చదివిన కవిత్వ సంపుటి :- 19(కవి సంగమం) కవిత్వ సంపుటి పేరు :-"దృశ్య ప్రవాహం" కవి పేరు :-" సడ్లపల్లె చిదంబర రెడ్డి" పరిచయం :- రాజారామ్. టి ..... "నీవు కవివా?ఎవరి కవివి?? "నీ' కవివైతే మంచింది! నీ లోని గుబులువైతే మరీ మంచిది!!" --అంటూ "కవి" ఎవరి కవి కావాలో చెబుతూ నీ లోని దుఃఖమైతే చాలా మంచిదనే సత్యాన్ని వెలువరించినవాడు సడ్లపల్లి చితంబరరెడ్డి. “అది కొత్త కత్తిలా కుచ్చు కొంటుంది గుండెలో పచ్చి కారం పొడిలా కలతలు రాలుస్తుంది కళ్ళలో చేదు ఉమ్మెత్త ముళ్ళకాయలా ఇరుక్కొంటుంది గొంతులో నిజంగా నీ గుండె కోసి కాగితం పై పరిస్తే రాస్తుందది రసాక్షరాలు"--అంటూ గూటిలోని దుఃఖం మాత్రమే రసాక్షరాల వాక్యాలు రాస్తుందని వొక నిజాన్ని మన ముందు పరిచిన వాడు సడ్లపల్లె చితంబర రెడ్డి. “నీటిని పోగొట్టుకొన్న చేపలా పొర చిట్లి గుడ్డు నుండి జారిన పచ్చసొనలా చావు పీఠానికి బలి ఇచ్చుకొని ఆరిపోతున్న మేక తల కంటి చూపులా... ఆగిపోయిన జీవితాల్ని కాలిపోయిన కలల తోటల్ని తెగిన నరనరం మీటే విషాదల అలజడుల్ని"-డప్పుల మోతల శబ్దాల కవిత్వం చేయడం కవి ధర్మంగా అనుకుంటున్నవాడు సడ్లపల్లె చితంబరరెడ్డి. తాను తానుగా నిలిచి అక్షరాలు కొలిచే కవై కదిలే పదచిత్రాలను దర్శింప చేయలనుకున్న కవి ఈ సడ్లపల్లె చితంబరరెడ్డి. కవిత్వం రాస్తే ఏంటి లాభం?కవిత్వం రాస్తున్న వాల్లకేమి లాభం?అనే ప్రశ్న కొందరు ఏ మొహమాటం లేకుండా వేస్తుంటారు.అలాంటి వాళ్ళతో నేనంటూవుంటాను "మీరు అనుకుండే "లాభం' వేరు కవులకు కలిగే లాభం వేరు "-అని "తెల్ల కాగితమే కదా!ఇష్టమొచ్చింది రాసి కాగితాన్ని ఖరాబు చేయటం కవిత్వం కాదు.అక్షరాన్ని కాగితం భరించేటట్లు రాయటం కవిత్వం"-అంటాడు వొకాయన.నల్ల కాగితం మీద తెల్లని అక్షరాలు రాయడం కవిత్వం.కవిత్వం రాయడం అందరు అనుకొన్నంత సులభం కాదు,ఎంతో ప్రయాసతో కూడుకొన్న అంశమని కొందరికే తెలుస్తుంది. లోపల ఎక్కడో కడుపులోనో,హృదయలోనో,అస్థిపంజరంలోనో,కళ్ళలోనో దాగి దాగీ మరిగి మరిగీ సలపరించిన అక్షరం మాగిన పండు చెట్టు మీద నుంచి రాలిపడ్డట్టూ కాగితం మీద పడుతుంటే ఎంత మథనం.ఇంత మథనం "సడ్లపల్లి" పడ్డాడు కాబట్టే అతని"దృశ్యప్రవాహం" మన హృదయాల్ని తాకి మనల్ని తలో కలుపుకొని తనతో చివరి వరకు తీసుకెళుతుంది. ఇప్పుడు ఒక్క కవి జీవితం లోంచే కవిత్వం రావడం లేదు.ఇతరుల జీవితాల్లోంచి,వాళ్ళ ప్రేమల్లోంచి,విషయాల్లోంచి,అవమానాల్లోంచి,అనుమానాల్లోంచి,ముఖ్యంగా రోజు వారి జరుగుతున్న కుటుంబఘర్షణల్లోంచి కవిత్వం వొస్తున్నది.కవి తాను పొందిన అనుభూతిని తను ఎంతపొందాడన్నది కాదు అతని కవిత్వానికి గీటురాయి.