కవిత్వమై గెలిచిన తెలంగాణ తెలంగాణ మలి దశ ఉద్యమంలో కవులు నిర్వహించిన పాత్ర మరువలేనిది. సాహిత్య పేజీల్లో నిరంతరం కవిత్వం ఊట లాగా వెలువడుతూనే ఉండింది. వేలాది కవితలు, వందలాది సంపుటులు, పదుల సంకలనాలు వెలుగు చూశాయి. ఎన్నో సంస్థలు ఏర్పడి మొదలు కవిత్వం ద్వారానే తెలంగాణ ఆకాంక్షను వ్యక్తపరిచాయి. ఉద్యమం పక్కదారి పట్టినప్పుడల్లా తెలంగాణ కవులు హెచ్చరికలయ్యారు. ఉద్యమం వెనకపట్టు పట్టినప్పుడల్లా ముల్లుగర్రలతో అదిలించారు. ఈ క్రమంలో తెలంగాణ కవులు ఎక్కడా వెనకడుగు వేసిన దాఖలా కనిపించదు. ఆత్మవిశ్వాసంతో ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు నిలదీస్తూ ముందుకు సాగారు. యుద్ధ వీరులని తలపించారు. రాజకీయ ఉద్యమం చతికిల పడిన సందర్భాలొచ్చి నప్పుడల్లా కవిత్వంతో జవసత్వాలనిచ్చే ప్రయత్నం చేశారు. ఉద్యమమైనా మొదట కవిత్వంలో వ్యక్తమవుతుంటుంది. భావ కవి త్వం, అభ్యుదయ, విప్లవ, స్త్రీవాద, దళిత, ముస్లిం, తెలంగాణ కవిత్వా లు ఆయా ఉద్యమాల్లో తొలి దశలో తమ వంతు పాత్ర నిర్వర్తించాయి. మిగతా ఉద్యమాల కన్నా తెలంగాణ ఉద్యమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఉద్యమం రాజకీయ ఉద్యమంతో మమేకమై చివరికి తమ ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతో కార్యరూపం దాల్చడంతో సఫలీకృతమైంది. తెలుగు సాహిత్యం పేరు మీద తెలంగాణ సాహిత్యానికి అన్యాయం జరిగింద ని, వివక్షకు గురైందని స్పృహలోకి వచ్చిన తెలంగాణ కవులు ఎన్నో ప్రశ్నలు సం« దిస్తూ కవిత్వం రాయడం వరకే పరిమితం కాకుండా కార్యాచరణలోకి దిగారు. తమ భాష, సంస్కృతి వేరని ఎలుగెత్తి చాటారు. ఉద్యమానికి ఊతమయ్యారు. 1969 ఉద్యమం సందర్భంలో భావజాల రంగంలో సమైక్యాంధ్ర భావనదే పైచేయి అయింది. కాని మలిదశ ఉద్యమంలో తెలంగాణ కవులు, కళాకారులు కవిత్వం ద్వారా పాట ద్వారా అనేక పుస్తకాల ద్వారా భావజాల రంగంలో సమైక్యాంధ్ర భావనను పూర్వపక్షం చేసి సీమాం«ద్రులపై పైచేయి సాధించగలిగారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎందరో కవులు నిలిచి వెలిగితే, మరెందరో పుట్టుకొచ్చారు. కాళోజీ లాంటివారు మొదట్లో సమైక్యవాది అయినప్పటికీ త్వరలోనే ఆయన తెలంగాణ వాదిగా మారి, 'ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేర దాకా తరిమికొడతాం/ప్రాంతం వాడే మోసం చేస్తే ప్రాంతంలోనే పాతర వేస్తాం' అనేంత తీవ్ర స్థాయిలో కవిత్వం రాశారు. 1995 నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమం రాజుకుంది. 