పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Prav Veen లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Prav Veen లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

chintam praveen ||కాకతీయ కీర్తితోరణం||

తలెత్తకుండా ఉండలేం
తలేత్తితేగాని చూడలేం

ఆత్మగౌరవానికి వెయ్యేండ్ల సజీవసాక్ష్యం
ఈ మట్టి పోరాటానికి శిలారూపం
కాకతీయ కీర్తితోరణం

రాజులు రాజ్యాలు
మట్టిపొరల్లో సమాధి చేయబడ్డా
తలొంచుకున్నోడికి
తలెత్తడం నేర్పే గంభీరత్వం తాను

ఒక్కరా ఇద్దరా
వేలమంది నియంతలు మతోన్మాదులు
వీరచరిత్రను కాలగర్భంలో కలిపేయాలని కలలుగన్నరు
ఒక్కడైనా మిగిలిండా
కాకతీయ కీర్తితోరణం తప్ప

నిలువెత్తు రాజ్యాన్ని కబలించాలనీ
ఎంతమంది
దండయాత్రల దండుతో మీసం దువ్వారో_

తీరా నిన్నుచూసాకా_

ఎంతమందికి వెన్నులో వణుకు పుట్టిందో
ఇంకెంతమంది నిలువెళ్ళా కంపించిపోయారో
రొమ్మువిరిచి నిలిచిన నీ రాజసాన్ని చూసి_

వంగీ సాగిలపడీ మోకరిల్లీ శరణుజొచ్చారే గాని
సవాల్ విసిరి నిన్నుదాటిన శత్రువొక్కడు లేడు

మహోజ్వల సామ్రాజ్యానికి శిలాఫలక
ఓరుగల్లు కీర్తిపతాక

ఉద్యమకారులకు పిడికిలెత్తడం నేర్పింది
వీరులెందరికో పౌరుషాన్ని పురుడు పోసింది
నువ్వే కదా_

ఇప్పటికి నీవు మాకు పిడికిలిబిగి భరోసావే!
మానుకోట రాళ్ళు
రాయినిగూడెం మట్టీ
నువ్విచ్చిన ఆయుదాలే కదా

కాకతీయ కీర్తితోరణం
పోరుగల్లు కీర్తిశిఖరం

12.09.2012

12, సెప్టెంబర్ 2012, బుధవారం

చింతం ప్రవీణ్ || ఏది కవిత్వం ||


ఎన్నాళ్ళీ నియమాల నిచ్చెనమెట్లు
ఇక ధ్వంసం చేద్దాం_

ఈ రంధ్రాన్వేషణలకు
ఈ శిల్పాన్వేషణలకు
ఇక ముగింపు పలుకుదాం_

జనాలకోసం రాస్తున్నప్పుడు
జనాలకు అర్ధంకాకపోతే
అదేం కవిత్వం?

పదాల్ని శిల్పాల్లా సానబెట్టీ
సర్ఫులో నానబెట్టీ
ఉతికి ఆరేసేదే కవిత్వమా?

అర్దంకాకుండా పోయెదే కవిత్వమైతే
అర్దమయ్యేదేంటీ?

విమర్షకుల ఇనుపకచ్చడాల
చట్రాల కిందపడి_
పరిశీలకుల పాముకాటుకు గురై
నురగలు కక్కుతూ
చచ్చీ చెడీ
బతికి బట్టకట్టేదే పదమా
అ పదాలసమూహమే కవిత్వమా?

కవిత్వానికి కులముంటుందా?
కవిత్వానికి మతముంటుందా?

ఎవరు ప్రయోగిస్తే పదం
ఎవరు సాగదీస్తే వాక్యం
ఇంకెవరు ఇరగదీస్తే కవిత్వం?

మంత్ర నగరిలో మృగాళ్ళకు బలైనా అబల స్థితిని
నడిబజారులో నెత్తురోడుతున్న అమరుని త్యాగాన్ని
ఏ శిల్పం ఎవరి సాంప్రదాయ చట్రంలో ఇమడ్చగలం

అందమే ముఖ్యమన్నోళ్ళకు
విషయం ముఖ్యం కాదేమో?
మేళాలు తాళాలే ముఖ్యమన్నోళ్ళకు
తండ్లాట ముఖ్యం కాదేమో?

