పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Bhavani Phani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Bhavani Phani లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, మే 2014, శనివారం

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ అగ్ని పర్వతం ॥ కవితోటి పారుతోంది కళ్ళ లోంచి కలం ఖాళీ అయినా నష్టం లేదు మనసు కోటకి మౌనం పహరా కాస్తోంది పెదవికి పెదవితో పోట్లాడే పని లేదు కొండచిలువలా కబళిస్తూ ఏదో తెలియని అశాంతి చిట్టడవిలా చిక్కులు పడిన ఆలోచనా స్రవంతి ఏ దిక్కూ నాది కాదనిపించే చిక్కని అనాసక్తత చిమ్మ చీకటిని చిమ్ముతూ కంటిపాపల జత అనుభూతేదీ రుచించక నిండైన జ్వరంలో విశ్రమింపు నిప్పులపై కాల్చిన హృదయానికి నిరాశతో తాలింపు వడి వడిగా వడిలి రాలిపడే సుందర మనోహర శిశిరం పుడమికి ఒంటరితనాన్నద్దుతూ వట్టి పోతున్న ఆకాశం సముద్రపు ఒరిపిడిలో పురుడు పోసుకునే నిప్పుల అలలు కనురెప్పల కలహంలో పట్టపగలే పుట్టిన అదృశ్యపు కలలు చెఱగు చెఱగు గా శమన నింపే విషాదం గరుకు గరుకుగా అదుముకునే ఆత్మీయ నిశీథం అమాయకం గా నవ్వుతూ అగ్నిపర్వతం మూసుకున్న దారుల్ని మండిస్తున్న ఓ లావాశ్రుకణం!!! 31. 05. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mUazQb

Posted by Katta

22, మే 2014, గురువారం

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ కవి సంగమానికి వందనం ॥ నడవాలన్న ఆశే తప్ప నడిచే శక్తి లేని నిస్సహాయత తో నిత్యం యుద్ధం చేస్తూ బుడి బుడి అడుగులేస్తూ పడుతూ లేస్తూ వచ్చానిక్కడికి భూమాత అదిరిపడేలా అంగలేస్తూ మహోన్నత శిఖరాల వైపుకి మహా వేగం గా పయనించే మహానుభావులని అబ్బురంగా చూసాను ఉన్నత శిఖరాలని చేరాక కూడా ఎదురొస్తున్న అపరిచితులకి చేతి ఊతమిచ్చే పనిలో అహరహము శ్రమిస్తున్న మహామహుల్ని మహాశ్చర్యం తో తిలకించాను నేను కూడా నడవాలని నీలాకాశాన్ని అందుకోవాలని కలలు కంటూ, కలంతో కుస్తీ పడుతూ తప్పులెన్నో చేసాను తప్పటడుగులు వేసాను పారాడే పసి పాపని చూసినట్టు పడి లేచే నా కవితల్ని మురిపెంగా చూసారు అడుగెందుకు తడబడిందని అడగనైనా అడగక చిటికెన వేలందించారు నచ్చితే ఓ మెచ్చుకోలు బహుమానమిచ్చారు నచ్చనప్పుడు మౌనంగానే చెప్పి నా తప్పులు నన్నేతెలుసుకోనిచ్చారు మాటల తూటాలు పేల్చకుండానే మంచి దారుల వైపుకి ప్రేమగా మళ్ళించారు ముఖ పరిచయమైనా లేకుండానే మదినిండుగా ఆత్మ స్థైర్యాన్ని నింపారు నడుస్తున్నానో ఇంకా పారాడుతున్నానో తెలీదు కానీ... పరుగులు తీస్తున్న అనుభూతిని కానుక గా అందించారు ఎక్కడెక్కడో గాయపడిన మనసుకి ఇక్కడి జ్ఞాపకాల లేపనం పూసి మళ్ళీ మునుపటిలా మార్చుకుంటూ ఉంటాను నీకేమీ కాకపోయినా నీకంటూ కొందరున్నారనే భరోసా నర నరానా నింపుకుని నన్ను నేను ముందుకు నడిపించుకుంటాను !!! కవి సంగమం మిత్రులకి మరో సారి ధన్యవాదాలు తెలుపుకుంటూ 22. 05. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jXgnng

