పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

22, ఆగస్టు 2012, బుధవారం

ప్రవీణ కొల్లి॥ఇంటికెళ్ళి వచ్చాక...॥


రాత్రంతా వర్షం కురిసి
ఇప్పుడే వెలిసినట్టుంది
తడిసిన గుమ్మం
చెమ్మగిల్లిన వాకిలి స్వాగతం పలికాయి.
సన్నజాజి తీగ, మల్లె మొగ్గ, చిరుగాలి స్పర్శ
ఆ ఆవరణంతా ప్రేమమయమే!
"బాగున్నావా తల్లి?", "అలా చిక్కిపోయావే?"
ఆర్ధ్రత నిండిన పలకరింపుల అమృతాలే!

నాన్న పడక్కుర్చీ
అమ్మ గాజుల మోత
వంటింట్లో తాలింపు వాసన
వరండాలో బంధువుల సందడి
అబ్బ...ఎప్పటికీ ఇవి ఇలాగే
నేను ఇక్కడే ఉండగలిగితే ఎంత బాగుండు!

కలవాలనుకున్నా కలవలేకపోయిన స్నేహితులు
ఎవరి జీవితాలలో వారు బిజీ అని సాక్ష్యం చెపుతూ
మరో సంవత్సరానికి వాయిదా పడ్డాయి!
కొత్తగా కలిసిన నేస్తాలు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని నింపాయి.

చాన్నాళ్ళకు కలిసిన తోబుట్టువులతో
కబుర్లు తీరనే తీరలేదు!

బాల్యం, కౌమారం, యవ్వనం
ఇవన్ని హడావుడిగా వెళ్లి పోతాఎందుకో?

గమ్యాలు వెతుక్కుంటూ సాగుతున్న ప్రయాణంలో
ఆటవిడుపుగా వెనక్కి వెళ్ళితే
మరి తిరిగి రావాలనిపించదు!

జ్ఞాపకాల అరలలో
స్మృతుల దొంతరలు పేర్చుకుంటున్నా
కాలం కరిగిపోతుందన్న బెంగ తీరక మునుపే
మబ్బులు ముసిరిన ఆకాశం
వర్షించటం మొదలుపెట్టింది
వీడ్కోలిస్తూ.....
*21.8.2012

స్వాతీ శ్రీపాద ||నువ్వు||


మగత మబ్బులా మత్తు
నరనరాన్నీఆవహిస్తున్న ఆక్షణం
ఎక్కడినుండో ఓ అస్పష్ట గానం జోల పాటై
నులి వెచ్చని మిధ్యా భావనలోకి లాగి
నిరాయుధంగా నీ భువన వలయంలో బంధీనై ....
సంపెంగల జడివాన చిత్తడీ
పారిజాతపు జల్లు పులకరింతా
అలదుకొన్న చిరుగాలి తునకై
నా అక్షరాల అలల్లో గిరికీలు కొడుతూ
కరిగి కరిగి జలపాతపు హోరై
నీ ఉనికి ...
నీ మాధుర్యపు మైత్రి వశీకరణలో
కఠిన శిలా హృదయం కరిగి
మెత్తని వెన్నెల ముద్దై
మనసు స్పటికపు పుటలగుండా
పరుగులు పెడుతున్న నిరామయ ప్రపంచమై
గుంపులు గుంపులుగా విహరిస్తున్న వాస్తవం
సందోహం మధ్య
అవిరమంగా ఆ మూలో ఈ మూలో వర్షించే నీ తలపు
సాలెగూళ్ళై మూలమూలలా అల్లుకున్న కలలు
జీవితం కాన్వాస్ మీదకు
ప్రవహిస్తూ.............
అజరామరమై నువ్వు
21.8.2012

పీచు శ్రీనివాస్ రెడ్డి || ఆశ నడిపే దారి||


నలు దిక్కులు
నిశితంగా చూడలేక
ఏదో ఒరుగుతుందని

అతడు
వెతుక్కుంటూ వెళ్ళింది దురదృష్టాన్నే
వెలుగు కోసం
వెలుతురులోనే వేట చీకటిలోకి జారుతూ
నవ్వుల పువ్వులు పూచే తోటలో
ముని వ్రేళ్ళతో ముళ్ళను తడుముతున్నాడు
గుచ్చుకున్నా నొచ్చుకోక
ఓటమిని ఒప్పుకొని నైజం
అతడిని చీకట్లో నడిపిస్తోంది
ఆశకు అలుపన్నది ఉండదేమో
అంతమయ్యేవరకు ఆడుకుంటుంది
తొలి అడుగులో తడబాటు
పొరపాటుకది అలవాటు
నడక నేర్చిన అడుగుల
నడత మారకపోతే యెట్లా ?
వెనకటి గురుతులు
ముందుకు వెళ్ళడానికే
తను మారతూ లోకాన్ని మార్చుకుంటూ.
అతను మాత్రం ఇంకా చీకట్లోనే
ఆశలు నడిపేది చీకట్లోకే
*21.8.2012

డా. సింహా చలం లక్ష్మణ్ స్వామి||తలసేమియా (రక్త పిశాచి ) ||


పైకి మాత్రం చిరునవ్వుల మేలి ముసుగుల
లోలోన మృత్యు ఘంటికలు ...

రుధిరపు నదుల్లోకి చొరబడ్డ తిమింగలాలు
ఒక్క నెత్తుటి చేపనూ వదలట్లేదు

ఏటి పక్కన బురద గుంటలో
మాటు వేసిన మకరం ...!

