పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.

1, సెప్టెంబర్ 2012, శనివారం

కెక్యూబ్ వర్మ ॥నిప్పు ఊట॥



నా ఆలోచనలెవరో దొంగిలిస్తున్నారు
ఒక్కొక్కటిగా....

తెరచిన కిటికీ గుండా ఓ మబ్బు తెరలా
లోలోన కురుస్తూ....

లోలోపల తడి గుండె మంటకు
ఆవిరవుతూ ఎండకాస్తూ....

రాతిరంతా ఓ మాట నిప్పు ఊటలా
భగ్గుమంటూ...

కప్పుకున్న కలల దుప్పటి
కమురు వాసనేస్తూ....

గుండెల కుంపటి మంట
కనురెప్పలను ఆరబెడుతూ....

దాచుకున్న నెమలీక ఒక్కోటీ
బూడిదౌతూ....

నాకు నేనుగా అల్లుకున్న కతల
పుటలు జ్వలిస్తూ....

ఆలోచనల కొలిమి తిత్తి ఎగదోస్తున్న
నిప్పురవ్వల చిగుళ్ళు నర్తిస్తూ....

కుంచెకంటిన రంగు చిత్రానికి
మంటనద్దుతూ....

కమ్ముకుంటున్న కారు మబ్బుల
చినుకు నిట్టూర్పుల ఆవిరౌతూ....

నా చుట్టూ చితి మంటల
ఊలలు నాదమౌతూ నన్నావహిస్తూ...

01-09-2012

డా.పులిపాటి గురుస్వామి ||భూమండల యాత్ర ||


కొన్ని తప్పటడుగులు వేసుకుంటూ
వెనక్కి చూస్తావు
నవ్వుకుంటూ ముందడుగు వేస్తావు

ఆయాసం మోసుకుంటూ

కొన్ని జ్ఞాపకాలను మూటగట్టుకుంటావు
దార్లో ,చెట్టు పిలిచిన నీడన
విప్పుకుంటావు
పరవశం కొంత
తడిసిన హృదయం ఆరిందాకా ...

కొంత మంది నీ వెంట నడుస్తారు
ఒకరి వెంట నీవు పరుగెడతావు
కొందర్ని వీపు కెక్కించుకుంటావు
తిరిగి చూస్తే నీవే కింద పడి ఉంటావు

కొన్ని గాయాలు సజీవుడిగా
గుర్తిస్తాయి
కొన్ని అక్షరాలు నిన్ను
కళాకారుడిగా కీర్తిస్తాయి

ప్రయాణం ఆపలేవు
సూర్యుడు ఊరుకోడు
చూస్తుండగానే
నడి నెత్తి మీది కొస్తాడు

ఏ ముద్ర లేకుండా నడవటం
వీలుపడదు
చెట్టు మీద కాకి గుర్తించి
సత్కరిస్తుంది చివరికి

అప్రమత్తంగా ఒంగినపుడు
నీ జేబులో దాచుకున్న బతుకు
ఒలికిపోతుంది
ఓపికగా దుమ్ము దులిపి ఎత్తుకుంటావు

ప్రకృతి ఊరుకోదు
ఆయాస పడ్డ నీకు చిరుగాలి ఊపుతుంది
కాసేపు సేదతీరాక
నీ శరీరానికి కొంత మెలకువ

కాలం నీవెంట నడిచి
పురుడుపోసుకుంటుంది
నీ గూట్లో పిచ్చుక పిల్లలు
నోరు తెరుచు కుంటాయి

ఆరు కాలాలు
ఆరు రుచులు
నిన్ను పులకింప చేస్తాయి

ఒక సాయంత్రం సూర్యుడు
నిను పిలుచుకు వెళతాడు
నువు నడిచి పోయిన జ్ఞాపకంగా
ఇక్కడ ఎప్పటికీ
రంగు రంగు సుగంధాల పూలు పూస్తాయి .

ప్రసాద్ తుమ్మా || ఓ అందం ||


ఓ అందం
నీ కెంతో గర్వం
ప్రకాశించే తారలలో
పొందు పడాలనుకుంటావ్
వెలగలేక మలగలేక బాధతో
కొట్టుమిట్టాడుతుందని నీకేం తెలుసు,
గల గల పారే ప్రవాహంలో
గంభీరంగా పొంగే సంద్రంలో
నీ నీడ చూడాలనుకుంటావు

కాని,
ఆ సముద్రం బడబాగ్నులతో
ఎలా ఘోశిస్తుందో నీకేం తెల్సు
నిర్మలంగా సాగే ప్రవాహానికి
ఎన్ని అడ్డంకులో నీకేం తెల్సు
కనిపించే జగతిలో
కమనీయ దృశ్యాలలో
చోటు చేసుకోవాలనుకుంటావు

కాని
జగతి నిండా ఆకలి ఘోషలు
కనలేని , వినలేని అతర్క్యమైన దృశ్యాలు
ఉన్నాయని నీకేం తెల్సు:

01-09-12

కొప్పుల వసుంధర॥Tell me why ...??॥


చెప్పగలవా...??


నాకీ ఒంటరితనం ఎందుకో..

నువ్వెక్కడ ఉంటె..
నేనక్కడ ఉండలేక పోతున్నానో..
కొన్ని యుగాల ఈ నా అన్వేషణ
నా ఆరాధన ఎందుకోసమో.
చెప్పగలవా...??

నా ప్రశాంతత
ఏ గూటిలో..ప్రశాంతంగా నిదిరిస్తోందో..
చెప్పగలవా..??
నా వేదన
నా కన్నీరు
ఏది చేతకాక
ఏం చేయాలలో పాలుపోక..
నే అరిచే అరుపులో..శభ్దం
ప్రతిధ్వనించి తిరిగి నన్నే ఎందుకు చేరుతుందో..
చెప్పగలవా..??

రాసే కొద్ది పేజీలే తప్ప
మాటలు ,మనసు ఖాళీ అవని
ఈ ఖాళీతనం ఏమిటో..
కనీసం, నువ్వైనా..చెప్పగలవా...???

అనిల్ డ్యాని ||లంచ గొండి||


ఆకాశంలో చుక్కలు
మీరు చేసిన పాపాలు
ఆకాశం లేని చోటకూడా
నువ్వుంటావ్ అక్కడ అవసరం వుంటే
అవకాశం అవసరం సంపర్కం లో
పుట్టిన అరాచక అవతారం

అదిగో నువ్వు పర్మిట్టు ఇచ్చిన బస్సు
పదిమంది పసిపిల్లల నవ్వుల్నిచిదిమి
చదునుచేసి కన్నవాళ్ళ కడుపుశోకం ను
హారన్ గా చేసుకొని మ్రోగుతుంది

బ్రతుకే భారమై అనారోగ్యం పాలై
ఆసుపత్రికి వెళితే నీ కోరిక తీర్చలేక
ప్రాణం పోయి ఆత్మ పైకెళ్ళిపొతే
నిర్జీవ దేహానికి వెలకట్టే నీ మూర్ఖపు
ఆలోచనలకు ఆత్మలన్నీ ఘోషిస్తున్నాయి
సమాధుల నోళ్ళు తెరుచుకొని

అసలే ముదిమి ఆపైన వెలివేత
ఆ నాఉగు పించను రాళ్ళకోసం
నీ వద్దకు తిరిగిన మైళ్ళ దూరం
పొరలు కప్పిన నీ కళ్ళకు కనబడవు
వారు విదిల్చిన పాదధూళి నీ పై కలియ బడితే
నీ కనులు కనుల పొరలు నేల రాలతాయి

కష్టపడి చదివి జీవితపు వైకుంఠ పాళిలో
నిచ్చేనేక్కి పైకేల్లాలనుకుంటే
నీ కామ దాహం కాలసర్పమై కాటేస్తే
రాసిన రాతకు కాక అందిన అందానికి మార్కులేసి
కామ లంచం తీసుకుంటే
ఆ సరస్వతుల నోళ్ళు శాపాలే పలవరిస్తాయి

నీ నవ్వంత స్వచమైన నకిలీ విత్తనాలు
రైతుల ప్రాణాలను తోడేస్తుంటే
నోట్ల కట్టలపై విష్ణుమూర్థిలా నిబిడాశ్చర్యం తో
నిట్టూర్పు విడుస్తూ విచారం వ్యక్తం చేస్తే
రేపు నువ్వు తినే మెతుకు విషమై నిన్నే మింగేస్తుంది

జీవన చక్రం ఆగదు జీవిత కాలపు చివరి మలుపులో
నీవు చేసిన పాపాలు ప్రళయం లా చుట్టుకుంటే
నువ్వు లెక్కేసి పెట్టుకున్న నోట్ల కట్టలు నీ చితిని
పేర్చి నిన్ను రారమ్మంటే
నీకసలె పట్టని నీ అంతరాత్మ ఆఖరి నిముషంలో
నీ గతం నీకు గుర్తు చేస్తే ఆ భయానక దృశ్యం
చూసే చేవ లేని దద్దమ్మలా చావు
అంతరాత్మని అంగీకరించలేని నీకు
అదేం పెద్ద శిక్ష కాదు

  01.09.2012

రియాజ్||సరదాగా...(సముద్రంతో సంభాషణ)||


సరదాగా ఈతాడటమొచ్చా నీకు?
తమాషా కాదు!
తీవ్రంగా అలొచించేంత సులువుకాదు!!
ఈ క్షణంలో అందంగా జీవించగలవా?
భయంకర నిరాశావాదమంత సులువుకాదు
ఈ ప్రక్రియ?!

