పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
praveena kolli లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
praveena kolli లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, ఏప్రిల్ 2014, గురువారం

Praveena Kolli కవిత

తోడు /ప్రవీణ నువ్వూ నేనూ రెండు విరుద్ద భావాలను వ్యక్తీకరిస్తున్నాం అనుకుంటున్నాం తరచి తరచి చూస్తే వాటి మూలం ఒకటే నేస్తం! నువ్వన్నావు, కష్టాన్ని పంచుకునే తోడొకటి లేకపోవటమే పెద్ద లోటని నేనన్నాను, సంతోషాన్ని పంచుకోలేని తోడు ఒక తోడే కాదని హుటాహుటిన పెద్ద పెద్ద గ్రంధాలను మోసుకోచ్చావ్ నీ చూపుడు వేలితో ఆ నీతుల వెంట పరుగులు పెడుతూ కన్నీటిని తుడిచే చెయ్యే ముఖ్యమన్నావ్ అయ్యో నా ప్రియ నేస్తమా, నీకెలా చెప్పనూ? అ ముని వేళ్ల నుంచీ ధారలుగా కారుతున్న జాలిని దాటుకుని నాలుగడుగులు ముందుకెళ్ళి ఓ సారి వెనక్కి తిరిగి చూడు చప్పట్ల మోతలు కాదని అవి మెటికల శబ్దాలని తెలుసుకుని నివ్వెర పోతావ్! అందుకే అంటాను, సంతోషాన్ని పంచుకునే సాహచర్యమే అసలైన తోడని

by Praveena Kolli



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1psbM5l

Posted by Katta

22, అక్టోబర్ 2012, సోమవారం

ప్రవీణ కొల్లి ||స్థితి ||

ఆనందమూ కాదు, విషాదమూ కాదు
అదో స్థితి
మాటలన్నీ మూటకట్టుకుని పారిపోతే

ఎద మొత్తం మౌనంలో ఒదిగిపోతే
ఆ నిశ్శబ్దపు ఒడిలో ఏర్పడే స్థితి.....స్తబ్దత!
శూన్యత కాదు స్తబ్దత!

ఈ స్తబ్దతలో
శ్వాసే ప్రశ్నలను సంధిస్తుంది..
సమాధానాల అన్వేషణలో
మనసును తవ్వి
పొరలను చీల్చుతూ
హృదయాంతరాలకు చేరాక
అక్కడ
ఎన్నాళ్ళుగానో నిక్షిప్తమైన మణులు
వెలికి వచ్చి నిలదీస్తాయి !
ఆ మాణిక్యాలలో ఏమి వుండదు ....ఒక్క స్వచ్ఛత తప్ప!

ఒక్కోసారి
ఈ ఏకాంతపు నదిలో ఈదటం
ఈ ఒంటరితనపు వారధిలో నడవటం
అత్యవసరం...
18. Oct. 2012

29, సెప్టెంబర్ 2012, శనివారం

ప్రవీణ కొల్లి || అసంపూర్ణం


ఒక్కో రాత్రి, ఒక్కో పగలు
ఎక్కడి నుంచీ మోసుకొస్తాయో
ఇంతేసి దిగులును?
నేల ఈదుతున్నట్టు, ఆకాశం చాలనట్టు
పుట్టుకొచ్చే ఈ ఆలోచనలు!
కడవల కొద్దీ తోడినా
ఊట బావిలో ఊరుటుందే ఈ జ్ఞాపకాలు!
ఇంత భారాన్ని మోస్తున్న మనసెంత బలసాలో కదూ...

నల్ల మబ్బుల నీటి భారం
వానై వరదై ముంచెత్తితే మటుమాయం...ఎంతదృష్టం!
కనురెప్పల కన్నీటి భారం
చినుకై కురిసి కురిసి
కడలిలోనే మరి భద్రం....ఎంతవిశాదం!

ఒక్కో వేదన, ఒక్కో ఆవేదన
ఎంతకీ చిధ్రమవ్వవు చిత్రంగా!
గాయాల తీపు తగ్గిందని బ్రమించినా
గురుతుల సలపరాలు జీవించే ఉంటాయి వింతగా!

