పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

కవిత్వ విశ్లేషణ



పారువెల్ల శ్రీనివాస రెడ్డి -గులక రాళ్లు


 


జీవితం,మానవుల ఉనికి.ప్రకృతి,ఆధ్యాత్మకత ఉన్న కవితని తాత్విక కవిత(Phylosophical poem)అంటారు.కవిత్వానికి సమాజం జీవితం కాక మరేదీ వస్తువుగా ఉండదుకదా?అనుకోవచ్చు.జీవితాన్ని చూసే దర్శనంలోనే తాత్విక కవిత వేరవుతుంది.శ్రీనివాస రెడ్ది గతంలోని ఙ్ఞాపకలను "గులక రాళ్లు"గా అభివర్ణిస్తున్నారు.

చిన్న తనంలో ఏరుకున్న గులక రాళ్లని అత్యంత భద్రంగా దాచుకుంటుంది బాల్యం బహుశః ఇందులో ఈప్రతిఫలనముంది.
ఇందులో రెండుకాలాల మధ్యన సూత్రంలా ఒక కొనసాగింపు కనిపిస్తుంది.నువ్వు ,నేను అనే రెండు అనిర్దిష్టపాత్రలు ఉన్నాయి.

"నలుగురిలో/నవ్వుతూ నవ్విస్తూ నేను
చీకటి రాత్రుల్లో ఒక్కడినై ఏడుస్తూ నేను/నువ్వు లేకుండా"

ఇందులో సాహచర్యంలో ఉండే తత్వాన్ని చెప్పారు.బయటి ప్రవర్తనకి ,మనసుకి మధ్యన ఉండే తారతమ్యాన్ని వ్యాఖ్యానిస్తున్నారు.రెండవ వాక్యంలోనూ ఇదే అనుక్రమం కొనసాగుతుంది.ఆతరువాత వాక్యంలో అంతర్ముఖత్వాన్ని తలపించే భావన కనిపిస్తుంది.

"నీకు మాత్రం/మనసుకు విప్పలేక ముసుగు కప్పుకొని తిరుగుతూ
అలిసి , కాలంతో కలిసిపోవడమే శరణ్యమయ్యింది"

"ముసుగు నీడను మోస్తున్న మనసును విడిచి
నీకు నువ్వు కనిపించేదాకా
నువ్వెక్కడున్నావో నువ్వే వెతుకు "

అచేతనాన్ని ,సచేతనాన్ని గురించి మనోవైఙ్ఞానికవేత్తలు మాట్లాడారు.ఫ్రాయిడ్ ఙ్ఞాపకాన్ని ప్రాక్చేతనం అన్నాడు.పై వాక్యంలో సచేతనానికి ప్రేరేపించడం కనిపిస్తుంది."ముసుగు"అలాంటి పదమే.ప్రాక్చేతనలో సంసర్గ విధానాన్ని(Associative process)గురించి చెప్పాడు.అనేకాంశలని చెబుతూ ఙ్ఞాపకాన్ని తవ్వడం.

"గులక రాళ్లు""వాగు" ఇలాంటివే.ఒకసారి ఒక మిత్రుడు కవిలోని స్వరాన్ని బట్టి స్త్రీ,పురుష బేధాలని గుర్తించినట్టు,ఎదుటి పాత్రలను గుర్తించ వచ్చా అని అడిగాడు.ఐతే కవి అందుకు అవకాశమిస్తే కష్టం కాదనిపిస్తుంది.

శ్రీనివాస్ రెడ్డిగారి కవితలో "గాలి,వెన్నెల,"లాంటిపదాలు ఎదుటి పాత్రలో స్త్రీ మూర్తిని స్ఫురించేస్తాయి.అయితే ఙ్ఞాపకలను ప్రేరేపించడమే శ్రీనివాస్ గారిలో ప్రధానంగా కనిపిస్తుంది.మంచి కవితనందించినందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి కృతఙ్ఞతలు.


                                                                                                                                          _____________________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

కవి యాకూబ్-చినుకు భాష






ఆత్మకళా,ఆత్మ కళాభ్యాసం,ఆత్మకళాసిద్ది అనే పదాలు ప్రాచీనకాలం నుంచి విరివిగా కావ్యమీమాంసలో కనిపిస్తాయి.ష్చెర్బీనా ఆత్మ కళాభ్యాసాన్ని గురించి మాట్లాడిందని,ఇది ప్రాచ్య,పాశ్చాత్య కళాతత్వ వేత్తలందరూ ఆదరించినదేనని శేషేంద్ర శర్మ గారి అభిప్రాయం.

జగన్నాథుడు "భగ్నావరణ చిద్విశిష్ట స్థితి"గురించి చెప్పాడు.ఆవరణలో ఉన్న జగత్తుపోయి ఇదివరకే ఉన్న ఆత్మీకృతమైన సంస్కారం ప్రకాశిస్తుంది.బాహ్య జగత్తుకు,ఆత్మావరణానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తనలో జాగృతం చేసుకోవడమే ఆత్మకళాభ్యాసం.

ఈక్రమంలో దర్శన స్థితి చాలావిలువైనది"తతఃపశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః పురా యత్తత్ర నిర్వృత్తం ప్రాణవామలకం యథా తత్సర్వంతత్వతో దృష్ట్వా" ఈతత్వదృష్టి,యోగస్థితి దర్శనాన్ని పదునుపెడతాయి.

దర్శనంలో స్పృహ అనేది ఒకటుంటుంది.దీనికి స్పర్శ మూలం.స్పర్శ నుంచి కవి ఆత్మీకరణ సంస్కారమైన స్పృహ లోనికి వెళుతాడు.తాను ఎటు ప్రయనిస్తాడనేది ఆత్మచైతన్యం,సంస్కార దృష్టిని బట్టి ఉంటుంది.ఇదంతా భౌతికం నుండి ప్రేరణ పొందిన కవి ఆత్మదృష్టివైపు వెళ్లటం.ఈ మార్గంలో కొన్ని సార్లు స్పర్శకూడా ప్రత్యక్ష భాగస్వామి అవుతుంది.కాని పరోక్షంగా స్పృహ అణువణువునా ప్రవహిస్తుంది.యకూబ్ చినుకుభాషలోఇలాంటిదృష్టిఒకటికనిపిస్తుంది.సాధారణదృష్టి,కళావిష్కారం,ఆత్మచైతన్యం,ఆత్మకళాసాధన ఇవన్నీ దార్శనిక పరిణతదశలు.


నిర్మాణపరంగా చూస్తేస్పర్సలోని చూస్తున్నవస్తువు,స్పృహలోని చెప్పబడుతున్న వస్తువు మధ్య సారూప్యతలుంటాయి.ఇలాంటి వాటిలో విలువలు ఒకదానికి ప్రత్యక్షంగా ఉంటే,మరోదానికి ఆపాదించబడుతాయి.

ఆమూర్తసంభాషణ, మూర్త సంభాషణ
అని రెండు ఉంటాయి.ఒక అంశాన్ని గురించి మాట్లాడుతున్నట్టుగా అనిపించినా ధ్వనిగతంగామరొకటి స్ఫురిస్తుంది.స్పర్స భౌతిక మైంది,స్పృహ ఆత్మికమైంది."కవిత్వాన్ని ఆత్మే స్వీకరిస్తుంది కాబట్టి చెప్పేదికూడా ఆత్మే అవుతుంది"అని అరవిందులన్నారు.