జనాలు పట్టని
జనాలు లేని కవిత్వానికి
బలముండదు
విలువుండదు
చరిత్ర ఉండదు_

ఎన్నాళ్ళీ నియమాల నిచ్చెనమెట్లు
రండి! ఇక ధ్వంసం చేద్దాం_

12.09.2012

చింతం ప్రవీణ్ || ఆమె ||

ఉదయం ఐతే కొందరికి
సంతోషం ఉదయిస్తుందేమో!
రాత్రి ఐతే ఇంకొందరికి
బాధలు అస్తమిస్తాయేమో!

పగలు రాత్రి తేడాలేదు
ఆమె ప్రతీక్షణం అస్తమిస్తూనే ఉంటుంది

ఋతువులెన్ని మారినా
ఆమెలో మార్పుండదు
జీవితమంతా ఆమెకు ఆకురాల్చు ఋతువే

ఆమె నవ్వు ఆమెకోసం కాదు
ఆమె అందం ఆమెకోసం కాదు
నిజానికి
ఆమె ఆమె కోసం కాదు

ఆమె పంచుతున్నసుఖానికిలాగే
ఆమె స్వేదానికి
ఆమె కన్నీళ్ళకు గురుతుళ్ళేవ్

విలువలు లేని మనుషులు
వలువలు లేని మాటలతో
ఆమెను అంగడిబొమ్మంటు గేలిచేస్తారు...

సృష్టి ఆమెను బహిష్కరించిందో
ఆమెనే సృష్టిని బహిష్కరించిందో ఏమోగాని
రహస్యశృంగారపు బంధితజీవన్మరణ క్రీడలో
ఆమె ఎప్పటికప్పుడు దేహాన్ని విసర్జిస్తూనే ఉంటుంది
ఆమెది కోల్పోవడం అనివార్యమైన జీవితం

పచ్చనినోట్లతో పచ్చిగా ఆమెను తడమగలమేమో గాని
ఎన్ని రాసులుపొసి ఆమె మనసును తాకగలం

స్వేదం కన్నీళ్ళు నెత్తురు ఆవేదనే ఆమె నేస్తాలు
ఆమెకు కలలు లేవు కన్నీళ్ళే
అరే! ఎందరికి తెలుసు ఆమె మనసు?

ఆమె కడుపు కోసం పడుపైంది గాని
పడుపు కోసమే కడుపు గడప దాటలేదు

ఎందరు వెంబడిస్తారో
ఇంకెందరు నిష్క్రమిస్తారో
ఎన్ని వసంతాలు కరిగిపొతాయో
ఎన్ని కనీళ్ళు నదులై పారతాయో
ఎన్ని స్వప్నాలు ఆత్మహత్య చేసుకుంటాయో
దీపం వెలుగుతున్నంత కాలం
ఆమె ఓ ఆరిపోని దీపం

ఆమె ఊరిడ్సినా
ఆమెను ఊరిడ్సిపెట్టదు
ఆశగా ఆమెవైపే చూస్తుంటుంది...