ప్రాణ జ్యోతిని వెలిగించటానికి
తగలబడుతూ
తరిగి పోతున్న నెత్తుటి ఇంధనం !!

పక్షానికోమారు
ప్రణాగ్ని పరీక్ష ..!!

చిల్లు పడ్డ రుధిర భాండం
గండి పడ్డ జీవన తటాకాన్ని
ఆపలేక ,నింప లేక
క్షణ క్షణం నరకయాతన ...!!

ఇదెక్కడి అన్యాయం దైవమా !!!
ఏపాపం చేశారని
ఈ చిరు దీపాల్ని
తుఫాను లోకి తోసేస్తున్నావు !

ఈ రక్త పిశాచాల బోనులో
ఆ చిన్నారుల ఆర్తనాదం
హృదయాన్ని పెకిలిస్తోంది
కాపాడవా ......!

రోజులు కరకు రంపాలై
రోజూ కోస్తుంటే
కన్నీటి మంటల్లో పడి
కన్నవారు విలవిల లాడుతున్నారు

తలసేమియా తలసేమియా
చిన్నారులని వదిలి వెళ్ళిపోవా

నీవు ప్రవేశించాక
ఇల్లు జీవచ్చవాల స్మశానమైయ్యింది!
ఏక్షణం ఏమవుతుందో ...?!
అవయవాలన్నీ చిద్రమవుతున్నాయి .

నెత్తుటి చుక్కల్ని కొనలేక
ఈ దారుణాన్ని కనలేక
పగులుతున్న గుండెలతో
పరితపిస్తున్న కుటుంభాలు ..!

తలసేమియా పంజాతిన్న
ఆధునిక విజ్ఞానం
పరుగందుకుంది ...!

అణుబాంబులు
అంతరిక్ష జ్ఞానం
బొక్క బోర్లా పడ్డాయి ...!!

లక్ష లేత ప్రాణాల్ని
పీక్కుతింటున్న
తలసేమియాను తరిమే
ఒక్క ఆయుధం కావాలి .

ఇల్లు -వాకిలి -భూమి -ఆస్తులన్నీ
తలసేమియా పూజకు హారతి
కర్పూరా లయ్యాయి..!!?

ఎన్నాళ్ళీ జీవన్మరణ పోరాటం ...!

అస్త్రాలన్నీ అయిపోయాయి
మృత్యువు రానే వచ్చింది

చీకటిలో ...
లీనమవుతున్న
చిరుదివ్వెల పరంపర
కొనసాగుతూనేవుంది ............!!!!??

* ( తలసేమియా బారిన పడిన పిల్లల, వారి కుటుంబాల దీనాతి దీన వేదనకు,
నరక యాతనకు స్పందిస్తూ ....) 
21.8.2012

క్రాంతి శ్రీనివాసరావు || నేను...ఎందుకు?||


కాలం కన్న కవల బిడ్డలు
రాత్రి పవళ్ళను నే నెందుకు సాకాలి

కాలం గానం చేస్తున్న సంధ్యారాగాలను
నేనెందుకు వినాలి

చీకటి నల్లని రంగుచూసి పరుగెత్తీ
పగిలి పోయున కిరణం
రంగులు క్రక్కు కొంటే
నేనెందుకు చూడాలి

శరీరం బరువు మనసుకు కట్టి
బాధల బ్రతుకు సంద్రం లో విసిరేస్తే
నేనెందుకు భరించాలి

శూన్యపు సుడిగుండాల్లో చిక్కి
ఎందుకు వెక్కి వెక్కి ఏడ్వాలి

తననుంచి తానే దూరంగా పారిపోతున్న
ఈవిశ్వాన్ని పట్టుకొని నేనెందుకు వ్రేలాడాలి

ఎంతప్రేమించినా ఎన్నిప్రదక్షినలు చేసినా
దగ్గర కాలేక భగ్న ప్రేమికులుగానే మిగులుతున్న
విశ్వగోళాలను చూసాక కుడా
నేనెందుకు ప్రేమించాలి

అణువు లోతు ఆకాశం ఎత్తు కొలవాల్సిన అవసరం నాకేంటి
అందుకే నన్ను నేనే రద్దుపరచుకొంటున్నాను
21.8.2012

కిరణ్ గాలి ||ఎద తెగిన పావురాలు||


ఒక ఊహ గర్భస్థశిషువులా అండంలో ఉండగానే
ఉపిరాడని ఉల్కలా రాలి పోతుంది

ఒక మౌనం మాటగా పునర్జన్మించకుండానే
గుండె గోంతుక పూడుకొని సజీవ సమాధవుతుంది

ఒక మృదు స్పర్ష మునివేళ్ళ కోసలపై విచ్చుకోకుండానే
ముడుచుకొని ఎందుకనో ఎప్పుడూ వాడి పోతుంది

