పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

28, ఆగస్టు 2012, మంగళవారం

కాశి రాజు || నాన్నన్న దేవుడు నాతో చెప్పాడు ||

అమ్మతనం నిండిన
అనంత విశ్వంలోనుండి
అరచేతుళ్ళోకి జారినపుడు
మొదటి ముద్దు అమ్మిచ్చిందట
దాంతో ఒక్కసారి ఉలిక్కిపడి
విశ్వాన్నే జయించిన వీరుడిలా
కనిపించానట నేను

రెండో ముద్దు నాన్నెడితే
నాలుకతీసి ఎక్కిరించానట
కితకితలు పుట్టికాబోలు
అదీ నాన్నే చెప్పాడు

ఈ భూమ్మీద మొదటాకలి తీర్చిన
అమ్మతనాన్ని
చిత్రించాడట మానాన్న
ఆమె చనుబాలు నా నోటికందిస్తూ
ఒళ్ళో ఉన్న నా బుగ్గమీద
ప్రేమచుక్కలు రెండు కురిపించిదట
వాటిని
మా నాన్న
తన ముక్కుతో తుడిచాడట తెలుసా!....?
నాతో చెబుతూ చెమ్మవుతున్నాడిప్పుడు.

"పెరిగి
పెద్దైనా
పేగుబందం తెగదులేరా"

ఆకలినీదైనా
అలమటింపు తనది
అందుకే
ఆమె
అమ్మైందిరా

కడుపులో ఉన్నప్పుడేననుకున్నావా?
పేగుతెంచుకుని పుట్టేసాక్కూడా
నీకాకలైతే తనకెలా తెలుస్తుంది చెప్పు?
ఇంకా ఆ లంకె ఏమిటో?
ఎక్కడుందో?
ఎవడు దాన్ని సృష్టించాడో తెలుసా?

అని అడిగాడు
తెలీదన్నట్టు చూసాన్నేను

దగ్గరకు పిలిచి
చెవిలో నోరెట్టిమరీ నాన్నన్న దేవుడు నాతో చెప్పాడు
"నేనెనని"

*28-08-2012

క్రాంతి శ్రీనివాసరావు || ఆకలి....కొలత ||

ఆకు..పప్పు నెయ్యూ అన్నీ
మనసులోనే వేసుకొనేవాళ్ళం
అమ్మ చక్కలిగిలి పెడితేనవ్వుకొనే వాళ్ళం

గంజీ గటకే తప్ప
వేడి వేడి ఇడ్లీ ఉప్మా ఎరగనివాళ్ళం
చద్దన్నమే రోజూ పలహారం
గొడ్డుకారమే మాకు గొప్ప విటమిన్లు

ఏరుకొన్నవో ఏవరో పారేసుకొన్నవో
పుచ్చువో పచ్చివో తప్పితే
ఫలాల జాడ పలువరుసలు ఎరుగవు
రుచి మరచిన నాలుక కసలేతెలియదు
మెలితిప్పే ఆకలిమంటలు
మలిపేందుకు నీళ్ళూదొరకవు

ఎ బి సి డి అక్షరాలు మా తెలివికి తెలియదు
ఎ బి సి డి విటమిన్ల్లు మాతనువుకుతెలియదు

నెత్తురూ చాలినంత వుండదు
వున్నదాంట్లో కుడా వుండాల్సినవి
ఎక్కువో తక్కువో వుంటాయు

సరిపోనూ అనే పదం
మాజీవితాల్లోంచి
చెరిపేసుకొని చాలాకాలమయ్యుంది

ఇరవైఏళ్ళకే మాకు అరవైఏళ్ళువస్తాయు
వయసుతోపాటు వైరాగ్యమూ వస్తుంది

ఆకాశం నెత్తిమీద కూలిపడుతూనే వుంటుంది
కాళ్ళ కింద భూమి బద్దలై పాతాళంలో
తూలి పడిపోతూనే వుంటాం

వైరస్ లన్నింటికీ వాసయోగ్యమై
శిధిల శిలాజాల్లా సంచరిస్తూనే వుంటాం

మిగతా జంతువులకు మల్లే
సహజాత సంతోషాలూ దొరకవు
సహజ మరణాలు ప్రాప్తించవు

ఒక్కోఅవయవం కూలి
అణువణువూ చీలి
తనువంతా తగలడి
చితిని చేరకముందే
మా కపాలం పగిలిన శబ్దం
మేమే వింటూ

ఊహల కందని వేదన
ఊదర పెడుతూ వుంటే
ఊపిరి వదులుతు వున్నాం

ఆకలి చావులు కావట మావి
అసలవి లేనే లేవట
మరు జన్మంటూ వుంటే మళ్ళీ మనిషిగ పుట్టాలని లేదు

*28-08-2012

నందకిషోర్||పునర్విమర్శ అభ్యాసం-1||

గద్దలు ఆకాశం తమదంటూ
చక్కర్లుకొడ్తాయ్.
పాములు పుట్టల్లోంచి,గుట్టల్లోంచి
పైకిపాకుతాయ్.

నిజాయితీలేని ఆసరా ఏదో
మినుక్కుమనే గాలిలో మెరుస్తుంటుంది.
సంజాయిషీ కోరని అభిమానమంతా
చురుక్కుమనే నీడలో తడుస్తుంటుంది.

