్తుల్లోనో, దిగలేని లోయల్లోనో ఎందుకలా నన్నొక ఎండమావిని చేసి ఆడుకుంటావ్?! ఎలాగూ నువ్వు నీ తెల్లారిన ప్రతీ లోకంలో నన్ను నీలోంచి గెంటేసి నీ పగటి మాస్క్ లోకి నీటుగా దిగడిపోయి, నన్ను మళ్ళీ వొక అపరిచితుణ్ణి చేస్తావ్. నీ మీద ఏ అధికారమూ లేక నేనొక నిట్టూర్పులోకి జారగిలబడ్తాను. నిను తాకే వేళ్ళనీ, నిను ముద్దాడే పెదాలనీ, నిను చుట్టేసే చేతుల్నీ – అకారణంగానే అయినా- వొక ఆకుపచ్చ కంటినై చూస్తా.
4
తేలదు
ఎటూ తేలదు
తెలియదు
ఏమీ తెలియదు.
తేలితే, తెలిస్తే నువ్వు కాదు కదా!
5
తెగిన నిద్రలోంచి మేలుకున్న ప్రతిసారీ
ఇటు తిరిగి నిద్రపోని కళ్ళతో
నా రెప్పల్ని నిముర్తున్న నువ్వే కనిపిస్తావ్!
నాకూ అప్పుడే తెలుస్తుంది, నీ రెప్పలు నిద్రని వెలివేశాయని.
6
అప్పుడిక నువ్వొక కల అని
ఎవరు చెప్పినా నమ్ముతానా నేను?
7
నీ కలలో మునిగి పైకి తేలే వొట్టి కలవరింతనే నేను!
నన్నిలాగే వుండనివ్వు నీ రాత్రిలో
నీ రెప్పల కింది ఆ వెలుగులో
ఆ వెలుగు కింది మసక చీకట్లో.
వంశీ || బెస్ట్ సెల్లర్ ||
నిద్రగన్నేరు నీడన
తలబాది తవ్వితే మొలిచిన తాజా కలలు,
స్వప్న భేదనానికి ఫ్రాయిడ్నీ
తత్వ రహస్యాలకు సార్త్ర్ నీ, సాంకృత్యాయన్నీ రమ్మని,
అపరిష్కృత కాలమమ్మి కొనుక్కున్న కలల్ని,
ఎదురెదురుగా కూర్చుని
మెదడు మూలాల్లో నిక్షిప్తీకరిద్దాం,
నువ్వే నాయకుడివి,
అసంభవాల్నీ,అద్భుతాల్నీ దర్శించి
ఆనందంతో చరిద్దాం,
తొలిప్రేయసి జడ రాల్చిన గులాబీ రెమ్మలు,
తుదిశ్వాసకి సంతకమిస్తున్న మితృడి రెప్పలు,
విశ్వయాత్రకి నభస్సుకెగురుతున్న పక్షి రెక్కలు,
నీ రుధిరఙ్నాపకాల్తో గర్భోద్భవమైతున్న శైశవ రూపాలు,
ఒక్కసారి స్పర్శించి,
మనోవల్మీకమంజూషాల్లో కుడ్యచిత్రాల్లా
పదిలపరిచి తేజోన్మత్తులమవుదాం..
నీ నీడకీ కలలుంటాయేమో
పురానాగరికతలోకి జారిపోవాలని,
నీ ఆత్మకీ కలలు కావాలేమో
పొరల శరీరాన్నొదిలి పారిపోవాలని,
ఒక్కసారి అడిగి చూడు,
నిజంకాని తలరాతలు
తోడిచ్చిన నిద్రలేని రాత్రుల్నీ,
కాలిబూడిదైన అనుభవాలు
విదిల్చిన అసంతృప్త స్మృతుల్నీ,
అనస్థిత్వపు దృక్కోణాలు
మిగిల్చిన అసంబధ్దపు ఊహల్నీ,
విషాదపు క్షణాలు
శిథిలీకరించిన అశృబిందువుల్నీ బహిష్కరించి,
కావాలనుకున్న కలలు భుజాన మోసుకెళదాం
ఆలోచనల వెన్ను నొప్పి పుట్టేంతవరకు,
రావాల్సిన రేపటి రోజుని ముందే ఆవిష్కరిద్దాం
కోరికల కళ్ళు వెలుగులతో నిండేవరకు,
నిద్రగన్నేరు నీడలో
కలిసి నవ్వితే కనిపించే తాజా కలలు,
నువ్వే నాయకుడివి,
అసంభవాల్నీ,అద్భుతాల్నీ దర్శించి
ఆనందంతో చరిద్దాం...
