పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
కాశి రాజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కాశి రాజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జూన్ 2014, సోమవారం

కాశి రాజు కవిత

మెట్టు దిగేటపుడు తూలే నా అడుక్కి తోడైన చేతుల్ని ఇంకా పట్టుకూనే ఉన్నా ! అందని సైకిల్ ఎక్కుతున్నపుడూ, ఫెడల్ జారి పడిపోయినపుడూ కొట్టుకుపోయిన చేతుల్ని , ఆ చేతికంటిన మట్టిని ఇంకా గుర్తు పెట్టుకునే ఉన్నా బోడి మొలమీద బొందులాగూని ఎక్కించి కట్టిన చేతిని పదో తరగతి పాసైనపుడు తాయిత్తు చేతికి వాచీ పెట్టిన చేతినీ మొన్నీమధ్యే ముద్దెట్టుకున్నా! పాతికేళ్ళకు ఇంకా పాత మొలతాడే ఎందుకుందో తెలుస్తున్నాక ఒకడి చేతులెపుడూ అద్భుతాల్ని చేస్తాయని అనిపిస్తున్నాక ఆశానికి ఎత్తుకుని అరికాలు ముద్దెట్టుకునే మా నాన గుర్తొస్తాడు Happy Fathers day my dear friends

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1otJ7g1

Posted by Katta

22, మే 2014, గురువారం

కాశి రాజు కవిత

||తెలుసు || దీపాలార్పేసిన గాలితో గొడవాడి భారంగా మారిన దాని హోరంతా కళ్ళకికట్టి సూపుతున్నపుడు సీకటి ముసుగు తీసేసి మామిడాకులు మెరుస్తాయని మా ఊళ్ళో ఎండాకాలం ఎన్నెలకి మనుసులతో మాటాడ్డం తెలుసు. దూరంగా ఉన్న ఎద్దునో , గేదినో అక్కడెవరో ఉన్నారని బ్రమింపసేసి తీరా సేరి సూశాక చేతులు నాకే ఎద్దునీ, గేదినీ మనుసుల్లాగా నీతో మాటాడించడం మాఊరి ఎన్నెలకి ఎప్పుడో తెలుసు 22/ 05/ 2014

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1tnWFIJ

Posted by Katta

11, మే 2014, ఆదివారం

కాశి రాజు కవిత

మేముప్పుడు నీ ముందుట్టినట్టు ఊకట్టడం నేర్పావు. ఓరగా సూడడమో వద్దని అలగడమో నీకు తెలిసింది బాగుందిప్పుడు కన్నా! పాల బుగ్గల్తో పచ్చోసనొస్తూ ముద్దెట్టుకుంటే మురిపిస్తున్నపుడు కళ్ళెందుకు మూస్తానో తెలుసా. సొంగకార్చి ఆరిన నీ వొంటివాసన నాకెందుకు నచ్చుద్దో తెలుసా మీ అమ్మపక్కలో రొమ్ము తడుముతూ నువ్వే చేసే హైరానాతో ఇంతెదిగాక నేనూ శాసించడం నేర్చాను మా అమ్మను ఆకలవుతుందే అన్నం పెట్టని గద్దించి అడుగుతున్నాను. 11/5/14

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jeGoOo

Posted by Katta

9, మే 2014, శుక్రవారం

కాశి రాజు కవిత

ఓ ఏడాది ఇల్లు నెయ్యనపుడు ఎండాకాలం గాలిబొమ్ముని ఎంత తిట్టుకున్నామో తెలుసా ! లేగదూడల్ని లోనకడుతూనో, గోనె సంచులు పైనేస్తూనో తడిచిముద్దై అరుగెక్కితే తుడుచుకునే రుమాల్తో ఎదురొచ్చి నీ తలతుడుస్తూ కడిగిన విగ్రహాన్ని అమ్మ ఒత్తుతున్నట్టుంది ఆ సందామాట్ల సీకట్లో ఎంతకీరానీ కరెంటుని అందరంకల్సి తిట్టుకుని తిందామని తీర్మానించుకున్నాక ఆ చిన్నదీపం వెలుగులో నవ్వుతున్న ముకాలు మాత్రమే కనబడే వెలుతుర్ని మనకెందుకిచ్చాడో అర్ధమై మరింత నవ్వొచ్చేది నాకు. పేదరికమని ఇసుక్కున్నా , ప్రశాంతత బాగున్నపుడు నవ్వుమాత్రమే నేర్చాను నేను. 09/ 05/ 2014