Posted by Katta

20, మే 2014, మంగళవారం

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ సిరుల వెన్నెల కురిసే వేళ॥ ఆయన హృదయం సాహిత్యపు స్వర్గానికి స్వాగతించే సిరుల సింహ ద్వారం ఆయన వ్రాసే ప్రతి గీతం పరవళ్ళు తొక్కే అమృత నదాల తీయని ప్రవాహం ఆయన పద విన్యాసం భరత వేదమున నిరతం నర్తించే నాట్య మయూరం ఆయన కవిత్వం తెలిమంచులా కరిగించే సూర్యభగవానుని వెచ్చని చరణ కిరణం ఆయన కవనం విరించి కలంనించి జారిపడే ఓంకార నాదపు స్వర మాధుర్యం ఆయన అక్షరం మనోవనాల్లోకి వసంతాన్నితరలించే పచ్చని ప్రకృతి పారవశ్యం ఆయన ఆవేశం అర్ధ శతాబ్దపు అజ్ఞానంపై ఎక్కుపెట్టిన ఆశయాల అగ్ని బాణం ఆయన మనోసౌందర్యం శత దళాల వికసించే సుందర సుమఫల సువర్ణ కమలం ఆయన వివేకం జగమంత కుటుంబాన ఏకాకి జీవితం గడపగల నేర్పరితనం ఆయన వైరాగ్యం సంసార సాగరాన సంగమించే సన్యాసపు శూన్యం ఆయన భక్తి తత్వం సంగీత సాహిత్య సమలంకృతమైన స్వర పదార్చనం ఆయన నైరాశ్యం కన్నులనే వెలివేసి కరిగిపోయే కలల కన్నీటి విహారం ఆయన ప్రేమభావం నిశీధిలో ఉషోదయాన్ని చూపగల సిరి వెన్నెల సుసామ్రాజ్యం ......... అక్షయ పాత్రలా అనంతమైన భావాల్ని అలవోకగా అక్షరాలతో వడ్డించే ఓ అసామాన్య ప్రజ్ఞా శాలీ ... మీ కీర్తి కిరణాలు వేల వేల వసంతాలు వన్నెతరగని వైభవాన వెలుగొందాలి మీ కవన వనాలు సుమబాలల కిలకిల రవాలతో కలకాలం విరబూయాలి మీ వంటిలో ఆయురారోగ్యాలు,మీ ఇంటిలో అష్టైశ్వర్యాలు పసిపాపలై పదికాలాలు పరవశాన పారాడాలి ఇదే మీ ఏకలవ్య శిష్యుల ఏకైక ఆకాంక్ష !!!!! సిరివెన్నెల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలతో -భవానీ ఫణి 20. 05. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kjUFy8

Posted by Katta

16, మే 2014, శుక్రవారం

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ బ్లాక్ హోల్ ॥ చిరు చెంపల్లో బిడియపు ఎర్రదనం లేదు పెదవంచుల్లో పలుకుల పచ్చదనం లేదు కనురెప్పలపై కన్నీటి చుక్కల కలకలం లేదు కనుపాపలకి ఎదురు చూపుల కలవరం లేదు హృదయాంతరాల్లోదుఃఖపు కెరటాల సందడి లేదు కనీసం ఎడారిలోలా ఇసుక తుఫానైనా చెలరేగడం లేదు నువ్వు సృష్టించి వెళ్ళిన అపనమ్మకపు బ్లాక్ హోల్ నా భావాలన్నిటినీ తన బాహువుల్లో బంధించి మాయం చేసాక నన్ను కోల్పోయిన నేను మాత్రం ఇలా మిగిలాను చీకటి జ్ఞాపకాల్లోకి చూపుల్ని పోగొట్టుకుంటూ !!! 16. 05. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iRN19r

Posted by Katta

29, ఏప్రిల్ 2014, మంగళవారం

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ విహారి ॥ సుదూర తీరం వైపుకి సాగే సుదీర్ఘ ప్రయాణం లో సముద్రపు అలలనే సింహాసనంగా చేసుకుని సేద తీరే సైబీరియన్ పక్షుల్లా ఈ దేహపు కడలి విడిదిలో విశ్రమించే ఓ విశ్వ విహారిని నేను తెల్లవారు ఝామున తమస్సామ్రాజ్యాన వేగంగా కదిలే కనుపాపల్లో పుట్టి విచ్చుకున్న కనురెప్పలతో పాటుగా విరిగి పడి కరిగిపోయే కమ్మని కలలా జననం లోంచి మరణం లోకి జారిపడే జీవిత రహస్యాన్ని నేను అత్యున్నత పర్వతాల పాదాల చెంత ప్రాణం పోసుకుని మెలికలెన్నో తిరుగుతూ లోతైన సంద్రపు ఒడిని చేరుకునే మహా నదం వంటి మహోధృతమైన ఆలోచనా పరంపర ను నిర్వికారంగా నిలబడి చూసే మనిషిలోని పరమాత్మను నేను!!! (కినిగే ఏప్రిల్ సంచిక లో ప్రచురితమైంది http://ift.tt/1nCywxQ) పోస్ట్ చేసిన తేదీ 29. 04. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nCywxQ