క్రాంతి శ్రీనివాసరావు ||మూడు మేరలు ||
అన్నయ్య కొడుకుపెండ్లి ఖమ్మం లో చేయ్యాలనుకొన్నప్పుడు
నాన్న ఎందుకో అలజడిగా కనిపించారు
అమ్మ మెల్లంగా వెల్లడించాక తెలిసింది
మంగలి నారాయణ
చాకలి లక్ష్మయ్య
కుమ్మరి వెంకయ్య
లేకుండా పెళ్ళెట్లా చెయ్యాలని?
కాళ్ళ గోళ్ళు తీసేందుకు
కూర్చునే పీటకింద పోసిన వడ్లను
మెరుస్తున్న కళ్ళతో చూస్తున్న నారయణ
నన్ను చూసి ముచ్చటపడి దగ్గరకొచ్చి
నీ జుట్టేందయ్యా ఇట్టయ్యుంది
అంతొత్తు గుండేది ఇంతపలచనయ్యుందేం మా బతుకుల్లాగా అన్నప్పుడు
పిల్లలెలావున్నరు అంటే
వాళ్ళు వూరిడిచి మేరిడిచి పట్నం బొయ్యు
ఎవడి కొట్లోనో కత్తెర్లేసుకు బతుకుతున్నారు
వూళ్ళో వాడ నచ్చక ఆడికి బొయునంక సొంతిల్లు లేక
మురికి వాడల్లోనే బతుకెలమార్చుకుంటున్నారు
సన్నాయుమేళం బాండొల్లెత్తు కెల్లాక
పెద్దోన్నాయానుగా బొత్తిగా పనిలేదుబాబు
వోడిపొయున కోడిపుంజుల సాపం ఉత్తినే పోద్దాబాబు
పొదిలో పదిలంగా ఉండాల్సిన బతుకు
పట్నం బొయ్యు ఆగమయ్యుండ్రు పోరగాల్లని
బాధని సన్నని నీటి పొర వెనుక దాచేస్తూ చెప్పిన మాటలు
నన్నింకా వెంటాడు తూనే వున్నాయు...................... .........
తోరణపు ఆకులు కట్టించి ప్రతాణపు పెట్టె బూజానెట్టుకొని ఎదురై
చల్లనిచూపులతో దీవిస్తున్న లక్ష్మయ్యనీ అదే ప్రశ్న అడిగా పిల్లలెలా వున్నారని
ఎముందయ్యా
ఒకడు అపార్ట్మెంటు కిందా మరొకడు రోడ్డుపక్కన
గూడలు పడేదాకా గుడ్డలు ఇత్తిరీ జాత్తాన్నా
గాడిద చాకిరీ తప్పితే గతకటానికే తప్ప ఏం మిగులుబాటులేదయ్యా
వూల్లో చాకిరేవు బెట్టినప్పుడు ఈమాత్తరపు గటక అప్పుడూ వుందిలేయ్యా అంటున్నప్పుడు
కళ్ళళ్ళో చల్లదనం పోయు నైరాశ్యపు నీడలు కమ్ముకోవడం నాకింకా గుర్తే
గరిగ ముంత ఏదన్నప్పుడు గబగబా వస్తున్న వెంకయ్య నడిగా
కుండలింకా చేస్తున్నావా అని
ఘట వాయుద్యంలా గలగలా నవ్వి
కొట్లో కొనుకొత్తున్నా సారిరిగి చాలాకాలమయ్యుందయ్యా
అప్పుడు
గరిగ ముంత నుండి నీల్లపొంతదాక
అన్నం కుండలు నీల్లకడవలు పచ్చడి బానలు
మట్టికూజాలు వొంటిచేత్తో చేసేటోన్ని
ఇప్పుడు కుండలు పగిలిపొయ్యు
మా బతుకులన్నీ ఓటు బొయ్యాయయ్యా
దినబత్తెం గాల్లమై దొరికిన పని జేసుకొంటున్నామయ్యా అన్నప్పుడు
ఆలోచనలన్నీ మనసులో తిరుగుతున్న సారె చక్రం చుట్టుకొని చిక్కుబడ్డాయు
అవతల అప్పగింతలవుతుంటే
నాన్న ఆముగ్గురూ వూరి జ్ఞపకాలను అప్పగించుకొంటు
చుట్టలు కాల్చుకొంటూ చుట్టాలను పక్కన బెట్టి
పల్లెను మళ్ళీ పెండ్లి పందిట్లో బ్రతికించారు
పల్లె పందిరిగుంజకు కట్టేసుకున్న ఆతరం
పందిరిమంచమెక్కాలని పట్నం చేరిన ఈతరం
బావుకున్నది బాగుపడ్డది ఏదీలేదు
సమస్త వృత్తులూ ధ్వంసమై
ఇప్పుడు పెట్టుబడిదారు స్వంతమయ్యాయు
యంత్రభూతాలు వెంటపెట్టుకొని
దొరకొడుకే ఇప్పుడు వృత్తిదారుడయ్యాడు
పిడికిలి బిగియుంచనంత కాలం
పిరికితనం వీడనంత కాలం
పేదరికం పంచలోనె కాపురముంటుంటారు
శ్వేదజలం దొంగలకె చాకిరిచేస్తుంటారు
జగద్ధాత్రి || తపస్సు ||
నరుక్కుంటున్నా
నాలోని నన్ను..నా అహాన్ని
అభిజాత్యాన్ని ..అసహాయతని..అజ్ఞానాన్ని
ఖండఖండాలుగా....