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1l5FEzt

Posted by Katta

6, మే 2014, మంగళవారం

కాశి రాజు కవిత

||మందార పువ్వు || కురిసిన వానంతా దూళి ప్రాణాలు తీసేసినట్టు ఇంతిలా తడిపి చంపడం బాగుంది. ఇష్టం తెలపక పోయినా ఏడుస్తుంటే, నచ్చావని చెప్పబుద్దై మౌనంగా ఉన్న మూలాన, అప్పుడప్పుడూ తడవడం అలవాటయ్యింది నాకు నవ్వుతూంది, ఏడుస్తుంది సరే! ఏదన్నా చెప్పాల్సొస్తే అమ్మలాగే అచ్చం అమ్మలాగే చెంగుచివర్లు మెలితిప్పి తలదించుకుంది. నాన్నా కాస్త లేటైనా నాకూ ఓ మందారపువ్వు తెచ్చివ్వు.

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iSVQWl

Posted by Katta

14, ఏప్రిల్ 2014, సోమవారం

కాశి రాజు కవిత

|| దేవగన్నేరు || వద్దులే అని నాన్నలు బద్దకించాకే ఏ ఊళ్ళోనైనా పొద్దుపోతుంది అప్పుడే ఆ ఊరి సూరీడు అలిసిపోయి పొద్దు సూసుకుంటూ పనిసేసే అమ్మల్ని ఇంటికి పొమ్మంటాడు బోదులో కాళ్ళు కడుక్కుని కచ్చాఇప్పి రోడ్డెక్కాక, ఇంటికి చేరేలోపు ఎన్ని కబుర్లో ! నెలలునిండని పిల్లాన్ని నేలమీద వొదిలేసి వచ్చిన అమ్మలకి ఒక్కో అడుగుకీ ఒక్కో వేగం వదిలిరాలేని ప్రేమతో వొచ్చిన ఒక తల్లి వొరిసేలో ఏం సేత్తాదో తెలుసా! ఆకుకట్ట ఇప్పినట్టే అమ్మ గుండెని ఇప్పేస్తది గుబులు మూన నీట్లో గుచ్చి వరి నాటుతున్నట్టు ఓరోజంతా ప్రేమను దుఃఖంతో నాటేస్తది. రోజుకూలీ బతుకులో రోజంతా అలా అమ్మ ధ్యాసలో జీవించి ఇంటికిపోయాక కాస్త ముందొచ్చిన మొగుడు పిల్లానెత్తుకుని గుమ్మమ్ముందు దేవుళ్ళా కనిపిస్తే. కల్లనీలు కారుస్తూ ఆ తల్లి దేవగన్నేరైపోతాది. అవును దేవగన్నేరైపోతాది

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iLDhhq

Posted by Katta

8, ఏప్రిల్ 2014, మంగళవారం

కాశి రాజు కవిత

||మీసాల రొయ్య || దిగబడిన అడుగుజాడల్లో చేరిన మురికి నీళ్లన్నీ వాడిమీదకి నేనూ నామీదకాడు తన్నుకుని సేసిన తానాలు అమ్మ అరుపుల్ని అందుకోలేవు ఇంకెంత సేపన్న కవురు ఎవరో ఒకరు తెత్తేనేగాని అమ్మ పిలిస్తుందని గాని , గుడికెల్లాలనిగాని గురుతురాదు. ఈతరాకున్న ములగననే దైరం ఇత్తన్నకొద్దీ ఎన్నోసార్లు దూకాను , లోతు నానది ఆటనాది. ఎక్కువసేపు రొంపసేత్తాది ఎక్కేయ్ గట్టు అనేవాడు తూము అరుగుల రాళ్ళ బొక్కల్లో రొయ్యపిల్లలు పట్టుకుని ఆడించిన నాన ఎందుకో ఎదగడం ఆపేసాక . మరి నేనూ రాములోరి కల్లేనం కదా తానం చేసి గుడికెలతుంటే మీసాల రొయ్యల దువ్వుకున్నాను . నానా మీసాల మీద సెయ్యేతే నిన్ను ముట్టినట్టే . నీతో మళ్ళీ మళ్ళీ ఆడినట్టే రాములోరిమీదొట్టు ఎదగడం రాలేదని ఎవరు నీతో సెప్తారు.