ఒక హృద్యమం ఉద్వేగసంభరిత ఉప్పెనయ్యే లోపె
అలల తలలు పగిలి కుప్ప కూలి పొతుంది

***

ఒక పరిచయం తనువంతా పరుచుకోకుండానే
కరచాలనాల పురిట్లోనె కన్ను మూస్తుంది

ఒక ప్రణయం పరిణయంగా తర్జుమా కాలేక
కాలగమనంలో తొనికి ఒలికిపోతుంది

ఒక అనుబంధం అవకాశవాదాల అసమ్మతిలో
అవిశ్వాస తీర్మానమై వీగిపోతుంది

***

ఒక అనుభవం అనుభూతిగా మారకుండానే
కనురెప్పల అంచుల నించి దూకి ఆత్మహత్యించుకుంటుంది

ఒక విశాద తంత్రి వినువీధిలో గానమవ్వకుండానే
తీగలు తెగిన తంబురా అవుతుంది

ఒక దుఖ నౌక ప్రతిసారీ తీరాన్ని చేరకుండానే
దేహపు తెరచాప తెగి తల్లకిందులుగా మునిగి పోతుంది

***

నా అక్షరాలు

విహంగాలై ఎడతెగని ప్రయాణంలో
స్వేచ్చని శ్వాసించె లోపె
ఎద తెగిన పావురాలై నెత్తురోడుతాయి
నేలకోరుగుతాయి
*21.8.2012

నరేష్ కుమార్ //నన్ను నేను పారేసుకున్నా...//


నన్ను నేను
పారేసుకున్నా...
నాలుగు మాటల
చౌరస్తాలో....

కొన్ని
పదాలను
పాదాలకు పూసుకొని
కొన్ని
నవ్వులని
పెదాలకు కుట్టేసుకొని
రెక్కలని
ముడుచుకొని
నా లోలోపలికి
ఎగిరిపోతు....
ఒరిగిపోతున్న
ఎండుటాకులపై
కవిత్వాన్ని
ఏరుకుంటున్నా....

మెదడంతా
పరుచుకున్న
నికొటిన్
దుమ్ము
నాసికని
నాకేస్తోంది......
ఎవరక్కడా...?
నా గుండెకు
ఓ కార్నియాని
అతికించండి
మనసులో
అక్షరాలకు
దారి చూపాలి.....

మట్టిలో
వొట్టినే ఇంకిపోతే
ఎం లాభం....?
మళ్ళీ ఒక
కొత్త ప్రశ్నగా
మొలకెత్తాలి గానీ...

కొన్ని కష్టాలని
నా భుజాలకు
రాయండి...
కాస్త
నా రక్తాన్ని
రుచి
చూసి నపుడే కద
పక్కనోడి
ప్రాణం
విలువ తెలిసేది....
*21.8.2012

నరేష్ కుమార్ ||నన్ను నేను పారేసుకున్నా...||


నన్ను నేను
పారేసుకున్నా...
నాలుగు మాటల
చౌరస్తాలో....

కొన్ని
పదాలను
పాదాలకు పూసుకొని
కొన్ని
నవ్వులని
పెదాలకు కుట్టేసుకొని
రెక్కలని
ముడుచుకొని
నా లోలోపలికి
ఎగిరిపోతు....
ఒరిగిపోతున్న
ఎండుటాకులపై
కవిత్వాన్ని
ఏరుకుంటున్నా....

మెదడంతా
పరుచుకున్న
నికొటిన్
దుమ్ము
నాసికని
నాకేస్తోంది......
ఎవరక్కడా...?
నా గుండెకు
ఓ కార్నియాని
అతికించండి
మనసులో
అక్షరాలకు
దారి చూపాలి.....

మట్టిలో
వొట్టినే ఇంకిపోతే
ఎం లాభం....?
మళ్ళీ ఒక
కొత్త ప్రశ్నగా
మొలకెత్తాలి గానీ...

కొన్ని కష్టాలని
నా భుజాలకు
రాయండి...
కాస్త
నా రక్తాన్ని
రుచి
చూసి నపుడే కద
పక్కనోడి
ప్రాణం
విలువ తెలిసేది....
*21.8.2012

ఆదూరి ఇన్నారెడ్డి||ఊసులన్నీ పోగేసి వుంచు ఏకాంతంలో జతచేరుతాను||


నన్ను చూసి నవ్వుకుంటూపోతున్న నల్లని మేఘాలు
వీపుమీద ఉన్న సంచిలో
చూడాలని పైనుంచి ఆత్రంగా చూస్తున్న పక్షులు
మాటల మూటల్ని జాగ్రత్తగా బుజానికెత్తుకొని
వడి వడిగా అడుగులేస్తున్నా
మొత్తానికి కవిసంఘం కు చేరుకున్నా
ఓ మూల కూర్చొని నీకోసం చూస్తున్నా ప్రియా
ఊసులన్నీ పోగేసి వుంచు.
ఏదో ఒక రోజు నీ ఏకాంతంలో జతచేరుతాను.
అని అన్నావు కదా అందుకే నీకోసం ఎదురు చూపులు
ఇక్కడ ఎందుకున్నానో తెల్సా..
నీకు కవితలంటే ఇష్టం కదా..
ఎప్పటికైనా ఇక్కడికొస్తావనే ఆశతో చూస్తున్నా..
అదికో నడుచుకుంటూ వస్తున్నది నీవేనా.. ?
ఏంటి కళ్ళు మసకబారాయి..
ప్రియా నీవేంటీ నీటిలో నడుస్తున్నావు.
ఆ వస్తున్నది నీవేనా..
ఇప్పటిదాకా స్పష్టంగా చూసిన నేను
ఇప్పుడు ఏమీ కనిపించడం లేదు ఎందుకో..
నీవు వస్తున్నా వన్న ఆనందంలో
నాకళ్ళు ఆవేశాన్ని ఆపుకోలేక
కన్నీళ్ళతో నిండి ఎవ్వరు వస్తున్నది కనిపించడంలేదు ..
అదేంటి ఆగకుండా వెలుతున్నావు
అది నీవుకాదా..ఏంటో నా కన్నీటి పొర
నీవెవరో చూడనీకుండా చేస్తోంది..
అరె..వెళ్ళీపోతున్నావా..
వచ్చిందినీవుకాదా....?