గతించిన గేయపు స్వరాన్ని
కరిగిపోయిన కాలపు పెదవులు
ఆజన్మాంతం అవిశ్రాంతంగా ఆలపిస్తూనే ఉంటాయి...
జనించిన స్మృతి రాగం
కాలం మిగిల్చిన వినికిడిలో
కూనిరాగమై ఆలకిస్తూనే వుంటుంది...

ఒక్కో ఘటన, ఒక్కో సంఘటన
ఎప్పటికీ అంతు చిక్కని
వైకుంఠ పాళి పాచికలే!
నిచ్చెన అనుభవాల కన్నా
పరిశీలన పాముకాట్లు ఎక్కువ బాధిస్తుంటాయి,,,,

ఒక్కో అక్షరం, ఒక్కో భావన
ఎప్పటికీ అసంపూర్ణమే!
పోగు మిగిలిపోయిన నేత అల్లికలా...

24 -SEP -12

24, సెప్టెంబర్ 2012, సోమవారం

ప్రవీణ || ఓ నలిగిన జ్ఞాపకం

జ్ఞాపకాల దొంతరలో నుంచి
అప్రయత్నంగా జారి పడింది
ఓ నలిగిన కాగితం….

వీలైనంత చదును చేసి చదవబోతే
కన్నీళ్ళ కొలనులైన కళ్ళు
మసగబారిపోయాయి…..

ఒక చేత్తో కళ్ళు నలుపుకుంటూ
మరో చేతి చూపుడు వేలుతో
అలుక్కుపోయిన అక్షరాలు విడదీస్తుంటే
చెమ్మగిల్లిన కాగితం
మరి కాస్త చిరిగి
మనసుని చిత్తడి చేసింది…

22 -Sep -12

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

ప్రవీణ // పై పై బతుకు //


ఇప్పుడంతా
పై పై బతికేయ్యటం అలవాటు చేసేసుకున్నాం
ఏ క్షణానన్నా పొరపాటున అంతరాలలోకి జారిపడితే
ఆత్మవిమర్శలు చుట్టుముడితే
అస్తిత్వం ప్రశ్నిస్తే
మిగిలేదంతా అంధకారమే!

ఇప్పుడంతా
పై పై బతుకులకు సౌఖర్యాల మేకప్పులేసేసాం
మస్కారా కరిగితే, ఐలైనర్ చెదిరితే
కాంతి క్షిణించిన కళ్ళలో జీవాన్ని భూతద్దంలో వెతుక్కోవాల్సిందే!
లిప్ గ్లాస్ అద్దిన నవ్వులు లిప్ స్టిక్ చెదరనంత వరకే!
ఆ సింగారం కరిగి వికారం బయటపడే దాకా అంతా సౌందర్యమే!

ఇప్పుడంతా
పై పై బతుకున పైపై పొరలలో అల్లుకున్న బంధాలే
లోతుల్లోకి తొంగి చూసే తిరికేది?
పలకరింపు సమాధానాలన్నీ కుశలాలే!
ఆత్మను తాకే స్పర్శ
మనసును హత్తుకునే కౌగిలి
కష్టం పంచుకునే హృదయం మృగ్యమే!

ఇప్పుడంతా
పై పై బతుకు నడకల్లో భూమిని తాకని పాదాలే
గాలిని మించిన వేగంతో
భావనాలెక్కి, అంతస్తులు పెంచి
రోధసిలో తిరిగి తిరిగి అలిసాక
వాకిలిలో చేరి రోదిస్తూ విశ్రమించటమే!

ఇప్పుడంతా
పై పై బతుకు చేతల్లో మీటలు నొక్కే యాంత్రికతే
తినే తిండి, పిల్చే గాలీ లెక్కే
జీతాన్ని, జీవితాన్ని కంప్యూటర్ పెట్టెలో లాక్ చేసేసి
జీవాన్ని, ప్రాణాన్ని క్లికుల్లో లెక్కించేస్తున్నాం !
స్నేహం, బంధం, బంధుత్వాలన్ని కొనలకు వేలాడుతున్న ఆర్ధికతత్వాలే!