1998లో తెలంగాణ కవులు, సాహిత్యకారులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, నందిని సిధారెడ్డి, కె.శ్రీనివాస్, అంబటి సురేంద్రరాజు, కాసుల ప్రతాపరెడ్డి తదితర ముఖ్యులు కూడి తెలంగాణ సాంస్కృతిక వేదికను ఏర్పర్చుకున్నారు. ఐదుగురు కన్వీనర్లుగా- సురేంద్రరాజు, సుంకిరెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, అనిశెట్టి రజిత, స్కైబాబ ఎంపికయ్యారు. ఎన్నో కవిసమ్మేళనాలు, సదస్సులు జరిగాయి. ఈ సంస్థ తరఫునే సురేంద్ర రాజు, సుంకిరెడ్డి సంపాదకత్వంలో 'మత్తడి' (2002 డిసెంబర్) అన్న బృహత్ కవితా సంకలనం వెలువడింది. ఇందులో 1917 నుంచి 1952 వరకు ఒక విభాగం, 1952 నుంచి 1998 వర కు రెండవ విభాగం, 1995 నుంచి 2002 వరకు మూడవ విభాగంగా విభజించి మొత్తంగా 258 మంది కవిత్వాన్ని సంకలనం చేశారు. 2002 నాటికి తెలంగాణలో పేరుబడ్డ కవులందరూ ఇందులో ఉన్నారనే చెప్పవచ్చు. 'మత్తడి' రూపుదిద్దుకుంటున్న సమయంలోనే జూలూరి గౌరీశంకర్ సంపాదకత్వం లో 'పొక్కిలి' (2002 మే) సంకలనం వెలువడింది. 129 మంది కవిత్వం ఇందులో చోటుచేసుకుంది. అప్పటికే లబ్దప్రతిష్ఠులైన సిధారెడ్డి, సుంకిరెడ్డి, జూకంటి జగన్నాధం, ఎస్.జగన్‌రెడ్డి, అఫ్సర్, సిద్ధార్థ, దెంచనాల శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి, జూలూరి గౌరీశంకర్, అమ్మంగి వేణుగోపాల్, ఆశారాజు, నాళేశ్వరం శంకరం, షాజహానా, అన్నవరం దేవేందర్, అన్వర్, స్కైబాబ, పొట్లపల్లి శ్రీనివాసరావు, వఝల శివకుమార్, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, కోడూరి విజయకుమార్ తదితరులు తెలంగాణ కవిత్వం రాశారు. గద్దర్, గూడ అంజయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న తదితర వందలాది మంది వాగ్గేయకారులు తెలంగాణ ఉద్యమంలో పాటల రూపంలో కవిత్వాన్ని పండించారు. వేముల ఎల్లయ్య, ఎం.వెంకట్, సీతారాం, ప్రసేన్, యాకూబ్, అయిల సైదాచారి, పగడాల నాగేందర్, అంబటి వెంకన్న, బెల్లి యాదయ్య తదితరులు ఎంతోమంది రాసిన కవిత్వం తెలంగాణ కవిత్వానికి అదనపు సౌందర్యాన్ని, వస్తు విస్తృతిని అందించింది. రెండేళ్ల తర్వాత సిధారెడ్డి ఆధ్వర్యంలో ఆయనే అధ్యక్షుడుగా తెలంగాణ రచయితల వేదిక ఏర్పడింది. తెరవే అన్ని జిల్లాలకు విస్తరించడమే కాకుండా ఎందరో కొత్త కవులకు ఊతమందించింది. 'సోయి' అనే పత్రికను వెలువరించింది. అనేక సభలు సమావేశాల ద్వారా ఉద్యమ కవిత్వం విరివిగా పుట్టుకొచ్చేలా కృషి చేసింది. 