ఉద్వేగంతరువాత ఉపశమనం నుంచి కవిత ప్రారంభమౌతుంది.
"ఇంక కొంత సమయం, పడుతుంది/ఈ
ముసురు ఆగిపోవడానికి"

మనసునిఏదో ఉద్వేగంచుట్టుముట్టి ఉండడం,ఆ ఉద్వేగపు సమాప్తి గురించి ఆలోచించడం."మరీ చిన్నిచిన్ని చినుకులు/వాటికోవ్యాకరణ సూత్రమేదో ఉన్నట్టు/ఒకటి వెంట ఒకటి కుదురుగా." ఆత్మీ కరింపబడున అంశాలు కాలగతంగా చేరినవైఉంటాయి. అందువల్ల ఒక్కటొక్కటిగానే అందుతాయి.ఆవరించి ఉన్న అంశాన్ని తప్ప
మరోదాన్ని,భౌతిక జరిగే పరిణామాలని ఆత్మ పట్టించుకోదు.
"నిన్నటి సాయంత్రం నుండి ఇవాళ్టి ఉదయం లోపల/ఎన్నిపరిణామలు జరిగిపోలేదు/అవేమి పట్టనట్లు ప్రవర్తిస్తుందీ ముసురు"-దానినుంచి ప్రేరణపొంది ముగించుకోడం తప్పా ఆవరించి ఉన్నదాని అంతుచిక్కదు

"ఈ ముసురు చేసే సంభాషణలో/ ఒక్క ముక్క అర్థంగాదు"

దృశ్యాన్ని వర్ణిస్తున్నట్టుగా ఉన్నా..చిత్రించడం,ఆపాదించడం లాంటివి ఇందులో బలంగాకని పిస్తాయి.ఆవరించి ఉన్న ఓ ఉద్వేగపు క్రమాన్ని యకూబ్ గారు ఈ కవితలో చిత్రించినట్టు కనిపిస్తుంది. ఈ మూర్త సంభాషణలోనించి ఆమూర్తంగా మరోగొంతు ధ్వనిస్తుంది.

         

                                                                                                                                        ________________ఎం.నారాయణ శర్మ-1.8.2013

కవిత్వ విశ్లేషణ

Mehdi Ali: నీ విఙ్ఞత





 


మెహది అలిగారి కవితగురించి మాట్లాడుకున్నప్పుడు రెండువిషయాలను గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.1.అలీగారు వ్యక్తం చేసిన అంశం2.వ్యక్తం చేసిన తీరు. చాలాకాలం క్రితం బౌద్దానికి సంబంధించి"అశ్వ ఘోషుడు"మనుషుల ప్రవర్తనకు సంబంధించి "సౌందరనందం"లో ఒక వ్యాఖ్య చేసాడు.

"దృష్ట్వైకం రూపమన్యోహి రజ్యతేsన్యఃప్రదుష్యతి
కశ్చిద్భవతి మధ్యస్థఃతత్రైవాన్యో ఘృణాయతే"

ఒక రూపాన్ని చూసి ఒకడు సంతోషపడితే ఒకడు దూషిస్తాడు,ఇంకొకడు మధ్యస్థుడైతే
,వేరొకడు జాలిచూపిస్తాడు.మనుషులస్వభావన్ననుసరించి వారివారి విఙ్ఞతలననుసరించి వారి ప్రవర్తన ఉంటుంది.ఇలా వేరువేరు అభిప్రాయాలు కలగటం వారి మానసిక సంస్కారాలను బట్టే ఉంటుంది.

అలీగారు ఇలాంటి తత్వంలోనే నీవిఙ్ఞత అనివదిలేసారు.ఇందులో అనేకాంశాలని స్పర్శించడం కవికుండే సార్వత్రిక దృష్టికి నిదర్శనం.విమర్శలో సభ్యొక్తి (euphemisam)అనే పదాన్నొకదాన్ని వాడతారు.ఇది వాక్యాన్ని చెప్పే పద్దతికి సంబంధించింది.ఎదుటి వారి ప్రవర్తన గురించి మాట్లాడుతున్నప్పుడు దురుసుగా,కటువుగా కాకుండా పరోక్షంగా చెప్పడం.

వ్యక్తం చేసిన తీరు గురించి మాట్లాడుకుంటే కొన్ని విషయాలు ప్రధానంగా గమనించాలి.కొత్తగా కవిత్వం రాస్తున్నవాళ్లకు ఏవిషయం రాయాలన్న దాంట్లో అనుమానం లేకున్నా.. ఎలారాయాలనేది,ఎదుటి వారికి ఎలాచేరవేయాలనేది మొదటి ఇబ్బంది.అలాంటి వారికి ఈకవితనుండి ఒక మార్గం దొరుకుతుంది.మొదట్లో చాలావరకు అందరూ పంక్తులలో పదాలనుపేరుస్తూ వెళతారు.అంటే ఒకే వాక్యాన్ని సుమారు మూడు నాలుగు పంక్తులల్లో రాయటం.ఇంకొందరు కుప్పగా ఒకేచోట రాసేస్తారు.ఇది ఒకరకంగా కవిత్వం రాసే వారిలో ప్రాథమిక దశ.ఎంత గొప్ప స్ఫూర్తి కలిగించే విషయం చెప్పినా నిర్మాణ క్రమం తెలిసి రాసే వారి వాక్యంలా చేరదు.

కొంత అధ్యయనం తరువాత ఇలాంటివారిలో పరిణత దశ కనిపిస్తుంది.అంశాలని యూనిట్లు గా రాయడం.ఈసమయంలో రెండు వాక్యాలుగా ,మూడువాక్యాలుగా రాయడం కనిపిస్తుంది.నిజాని ఈదశకి చేరడానికి కొంత కాలం పడుతుంది.ఇలాంటి కవితలు చదివి నిర్మాణాన్ని అర్థంచేసుకున్న వారికి ఆకాలం కొంత తగ్గొచ్చు.

అలీ కవితలో ప్రతి యూనిట్లోనూ వరుసగా నిర్మాణ సారూప్యత సాధించారు .

"నేనొక సముద్రాన్ని గంభీరంగా కనిపించడం నానైజం
భయపెడుటున్నానా కెరటాలతో ఆడమంటున్నానా
అర్థమెలాచేసుకుంటావో నీ విఙ్ఞత అది"

మొదటి దాంట్లో ప్రతిపాదక వాక్యం-సృజనధర్మ వర్ణన.రెండవదాంట్లో రెండు వైవిధ్యాంశాలు.మూడవది సూచన .నిర్మాణగతంగా ఇది శతకాలలో కనిపించే మకుటం లాంటిది.విమర్శ దీన్ని వాక్య నిర్మాణ పునరుక్తి(parallelism)అంది.సరళ వచనం (plain prose)లా కనిపించే కఠిన పదాల్లేని వచనం ఇందులో మరో ఆకర్షణ.అర్థ సంబంధంగా ప్రతీ పదంలోనూ కవికున్న అవగాహన కనిపిస్తుంది.ఒక అంశానికి సంబంధించి అనేక పదాలను నిర్మిస్తే అర్థ క్షేత్రం అంటాం.రెండు పదాలు ఉంటే సజాతీయాలు అంటాం.

