23, జులై 2012, సోమవారం
ధనలక్ష్మి బూర్లగడ్ద॥చినుకు అంటే..॥
మబ్బు చాటు వాన చినుకు
మంచుతెరలోంచి తొంగి తొంగి
మరుమల్లియ లాంటి నన్ను చూసి
మైత్రి చేయ మనసై
స్నేహ వీచిక ఒకటి రాయభారమంపింది
నాకు స్నేహ వీచిక ఒకటి రాయభారమంపింది
స్నేహ వీచిక నా చక్కిలి తాకి
సిగ్గులు నును లేత సిగ్గులు ఏవో నాలో పెంచింది
సోయగాలు పోతూ విషయమంతా చెప్పింది
నాకు విషయమంతా చెప్పింది
సిలకమ్మలా ఆరుబయట వాన కోసం ఎదురు చూడమని అంది
చెలిమి చేసే చినుకు కోసం
చిన్న పిల్లను అయ్యాను
అందం ఆరబోసా
పైటల తెరలు తీసా
పరువపు వేడి పెంచి
వయసును మరచిపోయా
చెంతకు చేరే చిరుచినుకుని చెంగులో పట్టి ఆడించేసా
చెంగు చెంగున చిందేసా
నే చెంగు చెంగున చిందేసా
చినుకు చినుకుకూ నాలో
చిలిపితనం నచ్చింది
చందమామలాంటి చల్లదనం నచ్చింది
చంటిపాప మనసున్న మంచితనం నచ్చింది
చిరకాలం చెలిమి చేయాలనిపించింది
నాతో చిరకాలం చెలిమి చేయాలనిపించిందీ
ఒకే ఒక్క చిరుచినుకుగా మారి
తూరుపు సింధూరంలా నా పాపిట్లో చేరింది
అమృతమే తానై నా అధరాలపై తేలి ఆడింది
నా దాహార్తిని తీర్చేందుకు గొంతులోకి చేరింది
నాలో జీర్ణమై అణువణునా ఇంకిపోయింది
నాతో చిరకాలం కలిసుండాలనే
చిరు వాంఛను గెలిచింది
చినుకు అంటే చుక్కలాంటి నేనని
చుక్కలాంటి నేను అంటే చినుకని
వేరు వేరు కాము మేమని
నా కడ కట్టె కాలే వరుకూ కలసి ఉంటామని
చెలిమికి చక్కని భాష్యం చెప్పింది
చిత్రంగా విచిత్రంగా
చిన్న నాటి తీపి జ్ఞాపకాల సాక్షిగా...
*23.7.2012
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)