పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

4, నవంబర్ 2013, సోమవారం

కవిత్వంతో ఏడడుగులు




నిజానికి జీవించడం ఒక కళ. అసలు జీవించడమంటే ఏమిటో తెలుసుకోగలగడమే పెద్దకళ. దానికి ఇది ఇది అని పూర్తిగా తెలియనక్కరలేదు. ఒక రేఖామాత్రపరిజ్ఞానమైనా చాలు. పరిమితులు లేని జీవితం ఏదీ ఉండదు... బలహీనతలు లేని వ్యక్తీ ఉండడు. కానీ పరిమితులకిలోబడి, బలహీనతలు గుర్తించి, జీవితాన్ని ఎంచుకున్న లక్ష్యంవైపు నడిపించుకోగలగడంలోనే వ్యక్తిత్వం రూపుకడుతుంది. అదే ఋషిత్వం.

అటువంటి అపురూపమైన వ్యక్తిత్వం ఎమిలీ బ్రాంటే ది.

నిజానికి కలం పట్టుకున్న ప్రతివ్యక్తీ ఋషి కావలసిందే. అందుకే నానృషిః కురుతే కావ్యం అన్నారు. అలాంటి ఒక ఋషిలాంటి కవయిత్రి ఎమిలీ బ్రాంటే. ఆమె జీవిత చరిత్ర చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. తల్లి ఆమె మూడేళ్ళవయసులోనే చనిపోతుంది . ఆమె కళ్ళముందే ఇద్దరు అక్కలు చనిపోతారు. తండ్రి చాలా కట్టుబాట్లలో పెంచుతాడు. స్కూలు వాతావరణం ఆరోగ్యకరంగా లేకపోవడంతో ఒక ప్రైవేటు ట్యూటరు ద్వారా భాషలో ప్రాధమిక పరిజ్ఞానం సంపాదించినా, ఇంట్లో ఉన్న పుస్తకాల చలవవల్ల బైరన్, షెల్లీ, స్కాట్ వంటి హేమా హేమీల రచనలు చదివే అవకాశం వస్తుంది. స్వయంకృషితో ఫ్రెంచి జర్మను నేర్చుకుంటూ, ఇంకొకపక్క ఇంటిపనులన్నీ నిర్వహిస్తూ, మరొకపక్క పియానో నేర్చుకుంటూ ( ఇవన్నీ ఇంకా 20 ఏళ్ళ వయసు రాకముందే) ఆమె చూపిన అసమానమైన వ్యక్తిత్వానికి బ్రస్సెల్స్ లో ఉన్నప్పుడు ఆమెకు విద్యగరిపిన టీచరు ఏమంటున్నాడో గమనించండి: " ఈమె అబ్బాయిగా పుట్టవల్సింది. ఒక గొప్ప నావికురాలై ఉండేది. ఆమెకున్న సునిశితమైన తార్కిక శక్తితో సరికొత్త ఆవిష్కరణలు చేసి ఉండేది. బాధలవల్ల గాని, వ్యతిరేకతలవల్ల గాని ఆమెలోని పట్టుదల పిసరంతైనా మొక్కవోయేది కాదు."

స్వేఛ్ఛఒకరిచ్చేది కాదు. జీవించడం ఒకరు మప్పేది కాదు. మనకు లేనివాటిని గూర్చి జీవితకాలం తర్కించవచ్చు. నిందించవచ్చు. కాని మనిషికున్న పరిమితులకి లోబడి ఉన్న అపారమైన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ గడపడం అంత తేలిక కాదు. ఆ అవగాహన అంత చిన్నవయసులో రావడం అంతకన్నా కష్టం.

ఈ కవిత నిజం చెప్పాలంటే ఋషివాక్యమే. ఆమె మేధోశక్తికే కాదు, ఆమె విశ్వాసాలకీ, బలమైన వ్యక్తిత్వానికీ ఒక సూచిక. మనలాంటివాళ్లకి ఒక వెలుగురేక.


వృధ్ధ విరాగి
.

