కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు పోస్టు ఆలస్యంగాను, చాలా చిన్న పోస్టు పెడుతున్నందుకు పాఠకులు మన్నించాలి. ఈ శుక్రవారం గాలిబ్ కవితల్లో కేవలం ఒకే ఒక్క కవిత మాత్రమే పోస్టు చేస్తున్నాను. గాలిబ్ సంకలనంలోని 14వ గజల్ మొదటి రెండు షేర్లు ఈ రోజు చూద్దాం బజ్మె షహిన్ షా మేం అష్ ఆర్ కా దఫ్తర్ ఖులా రఖియో యా రబ్, యే దరె గంజీనయె జోహర్ ఖులా షబ్ హుయీ ఫిర్ అంజుమె రక్షందా కా మంజర్ ఖులా ఇస్ తకల్లుఫ్ సే కె గోయా బుత్కదే కా దర్ ఖులా చక్రవర్తి దర్బారులో తెరుచుకుంది కవితల విభాగం దేవుడా, తెరిచే ఉంచు ఎల్లప్పుడు దీని వైభోగం రాత్రయ్యింది, నక్షత్రాలు పొదిగిన ఆకాశం తెరుచుకుంది. ఒక మందిర ద్వారంలా వైభవంగా తెరుచుకుంది ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. బజ్మ్ అంటే దర్బారు, సమావేశం, సభ అని అర్ధం. షహీన్ షా అంటే చక్రవర్తి (ఇక్కడ బహదూర్ షా జఫర్ని ఉద్దేశించి రాసారు). అష్ ఆర్ అంటే షేర్ కు బహువచనం అంటే కవితలని అర్ధం. దఫ్తర్ అంటే కార్యాలయం, కార్యాలయ విభాగం, లేదా వివరాలు నమోదు చేసే రిజీష్టర్ అని కూడా అర్ధం. దర్ అంటే తలుపు. గంజీనా అంటే ఖజానా లేదా ఒక పెద్ద గుట్ట. జోహర్ అంటే ప్రతిభ, నైపుణ్యం, కౌశలం వగైరా అర్ధాలు ఇక్కడ వర్తిస్తాయి. అంజుమ్ అంటే నక్షత్రం. రక్షందా అంటే మెరిసేది, ప్రకాశించేది. మంజర్ అంటే దృశ్యం. తకల్లుఫ్ అంటే ఆడంబరం అని ఇక్కడ అర్ధం. షబ్ అంటే రాత్రి. బుత్ అంటే విగ్రహం. బుత్కదా అంటే విగ్రహాలయం అంటే మందిరం. గాలిబ్ 14వ గజల్ లోని మొదటి రెండు కవితలివి. ముగల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ కవితా పోషకుడు, కవిత్వాన్ని చాలా అభిమానించేవాడు. స్వయంగా చక్రవర్తి కూడా పేరెన్నికగన్న కవి. ఆయన హయాంలో ఎర్రకోటలో కవితాగోష్ఠులు నిర్వహించేవాడు. ఈ గజల్ మొదటి రెండు పంక్తుల్లో గాలిబ్ అలాంటి కవితాగోష్ఠి వైభవాన్ని చెప్పాడు. ఆయన ఈ గజల్ దైవప్రార్ధనతో ప్రారంభించాడు. ఈ సమావేశం లేదా ఈ కవితాగోష్ఠి ప్రతిభకు ఖజానా వంటిదని, ఇది శాశ్వతంగా ఇలాగే నడుస్తూ ఉండేలా చేయమని దేవుడిని ప్రార్ధించాడు. తర్వాతి రెండు పంక్తుల్లో గాలిబ్ ఆకాశాన్ని వర్ణించాడు. అది కూడా రాత్రిపూట ఆకాశం. కవితాగోష్ఠి కూడా సాయంత్రం వేళల్లోనే ప్రారంభమై ఉంటుంది. రాత్రి అరుదెంచింది. ధగధగలాడే నక్షత్రాలు పొదిగిన ఆకాశం తెరుచుకుంది. మందిరంలో దేదిప్యమానమైన దీపశిఖల మధ్య కనబడే విగ్రహంలా ఆయనకు ఆకాశం కనిపించింది. హిందువులకు