పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

24, ఆగస్టు 2012, శుక్రవారం

నంద కిశోర్ ||పునర్విమర్శ అభ్యాసం-2||

కొన్ని పరిచయాలంతే!
ఊహాలోకూడా తెలియని రెక్కల్నికట్టి
రివ్వున వీచేగాలిలో
ఒక్కసారిగా ఎగరేస్తాయ్..

తేరుకుని కిందపడ్డావో
సరేసరి!
దేహం విరిగినా
ప్రాణం మిగిలించుకోవచ్చు.

సరదాగానో,సంతోషంగానో
కదలడం మొదలెట్టావో-
అంతే!
నీ ప్రయాణం,ప్రయాస
రెండూ మొదలవుతాయి.

ఆకాశం ఎప్పటికీ అందదు.
నేలమీదే జీవితం సాగదు.
గాలొచ్చిన,వానొచ్చినా భయపడాలి.
గద్దొచ్చినా,పామొచ్చినా దాక్కోవాలి.

కొమ్మపైన గూడు కడ్తే చెట్టుకి,
యేటిలో నీళ్ళు తాగితే కొండకి,
గింజలు ఏరుకుంటే చేనుకి,
ఈకలు రాల్చుకుంటే గాలికి,
సమాధానం చెప్పి తీరాలి!

ఎగరడం తప్ప ఏమితెలీదన్నా,
ఎగరడం నీ తప్పనిసరి అవసరమైనా,
ఎగరకపోతే బతుకేలేదని తెలిసినా,
సమాధానం చెప్పితీరాలి.

పూవులభాషలో మాట్లాడడం
గువ్వలభాషలో పాడుకోవడం
పిల్లలభాషలో పదాలల్లడం కాదు.
మనుషులభాషలో నటించడమూ నేర్చుకోవాలి.

ఎందుకూ పనికిరాని స్వేచ్చతో,
ఎటో ఓ దిక్కుకి ఏడ్చుకుంటూ,ఎగిరిపోతూ,
చెట్టుకి,చేనుకి,యేటికి,గాలికి
వీలైనా కాకున్నా వేగులకి,వేటగాళ్ళకి
సమాధానం చెప్పితీరాలి.

సమాధానం చెప్పేతీరాలి!

*23-08-2012

మోహన్ రుషి //ఎక్కడ?!//

నిన్ను నిన్నుగా గుర్తించినవారు
నువ్వు కాక లోకం లేదన్నవారు
నీతోనే ప్రపంచం అన్నవారు
మాటల్తో స్వర్గం చేసినవారు
నీ మనసు దుర్గాన్ని జయించినవారు
నిన్ను వొంటరిని చేసి
వొదిలేసి వెళ్ళినప్పుడు
నువ్వేం చేస్తావ్?!

ఆశలకు ఆధారంగా నిల్చినవారు
నిరీక్షణకు తెర దించినవారు
హృదయాన్ని సుతిమెత్తగా మీటినవారు
గొంతులోని కొత్తభాషకు కారణమైనవారు
మనసులోని మరో ప్రపంచపు ద్వారం తెరిచినవారు
మత్లావ్ చెప్పకుండా
మాయమైపోయినప్పుడు
నువ్వేమైపోతావ్?!

సంతోషానికి సారథిగా నిల్చినవారు
ఆనందానికి అడ్రస్ గా మారినవారు
గుండెలకు హత్తుకున్నవారు
లోకం గునపాలకు వెరవనివారు
ప్రేమతప్ప ఎరుగనివారు
ఫేంచ్ కట్ అయిన పతంగిలా
చెప్పాపెట్టకుండా చెక్కేసినప్పుడు
నువ్వెక్కడ రోదిస్తావ్?!

గుండెల్లోనా? గురుతుల్లోనా?
జ్ఞాపకాల సమాధుల్లోనా?
సత్యలోకపు దారుల్లోనా?!