10.09.2012

Prav Veen // గాయం... //

ఎన్నని చెప్పాలే ఏమని చెప్పాలే.ఒక గాయమైతే మరచిపోవచ్చు.కండ్లుతెరిచిన గడియనుండి రోజు నిష్క్ర్రమించేదాక గాయాల మీద గాయాలు.నిలువెల్లా గాయాలే దేహమౌతున్నవాణ్ణి.ఒకటా రెండా విరిగిన లాఠీలు ఎక్కిదిగిన ఠాణాల మెట్లు లెక్కేలెవ్వు.అయినా నాకు ఇబ్బందేంలేదు.గాయలదేముంది.ఓ వైపు ప్రాణాలకు ప్రాణాలే అవలీలగా ఉద్యమానికిచ్చిన నాతోటి విద్యార్థులు జనాలు.వీళ్ళ త్యాగాల ముందు నాకైన ఈ గాయాలేపాటివి.నేనేనా గాయపడింది.తెలంగాణకు తెలంగాణానే ఓ మానని గాయం.ఒడవని దుఃఖం.ఐతే గాయాలు మాకు కొత్తేం కాదు.సూర్యుడు రోజు ఉదయించడం వింతేం కాదు కనిపించకపోతే కదా వింత అమావాస్యా!నాకు ఐన ఈ గాయాలు ఎంత. నిజంగా గాయాల వల్ల నేను గాయపడలేదు.బిడ్డా ఒళ్ళంత నెత్తురుముద్ద చేసుకుంటివి ఎట్ల ఉండేటోనివి బిడ్డా!తెలంగాణ తెలంగాణ అంటివి అని అమ్మ ఏడ్చినప్పుడు నిజంగా గాయపడుతున్నా.గాయాలను త్యాగాలను కుప్పగా పోసి డబ్బులసంచుల్ని ప్రాజెక్టుల్ని మోసుకొచ్చిన సోకాల్డ్ రాజకీయ ఉద్యమకారులను చూసి మళ్ళీ మళ్ళీ గాయపడుతున్నా.నేనే కాదు 60ఏండ్లసంది త్యాగాలే వారసత్వంగా తీసుకుంటున్న నాలాంటివాళ్ళను చూసి తల్లీ తెలంగాణం నెత్తురు స్రవిస్తోంది కన్నీళ్ళకు బదులుగా.ఐతే గాయమెప్పుడు గాయంలా ఉండదు.గాయం పోరాటానికి సమాయత్తం చేసే ఓ సిగ్నల్.ఓ మెసేజ్.ఇప్పటిదాకా నేను ఓడిపోవచ్చు కాని నా గాయం ఎప్పుడూ నన్ను సిద్దం చేస్తుంటుంది విజయం కోసం పోరాడమని.గాయం ఇప్పుడు ఓ జ్ఞాపకం మాత్రమే కాదు...కొత్త బతుక్కు దారి చూపించే ఓ దిక్సూచి...

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

చింతం ప్రవీణ్||నా తెలుగు||

మాతృదేశంలోనే
ఇప్పుడొక మైలపడ్డపదం తెలుగు

నడుస్తున్న చరిత్రలోనే

అటకెక్కిన తాళపత్ర్రగ్రంధం తెలుగు

మడికట్టుక్కూర్చున్న ఇంగిలీషు బళ్ళో

ఇప్పుడొక అంటరానిపదం తెలుగు

చర్చలు లేని ఎంకౌంటర్లు జరిగిపోతూ ఉంటే

తల దాచుకున్న మిలిటెంటులా ఉంది తెలుగు

అమ్మా నాన్నల అశలకు మసిపూసిన మమ్మీ డాడీలు

ఈ శతాబ్దపు బాషా పరిణామం

సీసాపాలనే అమ్మపాలుగా సిద్ధాంతీకరించడం

ఈ శతాబ్దపు మేధో వికాసం

పోగుచేసుకున్న బాష అంతా

కాన్వెంట్ బళ్ళో
కార్పోరేట్ కౌగిళ్ళో
సమాధి చేస్తూ
వీసా పాస్ పోర్టులు నిస్సిగ్గుగా
పరాయిబాషని మన నాలుకలపై అతికిస్తున్నాయ్

మోఖానికి రంగులేసుకున్నోళ్ళు

తెలుగులోనే మాట్లాడుతున్నప్పుడు
దేషబాషలందు నా తెలుగు లెస్సే?

మనమిప్పుడు

తలాకొంచెం సిగ్గుపడదాం
స్వంత ఇంట్లో పరాయిలా ఉన్న మన తెలుగును చూసి
స్వంత వూర్ళో వెలికి గురౌతున్న మన తెలుగును చూసి

మనమిప్పుడు

మూకుమ్మడిగా తల దించుకుందాం
తేనెలొలుకు తెలుగుకు తగులుతున్న బెత్తం దెబ్బలను చూసి

ఇక

ఇప్పుడు మనకు కావలసింది
హోదాలు సొదలు కావు

ఆకలితో అలమటిస్తున్నవాడికి

అందలమెందుకు?

పదండి

కొత్త శిలాశాసనం వేద్దాం
తెలుగును బతికించడానికి
సామూహికంగా ఉద్యమిద్దాం
తెలుగుకు ప్రాణప్రతిష్ట చేద్దాం....