సముద్రం గొప్పదా?
నేను గొప్పవాడినా?
ఈ అలల్లోని ఉత్సాహం
చురుకైన కదలికలూ
ప్రవాహ వేగమును నేనెప్పుడు పొందగలను?
భీతిగొలిపే ఘోష
దీనిలోతూ నా మనసు లోతూ
దీని గాఢతా నా ప్రేమలో కూడా ఉంటుందా? అమ్మో?!
ఏవేవో అలోచనలూ.. ప్రశ్నలూ...ఇక్కడకూడా నాలో?!

సరదాగా ఈతకొచ్చావ్
సరే! బాగుంది!!
అంతర్గత బహిర్గత క్లాక్ లను సరిచేసి
గతాన్ని ఓ మూల వేసేసి ఈతాడేసి
ఆ ప్రక్రియకు న్యాయం చేసెయ్! చాలు!!

మరి ఈ సోది ఆలోచనలు
సుత్తి విశ్లేషణలూ ఎందుకో!!
ఈ అల ఎలా దాటాలి?
దీనిని ఎలా తప్పించుకోవాలి?
అలా ఉన్నా పర్వాలేదు నీ అలోచనలు

నువ్వేంట్రా!
సముద్రంలో కూడా
సగం ఆలోచనా ప్రపంచాన్ని మోస్తూ
నీకూ సముద్రానికి భారంగా తోస్తావ్!!

అలోచించే పిచ్చి ఏమైనా పట్టిందా?
నువ్వు చించి చించి ఎవరిని ఉధ్ధరిద్దామనో??

ఈ క్షణం
ముందుకు వెళుతుంటే..
నువ్వేంటి వెనుకటి వెనుకబాటు
భంగపాటూ వెతుక్కుంటుంటావ్?

మరీ బలహీనంగా కనిపిస్తున్నావ్ రా?
ఈ అలలకంటే!!

ఈతాడాలంటే లోతు తెలియనక్కర్లేదు
లోతు తెలిసినా తెలియకపోయినా నష్టమేమీ లేదు
ఒక్కో క్షణం ఒక్కో అనుభవమూ బలహీనతను తొడుక్కుంటూ
సగం నీ గతమే! అంతర్గతమే!! అడ్డుపడుతోంది
కొత్తగా అందంగా సృజనక్షణాలను గుర్తిచడంలో
సరికొత్త అనుభూతించడంలో..నువ్వెప్పుడూ వెనుకబాటే!!!!
వర్తమానాన్ని ఆస్వాదించడంలో..
ప్రస్తుత క్షణంలో జీవించడంలో...!!

ఈ సముద్రం కంటే లోతైనవి
దీనికంటే విశాలమైనది
దీని అలలకంటే ఉత్సాహమైనవి
దీని అంతర్గతంకంటే గంభీరమైనవి నీలోనూ ఉన్నాయ్!
నువ్వెక్కువో సముద్రమెక్కువో ..అనవసరం
ప్రస్తుతం నువ్వూ ఆ సముద్రతీరమూ ఐక్యమై
అలల విన్యాసాలూ వాటితో నీ విన్యాసాలూ
చూస్తూ ఆ అద్భుత కలయికా దృశ్యాన్ని ప్రకృతి చూస్తూ
పరవశంతో నిశ్చేష్టగా ఉండిపోవాలి!!

ఇక్కడ నువ్వూ ప్రేక్షకుడవు కావు
ఇద్దరు ఆటగాళ్ళ మధ్య సౌందర్య ఆస్వాదనా క్రీడలో
ఒకడివి
నీ అంతర్గత వికృతిని కాసేపు బంద్ చెయ్
నీ ఆట అత్యంత సహజంగా
వర్తమానంలో వర్తమాన ఆత్మలో
వర్తమాన మనసుతో
ప్రస్తుత కదలికపై నీ అవగాహన
చైతన్యానికే అవాక్కనిపించేలా
అలలవేగాన్ని ఎదుర్కోవడంలో నీ శైలిని చూసి
సముద్రుడే ఆశ్చర్యపోయేలా ఉండాలి నీ క్రీడా నైపుణ్యం
నీ సరదా పూర్థిగా తీరాలి ఆ కాసేపు
ఆ కొన్ని క్షణాలే అద్భుత జీవన సౌందర్య సూచికలు
బాహ్య సౌందర్యంలోని ఆత్మానంద అనుభూతి చిహ్నాలు
అందుకే..
సరదాగా ఈతాడు.. తీవ్రంగా కాదు...!!

01.09.12

బాలు||పెళ్ళికాని తల్లిని||



అమ్మ ఒక చోట
నాన్న ఒక చోట
అన్న వీదేసాలలో
నేను మరో చోట

ఏమైనా అంటే
ఉద్యోగం,
బాద్యతలు,
చదువులు,
అని సముదాయిన్చుకోవటం

ప్రేమ కరువు
ఈ కలి కాలంలో
బంధువులులా కలుస్తాము
అప్పుడప్పుడు

ప్రేమ పంచుతాను అని
దగ్గర అయ్యాడు ఒకడు
గర్బాన్ని
ప్రసాదించి
పుణ్య వంతురాలివి అన్నాడు

తాళి కట్టి
మొగుడు అవ్వు
ఈ బిడ్డకు
తండ్రి అవ్వు అంటే

బలే ఉన్నవే
ఆ బిడ్డ
నా బిడ్డేనా
అని వెర్రికూతలు కూసి
జారుకున్నాడు

సమాజం దృష్టిలో
నేను ఓ దోషిని
కన్నవాళ దృష్టిలో
నేను ఓ పాపిని

ఏది పాపం?
ఎవరికీ పాపం?
నాకా!
నా బిడ్డకా!

సరదాపడి
ఏదో చేసి ఉంటారు
బిడ్డను చంపి
చేతులు దులుపుకోమంటారు
తెలివిమీరిన పెద్దలు

సహజీవనానికి
బహుమానం అయిఉంటుంది
మూడు ముళ్ళ బందం ఉంటే
పాపం పోతుంది అంటారు
ఇంకొందరు

కాని వాళ్ళకు
తెలియదు
మూడు ముళ్ళు
వేసే వాడు
ఏములనో దాక్కున్నాడు

లోకుల కూతలు
పడతాను
బిడ్డ కోసం
బతుకుతాను
బిడ్డను
బతికిస్తాను

జనం ఎదురు తిరిగితే
సహిస్తాను
వాళ్ళు నా బిడ్డలాంటివారె అని
ఎంత అయిన
నేను ఒక
బిడ్డకు తల్లినే కదా!
కాక పోతే
పెళ్ళికాని తల్లిని.

*30-082012*

రేణుక అయోల||పట్టుపురుగు||


ఒక క్షణం కాలాన్ని కదపదు
 ఇంకోక్షణం నిద్రని దూరం చేస్తుంది
ఆలోచనగానే మిగిల్చేయాలన్న ఆలోచనలనకి గండిపడింది

వరద వరద 
వేసవి దాహం
నేలలో చోరబడ్డ కనబడిన నీటి బిందువు
నీ శరీరాన్ని చుట్టుకున్న మంత్రమేదో లోపల ప్రవేశించాలని ఆలోచించగానే
 మెట్లమీద ఆగిపోయిన నా అడుగులని పావులని చేసి
నడిపించుకుంటూ వెళ్ళిపోయావు

మోహన రాగం నన్ను అల్లుకుంది వేణువుని అన్నావు.
కోపంతో రగులుకున్న కళ్ళకి కర్పూర కాటుకని అద్ది
నీటిలో చేపపిల్లలా కళ్ళలో ప్రతిబింబించావు రెప్పని వాల్చాను.
రెప్పల విసినకర్రలో ఒదిగి
అగ్నిని ఆర్పేసిన అగ్నిమాపకదళుడివయ్యావు

నన్ను నన్నుగా బతకని మాటల బుట్టని అక్కడ ఉంచేసి వచ్చేదామనుకున్నాను
నన్ను కమ్ముకున్న నీ ఊహ దానిమ్మపూలరంగుల అద్దకాలని
 క్ష.
ణా.
ల్లో ...
ముద్రలువేసి వెళ్లిపోయింది
రంగులు అంటుకున్నదేహంలాంటి మనసు వెన్నెల దారులని వెతుక్కుంది

ఓడిపోయాను- అన్నమాటలో ఎవరు అన్న ప్రశ్న?
జవాబుగా
రెండు బలమైనదారాల గూడు అల్లుకుని పట్టుపురుగుని చేసాయి...
1-9-2012

MAMIDI HARIKRISHNA || మూడు సంగమాలు||

 

Prologue
గంధం.. కుందనం..
పేర్లు వినడం- కవిత్వంలో రాయడమే..
కానీ ఇన్నాళ్ళకి-
ఆ రెండూ కలిసి ఒకే సారి
నా ఎదుట ప్రత్యక్షం అయ్యాయి..