మందిరం పవిత్రమైనది. గుళ్ళో వెలుగుతున్న దీపాలు కూడా పవిత్రమైనవిగా భావిస్తారు. ఇస్లామీయ విశ్వాసాల ప్రకారం దేవుని సింహాసనం స్వర్గలోకాన ఉంది. దాన్ని ’’అర్ష్‘‘ అంటారు. ఆయన సింహాసనం దేదిప్యమానంగా వెలుగుతున్న నక్షత్రాల మధ్య ఉంది. సూర్యుడస్తమించి, పగటి కార్యకలాపాలకు తెరపడిన తర్వాత, గొప్ప ఆడంబరంగా రాత్రికి తెరలేచింది. పగలు అస్తమించి, మిలమిలలాడే తారకలతో ఆకాశం ఉదయించడమన్నది, తలుపులు తెరుచుకోగానే గుళ్ళో కనబడే దేదిప్యమాన దీపాల్లా గాలిబ్ కు కనబడింది. ఉర్దూకవులు తమ ప్రేయసిని అందమైన విగ్రహంతో పోల్చడం కూడా మనకు తరచు కనబడుతుంది. ఉర్దూలోనే కాదు, పర్షియన్, అరబ్బీ కవితల్లోను ఈ ధోరణి ఉంది. విగ్రహం గుళ్ళో ధగధగలాడే దీపాల మధ్య అత్యంత ఆడంబరంగా, వైభవోపేతంగా, పూజారుల పూజాదికాలు అందుకుంటుంది. తమ ప్రేయసిని ఈ స్ధాయిలో ఒకవిధంగా ఆరాధించడం ఉర్దూ కవితల్లో కనబడుతుంది. అయితే చాలా జాగ్రత్తగా, విగ్రహారాధన అరోపణలు తమపైకి రాకుండా, మరోవైపు హిందూ మతవిశ్వాసాలు దెబ్బతినకుండా జాగ్రత్తపడడం గమనించదగ్గ విషయం. గాలిబ్ పై కవితలో అత్యంత సమ్మోహనంగా ఈ పోలిక చెప్పాడు. నక్షత్రాలతో ధగధగలాడుతూ ఉదయించిన ఆకాశం, గుడి తలుపులు తెరుచుకున్నప్పుడు దేదిప్యమానమైన దీపాల దృశ్యంలా కనబడిందంటున్నాడు. గుడి దీపాలను నక్షత్రాలతో పోల్చడమన్నది అద్భుతం. ఈ రెండు షేర్లలోను ఖాఫియా రదీఫ్ నియమాన్ని పాటించాడు. నిజానికి గజల్ మొదటి షేర్ ఒక్కదాంట్లో ఈ నియమాలను పాటిస్తే చాలు. కాని రెండు షేర్లను మత్లాగా రాయడం గమనించదగ్గది. దీంట్లో రెండవ షేర్ ను మత్లాయే సానీ అంటారు. రెండవ మత్లా. ఇలా రెండు మత్లాలు రాయడంలో మరో విశేషమేమంటే, ఈ రెండు షేర్లకు ఆయన సమాన ప్రాముఖ్యం ఇచ్చాడు. మొదటి షేర్ లో చక్రవర్తి దర్బారులో కవితాగోష్ఠిని ఒక గొప్ప ప్రతిభల ఖజానాగా పేర్కొన్నాడు. దీన్ని కాపాడాలని దేవుడిని ప్రార్ధించాడు. ఈ కవితాగోష్ఠిలోని ప్రతి కవి నిజానికి ఒక ధగధగమెరిసు నక్షత్రం లాంటి వాడు. కవితాగోష్ఠి ప్రారంభమవుతున్నప్పుడు, రాత్రి ఉదయించించింది. తళతళమెరిసే నక్షత్రకాంతులతో. కవితాగోష్ఠిలోని కవులను ఆకాశంలోని తారకలుగూ సూచనాప్రాయంగా చెబుతూ, ఆ వెంటనే ఈ దృశ్యం గుడితలుపులు తెరుచుకున్న దృశ్యంలా ఉందంటూ మూడు దృశ్యాలను మన కళ్ళముందు ఉంచాడు. వచ్చే శుక్రవారం మరిన్ని గాలిబ్ కవితలు చూద్దాం. అంతవరకు అస్సలాము అలైకుమ్.
by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/QmG2iJ
Posted by
Katta