అశక్తతని ..అనుమానాలని ..మొహమాటాలని
ముక్కముక్కలుగా...
నాలోని నా అసలు నేను
నాకు దొరికే వరకు
ఈ నిరంతర ఊచకోత సాగిస్తూనే ఉంటా
నా శక్తిని నేను తెలుసుకునే వరకు
నా మనసుని యధాతధంగా
వ్యక్తీకరించగలిగే వరకు
నా అనుభవాలను నిర్మమంగా అక్షరీకరించేవరకూ
నా అనుభూతుల అ౦శీ భూత రాశిని
అభివ్యక్తీకరించ గలిగేవరకు
నాలో నాకు నేనే ..అడ్డుపడే అన్ని గోడల్ని
తెరలని పొరలని చీల్చుకుంటూ
ధరిత్రి లోంచి మొలకెత్తిన
నా జీవన విత్తనాన్ని..నా జీవిత కధనాన్ని
కాస్తైనా మీకు చెప్పేవరకు
ఈ నా నిరంతర అంతర్యుద్ధం
సాగిస్తూనే ఉంటా
నన్ను నేనే
సరి చూసుకుంటూ ..సరి చేసుకుంటూ
నన్ను నన్నుగా చూపించడానికి
అడ్డొచ్చే ప్రతి ఆంక్షని
నిజాయితీ తో నరుకుతూ పోతా
చివరికి అసలైన
"నేను" ను ఆవిష్కరించుకునే దాకా
నగ్నమైన నా ఆత్మను
నా ప్రేమను ..కనుక్కునేదాకా
ఇలా ఈ ఊచకోత
సాగిస్తూనే ఉంటా....!!!
నరేష్ కుమార్ // మా కిటికీ లో ఒక చంద్రుడు//
నిద్దురని
టీ కప్పు లో పోసుకొని
ఆమె
కళ్ళలో మనసుని దింపేసి
సేద తీరుస్తూ
కూర్చుంటానా.....
ఎలా వచ్చే వాడో
కిటికీకి తనని తాను
కట్టేసుకునే వాడు చంద్రుడు
పనేం లేనట్టు...
నాకు పోటీగా
నాకంటే ముందుగా
ఆమే మేనిని
తాకినప్పుడు
'మబ్బులడ్డం రానీ నీ సంగత్తేలుస్తా '
అన్న నా
బెదిరిం పులకు
హేలనగా నవ్వుతూ
నాతో సంబందం లేనట్టుగా
వెన్నెలని
ఆమె మొహానికి అతికించేసి
వాడిని వాడే
క్లోనింగ్ చేస్కునే వాడు
ఆమె కురుల్లో
నేను
మొహం దాచుకోగానే
దొంగ చాటుగా పరుగెత్తుకొచ్చి
తన బుగ్గల నిండా
సిగ్గుని
స్ప్రే చేసెవాడు..
అధరాలని పీల్చుకున్నప్పుడు
వీది చివరి
"అమృతా వైన్స్"
బోర్డు ని ఓదార్చే వాడి మాటలు
మత్తెక్కిననా కర్ణభేరిని
పలకరిస్తూనే ఉండే
రాత్రంతా..
మేం
ఖజురహొ శిల్పాల
అణువణువుల్లో
జీవాన్ని నింపుతున్నప్పుడు
కుళ్ళుతో
మొహం మాడ్చుకొని
చీకటిని మా మీద కప్పే వాడు
పగలంతా
ఏ తారతో కలిసి
మమ్మల్ని
ఆవాహన చేసుకునేవాడో..
మర్నాడు
కిటికీ రెక్కలకు
నీరసంగా వెళ్ళాడే వాడు
నవ్విస్తూ,కవ్విస్తూ,లవ్విస్తూ. .
మెదిలిన ఆమె
నా గుండెల్ని
ఖాళీ చేయకుండా
తలపుల
నిండా
తామసి మసి
చల్లేసి వెళ్ళిపోయాక
మా కిటికీ చువ్వలకు
చంద్రుడు ఉరేసుకున్నాడు
పాపం.........
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)