రోడ్డు వారగా నిన్ను చూడగానే
నిలువెల్లా గంధం పూసిన కుందనపు బొమ్మే
అక్కడ నిల్చుందేమో అనుకున్నా..
గాలి లోకి అలవోకగా నువ్వు విసిరిన చిరునవ్వుల పరిమళాన్ని
ఆత్మీయంగా దోసిలిలో పట్టి
నీ వెంట నడవడాన్ని అపురూపంగా అనుభవించా..
*** *** ***
Intro
మలుపుల దారులను దాటేసి
గదిలోకి వస్తావు
మదిలోని ఆనకట్టల్ని తెంచేస్తావు
నోటితో యాపిల్ పండుని - కళ్ళతో నీ ఒంటి సొంపులని తింటూ ఉంటాను
మధ్య మధ్య చేతుల స్పూన్లతో
నీ నడుం మడతల్ని నంజుకుంటూ ఉంటాను..
ఆకాశమంత సిగ్గుతో- నక్షత్రమంత సంభ్రమంతో
విరగ కాసిన చెట్టంతటి భారంతో
నువ్వు కన్రేప్పలను వాల్చేస్తావు..
*** **** ***
Pre-Journey
యుగాల నాటి అన్వేషణ సరికొత్తగా మొదలవుతుంది
మాటలు- ద్రుశ్యాలవుతాయ్
చేతులు- సంభాషణ మొదలెడతాయ్
పెదాలు- అదృశ్య వర్ణ చిత్రాలవుతాయ్
చూపులు- సౌందర్య వర్షం లో కాగితపు పడవలవుతాయ్
*** **** ****
సరిగ్గా అప్పుడే-
నేను ఓ బౌద్ధ సన్యాసిలా
జీవన్ముక్తి యాత్రకు తొలి అడుగు వేస్తాను
నీ "వంటి " ఇంట్లోని గది గదికీ వెళ్లి
భిక్షాటన అడుగుతుంటాను ..
ఏ గదినీ వదలడం ఇష్టం లేదేమో-
దేహపు ఇల్లంతా కలియ తిరుగుతూ ఉంటాను
మధ్య మధ్య-
తీయని చెలమ నీటిని గుటక వేసి
పునర్ జీవాన్ని పొందుతాను
చేతి వేళ్ళ పెనవేతలో
ఊపిరిని నిలబెట్టుకుంటూ ఉంటాను ..
*** **** ***
Journey
ఏ లోక కల్యాణం కోసమో అన్నట్లుగా
పూజ ఆరంభం అవుతుంది

ఒక గదిలో
చుంబనాల దండకం చదువుతాను
మరో గదిలో
కౌగిలింతల స్తోత్రం చేస్తాను
ఇంకో గదిలో
కర స్పర్శల హారతి పడతాను
వేరొక గదిలో
దంత-నఖ క్షతాల కీర్తన పాడతాను
మరొక గదిలో
నాలుక కుంచెతో
వీపు నేలపై ముగ్గులు వేస్తాను
ఇంకో గదిలో
ఖర్జూరాలు పొదిగిన డమరు ద్వయాన్ని
చేతుల్లోకి తీసుకుని లాలన గా భజన చేస్తాను..

దేశ ద్రిమ్మరిని కదా
ఒక్క చోటే ఆగిపోలేను
మరో గదిలోకి ప్రవేశిస్తాను-
అక్కడంతా మైదానం..
మైదానం మధ్య ఓ దిగుడు బావి
బావి చరియల చుట్టూ ప్రదక్షిణలు చేసి
అందులో మూడు మునకలేస్తాను

ఇక చివరి గదిలోకి మాత్రం-
అత్యంత భక్తీ శ్రద్ధలతో ప్రవేశిస్తాను
ఎదురుగా తెరుచుకుని ఉన్న వ్యాస పీఠం-
అందులో ఓ అద్భుత కావ్యం
సున్నితంగా తడుముతూ దానిలోని పేజీలని
నెమ్మదిగా ఒక్కొక్కటే చదవడం మొదలెడతాను

కావ్య పథనం -
మంద్ర నాదంగా మొదలై మర్మ ఉచ్చారణ గా
తీపి మూలుగుగా రూపాంతరం చెందుతుంది..
పీఠం లో ప్రకంపనాలు
పేజీలు తిప్పడం లో వేగం
అక్షరాలూ- వాక్యాల వెంట పరుగు ఊపందుకుంటుంది
పుస్తకానికి నాకు మధ్య అంతరం చెరిగి పోతుంది

ఇప్పుడు పుస్తకమే-
నన్ను చదవడం ఆరంభిస్తుంది
నేనేమో నా సహజ కలాన్నిఒడిసి పట్టి
పుస్తకంలో లిఖిస్తూ ఉంటాను
కొత్త రచన శ్రీకారం చుట్టుకుంటుంది
అద్వైతం సారవంతం అవుతుంది
మంచు ఖండం బద్దలై రస గంగ పెల్లుబుకుతుంది
పుస్తకం ప్రతి పేజీలోనూ ఎగజిమ్మిన సిరా చుక్కలు అన్నీ కలిసి
నవ నవోన్మేశ పద్యం రెక్కలు విదిల్చి ఎగురుతుంది..
*** *** ***
Destination

కొత్త కావ్యంలో
మొత్తం మూడు అధ్యాయాలు-
దేహ సంగమం
మనో సంగమం
ఆత్మ సంగమం

జయ మంగళం- నిత్య శుభ మంగళం
ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతి
*** *** ***
ప్రియా
ఇపుడిక నాలుగో అధ్యాయం రాయాలి..
రా..!
 
1st Sept,2012

Mercy Margaret ll అక్షర రెక్కల శబ్ధం l


ఏంటి ఈ శబ్ధం?

అక్షరాలు రెక్కలు విదిలిస్తూ
ఎటో ఎగిరి వెళ్ళే
ప్రయత్నం చేస్తున్నాయి

ఎటు?

కవి
ఆలోచనాకాశంలోకి
అతడి భావాల సంద్రం లోకి
మనసు వృక్షం పై వ్రాలి
గుండె తడిలో తడిసి
గొంతు గూటిలో మాటల జత కట్టి
వ్రేళ్ల దారుల్లో ప్రయానించి
కాగితపు మైదానం పై
నడుస్తూ
కన్నీటిని సంతోషాన్ని
తడిమి చూస్తూ
ఎగురుతూ వెళ్ళేందుకు
సిద్దపడుతున్నాయి ..

అక్షరాలు
గొంతును సవరించుకుంటున్నాయి
ఎందుకని ?

పాటలా, పద్యంలా
కధలా ,మాటలా
స్వరాల జలపాతంలో కలిసి
నీటి బిందువులన్నీ రాశిగా ఏకమైనట్టు
రాగమై ఆలపించే ఆ స్వరాల అల్లికలో
ఒదిగిపోతూ
ఆ గొంతుకల్ని భావవేశాల పరిమితులకి
తగ్గట్టు మలుచుకుంటూ

పిల్లాడి చదువుకు పద్యమై
అక్షరాల ఆస్తులై
విప్లవ పాటగా జ్వలితమై
అమ్మ పాటగా లాలనై
ప్రేమికుల ప్రేమ లేఖల్లో పూలై
కౌగిలింతలై
దేవుడి ముందు అర్చనై అభ్యర్దనై
సర్దుకుంటూ హడావిడి చేస్తున్నాయి

అక్షరాలు
ఏడుస్తూ మొరాయిస్తున్నశబ్దం

ఎందుకని ?

రాజకీయ నాయకుడి ప్రసంగానికి
ఉరి కాబోతూ
అసత్యం అవబోతుందని
డబ్బుకు అమ్ముడవుతున్న మీడియా
చేతుల్లో నగ్నత్వాన్ని ఆవిష్కరించాలని
మాటలు తప్ప చేతలలో చూపలేని వారి
నోటికి వేలాడుతూ అవమానం పాలవడం
ఇష్టం లేకని ..

