కొంత మంది ఎలా వస్తారో తెలియదు (దుర్మార్గంగా)
ముతకగా అభిరుచి అంటూ ఏమీ లేకుండా
(తూ...యాక్) వచ్చి పడతారు సభ్యలోకంలోకి
తన్మయత్మపు మైకమేమీ లేక (ఆర్టంటే ఏమిటో తెలిసి చస్తే కదా)
ఏదో పెనుగాలికి కొట్టుకొచ్చిన అపరిచిత జీవుల్లా
ఉద్యమాల్లోకీ.సాహిత్యంలోకీ గుత్తగా దఖలు పరుచుకున్న రంగుల కలలచిత్రాలలోకి
ఎందుకో(చాలా చాలా దుర్మార్గంగా)
ఉంటారా వీళ్ళు ఉండగలరా వీళ్ళు
సరదాగా మాటాడుకుందాం తూనిక వేసి పడిగట్టు పదాలతో తూగలేని వీళ్ళని
కోల్పోయి తమను నత్తులు కొడుతూ
మాటలలో హింసల కుప్పగా కూరుకొని చివరకు గాలిలో ధూళిలా కలగలసి పోయి (హిహిహి)-
చెరగని చిరకాల ముద్ర (మనదే మనదే)
ఉంటుందని ఒకటి
తెలియక వస్తారు( పాపం) వీళ్ళు నిరక్షర కుక్షుల గర్భశోకాలలోంచీ పొలోమంటూ (పాపం పాపం)
(హుష్) ఎవరు గరపగలరు విద్యను వీళ్ళకు మనం కాక ?
భుజస్కందాలపై (కాచిన కాయలు ఎన్నో!)
చరిత్ర మోపిన మరో భారం
మంచి ముడి సరుకు కదా
ఇక ఈ రోజుకు కథో కవిత్వమో -
(నుదుటి పై పొటమరించిన చెమట చుక్కలు ఎన్నో చూడు)
11-09-12