శిశిరాన్ని గెలిచిన పిచ్చిలో,వెర్రిలో
చెట్టుకి ఏమి పట్టకపోవచ్చు.
వసంతం చూడని కోయిలలగొంతులో
రాగం ఏది పుట్టకపోవచ్చు.

వాలే పక్షులకి ఏ చెట్టైనా ఒకటే-
గూడు కడ్తే గుండె పగిలిపోతుంది.
గాలివానొకటి గట్టిగా వీస్తే
నిజం నిక్కచ్చిగా తెలిసిపోతుంది.

ఏదైతేనేం?
ఋతువొకటి మారింది.
ప్రకృతికి,నీకు
పనికొస్తుంది.

ఎలాగైతేనేం?
ఋజువేదో దొరికింది.
వాగుకో,వలసకో
పొమ్మంటోంది.

విషాదాన్ని మింగి మూగబోయిన నీకు
పగిలిన కన్నుల్తో ప్రాణంపోయిన నీకు
మరో అకాలాన్ని కలవలేని నీకు
మరో ప్రపంచాన్ని చూడలేని నీకు

సాయం సాయంత్రమై కరిగేపూట
ఎందుకొచ్చిన వేదాంతం బుల్‌బుల్?
నిజం.. నీకెవరూ లేరు!
నీ రెక్క నువ్వే కట్టుకోవాలె.
నీలాగే నువ్వు ఎగిరిపోవాలె.

ఏం జరిగిందో,ఏం మారిందో ఆలోచిస్తూ,
ఎటెల్లావో,ఎలా చిక్కుబడ్డావో పరిశోధిస్తూ,
ఏం దాచావో,ఏం కోల్పోయావో లెక్కలువేస్తూ,
ఎక్కడికి పోవాలో,ఎలా తెంపుకోవాలో పత్రంరాస్తూ,

కాలం నిర్దయగా వెక్కిరించేవేళ
ఎవరిచ్చిన ఏకాంతం బుల్‌బుల్?
నిజం..నీకెవరు లేరు!
నీ గింజ నువ్వే సంపాయించాలె.
నీ బతుకు నువ్వే బతికిసూపాలె.

Date 28.08.12

నరేష్ కుమార్ //ఒక తిరోగమణం//

గుప్పెడు చీకటి
మొహంపై చల్లుకొని
పరిస్కందున్నై
విభ్రమం తో
పరిభ్రమిస్తున్నా...

ప్రభవానల ప్రకాశం నుండి
పారిపోతున్నా...
నా లోకి నేనే

దవళ కాళ యుగళ
దళాల నడుమ
నిర్విరామ
నిర్నిద్రా గమనం
నన్ను నేను
వెతుక్కోవటానికే...

శరాఘాత
గాయాలు నిండిన
హయాల ద్వయారూడుడినై
విఫల విహ్వల
అస్త్రాలతో
మనో వల్మీకపు
కుడ్యాల పై
నన్నునేను
ప్రతిష్టించుకుంటూ
నిమిషాల నివహాళ్ళొంచి,
ఆవర్తపు ఆవాసాల
మధ్యనుంచి
పంచముడై, వంచనుడై
పరాజిత
చరిత్ర పుటల్లో
నా చరిత్రను
పునర్లిఖిస్తూ
పునర్జన్మిస్తూ...

అనంతానంత
దిగంతపు మేఖలలో
ప్రతిధ్వనిస్తూ,
పరిక్రమిస్తూ..
మౌనం చెక్కిలిపై
హస్తపురేఖలు
చిత్రిస్తూ....
నన్నునేనే
ఒక
ప్రస్తానపు ధునిలో
పారేసుకుంటూ
పరీవ్రుతున్నై
పరిగెడుతున్నా....
నాలోకి నేనే.....

 28.08.2012

శిలాలోలిత॥దుఃఖపు రజను॥

లోపలిమనసులోని
పెనుకేకలు - ఎంత పెనుగులాడినా వినిపించవు.
గుండెలు పగిలిపోతున్నా
దుఃఖపురజను నుసి కనిపించదు.

నిశ్శబ్దపు సొరంగంలో
ఎంతకీ తేలని శబ్దపుతట్టు
ఒక్క కన్నీటిబిందువునూ సృష్టించదు.

అంతా మామూలే-
గబుక్కున మబ్బుదుమికినట్టు ముఖం
ఉదాసీనపు ముకుళిత కుసుమంలా మారిపోతుంది.

విచ్హుకోబొయిన రేకులు
మాటల వాడికి విలవిల్లాడతాయి.
నవ్వబోతున్న పరిమళం
ఏ సువాసనని ఇవ్వదు.

అరచేతిలో నెత్తురోడుతున్న మనసు పుష్పం=
ఎన్నిసార్లు కడిగినా,తుడిచినా కన్నీళ్ళే!

ప్రేమమట్టిని తొలుచుకుని
బతుకుమొక్కపై మొలిచిన నెత్తుటిమొగ్గ- మనసు!
కొత్తజన్మతో కన్రెప్పలు తెరిచిన కుసుమానికి
క్షణక్షణం కంటకాల సయ్యాటలే!

అదేమిటోగాని

మంచుకన్నా స్వచ్హం.స్ఫటికమైన మోహం
అనంతమైన అనురాగం
లోలోపలి మనసులో నీకై, నీకొరకై...!

*28-08-2012

వర్ణలేఖ ||అంతులేని ప్రశ్నలు ||

ఎదగాలని ఉవ్వెత్తున
ఎగసినప్పుడల్లా

నీవు నను నిలువరిస్తూ
నాతోనే ఉంటావు పంచభూతాల్లా....