శశి-వెన్నెల,సమీరం-చలి,సాగరం-కెరటం,రాగం-ఆహ్లాదం ఇలాంటి వన్ని అలాంటి పదాలే.ఇన్ని పంక్తుల్లోనూ మనిషి స్వభావాన్ని అంచనా వేస్తారు.రసానుభవానికి అనుకూలంగా ఏర్పడేవాటిని విభావాలు(objective correlative)అంటారు.ఇందులో ఆలంబన విభావం కారకం లాంటిది.సముద్రం,గ్రంథం,అనుభవం ఇలాంటివి ఆతాలూకే.మరోటి ఉద్దీపన విభావం ఆవేశవాతావరణాన్ని ప్రదర్శించేది.వాక్యాల్లో క్రియాగతంగా చెప్పిన వాక్యాలన్ని అలాంటివే.
ప్రకృతి గతంగా 3,భావన అనుభవాలకు సంబంధించి2,సాహిత్య సంబంధంగా3 అంశాలు కనిపిస్తాయి ఇందులో.
వ్యక్తిత్వాన్ని ప్రతీకాత్మకంగా చెప్పి సారూప్యతని ఆపాదిస్తారు.

"నేనొక అనుభవాన్ని పాఠం నేర్పడం నానైజం
అప్రమత్తత నేర్చుకోవాలా నిర్లక్షంగా వుండాలా
అర్థమెలా చేసుకుంటావో నీ విఙ్ఞత అది"

"నేనొక కవితని జాగృతం చేయడం నానైజం
కవితలో నిన్ను వెదుక్కుంటావో ఇతరులగురించి అనుకుంటావో
అర్థమెలా చేసుకుంటావో నీ విఙ్ఞత అది"

వాక్యనిర్మాణానికి సంబందించి ఆకాలనికి తగిన రచనకు దగ్గరగా ఉండే క్రమాన్ని అర్థం చేసుకోడం అవసరం.అలీగారి కవిత ఆపనిచేసింది.జయహో అలీగారు.


2.8.2013



                                                                                                                                            _____________________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

సాయికిరణ్ కుమార్ శర్మ కొండముది-ధన్యజీవితం,

           
         




ధ్యానంగురించి చాలావరకు ప్రాచీన భారతీయయానులనుంచి ఇప్పటి వరకు చెప్పని వారంటూలేరు.విమర్శలో ద్వంద్వార్థరచన(allegory)అనేపదాన్నొకదాన్ని ఉపయోగిస్తారు.పాఠకుడికి ఆసక్తి రేపడానికి ఒకవస్తువుతో ఒకటిపోల్చి చెప్పడం,ఒక స్వభావంతో మరోదాన్ని పోల్చి చెప్పటమిలాంటిదే.

పాతకాలపు నీతి శాస్త్రం నుంచి ఇప్పటిదాకా వచ్చిన సాహిత్యమంతాఈపనిచేసింది.ఇందులో ఒక మార్గం ప్రకృతిలోని అంశాలకు జీవితాన్ని ఆపాదించి చెప్పటం.ఇలాంటివాటిలో కవికి లోతైన పరిశీలనా శక్తి కావాలి.కొండముది సాయి కిరణ్ కుమార్ శర్మ ఒక చెట్టుజీవితాన్ని-వార్ధక్యంలో ఉన్న వృద్దురాలిలా దర్శించి కవిత్వీకరించారు.

ప్రకృతితో స్నేహం చేయడానికి ఒక దార్శనికపరిఙ్ఞానం కావాలి.

"దర్శనే స్పర్శణే వాపి శ్రవణే భాషనేపివా
యత్ర ద్రవత్యంతరంగః స స్నేహ ఇతికథ్యతే"

చూడటం,తాకటం,వినటం,మాట్లాదుకోటంవల్ల ఎక్కడైనా మనసు ద్రవిస్తే దాన్ని స్నేహం అంటారు.-అని నీతి శాస్త్రం.

ప్రాచీన సంస్కృత కవుల్లో వాల్మీకి,కాళిదాసు మొదలైన వారు ప్రకృతిని గూర్చి గొప్ప వర్ణనలు చేసారు.

వాల్మీకి-"నదీం పుష్పోడుపవహాం"(పూల పడవల్ని మోస్తున్న నదీ"అన్నాడు.

శూర్పనఖ రెండువైపులా ఉన్న రామలక్ష్మనులిద్దరినీ చూసి-ఎవరిని వరించాలో తెలియక అర్థం గాని స్థితిని ఇలాచెబుతారు"ఉభయ కూల సమస్థిత శాద్వలభ్రమగతా గత భిన్న గవీ దశాం"(ఇరువైపుల గడ్డి పెరిగితే ఏవైపున మేయాలో తెలియని ఆవులా ఉందన్నాడు)కాళి దాసు కూడా హిమాలయాలల్లో గాలిసవ్వడి వినిపిస్తుంటే "ఉద్గాస్యతామిచ్చతి కిన్నెరాణాం తానప్రదయిత్వమివోపగంతుం"(కిన్నెరలు పాదే పాటకు ప్రకృతి తానాన్ని పాడినట్టుగా ఉందని అన్నాడు)

ష్చెర్బీనా మాటల్ని శేషేంద్ర శర్మ ఈ సందర్భంలో ఇలా వివరించారు.
"What distingushes an artistic vision of the world from all the other froms of knowledge is its much larger content of fantasy,imaginetion,cinjecture,instinct,and sub conciousness"
భార తీయ అలంకార శాస్త్రం కూడా"ఋషిశ్చకిల దర్శనాత్"అనీంది స్థూలంగా..

"పండు ముదుసలి వగ్గులా
మడతలు పడ్డ దేహంతో/చెట్టు"
చెట్తు స్థితిని దార్శనికంగా చెప్పి,కారణాలను ఔన్నత్యాన్ని ఆవిష్కరించారు.

"ఆకలేసిన కాకిలా /ఆరో ఋతువు
ఆకులను అద్దుకు తినేసింది"
శిశిరంలో ఆకురాలిన సంధర్భాన్ని చెపుతున్నారు.ఈ కవిత లో ప్రాసపై మక్కువ కనిపిస్తుంది.భావనా వ్యక్తతలో శబ్దం పాత్రని కవి ఎక్కువగా విశ్వసించి నట్టు కనిపిస్తుంది. "అకలి,ఆరో ఋతువు,అద్దుకు తినటం,ఆకతాయిలు,అరవైచేతులు అన్నీ ఇలాంటివే.
నీడకూడ ఇవ్వలేకపొతున్నందుకు తడికళ్లతో ఉందని అంటారు.ఇందులో స్వభావాన్ని ఆపందించడం ఉంది.ధ్యానం, తో కవితను వ్యక్తం చేయటం ఇందులో కనిపిస్తుంది.
అభినందనలు.సాయి కిరణ్ కుమార్ శర్మ గారు.3.8.2013



                                                                                                       _______________ఎం.నారాయణ శర్మ


కవిత్వ విశ్లేషణ

వంశీధర్ రెడ్డి కవిత-ఓ రోజెందుకో,

         
                 




చాలానాళ్లక్రితం"చితి చింత"లో"మో" నరాల సంగీతం అంటూ ఓ కవిత రాసారు.అది దుఃఖానికి సంబందించిన బాహ్య స్థితిని ప్రతీకలనుపయోగించి చెప్పిన కవిత.వంశీధర్ కవిత(ఓ రోజెందుకో)లోనూ వస్తు గతంగా ఆకవితకి సారూప్యతలున్నాయి.