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ipsWr6

Posted by Katta

7, ఏప్రిల్ 2014, సోమవారం

కాశి రాజు కవిత

సీసాలూ, గ్లాసులూ కాదు గానీ గడ్డకట్టిన గాజు హృదయాలు ఖాళీ అవ్వాలి . నవ్వుకోవడం అయిపోయాక అద్దరాత్రి మెట్లుదిగుతూ పోయేవాడు ఉంటానంటాడు. ఫలితమాసించని పరామర్శ ప్రేమల్లో ఉందని తేలుద్దపుడు వాడోమెట్టు పైకొచ్చి,, నువ్వు కాస్త దిగెల్లి చేయిచ్చుకుంటారు అదేదో గుండెని లాగిచ్చినట్టే ఉంటది. స్నేహాల గుర్తెరిగి గుర్తెట్టుకోవాలి కొన్ని చేతుల్ని సివరిశ్వాస విడిచాక మనల్ని సాగనంపేటపుడు అవే కొన్నికళ్ళని తుడుస్తాయి. అప్పుడా స్నేహాలచేతులు పైకెత్తకున్నా సెండాపిస్తూ ఊగుతుంటాయ్. ఆత్మనేదొకటి ఘోషిస్తుంటే స్నేహాలే శ్వాసలని చేయాలొక రోయల్ చాలెంజ్ . (మొన్న మెట్లెక్కి అలసిపోయిన మనుషులకి )

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qcnr3f

Posted by Katta

6, ఏప్రిల్ 2014, ఆదివారం

కాశి రాజు కవిత

||బద్దెమంచం|| దు:ఖానికున్న దారుల్ని మూయలేమని చెప్పింది నువ్వేగా మొకందాచేసి ముక్కుతుడుసుకుంటుంటే తెలిసిపోతావ్ నువ్వునన్ను సాగనంపినపుడల్లా గుండెతడి గొంతులో ఆపేసి దుఖాన్ని గుటకలేస్తున్నపుడు నానా నీ గొంతే గుండెలా కనిపిస్తది నీ కొడుకుని నేనూ అంతే. దుఖాన్ని దాస్తాను ఒకదానికొకటంటుకున్న రెప్పవెంట్రుకలు తడిగా నన్ను నీకు సూపించాక వొచ్చేసేముందురాత్రి కుక్కడిపోయిన బద్దెమంచం బిగిస్తున్నపుడు కాళ్ళుతన్నిబెట్టి బద్దిలాగి , తెగిపోయి, పడిపోయి ఆకాశం నేలా ఏకమయ్యేలా నువ్వుకుందంతా వొదులైపోయిన బందాన్ని బిగించినందుకే గుర్తు తెచ్చుకుంటే దు:ఖానిది బరువొకసారి నాన్నా నవ్వేసి దుఃఖాన్ని తేలిక చేద్దాం. 4-04-2014

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1mORbG6

Posted by Katta

2, ఏప్రిల్ 2014, బుధవారం

కాశి రాజు కవిత

1 పతి మేఘంలో నీల్లుంటాయంటే నమ్మను గానీ అమ్మైన ఆడది కురుస్తుందను నేనూ కాస్త తడుస్తాను. 2 సంద్రుడి సుట్టూ వరదగూడూ ఆకాత ఎన్నెల్లోనూ కనపడే వొరిపొలాలు ఓ మడత మంచమ్మీద నాన దగ్గర కాళ్ళు నొక్కుతూ మాఅమ్మ రాత్రీ పగలని కాదు ఎప్పుడూ ఎలాగోలా కురుస్తూనే ఉంటది . 3 ఎండా? ఎన్నెలా? ఏమని సెప్పను 4 ఏసవి రాత్రి బయట పడుకున్నాక అకస్మాత్తుగా పట్టిన మేఘం అందర్నీ ఇళ్ళలోకి తరిమేస్తే అమ్మక్కొతే నాన్నతో ఎందుకేడుస్తాది? 5 వర్షం వచ్చిన జాడ ఆవాన కళ్ళకి తెలీదు అమ్మది ఆకాశమంత దుఃఖం. అమ్మకల్లకి నాన్న ఉపనది మా దాహాలు తీరడానికి వాళ్ళు దుఖాల్లా ప్రవహిస్తారని మాకెవ్వరికీ తెలీదు

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAgpEM

Posted by Katta

29, మార్చి 2014, శనివారం

కాశి రాజు కవిత

ఈ మధ్య కొప్పర్తి రమణ మూర్తి గారి పుస్తకం "యాభై ఏళ్ల వాన "విడులయింది. చదవాల్సిన కవిత్వం మీకు వీలయితే చదవండి .....

