ఉర్దూ కవిత్వ నజరానాలో గతవారం గాలిబ్ సంకలనంలోని 18వ గజల్లోని కొన్ని షేర్లు చూశాము. ఈ రోజు కూడా అదే గజల్లోని మరి కొన్ని షేర్లు చూద్దాం. మొదటి షేర్ గాలిబ్ సంకలనంలోని 18వ గజల్ 6వ షేర్ లే గయే ఖాక్ మేం హమ్, దాగె తమన్నాయె నిషాత్ తూ హో, ఔర్ ఆప్ బ సద్రంగ్ గులిస్తాం హోనా నేను ఆనందపు ఆకాంక్షల మచ్చలను కూడా సమాధిలోకి తీసుకుపోయాను ఇప్పుడు నువ్వున్నావు, వందలాది రంగుల పూదోట మాదిరిగా ఈ కవితలో ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. ఖాక్ అంటే దుమ్ము, మట్టి, సమాధి అని అర్ధాలున్నాయి. దాగ్ అంటే మచ్చ, బాధ అని అర్ధాలున్నాయి. తమన్నా అంటే అకాంక్ష. నిషాత్ అంటే ఆనందం. తు అంటే నువ్వు. తూ హో అంటే నువ్వున్నావు. బ సద్రంగ్ అంటే వంద రంగులతో అని అర్ధం. గులిస్తాం అంటే పూదోట, ముఖ్యంగా గులాబీపూదోట. ఇప్పుడు ఈ కవితకు భావం చూద్దాం. గాలిబ్ జీవితాన్ని ఆనందంగా గడపాలని అసంఖ్యాక ఆకాంక్షలు పెట్టుకున్నాడు. కాని ఒక్కటి కూడా నెరవేరలేదు. జీవితం ముగిసిపోయింది. ఆ ఆనందాల ఆకాంక్షల మచ్చలను కూడా తీసుకుని సమాధిలోకి వెళ్ళిపోయాడు. కాని తన ప్రేయసి మాత్రం వందల రంగుల పూదోట మాదిరిగా అందమైన, ఆనందదాయకమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాడు. పైకి చాలా సరళమైన కవితగా కనబడుతుంది కాని గాలిబ్ రెండు పంక్తుల్లో చాలా లోతయిన భావాన్ని చెప్పాడు. పైకి కనబడే భావం తాను జీవితంలో అనుకున్నది సాధించలేకపోయాడు. ప్రేమ విఫలమైంది. ప్రేమ మచ్చను తీసుకుని సమాధికి చేరుకున్నాడు. కాని తన ప్రేయసి మాత్రం సంతోషంగా శతవర్ణభరితమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాడు. కాని ఈ రెండు పంక్తుల్లో కాస్త ఆలోచిస్తే మరిన్ని భావాలు ధ్వనిస్తాయి. మనిషి కోరికల పుట్ట. అనేక ఆకాంక్షలు మనసులో పెంచుకుంటాడు. కాబట్టి మనిషి సమాధిలోకి వెళ్ళే సమయంలో అంటే మరణించే సమయంలో కూడా నెరవేరని అనేక ఆకాంక్షలతోనే ఉంటాడు. తాను సాధించలేకపోయినవి, తాను పొందలేకపోయినవి తాను ప్రేమించేవారికి దక్కాలని కోరుకుంటాడు. ఇక్కడ గాలిబ్ తన ప్రేయసిని ఉద్దేశించి ప్రేమను తిరస్కరించడం ద్వారా నువ్వు నన్ను నెరవేరని ఆకాంక్షలతో మరణించేలా చేస్తున్నావు, నాకు నెరవేరని కోరికలు నీ విషయంలో నెరవేరాలని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. ఆ విధంగా ఆమె పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఉర్దూలో ఒక సామెత ఉంది. దిల్ బాగ్ బాగ్ రహ్నా. అంటే సంతోషంగా ఉండడం అని భావం. ఈ సామెతనే మరో విధంగా గాలిబ్ ఈ కవితలో వాడుకున్నాడు. నిజానికి ఈ కవితలో ప్రేయసి వైఖరి పట్ల వ్యంగ్యం కూడా ఉంది. ప్రేమించే తనను కాదని ప్రేయసి తిరస్కరించింది. తాను ఇక మరణించాడు కాబట్టి ఆమెకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, జీవితం పూదోటలా ఉంటుందని ఒకవిధమైన ఎత్తిపొడుపులాంటి వ్యాఖ్య కూడా ఇందులో ఉంది. