ఈనాటికవిత-70 ________________________________ వక్కలంక వసీరా-రెండువాక్యాలు. కవిత్వంపై ప్రధానంగా ప్రభావాన్ని చూపేది కవి దర్శనమే.వర్ణన ముఖ్యమైందిగా భావిస్తే దానిని ప్రభావితం చేసేది కవిదర్శనమే."దర్శనాద్వర్ణనాచ్చాథ రూఢాలోకే కవిశ్రుతిః"అని ప్రాచీనులు.ఋగ్వేదంలోనూ "చత్వారివాక్"అని చెబుతారు అంటే పశ్యంతి,మధ్యమా,వైఖారి-దీనితోపాటు పరా అనేఅంశం ఒకటి ప్రధానమైంది. పశ్యంతి-చూస్తున్నది..మధ్యమా-చెప్పడానికి మాధ్యమంగాఉన్నది.వైఖారి -చెప్పబడుతున్నది..వీటన్నిటికి అతీతమైంది పరా...మీమాంసకూడా అలౌకిక వ్యాపారాలగురించి చెప్పింది.సాధారణ,ధారణ,మనన,చర్వణ,సృజన -అనే ఐదు అలౌకిక వ్యాపారాలు.ప్రపంచమ్నుంచి గమనిస్తున్నది,తీసుకొంటున్నది,ఙ్ఞప్తిలోకి తెచ్చుకుంటున్నది,తనకున్న ఙ్ఞానమ్మేరకు ప్రతిఫలింపబడుతున్నదీ,సృష్టింపబడుతున్నదిగా కవిత్వం ముందుకు వస్తుంది.-బహుశఃసాధారణ వాక్యాలుకూడా.కని పొందిన దానిని అంతే స్పష్టంగా చిత్రించడం సాధ్యం కాదనేది అనుభవం గలవారుచెప్పే అంశం. వసీరా ఇలాంటి తాత్వికధారగల కవిత్వాన్నే అందించారు.ఇందులో కనిపించే-"మాటల నీడలు " శబ్దాల రంగులు""వాక్యాలు "వంటి పదాలవల్ల ఏర్పడిన అర్థక్షేత్రం వల్ల ఇది కవిత్వాన్ని గురించిన అంశమని అర్థమౌతుంది. "రెండు రెక్కలూ రెండు వాక్యాలు మాటల మధ్య మౌనం లా వాక్యాల మధ్య ఆకాశం నదిమీద రెక్కలు విప్పే పక్షులు రెండు రెక్కలూ రెండక్షరాలు అక్షరాల మధ్య ప్రవహించే నది నీటిలో నీడలూ అంతకంటే పొడవైన అందమైన రెక్కలు విప్పుతాయి మాటల నీడల మధ్య ఎగిరే పక్షి అద్భుత శబ్దాల రంగుల మీద గింగిర్లు కొట్టి చివరికి మౌన వృక్షం తొర్రలోని ఇంటికి చేరుతుంది " మౌనానికి ,ఆకాశానికి మధ్యపోలికకి వాటికుండే అనంతమైన లక్షణమేకారణం.మాటలమధ్య ఉండడానికి ఒక కారణం వెదికితే ఏమౌనమూ కూడా ఆత్మికంగా మౌనం కాదు.అంతర్ముఖ సంభాషణే.పక్షి శబ్దంలోని ఉనికి స్వేచ్చని చెప్పెదే.నది ప్రవాహానికి,ఆగని కాలానికి ప్రతీక. కవిత్వమెప్పుడూ వర్తమానంలో కనిపించేదాన్ని మించి చూపుతుంది.అందువల్లే కవిత్వంలో వర్తమానం కూడా శాశ్వతముద్ర పొందుతుంది.అంతే సౌందర్యాత్మకంగా ఉంటుంది కూడా. "నీటిలో నీడలూ అంతకంటే పొడవైన అందమైన రెక్కలు విప్పుతాయి "-అనడంలో అర్థమిదే.నీడ అండంవల్ల దర్శించింది కాదు వ్యక్తంచేయబడుతున్నదనే ధ్వనిస్తుంది. కొసలో మొరాయించే మనస్సుని గూర్చి మాట్లాడుతారు.కవితకి భావచిత్రాలనో,ప్రతీకలనోవెతికి,వెతికి,రంగురంగుల శబ్దాలమీద గింగిర్లు కొట్టి (తిరిగి)చూసినదాన్ని అలాగే చిత్రించటం చేతకాక ఏ మౌనం లోనించి పుట్టిందో అక్కడికే వెల్లిపోతుంది. చిత్రిస్తున్నది కవికెప్పుడూ అసంతృప్తిగానే ఉంటుంది.ఒక స్థాయికి వెల్లి సంతృప్తిగావెనక్కి రావడమే తప్ప పొందినదాన్ని అట్లే అందించటం వీలుకాక పోవటం -తిరిగి ఆలోచన మళ్లీ యథా స్థానాన్నే చేరుకోవటాన్ని కవిత్వం చేసారు ఇక్కడ కవి. నిజానికి ఇలాంటి కవిత్వాన్ని మార్మిక కవిత్వమనే(Mysti poetry) అనాలి విమర్శలో మార్మిక కవిత్వం అంటేమేథస్సుని మించిన మనవసామర్థ్యంతో అర్థమయ్యేది.అంతే కాని తర్కానికి లొంగనిది.దైవత్వ సంబంధమైన అంశాలకు సంబంధిన చర్చ మాత్రమే మార్మిక కవిత్వం గా ఉంది.ఇందులో కనిపించే అర్థ అనిర్దిష్టత(Inditerminacy)వల్ల మార్మికంగా అనిపిస్తుంది.కాని ఇది దార్శనిక సంబంధమైన తాత్వికతతో ముడిపడిన కవిత. కవిత్వం రాయడానికి కవిపడె సంఘర్శణ ఈకవితలో కనిపిస్తుంది.ఈ మానసికానుచలనాన్ని అక్షరాలుగా మలచిన వసీరా గారికి అభినందనలు,ధన్యవాదాలు.
by Narayana Sharma Mallavajjala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cds61T
Posted by Katta
by Narayana Sharma Mallavajjala
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1cds61T
Posted by Katta