1966 తరువాత తెలుగులోనేకాక,మొత్తం సాహిత్యంలోనే ఒక కొత్త ఉనికిని,అభివ్యక్తిని మోస్తూ వచ్చింది వినిర్మాణం.ఈ వాదంలోని కొన్ని అంశాలని విమర్శ అర్థం చేసుకొనే ప్రయత్నం చేసింది.

1.భాషకి,పదానికి నియతమైన ఉనికి ,మూలాలు ఉండవని నమ్మటం.
2.విమర్శకులు (నిర్మాణవాదులు)కవితా వివేచనలో చెప్పే కేంద్రం(center)అంచులు(feriferi)వంటివి లేవని విశ్వసించింది.
3.అనుభూతిని వ్యక్తం చేయడానికి అగాథం ఉంటుందని నమ్మింది.
4.సంపూర్ణత్వం అనేది భ్రమ అని అన్నీ అసంపూర్ణాలేనని నమ్మటం.
5.ఏ అంశంపై మరే అంశపు ఆధిపత్యం ఉందకూడదని ఆలోచించింది.
6.రచనలోని ఖాళీలగురించి,అనేకమైన అప్రధాన మైన విషయాలని కూడా పట్టించుకుంది.
6.ఇది స్వీయ మానసిక వాదంపై ఆధార పడుతుందని విమర్శకులు అభిప్రాయ పడ్దారు.
వంశీలో ఈ రకమైన మానసిక సంస్కారం కనిపిస్తుంది.
7.నిహిలిజం లాంటిపిడివాదాన్ని మోసిందని,ఉద్దేశ్యపూర్వకంగా అస్పష్టతను సృష్టించిదని నిందలుకూడాపడింది.

తెలుగులో కొందరు ఈ తరహాకవితలు రాసినా మో ఒకరే వినిర్మాణ కవిగా కనిపిస్తారు.వంశీధర్ ని ఒక కవిత తో నిర్ణయించేయలేం కాని గతంలోని కవితలని చూసాక ఇందుకు కొంత అవకాశమూ లేక పోలేదు.

మో కవిత్వంలో ప్రతీకలని ఎక్కువగా వాడుకునేవారు.వాటి ఉనికిని వాటికి ఆపాదించే స్వభావాలని సాధారణం కంటే భిన్నంగాఉపయోగించేవారు.శ్రీరామ్మూర్తి లాంటివాళ్లు సంస్కృతం,లాటిన్,లాంటి భాషలతో పాటు మెడిసిన్లోని పరిభాషని వాడారు.వాక్యాలక్రమాన్ని మార్చిరాయటంకూడ కొందరిలో కనిపిస్తుంది.

వంశీధర్ లో స్వీయమానసిక వాదం కనిపిస్తుంది.సహజంతో వైవిధ్యమైన ,వైరుధ్యమైన భాషని,వాక్యాన్ని ప్రేరేపించేదిదే.

వంశీవాక్యరచనకి అసంబంధస్వభావాలని,ఉపయోగాలని చేర్చడం ద్వారా అవగాహనకు సంబంధించి ఒక అగాధాన్ని సృష్టిస్తారు.సూత్రప్రాయంగా ఇందులో ఒక అర్థవాహిక పని చేస్తుంది.

"ఏడుపునీళ్లనిగాలిలో విత్తడం"
"వెంట్రుకనై కురవాలనిపించడం"
సీతాకోకని చుట్టడం" ఇవి అవగాహనకు దూరంగా కనిపించినా ఒక అర్థ వాహకం ఉంది-విషాదంలో వెంట్రుకలస్థితి,కోక అనేపదానికి సంబందించిన ఉనికి ఈ వాహకాన్ని సృష్టిస్తుంది.చాలవరకు ఇందులో కొన్ని స్థితి సమీకరణాలని ఉపయోగించారు.

మరో వాక్యంలో-దేవుడి మునిమనవలు పలకలు తీసి పాడు బొమ్మలు గీసేదాక-అంటూ రాస్తారు ఇందులోనూ మోకాళ్ల నడుమగడ్డం పెరగటం..మునిమనవలు,కాల సమీకరణాన్ని
చూపుతాయి.

ఎవరో దేవతట-అనే వాక్యంలోమేల్కోవడం అనే స్థితి ఉంది..స్వభావ గతంగా ఇదికొంత వేదాంతాన్ని ధ్వనిస్తుంది.కలలు మారటం పర్యవసానం.చివర్లో ఆక్రొశాన్ని ద్వనించే స్థితి ఒకటి ఉంది-దేవుడు చనిపోయాట్ట అనేవాక్యంలో..

స్వీయ మానసికవాదమొకటిఉందని తెలిసిందే..ఇది సహజానికి విరుద్దమైన భాషని,వాక్య రచనని ,నిర్మాణాన్ని,ప్రతీకల్ని ప్రేరేపిస్తుంది.ఇలాంటి కవితా మార్గాలని అర్థం చేసుకోడానికి కావల్సిన దర్శన గ్రంధాలుతెలుగులో ఎక్కువగా అందుబాటులోలేవు.బి.తిరుపతి రావుగారు రాసిన"పోస్టు మోడర్నిజం"-ఆయనే మో కవిత్వానికి రాసిన 1,2 పీఠికలు,సమీక్షలు."మిసిమి"పత్రిక వేసిన ప్రత్యేక సంచిక.మినహా కనిపించవు.కళతత్వశాస్త్రం -మౌలికాంశవివేచన అనేగ్రంధంలో డా.ముదిగొండ వీరభద్రయ్య కొంతచర్చించారు.

వంశీధర్ లో తనదైన మార్గం ఒకటి ఉంది.ఇది పైన చెప్పుకున్న భాషా,మనసిక సంస్కారాలకు దగ్గరిది.ఈ మార్గంలోవంశీసాధన గమనించదగింది.

4.8.2013





                                                                                                                _____________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

బి.వి.వి.ప్రసాద్ కవిత-పావురాలు

 





తెలుగులో వచనకవిత వచ్చాక ఆ పరిధిలోనే మరికొన్నిమార్గాలు కనిపిస్తాయి.అనుభూతి కవిత్వం ,అంతర్ముఖీనకవిత్వం ఈదశలో కనిపించేవే.బివివి ప్రసాద్ కవిత సుమారుగా ఆకోవకు చెందిందే.నిజానికి "హైకూ"పరిచయం ఒకటి కలిగాక తెలుగులో పైన చెప్పుకున్న రెండుమార్గాలు పరవళ్లు తొక్కాయి.ధ్యానం,సమాధి లాంటివి పూర్వమే కనిపించినా వాటిని గురించి ఈ 1,2 దశాబ్దాలు మాట్లాడటం అలా ప్రారంభమయిందే.