Ro Hith||Glance||



Is my life a dead almond leaf
blowing in the winds of your breath?

Is this song of mine, a raindrop
falling in the pond of your love?

Am I the little bird
on which the first light of your glance touched,
for which I surrendered my senses
to wake in a new life?

Those melodies of strange silence
in empty streets of November,
The ripples of the still sea
on my emotionless face,
The untimely monsoon and violent winds
the singing cuckoo and raising sun,
falling meteors and storming sky,
is it all because of the debt
I owe for your glance ages ago?

I roamed
In villages of love
on those narrow lanes...passing between mud houses,
In deserts of humanity
for an oasis to quench the thirst of hope,
In jungles of time
running with flow of river and streams of light
I roamed
to explore and excavate the relics of a lost glance
*21.8.2012

శ్రీకాంత్||ఒట్టిగా/ ఒట్టి ఓటి రాత ||


నువ్వేమైనా రాసి ఉంటావేమోనని వస్తాను ఇక్కడికి, నీ వద్దకి-

ఆకులని తాకి వీడిన గాలి తిరిగి, తిరిగి తిరిగి వానతో వచ్చి
అదే ఆకుల్లో, అదే కొమ్మల్లో స్థిరపడి స్థిమితపడ్డట్టు-

తెలుసు నాకూ, నీకూ: ఇవన్నీ ఒట్టి పదాలని, ఒట్టి ప్రతీకలనీ
వలయమైన నీటిలో తేలే ఈనెపుల్ల వంటి కదలికలనీ కథలనీ

ఎక్కడో ఏరుకుంటాను, రంగు రంగుల గులకరాళ్ళని. దాచుకుంటాను వాటిని
గూట్లో పుస్తకాల వెనుక పుస్తకాలలో: పొందికగా అమర్చుతాను వాటిని
నువ్వు చదివే ఈ అక్షరాల చుట్టూ- రాత్రుళ్ళు తలగడ కిందుగా దాచుకుని
నదులని కలగంటాను, నిదురలో నుదిటిపై నీ చల్లని అరచేతిని ఊహిస్తాను
కలలో వినిపించిన సన్నటి నవ్వు మెలుకువలోకి తొలుచుకు రాగా

దాచుకున్నవన్నీ తప్పక ఎప్పుడో ఎక్కడో పారవేసుకుంటాను

తెలుసు నాకు ఇవన్నీ నిలువవని, అయినా కొన్ని మాటలనే నమ్ముకుంటాను
నీతో ఈ శరీరంతోనే మాట్లాడతాను, నీ శరీరాన్నే మాట్లాడతాను
నీ వద్దకే, నువ్వు రాసి ఉంటావనే నీ పదాల వద్దకే తిరిగి వస్తాను-

వడలిపోనివ్వకు పూలపాత్రలోని నింగిగులాబీని
రాలిపోనివ్వకు గులాబీ రేకులలలోని రాత్రుళ్ళని
ఆరిపోనివ్వకు పెదాలపై కదులాడే తడినీ-

ఇంతకు మించీ, ఇంతకు మినహా నాకు తెలిసి
పెద్దగా చేసేదేమీ లేదు ఇక్కడ, పెద్దగా సాధించేదీ ఏమీ లేదు ఇక్కడ- అందుకనే

అందించు ఇక నీ చేయిని, దానిని నా అరచేతులలో పదిలంగా పుచ్చుకుని
ఈ వాక్యం చివర నాకై, నీకై నిలిచిపోతాను నేను =
*21.8.2012

గరిమెళ్ల నాగేశ్వరరావు ||వీడ్కోలు ||



సముద్రాన్ని గుండెల్లోకి

ఒంపుకున్నాను

పెదాలు ప్రమాద సూచికలు

ఎగరేస్తుంటే..

కెరటాలు కళ్లల్లోకొచ్చి

విరుచుకు పడ్డాయ్!

రెప్పల వెనుక సూర్యాస్తమయం

లోపలంతా చీకటి.

గుండె గదికి అడ్డంగా...

బోర్లించబడ్డ పర్వతం

కుంభవృష్టి.. కురిసింది ఎంతసేపో?

దిగులు.. వాగులై పారినట్టుంది.

అంత వానలోనూ..

ఒక అగ్నిపర్వతం బ్రద్దలయ్యింది

బుగ్గల మీద ‘లావా’ చారిక.

దుఃఖం ముట్టడిలో చేతులెత్తేసిన

ఒంటరి ద్వీపాన్ని.

చీకటితో పోరాడుతూ నన్ను నేను

దహించుకున్న దీపాన్ని.

అల్లకల్లోలమైన అంతరంగంలో

చెలరేగిన దావానలం.

దగ్ధమైన చీకట్లో..

వెలిగిన జ్ఞానజ్యోతి

పండుగ ముందు ఇల్లలికినట్టు

మదిలో ఏదో పవిత్ర భావన.

జీవితం గడ్డిపోచంత తేలికా?

