21, సెప్టెంబర్ 2013, శనివారం
కవిత్వ విశ్లేషణ
బూర్ల వెంకటేశ్వర్లు-ఎన్నీల ముచ్చట్లు
తెలుగులో ప్రాంతీయ ఉద్యమం బలపడిన తరువాత తెలంగాణా నుడికారానికి
కవిత్వముఖంగా ప్రధాన పరికరంగా ఉనికి ఏర్పడింది.ఇది ఉద్యమంలోని ఉద్వేగాన్ని
సారవంతంగా,సహజాతి సహజంగా అందించింది.ఈ సందర్భంలోనే ఈ నుడికారంలో అభివ్యక్తి
సంబంధమైన కవిత రాయవచ్చాలేదా అనే చర్చలు జరిగాయి.బూర్ల వెంకటేశ్ కవిత
అందుకు సమాధానం చెబుతుంది.
వెన్నెలని ఆధారం చేసుకొని చాల గొప్ప భావచిత్రాలతో ఈ కవితని నిర్మించారు
బూర్ల.బూర్ల దర్శనంలో తన్మయీ భావంకనిపిస్తుంది.వెన్నెలని చాలా భిన్నంగా
తెల్లటి దుప్పటిలా,పాలలా,వరిగొలుకల్లా,వ ెండిలా,తెల్ల
కాయితంలా అనేకరూపాల్లో చూస్తున్నాడు.బూర్ల దర్శనంపై వర్ణ(colour) ప్రభావం
కనిపిస్తుంది.నిజానికి వెన్నెలని చల్లనిదనేదృష్టితో చూస్తారు.
"ఎన్నీల ముచ్చట్లు ఎన్నని చెప్పాలె
నేను ఇంట్ల ఉంటే/కిటికిలకెల్లి తొంగి చూస్తది
బైటికివోతె/ఆగమేఘాలమీద ఎంటవడి అస్తది"
"రాత్రిరాత్రంత/తెల్లటి దుప్పటిగప్పి
నా ఇంటిమీద కావలిగాస్తది/కండ్లుమూసుకుంటే
మనుసుల కూసోని/తెరచాటు ముచ్చటవెడ్తది"
"పొద్దుగాల పాలువిండేటప్పుడు
సర్వలదునికి జాక్కుంటది"
"ఆకాశంల నిలవడి నాకోసం తపస్సుజేసి/వరిగొలుకల అవతారమెత్తి
నా గుండిగెల నిండుతది/సముద్రం గుండెమీద తన బొమ్మచూయించి
రమ్మని చేతులు చాపుతె/తనవెండినంత వాని మొకమ్మీద కుమ్మరిచ్చి
తనమనుసు తెల్లకాయిదం జేసి/నాకు ప్రేమలేఖ పంపిస్తది"
వెన్నెలని తాను ఎంతగా అనుభవించాడో అంతగా అభివ్యక్తం చేసారు.కోడ్
చేయగలిగితే అన్నివాక్యాలు అంతే బలమైనవి.తెలంగాణా ప్రజా వ్యవహారంలోని భాషలో
ఉన్న మార్దవాన్ని,మాధుర్యాన్ని చక్కగా ఉపయోగించుకున్న కవిత ఇది.సాధారణంగా
తెలంగాణా భాషను ఉపయోగిస్తున్న సందర్భంలో నామవాచకాలు ఉపయోగించడం ఎక్కువ
కనిపిస్తుంది.వెంకటేశ్ క్రియలని కూడ సమర్థవంతంగా ఉపయోగించాడు."తొంగి
చూసు/ఎంటవడు/ముచ్చటవెట్టు/ దునుకు/జాక్కొను/కుమ్మరిచ్చు/ ఇనుకుంట"ఇలాంటివి కనిపిస్తాయి.
"చెప్పాలె/ఉంటే/వోతె 'లాంటి క్రియలుకూడా సహజత్వాన్ని ప్రదర్శిస్తాయి.కవిత్వానికి బూర్ల కొత్తకాదుకాని తనని నిలబెట్టే
కవితలో ఇదీ ఒకటవుతుంది.
"ఆమె కాళ్ళపట్టీల నుంచి రాలిపడ్డ గజ్జెలు
పక్షులగొంతుల్ల చేరి
ఉదయపు పాటలైతయ్"
ఇలాంటి మంచి ఊహలతో,భావచిత్రాలతో వెంకటేశ్ మరిన్ని మంచికవితలని అందిస్తడని ఆశిద్దాం.అభినందనలు బూర్ల వెంకటేశ్ గారు.
______________ఎం.నా రాయణ శర్మ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)