ఇప్పుడూ కూడా అప్పుడప్పుడూ
గుండెలోకి జారే అశ్రువు గర్భంలోకి చేరి
ఇలా..రహస్యాలను విప్పుతూనే ఉంటుంది!
అయినా...ఈ అశ్రువు జీవితకాలమెంతని?
ఎగిసే నిప్పుల సెగలో అవిరయ్యేంత వరకే కదూ?

9.3.2012

31, ఆగస్టు 2012, శుక్రవారం

ఆమె - 2 // ప్రవీణ కొల్లి //


ఊరికే జలపాతం ఆ కొలువులో
పారే సెలయేరు తన లోగిలిలో
సూరీడుతో సావాసం
కాలంతో సహవాసం
పరుగు పరుగుల ఆరాటం
అలుపెరగని అస్తిత్వపు ఆశయం ఆమెది ...

కంటతడిని గుండె అడుగున
గుండె వ్యధను మునిపంటి అంచున దాచేసి,
కన్నుల్లో స్తైర్యం
చేతల్లో విశ్వాసం
చెరగని చిరునవ్వు శక్తిగా
అహంకారానికి ఎదురు నిలిచి
మగువగా తనను తాను ఎక్కుపెట్టి
ఉద్యోగం, వ్యాపారం అది ఇది అన్నింటా
ఎదిగి ఎదిగి ఒదిగి ఒదిగిన నిరంతర శ్రామికరాలు ఆమె....

సాయం మాత్రమే నాది
బాధ్యత నీదే సుమా!
ఇదిగిదిగో తరతరాల ఇల్లాలి నియమాలు
సౌక్యపు పరిధి దాటితే
ఎత్తి పొడుపులు గునపాలు
మేడిపండు తెలియకనా?
ద్వందవైకరి మారునా?
ఆత్మీయత భాద్యతల నడుమ నలిగిన హృదయపు నిబ్బరం ఆ దొరసానిది..

ఆమెదంతా
బయట ఎదిగే పోరాటం
ఇంట ఒదిగే ఆరాటం
వెరసి, సరితూకపు తూనిక ఆమె.....

30/8/2012

26, ఆగస్టు 2012, ఆదివారం

ప్రవీణ కొల్లి || కవిత్వమంటే?..ఏమో... ||


విషాదం నిద్రిస్తున్నప్పుడు
అక్షరాలు మేల్కొంటాయి
పదాలలో ఒదిగిపోయి

వాక్యలు ఒకదాని వెనుక మరొకటి పరుగులు పెడతాయి
ఈ భావాల వెల్లువను కవిత్వమనోచ్చా?
ఏమో...నాకైతే తెలిదు!
I call it as flow of emotions

సంతోషం ఉరకలేస్తున్నప్పుడు
ఎగిరెగిరిపడే మనుసును
కూసిన్ని అక్షరాలతో అభిషేకిస్తాను
కొండంత తృప్తి పధిల పరుచుకోవటానికి.
అలా..అల్లిబిల్లిగా అల్లేసిన పదాలను కవిత్వమనోచ్చా?
ఏమో...నాకైతే తెలిదు!
I call it as flow of expressions

నా అనుభవాలు
నేను చూసిన సంఘటనలు
నా ఆలోచనలు
నేను గమనించిన విషయాలు
అది ఇది అని కాదు
తోచింది రాసేస్తాను.
రాసిందంతా కవిత్వమనోచ్చా?
I don't dare to say...I call it as flow of thoughts

కలం నా నేస్తం
ఎందుకంటే...నిజాయితీ సిరా కాబట్టి
కలం నా విమర్శ
ఎందుకంటే...అంతరాత్మ ఊపిరి కాబట్టి
కలం నా ప్రోత్సహం
ఎందుకంటే......?
చివరి అక్షరం లిఖించక, వెనుతిరిగి చూసుకుంటే "ఇదంతా నేనే!" అనే సంబరం!