ఆ అక్షరం రెక్కల చప్పుళ్ళలో
ఆనందం
కల్మషం లేకుండా హత్తుకునే
హృదయం దొరికిందని
ఎవరిదో ? అని వెతుకుతూ
అక్కడే నిరీక్షిస్తున్నా 

1/9/2012

స్కైబాబ ||రోడ్డు ఉద్యమం అడ్డా ||


- - - - - - - - - -

నేను మళ్ళీ రోడ్డు మీది కొచ్చాను
భగాయించి నువ్వు ఇంట్లో నక్కినవ్
రోడ్డు ఇవాళ నినాదమైంది
రోడ్డు ఇవాళ ర్యాలీ ఐంది
రోడ్డు ఇవాళ రాస్తారోకో ఐంది
రోడ్డు ఇవాళ బంద్ కి ప్రతిబింబమైంది
రోడ్డు అసెంబ్లీ ముట్టడి కి దారి చూపింది
రోడ్డు ఇవాళ నన్ను పొదువుకొని
నీపై రాళ్ళు విసిరికొట్టింది
నీ బహుఅందమైన కలల్ని
భళ్ళున బద్దలు కొట్టింది
నేను ఒక్క పిలుపునిస్తే
నువ్వు ఎక్కడికక్కడ జామ్
నేను నినదిస్తే
నీ గుండెలు పిక్కటిల్లాయ్
నేను మళ్ళీ రోడ్డు మీది కొచ్చాను

గ్రహించావా
నీ మదిలో కట్టుకున్న గోడే
నువ్వు నా ప్రాంతానికి రాకుండా
రోడ్డు మీద అడ్డుగోడై లేచింది

నా నాడీమండలం రోడ్డు
ప్రవహిస్తున్న ఉడుకు నెత్తురు నేను
రోడ్డు నా పూర్వీకులు తొలిచిన తొవ్వ
రోడ్డుమీదికి నడవకుంటే రక్తచలన ముండదు నాకు
గుమిగూడందే గుంపులో కలవందే దినం గడవదు నాకు
రోడ్డు నా అడ్డా

రోడ్డు మీద పుట్టినోళ్ళ నుంచే
ఉద్యమకారుడు ఉద్భవిస్తాడు

రోడ్డు మీద తిరిగిన వాళ్ళల్లోనే
ఉద్యమకారుడు ఉరకలేస్తాడు
రోడ్డు మీద బైటాయించిన వాడి నుంచే
ఉద్యమ రక్తం చింది పడుతుంది
రాతిముక్కను ఆయుధం చేయడం తెలుసా నీకు
ఉద్యమకారుడికి తెలుసు
రోడ్డును ఉద్యమానికి వేదిక చేయడం తెలుసా నీకు
ఉద్యమకారుడికి తెలుసు
రోడ్డు మీదికొచ్చిన ఉద్యమకారుడు ఒక్కడే
ఒక్కొక్కడే వందలు వేలు లక్షలవుతాడు
నీకు చేతనవుతుందా ?
రోడ్డు మీద నడిచినవాడివే కదా
రోడ్డుని అవమానిస్తావా ?
రోడ్డు నా అమ్మరా !
రోజూ పలకరిస్తుంది నన్ను
నా ఎతలన్నీ తెలుసు దానికి
నా నిరసనకి ఇంత చోటునిచ్చింది
నా ఆందోళన లన్నింటికీ ప్రతిబింబమైంది
ఉద్యమానికి అద్దమైంది

ఉద్యమించడం చేతకానివాడా!
మాకు ఉద్బోధలు చేస్తావా?
రారా ! నీకూ నాలుగు నినాదాలు నేర్పిస్తా
నా రక్తం లో సోడా కలుపుకొని తాగి జోగుతున్నవాడా!
మత్తు దిగి తెరుచుకున్న నీ కన్ను మీద
తెలంగాణ పటం ప్రతిబింబమవుతుంది
అందులో నా హైదరాబాద్
కోహినూరై మెరుస్తుంది

పద్మా శ్రీరామ్||గుర్తున్నానా......||


ఏయ్.... నేస్తం బాగున్నావా ?
నే నీతో లేని నాడు ఎలాఉన్నావు?
నా పై అలిగి నా స్నేహం నుంచి తొలగి
నాతో మాటమాత్రం తగదని నా చెలిమిలో మలిగి
నా మనసునిలా నలిబిలిగా చెలిగి....

ఏంటో ప్రతి వేకువలో తెల్లవారుతున్నా
నిశీధీ నిశ్శబ్దంలా ఏదో వెలితిగా నాకే ఉందేమో....
మరలా అది నేను నీకు చెపితే నీకు లోకువౌతానేమో....
అయినా మీకు నా నిశ్శబ్దం ఏ శబ్దం కానపుడు
నేనెందుకు రవళించాలనే ఒక చిన్ని ఆభిజాత్యం....
దానితోనే ప్రతి ఉదయం తెల్లవారుతోంది...ప్రతి నిశి మలిగిపోతోంది....

జీవితంలో ఏదో లోటు....ఎగశిపడే కడలి కెరటమై...
కవులకు సైతం అక్షరాలకందని పదాల జలపాతమై
ఆ కన్నీటి పుష్పాలతో కనుల కొలనులు నిండి
నాలో అనుదినం వెల్లువౌతుంటే......
నువ్ నాకు అలవోకగా గుర్తొచ్చేస్తావ్.....

అక్కడే జ్ఞాపకాల తలుపుతట్టి....అలా అదే పనిగా
నన్ను చూస్తూ నా తలపుల గోడకి జారగిలపడి
చూపుల పిలుపులతో నన్ను అణువణువునా తడుముతూ
నీ ఊసుల్తో నా మది నింపుతూ ఎద నిండుగా ఉండిపోతావ్

నీ దరికి రాలేని ఏదో అలజడి...నీకై అలవిమాలిన ఎదురుచూపు
ఆ అలికిడి లో ఏదో జ్ఞాపకం కన్నీరై చూపులకడ్డం పడుతూ ......
ఎద తడిమితే అది కవితైపోయింది మిత్రమా.....
రాని నీ కాల్ కోసం నిరీక్షణలో బ్రతుకు ఆరోహణా
అవరోహణాల పర్వమై....నీ చెలిమే సర్వమై.....

1 September 2012

జిలుకర శ్రీనివాస్॥నిన్ను చూశాకే తెలిసింది॥

1)

సముద్రాన్ని కళ్ళలో దాచుకొని తిరగడం ఎంత కష్టమో నిన్ను చూశాకే తెలిసింది ఆగిపోయిన కాలం వెనుక దాక్కోవటం నాకు చేత కాదని తెల్సుకున్నాక గట్టు దాటి పొంగే కడలి ఎన్ని సార్లు గొంతు కోసుకుందో మరెవ్వరికీ తెలియదు ప్రియా! బతకడమే పరమావధి అయితే ఎలాగైనా బండి లాగేయోచ్చు తలలు వాలిపోయే చోట కలలు కాలిపోయే చోట మురికి నీరు మాత్రమే నరాల్లో పారే చోట ఎలాగో అలా బతికేయటం నాకు నచ్చదు మెరుపులున్న చోటు నీ మురిపాల నవ్వులున్న
చోటు ఆకాశంలో తెల్లని మల్లె వొంకలున్న చోటు నీ సమస్తమూ ఓకే ఒక దివ్య వెలుగైన చోటు కోసం వెతుకుతూ నువ్వు నడిచిన దారిలో కాంతులీనుతూ ఉంటాను

2)

కలలు రావటం ఆగిపోయాయి అవి నువ్వోచ్చిన దారిలో గడ్డమూ మీసాలూ వేసుకొని ఒంటి మీద గుడ్డ లేకుండా తిరుగుతున్నాయి పిచ్చి పట్టిందని మిత్రులు ప్రకటించేశారు డాక్టరు చేతులెత్తేశాడు నాకోసం ఒక్క కంపెనీ నాలుగు మందు బిళ్ళలు తయారు చేట్లేదంటే ఎంత గర్వంగా ఉందొ తెలుసా నాకు నన్ను దోచుకొనే వీలు ఇవ్వలేదు కదా నేను! నిన్న రాత్రి పక్క వీధిలో వాళ్ళు కత్తులు నూరుకుంటున్నారు నల్లటి బాంబులు చుట్టుకుంటున్నారు కులాన్ని మాయ చేయాలంటే మతాన్ని ముస్తాబు చేయాలని పాడుకుంటున్నారు నేను నిన్నే దేవులాడుకొంటూ నీ కోసం బెంగ పడుతూ ఉరుకొచ్చాను కాళ్ళకు అడ్డుపడ్డ రెండు పెద్ద కత్తులు బొడ్లో దోపుకొచ్చాను రెండూ నీకోసమే జాగ్రత్తగా తలకింద పెట్టుకో హక్కుల గురించి నువ్వు మాట్లాడితే వినే వాడెవ్వడు? కనిపించ కుండా పోయినోళ్ళ జాబితాలో నీ పేరు ఎప్పుడు చేర్చాలా అని చూస్తున్నారు

3)