నీవులేంది నిలువలేను
నీవుంటే ఎదగలేను

గాలిలా వచ్చి
నా గమ్యాన్ని మారుస్తావు

వానవై తాకి
నా కలలను కరిగించేస్తావు

అగ్నివై నాలోని
ఆశలు ఆవిరి చేస్తావు

ఆకాశంలా మారి
నను చిన్నదాన్ని చేస్తావు

ఎంతకి నేనొదగకపోతే

భూమివై నను
నీలో కప్పెట్టేస్తావు

*** *** *** ***

ఎదగమనేదీ నీవే
ఎదురు నిలిచేదీ నీవే

వేటాడ నేర్పుతన్నవు
నన్నే వేటాడుతున్నవు

విమర్శ పేరుజెప్పి
విదిలించి కొడతావు

సలహాల పేరుజెప్పి
సచ్చుపడవేస్తావు

పాలుబోస్తె పంతవు
లేదంటె కాటేస్తవు

నేనెట్ట ఆడేది
నేనెట్ట పాడేది

నేనెట్ట ఎదిగేది
నిన్నెట్ట గెలిచేది

28-8-2012

సురేష్ వంగూరీ || మీడియాజాలం ||

మనసుని శాటిలైట్ ఛానళ్లుగా విడగొట్టి
కుహనా విలువల రిమోట్ కంట్రోల్తో
మనల్ని మనమే మార్చి మార్చి
మోసం చేసుకుంటూ ఉంటాం

జీవితం డైలీ సీరియల్‌లా
అరాచకంగా సాగుతుంటే
అర్ధాంతరంగా ఒక కమర్షియల్ బ్రేక్...
అనుకోకుండా అందులో మనమే ఉంటాం

మనం పంటి నొప్పితో బాధపడుతూ
డెంటిస్ట్‌ను సంప్రదించకుండా
చిత్రంగా సినిమా కెళతాం
సినిమాలో కొందరు రౌడీలు
హీరోయిన్ని బలవంతం చేస్తుంటారు
ఉన్నట్టుండి పంటి నొప్పి తాళ లేక
ఆ... అని అరుస్తాం
మన మీద జాలి పడిన హీరోయిన్
అత్యాచారాన్ని వాయిదా వేసుకుని
తెర చీల్చుకుని మన ముందుకొస్తుంది
ఉచితంగా ఒక ఉప్పు సలహా ఇస్తుంది

ఏమీ జరుగుతుందో మనకర్ధమయ్యే లోపే
ఆమె తిరిగి తెర మీద కనిపిస్తుంది
రౌడీలకు స్వచ్చందంగా సహకరిస్తూ
తన అత్యాచారం సీను కంటిన్యూ చేసుకుంటూ
అచ్చం మన సంకీర్ణ ప్రభుత్వంలా

ఇప్పుడు
శీలం కాపాడుకోవటం కన్నా
పంటి నొప్పికి కారణాలూ పరిష్కారాలూ
తెలియచెప్పటం అత్యంత అవసరం

ఇక్కడ
అమ్మకమే జీవితం
ప్రభుత్వాలు వాణిజ్యం చేస్తున్నాయో
వాణిజ్యాలు ప్రభుత్వం చేస్తున్నాయో మనకు పట్టదు
ఇంకా ప్రాధమిక హక్కులే అనుభవానికి రాని మనం
బంగారపు హక్కుల గురించి పోరాడుతుంటాం

చూడటానికీ మోసపోవటానికీ
అలవాటైన జీవితంలో
కరెంటుపోయిన ఒక రోజు
ఏదోటి చూడకుండా ఉండలేని మనం
విధిలేక మనసుల్లోకి చూసుకుంటాం
మెల్లగా మల్టీ మోసాల మీడియాజాలం అర్ధమవుతూంటే
ఏడ్వడానికి కూడా సిగ్గేస్తుంది

సరిగ్గా అప్పుడే
నీ మీద నుంచి అడ్డంగా ఒక మెరుపు వెళుతుంది
సత్యం సాక్షాత్కరిస్తుంది
అవాక్కయ్యారా అని ప్రశ్నిస్తుంది

28. 8. 2012

వంశీ // మదర్ లాండ్ //

మన డబ్బుతో
మన్తో పన్జేయిస్తూ
మనకే జీతాలిచ్చే ప్రజాస్వామ్యంలో,

సుబ్రహ్మణ్యస్వాములూ
తెహల్కా డాట్ కాములూ గడ్డి తినుంటే,
"రాజా"వారీపాటికి సాంబారిడ్లీ తిని, మెరీనాలో
భావకవితల్రాద్దురు కనిమొళిని కని,
దేశభద్రత మట్టికొట్టుకుపోయేది..

జర్నలిజం మొఫసిల్ వార్తలూ
బొడ్డుసుందర్ల ఉవాఛలేరాస్తే,
న్యాయం గనుల"గాల్లో" కలిసి
సచివులు కాక్ టెయిల్
ఉతార్ పెగ్గులేద్దురు బెల్ట్ షాపుల్లో..

హయ్యర్ హైరార్కీ కి మేళ్ళు,
జనాలకి రాళ్ళు మిగిలి,
పళ్ళెప్పుడో ఊడి,నిజాల్నమిలీ నమిలీ,
తలొకటే ఖాలీ, పగిలేందుకు..