Posted by Katta

24, ఏప్రిల్ 2014, గురువారం

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ దుఃఖం ॥ దుఃఖమే ఎందుకు ఇంతగా ఆకర్షిస్తుంది ఒక్క నన్నేనా.... అందరినీ అంతేనా? ఎంత గొప్ప సంతోషమైనా దోసిళ్ళ నిండుగా నిండిన నీటిలా ఎండిన గుండెల దాకా చేరలేక ఏ భావమూ చిగురింపజేయలేదు అదే దుఃఖమైతే హృదయంలో మొలకెత్తి కనుపాపల దాకా ఎదిగి కన్నీరై కురిసిపోగలదు అందాల్సినవన్నీ అడగకుండానే అందేస్తే అడగాలనే కోరిక అలా మిగిలిపోయి అందినదాని విలువ తెలియనివ్వక అసంతృప్తి లోతుల్లోకి తొక్కేస్తుంది అదే అందనంత దూరాన నిలబడి ఆహ్వానించే చిన్నిపాటి కామన అయినా నారింజ రంగు నక్షత్రంలా మిణుకు మిణుకుమని మెరుస్తూ ఆకాశానికి నిచ్చెనలు వేయిస్తుంది ఒక గొప్ప విజయం ఇంకాస్త ఎత్తుకు ఎగబాకమని ఆదేశిస్తుంది తీరా అత్యున్నత శిఖరం అధిరోహించాక ఇంకేం చెయ్యాలో చెప్పక ఒంటరిగా వదిలేస్తుంది అదే అపజయమైతే అలవి కాని బాధని తోడు తీసుకొస్తుంది చేరలేక పోయిన లక్ష్యాన్ని చేరుకోమంటూ సరి కొత్త బాటల్ని సృష్టిస్తూనే ఉంటుంది ఒకసారి దుఃఖం లో ఉన్న ఆనందపు రుచి మరిగాక దుఃఖమే లేని ఆనందాన్ని అనుభవించడం కొంచెం కష్టమే !!! 24. 04. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pt3dHF

Posted by Katta

10, ఏప్రిల్ 2014, గురువారం

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ హిమాగ్ని ॥ గాయమేదో అయిందని తెలుస్తోంది వెతికి చూస్తే కంటికి కనిపించడమే లేదు రుధిరపు ఊపిరి వెచ్చగా తగులుతోంది తడిమి చూస్తే చేతికి ఎర్రగా అంటడం లేదు ఎలా అంటావా? నీ వల్ల కలుగుతున్న బాధ నీకు చూపించకుండా నవ్వు ముఖం వెనుక నేను దాచిపెట్టినట్టు నా శరీరం కూడా నటిస్తోంది నా దగ్గర! జటిలమైన నా అసంతృప్తి వేళ్ళని మనసులోనే సమాధి చేసి పెదవులపై మాత్రం తియ్యని పలుకుల్ని నీకోసం నేను మెత్తగా పూయిస్తున్నట్టు నా బుద్ధి నన్నే మభ్యపెట్టాలని చూస్తోంది! నిన్ను ఒదులుకోలేని బలహీనత బలంగా నన్ను హత్తుకుని నాకు నువ్వెలా కావాలో చెప్పనివ్వక నీక్కావాల్సినట్టు నన్ను మారుస్తుంటే కాలుతున్ననా హృదయం సుగంధాల్ని వెదజల్లుతోంది! నీకు దూరం కావాలన్న కోరిక నన్ను మరింతగా నీ వైపుకి నెట్టి నా మనసుకీ శరీరానికీ సమన్వయాన్ని సమూలంగా నాశనం చేస్తున్నట్టు జ్వలించే నా కనుపాపలు హిమాన్ని వర్షిస్తున్నాయి! అవును .. నిజమైన నేను నీకు కనిపించను మరి నువ్వు నిజంగా చూడాలనుకునే వరకు !!! 10. 04. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gc08pa

Posted by Katta

7, ఏప్రిల్ 2014, సోమవారం

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ పసి(డి ) కలలు ॥ పండిన లేత చేతుల్తో తన మేని రంగుని సరిచూసుకుంటూ ఏమారిఉన్న ఆ పెంకు ముక్క, ఉన్నపాటుగా ఏదో ఒక గడిలోకి తొక్కుడు బిళ్ళగా విసిరివేయబడి అదే గోరింటాకు తో ఎరుపెక్కిన అరికాలి క్రింద నలిగి అలిసిపోతోంది ఎగిరెగిరి తన్నుతూ తాడాట ఆడుతున్న పసి పాదాల జంటని పదే పదే ప్రేమగా ముద్దాడే పుడమి సహనానికి అచ్చెరువొందుతూ మైమరిచిన చిరుగాలి, ఛెళ్ళున తాకే తాడు తాకిడికి ఉండుండీ ఉలికిపాటుకి గురవుతోంది తనని పైకంటా విసిరి నేలమీదున్నతన నేస్తాల్ని నేర్పుగా అందుకుని అతి లాఘవంగా తిరిగి తనని కూడా గుప్పిట చేర్చుకుంటున్న ఆ మెత్తని చేతి తాలూకూ గాజుల కోలాహాలానికి ఓ చింతపిక్క చిత్రంగా తుళ్ళి పడుతోంది వైభవంగా జరిగిన తన వివాహ వేడుకకి సిగ్గిల్లిన ఓ బొమ్మ పెళ్లి కూతురు, తనలో జీవమే లేదన్న విషయం మరిచి చిట్టి పొట్టి పెళ్లి పెద్దల సమక్షాన చేతనత్వాన్ని కోల్పోయానని తెగ కంగారుపడిపోతోంది పగడాలు రాశి గా పోసి పైన తెల్లని బొండు మల్లెని గుచ్చినట్టు ఆవకాయ కలిపిన అన్నం ముద్ద మీద కూర్చుని ఉన్న ఓ వెన్నముద్ద మెలమెల్లగా కరుగుతూ వయ్యారాలు పోతోంది దీపాల వేళ ఆరుబయట నిలబడి కొబ్బరిచెట్టు ఆకుల మధ్య నుండి తొంగి తొంగి తనని చూస్తుంటే ఎప్పుడో కొబ్బరాకులో నక్కిన ఓ వర్షపు చినుకు ముక్కుపైకి దూకిందని ఆ చిలిపి చంద్రుడు విరగబడి నవ్వుతున్నాడు ఇంతందమైన కలల పల్లకీలో నన్నెక్కించుకుని బాల్యం లోకి మోసుకెళ్తున్న ఈ బంగారు క్షణాలు కరిగిపోతాయేమోనని ఉదయాన్నిసైతం రావద్దంటూ కనురెప్పల తలుపుల్ని మరింతగా బిగిస్తున్నాను నేను !!! (కౌముది ఏప్రిల్ 2014 సంచిక లో వచ్చిన నా కవిత http://ift.tt/OqqTem) పోస్ట్ చేసిన తేదీ 07. 04. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/OqqTem