మాల్కం ఎక్స్ మాట్లాడుతూనే ఉన్నాడు నిన్ను రక్షించుకోవటం వీలు కాదు నీ సంఘమే నిన్ను కాపాడుతుందని చెప్తూనే ఉన్నాడు నల్ల జాతి ముఖాల మీద చిర్నవ్వుతో నన్ను పిలుస్తూనే ఉన్నాడు నాకు ఆయనకు అంబేద్కర్ను పరిచయం చేయాలనుంది ఇద్దరినీ ఒక్క వేదిక మీద చూడాలని ఉంది మాల్కంకు బాబాసాహెబ్ తత్త్వం తెలిస్తే ప్రపంచం చాల మారిపోయేది! ఎక్కడో జనం పిలుస్తూనే ఉంటారు వాళ్ళకిప్పుడు బాట చూపే వాళ్ళు కావాలి నువ్వేమో నాకు తప్పిపోయిన దారి చూపావు నువ్వు చూపిన దిక్కుకే అడుగులేస్తున్నానా! నా వెనుక సముద్రమేదో నడిచోస్తున్నట్టుంది

4)

చేతులు పక్క మీద నీ కోసం నిద్దర్లో తడుముకుంటాయి నువ్వోదిలేసి పోయిన తీపి చిహ్నాలు చిలిపిగా నవ్వుతూ దొర్లిపోతాయి కాళ్ళు కడుపులోకి దోపుకొని మూల్గుతూ ఉంటానా నువ్వు చదివిన పవిత్ర మంత్రం గదిని పరిశుద్ధం చేస్తుంది సమూహాల మధ్య ఒంటరిగా బతకడం ఎంత కష్టమో నీకు తెలుసునా? నీలో ధగధగా వెలిగే లోకాలను చూసినప్పుడు కళ్ళు మూతలు పడి మూగగా రోదించడం ఎంత కష్టమో తెలుసునా నీకు? నీ ప్రేమ లేకుండా నీ కమ్మని నవ్వులు లేకుండా యుద్ధం లో ముందుకురకటం అసలు ఎంత నరకమో కదా ప్రియా! నేను ప్రపంచాని జయిస్తే చూసి ఆనందించాలని నువ్వు ఆరాటపడుతున్నావు. నువ్వు హాయిగా ఆనందంతో నవ్వుల తోటవైతే చూడాలని నేను కత్తి తిప్పుతున్నాను. ఇప్పటికీ సముద్రం నా కళ్ళు దాటడం లేదు పిచ్చిది గొంతు నొక్కుకొని చచ్చిపోతుంది

నౌడూరి మూర్తి|| ఆర్కిమిడీస్ సూత్రం!!


నిన్నటి వరకూ నాకు ఎప్పుడూ ఒక సందేహం వస్తుండేది
సంతోషాన్ని కొలవడం ఎలా?
దాని విలువకట్టడం ఎలా? అని.

ఎన్ని వేల సందర్భాలు తటస్థించేయి జీవితంలో
కానీ నిన్నటిదాకా ఆ ‘యురేకా’ క్షణం రాలేదు

నిన్న మా మనవరాలిని ఎత్తుకున్నప్పుడు
ఒక్కసారి ఆర్కిమిడీసు తట్టేడు
ఆనందంలో ములిగిపోయిన నేను కోల్పోయిన
సమాన ఘనపరిమాణముగల నా తనుభారమే
నా చేతిలో ఉన్న నా ఆనందపు మొలక అని అప్పుడు తెలిసింది.

1.9.2012

శ్రీకాంత్||పురాకృతం||


తేలికగా ఉండడమంటే ఏమిటి?

బహుశా నాకు తెలీదు. అది సాయంకాలపు ఎండ కావొచ్చు. దేహంలోకి చొచ్చుకుపోయే గాలీ కావొచ్చు.ఒక అద్భుతం. నీరులానూ తుంపరలానూ వుండటం. అది ప్రేమ కూడా. తేలికగా వుండటం అదే కావొచ్చును.

ప్రేమించడం నిర్మలంగా నవ్వడం మృదువుగా మాట్లాడటం నాకు తెలీదు. ప్రతిక్షణం ముక్కలుగా రాలిపడటం యితరులను గాయపరచటం నాకు తెలిసిన జీవితం. అది యీ వాచకం కూడా - మరెప్పుడో మొదలయ్యింది సంఘర్షణతోనే. యిక్కడే అంతమవుతుంది సంఘర్షణతోనే. కానీ, పాదాల చుట్టూ చుట్టుకొనే నీడా దేహంపై కదులాడే ఎండా? యివి కూడా వాస్తవాలు.

ప్రేమ కూడా వాస్తవం.

యీ శాపగ్రస్థ పదాల ముందు ఆమె నిర్లిప్తంగా కదులాడింది. యీ శాపవిమోచనం లేని పదాలతో పాటు ఆమె నిరాసక్తతగా నడుస్తూ వుంది. సగం తెరుచుకున్న పెదవులు. కనులలో రోగగ్రస్థమైన ఎర్రటి జీర ఒక స్పర్శ. ప్ర్రాణప్రదమైనదాన్ని ఒడిసిపట్టుకున్నట్టు లేదా తల్లినుంచి విడిపోతున్న తల్లి చూపూ: ద్రోహం: వుండకపోవడం . ఉండటమూ నేరం. ఉండటం ఉండకపోవడం మధ్య, హస్తాల మధ్య తడిలా పారిపోయే నీరులా అదృశ్యమైనది ఏమిటి?

వుండటం. వుండకపోవడం.

భౌతికమైన ప్రేమ. ప్రేమ నుంచి మరింత దీర్ఘంగా,ఎండాకాలంలో పల్చనయ్యి బలహీనంగా తడిమే సన్నటి నదీ చారికలా ఆవిరవ్వకుండా మాయమయ్యే ఇంద్రజాలపు రూపం. ఒక సూర్యకిరణం లేదా చిట్లి సప్త రంగులుగా బయల్పడే సౌందర్యవంతమైన చిరునవ్వు, హింసాత్మకంగా ఏడు రంగులలో ప్రతిబింబించే వెక్కిళ్ళ రోదన. నొప్పి కూడా. అర్థరాత్రి ఎండాకాలం తన పాదం ముంగిట మోపే సుదూర సమీప సమయాన, ఎండాకాలం తన తొలిపక్షి పిల్లలతో చల్లటి వేడి రెక్కలతో వీచే దిగులు పారిజాత పరిమళ గాయపు సమయాన వొక స్వరం. లేదా వొక భాష.

సుదూరం నుంచి, మరచిపోయిన లేదా మరచిపోయినదేదో వొదిలి వెళ్ళిన సువాసనలాగా, అప్పుడెప్పుడో వర్షాకాలపు మధ్యాహ్నపు సాయంత్రం పూట, మేఘాలు మృదువుగా, కదులుతున్న రక్తంలా, గడ్డ కడుతున్న చేతివేళ్ళల్లా కదలాడుతున్నప్పుడు పెదాలపై వొదిలివెళ్ళిన వుమ్మిలా లేతగా జారుతున్నప్పుడు, సుదూరం నుంచి మరచిపోవాలనుకొన్నదేదో, మరచిపోతే మరణిస్తాననుకున్నదేదో, తిరిగి వున్మత్త వుద్రేక వృత్తాలుగా దేహాన్నీ, దేహం లోపల సమయపు నదుల మధ్య నింపాదిగా కదులుతున్న కలలనీ పిచ్చితనంతో , హింసాత్మక ప్రేమతో కత్తుల్లా గాయపరుస్తుంది.

సుదూరం లేదా దూరం (ప్రశ్న: దూరం అంటే ఏమిటి?)

సముద్రం నుంచి మేఘాల దాకా మేఘాల నుంచి సముద్రం దాకా భూమిపై నుంచి భూమి పొరల్లోని సున్నితమైన నదీ ప్రవాహాల్లా అచ్చు నాన్నాలా అమ్మలా, గోరింటాకు విచ్చుకున్న రక్తపు పత్తి పూవులా అరచేతంతా అలుముకున్నట్టు అర్థరాత్రి చీకటినొప్పిలో, నాదైన నాది కాని యీ దేహంలో: నువ్వు

నిశ్శబ్దంగా యుద్ధ భీభత్స తీవ్రతతో, వూహించీ వూహించలేనంతగా, వర్షపు చుక్కలు మట్టిని గాయపర్చిన తీవ్రతతో, అపస్మారకపు సాయంత్రం ఆకస్మికంగా నోరు నొక్కి గుండెల్లో దింపిన కత్తిమత్తు వాస్తవంతో, గోరువెచ్చని నీటిలాంటి రాత్రిపూట దేహం లోపలంతా నలుమూలలా నింపాదిగా ముళ్ళ రక్తపు ఙ్ఞాపకాలతో దిగబడే, లోతుగా విత్తనాల్లా నాటుకుని మొలుచుకువచ్చే: నువ్వు:

=ప్రశ్న రెండు= నువ్వు అంటే ఎవరు? వొట్టి ప్రతీకలు. నగిషీల భాషా ప్రతీకలు. సౌందర్యాత్మక భాష, సౌందర్యాత్మక హింస . హింసా సౌందర్యం. సౌందర్యపు హింస.