ఓ మెప్పు సంతోషాన్నిస్తుంది
ఓ విమర్శ ఆలోచనను రేకెత్తిస్తుంది
అలాగని...
మెప్పులకు బానిసను కాదు
విమర్శలకు భయపడీపోను

నచ్చితే హత్తుకుంటా
నచ్చకపోతే పక్కకుపోతా
ముసుగేస్తే అక్షరాలు తిరగబడతాయి....

బాషపై పట్టు లేదు
పదాలు తడుముకుంటాను!
భావం నా సొత్తు
వ్యక్తీకరణ నా హక్కు!

భావుకత్వం నేర్చుకుంటే వచ్చేదా?
కేవలం ఆస్వాదించాల్సిందే!

(I don't dare to call it as poem, it's just Flow of thoughts.)

24, ఆగస్టు 2012, శుక్రవారం

ప్రవీణ కొల్లి || పుటలు ||

ఈ పుస్తకంలో
నిర్ణీత కాలం గడిచాక
పక్కకు తిరిగిపోయే ఎన్నో ఎన్నో పుటలు
నిన్నటి పేజీలో మరి రాయలేను
రేపటి పుటలో ఏమి రాస్తానో తెలీదు.
నేను, తెల్లకాగితం నేడు నా ముందున్నాయి...

అమ్మ కౌగిలి, కాగితం పడవ
నెమళీక, ప్రేమలేఖ
భద్రంగా దాచేసుకున్నా గడిచిపోయిన పుటలలో ...
ఎదురుదెబ్బ, నిట్టూర్పుల సెగ, గుణపాఠాల పోటు
కన్నీటి దారలలో అలకబడిన అక్షరాలు అక్కడక్కడా....

తరచి తరచి చూస్తే
ప్రతి పుటలలోనూ
మునుపెన్నడూ ఎరగని నేనే!
మరల మరల ఆలోచిస్తే
నన్ను నేను వెతుక్కునే ప్రయత్నమే
అన్ని పుటలలోనూ ....

నిన్నటి అనుభవం అక్కడే
నేటి భావం ఇక్కడే
అనుభవం పాఠాలు నేర్పుతుందా?
ఏమో?!
అవును కాదుల నడుమ ఊగిసలాడుతూనే వుంటుంది
పిచ్చి మనసు.

అనుభవాల సారమే సిరా అనలేను
లిఖించేదే వేదమూ కాదు!
అభిప్రాయాలు మారుతూనే ఉంటాయి
ఆలోచనలు ఎగిసిపడుతూనే ఉంటాయి
ప్రశ్నలు నిలదిస్తూనే ఉంటాయి
ఒక అధ్యాయంలో సమాధానం దొరికినట్టే దొరికి
మరో అధ్యాయం చివరలో
అదే సమాధానం మళ్లీ ప్రశ్నవుతుంది....

ఎన్ని అధ్యాయాలు రాస్తానో తెలిదు
ఎన్ని పేజీలు నింపుతానో అసలే తెలీదు
మార్జిన్లో రఫ్ వర్క్ చేస్తూనే ఉంటాను
అక్కడే కదా జీవితసత్యాలు తెలుసోచ్చేది!

అణుక్షణం ఆత్ర్రం
ప్రతి పుటను ప్రేమగా తీర్చిదిద్దాలని.
నేటితో 365 పేజీలు నిండాయి
అవును...రేపు నా మరో పుట్టిన రోజు.

23-08-2012

22, ఆగస్టు 2012, బుధవారం

ప్రవీణ కొల్లి॥ఇంటికెళ్ళి వచ్చాక...॥


రాత్రంతా వర్షం కురిసి
ఇప్పుడే వెలిసినట్టుంది
తడిసిన గుమ్మం
చెమ్మగిల్లిన వాకిలి స్వాగతం పలికాయి.
సన్నజాజి తీగ, మల్లె మొగ్గ, చిరుగాలి స్పర్శ
ఆ ఆవరణంతా ప్రేమమయమే!
"బాగున్నావా తల్లి?", "అలా చిక్కిపోయావే?"
ఆర్ధ్రత నిండిన పలకరింపుల అమృతాలే!