Posted by Katta

3, ఏప్రిల్ 2014, గురువారం

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ కోపం ॥ కోపం ఉండచ్చు.. కానీ అది, అద్దం మీంచి జారిపోయే నీటి బిందువులా ఉండాలి తప్ప తారాజువ్వని ని అంటించే నిప్పు రవ్వలా కాదు కాలువ లో పరవళ్ళు తొక్కే కొత్తనీరు లా ఉండాలి తప్ప భూకంపం తర్వాత వచ్చే సునామీ లా కాదు పులిహోర లో కలిసి మెత్తబడిపోయే పోపు లా ఉండాలి తప్ప అన్నం లోనో, పప్పులోనో నక్కి పంటికింద పడే తెల్లని రాయిలా కాదు గోడకేసి కొట్టిన రబ్బరు బంతిలా ఉండాలి తప్ప లక్ష్యాన్ని తునాతునకలు చేసే బాణపు మొనలా ఉండకూడదు శీతాకాలపు పలుచని ఎండలా చురుక్కుమనిపించాలి తప్ప వడదెబ్బతో నిర్జీవం చేసే గ్రీష్మ ప్రతాపం లా ఉండకూడదు దువ్వెన ని ఇబ్బందిపెట్టే గిరజాల జుట్టు చిక్కులా ఉండాలి తప్ప ఎంతకీ విడదియ్యలేని చిక్కుముడి లా ఉండకూడదు కోపం అనేది మన మనసుకి తగిలిన గాయాన్ని మాన్పే టందుకు బహిర్గతమవ్వాలి తప్ప దావానలంలా వ్యాపించి మనతో పాటు పక్కవారిని కూడా మాడ్చి మసి చెయ్యకూడదు !!!! (ప్రస్థానం ఏప్రిల్ సంచిక లో వచ్చిన నా కవిత http://ift.tt/PcN8pe) పోస్ట్ చేసిన తేది 01. 04. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PcN8pe

Posted by Katta

1, ఏప్రిల్ 2014, మంగళవారం

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ కోపం ॥ కోపం ఉండచ్చు.. కానీ అది, అద్దం మీంచి జారిపోయే నీటి బిందువులా ఉండాలి తప్ప తారాజువ్వని ని అంటించే నిప్పు రవ్వలా కాదు కాలువ లో పరవళ్ళు తొక్కే కొత్తనీరు లా ఉండాలి తప్ప భూకంపం తర్వాత వచ్చే సునామీ లా కాదు పులిహోర లో కలిసి మెత్తబడిపోయే పోపు లా ఉండాలి తప్ప అన్నం లోనో, పప్పులోనో నక్కి పంటికింద పడే తెల్లని రాయిలా కాదు గోడకేసి కొట్టిన రబ్బరు బంతిలా ఉండాలి తప్ప లక్ష్యాన్ని తునాతునకలు చేసే బాణపు మొనలా ఉండకూడదు శీతాకాలపు పలుచని ఎండలా చురుక్కుమనిపించాలి తప్ప వడదెబ్బతో నిర్జీవం చేసే గ్రీష్మ ప్రతాపం లా ఉండకూడదు దువ్వెన ని ఇబ్బందిపెట్టే గిరజాల జుట్టు చిక్కులా ఉండాలి తప్ప ఎంతకీ విడదియ్యలేని చిక్కుముడి లా ఉండకూడదు కోపం అనేది మన మనసుకి తగిలిన గాయాన్ని మాన్పే టందుకు బహిర్గతమవ్వాలి తప్ప దావానలంలా వ్యాపించి మనతో పాటు పక్కవారిని కూడా మాడ్చి మసి చెయ్యకూడదు !!!! (ప్రస్థానం ఏప్రిల్ సంచిక లో వచ్చిన నా కవిత http://ift.tt/PcN8pe) పోస్ట్ చేసిన తేది 01. 04. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/PcN8pe

