కవిత్వంతో ఏడడుగులు 31 . ఇంగ్లీషు రొమాంటిక్ మూవ్ మెంట్ లో కీట్స్ లా రెండవ తరానికి ప్రాతినిధ్యం వహించే కవి షెల్లీ. అతనిలాగే చిన్నవయసులోనే కీర్తిశేషుడయ్యాడు. అతని జీవితకాలంలో సమకాలీన మత, రాజకీయ విశ్వాసాలకు చాలాభిన్నమైన అభిప్రాయాలుగలిగిఉన్నందుకు అతన్ని పక్కకి తోసిపెట్టినా మరణానంతరం అతని అభిప్రాయాలకి, అతని కవిత్వంతోపాటే సమున్నతమైన గౌరవం దక్కింది. కార్ల్ మార్క్స్, బెర్నార్డ్ షా, WB Yeats, ఆస్కార్ వైల్డ్ వంటి ప్రముఖులు అతన్ని ఇష్టపడ్డారు. చారిత్రక ప్రథానమైన కథనంలో అతను అందెవేసిన చెయ్యి. అతని Ozymandias నిజం చెప్పాలంటే కేవలం 14 లైన్ల కావ్యం. Ode to the West Wind, To a Skylark అన్న కవితలు అతనికి అజరామరమైన కీర్తి సంపాదించిపెట్టేయి. కీట్స్ స్మృత్యర్థం షెల్లీ Adonais అన్న Pastoral Elegy వ్రాసేడు. "పీటర్లూ మారణహోమం" గా పిలవబడే ... మాంచెస్టర్ లోని సెయింట్ పీటర్ ఫీల్డ్ లో 1819లో ప్రశాంతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రజలపై, ఆశ్వికదళం జరిపిన దాడికి ... నిరశనగా షెల్లీ ఈ కవిత వ్రాసేడు. (ఈ దాడిలో 15 మంది మరణించి కనీసం 600 మంది గాయపడ్డారు.) ఈ కవిత చదువుతుంటే, ఇందులో పేర్కొన్న ప్రతి రాజ్యాంగ వ్యవస్థలోని విభాగానికీ... సమాంతరంగా ఉన్న నేటి మన దేశ రాజకీయ వ్యవస్థలు అచ్చం అలాగే పనిచేస్తున్నాయని ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. ఏ పార్లమెంటు సభ్యుడికీ, ఏ కేంద్రమంత్రికీ తన ప్రాధాన్యతా, తన నియోజకవర్గ ప్రయోజనాలూ, తన రాష్ట్రప్రయోజనాలూ తప్ప విస్తృతమైన దేశప్రయోజనాలు అవసరం లేదు. అందుకని బలహీనమైన కేంద్రాన్ని బెదిరించి గడుపుకుంటున్నాయి చిన్న పార్టీలు. 18వశతాబ్దంలో బ్రిటనులోపార్లమెంటు క్రమేపీ ప్రవేశపెట్టిన "Enclosure" చట్టాలద్వారా గ్రామాలలోని రైతులు భూమి హక్కులు కోల్పోయి, ముందు పాలెగాళ్ళుగాను తర్వాత రైతుకూలీలుగానూ మారినట్టు, ఈ రోజు భూసేకరణపేరుతో పంటభూములని రైతులదగ్గరనుండి సేకరించి కార్పొరేటు సంస్థలకూ, తమ తాబేదార్లకూ అప్పనంగా అప్పచెబుతున్న ప్రభుత్వాలు, వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేసి, రైతులు "Crop Holiday"కి దిగే పరిస్థితులు తీసుకొస్తున్నాయి. ఇక ప్రజా ప్రతినిధుల, చిన్నా చితకా అధికారులదగ్గరనుండి ప్రభుత్వ నిర్ణయాలను అమలుపరచే అధికారం ఉన్నవారిదాకా అవినీతి రోజురోజుకీ కొత్తపుంతలు తొక్కుతోంది. స. హ. చట్టాలవంటివి ఉన్నా వాటిని ఎలా నీరుగార్చాలో ప్రభుత్వాలకీ, నియమింపబడిన అధికారులకీ బాగా తెలుసు. న్యాయవ్యవస్థ కలుగజేసుకోగలిగిన సందర్భాలూ, పరిమితులూ స్వల్పం. మతం ప్రజల నైతిక ప్రవర్తనని ప్రభావితం చెయ్యలేక పోవడంతో, మతం, నైతిక వర్తనా దేనికదే, గాలికూడా చొరలేని ఇరుకు గదులైపోయాయి. కవిత ముగించిన తీరులోనే, మనం కూడా చెయ్యగలిగింది ... ఏ అద్భుతమో జరిగి, ఈ దేశంకోసం, స్వాతంత్ర్యంకోసం ప్రాణాలర్పించిన ఏ మహానుభావుడైనా పునర్జన్మించి ఈ అల్లకల్లోలవాతావరణంలో దేశానికి ఒక మార్గదర్శనం చేస్తాడని ఆశగా ఎదురుచూడడమే. . రాజు ... అంధుడూ, వివేకశూన్యుడూ, ఉన్మత్తుడూ, కాటికికాళ్ళుజాచుకుని అందరూ అసహ్యించుకునే ముదుసలి; రాజ వంశీయులు ... పసలేని జాతి కుక్కమూతిపింజలు, ప్రజలు చీదరించుకునే మందులు, మురుగునీటి మీది మురుగు; పాలకులు... చూడరూ, తెలీదు, తెలుసుకోలేరు. అప్పటికే నీరసించిపోయిన దేశపు రక్తాన్ని తాగితాగి ఆ మైకంలో కళ్ళుమూసుకుపోయి పట్టురాలి పడిపోయేదాకా వేలాడే జలగలు; ప్రజలు... ఆకలితో అలమటించి, బీడుబారిన తమ పొలాల్లో హత్యచేయబడ్డవాళ్ళు సైన్యం ... రెండంచులకత్తిలా ఒకపక్క స్వేచ్ఛని హత్యచేస్తూ, ఇంకొకపక్క దోచుకుంటుంది చట్టం ... ఆశావహం, ఉత్తమం అయినప్పటికీ వక్రభాష్యాలకుగురై నిరుపయోగం మతం ... క్రీస్తూ లేక, దేముడూ లేక పుస్తకంలో బందీ అయిపోయింది. పార్లమెంటు... కాలం రద్దుచెయ్యని ఒక చట్టం. . ఇక ఈ సమాధుల్లోంచి అద్భుతమైన ఏ ప్రేతాత్మో పునరుజ్జీవించి ఈ కారుచీకటిలో వెలుగు చూపించుగాక! . . English in 1819 ... PB Shelly . An old, mad, blind, despised, and dying king,-- Princes, the dregs of their dull race, who flow Through public scorn, mud from a muddy spring,-- Rulers who neither see, nor feel, nor know, But leech-like to their fainting country cling, Till they drop, blind in blood, without a blow,-- A people starved and stabbed in the untilled field,-- An army which liberticide and prey Makes as a two-edged sword to all who wield,-- Golden and sanguine laws which tempt and slay; Religion Christless, Godless, a book sealed,-- A Senate—Time's worst statute unrepealed,-- Are graves from which a glorious Phantom may Burst to illumine our tempestuous day. . Percy Bysshe Shelly (4 August 1792 – 8 July 1822)
by Nauduri Murtyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h1d3Y5
Posted by
Katta