యిప్పుడే యిక్కడే వున్నంత సుదూర సమయాన, నాలుగు చినుకులు చూరు నుంచి జారి అంతదాకా కురిసి వెళ్ళిపోయిన వర్షాన్ని ఙ్ఞాపకం చేసినట్టు, ఒక వర్షాకాలపు తొలి గాలిరోజుల మధ్య నుంచి, అదే వర్షాకాలపు తొలి సజల రాత్రుళ్ళు మేఘాల మధ్య చిక్కుకుపోయిన చందమామను వెతుక్కుంటున్నట్టు ఒక దేహం గురించీ, దేహంలాంటి దిగులు కలల్నీ, వొదిలివేసి వెళ్ళిన కొడుకుల్ని మృత్యునయనాలతో ఆ వృద్ధుడు హింసాత్మక కరుణతో కంపిస్తూ గుడ్డిగా కళ్ళ వేళ్ళంచులతో గరుకుగా తడుముకూంటూ ఎదురు చూస్తున్నట్టు నేను నాకోసం ఎదురు చూస్తున్నప్పుడు చాలా మామూలుగా ఎదురుపడ్డ

నువ్వు.

I was simple
I was simpler then
It was smplicity
which seemed so sensual.

అవి పదాలన్నీ నువ్వే అయిన రోజులు. నువ్వే అయిన పదాలు అస్థిత్వాన్ని కమ్ముకున్న రోజులు. అవి గుసగుసల అమాయకత్వపు ధ్వనుల రోజులు. కనిపించనిదేదో కదలి, గడ్డి మృదువుగా రాత్రితో సన్నటి నీటి కోతలా వూగులాడినట్టు అనేకానేక సుధీర్ఘ నలుపు వర్షాల తర్వాత తిరిగి ప్రత్యక్షమయ్యే వ్యతిరేకాలు: పునరావృతమయ్యే పురాతన ప్రశ్నలు: subject and the other. అతడు అన్నాడు.

=other is the self=

అవి కొన్ని సమయాలు. అవి కొన్ని వ్యక్తిగత సమయాలు. దేహం లోపల నదులు అంచులదాకా ప్రవహించి, ఏమాత్రం కదలినా ఏ మాత్రం శబ్ధించినా దేహం జ్వలిస్తూ వొలికిపోయేంతగా నిండిపోయిన దేహపు అలల-యిద్దరిదీ అయిన – యిద్దరిదీ కాని వ్యక్తిగత పరిమళ కలల సమయాలు.

“నేనొక క్రిష్టియన్” ఆమె అంది. ”నీకు తెలుసా బైబిల్ లోని ఆమె కథనాన్ని గురించీ?” అతడు చిర్నవ్వుతో అడిగాడు. ఆరుబయట అశోక చెట్ల గాలులతో పాటు గాలిలా మారుతూ ఆమె చిర్నవ్వింది

దేహం . రహస్య దేహం. బహిర్గతమయ్యీ రహస్యంగా మిగిలిపోయే దేహం.

దేహం మారుతుంది. అశొక చెట్ల గుంపుగానూ, మేఘావృత వుద్యానవపు గులాబీల సందడిగానూ, సముద్ర తెరల నిండైన మెత్తటి పాదాల స్పర్శలగానూ, యింకా ప్రేమపూరితమైన పక్షుల కేరింతలగానూ లేదా సాయంత్రంపూట బేబీకేర్ సెంటరల నుంచి వడివడిగా పొర్లే పిల్లల హృదయాల్లానూ, విశ్వంగానూ సమయంగానూ సర్వరహితంగానూ దేహం మారుతుంది.

“body is a universe in itself” అతడు అన్నాడు.

నక్షత్రాల బిందువుల కింద, అరతెరచిన కిటికీ లోంచి సన్నగా పొగలా జొరపడుతున్న వెన్నెలలా వేకువ ఝామున వుండే నింపాది ఉన్మాద, చిక్కటి చీకటి రక్తంలాటి మంచూ, దేహం నలువైపులా వీడిపోయి మరొక దేహాన్ని ఊదారంగు సర్పంలా చుట్టుకొని మరలా అంతలోనే కరిగి పోయి, తరచూ తడిమే

ఎవరు ఎవరు?

ఆమె దేహం అతడి దేహమయ్యేంతవరకూ అతడి దేహం ఆమె దేహమయ్యేంత వరకూ కలగలిసిపోయి వ్యతిరేకార్థాలైన ఏక భాషలా మారిన పలవరింతల మత్తుసమయాలు.

” నన్ను హిందువని అంటారు కానీ మగ పందినని నా అనుమానం ” అతడు అన్నాడు.

ఒక రాత్రి పూట దేహాన్ని పూర్తిగా చూడాలనే వాంఛతొ దుస్తులను, పొలాల మధ్య కలుపు మొక్కలను ముక్కలు ముక్కలుగా చేసినట్టు, బంగారు రంగు ద్రావకపు వున్మాద మెరుపుల మధ్య తునాతునకలు చేసినప్పుడు, ఆ ముస్లిం ప్రియురాలు అంది: ” నేను రజస్వలను. మతపరంగా అపవిత్రను. వొద్దిప్పుడు, నిజంగా వొద్దిప్పుడు.”

అతడు చెప్పాడు: మనం నిజంగా మతాన్ని పునర్ నిర్వచించుకోవాలి. నిజంగా మనకు తెలియని, తెలిసీ తెలియని అస్పష్ట ఆకారపు రాముడ్నీ, జీసస్ నీ అల్లానూ. నీకు గుర్తుందా? అతడిలోని అతడు ప్రశ్నించాడు. ఆ తెల్లటి గులాబీపూల చందమామని నువ్వేమని పిలిచే వాడిని? తెరుచుకున్న తెరచాపల రెక్కల సుతిమెత్తని శబ్దాల కలకలమని కదా.

ఏదో వొకటి వుంటూనే వుంటుంది

నాకు తెలియని దుఃఖంనుంచి నీకు తెలిసిన భయ దుఃఖపూరితమైన నమాజ్ దాకా ఏదో ఒకటి వుంటూనే వుంటుంది. వెనక్కు వెడితే, దేహం లోపల వానపాముల్లా కదలాడే ఙ్ఞాపకాల వెంట నిశ్శబ్దశబ్దంగా మెలికలు తిరుగుతూ వెడితే, మొదటి రక్తస్పర్శపు ఎర్రగులాబీ పరిమళమా, మొదటి దేహంకోతలో నన్నుమృదువుగా యింకించుకున్నదానా, ఒకానొక మధ్యాహ్నంపూట నాకేమీ తెలియని, నాకు తెలిసీ తెలియని నీ దేహం లోపల నన్ను పిల్లల ఆటలలోని బొమ్మల్లా, మిఠాయి పొట్లంలా దాచుకున్నదానా

ఒకానొక రాత్రిపూట నువ్వు

జాబిలి మధ్యగా రక్తపుచారికలా పగిలితే, ఎవరూ లేని ఒంటరి వేసవి ఆకు అల్లాడని పనస ఆకుల రాత్రి మధ్య నేను ఒంటరిగా గాయపడితే, నా మొదటి అర్థంకాని చందమామా నువ్వు నా ఎదురుగా గాజుగ్లాసులోని సూర్యజలంలాంటి పాపలా తిరిగి వస్తే , నేనేం చేయను? నా చేతి వేలు నుంచి, నింపాదిగా జారిపడుతున్న రక్తంబొట్లలా నేనెవరో తెలియని ఙ్ఞాపకం మృదుమెత్తగా రాత్రిలా కదులాడుతుంటేనూ, నువ్వూ, పగటి మధ్యాహ్న సమయాలలోనూ కదులాడిన క్రైస్తవ బిడ్డ కూడా, గుండెలో యింకించుకున్న బాధలా ఎదురుపడితేనూ, యీ సముద్రమంతానూ, యీ పొంగిపోవడమంతానూ:

చాలా రోజుల క్రొతం పేరులేని, ‘నేను’లేని రోజుల క్రితం నాదయిన ‘నేను’ లేని వ్యక్తావ్యక్త రోజుల గాఢమైన అలల మధ్య నిశ్శబ్దశబ్దంగా తేలాను. తేలికగా, మోయలేనంత తేలిక బరువుగా కదలాడాను.