భౌతిక ప్రపంచాన్ని విడచి అహంకారాలులేని శాంతినపేక్షించే మానసిక ప్రపంచంలోనికి అక్కడినించి సౌందర్యమైన ప్రాకృతికప్రపంచంలోనీ దాన్నించి దృశ్యమూ,శబ్దమూ,రూపమూ లేని పూర్ణ ప్రపంచంలోనికి వెళ్లడం అంతర్ముఖీనత(introspection).అలావెళ్లేకవి అంతర్ముఖీనుడు(invertor).

యోగదర్శనం పేరుతో సౌందర్యారాధకులుచెప్పినది.సమాధి అభ్యాసాలను ప్రతిభా కారకాలుగా అలంకారికులు చెప్పినది ఈ లక్షణాలకు కాస్త దగ్గరగా కనిపిస్తుంది.

రుద్రటుడు(వచనాను స్మృతి)లో-
"మనసి సదా సమాధినీ"(సమాధి సిద్దమైందే ప్రతిభ)అని వ్యాఖ్యానించాడు.సమాధికి అలాంకారికులు చెప్పిన నిర్వచనాలూగమనించదగ్గవి."సమాధిరాంతరా"అనేది ఈ అంతర్ముఖీనత్వాన్నే చెబుతుంది.తౌత భట్టు కావ్య కౌతుకం లో శాస్త్రాధ్యయనం చేత ఙ్ఞానం లభిస్తుందని అక్కడినుండి దర్శనం కలుగుతుందని ఆదర్శనం వల్ల చేసే వర్ణన కవిగాచేస్తుందని అన్నాడు.

"సతత్త్వ దర్శనాదేవ శాస్త్రేషు పఠితఃకవిః
దర్శనాద్వర్ణనాచ్చాధ రూఢాలోకే కవి శృతిః"

బివివి ప్రసాద్ సృజనని ఇలాంటి దర్శనంతో దర్శించి చిత్రించారు.మనసులోకి ఊహలు రావడాన్ని,అందులోంచి సృజనరావడాన్ని స్పందనలుగా ,పావురాళ్లుగా చిత్రిస్తున్నారు.ప్రశాంతత అనే అంశమే "పావు రాళ్ల"నితెచ్చింది.శబ్దాన్నే కొరుకుంటే బహుశః చిలుకనో,మరోదాన్నో తీసుకునే వారేమో.అంతర్ముఖీనత అనిచెప్పడానికి ఈ ప్రశాంతతని అపేక్షించడమే ఆధారం.

ప్రసాద్ గారిలో విస్త్ర్తమైన నిర్మాణ ధార ఉంది.ఇది అనేక చోట్ల కనిపిస్తుంది.ప్రేరణ కలగడాన్ని చిత్రించే ఈ భావ చిత్రం అందుకు నిదర్శనం

"పిల్లలెవరో కాగితంపై రంగులు చల్లుతున్నట్టు
ఆటలో విరామం నిండిన ప్రశాంతతలోకి
ఏవో మృదువైన స్పందనలు వచ్చిచేరుతాయి"

భావచిత్రాలను1.అలంకారాలు2.పాశ్చాత్య కళాపద్దతులు3.మనోవైఙ్ఞానిక భూమిక ద్వారా మూడురకాలుగా చిత్రిస్తారు."చల్లుతున్నట్టు"అన్నక్రియా సంబంధం లోంచి ఉపమావాచకం ద్వారా ఇది అలంకారపద్దతిలో జరిగిందని చెప్పవచ్చు.చివరి వాక్యంలోంచిచూచినా "శాంతి వృత్తంలా/నీడరూపం వచ్చినట్టు"ఇలాంటివే.

మొదటి వాక్యంలోని"వాలటం"2 లోని"క్షణాలు
నోట కరవటం"ఇలాంటివన్ని స్థితులలోని క్రమాన్ని చూపుతాయి."ఈ పావురాలు ఎగిరేందుకు వచ్చినవికావు/వాలెందుకు వచ్చినవి"అనటం.చివరి వాక్యం కవిత ప్రయోజనాన్ని,అంతర్ముఖీనతని ప్రదర్శిస్తాయి.

"ఈ పావురాలు అందుకే వస్తాయి.
ఇవి నిశ్శబ్దం పొట్లాన్ని విప్పి శబ్దాన్ని వెదజల్లవు.
శబ్దం పొట్లాన్ని విప్పి నిశ్సబ్దాన్ని పంచి పెడతాయి"

ప్రతీక,దాన్ని నిర్వచించేతీరు,అందులో చిత్రించిన భావ చిత్రాలు..అందులోని దర్శనం బివివిని ప్రత్యేకంగాచూపుతాయి.తెలుగుకవితలోని ఒక ప్రధాన మార్గాన్ని ఆవిష్కరిస్తాయి.

5.8.2013
                                                                                                          _____________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

పెన్నా శివరామకృష్ణ-పోలిక ఒక మాధ్యమం






ఋగ్వేదంలో దశమ మండలంలో ఒక ఋచ ఉన్నది."చత్వారి వాక్ పరిమితా పదాని.తానిత్రీణి గుహితానేంగయంతి.తురీయం వాచో మనుష్యావదంతి"ఇందులో చత్వారి వాక్ అనేది గమనించదగ్గది.-వాక్కు యొక్క నాలుగు దశల్నిఈ ఋచ చూపింది."పశ్యంతి,మధ్యమ,వైఖారి నాలుగవది పరా".పశ్యంతి-చూచుచున్నది,మధ్యమ-అభివ్యక్తికి కావాల్సిన ఙ్ఞాన ,సౌందర్య,కళా,శాస్త్ర పరిఙ్ఞానాన్ని కూర్చుకునే దశ.మూడవది బయటికి చెప్పే అంశం.నాలుగవది వీటికి అతీతమైంది.

మిత్రులు పెన్నా శివరామ కృష్ణ కవిత "పోలిక ఒక మాధ్యమం"లో ఈఅంశాల్లోని మధ్యమ దశని స్పర్శించారు.సాధారణ,చర్వణ,ధారణ,మనన,సృజన అనేవి అలౌకిక వ్యాపారాలు.చూడటం,చూసినదాన్ని నెమరువేసుకోటం,దాన్ని ఙ్ఞానంలో పాదుకోటం,దాన్ని సమన్వయం చేసుకోటం,-సృజంచడం ఇవి.బుద్ది దేన్ని అనుసరిస్తుందనేది ఒక ప్రశ్న?శాకుంతలం "బుద్దిఃకర్మానుసారిని"అన్నది.బుద్దికి చేసే పనులే కారణం.

కవిత్వంలో గాని సాధారణ వ్యవహారంలో గాని పోలికలు కనిపిస్తాయి.ఈపోలికలే ఏరకమైన సంభాషణకైనా మాధ్యమం అంటున్నారు కవి.ప్రతిపదానికి యోగ,ఆయోగ,ఔపయోగిక,సమన్వయ ,ఆవృత్తమనే దశలు ఉంటాయి. ఈ కవితలో ఇలాంటివి కనిపిస్తాయి.

