అయ్యా నాతో చదివే
జానెడు బెత్తెడు లేని పోరగాడు
నీకు బాబుగారా?
ననుగన్న నీవు
వాడికి ఏరా పోరా గాడివా?
నాకొద్దీ పైసల బడి
అక్కడన్నీ అబద్దాలే
మా అందరి
చొక్కా గుడ్డలే ఒకటి
లోన మనుషులంతా వేరు
వాళ్ళ బ్యాగుల నిండా
గొప్పతనాలు
మోసుకు తిరుగుతున్నారు
పూసుకొన్న సెంటు
రాసుకొనే పెన్ను
వాళ్ళకు వేరే వుంటాయు
రోజుకో రుచి మరిగిన
లంచ్ బాక్స్ వాళ్ళది
నాదేమో
రోజూ తిన్నదే తింటుంది
సత్తిగాడు స్కూటర్ మీదా
భరత్ గాడు బెంజికార్లో
నాది రోజూ రెండు కాళ్ళ బండేగా
ఇక్కడి పాఠాల్లోనూ పెద్దోళ్ళే
మన్ని గురించి
ఎవరూ చెప్పరిక్కడ
ఆల్లందరూ వేరయ్యా
నాకొద్దీ పైసల బడి
ఆకలయునప్పుడల్లా
అరచేతిలో
అమ్మిచ్చే ముద్దులు చాలయ్యా