సంపదలు విలువైనవిగా భావించను,
ప్రేమ? ఆ మాటంటేనే నాకు నవ్వొస్తుంది,
కీర్తి కాంక్ష ఒక కల
ఉదయమవుతూనే కరిగిపోతుంది
.
నేను ప్రార్థించడమంటూ జరిగితే
నా పెదాలమీద కదిలే మాటలు ఒకటే:
నా మనసు నా అధీనంలో వదిలీ
నాకు స్వాతంత్ర్యాన్ని ప్రసాదించు!
.
అవును. నా రోజులు తొందరగా లక్ష్యాన్ని సమీపిస్తున్నకొద్దీ,
జీవనం లోనూ, మరణం లోనూ, నే కోరుకునేది,
సంకెలలులేని మనసూ,
దేన్నైనా ఎదుర్కోగల ఆత్మ స్థైర్యమూ. అంతే!
.
ఎమిలీ బ్రాంటే
బ్రిటిషు నవలాకారిణి, కవయిత్రి
(30 జులై 1818 – 19 డిసెంబర్ 1848)

.
The Old Stoic
.
Riches I hold in light esteem;
And Love I laugh to scorn;
And lust of fame was but a dream
That vanished with the morn:
.
And if I pray, the only prayer
That moves my lips for me
Is, 'Leave the heart that now I bear,
And give me liberty!'
.
Yes, as my swift days near their goal,
'Tis all that I implore;
In life and death, a chainless soul,
With courage to endure.
 









Emily-Bronte
(1846)


                                                                                                                          ______నౌడూరి మూర్తి 

నీలాగే ఒకడుండేవాడు

http://www.youtube.com/watch?v=6IWqRZuKc-k

కవిత్వ విశ్లేషణ

కెక్యూబ్ వర్మ -దుఃఖ దీపం


తొలిదశల్లో అలంకారశాస్త్రం,కొంత కాలానికి కళాతత్వశాస్త్రం.ఇంకాకొంత కాలానికి మనస్తత్వ శాస్త్రం వచ్చాక సాహిత్యంలో అనేకమైన అంశాలు చర్చకు వచ్చాయి.ప్రధానంగా అలంకార శాస్త్రం నాటికే మనస్సు కు సంబంధించిన చర్చ ఉన్నప్పటికీ,సాహిత్యంలోనూ మనస్సుకు సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ పాశ్చాత్యులు వేసిన దారులు గమనింప దగినవి.

దుఃఖానికి మూలం సుఖం పైనున్న యావేనని భారతీయ తాత్వికుల ఆలోచన.ఈ ఆశావహ జీవితాన్ని అందుకోలేక పోవడమే దుఃఖ హేతువు.అందుకోలేని అంశం ఎలా అవగాహన లోకివస్తుందనేదీ ప్రశ్న.అది ఇతరజీవితాలని గమనించటం.దాన్నించి తనని గ్రహించటం.ఈ అనుభవాన్ని కళాకారుడు ప్రకృతినించి కూడా అనుభవిస్తాడు.

మానసిక యంత్రాంగాన్ని గూర్చి ఫ్రాయిడ్ కొన్ని సూత్రీకరణలు చేసాడు.మనో యంత్రాంగం లేదా స్వప్న యంత్రాంగం(The mechnism of Dreems)సంఘర్షణకు,బాధకు ప్రతినిధి.ఒక సందర్భం నించి కలిగే అనేక భావనలకు,వికారాలకు ఇదే మూలం.ఇందులో నాలుగు భాగాల్లో వ్యత్యయీకరణం(Displacement)ఒకటి.ఇది రెండు రకాలుగా జరుగుతుంది.అవ్యక్తాలోచనకు సంబందించిన వస్తువు భాగం మాత్రమే అభివ్యక్తిలో కనిపిస్తుంది.ఒకరకంగా అలంకార శాస్త్రంలో (Synecdoche)సారోపలక్షణను పోలి ఉంటుంది.ఒక అంశాన్ని మరోదానితో ఆరో పించి చెప్పటం.