ఆ అనుభూతిని ఎంతగా పాఠకుల పొందారన్నది ఆ కవి కవిత్వానికీ గీటురాయి అవుతుంది.ఈ లక్షణాన్ని"దృశ్యప్రవాహం" సంతరించు కొన్న వొక మంచి కావ్యంగా కవిత్వ ప్రియులకు అనిపించకమానదు. ఒక వాస్తవాన్ని తెలుసుకోవడానికి శ్రమించాల్సిన అవసరం లేదు కానీ ఆ వాస్తవాన్ని తట్టుకోవాడానికే శ్రమించాల్సివుంటుంది.ఈ కవికి జీవితవాస్తవాలు అవగతం అయింతరువాత,అవగతం అయిన ఆ వాస్తవాల్ని తట్టుకోవడానికీ ఎంతో మథనపడ్డాడు.ఆ మథనం లోంచి ఉబికుబికీ వచ్చిందే ఈ "దృశ్యప్రవాహం". దుర్బల ఆరోగ్యం-దుర్భర దారిద్ర్యం అనే రెండు బండరాళ్ళ మధ్య చొచ్చుకొచ్చి అస్థిత్వాన్ని పొందిన మొక్క ఈ కవి జీవితం. రెండు ఇసురు రాళ్ళ మధ్య నలిగినలిగి ముక్కలు ముక్కలైన జీవిత శకలాల సమూహం ఈకవి జీవితం.ఆ జీవితాన్ని ఒరుసుకొని పారిన జీవిత దృశ్యప్రవాహం ఈ కవిత్వ సంపుటి.అందుకే ఇంత తీవ్రంగా ఇంత ఆగ్రహంగా ఇంత అనుభూతి సాంద్రంగా సాగుతుంది ఇది. "ఆత్మ సహజంగా జ్వలనశీలమయితే చంచలజ్వాల సైతం వెలుగులు విరజిమ్మవచ్చు-అంటాడు "జార్జిసాంట్ ఆనీ"అనే విమర్శకుడు.జీవన్మరణ సమస్యతో నిరంతరంఘర్షిస్తూ ..తన ఆత్మను సహజంగా జ్వలనం చేసుకొంటూ తానొక చంచలజ్వాలై భావుకతతో చితంబరరెడ్డి మండుతున్న భావాల వెలుగుల్ని ఈ సంపుటిలో విరజిమ్మాడు. మానవ,మానవేతర ప్రాకృతికాంశాల సర్వ వ్యాపకాలకు చెందిన అనుభూతుల్నీ,జనసమూహాల బాధలకూ,గాథల అనుభూతులకు ఈ సంపుటి వొక అద్దంగా రూపొందింది.మనుషుల్లోని మంచి చెడ్డల్నీ,సమాజంలోని అంతరాల దొంతరల్ని బట్టబయలు చేయటమేగాక"విజయానికి చిగురు తోరణం కట్టి''తొలిపాఠం' నేర్పుతుంది ఈ దృశ్యప్రవాహం.విద్య,పర్యావరణ రంగాలలోని విషయాలను ,జనుల అగచాట్లను,వైయుక్తిక అనుభవాల్నీ అందమైన పద,భావ చిత్రాలతో సరికొత్త దృక్కోణంతో వచన కవిత్వం చేశాడు సడ్లపల్లి.ఎన్నో కవితలు హృదయపులోతుల్లోకి వెళ్ళి బాధించి బోధించిన అంశాలను ప్రస్తావిస్తాను. "దారి పొడుగునా ఆశల గింజల్ని విత్తి స్వప్న చిత్రాలు తిరగేస్తూ ఒంటరిగా గడియారాన్ని వెంబడిస్తున్నప్పుడు నేను ఊహల శిఖరాలు కొలుస్తాను అప్పుడు నీవు గుర్తోస్తే... మనసు విప్పారిన పూవవుతుంది నిన్ను ఆకృతీకరించాలని కలల నేత కుంచెను తీస్తే అది రక్తాన్ని ఉమ్మింది"-అంటున్న ఈకవి నగరాల్లోని కొన్ని చోట్ల,అడవుల్లో పేలుతున్న మందు పాతరలను ఙ్ఞాపాకానికి తెచ్చి పచ్చి నెత్తురు మరకల్ని చుసి తన గుండె కూడా మందు పాతరై పేలిందని దుఃఖిస్తాడు."