యువరాజేడి కనపడ్డూ
కోచింగా సార్వత్రికెన్నకల్లో ప్రధానిగా,
ఉద్యమాలేవి వినపడవూ
మళ్ళీ వ్యూహాత్మక మౌనమా,

B.P.L కింద
కాందిశీకుల ద్విధావిఛ్చిత్తి,
I.P.L మీద పెద్దతలల
కరెన్సీ చెయిన్ రియాక్షన్..
ఛ, దరిద్రగొట్టు దేశం,

-"పట్టుకోండ్రా వాణ్ణి,
ఇన్సల్టింగ్ ది నేషన్ ఇన్ పబ్లిక్,
కాగ్నైజబుల్ అఫెన్స్,
వారంట్ భీ అవసరం లేదు,
నూకండి బొక్కలో"

నా జన్మభూమి ఎంత అందమైన దేశమూ,
నా ఇల్లు అందులో ఒక కమ్మని ప్రదేశమూ....

date 27.08.12

భమిడిపాటి //నాలో మార్పు //......

అమ్మ చెప్పింది
పెద్దదానివయ్యవ్
హద్దుల్లో ఉండమని
వంచినతల ఎత్తోద్దని ....

నిన్ననే
పసిడి ప్రాయాన్ని పలకిరిస్తూ
కొత్తగా వచ్చిన
నాకే అర్థం కాని చిన్న మార్పు !

ఎందుకో
పదహారు ప్రాయాన్ని పలకరిస్తూ
ఆశగా చూసే కళ్ళు
అర్థం కాని ఎన్నో ప్రశ్నల ముళ్ళు

పొరపాటున కూడా పట్టించుకోని
పక్కింటి అంకుల్
కొత్తగా ప్రేమ ఒలకబోస్తో
ఏదైనా కావాలంటే మొహమాట పడద్దని మరీచెపుతూ

ఎప్పుడూ నడిచే సందు మొగలో
చూసే వింత చూపులు
వెక్కిరించే కొత్త సైగలు
వినీ వినపడనట్టు ఏవో కొత్త మాటలు

ఎప్పుడో ఒక్కసారి గుర్తొచ్చినప్పుడు
హోం వర్క్ తప్పుల్ని
బెత్తంతో చేతిమీద దిద్దే మాస్టారు
తప్పుల సాకుతూ ఒంటి మీద చేతితో పెట్టె కితకితలు

అమ్మ పక్కలో దూరి
చిన్నప్పుడు వినే కధల్లో
పెద్ద దానివైతే కొత్త ప్రపంచాన్ని చూస్తావ్
స్వేచ్చగా జీవిస్తావ్ ...!

అంటే ఏదో అనుకున్నా !
ఎంతో ఆశ మనసులో దాచుకున్నా
కాని వింత ప్రపంచాన్ని చూస్తున్నా
నాలో మార్పుకి నేనే నాలోనే కుచించుకు పోతున్నా

26-08-12

రాళ్లబండి కవితా ప్రసాద్ || నేలకు చేరని నీడలు !|

వీధి లో నడిచే ప్రతిమనిషి వెనకా రెండు నీడలు
ఒకే దారిలో వేర్వేరు అడుగులు
వెలుతురును బట్టి నీడలు,
అడుగులను బట్టి నడకలు ,
మారుతూ ఉంటాయ్.

దారి ఒకటే,
గమ్యాలు వేరు!
నడక ఒకటే,
ముందుకూ , వెనకకూ, ఒకేసారి!

చీకటి లో
నడిచేటప్పుడు కూడా,
తమ నీడల్ని ఈడ్చుకు పోతున్నారు!
కదల కుండా కూర్చుని కూడా
పరుగేడుతుంటారు
ఒకరికొకరు దీకోట్టుకోకుండా
తేనెటీగల్లా తుట్టె కేసి
ఎగురుతుంటారు!
ఏపువ్వును ఎవరు దోచుకున్నారో!
ఏమనిషిని ఎవరుకుట్టి వచ్చారో!
మర్చి పోతుంటారు!

వీధి లో ఎగిరే ప్రతిమనిషి వెనకా
నేల మీద పడని వేల నీడలు!

27-08-2012

వర్ణలేఖ || స్పందన ||


నిన్నెప్పుడూ
మనసులో నుండి
తోసేస్తూ నేను
నన్నేప్పుడూ
నీలొనే
భద్రపర్చుకుంటూ నీవు

ఎప్పుడూ నేనేనా
నీవెప్పుడూ చెప్పవా
అనే నీ బుంగమూతి
నే స్పందించనని
నీవలిగితే
నే నవ్వినపుడు

ఈ స్పందనే
నాక్కావాలని
సంతోషపడతావు
నాకో చంటిపిల్లాడు
దొరికాడని
నేనింకా నవ్వుకోవడం
నీవేమో ముత్యాలేరుకోవడం

27-8-2012

చింతం ప్రవీణ్||కన్నీళ్ళు||

నాకెందుకో ఏడ్పురాదు
లోలోపల వేదనతో
హృదయం పగిలి ముక్కలౌతున్నా
పైకి మాత్రం ఒక్క చుక్క కన్నీరు ఉబికిరాదు
అప్పుడప్పుదు అనిపిస్తుంటుంది
నేను బండబారానా అని