పోల్చే అంశం ప్రతీకీ కరణం(Symbolisetion)కు లోబడి జరుగుతుంది.దర్శనం వీటిని దృశ్య ప్రతిమలు(Visual images)గా స్వీకరిస్తుంది.మనవాడుకలోని అనేక పదాలు ఇలానే ఏర్పడ్డాయి.భాషాశాస్త్రం తెలిసిన వాళ్లకి ఈ విషయంకొత్త గాదు.మనం అమూర్తార్థంలో పదాలను ఉపయోగిస్తాం కాని ఇవి ఒక మూర్తార్థాన్ని ఆధారం చేసుకునే పుట్టాయి."కుశలుడు"-అంటే చేయితెగకుండా దర్భలు కోసేవాడని,"ఘటికుడు"అంటే కుండ పొట్టకింద ఉంచుకుని నదిని ఈదేవాడని ఆర్థాలు. ఇతిహాసాలలో పేర్లు ఇలా మూర్త భాగాలనించి వచ్చినవే.అందువల్ల మూర్త భాగానికి సారూప్యాన్ని పట్టుకోవడం మనసుకు బాగా అలవాటైన పని.

కెక్యూబ్ వర్మ గారు మనిషికి దీపానికి మధ్య సారూప్యాన్ని ఆధారం చేసుకుని తాత్విక పునాదులనుంచి జీవితాన్నినిర్వచించారు.జీవితంచుట్టూ జరిగే అనేక అంశాలతో ప్రతీకాత్మకంచేస్తూ జీవితాన్ని నిర్వచించారు.

"నీ చుట్టూ కొన్ని ప్రమిదలు వెలుగుతు/గాలి నిన్ను కూచోనివ్వదు"

"నీ అరచేతులు చాలనప్పుడు లోలోన/దిగాలు ఒక్కసారిగా అసహనంగా"

"ఈ ప్రమిదలలోని నూనె ఒలకనీయక/దీపపు నీడ దాపెట్టే విఫలయత్నం"

"నీ చుట్టూ ఇన్నిన్ని క్రీనీడల సయ్యాటల/భయ దృశ్యం అల్లుకుంటూ"

"నీ చుట్టూ ఓ దీప తీరం వలయంలా/అల్లుకుంటూ అచేతనంగా"

"ఈ కాంతి రేఖల రాక పోకల/వ్యవధి మధ్యలో ఎన్ని మిణుగురుల ఆశలు"

అనేకదృశ్యాలు ఇందులో కనిపిస్తాయి.ఇందులో "నీ" అనే పదం మాత్రమే కేవల వ్యక్తి వాచకం.ఇది లేకుంటే"గాలి/క్రీనిడ/నూనె ఒలకటం /కాంతి రేఖలు/మిణుగురులు/వలయం "లాంటి వన్ని అర్థపరంగా సామాన్యీకరణంచెందేవి.కాని వ్యక్తి వాచకం వల్ల ఇవన్నీ జీవితాన్ని అందులోని ఆటుపోటులని,కాపాడుకోడానికి పడే బాధని వ్యక్తం చేస్తాయి.అర్థక్షేత్ర పరిధిలో చూస్తే ఇవన్నీ దీపం అనే పరిధికి చెందినవే.

"చిక్కనవుతున్న చీకటి పాట/గాలి అలలనలా కోస్తూ"

"అచేతనంగా అభావమౌతున్న/రూపం ధూప కలికమవుతూ"

"నీ ఒక్కడివే ఈ గదిలో/ఒంటరిగా ప్రమిదలో దు:ఖ దీపమౌతూ"

చివరి క్షణాలని వ్యక్తం చేస్తున్నట్టుగా అనిపించే ఈవాక్యాలు కూడా జీవితం చుట్టూ ప్రతీకాత్మకంగా అల్లుకున్నవే.దర్శనం దృశ్యాలని చేజిక్కించుకుంటే అది విఙ్ఞానం రూపంలో లోనికి వెళ్లి ఙ్ఞానం ,అనుభవం ద్వారా కళగా వ్యక్తం చేయబడుతుంది.మంచి దార్శనిక కళానుభవం ఉన్న కళాకారుడే దాన్ని అందుకో గలుగుతాడు,అందించగలుగుతాడు.మంచి కవిత అందించిన కెక్యూబ్ వర్మ గారికి ధన్య వాదాలు.
                                                                     
                                                                                                                                                        
 
 
 
 
                                                                                                                                                      __________ఎం. నారాయణ శర్మ