2007లో జూకంటి జగన్నాధం, జూలూరి గౌరీశంకర్ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికై ఈ సంస్థ మరెన్నో కార్యక్రమాలు తీసుకుంది. 2012లో ఈ సంస్థకు సూరేపల్లి సుజాత కార్యదర్శిగా ఎంపికయ్యారు. 2006లో సుంకిరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబ, పసునూరి రవీందర్ తదితరుల పూనికతో 'సింగిడి' తెలంగాణ రచయితల సంఘం ఏర్పడి ఎన్నో సదస్సులు, సభలు నిర్వహించడంతోపాటు కొన్ని విశిష్టమైన సంకలనాలు వెలువరించింది. '1969-73 తెలంగాణ ఉద్యమ కవితా' సంకలనం కూడా ఈ సంస్థ వెలువరించింది. 2009లో 'జాగో..జగావో' పేర ప్రొ.జయశంకర్ ప్రారంభోపన్యాసంతో ఒక రోజంతా జరిగిన కవిసమ్మేళనంలో వచ్చిన కవితలకు మరిన్ని పాటలు జోడించి 'జాగో..జగావో' తెలంగాణ ఉద్యమ కవిత్వం పేర 120 మందికి పైగా కవులతో సంకలనం వెలువడి మలి ముద్రణ కూడా పొందింది. కెసిఆర్ నిరాహారదీక్ష తర్వాత నడిచిన ఉద్యమంలో ఈ సంకలనంలోని పాటలు, కవితలు విద్యార్థులకు, ఉద్యమకారులకు ఎంతో తోడ్పడ్డాయి. టాంక్‌బండ్‌పై విగ్రహాల కూల్చివేత సందర్భంలో 'దిమ్మిస' వినిర్మాణ కవిత్వం పేర 51 మందితో ఒక సంకలనం వెలువడడం విశేషం. ఈ సంకలనం వల్ల కూల్చివేత పట్ల ఎక్కువ వ్యతిరేకత రాకుండా తెలంగాణ కవులు చేయగలిగారు. శ్రీకృష్ణకమిటీ రిపోర్టు వెలువడిన వెంటనే ఆగ్రహోదగ్రులైన కవులు 31 మంది దాకా కలిసి తీసుకొచ్చిన 'క్విట్ తెలంగాణ' సంకలనంలోని కవితలు వివాదాస్పదమవడం తెలిసిందే. తెలం గాణ వ్యతిరేకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ కవులను మొత్తం ఆంధ్రా ప్రాంతంవారి వ్యతిరేకులుగా చిత్రించే ప్రయత్నం జరిగింది. అనంతరం 'మునుం' పేర 256 మంది కవులతో మరో సంకలనం వేముగంటి మురళీకృష్ణ, వఝల శివకుమార్, అందెశ్రీ, కాంచనపల్లి, దాసరాజు రామారావు తీసుకొచ్చారు. అయితే ఈ సంకలనంలో తెలంగాణేతరులు రాసిన కవిత్వం కూడా చేర్చడం పలు విమర్శలకు దారితీసింది. తర్వాత అనిశెట్టి రజిత పూనికతో 100 మందికి పైగా కవులతో 'జిగర్' సంకలనం వెలువడింది. డా.ఖుతుబ్ సర్‌షార్, స్కైబాబ సంపాదకత్వంలో 'రజ్మియా' తెలుగు-ఉర్దూ సంకలనం (36 మంది తెలుగు ముస్లిం కవులు, 31 మంది ఉర్దూ కవులు) వెలువడింది. తెలంగాణ జాతిపిత జయశంకర్ చనిపోయిన సందర్భంలో జూలూరు సంపదకత్వంలో 'జయశంకరా', వేముగంటి మురళీకృష్ణ సంపాదకత్వంలో 'జయశిఖరం' కవితా సంకలనాలు వెలువడ్డాయి. ఇవే కాక వివిధ జిల్లాల నుంచి ఎన్నో సంస్థలు ఎందరెందరో కవులతో సంకలనాలు వెలువరించాయి. కొన్ని జిల్లాల