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hl3OoW

Posted by Katta

27, మార్చి 2014, గురువారం

కాశి రాజు కవిత

||పండగలాంటోడు|| ఏపపువ్వు ఎవడన్నాతెత్తాడు ఉత్తునొచ్చేదే కదా! సిన్నోన్ని పంపి పాలు తెమ్మను ఊళ్లోకెల్లి బెల్లమూ సామాన్లూ పట్రా అని తిడతున్నట్టు దుఖిస్తుంటే అందీ అందని ఏప రొబ్బని అందుకుని కోసిన పువ్వంతా జల్లిపోతాడు మా నాన అదంతా ఏరుకుని, గుమ్మాలో అరిసిన సాపమీద గుట్టగా పోసేసి పురుకోసనిండా మామిడాకుల్ని మాటాడకుండా గుచ్చేత్తాను. నాగులు దండలూ అయిపోయాక అక్క గడపలకి పసుపు రాస్తుంటే, దాన్ని తన్నుకుంటూ మెక్కలపీట తెచ్చుకున్నాక, మా గుమ్మలకి పచ్చగా ఏలాడేది మాయమ్మ ఉగాది పచ్చట్లో బెల్లం, మామిడి ముక్కా చెరుకూ, చింతపండు సరింగా ఉన్నాయో లేదో అలిసిపోయే అమ్మకి తోడయ్యే అక్క ఆరాటపడే నాన్నకి ఆటపట్టించే నేను కలిసిపోయాక అరచేతిలో పచ్చడి అందరి వొంకా సూసి తింటే అదో తుత్తి అమ్మా, నాన్న అలాగే ఉన్నాక ఏళ్ళు గడిచాఛి మేం గడసరులయ్యాకా ఆ పచ్చడిది అదే రుసి మా ఊళ్ళో ఉగాదంటే వేచి సూసే అమ్మకి తెచ్చిపెట్టే నానతోడు

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gFfRP2

Posted by Katta

24, మార్చి 2014, సోమవారం

కాశి రాజు కవిత

18 నోటిక్కరుచుకు తాగే కొబ్బరి బొండాన్ని జాగ్రత్తగా నీ చేతుల్లోకి తీసుకుని ఒక్కో గుటకా వేస్తుంటే కిందకీ, పైకీ కదిలే నీ స్వరపేటిక సంగీతాన్ని వినినందుకే నేను ఆ కొబ్బరినీరైపోయాను. పెదాల మీదనుంచి జారిన ఆ కంగారు నిండిన నీళ్ళు గొంతుక మీద గొలుసు దాటి పోతుంటే నేనూ ఒక్క గుటక వేసాను అది చూసినా ఏడాది దాకా ఏమీ మాటాడలేదు ఎందుకలా చూసావని ఎపుడైనా అడుగుతావని ఎన్నోసార్లు కొబ్బరి నీరయ్యాను నువ్వు లేవు నా దుఖం కొబ్బరి నీరు ఇదిగో గుర్తులతో తియ్యగా దుఖిస్తున్నాను

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hfrEP9

Posted by Katta

23, మార్చి 2014, ఆదివారం

కాశి రాజు కవిత

కాశి రాజు || కమ్యూనికేషన్ || ఇంతలేటైంది కదరా ఇంకా తినలేదా అని అమ్మకి ఆకలైనట్టే అడుగుతావుంటే ఓ దుఃఖపు జీర నా చెవికెలా చేరిందీ తెలుస్తూ ఉంది దాన్ని నాదాకా మోసుకొచ్చిన ప్రేమది ఎన్ని సెకన్ల వేగమని ఎవరినడిగితే తెలుస్తుంది కాల్ కట్ చేస్తే ఫోన్ టూ హార్ట్ , హార్ట్ టూ అమ్మా నాన్న అన్న సంభాషణ సమాదైపోయి రేపు చేయాల్సిన పనినంతా రివైండ్ చేసుకున్నా దాహమైనట్టు అనిపించాక లెగాలని చూస్తే సహకరించని ఒళ్ళు నీరసాన్ని బద్దకంగా చేసుకుని బయట తినేద్దాం అని సర్ది చెప్పుకుంది మెట్లుదిగి కాస్త ముందుకెళితే ఆ మలుపు తిరిగాక ఉండే చపాతీలోడు సర్దేసుకున్నాడు నవ్వుకుని నేను పడుకుంటాననుకో పర్లేదు అక్కడ మా అమ్మకి ఆకలేస్తేనో !