శివరామకృష్ణ గారి వచనంలో వేగం(swift)ఉంది.దేన్నయినా మరింత భారంగా చెప్పడానికి పోలిక ఒక మాధ్యమం.దీని ఉపయోగాన్ని.ఉనికిని,రూపాలని కవితలో వ్యక్తం చేస్తారు.

"పోలిక ఒక ఉపగ్రహం/ఆత్మ ప్రదక్షణం చేస్తూ/భూగోళం చుట్టూ తిరుగుతుంది"ఇది ఉనికిని చెప్పే వాక్యం.పోలికలకు ఎక్కడో వెతకాల్సిందిలేదు.ఈ భూమిపైనే ఉన్నది.

"సకాలానికి అస్తమించే సూర్యుడిని గుర్తుచేసుకోకపోతే/చీకటి బాహువుల్లో క్షణ క్షణం/వెలుగులజల పొంగేదెట్లా?"పోలిక యొక్క విస్తృత రూపాన్ని అనేకకోణాల్లో పరిచయంచేస్తారు.అనేకాంశాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి.

"పోలిక ఓ విశ్వజనీన మాధ్యమం/
పోలిక దృశ్యా దృశ్యాల మధ్య పూల వారధి/
పోలిక వేదిక కొక ఆహార్యం మార్చుకునే నర్తకి/
రుతువుకొక రాగం పలికించే విచిత్ర పల్లవి"

లెనిన్ ప్రతిఫలన సిద్దాంతాన్ని (reflection theory)ప్రతిపాదించాడు.ఒక అంశంపై అనేక అంశాల ప్రతిఫలనం ఉంటుంది.నిర్మాణంలో వస్తువు ఉనికిని,అది విస్తృతమైన రీతిని అందులోని వాక్యాలే చెబుతాయి.శైలిలో వేగంతోపాటు సరళంగా కనిపించే వాక్యాల మధ్యన పేర్చిన సమాస బంధాలు కూడా ఈవేగాన్ని పెంచాయి.

"అశ్రు దరహాస తటిల్లత"
"నిక్షిప్త దరహాస మధురిమ"
"అనంత నీరవ నీరధి"-అలాంటివే..

బుద్ది అనేదానికి ఙ్ఞానం ప్రధాన ఆకరం.ఈ ఙ్ఞానంలో ప్రతిఫలనాలు అనేకం .బుద్దిజీవులు సూక్ష్మం నుంచి అనంతం లోనికి ప్రయాణం చేస్తారు.ఈ కవిత అలాంటిదే.
మంచికవితని అందించినందుకు పెన్నాశివరామ కృష్ణ గారికి,మనకు పునః పరిచయం చేసినందుకు యాకూబ్ గారికి ధన్యవాదాలు.

6.8.2013


                                                                                                         _______________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

శివసాగర్ కవిత-నడుస్తున్న చరిత్ర


       
తెలుగు నేలమీద సోషలిస్టుపార్టీల ఆవిర్భావం తరువాత ఆ తాలూకు తాత్వికతలు,దృక్పథాలు అనేక అంశాలపై ప్రతిఫలించాయి.ఆ మార్గంలో ప్రత్యేక సాహిత్య మార్గాలు కూడావచ్చాయి.మార్క్సిస్ట్ సాహిత్య విమర్శనాపద్దతులు పాదుకొనడానికీ ఊతమిచ్చాయనటం కూడా అతిశయోక్తికాదేమో..బహుశఃఅభ్యుదయవాదం నుంచి అనంతర ప్రజా ఉద్యమ ధోరణులలో కూడా ఈ వాస్తవికత ప్రభావాన్ని కాదనలేం.

విమర్శలోనూ ఈమార్గంలో సవిమర్శక వాస్తవికత(Critical Realism)సామ్యవాద వాస్తవికత(Socialist Realism)అనే రెండు పదాలు కనిపిస్తాయి.మొదటిది-సమాజంలోని వ్యత్యాసాలను,వైరుధ్యాలను గుర్తించి,చిత్రించే ప్రయత్నం చేసింది.రెండవది సవిమర్శకవాస్తవికత కన్న ముందడుగు వేసి మార్క్సిస్ట్,లెనినిస్ట్ సిద్ధాంతాల ద్వారా-విప్లవం ద్వారానే ఉన్నతమైన సమాజం ఏర్పడుతుందని నమ్మింది.

ఇందుకోసం సోషలిస్టు వాస్తవికత ఓ తాత్విక ధారని సృష్టించింది.ఇందులో కొన్ని ప్రధాన అంశాలని గుర్తించవచ్చు.
1.విషయాలను పైపైన చూడటంగాక వాటికారణాలనూ అర్థంచేసుకోవడం మొదలుపెట్టింది.
2.ప్రతి అంశాలూ సహ సంబంధాన్ని కలిగి ఉంటాయని అభివృద్ధికి వర్గాలమధ్య సంఘర్షణ తప్పదని నమ్మింది.
3. పీడిత ప్రజల పక్షపాతంతో వారిలో చైతన్య సాధన ,నూతన సమ సమాజ స్థాపనకోసం ప్రయత్నించింది.

శివసాగర్ కవిత్వంలో రెండు తాత్విక ధారలు ప్రధానంగా కనిపిస్తాయి.అవి వైప్లవిక ,దళిత ఉద్యమాలు.ఈ రెంటికీ దగ్గరగా ఉన్నదే సోషలిస్టు వాస్తవికత.నిజానికి దళిత సాహిత్యానికి ఓ మేనిఫెస్టో లాంటి నిర్మాణ దార్శనికతనిచ్చిన కవిత శివసాగర్ ది.శంబూకుడు,ఏకలవ్యుడు మొదలైన పాత్రలని దళిత ప్రతీకలుగా అందించిన కవిత"నడుస్తున్న చరిత్ర". ఇప్పటికీ దళిత సాహిత్యాన్ని అంచనా కట్టడానికి శివసాగర్ కవిత సాహిత్య ప్రమాణం(Litarary Criterion).

"శంబూకుడు పెదాలమీద చిరునవ్వుతో/
రాముణ్ణి వధిస్తున్నాడు
ఏకలవ్యుడు ద్రోణుని బొటన వేలును
గొడ్దలితో నరుకుతున్నాడు"

"మనువు కళ్లలో సూదులు గుచ్చుకుని
నాలుక తెగ్గోసుకుని/చెవిలో సీసంపోసుకుని/
స్మశానంలో దొర్లుతున్నాడు"

వాద నిర్మాణంలోప్రాతిపదికగా మూడు సమీకరణలున్నాయి.ఇవి వాటి గమనాన్ని నిర్దేశిస్తాయి.1.స్వీయ అస్తిత్వోద్దీపన 2.తిరస్కారం 3.ధిక్కారం.ధిక్కార దశలోనే వాక్యాల్లో ప్రతీకార స్వరం వినిపిస్తుంది.ప్రతీకార,సంఘర్షణల్లోనే చరిత్ర పునర్నిర్మాణమౌతుంది.ఈ స్వరం ఈ కవితలోని అన్ని వాక్యాల్లో కనిపిస్తుంది.

