పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

6, ఆగస్టు 2012, సోమవారం

డా . సింహాచలం లక్ష్మణ్ స్వామి || ‎*** పల్లె ***||

కల్మషమేరగని...పల్లెలో
పచ్చనిలోగిళ్ళలో
గడ్డివాము, జోడెడ్లు...

మేకపిల్లలు గొల్ల భామలు.

ఆకుపచ్చని కొబ్బరాకు చాటున
అలవోకగా సాగుతున్న నాపాటకు....
తలలూపుతున్న పైరగాలి, పైరు.

నాపాత జ్ఞాపకాలని నేమరువేస్తున్న
ఎడ్లు, గుడిసె,వడిసెల ,గువ్వలు.

ఎర్రని ఎండకు మఱ్ఱి నీడలో సేదదీరే బాటసారికి
చల్ల పోసే అవ్వ మానవత్వపు రవ్వ.

మనిషి యంత్రమై కుత౦త్రమై పోతున్నవేళ
మానవత్వాన్ని గుర్తు చేస్తుంది పల్లె 

*06-08-2012

బాబీ నీ॥"ఒక ఇద్దరి కథ" ...."నీ"॥

"మన ఇద్దరికి మధ్య తెలీని ఖాళీ నది"
నువ్వు ఆ ఒడ్డునే వుండు
నేనీ ఒడ్డున కూర్చుంట..!

అప్పుడప్పుడూ...
కొన్ని మాటల పడవలేసుకుని
అనూహ్యంగా నిన్ను చేరుకుంటా...!

ఒకప్పుడు...
సంభాషనల చలి మంటల దగ్గర,
నవ్వుల కౌగిలింతల్లొ కలుసుకున్న మనం
ఇప్పుడు...
"మా ఊళ్ళో మోరీ అరుగుల్లా
ఎదురెదురు నిలబడి
మాటలు రాని రెండు వస్తువులమైపొవటం నిజమైన విషాదం..!

"అప్పటి నువ్వు ఇప్పటినీలో కనిపిస్తావేమో అని తడుముకుంటున్న ",
నా కవిత్వాన్ని స్ప్రుశించిన వేళ్ళకొసం నిరీక్షిస్తున్న

ఒకప్పుడు మనం కలసి నడిచిన దారి పొడుగూతనా
నీ మాటల పుస్తకాలు రాలిపడ్డాయేమోనని వెతుక్కుంటున్న
అమావాస్యల్ని నరుక్కెళ్ళే నీ రేదీపపు చూపుకొసం
నిసీదిలొ కలవరించా,
నీకొసం పరితపించా..!

"నిన్ను నీలొ కోల్పొయా,
నువ్వు నాతోనే ఉంటూ నాకెక్కడా కనబడవు"

నువ్వొక పరిగెత్తే ప్రవాహానివి
నేనొక కాళ్ళు నరుక్కొని కూలబడ్డ కవిత్వాన్ని..!

*05-08-2012

మోహన్ రుషి॥ఆఖరి వాక్యం!॥

మిగల్లేదు
ఏ ఒక్క ఆశా...!
హృదయం లయ తప్పడం
ఇక్కడొక శాపం -
తీపి కలలకు వశమవ్వడం
నిజంగానే నేరం -
అశ్రువొక్కటి రాలిపడ్డం
చెలామణిలో ఉన్న చేతగానితనం!
ఇక నువ్వు ఏ ధైర్యంతో బతుకుతావు
ఏ నమ్మకంతో నడుస్తావు?!
ఏ దేహంతో?! ఏ దాహంతో?!
విరిగిన ఏ మనసు ముక్కతో?!
చావుకీ, బతుక్కీ పెద్దగా తేడాలేని
సందిగ్ధ సందర్భాలను మోసుకుంటూ
ఇక నువ్వు ఎటువేపుగా ప్రయాణిస్తావ్?!

*06-08-2012

రియాజ్ || స్పందించకున్నా! ||

నీలో స్పందనలకు
సరైన ప్రతిస్పందన ఇవ్వనంత మాత్రాన
నీవు నొచ్చుకొని

నన్ను నొప్పించకు నేస్తం!