కొందరేమో అశ్చర్యంగా
క్షణాల్లో కన్నీళ్ళ కొలనౌతారు
చూస్తుండగానే

నాకేమో ఏడ్పురాదు

అలా రోడ్డుమీద ఓ అడుగు వేస్తానో లేదో_
కకావికలమౌతాను
మెదడులో అలోచనకాలోచనాలు
ఉక్కిరిబిక్కిరి చేస్తాయ్

ఒక్కో దృశ్యం
గుండెను నిమిషానికి వెయ్యిసార్లు కంపితం చేస్తుంది

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పాపను చంకనెత్తుకున్న బిచ్చగత్తె
బస్టాండు రైల్వేస్టేషన్లలో కరగడానికి సిద్దంగా ఉన్న యవ్వనవతి
స్వేదం కురుస్తున్నా బతుకురిక్షాబండిని లాగుతున్న వృద్దుడు
వివర్ణ ప్రతిబింబాలై విచలిత బతుకులను భుజాలపై మోస్తున్న బాటసారి

బతుకు సుడిగుండంలో జీవితాన్ని కోల్పోతున్న వీళ్ళందరు
గుండెను నిమిషానికి వెయ్యిముక్కలు చేస్తారు
కుండపోత వరదలా ముంచెత్తి గుండెరేవును గండి కొడ్తారు

ఐనా
పైకి మాత్రం ఒక్క చుక్క కన్నీరు ఉబికిరాదు...

అలా సమాజ మరుభూమిలో
ఎవరైనా బతుకుపందానికి ముగింపు పలికితే... వెళ్తానా

సానుభూతి చూపిస్తు కొందరు
తెచ్చిపెట్టుకున్న కన్నిళ్ళతో ఇంకొందరు
కుండపొత వర్షంలో నన్ను బందీని చేస్తారు
దింపుడు కల్లంలో ప్రాణం దొరకని చోట
అక్కడ నేను దొరికిపోతాను

ఒక్క చుక్క కన్నీరు రాదు!
వీడు బండబారాడని కొందరంటారు
కృత్రిమ కన్నీళ్ళకు విలువనిచ్చేవాళ్ళు

నేనంటాను
కన్నీళ్ళు
అనివార్యమైన సానుభూతికి నజరానాలు కాకుడదని

ఐనా
మన కన్నీళ్ళలో హృదయం లేనపుడు
మన కన్నీళ్ళు
మన హృదయం
మనం
నమ్మకం కోల్పోతాం ఎప్పటికైనా_

26.08.2012

శ్రీకాంత్|| పరదాలు||

ఎర్రటి మట్టి మాలలలోంచి
ఎగురుతోంది గాలి, రాణులు
స్నానమాడిన కొలను వద్ద

తెల్లటి బాతులు నడిచిన
ఆ దారులలోనే ఉన్నాయి
ఇప్పటికీ పచ్చని ఆకులు

రాత్రి బావిలో తొణికిసలాడే
నిండు చంద్రుడు, వానలో
తడిచి వణికిన తల్పం ఇదే

తడి పాదాలతో నీకు పైగా
నడిచి వెళ్ళిన రాణీవాసపు
రహస్య స్త్రీలు రారిక నీవైపు

పరదాలు దాచుంచిన
ఆ మందిరాలలోంచి
స్మృతి చరిత్రలలోంచి.
----------------------
27.08.2012

భవాని ఫణి ||ఆసరా ||

ప్రాణం పరుచుకుని
దేహం దర్పంగా నిలుస్తుంది
మౌనం పరుచుకుని
నయనం కథలెన్నో చెబుతుంది
ప్రాయం పరుచుకుని
యవ్వనం నిండుగా నవ్వుతుంది
మేఘం పరుచుకుని
వర్షం వెల్లువలా కురుస్తుంది
భావం పరుచుకుని
భాష కవిత్వాన్ని స్రవిస్తుంది
నీ ప్రేమని పరుచుకుని
నేను పసిపాపలా నిదురిస్తాను

27/08/2012

Mercy Margaret ||జీవితం ఒక చక్కటి కాఫీ లాంటిదే||

నిమిషాలన్నీ
కాఫీ చుక్కలుగా
కాలాన్ని కాఫీ చేసుకుని తాగెయ్

ఒక్క కప్పు కాఫీ రుచిగా
ఉండడం కోసం
జీవితాన్నిమరిగించే
పిచ్చి వారిలో నువ్వూ
ఒక దానివేగా

వేడి వేడి పొగల్లో తన
జ్ఞాపకాలతో నింపుకున్న శ్వాస
ఆవిరై పోనివ్వక
తన మాటలన్నీ
చెక్కర గుళికలుగా చేసుకో
ఆ పోగానంతా పీల్చేసుకొని
గుండెల్లో నింపుకో

అక్కడే తను ఘనీభవించి పోయేలా
ఆ ఆవిరులకు
నీ తలపుల వెచ్చని కౌగిలి
జోడి చెయ్

చూడు అప్పుడు జీవితం
ఒక చక్కటి కాఫీ లాంటిదే కదా !

27/8/2012

స్కైబాబ || సహచరం ||



కొత్తగానో ఒంటిగానో
బయలెల్తే
ఎక్కడ విడిది చేస్తే
అదే ఇల్లు
ఎటు ప్రయాణిస్తుంటే
అటే గమ్యం

గాడిని తప్పుకొని
గడులు గిరులు దాటుకెళ్తుంటే
అదో ఖుషీ
అసలు 'గోల్' అనే ఒకదాన్ని
నాశనం చేస్తే
అంతా మైదానమేరా బై !