Posted by Katta

21, మార్చి 2014, శుక్రవారం

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ కవిత్వం ॥ కనుపాపల అంచుల్లో పుట్టి సుదూర నిశీథపు నివాసంలోని నక్షత్రపు చిటారు కొమ్మన చేరే ఓ నల్లని వెలుగు పిట్ట ...... కవిత్వం పూరేకుల నవ్వుల్ని చుట్టి ఆ రంగు రంగుల రాజసంలోంచి సౌందర్యపు మకరందాన్నివెలికితీసే ఓ మెత్తని తుమ్మెద రెక్క .... కవిత్వం నీలి చెంపల కడలిని తట్టి ఆ పాల నురుగుల అలలతో తన మేనిఛాయని సరిపోల్చుకునే ఓ చల్లని వెన్నెల చుక్క ..... కవిత్వం నిశి రాత్రిని పక్కకు నెట్టి అనవరతమైన ఆకాశపు గోడ పై అందాల దినకరుడ్ని అలంకరించే ఓ ఎర్రని తూరుపు ప్రక్క .... కవిత్వం తన నల్లని కురుల్ని విదిల్చి రాల్చిన నీటి చుక్కల పువ్వులతో ఆల్చిప్పల ఒడిలో ముత్యాలు పేర్చే ఓ చక్కని మేఘ మాలిక ..... కవిత్వం జగతిలోని ప్రతి చిత్రాన్నీ ఒడిసిపట్టి పలుకు పలుకునా ప్రతి ధ్వనిస్తూ ప్రపంచమంతా విజ్ఞానాన్ని విత్తే ఓ ప్రచండ ప్రజ్ఞా హేళిక .... కవిత్వం 21. 03. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hMdvu9

Posted by Katta

10, మార్చి 2014, సోమవారం

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ అనాథ ॥ వాడి అమ్మా నాన్నలకి అందరికంటే ముందే ఆహ్వానమొచ్చింది ఆ దేవుడి దగ్గర్నుంచి సరదాకి నేలమీదకి విహార యాత్ర కొచ్చిన అల్లల్లోంచి తప్పిపోయి ఇసుక రేణువుల్లో చిక్కుకుపోయిన నీటి తుంపరలా వాడు మాత్రం ఈ భూమ్మీద ఒంటరిగా మిగిలిపోయాడు వాడి దేహమంతా దుఃఖమే కన్నీరు ఎక్కడ తుడుచుకుంటే అక్కడనించి ఇంకొంచెం అంటుకుంటోంది కనురెప్పలు కత్తిరించుకున్నా వెలుగు చుక్క కనబడనంత గా వాడి లోకమంతా చీకటే కిక్కిరిసిపొయిన జనం మధ్య నిలబడినా వాడి కడుపంతా ఖాళీతనమే వాడి చూపుల దారిలో చేరి వాడి దరికి చేరే కంటిపాపే లేక వాడి చుట్టూ ఎప్పుడూ ఒంటరితనమే వాడి నవ్వుల పువ్వుల్లో చిమ్మే మకరందం రుచి ఏ తేనెటీగకూ నచ్చడం లేదు వాడి బంగారు బాల్యం బయటపడే మార్గం లేక మట్టి పొరల మధ్యే సమాధి కాబడింది ఎవరు చేసినా చెయ్యకపోయినా ఆకలి మాత్రం అనునిత్యం వాడితో స్నేహం చేస్తూనే ఉంటుంది ఎవరొచ్చినా రాకపోయినా నిద్రా నీరసం వాడి కోసం వచ్చి కాసేపు కలల కబుర్లు చెప్పి వెళతాయి వాడి చుట్టూ వాడిలాగే ఎన్నో ముఖాలు వాడికి కనిపిస్తాయి కానీ వాళ్ళ ముఖాల్లో, వాళ్ళ లాగే ఉన్న తన ముఖం తాలుకూ గుర్తింపే ఎప్పుడూ ఎందుకు కనబడదో మాత్రం వాడికి అస్సలు అర్ధం కాదు పోస్ట్ చేసిన తేది 10. 03. 2014 ( మార్చ్ నెల ఈమాట మాగజైన్ లో ప్రచురితమైన నా కవిత వాళ్ళు కొద్దిగా మార్పులు చేసారు http://ift.tt/1h5RQg5)

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h5RQg5

Posted by Katta

8, మార్చి 2014, శనివారం

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥అభివందనం॥ అలవోకగా ఆకాశాన్ని దాటిపోతుంది అవసరమైతే అక్కడే కాలి పోతుంది -కల్పనా చావ్లా కు కన్నీటి వందనాలు ఆత్మాభిమానాన్ని ఆభరణంగా ధరిస్తుంది అగ్నికీలల్ని సైతం నిగ్గు తేల్చి జ్వలిస్తుంది -సీతా ,సతీ మాతలకు శతకోటి వందనాలు మందరపర్వతమై మానవత్వాన్ని మధిస్తుంది ప్రేమామృతాన్నితెచ్చి ప్రపంచానికి పంచి ఇస్తుంది -మదర్ థెరీసా కు మనః పూర్వక వందనాలు శివంగిలా శత్రువుల గుండెల్లో చరిస్తుంది స్వేచ్ఛావర్ణమై చరిత్ర పుటల్లో మెరుస్తుంది -ఝాన్సీ లక్ష్మికి జయ ధ్వానాల వందనాలు సహనమై, సౌందర్యమై సాహసమై, సాహిత్యమై మాతృత్వమై, దాతృత్వమై ధీరత్వమై, దయాతృప్తహృదయమై సౌకుమార్యమై, శక్తి స్వరూపమై కారుణ్యమై, కదిలే కాంతి పుంజమై ప్రకాశించే ప్రతీ మహిళకూ పేరుపేరునా ప్రత్యేక అభివందనం !!! 08. 03. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/NIpCQc