నిన్ను నొప్పించివుంటానేమో
ఏదో ఒక సందర్భంలో..
కావాలని చేసివుండను
తప్పు ఎత్తిచూపినా
నువ్వు కసురుకున్నా
నీకిష్టంలేకున్నా నువు మాట్లాడకున్నా
పరవాలేదు...!

నేను నీకు గొప్ప స్నేహితుడిని కాకపోవచ్చు
కానీ...కానీ..!
నువ్వు మాత్రం ఎప్పటికీ నా నేస్తమే!!

అలకలు అహాలు తాత్కాలికమే!
నాకోసం నువ్వు పోగొట్టుకున్న క్షణాలు
నన్ను వెంటాడుతుంటాయ్ !!

క్షమించెయ్ నన్ను !!
నువ్వు స్పందించకున్నా!
నేను స్పందిస్తుంటా....నీలో స్పందనలకు జీవమొచ్చేంత వరకు!!
గుండె కాఠిన్యం వదిలేంత వరకు!!

మాట్లాడేందుకు ప్రయత్నిస్తా
ఆవేశం చల్లారి మౌనం కరిగి మాటలయ్యేంతవరకు
అలకలు మొలకెత్తి నవ్వు అందుకునే వరకు
నే కోల్పోతా నా అహాన్ని!! ఎన్నిసార్లయినా.. నీ స్నేహం కోసం!!!

*05-08-2012

సతీష్ చందర్ ||మెత్తని సంభాషణ! ||


పువ్వు వికసిస్తుంది

మెత్తగా.

కొవ్వొతి వెలుగుతుంది

మెత్తగా.

నవ్వు గుబాళిస్తుంది

మెత్తగా.

మెత్తనయిన

ప్రతి మాటా

కవిత్వమే

*06-082012

జయశ్రీ నాయుడు || నెప్పి.. నాకు కావాలి ||

అందం లేదు
ఆహ్లాదం కాదు
విలవిలలే తప్ప

వయారమెరుగవు

ఆహ్వానం ఎప్పుడూ వుండదు..
కానీ అవసరానివి
తెరలు తెరలు గా వస్తావొ
తుఫానులా కమ్మేస్తావో

ఉలిక్కి పడి చూసుకున్నా
ఎటో తేలిపోతున్నట్టుంది.. నీతో
నీ చిటికెన వేలే కాదు..
నీ విశ్వరూపంలా..

గోరంత మొదలై
కొండంతగా..
ఇంతై.. పెయిన్ అంతై
శరీరాంతర్వర్తియై..

కొనగోటి నుంచి
తలకొస వెంట్రుక దాకా
జర జరా పాకేశావు

నా ముక్కు పట్టి
నిన్ను చూపిస్తావు
నిన్ను నువ్వు పట్టించుకో అంటావు
మొండికేస్తే.. జగమొండివి అవుతావు
సర్వ శరీరాల ప్రాణ సఖివి
అందరినీ రగిలించే చెకుముకివి

నువ్వుండాలి..
అప్పుడే నేనుంటా
ఓ అద్భుతమైననెససరీ ఈవిల్ వి
నన్ను నాకు గుర్తు చేసే ఏంజిల్వి

*06-08-2012

కిరణ్ గాలి॥మరో ప్రస్థానం॥

మనసుకు పట్టిన
సాలె గూడు ఛేదించూకొని
మరో శ్రీ శ్రీ లా

మళ్లీ రా

ఇక నీ కలం

ఒక ఖడ్గమై
పదాల పదాతి దళాల్ని
కవితా కదనరంగంలో
కవాతు చేయించాలి
అక్షరాలతో అవిరామరమైన
అశ్వమేధం జరిపించాలి

ఒక పాంచజన్యమై
దిక్కులు పిక్కటిల్లెలా
మరొక్క సారి
సామ్యవాద శంకారావాన్ని
దద్దరించాలి

దాని "సమానతా" ప్రకంపణలు
సుశప్తావస్తలొవున్న
భావ సారూప్య హృదయాలలో
ఆత్మశొదన అనుకంపణలు
సృష్టించి జాగృతం చెయ్యాలి