మనిషి మనిషి నిశిలో పేరుకొన్న కసి మాంసం ముద్దై కత్తుల కుత్తుకలకు కైపై" ఎక్కుతున్నదని వాపోతు ఇవి "మంచు ముక్కైకరిగి,కన్నీటి వాగై పొంగి కువకువలాడే కపోతమయ్యే" దృశ్యాన్ని కవి కోరుకుంటాడు. మానవ జీవితం లోని వేగం,తీరికలేనితనం,ఇంట్లో కోరికల చిట్టా విప్పినప్పుడు జేబు నిండుకున్న వైనం ఇవన్ని తెలుసుకొనే శక్తి కళ్ళకు లేకుంటే ఎంత బాగుండేదోకదా!-అని అనిపిస్తుంది అని కవి "నాకు అనిపిస్తుంది..!!!"అనే కవితలోచిత్రిస్తూ,"పలకా బలపాల కన్నా జాగ్రత్తగా విధ్యార్థులు అన్నం తట్టలు తెచ్చినప్పుడు../కలల కథలు చెప్పినప్పుడు లేని ఆనందం ఉడకని పిడికెడు మెతుకులు చూడగా/వారి ముఖాల్లో పొంగే వులుగులు చుసినప్పుడు.."-అని అనటంలో భారత దేశంలో రేపటిపౌరులు ఎలాంటి స్థితిలో వున్నారో తెలియ చేస్తాడు.ఎంతో అధిక్షేపాన్ని ఆగ్రహంతో తెలియజేస్తాడు. "విజయానికి' అనే కవితలో కవి తన జీవితం విజయం వైపు ఎట్లా పరుగులు తీసిందో అవిష్కరించాడు.జీవితాన్ని యుద్ధంగా,జీవించాడాన్ని అశ్వంగా,ఎదురయ్యే సంఘటనల్ని దారిగా పోలుస్తూ"యుద్ధానికి దౌడు తీస్తూ గుర్రం అలసి పోతుందప్పుడప్పుడు.......ఆవేశాన్ని సకిలిస్తూ,సునామీల్నీ పుక్కిలిస్తూ కండ కండ నుండి కాళ్లకు శక్తిధారల్లాగి విజయానికి-వీర మార్గం వైపు మళ్ళి కుప్పళిస్తుంది"-అంటూ వొక జీవన వికాస పాఠాన్ని చెబుతాడు."కన్రెప్పలు వాల్చాలంటే /రాత్రికి క్కూడా భయం/రాజ్య వ్యవస్థలో/మారువేషాల శాసనాలని"-అంటూ"ఏడొ చేప" అనే కవితలో రాజ్య వ్యవస్థ నిరంకుశ అధికారా హుంకారాలను కవిత్వంగా మార్చాడు ఈ కవి. రెండు దశాబ్దాల కిందట కవిత్వం రాసిన కవులు ఉదారవాదం,ప్రయివేటికరణ,ప్రపంచీకరణ అనే వాటి ప్రభావానికి లోనయ్యారు.ఈ కవి కూడా వీటి ప్రభావానికి గురికాక తప్పలేదు.మానవ జీవితాల్లోకి ఎంత తీవ్రంగా ప్రవేశించిందో,అది చేసె కుట్రలకీ ఒక్కొక్క కుటుంబం సాంకేతిక వ్యాపార సంస్కృతి వల్లా ఎట్లా విచ్ఛిన్నం అయ్యిందో బహిర్గతం చేసె కవిత "అన్ని రూట్లు బిజీ!!' అనేది. "గిట్టుబాటు ధరకు ఎదురు చూస్తూ కల్లమ్లో పురుగుల ధాన్యం కొరికి పుచ్చిపోతూ రైతు కట్నం బాకి బాపతు కొతయినా జమ చేస్తే అల్లుని ముఖంలో నవ్వులూహిస్తూ కూతురు పట్నం కరెన్సీ పిల్లల్తో పోటి పడే అమాయకత్వంలో మోటార్ సైకిల్ చుట్టూ చక్కర్లాడుతూ కొడుకు..... కాషాయంబరం విభూదుల వెచ్చదనాల్చాలక వి.ఐ.పి స్వాములంతా కొంగు చాటు కోసం తచ్చాడుతూ... జన సంబంధాల చదువులన్నీ టెక్నాలజీ పాము నోట్లో జీర్ణమవుతూ.... అన్ని రూట్లు బిజీగా వున్నాయి"-ఇలా కవిత ప్రపంచీకరణ వల్ల సంభవించిన పరిణామాల్ని వ్యంగ్యంగా ఆవిష్కరిస్తుంది. ఏ విషయమైనా అనుభవంలోకి,అవగాహనలోకి,అనుభూతిలోకి రానంతవరకు నిమ్మళంగా వుండొచ్చు.