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pm2lzd

Posted by Katta

14, మార్చి 2014, శుక్రవారం

కాశి రాజు కవిత

కాశి రాజు ||ఒరిమూన|| ఆ గరుకుగెడ్డాన్ని గీసిన తుప్పట్టేసిన బ్లేడుతో బొడ్డుకోసాక నెప్పిలేకున్నా ఏడ్చానట, నాకప్పుడు తెలుసేమో గడవక ఆరో నెలలో దమ్ముచేలో అమ్మ నాటిన ఒరిమూన ములిగిపోయింది మాయమ్మ దుఖంలోనని. కడుపులో ఉన్న నేను కరువురోజోల్లో పెరుగుతానో లేదోనని గర్భగుడిలో గుప్పిల్లు మూసుకుని కళ్ళు తెరవని నాకు కన్నీల్లే పట్టినట్టుంది నా పేగుకు ముడేసుకున్న మాయనిండా, ఆ దమ్ముచేలో ఉన్న మాయమ్మ కన్నీళ్లు అవునిప్పుడు ఏడుస్తాను అన్నాన్ని, అమ్మనీ గుర్తు తెచ్చుకుని ఎవరైనా ఆప్యాయంగా వొండెట్టిన ముద్దను చుడుతున్నపుడు భూమి బ్రమిస్తున్నట్టు ఉంటాది నాకు. ఒరేయ్ వింటున్నవాడా ! నేను రాసేదానికి నీ లెక్కలు నీవి కావొచ్చు అన్నం నాకు ముఖ్యం కాదు, అమ్మల ముందు చేయికడిగి, ఒంటరి కాలాల్లో వొచ్చేటి దుఖం నాకు ప్రశాంతత. అపుడు రాసే కవిత్వమైతే కన్నీళ్లలో తేలెళ్లిపోయే కాగిత్తప్పడవ. విమర్శించకు వదిలేయ్ దుఖం లాంటి నీటిలో పెరిగే ఒరిమూన బతుకు నాది. (భరించలేని ఆ వెకిలి నవ్వుకి )

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oTbgI7

Posted by Katta

12, మార్చి 2014, బుధవారం

కాశి రాజు కవిత

పురిటి దుఃఖం మాయమ్మ భాదలాటి వరదగూడు మా నానలా మాటాడలేనట్టి సందురూడు అయేల సీకటిలో దుఃఖమంతా నక్షత్రాలవుతున్నట్టు వొట్టి ఊహనాది. వరిసేల మీద గాలి ఊగుతావుంది గడపమ్మీద్దీపం వొణుకుతూ వుంది. చిరు సీకటిలో అన్నమెట్టి పెద్దదానికి నెలలు నిండాయి, రేపో మాపో కరుసుంది అత్తమాటూ తాగొద్దు సత్తియ్యా అంటుంటే అన్నం తినడం ఆపలేదాడు. చిరాకొచ్చి, "పెంచలేనోడివి ఎందుక్కన్నావ్" అని అడిగితే గుండె బరువెక్కి,కల్లలోనీలు గొంతులోకొచ్చి మెదబడిందాడికి తప్పుడుమాటని తెలీకుండానే తరవాత నేను నిద్దరోయా ! మా నానకి ముందుగా తెల్లారినట్టుంది మొకం దుఃఖంతో కడుక్కుంటున్నాడు. చూడలేక పొద్దున్నే పొలాలమీదకి పొతే గడ్డిపరక్కి ఏలాడే మా ఊళ్ళోని మంచుబిందువులన్నీ ఆ రాత్రి దుఖ్ఖాలే ఆ గడ్డిపరకేమో రాత్రంతా మెలితిరిగి పోయిన మానాన గుండె.