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్ 8వ షేర్ కి మేరే ఖతల్ కే బాద్, ఉస్నే జఫా సే తౌబా హాయ్, ఉస్ జూద్ పసీమాం కా పషీమాం హోనా నన్ను హతమార్చిన తర్వాత తాను అయ్యో అనుకుంది అయ్యో, ఎంత త్వరగా మనసు మార్చుకుంది... ఈ కవితలోని ఉర్దూపదాలకు అర్ధాలు చూద్దాం. ఖతల్ అంటే హత్య. జఫా అంటే క్రూరత్వం,దౌర్జన్యం వగైరా అర్ధాలు చెప్పవచ్చు. తౌబా అంటే పశ్చాత్తాపపడడం. జూద్ అంటే త్వరగా. పషీమాం అంటే బాధపడడం. ఈ కవితలోని భావాన్ని పరిశీలిద్దాం. ప్రేయసి అతడిని హతమార్చిన తర్వాత అయ్యో అనుకుంది. ఇంకెప్పుడు ఎవరినీ బాధపెట్టకూడదని నిర్ణయించుకుంది. అబ్బా, ఎంత త్వరగా ఆమె పశ్చాత్తాపపడిందో, ఎంత త్వరగా అయ్యో అనుకుందో అంటున్నాడు. ఎంత త్వరగా మనసు మారిందో కదా అని కూడా అంటున్నాడు. ఇందులో వ్యంగ్యం గమనించదగ్గది. నిజానికి తనను చంపకముందు ఇలా మనసు మార్చుకుని ఉంటే బాగుండేది. జూద్ పషేమాం అంటే త్వరగా పశ్చాత్తాపపడిన వ్యక్తి అని అర్ధం. ఏదైనా తప్పు, పాపం చేసి వెనువెంటనే తప్పు గ్రహించి అలాంటి తప్పు మరెప్పుడు చేయనని దేవుడిని వేడుకుంటూ పశ్చాత్తాపపడే వాడు జూద్ పషీమాం. తన ప్రేయసి అలాగే వెనువెంటనే తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడింది. అబ్బా, ఎంత త్వరగా పశ్చాత్తాపపడి, అయ్యో అనుకుందో కదా.. అని వ్యంగ్యంగా అంటున్నాడు. గాలిబ్ కవితల్లో ఈ షేరు చాలా ప్రసిద్ధి పొందిన షేర్. సాధారణంగా గాలిబ్ ఒక కవితలో ఒకే పదాన్ని రెండుసార్లు వాడడం జరగదు. కాని ఈ కవితలో ఒకే పంక్తిలో రెండుసార్లు పషీమాం అన్న పదాన్ని వాడాడు. ఇందులో జూద్ పషీమాం అన్నది ఒక పదబంధం. ఉర్దూ పలుకుబడి వంటిది. జూద్ పషీమాం అనేది ఒక వ్యక్తి గుణవాచకం. ఒకే పంక్తిలో ఈ పదాన్ని ఇలా రిపీట్ చేయడం కవితకు కొత్త అందాన్ని ఇచ్చింది. గాలిబ్ వ్యాఖ్యాతలు ఈ కవిత గురించి వివరిస్తూ, ఆమె కోపంతో ఆవేశంతో అతడిని హతమార్చడానికి క్షణం ఆలోచించలేదు. ఆ తర్వాత అయ్యో ఎంత పని చేశాను అని వెంటనే మనసు మార్చుకుని బాధపడిపోయింది. ఇదొక నిలకడలేని మనస్తత్వం. అలాంటి మనస్తత్వాన్ని సూచిస్తూ ’’జూద్ పషీమాం‘‘ త్వరగా పశ్చాత్తాపపడే వ్యక్తి అన్న పదబంధం వాడడంలో తీవ్రమైన వ్యంగ్యం ఉంది. ఈ కవితలో లోతయిన భావం ఉంది. ముఖ్యంగా జూద్ పషీమాం అన్న పదం వాడడం ద్వరా గాలిబ్ ఈ కవిత పరిధిని పెంచేశాడు. చాలా మంది చాలా తప్పులు చేస్తుంటారు. ఉదాహరణకు అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత చాలా పశ్చాత్తాపపడ్డాడు. బౌద్ధాన్ని స్వీకరించి హింసకు దూరంగా ఉన్నాడు. కాని కళింగ యుద్ధంలో మరణించిన వారి బంధువులు ఏమనుకుని ఉంటారు. అశోకుడిలో ఈ మార్పు యుద్ధానికి ముందే వచ్చి ఉంటే ఎంత బాగుండును అనుకుని ఉంటారు. అలాగే తప్పు చేసే ఏ వ్యక్తయినా ఎంత త్వరగా పశ్చాత్తాపపడినా, నిజానికి ఆ తప్పు వల్ల జరగవలసిన నష్టం జరిగిపోతుంది. ఈ కవితలో ఉన్న సూఫీ కోణం ఇదే. స్వచ్ఛమైన మనసుతో, నిజాయితీగా చేసిన తప్పుల పట్ల పశ్చాత్తాపపడితే దేవుడు క్షమిస్తానంటున్నాడు. తప్పు జరిగిన వెంటనే దాన్ని గుర్తించి, క్షణం ఆలస్యం చేయకుండా పశ్చాత్తాపపడాలి. అలా చేసేవాడు జూద్ పషీమాం. కాని గాలిబ్ ఈ విషయం గురించే మాట్లాడుతూ ఎంత త్వరగా పశ్చాత్తాపపడినా, జరగవలసిన నష్టం ఎలాగూ జరిగిపోతుందంటున్నాడు. ఇక్కడ తప్పులు రెండు విధాలు కావచ్చు. ఉద్దేశ్యపూర్వకంగా చేసేవి, అనుకోకుండా జరిగేవి. ఉద్దేశ్యపూర్వకంగా చేసే తప్పుల్లో తనకు నష్టం కలిగించేవి, ఇతరులకు నష్టం కలిగించేవి ఉంటాయి. ఇతరులకు నష్టం కలిగించే తప్పులు, పాపాల విషయంలో నష్టపోయిన వారు క్షమించనంత వరకు దేవుడు తాను కూడా క్షమించనన్నాడు. కాబట్టి ఇక్కడ గాలిబ్ చెబుతోంది తనకు నష్టం కలిగించిన తప్పు గురించి మాత్రమే. ఈ విశ్లేషణ తర్వాత ఈ కవిత అర్ధమే మారిపోతుంది. ప్రేయసి అతడిని హతమార్చింది. దాని వల్ల గాలిబ్ చనిపోయాడు. కాని దాంతో పాటు ఆమె స్వయంగా ఒక గొప్ప ప్రేమికుడిని కోల్పోయింది. అది ఆమెకు జరిగిన అతిపెద్ద నష్టం. వెంటనే పశ్చాత్తాపపడింది. కాని ఏం లాభం ఎంత త్వరగా పశ్చాత్తాపపడినా జరగవలసింది జరిగిపోయింది. తర్వాతి కవిత గాలిబ్ సంకలనం 18వ గజల్ హైఫ్, ఉస్ చార్గిరా కపఢేకీ ఖిస్మత్ గాలిబ్ జిస్ కీ ఖిస్మత్ మేం హో ఆషిఖ్ కా గిరేబాం హోనా అయ్యో, ఆ జానెడు వస్త్రం దురదృష్టం గాలిబ్ ప్రియుడి చొక్కా కాలరుగా బతుకుతోంది ఈ కవితలోని ఉర్దూ పదాలను చూద్దాం. హైప్ అనేది బాధను సూచించడానికి ఉచ్చరించే ధ్వని. గిరా అంటే ముడి లేదా గుప్పిట. చార్గిరా అంటే నాలుగు గుప్పెళ్ళు అని అర్ధం. గరేబాం అంటే చొక్కా కాలరు. ఈ కవితలోని భావాన్ని చూద్దాం. చార్గిరా అంటే నాలుగు గుప్పెళ్ళ పొడవున్న అని అర్ధం. నేను జానెడు వస్త్రమని పైన రాశాను. ప్రియుడి చొక్కా కాలరుగా వాడబడిన ఈ జానెడు వస్త్రం చాలా దురదృష్టం చేసుకుందంటున్నాడు. ప్రేయసి ప్రియులు కలిసినప్పుడు ఆమె ఉద్రేకంతో లాగడం వల్ల కూడా అది చిరిగిపోవచ్చు. ప్రేయసిని వదలి వెళుతున్నప్పుడు ప్రియుడు బాధగా తన కాలరునే పట్టుకుని లాగడం వల్ల కూడా అది చిరిగిపోవచ్చు. ప్రేమలో పడిన వ్యక్తి చొక్కా