*
దేహ ఖండా లేకమైంతర్వాత
అగ్గి పుట్టడమే కాదు
ఘనీభవించడమూ ఉంటుంది

జీవితం
సహచరమనే పరచేతిలో
పగ్గమై నలిగిపోతుంది

ఒకరి ఆధీనంలోకి
హద్దులోకి నడవడం
నాలో నదులు నదులుగా
ప్రవహిస్తున్న చైతన్యాన్ని
ఉప్పు సముద్రంలో కలపడమే !

వద్దు
ఈ గుంజలొద్దు గుంజాటనలొద్దు
ఈ పలుపుతాళ్లొద్దు గుదిబండలొద్దు
బందీ కావడం నా చేత కాదు
చేతన కాదు

మనుషుల్ని తడుముతూ
వాళ్ల పరవళ్లనూ
కన్నీళ్లనూ
తోడ్కొని
పాయలు పాయలుగా విడిపోతా...

27-08-2012

మోహన్ రుషి ||ఒకరోజున..!||

కడుజాగ్రత్తగా ఉంటాననీ
అపురూపంగా చూసుకుంటాననీ
అపార్థం చేసుకోననీ
అనర్థాలకు కారణం కాబోననీ చెప్పాను!

కేవలం వినడం చేస్తాననీ
చూపుని నిశితం చేసుకుంటాననీ
కరుణతో మెలగుతాననీ
కళ్ళల్లో తడిని కాపాడుకుంటాననీ చెప్పాను!

శుభ్రమైన మనసుతో చరిస్తాననీ
చిరుదుఖ్ఖానికైనా చలిస్తాననీ
బలమైన కాంక్షతో కౌగిలించుకుంటాననీ
బంధానికి అంతులేని అనురాగం అద్దుతాననీ చెప్పాను!

కిటికీలు తెరిచి ఉంచుతాననీ
గదులన్నీ ఖాళీగానే అట్టిపెడ్తాననీ
వెలుతురును నిలుపుకుంటాననీ
వెన్నెలనే కురిపిస్తాననీ చెప్పాను!

చేతిలో చెయ్యి వేసి
తన ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తానని
జీవితంతో చెప్పాన్నేను!

27-08-2012

ఈడూరి శ్రీనివాస్ ||ఒకప్పుడు||

ఒకప్పుడు భూమ్మీద మనుషులుండేవారట
మంచితనం, మర్యాద పంచుతుండేవారట.

ఏవైపు చూసినా పచ్చదనం వుండేదట
నదీ పరివాహకాల్లో నాగరికత విరిసేదట.

ఏనోటి మాట విన్నా మనసు పులకరించేదట
ఏఇంటి తలుపు తట్టినా ఆప్యాయత పలకరించేదట.

శ్రమైక జీవన సౌందర్యం అనుభవించేవారట
చెరపకురా చెడేవు అని చెప్పుకునేవారట.

ఆ రోజులు పోయాయి, అవతారాలు మారాయి
విలువలు తరిగాయి, స్వార్ధాలు పెరిగాయి

నేడు భూమ్మీద వున్న జనం మనుషులు కానేకారు
యాంత్రికంగా బతుకు లాగే మరమనుషులు వీరు

జురాసిక్కు పార్కులో స్పీలుబర్గు చూపించినట్లు
రాక్షస బల్లుల్లా మనుషులు మళ్ళీ పుడతారట

అమ్మ నన్ను ఈరోజు జూకి తీసుకెడుతోంది
మనుషుల్ని చూపిస్తా రారమ్మని అంటోంది

అంతరించిపోతున్న మనిషి జాతీ వందనం
ఫ్యూచర్లో ఎక్కడో మళ్ళీ కలుద్దాం మనమందరం!!!!

27/8/12

క్రాంతి శ్రీనివాసరావు || నిజం భాష||

నిన్నటి రక్తపాతం
ఆవిరయ్యుందనుకొనేలోపే...

నిప్పుల వడగళ్ళ వానై
మళ్ళీ కురుస్తోంది

నిన్నటి ఆర్తనాదాలు
ఆగిపోయాయనుకొనేంతలోపే

గుండెలు పగులుతున్న చప్పుళ్ళు
మళ్ళీ మొదలవుతున్నాయు

నిన్నటి కన్నీటితో
సేదతీరకముందే

సన్నటి ధార మళ్ళీ
ప్రవహించాల్సివస్తూనేవుంది

నిన్నటి ఆకటి తడీ ఆరలేదు
రేపటి చీకటీ తొలగేట్లులేదు

వాడలు వూళ్ళయ్యేదెన్నడో
బళ్ళు ఓడలయ్యేదెన్నడో
రాకాసి రాబందులూ వాళ్ళే
విషసర్పాలూ వాళ్ళే
మేం మాత్రం ఎప్పుడూ కోడిపిల్లలమే

పుట్టకముందే ఒకటి
పుట్టాక మరొకటీ చంపుకుతింటున్నాయు

ఒక్క ఘోష బుసకొట్టినా
సహించలేరు
మాలోంచి ఒక్క కిరణం వెలిగినా
మలిపేదాకా నిద్దుర పోరు
అయునాసరే
నిన్నటి ఆకులు రాలకా తప్పదు
రేపటి కోసం
కొత్తచిగుళ్ళు తొడగకా తప్పదు

అనాదిగా అడుగునే వున్నా
సరికొత్త సమసమాజానికి పునాదిరాళ్ళం
మేమే అవుతాం

*27-08-2012

కర్లపాలెం హనుమంత రావు॥వెతుకులాట॥

పుప్పొళ్ళకోసం తూనీగల వెతుకులాట

తల్లి కాబొయే పిట్ట చాటుకు

పుల్లా పుడకా కోసం మగపిట్ట వెంపర్లాట

కంటికి కనిపించవు గానీ

చీమా దోమా నక్కా కుక్కా

జీవించినంత కాలం గింజా బొంజా బొక్కా తొక్కా వెతుకులాటలోనే బతికివుండేది.