కాలం.. ఏడు రంగుల హరివిల్లు

పెదాల మీద చిరునవ్వుల తోరణాలు

దూరంగా వెళ్లిపోతోన్న దుఃఖానికి

వౌనం.. పాడుతోన్న వీడ్కోలు..

దుఃఖం.. ఇప్పుడు ఆత్మబంధువు

ధైర్యానికి.. జన్మనిచ్చిన అమ్మ.
*21.8.2012

భాస్కర్ || బాబ్ పాటై ప్రవహిస్తాడు||


"..గుండె నాదమై
మోగినట్టు
కళ్ళలోంచి
ధారగా కన్నీళ్లు
ప్రవహించినట్టు
గడ్డకట్టుకు పోయిన

హృదయం మీద గానం
రక్తాశ్రువులు లిఖించినట్టు
చీకటి ఆవహించిన చోట
బాబ్ ..ప్రవాహమై వెంటాడుతాడు
అతడిప్పుడు లేడు ,,కానీ
అతడి జ్ఞాపకం
అమ్మతనమై జోల పాడుతోంది
ప్రేమ రాహిత్యంలో
కొట్టుకుపోతున్న సమయంలో
బాబ్ మళ్ళీ మళ్ళీ
జన్మిస్తాడు ..గుండెల్లో
పాటల పరిమళాలు వెదజల్లుతాడు .."
*21.8.2012

పులిపాటి గురుస్వామి॥తీరొక్క బాధలు॥



ఎన్ని చెరిపినా
ఇంకొన్ని మిగిలే ఉంటాయి

నిన్ను తెలుపని వాసనలు కొత్తవి
నా మీదికి తెరుచుకున్నపుడు
నాకు సందేహమే నువ్వు

నువ్వెప్పుడూ ఇంతే
మనసులో కలిసి వెల్లిపోతావ్
గావర పెడతావ్
గుండెను చేది పెడతావ్

ఎవరు ఎవరికీ అర్ధం కాని బజారిది
అలుపెరుగని కాళ్ళ శ్వాస

ఒకరు పూర్తిగా
అర్ధం కావాలనుకోవటం భ్రమ
తెగదు ముడిపడదు
యాప్యము.
*21.8.2012

వంశీ || లెట్ ద వరల్డ్ గో టు హెల్ ||


లోకానికి నేన్నచ్చట్లేదెందుకో,
ఏం కనిపించిందో కొత్తగా
ఇన్నాళ్ళు లేనిది,
ఏం అన్పించిందో అంతగా
ఇప్పుడే బైటికొచ్చింది,
ఎవరికెవరున్నారు, నాకు నేన్తప్ప,
లెట్ ద వరల్డ్ గో టు హెల్,
కోయీ ఫరక్ నై పడ్తా,
నా ఆలోచన్ల ఆకలి,
భ్రమల బ్రతుకు నాకుంది..

దరిద్రాన్నీ దర్జాగా అనుభవిస్తూ,
లేని అందాన్ని దొంగచాటుగా గమనిస్తూ,
రాని మాటల్నీ మూటకట్టి విసిరి గమిస్తూ,
కపిత్వం తలకెక్కించుకుని నిగర్వినని గర్విస్తూ,
-"స్టాప్ దట్ గ్రాండియస్ థాట్ ప్రాసెసింగ్,
ఏం పొడిచావనందరూ మెచ్చాలి,
ఏదో చేస్తావని ఎవరెందుకు చూడాలి"

మనిషత్యంత తెలివైన తెలివితక్కువోడొరేయ్,
మెంటల్ రిటార్డెడ్నెస్
నీ గుర్తింపు పెంచుతూ,
ఇంటల్లెక్చువల్ బ్లాస్ట్స్
నీలోపలి గాలికి వెంటిలేషనిస్తూ,
నీ ఉనికి నీ వరకే,
నీ నిష్క్రమణ నీ కొరకే,

ఎవరేమనుకుంటే నాకేం,
నేనెలాపోతే ఎవరికేం..
లెట్ మి గో టు హెవెన్స్, అసలు,
స్వర్గానికెవడు పోగలడు ఒక్క తప్పూ చేయక,
స్వప్నాలనెవడు చూపగలడు ఒక్కటైనా దాచక,
సత్యాలనెవడు మెచ్చగలడు, ఓటమన్నదే ఎరగక,

పరిగెడ్తున్న రహదార్లెనక అలిసిపోతూ,
పరుగాపనన్న రేపుని చేరలేక ఆరిపోతూ,
నా చిర్నవ్వుల చింతలూ
మాడుపగిలే వింతలూ నాకున్నాయ్..

లెట్ ద హిప్పోక్రాటికల్ హైపోథెటికల్
కాన్స్పిరేటరీ ఇల్లాజికల్ మూవింగ్ వరల్డ్ గో టు హెల్,
కోయీ ఫరక్ నై పడ్తా,
నా విఙ్నానపు అఙ్నానం,
వేదనాభరిత నివేదనలూ నాకున్నాయ్...
*21.8.2012

వంశీ || యూథనేషియా ||


H.I.V పాసిటివ్,
వెస్టర్న్ బ్లాట్ అబధ్దాల్చెప్పదు,
ఏడవాలనుందోసారి, చస్తానని
తెల్సినా కన్ను తడవనీని గుండెదే ధైర్యమో,
నన్నెవరైనా చంపరూ
రేపుని చూడనీక, ఈ రాత్రిలోనే ఉండేట్టు..