*23-08-2012

ప్రవీణ కొల్లి || పుటలు ||

ఈ పుస్తకంలో
నిర్ణీత కాలం గడిచాక
పక్కకు తిరిగిపోయే ఎన్నో ఎన్నో పుటలు
నిన్నటి పేజీలో మరి రాయలేను
రేపటి పుటలో ఏమి రాస్తానో తెలీదు.
నేను, తెల్లకాగితం నేడు నా ముందున్నాయి...

అమ్మ కౌగిలి, కాగితం పడవ
నెమళీక, ప్రేమలేఖ
భద్రంగా దాచేసుకున్నా గడిచిపోయిన పుటలలో ...
ఎదురుదెబ్బ, నిట్టూర్పుల సెగ, గుణపాఠాల పోటు
కన్నీటి దారలలో అలకబడిన అక్షరాలు అక్కడక్కడా....

తరచి తరచి చూస్తే
ప్రతి పుటలలోనూ
మునుపెన్నడూ ఎరగని నేనే!
మరల మరల ఆలోచిస్తే
నన్ను నేను వెతుక్కునే ప్రయత్నమే
అన్ని పుటలలోనూ ....

నిన్నటి అనుభవం అక్కడే
నేటి భావం ఇక్కడే
అనుభవం పాఠాలు నేర్పుతుందా?
ఏమో?!
అవును కాదుల నడుమ ఊగిసలాడుతూనే వుంటుంది
పిచ్చి మనసు.

అనుభవాల సారమే సిరా అనలేను
లిఖించేదే వేదమూ కాదు!
అభిప్రాయాలు మారుతూనే ఉంటాయి
ఆలోచనలు ఎగిసిపడుతూనే ఉంటాయి
ప్రశ్నలు నిలదిస్తూనే ఉంటాయి
ఒక అధ్యాయంలో సమాధానం దొరికినట్టే దొరికి
మరో అధ్యాయం చివరలో
అదే సమాధానం మళ్లీ ప్రశ్నవుతుంది....

ఎన్ని అధ్యాయాలు రాస్తానో తెలిదు
ఎన్ని పేజీలు నింపుతానో అసలే తెలీదు
మార్జిన్లో రఫ్ వర్క్ చేస్తూనే ఉంటాను
అక్కడే కదా జీవితసత్యాలు తెలుసోచ్చేది!

అణుక్షణం ఆత్ర్రం
ప్రతి పుటను ప్రేమగా తీర్చిదిద్దాలని.
నేటితో 365 పేజీలు నిండాయి
అవును...రేపు నా మరో పుట్టిన రోజు.

23-08-2012

కపిల రాం కుమార్ //మా రక్తం కాదూ! //

ఓ స్వాతంత్ర్యమా
నీది అపురూప సుందరనామం
అత్యంత ఆకర్షణీయ రూపం

అలాంటి నీవు
నా మట్టి గోడలపూరిగుడిసెలోకి
వస్తున్నవేమోననుకున్నను!
నీ అడుగుల సవ్వడికోసం
నిరంతరం నిరీక్షిస్తున్నాను!
కాని
డబ్బున్నవాళ్ళతో్
డాబుసరి వెలగబెట్టి
వారి జీవితం మాధుర్యం చేస్తున్నావు!

మొన్న ఒకసారి నిన్నుచూసి
కోపంగా అరిచాను! విన్నవు కావు.
ఓ ధనవంతుణ్ణి సుఖపెత్తడానికి వెడుతున్నావు!

మళ్ళీ ననిన్న
నల్లబజారు యజమాని వళ్ళో రాసక్రీడలో
ములిగినప్పుడు, నిర్ఘాంత పోయాను!

నువ్వేమీ చిన్న పిల్లవి కావు!
విలువకల కాలంలా
శీలంకల్లదానివఅనుకున్నాను!
ఏళ్ళు నిండిన ప్రౌఢవు సుమా!మరి ఈ రోజు
మా ఫాక్టరీ మేనేజరు
ఎర్రలిక్కరు అందిస్తూ నీకు విందు చేస్తున్నప్పుడు
అర్ద్రంగ నా గుండె స్పందదిస్తున్నది!