నిర్మలంగా వుండొచ్చు.ఈ కవి తీవ్రంగా దీర్ఘ రోగానికి(క్రానికల్ డిసీజ్)చిన్నపటి నుండి గురై దాని అనుభవాన్ని పొందిన తరువాత దాన్ని గురించి అవగాహన చేసుకొన్నాకా,దాని అనుభూతిని అర్ఠం చేసుకొన్నాకా నిమ్మళంగా వుండలేక నిర్మలంగా వుండలేక "పచ్చని ప్రాణాన్ని చప్పరిస్తు/మరణద్వారం వైపు లాక్కేల్ళే మృగం రోగం/వైరి వర్గాన్నిక్కూడా కర్కశ కరాళ కర్కోటక పీడింపుల రూపం"-అని ఆ రోగం గురించి గొప్ప అనుభూతాత్మక చిత్రణ చేశాడు.ఆయన తన సంపుటిలో రాసుకొన్న "నే ప్రవహిస్తూ వచ్చిన...'అనే మాటల్ని చదివితే ఆశ్చర్యంతోపాటు మన కళ్ళు కూడా కన్నిటి దృశ్య ప్రవాహలవుతాయి."కళ్ళ ముందే కను గుడ్డును /కసాయి కత్తుల్తో లాగి /మొసలి నోరులా నముల్తూ /ఏదో చెప్పాలని ప్రయత్నించే కళేబరం చివరి కదలికగా మెదిలే నాలుకను కొరుక్కుతిని"-ఇలా మరణం చివరి అంచున నిలబడి కవి చేసిన గెలుపోటముల జీవన్మరణపోరాటాన్ని చదివితే కవి విషాదం, మొండిధైర్యం మనల్ని ఉద్విగ్నతకు గురిచేస్తాయి. మాటలకీ భావాలకీ వో కొత్త సోయగాన్ని తొడిగిన కవితా సందర్భాలెన్నో ఈ సంపుటిలో వున్నాయి.తెగి పోతున్న సంబంధాల గురించి కవి వొక చోట ఇలా అంటాడు."మంట సోకి పటాకీ సరాలు ఒక్కొక్కటి కాలి పేలి పోతున్నట్లు"-ఇలా ఊహకు అందని ఊహను కవి చేస్తాడు."ఏవో వలయాల తీగలు చుట్టుముట్టి/నింపాదిగా స్వారీ చేస్తూ నామీద/నా చేతుల్లో ఏమీ లేని నిబంధనల పుట్టుక/అస్థిత్వాన్ని పళ్ళ కింద బిగపట్టి/పందిరి దబ్బగా ఉండీ లేనట్లు నేను' లాంటి కవిత కవి అస్థిత్వ ఆలోచనను పందిళ్ళకోసం వేసె దబ్బతో ఉపమించడం కవి ప్రతిభను తెలుపుతుంది. "వలస పోతున్న ఎర్రెర్రని మట్టి /దిగులు పడుతున్న పల్లెల ఇళ్ళలో /తెగిపోతున్న వెల్తురు దీపాలు/కరువు లావా ప్రవాహంలో పడి /కాళ్ళూ చేతులాడక /మునిగిపోతున్న రైతులు,రైతు కూలీలు"-ఇలా కరువు నేలలోని స్థితిని ప్రముఖ కవి శివారెడ్డి మెచ్చేలా కవిత్వ చేశాడు సడ్లపల్లి.ఈ కావ్యమంతా ఎన్నో మంచి కవితలు "మనసులను చంపుకొని,దేహ దాహాలను పెంచుకొని,సంతలో సరుకులై కొల,తుల దూర ద్రవ్యాది మానాల ముక్కలై తక్కెడలో ' తూగుతుంటే.."మేల్కొల్పడానికి ప్రయత్నిస్తాయి. 'నిరాశల గళంలో ఆశల పల్లవి'ని ఇంకా చాలా కాలం ఆలపించమని ఈ కవిని కోరుతూ"జీవించాలనే ఆశ/కాలాన్ని ఎదురించే చేవ" తో ఈ కవి జీవించి నిరంతరం జ్వలించాలని కోరుకొంటున్నా.కవి సంగమ మిత్రుల్ని ఇలాంటి మంచి కవిత్వాలని చదివి మరింత మీరు జ్వలించాలని ఆశతో చెబుతూ మరో మంగళ వారం కలుద్దాం.
by Kavi Yakoobfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1evzMsW
Posted by
Katta