శివసాగర్ తరువాతి కాలం శంబూకున్ని,ఏకలవ్యున్ని దళితప్రతీకలుగా అనేకసార్లు చిత్రించింది.బలిని తక్కువే.శివసాగర్ తరువాత కవిత్వం కర్ణుడిని కూడ ప్రతీకగా పరిచయం చేసింది కానీ ఈప్రతీకను కూడ తరువాతి కాలాల్లో కొనసాగించినట్లు కనిపించదు.ఈ మార్గంలోనే ఎండ్లూరి సుధాకర్"గోసంగిని"పరిచయంచేసారు.

జాషువా గబ్బిలం దళిత వాదానికి ఒక స్పృహని ఇచ్చివెళితే శివసాగర్ దానికి ఒక చైతన్యాన్ని దార్శనిక అస్తిత్వాన్ని చారిత్రక దృష్టిని ఇచ్చారు.

సాహిత్య చరిత్రకు ప్రధాన ఆకరమైన ఈకవితను పునఃపరిచయం చేసినందుకు కపిల రాంకుమార్ గారికి ధన్యవాదాలు.

7.8.2013







                                                                                                            _______________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ



 





తెలుగులో1980 కి ఈవలిదశనుంచి సాహిత్యంలో స్త్రీవాదం ఒకటి కనిపిస్తుంది.60 కాలాలల్లోనే అమెరికా,బ్రిటన్,ఫ్రాన్స్ వంటి దేశాలలో వీటి జాడలున్నాయని విశ్లేషకుల మాట.దీనిని ఆనుకొని ఒకవిమర్శాపద్దతికూడా ఉన్నప్పటికి దీని క్రమ వికాసాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరముంది.

తొలి దశల్లో ఆర్థిక ,సామాజిక,సాంస్కృతిక అసమానతలపై దృష్టి పెట్టిన స్త్రీవాదం ఇప్పుడు మానవీయ విలువలతో జీవితాన్ని చిత్రిస్తూ కొత్త కోణాలని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తొంది.


సంస్కృతంలో శ్రీనివాస రథ్ అనే పండితుడు "తదేవ గగనం సైవ ధరా"అనే సంపుటిని ప్రచురించారు.అందులో ఓ చోట"శాస్త్రగతా పరిభాషాధీతా గీతామృతకణికాపి నిపీతా,కో జానీతే తథాపి భీతా కేన హేతునా విలపతి సీతా"(విఙ్ఞాన శాస్త్రాలలో వృద్దిని సాదించాం,భగవద్గీతను కొత్తగా అర్థం చేసుకో గలిగాంగాని ఇప్పటికీ సీత(స్త్రీ)ఎందుకు దుఃఖిస్తుందో ఎవరికి తెలుసు)అన్నాడు.

సాంకేతిక పురోగతిని అభివృద్దిగా చెప్పుకుంటున్న సందర్భంలో నైతికంగా ఎలా మానవీయ విలువలని కోల్పోయామో ఈ వాక్యాలు చెబుతాయి.

జ్యోతిర్మయి మళ్ల గారికవిత కూడాఇలాంటిదే..ఆధునిక దశలో సాహిత్యం మనోవైఙ్ఞానికాంశాలమీద దృష్టిపెట్టింది.ఈక్రమంలో జ్యోతిర్మయిగారు రెండు పాత్రల మనస్సులను,అందులో ఒకేపదంపై స్వభావగతంగా ఉండే భావనలనుదర్శించి కవిత్వీకరంచడం కనిపిస్తుంది.కవిత్వంలో పెద్దగా కళ.దర్శనం,వర్ణనలాంటివి లేక పోయినా ఈ కవిత సిద్దాంత ధర్మాన్ని మోసింది.

స్వభావగతంగా వ్యక్తులు,వర్గాల మధ్య వచ్చే అర్థ వైరుధ్యాలను"విపరిణామం"గాచెబుతారు.ఈస్పృహతో స్వభావాలని,దాన్నించి జెండర్ వర్గాన్ని నిర్వచించే ప్రయత్నం చేసారిందులో.

"కొంటె కళ్లతో ఆమె
చంపేయ్ నీచేతుల్లో చచ్చి పోవటం నాభాగ్యం
అతని గుండెలపై వాలి పోయింది"

"ఏమన్నా చేసుకో/నా అణువణువూ నీదేగా/
కళ్లు మూసుకుంది/-/ఆ కళ్లు అప్పుడే మూసుకు పోయాయి శాశ్వతంగా/"-చంపటం అనేపదం చుట్టూ రెండు దృశ్యాలను చిత్రించి ఈకవితను సాధించారు.

జెండర్ వైరుధ్యాలను ప్రాతిపదిక స్థాయినుండి కొన సాగించినట్టుగాకాక ఓకొత్తచూపు,ఆవిష్కరణ కనిపిస్తాయి.ఇందులోని స్త్రీ గొంతుక వాదతాత్వికతని కూర్చుకున్నా మానవీయ అన్వేషణ కనిపిస్తుంది.

నిర్మాణం,వాక్య రచన,అభివ్యక్తి విషయంలో ఈకవిత సౌష్టవంగాఉంది.మంచికవిత అందించినందుకు జ్యోతిర్మయి గారికి అభినందనలు.మరింత మంచి రచనలతో ముందుకువెళ్లాలని ఆశిద్దాం.

8.8.2013


                                                                                                         _______________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ







సాహిత్యంలో మనస్సుకు,అందులోని వాతవరణానికివిలువ హెచ్చిన తరువాత కవిత్వ మార్గాలు అనేకంగవచ్చాయి.ఇవన్నీ అభివ్యక్తి మార్గాలను బలపరిచాయి.అస్పష్టత అన్న నిందకూడా కవిత్వం అప్పటినుండే మోయటం మొదలు పెట్టింది.

ఎం.ఎస్.నాయుడుగారి కవితలో "స్వాపము"అనే పదం ఒకటి ఈకవితలోకి మార్గాన్ని తెరుస్తుంది.స్వాపం-అనే పదానికి కల,పడుకోటం,నిద్ర,అఙ్ఞానం అనేఅర్థాలున్నాయి.ఇందులో గమనించాల్సింది ఇవన్నీ భౌతికాతీతాలు.

కలలు వాటికవేవస్తాయని చాలావరకు విశ్వసిస్తున్న క్రమంలో వైఙ్ఞానిక శాస్త్రంలో కొన్ని అంశాలు కనిపిస్తాయి.పూర్వం గ్రీకుల్లో అభిలషిత స్వప్నం(disired dreems)పొందే విధానం ఉండేది.ఈక్రమంలో "పొదుగుడు"(Incubetion)కేంద్రాలు వుండేవి.ఒక విషయం పై దృష్టిఉంచి,అదే వాతావరణంలో నిద్రించి స్వప్నాలనుపొందటం ఈసాధనలోని అంశాలు.ఈ కలల్ని తనకుండే ఉద్వేగ,ఉత్సాహ,ఉద్రేకాలమేరకే పొందుతాడు.సృజన కూడా అలాంటిదే.