నాన్న పడక్కుర్చీ
అమ్మ గాజుల మోత
వంటింట్లో తాలింపు వాసన
వరండాలో బంధువుల సందడి
అబ్బ...ఎప్పటికీ ఇవి ఇలాగే
నేను ఇక్కడే ఉండగలిగితే ఎంత బాగుండు!

కలవాలనుకున్నా కలవలేకపోయిన స్నేహితులు
ఎవరి జీవితాలలో వారు బిజీ అని సాక్ష్యం చెపుతూ
మరో సంవత్సరానికి వాయిదా పడ్డాయి!
కొత్తగా కలిసిన నేస్తాలు ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని నింపాయి.

చాన్నాళ్ళకు కలిసిన తోబుట్టువులతో
కబుర్లు తీరనే తీరలేదు!

బాల్యం, కౌమారం, యవ్వనం
ఇవన్ని హడావుడిగా వెళ్లి పోతాఎందుకో?

గమ్యాలు వెతుక్కుంటూ సాగుతున్న ప్రయాణంలో
ఆటవిడుపుగా వెనక్కి వెళ్ళితే
మరి తిరిగి రావాలనిపించదు!

జ్ఞాపకాల అరలలో
స్మృతుల దొంతరలు పేర్చుకుంటున్నా
కాలం కరిగిపోతుందన్న బెంగ తీరక మునుపే
మబ్బులు ముసిరిన ఆకాశం
వర్షించటం మొదలుపెట్టింది
వీడ్కోలిస్తూ.....
*21.8.2012

17, జులై 2012, మంగళవారం

ప్రవీణ కొల్లి || వలయం ||

ఏదో ద్రవంలో తేలియాడుతున్నాను
చేతి వేళ్ళు కదలాడుతున్నాయి
కాళ్ళ కదలికలు మొదలయ్యాయి
కనురెప్పలు విడిపడుతున్నాయి
కనులు మూసినా తెరిసినా, అదే చీకటి!

ఏదో ప్రవాహపు హోరు ఆలకిస్తూ
బొడ్డుతాడు చుట్టూ తిరిగేస్తూ
నాకు మాత్రమే సరిపోయే చోట
నేను మాత్రమే ఉన్నాను!

అమ్మ గర్భమంట
ఎంత భద్రంగా ఉందీ చోటు!
అమ్మ..అమ్మ...ఎలా ఉంటుందో?
గొంతు లీలగా వినిపిస్తోంది

అయ్యో... అయ్యో....
నన్నెవరో తోసేస్తున్నారు
ఈ పొర చిలిపోతోంది
ఈ ద్వారం ఇరుకుగా ఉంది
కండరాలు నొక్కేస్తున్నాయి
నలిగిపోతున్నాను
జారిపోతున్నాను
వేధన..వేధన....ప్రసవ వేధన
ఎవరివో చేతులు
నా తలను పదునుగా పట్టి
నా శరీరాన్ని బలంగా బయటకు లాగేసాయి

ఊపిరి..ఊపిరి...ఊపిరి కావాలి
కేర్ మనే ఏడుపుతో
ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసల లయ ఆరంబమయింది!
అబ్బా..ఈ వెలుగు బరించలేకపోతున్నా
కళ్ళు చిట్లించి చిట్లించి చూస్తున్నా
ఓ వెచ్చటి స్పర్శ ఆహ్వానించింది
తన చనుబాలు నాకు అందిస్తూ
అమ్మ..అమ్మ....అమ్మ
ఆకలి మొదలయింది!

నా లేత చెక్కిళ్ళు ముద్దాడుతూ అమ్మ
నన్ను మురిపెంగా చూస్తూ నాన్న
ఆకలేస్తే ఏడుపు
కాదంటే మారాం
అందమైన లోకం
అమాయకపు సర్వస్వం
నడకలు నేర్చాను
పలుకులు పలికాను

అంతలోనే
ఎవరో నన్ను గెంటేస్తున్నారు
పద పదమని తొందర చేస్తున్నారు
ఆగండి...ఆగండాగండి
ఈ స్వేఛ్చ నా హక్కు
ఈ స్వచ్ఛత నా స్వభావం
నా నుంచి నన్ను దూరం చెయ్యకండి, వేడుకుంటున్నా
"ఎలా బతుకుతావేమిటి?"
చురకత్తులు విసిరారు
ప్రయత్నంగానో అప్రయత్నంగానో
ఓ కత్తి చేజిక్కించుకున్నా
పరుగులు సమరాలయ్యాయి
యుద్ధం నిత్యకార్యమయింది....