కవులతో ప్రత్యేకమైన సంకలనాలు కూడా వెలువడ్డాయి. ప్రత్యేక సంచికల్లోనూ కవిత్వం విరివిగా చోటుచేసుకుంది. రెండు సంచికలుగా వెలువడిన 'ముల్కి' పత్రికలోనూ, మరెన్నో ఛోటా మోటా పత్రికల్లోనూ తెలంగాణ కవిత్వమెంతో అచ్చయింది. అన్వర్, సుంకర రమేష్, అన్నవరం దేవేందర్ లాంటివారు పత్రికల్లో అచ్చయిన కవిత్వాన్ని సంకలనాలుగా వెలువరించారు. అఖిల భారత తెలంగాణ రచయి తల వేదిక ఇతర రాష్ట్రాలలోని కవులను కూడా ఉద్యమంలో భాగం చేసింది. మొత్తంగా తెలంగాణ కవుల్లో తెలంగాణ కోరుకోని కవి ఒక్కరూ మిగలలేదంటే, తెలంగాణపై ఒక్క కవిత కూడా రాయని కవి మిగల్లేదంటే అతిశయోక్తి కాదేమో! ఉద్యమం పక్కదారి పట్టినప్పుడల్లా తెలంగాణ కవులు హెచ్చరికలయ్యారు. ఉద్యమం వెనకపట్టు పట్టినప్పుడల్లా ముల్లుగర్రలతో అదిలించారు. ఈ క్రమంలో తెలంగాణ కవులు ఎక్కడా వెనకడుగు వేసిన దాఖలా కనిపించదు. ఆత్మవిశ్వాసంతో ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు నిలదీస్తూ ముందుకు సాగారు. యుద్ధ వీరులని తలపించారు. రాజకీయ ఉద్యమం చతికిల పడిన సందర్భాలొచ్చినప్పుడల్లా కవిత్వంతో జవసత్వాలనిచ్చే ప్రయత్నం చేశారు. ఉద్యమంలో భాగంగా వివిధ సందర్భాల్లోనూ విభిన్నంగా, విరివిగా కవిత్వం వచ్చింది. 'తెలంగాణ ఎప్పుడు? ఎట్లా?' 'ఇప్పుడేం చేద్దాం', 'తెలంగాణ కవుల గర్జన', 'విద్రోహదినం', 'యుద్ధభేరి', 'సిర్ఫ్ తెలంగాణ' అంటూ పూట పూటంతా, రోజు రోజంతా కవిసమ్మేళనాలతో ఉద్యమం ఉర్రూతలూగింది. ఆత్మహత్యలు, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం ఇలా ఎన్నో సందర్భాలు పోరాట రూపాలై కవిత్వం పలికాయి. తెలంగాణ ఉద్యమం పలికించిన వివిధ రూపాలు- దూలా, బతకమ్మ, బోనాలు, రాస్తారోకోలు, రహదారుల బంద్, రోడ్లమీద వంటావార్పు-సామూహిక భోజనాలు లాంటివన్నీ కవిత్వంలోనూ ప్రతీకలయ్యాయి. సబ్బండ వర్ణాల వృత్తులన్నీ ఉద్యమంలో నిరసన రూపాలవడం, ప్రతీకలవడం విశేషం. ఇట్లా ఒక ఉద్యమం ఇన్నేసి రకాల కవిత్వాన్ని అందివ్వడం అరుదేనేమో! అయినప్పటికీ అవన్నీ ఉద్యమానికి ఊతమందించాయనడంలో సందేహం లేదు. తెలంగాణ ఏర్పడుతున్నది కాబట్టి ఇక ముందు తెలంగాణ కవులు రాశి కన్నా వాసి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. మరింత బలమైన, లోతైన భావంతో, విభిన్న కోణాల నుంచి కవిత్వాన్ని అందించాల్సి ఉంది. తెలంగాణ కవిత్వం మరింత విస్తృతి పెంచుకోవాల్సి ఉంది. -స్కైబాబ
by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nrO9qt
Posted by
Katta