Posted by Katta

6, మార్చి 2014, గురువారం

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ కావడి కుండలు॥ జననం మరణానికీ మరణం మళ్ళీ జననానికీ కారణం అయినట్లు ఆకాశాన్ని అందుకున్న సముద్రపు నీరు,మేఘాల్లోంచి దూకి మళ్ళీ నడిసంద్రం లోకి జారినట్టు గమనం నిశ్చలమై నిలిచి ఆ స్థిరత్వం మళ్ళీ చలనమవుతూ నిలకడని నడక పూరించినట్టు మిగలముగ్గి నేలరాలిన ఓ పండు చిరు మొక్కగా ప్రాణం పోసుకుని మరెన్నో పళ్ళకి సృష్టికర్త అయినట్టు అలిగి దూరమై ,అంతలో చేరువై సూర్యుడి చుట్టూ భూమి పదే పదే ప్రదక్షిణలు చేసినట్టు నిశిరాత్రిలోకి నిష్క్రమించిన వెలుగు వేకువై వికసించి మళ్ళీ చీకటి వైపుకి పయనం ప్రారంభించినట్టు ఆకుపచ్చని వసంతగానం నిశ్శబ్దంగా శిశిరం లోకి రాలి పడి మరలా సరికొత్త రాగాన చిగురించినట్టు ఒకే కర్రకి కట్టబడిన కావడి కుండల్లా ఒకే నాణంలో ఇమిడిన రెండు ముఖాల్లా రూపాలు మార్చుకుంటాయి మంచి చెడులు ఒకదాన్ని మరొకటి పరిపూర్ణం చేస్తూ !!! పోస్ట్ చేసిన తేది :06. 03. 2014 (వాకిలి మార్చి సంచికలో వచ్చిన నా కవిత http://ift.tt/1fJLArN)

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fJLArN

Posted by Katta

1, మార్చి 2014, శనివారం

Bhavani Phani కవిత

(మా అబ్బాయి సాకేత్ వ్రాసిన కవిత. గ్రూప్ లో జాయిన్ కావడానికి తన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చెయ్యబడని కారణంగా నేనే పోస్ట్ చేస్తున్నాను . దయచేసి చదివి మీ ఆశీర్వాదాలు , సలహాలు , సూచనలు తెలుపగలరు . ) Valluri Saketh ॥ A message from history॥ It all started on a moonless windy night, when the king took his place and sat upright. A meeting was arranged which was clandestine, a meeting that would change the world with time. The results of the meeting were drastic, a war was declared. It was an errant decision,so barbaric, that even the soldiers were aghast. The kingdom upon which the war was declared, was equally strong and agile, all the other kingdoms' invasions on it had been futile. But the adamant king wouldn't bulge, he wouldn't change his orders, so the army started to mobilize and the horses were fed with fodder. The day of battle finally arrived, the battleground and its vicinity was green. Two strong armies stood facing each other, to fight a battle in which only the strongest would win... The war-horn was blown and the swords clashed, in matter of days there was no battle ground, all one could see was pool of blood and hear wailing sound. Few who survived that brutal battle, left that place forever, Resolved not to return again, and never to battle..never ever. This is not a folklore neither fairy tale nor a story, this is taken from future, a future where people reckon it as their history..... 01. 03. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kk86PV