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ft4vw5

Posted by Katta

10, మార్చి 2014, సోమవారం

కాశి రాజు కవిత

కాశిరాజు ||వొంగపువ్వు|| వేలితో సబ్బుబిళ్ళరగదీసి అద్దాన్నొక సారీ, నాననొకసారి సూసాక నువ్వెట్టుకున్న కాస్త కుంకుంబొట్టూ నీ నొసటమీద ఉదయించిన సూరీడు. నాన లెగిసినా, నేను లెగిసినా కనపడే నీమొకమే మా తూరుపుదిక్కు . నువ్వు మెడ తడుముకున్నాక కల్లద్దుకున్న పసుబ్బొందు నానతో ఏమ్మాటాడుద్ది? నవ్వే నిన్ను చూసి మానాన ఒయ్యారంగా తెంపిన వొంగపువ్వు నీ సిగనున్నాక అమ్మా అందమంటే నీదే కదూ ! 10/04/2014

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dHB8Vq

Posted by Katta

7, మార్చి 2014, శుక్రవారం

కాశి రాజు కవిత

కాశి రాజు ||జమ్మి చెట్టు || ఒరేయ్ మర్సిపోకే అని బయటడ్డ కాళ్ళకి దుప్పడికప్పి గడ్డకట్టే సలిలో సుట్టెలిగించి నడుస్తూ పోతావ్. నీలుబిందెతో ఎత్తైన అరుగు ఎక్కలేక, అమ్మ పడిపోతుంది. వొలిగిన నీలు తుడిసేసి, మిగిలిన నీలు మొక్కలకేసి బిందిసొట్టతీస్తుంటే ఆ గోలకి తమ్ముడూ నేనూ లెగాల్సిందే ఇసురుగుంజ దాపెట్టి, పొత్తరంతో కొట్టి సొట్టతీస్తూ నీ సెయ్యి నలిగితే అమ్మా ఆ పూట నా నిద్దర బద్దలయ్యిందే అపుడు వండేసాక వేలొంచలేని నెప్పితో కూడార్చినపుడు నీ కాళ్ళమీద పడ్డ ఉడుగ్గెంజి వేడిగా లేదులేరా అంటే నమ్మేసానమ్మ పొగలుకక్కే అన్నాన్ని టిపిని కర్రలో పెట్టిస్తే అదిగో ఇప్పుడు ముసలిదయ్యిందే ఆ చేనుగట్టునున్న జమ్మిచెట్టు సరిగ్గా దానిమొదలే మొన్నమొన్ననే ఊదుకుతిన్నాం. ఆ అన్నగాటం మా ఆకలిదో, నీ ఆరాటానిదో ఒక్క ఆకైనా రాలి సెబితే బాగుండునని నాన్నా, నేనూ మాటాడుకున్నాం (వేడివేడన్నం తినేటప్పుడు మానాన కౌలుకి సేసే చేనుగట్టు , అక్కడుండే జమ్మిచెట్టు గుర్తుకొస్తాయి )

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iiSZ9B

Posted by Katta

6, మార్చి 2014, గురువారం

కాశి రాజు కవిత

నిండుగా తిన్నాసరే నిండని రాత్రులుంటాయ్ కంచంనిండా పెట్టుకున్నా కొన్ని కబుర్లుండాలి పప్పో పెరుగో ఎప్పుడూ సరిపోదు సరిగ్గా నాకేసి సూసాక కదా కడుపు నిండేది ఏమీ మాట్లాడకుండా తినమన్నపుడో, మొకం సూపించకుండా వడ్డిస్తున్నపుడో ఆ నిండిన కంచం , ఆ నీళ్ళ గ్లాసూ నాతో మాటాడవు అప్పుడే ఒంటరితనపు నిర్వచనాలు, ఎంగిలి కంచంలో ఏళ్లతో రాస్తాను. నేనెందుకూ నీకందరూ ఉన్నారు అంటుంటావు ఒక్కోసారి సమూహంలో ఒంటరవుతాం , లేదా ఒక్కరమే సమూహమవుతాం తెలీదా! కొన్ని మాటలు కేవలం కరచాలనాలకి కల్పితాలు కొన్ని గుండె సెరువులో పడ్డ గులక రాళ్ళు మాట్లాడు నీ స్నేహం చేరువయ్యాక నువ్విసిరే మాటల రాళ్ళకు, నా గుండె సెరువవుద్ది. నేను మాట్లాడకుండా తిండం పూర్తిసేసాక మనసు నిండక మాఅమ్మ గుర్తొస్తది అపుడేమో ఆగకుండా కన్నీలొస్తయి 06/03/2014

by కాశి రాజు



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1e4eDqr

Posted by Katta