కవి స్వరం: స్వాతీ శ్రీపాద కవిత Posted by: Pratap Published: Monday, May 12, 2014, 9:00 [IST] ఒక సాంద్రమైన కవితను చదివిన అనుభూతిని స్వాతీ శ్రీపాద కలిగించారు. కవితలో ఏ వాక్యానికి ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడమా, కవితను మొత్తాన్ని చదివి ఏకంగా సారాన్ని గ్రహించడమా అనే అనుమానం ఈ కవిత చదివిత తర్వాత కలుగుతుంది. స్వాతీ శ్రీపాద కవితలో సాంద్రమైన జీవన తాత్వికత దర్శనమిస్తుంది. అయితే, కవితలో దిగులు ఛాయలు లేకపోవడం ఓ గొప్ప అనుభూతి. జీవితంలో ముందుకో వెనక్కో నడుస్తున్నట్లు అనుకుంటూ ఉంటాం. జీవితంలో వెనక్కీ నడవడానికి కొలమానాలు ఏమిటి, ముందుకు సాగడానికి ప్రమాణాలు ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. మొదటి స్టాంజా జీవన పయనం గురించి చెబుతుంది. అందులో అవగాహన లేని ప్రయాణం గురించి కవి మాట్లాడుతారు. బహుశా, అది జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం, వ్యవధి ఇవ్వని బాల్యమూ యవ్వనమూ కావచ్చు. రెండో స్టాంజాలో జీవితం నిస్తేజంగా కనిపించిందని, రంగూరుచీ లేదని కవయిత్రి చెబుతారు. అంతేకాదు, జీవితానికి అర్థమేమిటనే మీమాంస కూడా ప్రారంభమైంది. ఆ మీమాంసలో "లోలోపల నాకు నేనే ఒక ఆవిష్కరిచని ప్రపంచాన్నై" అని అంటారు. జీవితానికి అర్థమేమిటి, ఈ ప్రయాణానికి అర్థం ఏమిటి అంటే ఏమీ మిగలలేదనే భావన కలిగి ఉంటుంది. కవి స్వరం: స్వాతీ శ్రీపాద కవిత మొదటి స్టాంజాలో రెండో స్టాంజాలోకి ప్రయాణం చేయడానికి అనువైన కొన్ని వాక్యాలు ఉన్నాయి. పరవశానికి, ఆనందానికి, భావోద్వేగానికి సంబంధించిన ప్రతీకలను అందులో వాడుతూనే వాడిపోయిన కసరు క్షణాలు, కుప్పకూలిన భావాలను అంటూ అర్థసహితమని భావించే స్పందనలను చేర్చారు. ఆ తర్వాత అది రెండో స్టాంజాలో మరింత సాంద్రతను సంతరించుకుంది. అలా కవిత ఒక ప్రారంభం నుంచి ముగింపునకు వచ్చింది. అయితే, దాంతో అగిపోతే కవిత అసంబద్ధమైన, అర్థరహితమైన జీవన యానాన్ని చెప్పి ఉండేది. కానీ, మూడో స్టాంజా వచ్చేసరికి దాన్ని తాత్వీకరించారు స్వాతీ శ్రీపాద. ఉలిపిరి సిల్కు దారపు వంతెన మీదనే జీవనయానం సాగింది. చివరికి ప్రయాణం ఎక్కడికి దాకా చేశామంటే ఉన్న చోటే ఉన్నామనే గ్రహింపు వచ్చింది. "వెనక్కు నడచినా, ముందుకు కదిలినా/ దూరం ఒక్కటే అయినప్పుడు ఎలా నడిచి వెళ్లాలో/ చివరి అడుగు వరకు" అంటూ సంశయాన్ని ప్రకటించారు. కానీ, జీవిత పరమార్థాన్ని నిర్దిష్టంగా, నిర్దుష్టంగానే వెల్లడించారు. జీవితంలో ముందుకో, వెనక్కో కదులుతున్నామనేది భ్రమ మాత్రమే అని చెప్పారు. కదులుతున్నామని అనుకుంటాం గానీ ఉన్నచోటనే ఉంటామనే జీవిత తాత్వికను వెల్లడించారు. జీవితంలో అనుభవించేవి, అనుభవించామని అనుకునేవి - సంపాదించామని అనుకునేవి, కోల్పోయామని వేదన పడేవి అన్నీ భ్రమ, జీవితం మాత్రమే సత్యమని స్వాతీ శ్రీపాద చెప్పారనిపించింది. మొత్తం మీద, జీవన సారాన్ని ఉన్నదీ, లేదూ - లేదూ ఉందీ అనే తాత్వికతతో కవిత వెల్లడించింది. - కాసుల ప్రతాపరెడ్డి శీర్షిక లేదు 1 ఎలా నడిచి వచ్చానో మరి నన్ను నేను చిటికెన వేలట్టుకు నడిపించుకుంటూ దుఃఖాలు వడబోస్తున్న చీకటి కనుపాపల మినుకు మినుకు వెలుగుల్లో తడబాటు అలలై చుట్టేసే తమకాలను వదిలించుకు సైకత స్వప్నాల హోరు గాలిలో తమాయించుకుంటూ ఎలా నడిచి వచ్చానో మరి ! కరిగి కరిగి నీరై ప్రవహిస్తూ, నిలువరించుకుంటూ రెపరెపల మధ్య పూరెక్కల పరవశాల పులకరింతల మధ్య కంటి రెప్పలకింద వికసించకుండానే వాడిపోయిన కసరు క్షణాలూ లోలోపల పొరల మధ్య అలసి అలసి కుప్ప కూలిన భావాలను పేర్చుకుంటూ, ఓదార్చుకుంటూ, సవరించుకుంటూ మైనపు ముద్దలా మరుగుతూ , చల్లారుతూ కాస్త కాస్త కాలం నీడల్లోకి నిశ్సబ్దంగా అదృశ్యమవుతూ ఎంత మిగిలి వచ్చానో ....... 2. ఇప్పుడిక రంగూ రుచీ వాసనా కోల్పోయి నిస్తేజంగా గుడ్లప్పగించి చూస్తున్న శీతాకాలపు సాయంసంధ్య నై ఉపరితలం పొడుగునా మౌనం గాజు అద్దాలు పరచుకు పలకరి౦తల వెచ్చని వెలుగు కిరణాలు వెనక్కి తిప్పి కొడుతూ లోలోపల నాకు నేనే ఒక ఆవిష్కరి౦చని ప్రపంచాన్నై'' ౩. ఈ కొనకూ ఆ కోనకూ ఆద్యంతాలకు ముడివేసిన ఉలిపిరి సిల్కు దారపు వంతెన మీద వెనక్కు తిరిగి చూసుకుంటే నడిచొచ్చిన అడుగులకూ ముందు నడవవలసిన దూరానికీ ఒకటే కొలమానం వెనక్కు నడిచినా ,ముందుకు కదిలినా దూరం ఒకటే అయినప్పుడు ఎలా నడిచి వెళ్ళాలో చివరి అడుగు వరకూ -స్వాతి శ్రీపాద మే 5, 2014 Read more at: http://ift.tt/1jQOvW5
by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1jQOvW5
Posted by
Katta