"గ్రీఫ్ రియాక్షన్"
డినైల్, యాంగర్, బార్గెయిన్,డెత్ ఫియర్,యాక్సెప్టాన్స్..
ఆ దశలేవీ చూడకనే అంగీకరిస్తూ,
పుణ్యకార్యమేం కాదుగా చేసింది,
ఆర్నెల్ల కింద గోవాలో పాపం,
పెరిగి పండై పగిలి ఇలా..

సంతాపసభలో
నా చావుక్కారణం ఏమంటారో,
ఉప్పునీళ్ళు నరాల్లోకెక్కించుకునా,
ఆక్సిడెంట్లో శరీరం ఛిద్రించుకునా,
ఉరేస్కుని మృత్యువు ముద్రించుకునా,
విండో పీరియడే, ఇంకా రెండేళ్ళకు
ఇమ్యునిటీ తగ్గి రోగాలు, బరువు తగ్గి భయాలూ..
అందుకే చంపడ్నన్నిప్పుడే,
ఐ కాంట్ కిల్ మైసెల్ఫ్..
ఆలోచన్ల అలజడి కంట్లో మేఘాలు కదుపుతూ..

"పాపానికి ప్రాయశ్చిత్తం లేదు
నివారణొకటే మార్గం"
మొన్న కొన్న స్కోడానీ,
మందులో కలిపిన సోడానీ,
కావాల్సిన భవితనీ,
రావాల్సిన అనుభవాల్నీ,
చేయాల్సిన పనుల్నీ,
చూడాల్సిన కలల్నీ, వొదిలి
మహాప్రస్థానానికి కదుల్తూ,
సినిమాలో చివరి రీల్ మొదలైనట్టు..

రక్తంలో వైరస్ వీరవిహారం తెలుస్తూ,
నిజానికదీ నేనూ ఒకటే,
విశృంఖలతే, స్రావాల్లో సుఖిస్తూ,

లోకం చిలకరించే చిల్లర జాలినీ,
సంఘం దయతల్చిచ్చే ప్రత్యేక గుర్తింపునీ చేరకముందే,
నానుండి మరొకరికి వ్యాధిసంక్రమణం చేయకముందే,
చంపడ్నన్ను, ప్లీజ్,
యూథనేషియా,
యూథనేషియా..
*21.8.2012

కవితాచక్ర ||ఈ..క్ష ..ణం..||

ఈ క్షణం!
గుండె గూటిలో
అపురూపం..
కొంచం జారవిడిచావో..
ముత్యాల సరంలా
చేజారిపోతుంది..

ఈ క్షణం!
మనస్పుష్పంలో
అందమైన జ్ఞాపకం!
కొద్దిగా యేమరపాటుగా ఉన్నవో..
నీటి బిందువులా
జాలువారిపోతుంది..

ఈ క్షణం!
వర్ణాలు చూసే కంటిలో..
వర్ణించలేని చిత్రం..
గ 'మ్మత్తు 'లో
కనురెప్ప మూసావో..
నిశీధిలో నిస్తేజమైపోతుంది!!

ఈ క్షణం!
అనుభవాల దొంతరలో
ఒక మధురిమ..
పొందలేక తప్పుకున్నావో...
జీవితకాలంలో కరిగిపోతుంది..
తుషార బిందువులా..

అందుకే..
ఇప్పుడే..
భ్రమలో లేని, ఊహ కాని..
ఈ క్షణమే శాశ్వతం!!
*21.8.2012

యజ్ఞపాల్ రాజు II అలుసుగా చూడకు II


అలుసుగా చూడకు ఆడదాన్ని
నమ్మి నీవెంట వచ్చే నీ దాన్ని
అలక్ష్యం చేశావో
అంతవరకు నిను పరిమళాలతో
అలరించిన పూవుల అంచుల్లో
నిప్పురవ్వలు పూస్తాయి
అంతవరకు నీపై
ప్రేమను వర్షించిన ఆ కళ్ళు
భుగభుగలాడే లావా కురుస్తాయి
అంతవరకు నీ చేతికి
పట్టులా తగిలిన స్పర్శ
ముళ్ళపట్టీగా మారి
నిను గుచ్చేస్తుంది
అంతవరకు నిను కవ్వించిన
వలపు గాలి
వడగాడ్పై నిను ఆర్చేస్తుంది
అంతవరకు నీకు
తోడుగా నీపక్కన నడిచిన
సుతిమెత్తని అడుగులు
ప్రళయకాల పదఘట్టనలై
నిను నేలమట్టం చేస్తాయి
అంతవరకు నిను
ఆరాధించిన చల్లని మనసు
ప్రణయాగ్నికి ఆజ్యమై
దహించివేస్తుంది
అంతవరకు నువు
నిర్మించుకున్న ఆశల సౌధాలు
నీ మీదే విరుచుకుపడతాయి
అంతవరకు నీలో
విరిసిన వసంతం మాయమై
మోడు మ్రాకుల ఎడారి
నీముందు సాక్షాత్కరిస్తుంది
అబల కాదది సబల
ఆడది కాదది ఆదిశక్తి
నీకు అన్నీ తానే అయ్యే ఆత్మశక్తి
అందుకే
అలుసుగా చూడకు ఆడదాన్ని
నమ్మి నీవెంట వచ్చే నీదాన్ని
*21.8.2012