ఒక సమాజ గళమై
సామాన్యుడి స్వరాన్ని
ఈ కాంక్రీటు కీకారణ్యం లో
అసమర్ధ ప్రభుత్వాల
కర్ణ భేరీలు వ్రయ్యలయ్యేలా
ప్రతిధ్వనించాలి

గురి పెట్టిన గాండీవంలా
అంతరంగపు అంబుల
పొదిలోని ఆలోచనాస్త్రాలను
విప్లవపు వింటిపై
ఆశయాలుగా సంధించి
అభ్యుధయ బ్రహ్మాస్త్రాలుగా మార్చాలి

మాటల అంకుశమై
నిరసించిన
నిస్సత్తు వ నిండిన
నిర్జీవ, నిర్ 'లక్ష్య'
అస్థిత్వ లోపిత
బాధ్యతా రహిత
వ్యక్తిత్వ దిగంబర

దిశా హీన యువతరాన్ని
మావటిలా
గుచ్చి గుచ్చి
నవ చైతన్యం వైపు
నడిపించాలి

గాండ్రించే బెబ్బులై
వెలలేని
"స్వ" భాష
వలువలు విడిచి
ఆంగ్ల ఉచ్చారణల
అచ్ఛాదనల వెనుక
నక్కిన నిజ నగ్న శరీరాలను
వెంటాడి వేటాడీ ఛిద్రమ్ చెయ్యాలి

భావ రాహిత్యంతో
భాషా విహీనతతో
శిల్ప,శబ్ధ
శైలి శూన్యతతో
బీల్ళు వాడి, బీటలు పడి
నిస్సారమైన
సమకాలీన సాహిత్య
క్షామ ధాత్రిని

ఇక నీ కలం

చలం హలం లా
పెకిలించి
కృష్ణ శాస్త్రి భాష్ప జలంతో
తడిపి
శ్రీ శ్రీ రక్త భీజా లను నాటి
హరిత "తిలకా"న్ని
దిద్ది స-ఫలం చేయాలి

పరిణితి పరిపక్వతల
పంట చెల్లుగా పచ్చిక బయల్లుగా
మార్చాలి

...........

ఇక నీ కలం

పట్టాలపై పొగ బండిలా
ధడ ధడ లాడాలి
ఒక సుధీర్గ సాహితీ
ప్రయాణానికి సిద్దం కావాలి

జన జాగృతి గీతంలా
గణ గణ లాడాలి
కర్షక, కార్మిక, శ్రమైక
శక్తులన్నిటిని సంఘటితం చెయ్యాలి

కొలిమి లోంచి ఎగిరి పడిన నిప్పు కనికలా
కణ కణ లాడాలి
సమస్త సమాజ అసమానతలను
దావానలమై దగ్ధం చెయ్యాలి

తలారి చేతిలో మెరిసే గండ్ర గొడ్డలిలా
తళ తళ లాడాలి
నీ ఆశయ సాధనకు అడ్డొచ్చే ప్రతి
అవాంతరాన్ని అడ్డంగా తెగ నరకాలి

ఇక నీ కలం
కాష్టంలో కాలే కపాలంలా
కఠెల్ కఠెల్ మనాలి
నీ చేతి వ్రాతల
చితి జ్వాల లతో
సగం చచ్చిన
సగటు మనిషిని
ఆవాహనం చేసి
అగ్ని పునీతం చెయ్యాలి
పునర్జన్మ నివ్వాలి

*06-08-2012

డా . సింహాచలం లక్ష్మణ్ స్వామి || బహుశా..ఇదేనా కవిత్వం.!!? ||

ఆకలిమంటల ఆర్ద్ర
ఆర్తి గీతాల అరణ్య రోదపు
అక్షరాశృవులేనా....కవిత్వం !


పొక్కిలైన గుండె వాకిలి
ను౦డి పొంగే అక్షరమే ....కవిత్వం..!


అంతస్సాగరాల్లో బద్దలయ్యే
అగ్నిపర్వతమే కవిత్వం..!