గది ఎదురుగా కూర్చుని ఎదురుగా కదలాడే మామిడాకుల బాషను అనువదించటం నైరాశ్యం. అదృశ్యంగా దేహాన్ని పలుకరించే గాలి వేళ్ళను కళ్ళతో స్పృశించటం నైరాశ్యం. అస్థిత్వమంతా కరిగిపోయి, ఒక చిన్ని నీటి చినుకులోకి యింకిపోయి వుండటం నైరాశ్యం. వైద్యులు దానిని ఖచ్చితంగా నైరశ్యమే అన్నారు.. మరి ,ఒక దాగుడుమూతల మత్తు రాత్రి మధ్య నువ్వేమన్నవు?”నువ్వెప్పుడూ ఎందుకంత దిగులుగా వుంటావు”...
____________________________________________________________________
29.08.2012. Couldn't load the full file. Those who are interested can read the whole text at http://blueofmoon.blogspot.in/2012/08/blog-post_5895.html

కె.కె॥కలుసుకో||


నింగి ఎత్తుని కొలవాలంటే,
నీటిచుక్కని కలుసుకో

మనిషి మూలం వెదకాలంటే,
మట్టిబెడ్డని కలుసుకో,

మౌనవేదన చదవాలంటే,
మనసు పొరలని కలుసుకో

నువ్వు ఎవరో తెలియాలంటే,
ఒక మంచి మిత్రుని కలుసుకో

కాంటేకార్ శ్రీకాంత్ ||మౌనం నా సంభాషణ||



మౌనం నా సంభాషణ
ఏకాంతం నా అన్వేషణ
నీవు చూసినప్పుడు చిరునవ్వయినా
బదులివ్వలేదని నొచ్చుకోకు..
అలా అర్థం కాకుండా ఉండటమే నా తత్వం
ఎన్నో సమయల్లో వ్యక్తం కాకపోవడమే నా నైజం

నామమాత్రమైన స్పందించనందుకు
నాలో ప్రేమలు లేవని అనుకోకు
సాగరమంతా ప్రేమను దాచుకొని కూడా
బయటపడకపోవడమే నా తీరు
గంభీరత నా లక్షణం
మగాడు నా పేరు

కఠినంగా.. కరుకుగా ఉండటమే
ఎన్నో కష్టాలను పంటి బిగువున భరించడమే
గుండె తడులను దాచుకొని
ఆవేశాన్ని ప్రదర్శించడమే
నాలో నాకు నిర్వచనం
అలాగే
కఠినుడిలా కనిపిస్తాను
కన్నీళ్లను దిగమింగుకొని
బాధను అణచుకొని
ఇతరులను అనునయిస్తాను
ఏ ఓదార్పూ ఆశించకుండా

హైమా రెడ్డి॥నాకు వద్దు నా కులం....!॥



ఒక వేళ నా రెక్కలు విరిచి నన్ను ఎగరకుండా చేస్తానంటే... నాకు వద్దు నా కులం...!
ఏమైనా పక్కవారిని ప్రేమించే దారి మూసుకుపోతుంటే.....నాకు వద్దు నా కులం....!

పరువులు పోతాయంటూ నా ఉనికినే సవాలు చేస్తుంటే....నాకు వద్దు నా కులం.....!
నీది గొప్ప వంశం అంటూ నాకు సంకెళ్ళు తగిలిస్తానంటే....నాకు వద్దు నా కులం.....!

హిపోక్రసి ముసుగులో జీవితాన్ని నటించమంటే....వామ్మో! నాకు వద్దు నా కులం...!
నన్ను నన్నుగా కాకుండా నా కులం తోకతోనే గుర్తిస్తానంటే...నాకు వద్దు నా కులం..!

మనిషిని మనిషిగా గుర్తించే మానవీయ కులం కావాలి నాకు....!
ఎదుటివారి బాధను తగ్గించగలిగే సేవా కులం కావాలి నాకు......!

తోటి జీవి పట్ల ప్రేమ చూపించగలిగే కరుణ కులం కావాలి నాకు...!
హృదయాన్ని తట్టి లేపే అనురాగపు కులం కావాలి నాకు.........!

పీచు శ్రీనివాస్ రెడ్డి ||అ క్ష రం||



ఉప్పు కారం లేకుంటే చప్పగానే ఉంటుంది పప్పు
కేవలం , ప్రాసతో పదానికి జీవం పోసిన కవిత్వంలా
భావాన్ని పెనవేసుకున్న అక్షరాలు కవితలా కురవాలి

అక్షరాలు నిలబడాలి
యుద్ధానికి సన్నిద్ధంగా
మనిషిని భయానికి గురిచేస్తున్న చీకట్లను
ప్రశ్నించేలా ...

భావం గర్జించాలి
మనిషిని మింగుతున్న నిరాశ నిస్పృహలను
తరిమేలా ...

భావం బ్రతికించాలి
ప్రతి నిత్యం మనిషి నర నరాన కర్మ జలాన్ని
నింపేలా ...

అక్షరం నిలబడాలి
తనకు తానే సంక్షోభంలో మునుగుతున్న మనిషికి
చేయూతనిచ్చేలా...

అక్షరం తలబడాలి
పళ్ళెంలో వేసుకున్న నాలుగు మెతుకులను
ఎత్తుకుపోయే ...
బలిసిన గద్దల రెక్కలను
నరికే కత్తిలా ...

అక్షరం కురవాలి
అక్కర కోసం అవకాశాన్ని అమ్ముకునే
స్వలాభ చింతనను
కడిగేసే జడివానలా...

అక్షరం వెలుగవ్వాలి
మనిషికి
ప్రకృతి ఇచ్చిన పచ్చదనాన్ని పక్కదోవ పట్టిస్తున్న
పగటి వేషగాళ్ళ స్వార్థపు నీడలను
బయటపెట్టేలా ...

అక్షరం.
దొరలై దోచుకుంటున్న దొంగల బాగోతాన్ని
కాల్చే మంటవ్వాలి...

అక్షరం నిలబడాలి కత్తిలా
అక్షరం నిలబడాలి అండలా
అక్షరం నిలబడాలి వెలుగులా

అక్షరం నిలబెట్టాలి
కవితను సమోన్నత స్థానం పైన
అక్షరం నిలబెట్టాలి
మనిషిని సర్వోన్నత శిఖరం పైన

31-08-2012

అన్వేషి || తన జ్ఞాపకం||


ఏ పేజీతో మొదలుపెట్టను..?
డైరీలో అన్ని పేజీలు
ఆశగా అడుగుతున్నాయి
మాతో అంటే మాతో
అంటూ పోటీపడుతున్నాయి..

తన పరిచయమైన తొలిక్షణాలతో
మొదలుపెట్టాలనిపిస్తోంది..కానీ
కొన్ని అపురూపమైన క్షణాలని
మనసులోనే దాచుకోవాలంటూ
కలం కదలనని మొరాయిస్తోంది..

తొలిసారి ఫోన్‌లో తనస్వరం వినగానే
ఆత్మీయంగా అనిపించింది..
ఆ స్వరానికి ఒక రూపాన్ని
ఇవ్వడం మొదలు పెట్టింది మనసు..

సేలయేటి పరుగులా మొదలైన
మాటల ప్రవాహం మరుక్షణమే
నదిలా ఉరకలు వేస్తోంది
సమయానికి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా..

క్షణాలు నిమిషాలై
గంటలలోకి మారుతూ
రోజులు తరబడి సాగిపోయాయి..
ఏమైందో ఏమో ఒక్కసారిగా
మూగబోయింది తన స్వరం ఒకానొక క్షణాన..

వసంతంలా మురిపించిన తాను
ఒక్కసారిగా మూగబోయింది శిశిరాన చెట్టుకొమ్మలా..
మనసు పదే పదే తన స్వరం వినాలనుకున్నా
మౌనం మాత్రమే సమాధానమై మనసు ముంగిట నిలిచింది..

ఒకనొక వర్షాకాలపు సాయంత్రమో,
లేదా వెన్నెలరాత్రుల జాగారమో...
మదిలో తన జ్ఞాపకం మరోసారి కదలాడుతుంది..
కనులలోకి ఒక కన్నీటిచుక్కకి ఆహ్వానం పలుకుతూ..

కదలాడిన భావాలని
కలంలో నింపుతున్నాను,
అదేంటో.. కలం కూడా
అక్షరాల కన్నీరు కారుస్తోంది..

నా జీవనపయనంలో తన పరిచయం
ఒదిగిపోయింది డైరీలో ఒక కాగితమై..
నిలిచిపోయింది మనసు పొరలలో ఒక జ్ఞాపకమై..

30-08-12

ఉదయ్ కుమార్ అలజంగి || విశ్వ ప్రేమ గానం ||



జడలు కట్టిన అహంకారం
నలుగురి మధ్య గోడలు కడుతుంటే

కుచించుకుపోతున్న నీ ప్రపంచం
నిన్ను ఒంటరిని చేస్తుంది

ఒక్కరొక్కరుగా నీ వాళ్ళనుకునేవాళ్ళు
మనసు చంపుకోలేక దూరమవుతుంటే

నీ గదిలో నీవు గొప్పగా భావించే హేతువందని
ఇనుపసంకెళ్ళు బందీను చేస్తాయి.

విను వీధిని చేధించిన నీ ధృష్టి
నీ గుమ్మాన్ని సైతం దాటలేక
సంకుచితమవుతుంది.