నాటి కన్నుల్లో మెరుపు
నేడు లౌక్యాన్ని నేర్చింది
నాటి మోములోని అమాయకత్వం
నేడు గడుసుతనాన్ని ఆపాదించుకుంది
స్వయంరక్షనంటూ
కట్టి కూల్చేస్తున్నా
కూల్చేసి కట్టేస్తున్నా!
అడుగుల వేగం పెరిగి పెరిగి
సంధ్యవేళ నెమ్మదించింది...

పట్టుతప్పుతున్న దేహం
అదుపుతప్పుతున్న అలసట
ముడతలు పడిన మోము
బతుకు సమరం కొలిక్కి వచ్చిందో? నెమ్మదించిందో?

ఎవరో ఎవరో..ఎక్కడ నుంచి వచ్చారో !
నన్ను బలంగా ఈడ్చుకుపోతున్నారు
"రాను రాను...నేను రాను..నన్ను వదిలేయ్", గింజుకుంటున్నా
"నీ సమయం ముగిసింది", వాణి వినిపించింది
"నన్ను నా సామ్రాజ్యం నుంచి విడదీయటానికి నువ్వెవరు?", నిలదిసా
"నేనేవరా?నన్ను గుర్తించలా?.........
నేను కాలాన్ని....."

చేతి వేళ్ళు అతుక్కుపోతున్నాయి
కాళ్ళ కదలికలు బిగుసుకుపోతున్నాయి
కనురెప్పలు మూతబడుతున్నాయి
చుట్టూ చీకటి
ఆయువు బొడ్డు తెగిపోయి
ప్రాణం అనంతంలో కలిసిపోయింది...
http://alochanalu.wordpress.com/2012/07/16/%E0%B0%B5%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82/ 
*16-07-2012

15, జులై 2012, ఆదివారం

ప్రవీణ కొల్లి || విరామం ||

మనసు అలసట మదికి తెలుస్తూనే ఉంది
తనువు బడలిక భారమై ఎదను వేడుకుంటోంది
కాస్తంత విరామం ఇవ్వమని...

కాలం పరుగెడుతూనే ఉంది నా పనిలా
కాసేపు...కాసేపంటే కాసేపే
ఈ పనిని పక్కన పెట్టి
ఈ రోజును నా కోసమై జన్మించనీ
కొన్ని క్షణాలను దోసిట్లో నింపుకుని
నన్ను నేను అభిషేకించుకోనీ....

నిద్ర లేమి లేని కనులతో
సూరీడి గోరు వెచ్చటి దుప్పటిని తొలిగించి
నీలాకాశపు కాన్వాసుపై
ఎర్రటి రంగును చిత్రిస్తున్న
ప్రకృతి చిత్రకారుడితో కబుర్లు చెపుతూ
ఈ ప్రభాతాన్ని ఆస్వాదిస్తుంటే
ప్రాణవాయువును కొత్తగా శ్వాసిస్తున్నట్టుంది ....

పువ్వుల పరిమళాలను మోసుకొచ్చిన ఆ చిరుగాలి
మనసు మూలాల్లోకి జొరబడి
సరసాలాడుతూ విసుర్లు విసిరింది
ప్రపంచాన్ని పల్లెటూరన్నావు
మనసులు ఇరుకు సంధులు చేసావు
ప్రకృతికి మేకప్పులేస్తున్నావు
సరి సరి..ఒప్పుకున్నా
ఈ నిట్టూర్పుల సెగలింక ఈపూటకు పక్కన పెట్టనీ
నీ సరసన నన్ను సేదతీరనీ
వేడుకోలును వయ్యారంగా ఆలకించిన
చిలిపి గాలి నా ముంగురులను ముద్దాడింది
పులకరించిన తనువు అలసటను మరిచింది...