వాడు గ్లాసులో పోసిందేమిటి?
మా శ్రమ జీవుల్ ర్క్తం కాదూ???
థూ!

*23-08-2012ka

రాళ్లబండి కవితా ప్రసాద్ || ఒక విస్మృతి||

ఇసుక లో నడిచే పాదాలకు
చిగుళ్ళు మొలిచినట్లు
మిట్ట మధ్యాహ్న వేళ
నీ జ్ఞాపకాలు..

మసక చీకటిని ముద్దాడు తున్నట్లు
వర్తమానం తో కాపురం.
వెలుతురును స్వప్నిస్తున్నట్లు
భవిష్యత్తు లోకి నిద్ర.

ప్రతి సూర్యాస్తమయమూ
ఒక గతమే!
ప్రతి వెన్నెలరాత్రి
సుఖ దుహ్ఖాల ద్వంద్వ సందేహమే!

కాలాన్ని ప్రాణ మెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది,
అందుకే,
కాలం లో ప్రాణం కలసి పోతుంది...?

23-08-2012

‎Ro Hith / at toilet complex

In subway station
people going into the toilet complex
are so hazy,
enigmatic, distrubed, weird.
Agitated ponds, their faces are.
Many metropolitan sounds
murmur in their tired garments.
Each one is a river,
flowing into the toilet-ocean.
No sky may fall,
no burden of earth is on their shoulders,
no money-lenders may be chasing them,
and no cinema shooting happens there,
still they all rush.
Stop them and you get a slap for free.

But the same people
when they come from toilet
are like Buddhas.
Like they gave their old slippers to the poor boy on road
soft and kind.
Like they came from a wonderful art-of-life class
silent and nice.
Like they had found all the nirvana in a bathroom
peaceful and calm.

*23-08-2012

రవి వీరెల్లి // వెలితి కుండ //

1
కంటి పాత్రలోకి
ఎన్ని దృశ్యాలు వొంపినా
ఎదురుచూపు తప్ప
ఏమీ మిగుల్చుకోదు.

2
బికిని వేసుకుని వోరగా చూస్తూ
వేడివేడి పగళ్ళ ఇసుకతిన్నెల మీంచి
తెప్పున అలా శీతాకాలం అలల్లోకి మాయమయ్యే
వేసవిలా
ఋతువులు ఊరిస్తూ ఊరిస్తూ కరిగి
శూన్యం వెలితి పూరిస్తూనే ఉంటాయి.
చెయిజారిపోయిన అందమైన క్షణాల్ని
ఎప్పటికీ పూర్తికాని కాలం కాన్వాస్ మీద
కవిత్వీకరించడానికి
రంగుల్ని రుబ్బుతూనే ఉంటాయి
అమాయకపు ఆకురాల్చుకాలాలు.

3
కన్నూ
కాలమూ
ఎప్పుడూ వెలితి కుండలే.

కవిత్వంలా.

*23-08-2012

క్రాంతి శ్రీనివాసరావు || దారితప్పిన కన్ను ||

రెప్పలులేని చేపకన్ను వీడిది,
కన్నీళ్ళే మాత్రమూ కనబడనిది
బ్రేకులేకుండా ఇరవై నాలుగు గంటలూ
బ్రేకింగు న్యూసులు సరఫరా చేస్తుంది

వొంటికన్ను రాక్షసుడు వీడు
ఓకే కన్నున్న శుక్రాచార్యుడికి తోడు

అరచేతిలో కేమెరా కన్నెట్టుకొని విర్రవీగుతున్నాడు
అరికాలులో కన్నున్న బృగుమహర్షి ననుకొంటున్నాడు
వాసుదేవుని వక్షస్తలంపై తన్నినప్పుడు
జరిగిన సంగతి తెలియజెయ్యాలిప్పుడు