కాలరుగా మారడం కన్నా దురదృష్టం వస్త్రానికి మరొకటి లేదు. గాలిబ్ ఈ కవిత రాయడానికి కారణమైన ఒక సంఘటన గురించి ప్రస్తావన ’’ఆబె హయాత్‘‘ అన్న పుస్తకంలో ఉంది. జూదమాడుతూ ఒకసారి గాలిబ్ పట్టుబడ్డాడు. అతడికి జైలు శిక్ష పడింది. చీకటి కొట్టంలో పడేశారు. శిక్ష పూర్తయి బయట అడుగుపెట్టేసరికి అతడి చొక్కా మాసిపోయి పరమ మురికిగా తయారైంది. కాలరుపై నల్లులు, పేనులు పాకుతున్నట్లుంది. గాలిబ్ చికాగ్గా తన చొక్కా కాలరు వద్ద పట్టుకుని చించిపారేస్తూ ఈ కవిత చెప్పాడంట. ఈ కవితను పరిశీలిస్తే గాలిబ్ రెండు పంక్తుల్లో, పాతనిబంధన, కొత్తనిబంధన, ఖురాన్ గ్రంథాల్లోని ఒక ప్రవక్త కథను చెప్పేశాడు. జాకబ్ ప్రవక్త కుమారుడు జోసెఫ్. ఆయన్ను సవతి సోదరులు ఒక బావిలో తోసేశారు. అటుగా వెళుతున్న ఒక వర్తక బిడారు బావిలో ఉన్న జోసెఫ్ ను చూసి బయటకు తీశారు. ఆ వర్తకులు ఆయన్ను ఈజిప్టుకు తీసుకువెళ్ళారు. అక్కడ ఫారో రాజభవనంలో బానిసగా అమ్మేశారు. జోసెఫ్ యువకుడు, చాలా అందమైనవాడు. ఫారో దర్బారులో ఉన్నత సైనికోద్యోగి పోతిఫర్ భార్య జులేఖా ఆయన అందం చూసి మనసు పారేసుకుంది. ఒకరోజు రాజప్రాసాదంలో ఒంటరిగా దొరికిన జోసెఫ్ ను ప్రలోభపరచడానికి జులేఖా ప్రయత్నించింది. తనను పట్టుకున్న జులేఖాను విడిపించుకోడానికి జోసెఫ్ పెనుగులాడారు. ఈ పెనుగులాటలో జోసెఫ్ చొక్కా కాలరు చిరిగిపోయింది. అయితే తనపై నింద రాకుండా ఉండడానికి జులేఖా తన దుస్తులు చింపుకుని జోసెఫ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది. జెసెఫ్ ను పట్టుకుని జైలులో పడేశారు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. చివరకు ఈ కేసు విచారణకు వచ్చింది. విచారించిన ఖాజీ (న్యాయమూర్తి) జోసెఫ్ చొక్కా కాలరు వెనక నుంచి చిరిగి ఉంది కాబట్టి, అతను విడిపించుకుని పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు వెనక నుంచి పట్టుకోవడం వల్ల చిరిగిందని తీర్మానించి విడుదల చేయిస్తాడు. ఈ కథ దాదాపు మూడువేల సంవత్సరాల పాత కథ. ఇక్కడ గాలిబ్ కవిత ఆ కధను గుర్తు చేయడం మాత్రమే కాదు, వేల సంవత్సరాలుగా ప్రేమికుల మధ్య చొక్కా కాలరు బలవుతుందన్న హాస్యంతో కూడిన వ్యంగ్యాన్ని పలికించాడు. కవితలో చమత్కారం కూడా గమనించదగ్గది. మొదటి పంక్తిలో అయ్యో ఆ జానెడు వస్త్రం ఎలాంటి పరిస్థితిలో ఉంది అన్నాడు. రెండవ పంక్తిలో ప్రేమికుడి చొక్కా కాలరుగా మారింది కదా అంటున్నాడు. రెండవ పంక్తిలో పలికే చమత్కారం గమనించదగ్గది. ఇది ఈ రోజు గాలిబానా. మళ్ళీ శుక్రవారం కలుద్దాం. అంతవరకు అస్సలాము అలైకుమ్
by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oxHYzX
Posted by
Katta