Posted by Katta

15, ఫిబ్రవరి 2014, శనివారం

Bhavani Phani కవిత

(రవీంద్ర నాథ్ టాగోర్ గారు వ్రాసిన "The Banyan Tree" అనే ఈ కవితని చాలా మంది ఈ పాటికే తెలుగులో తర్జుమా చేసి ఉంటారేమో నాకు తెలియదు కానీ చదివిన తరువాత నేను కూడా చెయ్యకుండా ఉండలేకపోయాను . అంత గొప్ప కవి వ్రాసిన కవితని ట్రాన్స్ లేట్ చెయ్యడంలో తప్పులేమైనా చేసి ఉంటే క్షమించగలరు) ॥ మర్రి చెట్టు ॥ చెరువు గట్టున జుట్టు విరబోసుకుని నిలబడి ఉన్న ఓ మర్రి వృక్షమా నీ కొమ్మలపై గూళ్ళు కట్టుకున్న పక్షులెన్నో నిన్ను వదిలి వెళ్ళిపోయినట్టు గా నువ్వు కూడా ఆ చిన్ని పిల్లవాడిని మరిచిపోయావా చిక్కులు పడిన నీ చిక్కని మూలాలు ఎలా భూమిలోకి చొచ్చుకు పోయాయో ఆశ్చర్యంగా చూస్తూ అతనెలా ఆ కిటికీ లో కూర్చుని ఉండేవాడో నీకు నిజంగా గుర్తు లేదూ చెరువు నీటితో తమ కడవలు నింపుకునేందుకు స్త్రీలు వచ్చినప్పుడు మెళకువ తెచ్చుకోవడానికి నిద్ర చేసే ప్రయత్నం లా నీ నల్లని పెద్ద నీడ నీటిమీద మెలికలు తిరగడాన్నీ అలుపెరుగని చిన్ని చిన్ని సూదులు బంగారు బట్టని నేస్తున్నట్టు ఆ నీటి తరంగాలపై సూర్యకాంతి నాట్యం చేయడాన్నీ వరుస కట్టిన చెట్ల ప్రక్క నుండి రెండు బాతులు తమ నీడల మీదుగా ఈదుకుంటూ వెళ్లడాన్నీ స్థిరంగా కూర్చుని చూస్తూ ఆ కుర్రవాడు ఇలా ఆలోచించేవాడు ఆ గాలిలా మారి నీ కొమ్మల చప్పుడు లోంచి వీచాలని నీ నీడలో చేరి పొద్దుతో పాటుగా నీటి మీద పెరుగుతూ ఉండాలనీ ఓ పక్షిలా మారి నీ చిటారు కొమ్మపై నుండి కమ్మగా కూయాలనీ ఆ బాతులైపోయి తమ నీడలతోనూ నాచుతోనూ కలిసి నీటిపై తేలాలనీ !!!! ( ఆ కుర్రవాడు ఆలోచించేవాడు ) (Original poem) O you shaggy-headed banyan tree standing on the bank of the pond, have you forgotten the little child, like the birds that have nested in your branches and left you? Do you not remember how he sat at the window and wondered at the tangle of your roots and plunged underground? The women would come to fill their jars in the pond, and your huge black shadow would wriggle on the water like sleep struggling to wake up. Sunlight danced on the ripples like restless tiny shuttles weaving golden tapestry. Two ducks swam by the weedy margin above their shadows, and the child would sit still and think. He longed to be the wind and blow through your resting branches, to be your shadow and lengthen with the day on the water, to be a bird and perch on your topmost twig, and to float like those ducks among the weeds and shadows. posted on 15.02.2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/MlYJRo

Posted by Katta

14, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ ప్రేమ ॥ ప్రేమంటే గ్రీటింగ్ కార్డుల మడతల్లోంచి రాలి పడే రంగుల అక్షరం కాదు హృదయాంతరాళాపు లోతుల్లో మమతల చిత్రమై మౌనంగా విశ్రమిస్తుంది ప్రేమంటే ఎర్ర గులాబి రేకుల మధ్య నుండి నవ్వే సుందర వర్ణం కాదు తన వారి కష్టాన్నిచూసి గుండెలోంచి కళ్ళలోకి రక్తమై ఎగజిమ్ముతుంది ప్రేమంటే ఏదో ఒక ప్రత్యేకమైన రోజు బహూకరించే ఖరీదైన వస్తువు కాదు ప్రతి నిమిషం,చేసే ప్రతి పనిలోనూ వెలకట్టలేని అనురాగాన్ని వ్యక్తపరుస్తుంది ప్రేమంటే పలకరింపుల్లో , పదాల అల్లికల్లో ప్రకటితమయ్యేది కాదు తనువులోని ఆణువణువూ నిండి కనుపాపల్లోంచి ప్రసరిస్తుంది ప్రేమంటే పరస్పర వ్యతిరేక రూపాల పదునైన ఆకర్షణే కాదు ప్రకృతి లోని ప్రతి బంధం లోనూ అంతర్యామిగా ఇమిడి ఉంటుంది 14. 02. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iUqMm7

Posted by Katta

11, ఫిబ్రవరి 2014, మంగళవారం

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ ఆకుపచ్చని హృదయం॥ మల్లెల పరిమళం లాంటి ఓ చిలిపి జ్ఞాపకాన్ని ఏ చల్లని క్షణం, చిరుగాలిలా మోసుకొచ్చిందో, పుడమిన పరుచుకుని ఉన్న మన్నుని తట్టి లేపే పిల్ల తెమ్మెరలా మానుపడుతున్న గాయాన్ని ఏ వర్తమానం వచ్చి కదిపి రేపిందో అది పున్నమి వెన్నెలో, చిక్కని చీకటో తెల్లని తుషారమో, వెచ్చని వెలుగు కెరటమో ప్రకృతి మార్చుకునే ఏ రంగురంగుల వస్త్రమో గానీ ఆ చూపుల ప్రవాహంలో పడి మనసులోకి కొట్టుకొచ్చిందేమో లేకపోతే మెరిసే నక్షత్రాల్నీ, విరిసే వసంతాల్నీ చెట్లు రాల్చే శిశిరాశ్రువుల్నీ, చినుకులై రోదించే చిట పట మేఘాల్నీ,గింజల్లా ఏరుకొచ్చి ఏ పరిచయపు పక్షి రాజం తన గుండెల్లోకి విసిరిందో గానీ ఆ హృదయం లోపల ఓ సరి కొత్త భావమేదో విత్తుకుంది విత్తుకుని ఊరుకుందా..... అనుభవాల్లోంచీ, పుస్తకాల్లోంచీ వెలుగు రేఖల్ని లాక్కుని పెనవేసుకుంది దుఃఖ పీడితుల కన్నీటినీ, ఊహించని సుఖంలోంచి పుట్టిన ఆనంద భాష్పాల్నీ అరువడిగి ఆత్రంగా పీల్చుకుంది గురువుల సూచనల్నీ,నేస్తాల ప్రశంసల్నీ, ఎరువుగా మార్చుకుంది అన్నిటినీ రంగరించి తనని తానే మధించుకుని అక్షరామృతాన్ని పత్ర హరితం లా సృష్టించుకుంది చివరికి చిన్ని మొక్కలా చిగురులు తొడిగి ఎందరో సహృదయుల ఆసరాతో మహా వృక్షమల్లే ఎదిగి హృద్యమైన కవితలెన్నో పుష్పించింది , అపూర్వమైన కావ్యాలెన్నో ఫలించింది ఎందరెందరో సాహితీ పిపాసుల ఆకలిదప్పికలు తీర్చే కల్ప వృక్షమైంది మరెన్నో చిరు మొక్కల కోసం అనుభవ పాఠాల్ని రాల్చి ఆదర్శ ప్రాయమైంది మామూలు మట్టి మనసే మరి చిన్ని చిన్ని స్పందనల్ని ఒడిసిపట్టి మహోన్నతమైన రూపాన వృక్షించి అద్భుతమైన కవి హృదయమైంది 11. 02. 2014