వొళ్ళంతా కన్నులేసుకున్న ఇంద్రుడననుకొంటున్నాడు
వెకిలి శృంగారచేస్టలు వెలగబెడుతున్నాడు
పరమశివుని మూడోకన్ను తెరచినప్పుడు
మాడి మసయున మన్మధున్ని మరచినట్లున్నాడు

గ్రద్ద కళ్ళెట్టుకొని వీడు
గమనించాల్సినవి విడిచిపెట్టి
సెలబ్రిటీల బెడ్రూముల్లోకి తొంగిచూస్తుంటాడు

గుడ్లగూబ కళ్ళేసుకొని
చీకటి తెరలమాటున జరిగిన నేరాలను ఘోరాలను
భయానకంగా అనవసరంగా గుర్తుచేస్తుంటాడు

కన్నులున్నా వాడకుండా రాడార్ సిగ్నల్స్ నమ్ముకున్న గబ్బిలంలా
రేటింగ్స్ కోసం కేమెరా కన్నుల్ని తాకట్టుపెడుతుంటాడు

కులం తోలు కప్పుకొని రాజకీయ రంగులేసుకొని
అందరికంటే ముందే ఎక్స్లూజివ్ ముసలికన్నీరు కారుస్తుంటాడు

24ఇంటూ7 చిరుతపులి కళ్ళతో చెలరేగుతూనే
ఇంటింటికి నిజాన్ని చెప్పల్సినవాడు
లంచాలనాలతో

ర్ధాం

రం
గా
వార్తను వధిస్తుంటాడు
మరో సంచలనానికై
సరికొత్త టీజర్ బాణం
సందిస్తూనే వుంటాడు

దృశ్యాలకు నోళ్ళుపెట్టి దుర్మార్గాలను ఆపాల్సినవాడు
నిజం నీడల జాడలు పట్టి చరిత్రకోసం దాయాల్సిన వాడు
అజాగళ స్తనమై అఘోరిస్తున్నాడు

ఫొర్తెస్టేట్ గా నిలబడాల్సినవాడు
లేపాక్షీ ఆలయంలో వ్రేలాడే స్తంభమై ఊరేగుతున్నాడు

*23-08-2012

అనిల్ డాని // నేను నిశబ్దం లో //

ష్ ...............
నిశబ్దం నేను
నా మౌనం తో
మాట్లాడుతున్నాను

నా తప్పులన్నీ నా మౌనం లో
వెతుక్కుని సరిదిద్దుకుంటున్నాను
సవ్యమైన అంతరాత్మ దిశలో వెళుతూ

కఠిన నిర్ణయాల కలబోతకు
సమయం ఆసన్నమైంది
నన్ను నేను వెతుక్కుంటున్నాను
నేను తప్పి పోయిన చోట

దేవుడో ,లోకమో ,స్నేహితులో
పరిసరాలో, అవసరమో ఇంకోటో
తప్పు చేయించినా చేసింది నేను
అందుకే దిద్దుకుంటున్నా

విశ్వ అంతరాళం లో విసిరేయబడ్డ
నా పాపాలన్నిటిని ఏరి ఒక చోట కూర్చి
నిష్కృతి కోసం ఆచరణ సాద్యమైయిన
అవకాశాన్ని అందుకుంటున్నాను
నా మౌనం లో నన్ను నేను వెతుక్కుంటూ

*23-08-2012

శ్రీకాంత్ ||ఆమె నా తల్లి||

ఆమె నా తల్లి - శ్రీకాంత్
-----------------------
ఆమె నా తల్లి

ఇద్దరూ ఒకరికొకరు దూరంగా
ఇద్దరూ ఒకరికొకరు సమీపంగా

దూరానికి దూరమై
ఇంత దూరం ఎలా అయ్యమో తెలీదు
తను తనయుడిగా, తన తనయుడు
తల్లిగా ఎలా మారిందీ తెలియదు