చితుల చీకటికి
చితిని పేర్చే చిన్మయ దీపమే ..కవిత్వం


దుఃఖిత దుక్కిలో
లెక్కలేనన్ని భాష్పంకురాలేనా కవిత్వం ..!


అశృ వాహినికి తెగిన
ఆనకట్ట వరదే ..కవిత్వం ..!


యద యదల్లో మధురంగా
సాగే యలదేటి గీతమేనా కవిత్వం..!


ఎడతెగని విధి వంచిత
కారుణ్య స్పందన నాదమే ..కవిత్వం..!


పాంచభౌతిక సృష్టి విలాస
విలక్షణ విరచితమేనా కవిత్వం..!


ప్రకృతిని గుండెల్లో కూర్చి
అక్షరాలుగా మార్చి సమర్పించటమేనా ....కవిత్వం..!


భగ్న హృదయ దగ్ధ మానస
గీత మాలికల అక్షరాల మాలయేనా...కవిత్వం..!


ద్వయ దేహా వాంఛల వెచ్చని
ఊపిర్ల విరహ వేదనేనా...? కవిత్వం..!


అక్షరాలకు ఆస్థి మా౦సాలిచ్చి చేసిన
జాగృత స్వేచ్ఛా జీవన విహంగమే..కవిత్వం..!


కవిత్వం ...కవిత్వం..కవిత్వం..!
నాకు జన్మ జన్మలకు అమరత్వాన్ని
అందించే అమృతాక్షరి...........


*05-08-2012

బి వి వి ప్రసాద్ || గమనించముగానీ ||

గమనించము కానీ
 ఒక దీర్ఘ ప్రవాసం తరువాత ఇల్లు చేరినపుడు
 ఇల్లు కూడా కాసేపు మనని అతిథిలానే చూస్తుంది

ఇంటి గోడలూ, వాటి వెలిసిన రంగులూ

సామానూ, అవి సర్దుకొని ఉన్న విధానమూ

మన మనుషుల మాటలూ, ప్రవర్తనా

వాకిట్లో ఇవాళ పూసిన పూలు కూడా

ఎవరీ మనిషి అని చూస్తున్నట్లూ, ఎవరినో పలకరిస్తున్నట్లూ ఉంటాయి

మనని మనకు కొత్తమనిషిని చేస్తాయి


గమనించము కానీ

గాఢమైన నిద్రనుండి మేల్కొన్నపుడు కూడా

కొంత సమయం, మనచుట్టూ ఉన్న ప్రపంచం అప్పుడే పుట్టినట్లుంటుంది

ఆక్షణమే, ఎవరో ఎక్కడినుండో ప్రపంచాన్ని తెచ్చి మన చుట్టూ పరిచినట్లుంటుంది

అపుడు మనం

మొదటిసారి శ్వాసిస్తున్నట్లు కొత్త ఊపిరి గుండెలనిండా నింపుకొంటాము


మేలుకొన్నపుడూ,

ఇంటికి వచ్చినపుడూ

కాసేపు మనలో పసిపిల్లల అమాయకత్వమేదో గోడమీది నీరెండలా పారాడుతుంది


తామేమి చేస్తున్నాయో తమకు తెలియకుండానే

కఠినమైన ప్రపంచాన్ని కోమలమైన రంగులతో నింపుతున్న

పూలలోని మృదు సౌందర్యస్పృహలాంటిది ఏదో

మనలో లీలగా, దూరం నుండి వినవస్తున్న పాటలా

వాగు ఇసుకపై మెరుస్తున్న పలుచని నీటిపొరలా చలిస్తూ ఉంటుంది


గమనించము కానీ

మన ఇల్లూ, మెలకువా పాతబడే కొద్దీ

కొంచెం కొంచెంగా మనవాళ్ళూ, ప్రపంచమూ మనలో నిండే కొద్దీ

దేనినో కోల్పోతున్న దిగులు ఒకటి

ఇసుకపొరలు దాటుకొంటూ వాననీరు పాతాళంలోకి ఇంకుతున్నట్లు

మన లోపలికి ఇంకుతూ ఉంటుంది.

*05-08-2012