అది పురుగూ పుట్రా కత

అన్నీ అమర్చి పెట్టి పుట్టించిన మనిషి కతో!

పాలబుగ్గల కోసం తల్లి రొమ్ముల మీద పసివేళ్లతో శిశువు తడుములాటతో మొదలు వెతుకులాట కత…

అమ్మ వంటింట్లో ఏ పోపు గిన్నెలెనకాల మిఠాయి దాచిపెట్టుంచిందో

నాయిన ఏ అంగీజేబులొ ఖర్చులకోసం చిల్లర పైసలు మిగిల్చుకున్నాడో…వెతుకులాట!

పిల్లతనం ముదిరితే పిల్ల నీలికళ్ళ వాలుచూపుల కోసం పిల్లడి వెతుకులాట

పిల్లడి చొంగ కళ్ళ వెచ్చ్దదలనం కోసం పిల్లదాని దొంగ వెతుకులాట

అదో దోరవయసు వేట

చిటికెనేలు పట్టుకుని వెనకెనెకే నడుచుకునే చిట్టి పాపాయి

చటుక్కున మాయమైపోతే చెట్టూ పుట్టా పట్టుకుని వెతుకులాట

ఎటూ తప్పదు కదా వెతుకులాట కన్నపాశానికి…చదువులకోసం..చక్కని సంబంధాలకోసం!

మనుషుల కోసం సరే

కలిసే మనసుల కోసం..మాటల కోసం…!

మూటల కోసం…మూటలు దాచే చోటుల కోసం

అంతరాత్మల బరువులను కూసింత సేపు నెత్తిమీద మోసే హెర్క్యులిస్ ల కోసం

వెతుకులాటో!

డబ్బూ దస్కం పేరూ ప్రతిష్ట వంశం గౌరవం మానం మర్యాదా చిలక ప్రాణంలోదాచి సప్తసముద్రాలకావల ఏ మర్రితొర్రలో దాచుంచాలోననీ వెతుకులాటే!

మనం నాటిన విత్తు మహావృక్షంగా విస్తరిస్తే మహదానందమే గాని

అరబ్బు ఒంటె మాదిరి గుడారంలో ముడుచుకునేందుక్కూడా మూడడుగుల జాగా కోసం ముదిమితనంలోవెతుకులాటంటే!

తప్పదా చివరిదాకా మనిషికి ఈ వెదుకులాట!

పోతాం గనక తెలీదు కానీ

అస్తికలు కాశీలో కలిపి రావడానికి బయలుదేరే ముందే

కన్నబిడ్డలు రాయని వీలునామాలో తమ వాటా ఎక్కడుందో వెతుక్కుంటారు.

కానీ…

పుప్పొళ్ళకోసమే తూనీగల వెతుకులాట

తల్లి కాబొయే పిట్ట చాటుకోసమే

పుల్లా పుడకకు మగపిట్ట వెంపర్లాట

మనిషి కంటికి కనిపించని

చీమా దోమా నక్కా కుక్కా

జీవించినంత కాలం గింజా బొంజా బొక్కా తొక్కా వెతుకులాటలోనే బతికివుండేది.

వెతుకులాటలోనే వాటి బతుకు పండేది.

అన్నీ అమర్చి పెట్టి పుట్టించిన మనిషి వెతుకులాట కతే

నవ్వులాటగా ఉంది మరి!

*27-08-2012

కవితాచక్ర ||నీ ఇష్టం..||


ఉరకలేసే యెద గోదావరి
పరవళ్ళు తొక్కుతూ
ఆనకట్ట వేయలేని నా
పట్టు తప్పి,
నీ దారి మళ్లితే...
తలమునకలవుతావో..
తరలించుకుంటావో
నీ ఇష్టం!!

మౌన భాష పలికే కళ్ళు
భావపు లోగిళ్ళై
నా మనసు దాటి,
నీ చెలిమి ముందు
మరో భాష్యమై నిలిస్తే...
మనసారా ఆహ్వానిస్తావో
ఆస్వాదిస్తావో
నీ ఇష్టం!!

తీయని తలపుల కలవరం
వలపు వర్షమై
నా హ్రుది మిన్ను నుండి
నీ యెడద నేల పై
యెడతెరిపి లేకుండా కురిస్తే...
తనువారా తడుస్తావో..
మురుస్తావో
నీ ఇష్టం!!

ఏకాంత ఊహా సౌధపు
సౌందర్య దీపాల కాంతి
అడ్డు పెట్టలేని నా
చేయి దాటి దేదీప్యమై
నీ చెంత వెలిగితే...
వెలుతురవుతావో..
వెలితినే పారద్రోలుతావో
నీ ఇష్టం!!