తెగని ఆలోచనల దారానికి
ఎగురుతున్న గాలిపటం
గడియారం ముల్లుల మధ్య చిక్కుకుపోయింది
ఈ నిశ్శబ్దంలో నా శబ్దం ఆలకిస్తూ ఆ స్తబ్దతను ఆస్వాదిస్తుంటే
మరోమారు జన్మిస్తున్నట్టుంది...

నీలాకాశపు పందిరి కింద
చంద్రవంకను వంగి ముద్దాడి ఎన్నాళ్ళయింది!
లెక్క తేలని నక్షత్రాలలో తప్పిపోయినట్టున్నా
ఈ రాత్రి
కొబ్బరాకుల నడుమ నుంచి
నిద్రను వెతుక్కుంటూ
జాబిలమ్మ ఒడిలోకి చేరి
వెన్నెలను కౌగలించుకుని
మబ్బుల లాలిపాటలో ఓలలాడా...

నిన్నటి రోజున జనించిన
ఆ రాగం
నా గుండె గదిలో ధ్వనిస్తూనే ఉంటుంది
ఆ పుటలు
మనసు పొరలలో రెపరెపలాడుతూనే వుంటాయి
మరో రోజూ అలసటతో విశ్రమించే వరకు....

ఈ విరామం కొత్త ప్రాణాన్ని నాలో నింపింది...

*14-07-2012

13, జులై 2012, శుక్రవారం

ప్రవీణ కొల్లి || సమాజం ||

సమాజమంటోంది
నేనో సాగర ప్రవాహమని!
నేనన్నాను
నువ్వో దాహం తీర్చని ఉప్పటి ద్రవమని!


నేననుకున్నాను
ఓ పదునైన పాళీ తయారు చేసుకుని
సముద్రాన్ని కలంలో సిరాగా నింపి
కసితీరా రాసెయ్యాలని….


సమాజం నోటితో నవ్వి,
నొసటితో వెక్కిరించింది.
“ఏంటని?” అడిగా
“ఏం రాస్తావేంటి?”, వ్యంగ్యం వుట్టిపడింది
“నీ గురించే రాస్తా…నీలోని మనుషుల గురించే రాస్తా”
పాళీ పదును పెడుతూ చెప్పా!
“మనుషులు నాలోని లవణాలు కాదా?”, హృద్యంగా నిలదీసింది!


హు....ఏ దప్పిక గురించి రాయను?
పదును తేలిన పాళీ గుచ్చుకుంది
చూపుడువేలు స్రవిస్తోంది
చట్రంలో చితికిపోయిన ఎందరో బతుకుల సాక్షిగా
తెల్లకాగితం రంగు మారింది….


( * August 12, 2011 రాసిన కవిత. హనుమంత రావు గారి, సమాజపు పెడ పోకడల మీద కవిత్వం రావాలి అనే పోస్ట్ చూసాకా, ఈ కవిత పోస్ట్ చేస్తున్నాను.)

9, జులై 2012, సోమవారం

ప్రవీణ కొల్లి॥నిశ్శబ్దం॥


నా చుట్టూ నిశ్శబ్దపు రాజ్యం
రాణిని నేనే, దాసిని నేనే!
ఆలోచనల అలల్లో తీరం చేరితే
సామ్రాజ్యమంటాను!
ఆశల వలలో చిక్కుకుపోతే
నడిసముద్రమంటాను!

నుదుటి స్వేదం
గుండెలపైకి జారి
నిశ్శబ్దాన్ని చిద్రం చేస్తుంది
అంతే వేగంగా
తటాకంలోని గులకరాయి
బుడుంగున మునిగిపోతుంది….

ఏ పలకరింపో
ఓ శబ్ద తరంగాన్ని అలా మోసుకొచ్చి
చుట్టపుచూపులా ఇలా తరలిపోతుంది….

దివారాత్రుళ్ళు లోలకానికి అతుక్కుపోయినట్టున్నాను!
అవును కాదుల నడుమ
ఊపిరి సలపనంత ఊగిసలాట…
గడియారపు టిక్కుటిక్కులే మిగిలిందిక

కనురెప్పల కదలికలలో సవ్వడేది?
కన్నీటి సుడులలో హోరు, మీరెవరన్నా విన్నారా?