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1elHSnJ

Posted by Katta

8, ఫిబ్రవరి 2014, శనివారం

Bhavani Phani కవిత

భవానీ ఫణి ॥ నిన్న నేను ఆత్మహత్య చేసుకున్నాను ॥ అవును, ఎవరికోసం బ్రతకాలి హరివిల్లువంటి ఉనికి లేని ప్రేమ కోసం, ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఎంతం కాలం ఎదురుచూడాలి నమ్మకమనే కనిపించని కొక్కానికి జీవితాన్ని ఎన్నిసార్లు వ్రేలాడదీయాలి ఎండమావిలా ఊరించే సంతోషం కోసం ఎంత దూరమని పరుగులు తియ్యాలి అడుగడుగునా ఎదురయ్యే అవమానాల్ని సమాజపు అంగడిలో కొనుక్కుని మరీ ఈ దేహానికి ఎందుకు తగిలించుకోవాలి మనసుని ఎందుకు అయినకాడికి అమ్ముకోవాలి తనది కాని కాంతిని దొంగిలించి వెన్నెల సృష్టికర్తనని ప్రగల్భించే చంద్రుడిలా లేని గొప్పల్ని డప్పు కొట్టి వినిపించే మూర్ఖులతో కలిసి ఎందుకు సహవాసం చెయ్యాలి గింజలు చూసి వచ్చి వలలో చిక్కి వేటగాడి చేతిలో ప్రాణాలు కోల్పోయిన పక్షిలా తియ్యని కబుర్లు చెప్పే మోసగాళ్ళ నయవంచనకి బలై చచ్చిన మనసుతో ఎందుకు జీవచ్ఛవమై బ్రతకాలి గెలుపు నావ నెక్కితే చప్పట్ల జడివాన కురిపించిన ఈ జనం ఓటమితో మునిగిపోతున్నప్పుడు రాళ్లు విసురుతుంటే ఎలా తట్టుకోవాలి ఉరుకులు పరుగులు పెట్టే తెల్లని మేఘాల వంటి ఈ మనుషులు విసిరే జాలి చూపుల చినుకుల కోసం ఎదురుచూస్తూ ఒంటరితనపు దాహార్తితో ఎంతని అలమటించాలి అందుకే చచ్చిపోయాను ఆరిపోయిన దీపం విలువ చీకటి చూపించినట్టు ప్రాణాన్ని నింపుకున్న నా దేహం గొప్పతనాన్ని నా శవమైనా చెబుతుందని ఏమీలేని శూన్యాన్ని కౌగిలించుకునేలా చేసిన ఈ క్రూర జీవితం మరో హత్య చేసేముందైనా మరికాస్త ఆలోచిస్తుందని వెలుగు మీద పిచ్చి భ్రమతో ఆత్మార్పణ చేసుకున్న దీపపు పురుగులా కాస్తంత ఆదరణ కోసం మరణాన్ని నిర్భయంగా హత్తుకున్న నేను.... మీరు ఈ రోజు కార్చే కన్నీటి కాలువల్లో పడి కొట్టుకుపోతున్న ఆ శరీరంలో.... లేనే లేను !!!! (వ్రాసిన తేదీ 09.01.2014) (మాలిక ఈ మాగజైన్ లో వచ్చిన నా కవిత )

by Bhavani Phani



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/LGTZou

Posted by Katta

29, సెప్టెంబర్ 2012, శనివారం

భవాని ఫణి || మౌనం


మౌనం ఉదయించింది
మాటల చీకటి కనుమరుగయింది

మౌనం వర్షించింది
శబ్దం నిశ్శబ్దమై చిగురించింది

మౌనం పలికింది
పలుకు మూగబోయింది

మౌనం పలకరించింది
భాషణం బిత్తర పోయింది

మౌనం వెల్లివిరిసింది
వాక్కు వాడిపోయింది

మౌనం పరిమళించింది
ప్రతి మనసూ పరవశించింది
28.09.2012