27.08.2012

కాశి రాజు || కవికోసం ||

ఒరేయ్ కవీ
మనకి కవిత్వం తలకెక్కిందంటే
ఒప్పుకుంటావా?

ఎండని ఎన్నెలన్నా
ఏడుగుర్రాలోడీ ఎటకారమన్నా
మనకే సెల్లింది

చిక్కటి సీకట్లో
ఆమెతో ఆడుకోడమే కాదు
అతన్నీ ఆటపట్టిస్తాం
ఈది సివర ఊసులాడ్డాలు
మనుసుల్ని మెలికలుతిప్పేసి
మనుసుల్ని పిప్పిసేసి పిండేయడాలే కాదు
ఫిరంగులు పేల్చేయడం కూడా తెలుసు మనకు

అలాగే
అప్పుడప్పుడూ
ఆరోగ్గమైన
అబద్దాలల్లుతాము

నిజాల్ని
నిజంగా
నిక్కార్సుగా
నిలదీసేవాళ్ళేవారు సెప్పు ?

ఎవరో కసిర్తే
మనమో రాయిసుర్తాం
కాపోతే
అదీ కవిత్వంలాగుంటాది
అందుకే
మనమే తోపిక్కడ

ఐతే మాత్రం?

కవిత్వాన్ని
కుంచాలు
కుంచాలుగా
కుమ్మరించక్కర్లేదట

కావాల్సినోళ్ళకి
కావాల్సినంత
కవిత్వం
కావాలట
కవిత్వంలాగ 

(*27-08-2012)

కిరణ్ గాలి ||అక్షరాన్ని నమ్ము||

కవీ
అక్షారాన్ని నమ్ము
నీ లోలోపల రాజుకునే అగ్గిని నమ్ము

అవహేలనపహాస్యాలను,
అర్ధంగికార అభినందనలను
అద్రుశ్య అపనమ్మకాలను కాదు

అమ్మ తోడు!
అరవాక్యం అర్ద్రంగా రాయలేని
అంతర్జాతీయ కవులున్నారు

వాళ్ళ అంతరాత్మలకీ తెలుసు
వాళ్ళ అంతరంతరాలలో
ఎంత లోతుందో,
ఎంత చెమ్ముందొ,
ఎంత చేవుందో

అందుకే
అక్షారాన్ని నమ్ము
నీ లోలోపల రాజుకునే అగ్గిని నమ్ము

***

విమర్శుకుల సంగతా?

విశ్లేషకుల ముసుగులో విదూషకులు వాళ్ళు
బంటుని రాజంటారు రాణిని దాసంటారు
యోధానుయోధుడికి మాత్రం కత్తితిప్పడం రాదంటారు
వారు ఔనంటె దాసి రాణవుతుంది
వారిని కాదంటె రాజు బంటవుతాడు

వారి "స్వ అర్ధాన్ని" నిమరక పోతె
మొగ్గను తుదిమెస్తారు, పువ్వును చిదిమెస్తారు
మొక్కను పీకెస్తారు, చెట్టును నరికెస్తారు

అందుకే
అక్షారాన్ని నమ్ము
ఎ ఆయుధాలు కొనగోటిని తాకలేని మహ వృక్షమవ్వు

***

ప్రసిద్ధ కవి సంగతా?

ఆయన నిలువెత్తు అహం కూల బడ్డ కలం...
తరం మారినా తీరు మారని జడం
పేరు చూసి మోసపోయి అద్భుతమనుకోకు
తూకమేసి తూచి మరీ వారి విలువను కట్టు

వారి వంధిమాగధులు అంతే!

వారి సాలె గూడులో ఈగలు వారి నీడలొ ఛాయలు
కవిగారు ఏం రాసినా, ఎలా రాసినా వాహ్ అంటారు వహ్వ అంటారు
వారు కనికరించి వీడి బుజం తట్టి బాగా రాసావ్! నా లాగ రాసావ్ అన్నారా
వీడిక పుస్తకం అచ్చెసుకుంటాడు ముందు మాట రాయించు కుంటాడు.

***

ప్రచురణకర్త సంగతంటావా?

భవదీయులకే మరి బట్రాజులు వీళ్ళు
అతిరధమహారధులకే వీరి అథిధి సత్కారాలు
వీళ్ళు కొట్టని చప్పట్లకు నీ కవిత ఓడి పోదు
వీళ్ళు ముడిచె నొసళ్ళకు నీ కలం చిట్లి పోదు

***

నిరుత్సాహ పడకు...

నిప్పులు వంటికి రాసుకొని అగ్గిలోకి దూకు
కణకణ మండే అక్షరాలు దోసిటిలో పట్టు

ఆ అక్షరమే నిన్ను
నిర్మిస్తుంది
ఆ అక్షరమే నిన్ను
నిర్వచిస్తుంది
ఆ అక్షరమే నిన్ను
నిర్భయిస్తుంది

నీ అక్షరం నిజమైతే నిఖిలమై నిలుస్తుంది
నీ అక్షరం నిజాయితి నిండు మనసులు గెలుస్తుంది
నీ అక్షరం ఆర్ద్రత వేయి గుండెలు తడుపుతుంది
నీ అక్షరం ఆవేశం ఆరిన ఆశయాలను వెలిగిస్తుంది

అందుకే
అక్షారాన్ని నమ్ము
నీ లోలోపల కుసుమించే పువ్వుని నమ్ము

*27-08-2012