నాకనిపిస్తోంది , నిశ్శబ్దమే శాశ్వతం……..కాదంటారా?
*9.7.2012

7, జులై 2012, శనివారం

ప్రవీణ కొల్లి - కవిత

అబ్సర్డ్ పైయింటింగ్

మనసు పొరలలో నిక్షిప్తమైన బావాలు
కుంచె కొసలకు వేళాడి వేళాడి
ఏ కలనో జారిపడి
అలుక్కుపోయిన రంగుల కలబోత

వృత్తాల గర్భాల్లో అనంతాలు
వంకరటింకర గీతల్లో భావోద్వేగాలు
మోహమో, వ్యామోహమో
ప్రేమమయమో, ద్వేషపూరితమో
జీవమో, జీవచ్చవమో
ఏమో
ఏవేవో అర్థాలు
అంతులేని అయోమయాలు

హృదయాంతరాలలో ప్రకంపనల అలజడి లేపి లేపి
ఆలోచనల అలలు ఎగిసెగిసిపడి
చిక్కు ముడులలో బిగిసి బిగిసి
పాళీ కొనలకు అటు ఇటు ఊగిసలాడి
స్తబ్దత నిశ్శబ్దము నీడలో
చిత్రించబడిన ఆకారం
ఆ మోములో
ఆనందమో విషాదమో ఎవరికెరుక?
వీక్షించిన ఒక్కోమారు ఒక్కో బావం...

ఆచిత్రంలో
అన్నీ ఆద్యంతాలకు పరుగులు తీస్తున్న గీతలే
నా ఆలోచనల్లా
అన్నీ దిక్కులను వెతుకుతున్న రేఖలే
నా ఆశల్లా
అన్నీ శూన్యంలో అంతమవుతున్న ఆకృతులే
మనిషి మరణంలా

మా గోడకు వేలాడుతున్న అబ్సర్డ్ పైంటింగ్
అచ్చు గుద్దినట్టు నాలా.........


*published on ???

ప్రవీణ కొల్లి- కవిత

నాలోని నా గుహ

నాకు నేనుగా
నా ఒడిలో నేను పాపగా
నా బడిలో నేను విద్యార్ధిగా
నాలో నేనుగా ఒదిగిపోయే నా స్థానం
అంతర్మధన సముద్రాన్నిఅంతరంగంలో ఇముడ్చుకున్న నా స్థలం
నాలోని నా గుహ…..నా అంతర్గుహ…

అటు ఇటు వీలుచూసుకుని
హటాత్తుగా తనలోకి లాగేసుకుంటుంది
ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు
సంఘర్షణల కొలిమిలో కాలిపోతునట్టు
గతమంతా ఓ ప్రశ్నగా నిలదీస్తున్నట్టు
సమాధానాల వెతుకులాటకు పొమ్మని
నిర్ధాక్ష్యణ్యంగా తనలో నుంచి నన్ను నెట్టివేస్తుంది

విజయాల చప్పట్ల మోత ఆగాక
ఆనందపు పరిసరాలు ఖాలీ అయ్యాక
తన కౌగిట్లో బంధించి
నుదుటన ముద్దిచ్చి
నా కష్టం తీరుస్తుంది

కన్నీటి పరామర్శలు అయ్యాక
సాధింపు ఎత్తిపొడుపులు వెళ్ళాక
తనలో నన్ను దాచుకుని
నా వెన్ను చరిచి
అనుభవాలసారంతో నా గొంతు తడుపుతుంది

ఆ గుహ ద్వారానికి
ఎన్నోసార్లు ఉరేసుకుని వేలాడాను
ఆ గుహ గర్భంలో
ఎన్నోసార్లు ప్రాణం పోసుకున్నాను
ఆ గుహ గోడలలో ప్రతిధ్వనించే శబ్దమే నాకు వేదం

అదే నాలోని నా గుహ…..నా అంతర్గుహ…
అంతర్మధన సముద్రాన్నిఅంతరంగంలో ఇముడ్చుకున్న నా గుహ…
* 3.7.2012