28.08.2012

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

చింతం ప్రవీణ్ || నాన్న||


విరామమెరుగక
నిరంతరం ప్రవహించే
జీవన నది నాన్న

విషాదాలను మోస్తూ
సంతోషాలకై అన్వేషిష్తున్న
బాటసారి నాన్న

కుండపోత వరదలా దుఃఖం ముంచెత్తి
గుండె రేవును గండికొడుతున్నా
చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం నాన్న
గుండెనిబ్బరానికి నిలువెత్తు చిరునామ నాన్న

నాన్న ప్రతీక్షణం
కష్టాలను కౌగిలించుకుంటడు
కన్నీళ్ళతో కరచాలనం చేస్తడు

నిజంగా
నాన్నకు కన్నీళ్ళొచ్చినా
నాన్న ఏడ్వలేడు
నాన్న ఏడిస్తే
ఇల్లు ఇల్లంతా కన్నీటిసంద్రమే

జీవన గమనంలో అలసిపోయిన బిడ్డలకు
నాన్నిచ్చే దైర్యం
ముందుకెళ్ళడానికి ఓ కాన్ఫిడెన్స్

నడవడం నేర్చిన బిడ్డలకు
నడిపించే దారౌతడు నాన్న

ఓటమితో అనుక్షణం పోరాడుతు
గెలుపునే పంచే నాన్నే
ప్రతీ బిడ్డకి మొదటి హీరో

సంతోషాలను సంపదను వాటాలేసే
నాన్న గుండెలోతుల్లో దాగున్న
కన్నీటి దొంతరలను
గుర్తించేదెవ్వరు

నాన్న బతుకంతా
మన జీవితమే కదా

ఎన్నని చెప్తం_
ఏమని చెప్తం_
సముద్రమంత ప్రశాంతం
అంతర్గత బడబాగ్ని నాన్న

నాన్నైతేనే తెలుస్తది
నాన్నంటే

31.08.2102

28, ఆగస్టు 2012, మంగళవారం

చింతం ప్రవీణ్||కన్నీళ్ళు||

నాకెందుకో ఏడ్పురాదు
లోలోపల వేదనతో
హృదయం పగిలి ముక్కలౌతున్నా
పైకి మాత్రం ఒక్క చుక్క కన్నీరు ఉబికిరాదు
అప్పుడప్పుదు అనిపిస్తుంటుంది
నేను బండబారానా అని

కొందరేమో అశ్చర్యంగా
క్షణాల్లో కన్నీళ్ళ కొలనౌతారు
చూస్తుండగానే

నాకేమో ఏడ్పురాదు

అలా రోడ్డుమీద ఓ అడుగు వేస్తానో లేదో_
కకావికలమౌతాను
మెదడులో అలోచనకాలోచనాలు
ఉక్కిరిబిక్కిరి చేస్తాయ్

ఒక్కో దృశ్యం
గుండెను నిమిషానికి వెయ్యిసార్లు కంపితం చేస్తుంది

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పాపను చంకనెత్తుకున్న బిచ్చగత్తె
బస్టాండు రైల్వేస్టేషన్లలో కరగడానికి సిద్దంగా ఉన్న యవ్వనవతి
స్వేదం కురుస్తున్నా బతుకురిక్షాబండిని లాగుతున్న వృద్దుడు
వివర్ణ ప్రతిబింబాలై విచలిత బతుకులను భుజాలపై మోస్తున్న బాటసారి

బతుకు సుడిగుండంలో జీవితాన్ని కోల్పోతున్న వీళ్ళందరు
గుండెను నిమిషానికి వెయ్యిముక్కలు చేస్తారు
కుండపోత వరదలా ముంచెత్తి గుండెరేవును గండి కొడ్తారు

ఐనా
పైకి మాత్రం ఒక్క చుక్క కన్నీరు ఉబికిరాదు...

అలా సమాజ మరుభూమిలో
ఎవరైనా బతుకుపందానికి ముగింపు పలికితే... వెళ్తానా

సానుభూతి చూపిస్తు కొందరు
తెచ్చిపెట్టుకున్న కన్నిళ్ళతో ఇంకొందరు
కుండపొత వర్షంలో నన్ను బందీని చేస్తారు
దింపుడు కల్లంలో ప్రాణం దొరకని చోట
అక్కడ నేను దొరికిపోతాను

ఒక్క చుక్క కన్నీరు రాదు!
వీడు బండబారాడని కొందరంటారు
కృత్రిమ కన్నీళ్ళకు విలువనిచ్చేవాళ్ళు

