పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Narayanaswamy Venkatayogi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Narayanaswamy Venkatayogi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, సెప్టెంబర్ 2012, గురువారం

నారాయణస్వామి వెంకటయోగి॥ చిన్నతనం ॥



చిన్నప్పుడు
నేనెప్పుడు పాలు తాగిన్నో తెలియదు!
పోతున్న ప్రాణం నిలిపెటందుకు
ఏ చల్లని తల్లో అందించిన మొదటి అమృతధార -
చెంప మీద గరుకు మరక.

ఏ బొమ్మల్తో ఆడుకున్ననో,
ఏ ఏ ఆటల్ని లోకమెరుకలేని మురిపెంతో
నేర్చుకున్ననో గుర్తుకు లేదు.

పగిలిన బొమ్మల ముక్కల్ని
కూలిన గోడలకు దారాల్తో కట్టి మాట్లాడుకున్న
ఎడతెరిపిలేని సంభాషణలు -
బయటకు రాని ఏడ్పు ముసురులో
ఆరబెట్టుకున్న చినిగిన బట్ట పేలికలు.

ఎవరెవరిని ముద్దు పెట్టుకున్ననో,
ఎవరెవరితో తన్నులాడుకున్ననో,
మూసుకున్న పాత అర్ర తలుపుల వెనుక
అనేక ఒంటరితనాలు, నా దోస్తులు -
చిమ్మచీకటి అలవాటు పడ్డకళ్ళకు
ఎప్పటికీ కాని పరిచయాలు.

నాలో నేనే, అందరికీ వినబడెటట్టు,
వాడచివర తల్లి లేని కుక్కపిల్ల ఏడుపుతో
రాగం కలిపి పాడిన పాటలు -
చిన్నతనమంతా అలుముకున్న
చెవులు చిట్లిపొయ్యె నిశ్శబ్దం.

ఈత నేర్చుకున్న పాతబావి
పచ్చటి నీళ్ళలో జరజర పాకిన
నల్లటి నీరు కట్టెలు -
చుట్టలు చుట్టుకుంటూ
బుజాలమీద నుండి జారిపోయే
పసితనపు భయాలు.

కలలో,
లోలోపలి కలల్లో
రోజూ కనబడే పగిలిన బొమ్మలు,
సుడులు తిరిగే గొంతు విరిగిన పాటలు -
వెంటాడుతుంది కందిరీగలా కుట్టే
కనికరం లేని ఒంటరి చిన్నతనం!

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

నారాయణస్వామి వెంకటయోగి॥ యెవరైనా ఉన్నారా – ఎక్కడ? ॥

యెవరినైనా తెలిసిన వాళ్ళని అర్జెంటు గా కలవాలి – అన్నీ కూలిపోయిన మైలు రాళ్ళే! ఎక్కడని పత్తా చెప్పను – ఎవరైనా వస్తారేమో నని ఎదిరిచూపు – మాటలు లేక నోరెండుక పోతోంది – నోటి నిండా గాజుపెంకులు – వేచి చూసే క్షణాలు – యెవరినైనా హఠాత్తుగ పలకరించాలని దేవులాట – చౌరస్తాలన్నీ సర్కారు తుమ్మల పరిక్కంపలే – గీరుకుపోయిన పెదవులతో చిరునవ్వుతారెవరో – గడ్దకట్టిన ఎలక్ట్రానిక్ భాష పరిచిత శీతలత్వమై కోసుకుపోతోంది – యెటూ పోలేము – ఇక్కడ క్షణం వుండలేం – బుజాల మీద చేతులెవరివి – బిగుసుకుపోతున్నాయి – నిశ్చలచైతన్యం లోకి నూకేస్తున్నాయి – యెవరినైనా గట్టిగా అలుముకోవాలి – యెన్ని శతాబ్దాలైంది – మనిషిని కౌగలించుకోక – శరీర వేడిని తాపించక – చుట్టూ ఇనుపకవచాల శరీరాలు – ఇంటర్నెట్ ని కప్పుకున్న శరీరాలు – అంతా ఒక్క తీరుగనే –– గుర్తు పట్టలేను – కాంక్షించలేను – అక్షరాలే పదాలే మాటలే వాక్యాలే పొంతన లేదు అర్థంకావు వినబడవు స్పష్టంగా – అంతా ఒకే అరుపు – అంతా ఒకే చెవులు చిల్లులుపడే నిశ్శబ్దం – తిరిగి తిరిగీ అదే చౌరస్తాకు – అవే ముళ్ళకంపలకు చినిగిపోయిన మురికి అంగీలా వేళ్ళాడుతూ – ఎండా, వానా, వెన్నెల లేని రాత్రో, వెల్తురు లేని పగలో తెలియని – ఏ చోట? ఏ పూట ? ఎవరైనా ఇటువైపు వస్తున్నరా, పోతున్నరా - చేయందిస్తున్నరా, మాట విసురుతున్నరా, పలుకులు గుచ్చుతున్నరా – ఏదో ఒక దీర్ఘ నిద్ర, పొడుగాటి కల – రాళ్ళు విసిరే మౌనం - ఏమీ తెలియని నిర్విచారం –బూడిదలా పరుచుకున్న నిరామయం – యెవరైనా ఉన్నారా – ఎక్కడ?
3.9.2012