అప్పుడప్పుడూ చూస్తాను తనని
కొంత కరుణతో
అప్పుడప్పుడూ పిలుస్తాను తనని
కొంత ప్రేమతో

తననే, నన్ను ఇంతకాలం పొదివి పుచ్చుకున్న తన కళ్ళనే
నాకు చూపునిచ్చి, ఎగరటం నేర్పించి
తను నరుక్కున్న తన రెక్కలనే
వడలిపోయి, అలసిపోయిన తన
మృదు మధురమైన వదనాన్నే-

చలికి ముడుచుకు కూర్చుని, ఆవరణలో
నీడలతో మమేకమై
నీడగా మారిన తననే, చరమాంకంలో
ఎదురుచూస్తున్న తననే
నేను అప్పుడప్పుడూ తాకుతాను-

చెట్లకు ఆవలగా, పిల్లల అరుపులకు పైగా
తెల్లటి కాంతితో ప్రజ్వరిల్లుతున్నఆకాశంలోకి
ఖాళీగా సాగిన ఆమె చూపుల మధ్యకు
దిగులుతో కూడిన ఆమె అరచేతుల మధ్యకూ
ఒక పసుపు పచ్చని పిట్టనై వాలదామని
ప్రయత్నిస్తూ ఉంటాను-

ఇలాగే ఉంటుందేమో, ఇలాగే సాగుతుందేమో
సమయం, ఎవరూ ఎవరికీ
ఏమీ కాని ముదుసలి సమయం
ఎవరూ ఎవరికీ చెందని నిరీక్షణా వలయం-

తను నా తల్లి. ఒక పిలుపుకై,
తన తల్లి తిరుగాడుతున్న రంగుల ప్రపంచంకై
బాల్యంలో ఆటలాడిన పూలతోటలకై
వొదిలివేసిన కలలకై ఏం చేయాలో తెలియక
అలా ఎదురుచూస్తున్న
తను నా పిచ్చి తల్లి-

అనునయించనూ లేను
గుండెల నిండాగా
హత్తుకోనూ లేను

ఆమెకు తల్లినీ కాలేను,
ఆమెకు నా స్తన్యం
అందించనూ లేను. ఇక

కురుస్తున్న సమయమంతా
వేచి చూస్తున్న సమయమంతా

ఇద్దరమే, ఎదురెదురుగా బెదురుబెదురుగా
ఒకరికొకరు దూరంగా
ఒకరికొకరు సమీపంగా

దూరానికి దూరమై
పరచిత అపరిచితులమై
కాందీశీకులమై

మనమందరమంతా
అనంతం దాకా-

*23-08-2012

డా.పులిపాటి గురుస్వామి|| ఐతుందంతా కానున్నదే ||


దురదృష్టం ఏదీ లేదు
అదృష్టం అంతకన్నా లేదు

ఆకాశం నుండి రాలే చినుకుల్ని
ఒక్కోరకంగా ఒక్కోడు వాడుకుంటాడు

ఏడవటం లో ఒకడికి త్రుప్తి
ఏడిపించడంలో మరొకడికి
ఏదో ఓ సమయంలో రెండు అవతారాల్ని
తొడుక్కుంటావ్

ఏదో ఒకరోజు
నీ వాహనం మీద ప్రయాణించిన కొంతసేపటికి
''ఇది ఇంతేగా''అని
కునిర్దారణకు దిగి
కరుకు నిగ నిగ వెకిలి నవ్వు
భుజం మీద కప్పుకుంటావు

వాహనం అదుపు తప్పిన వేగానికి
నువ్వు పట్టుదప్పి
రోడ్డు మీద రక్తపు కుప్పలో తేలతావ్
రెండు చేతులు మాత్రం
చప్పట్లు కొడతాయి
అవి నీవే

ఏదేమైనా
నువ్వు పూల భాషలో
జీవించ నంతకాలం
మనుషుల చావు తప్పదు .