జాన్ హైడ్ కనుమూరి ||ఒక నడక||


నడుస్తున్నది కాళ్ళైనా
కళ్ళకెంత శ్రద్దో

పోగొట్టుకున్నదేదో వెదకుతున్నట్టు
నిశితంగా చూపు సారిస్తుంది

అప్పుడప్పుడూ
ఒక్కింత ఆశ్చర్యాన్ని
ఒక్కింత ఆనందాన్ని
మరికొంత దుఃఖాన్ని
రెప్పల్తో ప్రకటిస్తుంది
లోలోపల

ముత్యమంత అక్షరమేదో పొటమరిస్తుంది
ఒకదానివెంటొకటి
హారమై అల్లుకుంటుంది

ఆలోచన
నగిషీల నద్దుతుంది

కనులు ప్రేమించే పదాలలోకి
కాళ్ళు దారులు వెదకుతుంటాయి

నేనిక్కడలేనప్పుడు
నీవు ఆలింగనం చేసుకున్న అక్షరాలు
కళ్ళకెలా తెలుస్తుందో
కొత్త సత్తువను దిగుమతి చేసుకుంటుంది

నేనుగా ఎక్కడైనా కన్పిస్తే
కళ్లతోనే కాళ్ళకు నమస్కరిస్తాను

ఎందుకంటే
నడుస్తున్నది కాళ్ళైనా
కళ్ళకెంత శ్రద్దో!!

*21.8.2012

రాఖీ|| బ్రతుకు భార(త)౦ ||


నా భారత దేశం కాదు దారిద్ర్య దేశం....
ఇది భావదారిద్ర్య దేశం..!

1

క్రమశిక్షణాయుత పాలనా రాహిత్య దేశం...
మౌలిక వసతుల పరికల్పనా రాహిత్య దేశం-
విద్యా ,వైద్యం – న్యాయం ,వ్యవసాయం
రవాణా,పారిశ్రామిక ,విద్యుత్ రంగం ....
ఏదైనా అంతే- మిగిలేది చింతే-

రక్షిత ఆరోగ్యం ఎచట వెదికినా మృగ్యం-
బస్సుల్లో...రైళ్ళలో...
రేట్లు పెట్టినా టిక్కట్లు దొరకని దౌర్భాగ్యం..
తిప్పలు బడితే...టిక్కెట్లు దొరికినా ..సీట్లు అలభ్యం..
ఎంత దూరాలైన..నిలబడి ..పయన౦..సంప్రపతే తుభ్యం
గుండె గుభిల్లనే..బిల్లు ..కట్టినా....దొరకదు...నిరాటంక కరెంటు సౌలభ్యం..
వేలు లక్షలు..పోసినా...ఎంట్రన్స్ ల హర్డిల్స్ దాటినా...
నాణ్యమైన విద్య గగన కుసుమం....
ఖరీదు చెల్లించినా దొరకని సౌకర్యం..
డబ్బులు వేదజల్లినా లబించని సౌఖ్యం-

2

అటెండర్ నుండి అధ్యక్షుడి వరకు ...
రాజ్యమేలేది ఇట..దోపిడే..
కంట్రాక్టర్ నుండి..మినిస్టర్ వరకు..అంతా మేసుడే ..
అడుగడుగునా కుంభకోణాలు వెలుగు చూసుడే...
అణువణువునా అవినీతి గాధల సందడే...
దోచుకున్న వాడికి దోచుకున్నంత రాజశేఖరా ..
దాచుకున్న వాడికి పట్టుకోలేనంత జనార్దనా..

3

మేస్త్రీల నుండి మేనేజర్ల వరకు ...ఫ్రాడ్
మెకానిక్ ల నుండి టెక్నీషియన్ల వరకు..డబ్బుల డిమాండ్..
చెప్పిందే వేదం...పలికిందే మంత్రం...పాడిందే గానం...
ట్రాన్సిస్టర్ నుండి ట్రాన్స్ఫార్మర్ వరకు...మొనోపలీ ..
గతిలేని గత్యంతరం లేని సామాన్యులు బలి-
ఈ నా దేశం ఎటు పోతోంది..
నా పవిత్ర భారత దేశం ఏమైపోతోంది...

4

సభ్యత ,సంస్కారం..
సంస్కృతీ, సాంప్రదాయం..
అనుబంధం, ఆత్మీయత...
స్నేహం, సౌజన్యం...
విలువలు ,వినయాలు ...
మానవత్వం ,జీవ కారుణ్యం..
అన్నీ మృగతృష్ణ లే..
అన్నీ గత చరిత్రలే...

వర్ధిల్లు నా దేశమా..ప్రపంచానికే ..సందేశమా..!
విలసిల్లు నా భరతదేశమా...విధి లేని జీవన విధానమా..!
*21.8.2012

బాలు||మనషి జీవితం||


రెండు దుఃఖాల మధ్య జీవితం
పుడుతూ ఏడుస్తాం, చచ్చి ఎడిపిస్తాం
రెండు విజాతి లింగాల సరస శృంగారం
మనషి పుట్టుకకు నాంది

పెద్దింట్లో పుడితే ప్రేమ కరువు
చిన్నింట్లో పుడితే కష్టాలు మొదలు
మగ పిల్లాడిగా పుడితే గర్వంగా చూస్తారు
ఆడపిల్లగా పుడితే చిన్న చూపు చూస్తారు

అండదండలు ఉంటే అండగా ఉంట్టారు
ఒంటరిగా ఉంటే అంటారాన్ని వాడిగా చూస్తారు
విజయంసాదిస్తే విజయం మనదే అంటారు
అపజయంవస్తే మాకేం సంబంధం అనట్లుచూస్తారు