నేనంటాను
కన్నీళ్ళు
అనివార్యమైన సానుభూతికి నజరానాలు కాకుడదని

ఐనా
మన కన్నీళ్ళలో హృదయం లేనపుడు
మన కన్నీళ్ళు
మన హృదయం
మనం
నమ్మకం కోల్పోతాం ఎప్పటికైనా_

26.08.2012

23, ఆగస్టు 2012, గురువారం

చింతం ప్రవీణ్|| మౌనం||



మౌనం అక్షరాల్లేని లిపి
ధ్వనిలేని సంగీతం


మౌనం పెదవికదిలితే మాట
గొంతెత్తితే పాట


మౌనం నినాదానికి రిహార్సల్
ఉద్యమానికి వ్యూహం


మౌనం మాటకు తొలిరూపం
బతుకు చివరిరూపం

12, ఆగస్టు 2012, ఆదివారం

Prav Veen || ఏం దొంగిలించగలం ||


ఎవరి నుండి ఎవరు
ఏం దొంగిలించగలరు

ఎవరి హృదయంలోనైన దాగి వున్న
ఒక్క విషయమైనా
దొంగిలించగలిగామా
ఎప్పుడైనా

ఎవరి కన్నులనుంచైనా
కాస్తంత చల్లని చూపును
దొంగిలించగలిగామా
ఎప్పుడైనా

ఎవరి మాటలనుంచైనా
కాస్తంత మంచిని
దొంగిలించగలిగామా
ఎప్పుడైనా

లేదు
ఎవరి నుంచి ఎవరు
ఏది దొంగిలించలేరు
నిజంగా దొంగిలించబడ్డవన్ని
ఎదుటి వ్యక్తులు కోల్పొయినవి కావు


నిజంగా
దొంగిలించవలసివస్తే
హృదయాలను దొంగిలించాలి
కాస్తంత ప్రేమను
అందరికి పంచాలి


నిజంగా
దొంగిలించవలసివస్తే
ధాన్యపు రాసులను దొంగిలించాలి
అన్నార్థుల కడుపుకు పంచాలి


నిజంగా
దొంగిలించవలసివస్తే
కాసిన్ని రాళ్ళను దొంగిలించాలి
వాటితో
భూర్జువా కోటలను ధ్వంసంచేయాలి.




*12-08-2012

8, ఆగస్టు 2012, బుధవారం

Prav Veen || "ప్లాస్టిక్ దునియా" ||

రోజు ఎంతమందిని అనివార్యంగా మోస్తున్నామొకదా
నిజంగా ఎంతమందిని ప్రేమిస్తున్నాం
ఎంత ప్రేమిస్తున్నావన్నది కాదిప్పుడు పాయింట్

నువ్వెంత కోల్పోతున్నవనేదె సెంటర్ పాయింట్
ప్రేమించమని నిన్నెవరు అడగరు
ప్రేమించడం మొదలుపెడితె
అన్నిటిని ప్రేమించగలగాలి వరుసపెట్టి
పైత్యాన్ని బలాన్ని బలహీనతల్ని
ఏక్ష్నంలోనైన ఎస్కేపిజం ప్రదర్శించా.వొ
అంతే ఒ స్టాంపు
వాడు ఎవడిని ప్రేమించలెడని
నిజంగా ఎవడినిప్రేమించొద్దు గుండెలనిండా
బాగా నటించడం నేర్చుకొ
ఈజనాలకి ప్రెమంటె బహిర్ ద్రుశ్యమె
అంతర్గతాన్ని ఎవరు విశ్వసించరు
కరచాలనాలు కౌగిలింతలు చిరునవ్వులు మాటలు
చివరికిబతుకులు
అంతా ఆర్టిఫిశియల్ అంతా ప్లాస్టిక్ జమాన
నిజంగా నువ్వు బతకాలంటె
అర్జెంట్ గా నీగుండెను పీకి అవతలపారెయ్
నిజంగా నువ్వు బతకాలంటె
ప్లాస్టిక్ పెదవులు తగిలించుకొ
ప్లాస్టిక్ గుండెను అమర్చుకొ
ప్లాస్టిక్ ని నిశేదించినట్టు
ప్లాస్టిక్ జిందగిలను నిశేదించేదాక.

*07-08-2012