అరిస్టాటిల్ గురువైన ప్లేటో స్వప్నంలో ఔద్వేగికాంశాన్ని (Exaitment particular)గురించి చెప్పాడుఈ సమయంలోనే మనిషిలో ఉండే వివిధ ప్రవృత్తులగురించి చర్చించాడు.థామస్ హబ్స్"అంతరంగావయవాల తాపం "(Distemper of inner parts)స్వప్నానికి మూలం అని అన్నాడు.ఫ్రాయిడ్ "స్వప్నార్థ వివరణ"(Interpredetionof dreams)వచ్చినతరువాత ఈఅధ్యయనానికి ఒక శకం మొదలైంది.

భౌతిక వాంఛలు స్వప్నాలయ్యేతీరుని,వాటి క్రమాన్ని గురించి కవిత్వీకరించడం కనిపిస్తుంది.మనస్సు ఏ మార్గంలో వెలుతున్న దనేది అంచనా వేయలేం.కవిలోని కవితాస్ఫూర్తి అందుకు కొంత అవకాశమిస్తుంది.నాయుడు గారి మొదటి వాక్యం ఓ భౌతిక క్రమాన్నించి జారుకునే అంశాన్ని చెబుతుంది.

"ఉత్త పెదాల్నే కడుక్కొనివొస్తాను
పెదాల్ని అక్కడే వదిలి"

"కాస్త నిరాకరించే పెదాలు
ఎప్పటికీలేని మౌనంలో"

సృజనసంబంధ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు 'పెదాలు 'పై విషయాలను చెక్కే భౌతికాంశాలు.వర్డ్స్ వర్త్ కవిత్వాన్ని గురించి కాకపోయినా సృజనకి వెనుక ఉండే కొన్ని అంశాలగురించి మాట్లాడారు.భ్రాంతి(Illussion)విభ్రమం(Hallucinetion)సంభ్రాంతి-మనోవిక్షిప్తి(Paranoid)సమ్మోహనిద్ర(Hypnosis)బహు మూర్తిమత్వం(Multi personaality) ఈ అంశాలు సాహిత్యంలో అనేకంగా కనిపిస్తాయి.

నాయుడుగారి పైవాక్యాల్లో ఈమనో విక్షిప్తి ఉంది.ఎ కవితలో కనిపించే ఓ కళాత్మకానుక్రమణం(Artistic succession)ఉంది."వేళ్లు-వృక్షాలు"అందుకు ఉదాహరణ.హొతికాంసాలలో ఒక క్రమం ఉన్నట్టు మానసికాంశాలలోనూ ఉంటుంది.లేదా సృజనదశలో అలా పేరుస్తారు.

మాలినోవిస్కీ స్వప్నాలను 1.(వైయ్యక్తిక)స్వేచ్చా స్వప్నాలు 2.అధికారిక స్వప్నాలు అనివిభజించాడు.వ్యక్తి జీవిత ప్రభావంతో అతని ఇష్టంతో సంబంధంలేకుండాంతర్గత శ్క్తులు మలచగ పుట్టింది మొదటిది.శుభాశుభాలను నిర్ణయించుకొని తనకోరికల మేరకు పుట్టింది రెండవది.కవులు,సృజనకారులు బహుశః రెండవ కోవకు చెందుతారు.తెలుగులో వీటిని అర్థం చేసుకోడానికి తగిన ఆకరాలు లేవనేచెప్పాలి.ఇదిసమకూరాలనికోరుకుందాం.నాయుడుగారికి అభినందనలు

9.8.2013



                                                                                                                 ____________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

భవాని ఫణిగారి కవిత-ఉత్తరమొచ్చింది.




సందేశాత్మక వచనం కవిత్వంలో తెలుగు నేలమీదికి అడుగుపెట్టిచాలా కాలం అయ్యింది.వ్యాస భాగవతంలో "రుక్మిణి"కృష్ణునికి లేఖ రాస్తుంది.కాలిదాసు మేఘ సందేశాన్ని గురించి తెలియని వారుండరు.ఆమధ్యన ఓ సినిమా రచయిత కూడా"కాబోయే శ్రీవారికి"అంటూలేఖని కవితా ఆఖ్యానంలో పొందు పరిచారు.

భవానీ ఫణి గారికవిత"ఉత్తరమొచ్చింది"కూడ ఆలాంటిదే.కవితానిర్వహణలో ఆఖ్యానం,వ్యాఖ్యానం అని రెండు భాగాలున్నాయి.ఆఖ్యానం లో కథనాత్మకత ఉంటే,వ్యాఖ్యానం లో కళాభివ్యక్తులుంటాయి.

ఇలాంటి కథనాలలో వ్యక్తుల సంబంధ సంభావ్యతలగురించి కూడా గమనించాలి.ఓ అమ్మాయి తనభర్త విషయాన్ని తనకు తాను చెప్పుకోడానికి .మరొకరితో చెప్పుకోడానికి ,తన భర్తతోనే పంచుకోడానికి మధ్య తేడాలున్నాయి.ఈతేడాలే సంభావ్యతలకు మూలం.

భవానీ ఫణిగారి కవిత ఓసైనికుడి భార్య అంతరంగాన్ని ఆవిష్కరించిది.ఈ కవితలో వ్యక్తుల సంభావ్యత ఎంత గొప్పగాపరిమళించిదో,మానసిక భూమిక గూడ అంతే ప్రగాడంగా అల్లుకుంది.చాలాబలమైన వాక్యాలు అడుగడుగునా కనిపిస్తాయి.ఓ ఆర్ద్రమైన స్వరం ఈకవిత నిండా మూగగా,గర్వంగా,ప్రేమగా అనేకరకాల అభినివేషంతో ప్రవర్తిస్తుంది.

ఈకవితనిండా భాషని కావలసినంతా మార్దవంగాఉపయోగించారు.

""కన్నెటి పొరలతో కాసేపు/ పోరాడితే గాని కంటిపాపకు/కోరుకున్నది దొరకలేదు"

"మంచులో తడిసిన పూలరేకుల్లా/కనురెప్పల్ని విదిల్చాను/
నువ్వు రాసిన ఓ అక్షరం/తడిసి అలుముకు పోయిందని /ఎంతగా గాభరా పడ్డానో"

ఈ రెండు వాక్యాలుచాలు ఇందులోని తాదత్మ్యత గురించి మాట్లాడటానికి.ఆఖ్యానంలో తరంగ వైరుధ్యాలని లెక్కిస్తారు.ఇవి వ్యక్తినించి,విషయం నించి,శారీరిక ,మానసిక స్థాయిలనుండిలెక్కిస్తారు.నిజానికి ఈవిశ్లేషణ కథానికలలో చేయడమే తెలుసు.మంచి కళాత్మక వాక్యాలున్నవి
కూడా ఉన్నాయి.

""అప్పుడే జల పడిన బావిలా /ఎంతగా ఊరిపోయాయో నీళ్లు,కళ్లనిండా"

"శ్రావణ మేఘంలా ఉన్నానని చెబితే సరిపోతుందేమో"

"ఏమిటో చెంపలు ఎప్పుడూ తడిగానే ఉన్నాయి/చిరపుంజీలోని చిత్తడి వేళ్లలా"

భవానీ ఫణిగారి వాక్యాలలో మంచి కవితా శక్తి ఉంది.మరిన్ని మంచి కవితలతో ముందుకురావడానికి ఆశక్తే మార్గం చూపుతుంది.

10.8.2013


                                                                                                                             ________________ఎం.నారాయణ శర్మ