అనుక్షణం కలిసి మెలసి ప్రయాణం సాగిదామంటే
లేదు అవసరమైయ్నపుడు చుదాములే అంటారు
దోచుకుందాం అంటే ముందుంటారు
సాయంచేదాం అంటే వెనుక అడుగు వేస్తారు

లేని పొని పొగడత్తలకు ఉపొంగిపోతారు
నిజాయితీగా విమర్శిస్తే చిన్న బుచ్చుకుంటారు

కాల గర్భంలో కలిసిపోయేవాళ్ళమే
హుందాగా బ్రతుకుదాము అంటే
లేదు లేదు నేను అమర జీవిని అన్నట్లు
ఆస్తులను పోగేసుకుంటారు

నూరేళ్ళ మనిషి జీవితం
చివరకి అరుఅడుగుల గొయిలోకే పోతుంది
అన్నా అర్ధం చేసుకోరు

మనషి జీవితం అర్ధం చేసుకోవాలంటే
ఈ జీవితం సరిపోదు అనుకుంటూ
వెర్రి తలలను ఊపుకుంటూ బ్రతికేస్తుంటాము...
*21.8.2012

వర్ణలేఖ || కొన్ని వాన చినుకులు ||



నీ మాటలన్నీ మధువులే
మత్తులో తేలుతూ నేను

నాతో వస్తావా
నీ జీవితానికి రంగులద్దుతాను

నీ నుండి జారిపోతున్నా
నీ మనసు నవనీతం కదూ

నీలో నన్ను వెతకడం
ఎండమావిలో నీటిని వెతకడమే

ఎన్ని ఆశల పందిళ్ళు
నీ కోపాగ్నికి దహించుకుపోతున్నాయో

నా వ్యసనం
నీ మీద వ్యామోహమే

నీ ఊహతో వచ్చిన రెక్కలు
నిను చూడగానే మాయమవుతున్నాయి

నేను అలనైన ప్రతిసారీ
నీవు తీరమై ఆపుతూనే ఉన్నావు

సడికావొద్దంటే ఎలా
నా కాళ్ళకి మువ్వలుపెట్టి

నీ నిర్దయలాగే
ఈ రాత్రి కొనసాగుతూవుంది

మనసు మసిబారిందని
చిరునవ్వురంగేసా పెదవులకి

నా అస్తిత్వాన్ని నిర్మించుకోనీ
నీ ప్రేమకు లోటు చేయను

సీతాకోక చిలుకనని
రంగులే చూస్తారు, మరి మనసు?

మూడు ముల్లేస్తారు
అమ్మాయి నోటికి మనసుకి ప్రగతికి

స్త్రీ ఓ ద్రావణం
పాత్రనిబట్టి రూపు మార్చుకుంటుంది

ఇంకా బెంగ తీరనేలేదు
బాల్యం నుండి నేను వలస వచ్చాను 
*21.8.2012

పెరుగు రామకృష్ణ || మనదేశం-మన గీతం..||


నీలి సముద్రం మీద
గుండెని లాగి కట్టి రాసిన వేదమే జనగణమన ..
శవాలు గుట్టలుగా మిగులుతున్నప్పుడు
మరణం మీటిన రహస్య శబ్ద తంత్రీ నాదమే జనగణమన..
సింధు నది ఆవలి వొడ్డు నుండి
గంగా నది ఈవలి వొడ్డు వరకు జలతరంగిణి లా సాగే
ఒక మహా ప్రవాహ సంగీతమే జనగణమన..
పాట అందర్నీ పరవశింప చేసినా
గానం ఎప్పుడూ తల వంచదు ...
కాలంలో జారిపోయిన
అద్భుత క్షణాల్ని దోసిట్లో పెడుతుంది...
భారత దేశం ఒక తేజో మండల దీపం
ఇక్కడి మనిషిది కాన్తివంతపు దేహం
అందుకే
నా దేశాన్ని నేను జనగణమన తోనే అలంకరిస్తాను..
ప్రతి పౌరుడి గుండెలమీద పచ్చబొట్టులా దాన్ని పొదుగుతాను
శాంతి కాముకుడ్నై ,యుద్ధరహిత
మరోప్రపంచం కోసం మళ్ళీ మళ్ళీ జనగణమన ఆవిష్కరిస్తాను
నా గీతానికి ఆత్మాభిమానం ఎక్కువ...
నా దేశానికి గర్వమెక్కువ..
ఒక పురాతన ఉద్యమం లో అమరుల సాక్షిగా
మనుషులు పుష్పించడం కోసం జనగణమన ఆలపిస్తాను
భారతమాతను జనగణమన తోనే అభిషేకిస్తాను..
హిమాలయాల జీవన తాత్వికతను సుజల్లం,సుఫలాం లా
ప్రతి భారతీయుడి గుండెల్లోకి వొంపుతాను
అవును...
గురి కోసం నేను పాటని ఆయుధం చేస్తాను
దానికి జనగణమనగా నామకరణం చేస్తాను
నా గీతం లో కాంతి మసి బారదు
నా గీతం లో జాగృతి ఎప్పటికీ ఆరదు
అలుపెరగని గళాలతో, కోట్ల గొంతులతో
జయ జయహే నినాదాల తో
ఈ జాతీయ గీతం తోనే శత్రువుని జయిస్తాను...!
*21.8.2012