ఏకాంత జీవితం కాదది
బితుకు బితుకు మంటూ సాగే
ఓ ఒంటరి ప్రయాణం

ఆత్మ సంతృప్తి కాదది
నోరు మెదపలేక
నీ మూర్ఖత్వంతో వాదించలేక
నీ మనసు చేసుకునే ఆత్మవంచన

విశ్వజనీనమైన సర్వంతర్యామిని
సర్వత్రా దర్శించగలిగితే
అహం కర్పూరం లా కరిగి
ప్రతి జీవి లో పరమాత్మ దర్శనంలో లీనమవుతావు

నిన్ను నీవు అర్పించుకునే ఆ క్షణంలో
నేను అనే భావన శాశ్వతంగా అంతమై
అద్వితీయ సచ్చిదానందంలో ఓ భాగమవుతావు
విశ్వప్రేమ గానం లో తీయని రాగమవుతావు

క్రాంతి శ్రీనివాసరావు || ఉమ్మనీటి కన్నీరు ||



మమా మొగ మంత్ర గాడు
మందిరం లో కూర్చొని పొగబెడుతున్నాడు

చిటికెన వ్రేళ్ళకు లంకె పెట్టిస్తాడు
చిక్కంతా అక్కడేవుంది
ఆడపిల్లను తేడాగా చూడటం
అప్పుడే మొదలైంది

దేహమంతా సంతోషం పూస్తూ
మధురోహల తరంగాలు మదినుండి మొదలై
తనువంతా సరఫరా అవుతున్నప్పుడు

ఆశలజలపాతం ఆకాశం నుండి దూకి
అందంగా పైకి లేస్తున్నప్పుడు

స్వప్నానికీ సత్యానికీ తేడా తెలియకున్నప్పుడు
వేలకనుల కాంతులమద్య
మనసు వెలుతురవుతున్నప్పుడు

వళ్ళంతా
కేంద్రక సంలీనానికి సిద్దపడి
పరమవేగంతో పరుగెడుతున్న
పరమాణువులై పరవసించి
తనువిస్పోటనం చెందుతున్నప్పుడు

ఆతని చిటికెన వేలి కొస మనసుతీగలను
మనోజ్నంగా మీటుతున్నప్పుడు
ప్రవహించిన విద్యుత్ తేజం
వళ్ళంతా విరబూస్తుంటే

పెండ్లికిముందే చూలును నిర్ణయుస్తున్నారు
రహశ్య ఎజెండా గుట్టు చెప్పేద్దాం ఇప్పుడే
చిటికెన వ్రేళ్ళ సంబందం కొడుకుని కంటుందట
బొటన వ్రేళ్ళ బందమయుతే ఆడకూతిర్న్నిస్తుందట

మగస్వామ్యం జూలు విదిల్చి
భావదారిద్యం జడలు విప్పిందక్కడే
ఏడుకోట్ల మందిని మింగేసిందిప్పటికే

పురిటికిముందే ఉరితీయబడ్డ ఆడ పిండాలు
డ్రైనేజీల్లో మునిగి తేలుతున్నాయు

హక్కుల్లో సగబాగం వస్తుందో రాదో
మనుషుల్లో మీ శాతం తగ్గిందిప్పటికే

గర్భ స్రావము మీకే
ఆ గర్భ శోకమూ మీకే
ఇక ఉపేక్షిస్తే
జరుగుతున్న ఉత్పాతాన్ని ఆపలేరు
ఇప్పుడు తలదించితే
ఇక ఎప్పటికీ తల ఎత్తలేరు
*31.8.2012

గరిమెళ్ళ నాగేశ్వరరావు//ఆరోగది//



ఆరోగదిని తెరవొద్దు
దేశానికి.. అరిష్టం.

ఆరోపణలు చెయ్యొద్దు
ఆరోగ్యానికి.. నష్టం.
దరిద్రమొక దావానలం..
దాన్నలా.. తగలడనీ.
ధనమంతా దైవాధీనం
అదలా.. దాగుండనీ.
గనులు తవ్వితే ఏముంటుంది?
ఘనుల గదులు తవ్విచూడు
నవ్వుతూంటుంది.. ధనలక్ష్మి.
లాకర్లో ఇరుక్కుంటె లోకం
ఇంకెలా తీరుతుంది శోకం

పార్టీలను నడిపించే ‘‘పార్టీ’’ఏదో
దాచేసిందట..
చూపుడు వేలి చుక్క సూట్‌కేస్‌లో.
మందుపాతర లోపలి శక్తీ ‘మందే’నట.
సారా కాంట్రాక్టర్ స్పాన్సరింగ్‌లో
సాగుతుంది.. స్వామీజీ ప్రవచనం.
చర్లపల్లి జైలులో సాగుతూంటే అసెంబ్లీ
తీహార్‌లో పాసవుతుందేమో.. తీర్మానం.
లోకపాలకుల లోపలి గుండెల్లో
అదిగదిగో ఊగుతోంది కీలక లోలకం
న్యాయదేవతకి నేత్రదానం..
చేసొద్దాం.. పద.

అన్నాహజారే.. ఆపకు సత్యాగ్రహం
నల్లకోటు మీద తెల్లటోపీ వాలకముందే.
ఆకతాయెవడో.. ఆరోగది తెరిచేస్తాడట

అపరిష్టం.. ఆగుతుందా.. సాగుతుందా..
స్విస్ బ్యాంకు ముందు చిలక జాతకంలో..
అడగండీ ప్రశ్న- అర్జంటుగా.

31-8-2012

రాఖీ||కవిని నేను! ||


చిగురాకు నేను
చిరుగాలికే మైమరచేను

ఏకాకి నేను
చిరు స్పర్శకే పులకరించేను

అనాధను నేను
చిరునవ్వుకే పరవశమౌతాను

బీడు భూమి నేను
చిట్టి చినుకుకే అనందం తట్టుకోలేను

ఎండిన మోడు నేను
ఆమని కై అర్రులు చాస్తాను

ఎడారి బాటసారి నేను
ఒయాసిసుకై పరితపించి పోతాను

పసి వాణ్ణి నేను
చేర దీస్తే ఆశగా చేతులు సాచేను

చకోరి నేను
జాబిలికై జాలిగ చూస్తాను

కవిని నేను
కాసింత ప్రశంస కే ఉత్తుంగ తరంగమై ఉప్పొంగుతాను

ఏమిచ్చుకోను అభిమానులందరికీ
శిరసు వంచి నేను సదా అభివాదమంటాను
30-08-2012

స్కైబాబ||లొంగని వీరుడికి సలాం!||


ఒక్కో భూమ్మీద
ఒక్కో పేరుతో పుట్టుకొస్తుంటాడు
లొంగనితనం వీరుడి మాతృక

తన నేలను ఖబ్జా చేస్తూ
తన నాలుకనే తెగ్గోస్తున్న వాడికి
చివరి శ్వాస దాకా లొంగనితనం
వీరుడి పోరాట రూపమే....

నీళ్ళను కొల్లగొట్టి-
ఆకుపచ్చదనాన్ని కొల్లగొట్టి
బీళ్ళు చెయ్యజూస్తుండు శత్రువు
పెట్రోలును కొల్లగొట్టి-
సకల జీవత్వాన్ని కొల్లగొట్టి
ఎడారులే చెయ్యజూస్తున్నడు శత్రువు
వీరుడన్నవాడు సై అంటాడా
వీరుడన్నవాడు ఖామోష్‌గుంటాడా
ఖబర్దార్‌ అంటూ గుండెల్లోంచి కేక వేస్తాడు
భూమి తల్లికోసం బలిదానమవుతాడు
ఇరాకీ పిల్లవాడి తెగిన కలల రెక్కలు చూసి
చలించకుండా ఎవడుండగలడు?
వేల ఒక జాతి జనాన్ని
సమాధి చేయడం చూసి
రగలకుండా ఎవడుండగలడు?
ప్రపంచపటంమీద ఒక జాతి వతన్‌నే
మాయం చేయాలనే కుట్రను చూసి
ఎవడు భరించగలడు?
రేపు మరొక దేశం
ఖబ్రస్తాన్‌ అవబోతుండడం చూసి
ఊకుండగలడా?
చుట్టూరా చేతులు కట్టుకొని చూస్తున్న
దునియా
ఘడియకో మాటమార్చే దునియా
సిగ్గూ శరం లేకుండా
సాష్టాంగపడే దునియా
లొంగని వీరుడిముందు బలాదూర్‌
వీరుడెప్పుడూ నిజం మీదే నిలబడతాడు
వెన్నెముకే ఆయుధంగా కలబడతాడు
శాంతికోసమే ఆయుధం పడతాడు
ఓడిపోవచ్చు
కాని లొంగిపోడు
ఒక్కో భూమ్మీద ఒక్కో పేరుతో పుట్టుకొస్తుంటాడు
లొంగనితనం వీరుడి చిరునామా

వీరుడు బరిసెనో బాణాన్నో పట్టినప్పుడు
తెల్లోడు బందుఖుతో వచ్చాడు
వీరుడు బందూఖు పట్టినప్పుడు
తెల్లోడు బాంబు లేశాడు
వీరుడు బాంబులేద్దామంటే
తెల్లోడు మిసైళ్ళు ప్రయోగిస్తున్నాడు
శత్రువు గెలవొచ్చు
జనంలో వీరుడే నిలుస్తాడు
ఒక్కో భూమ్మీద ఒక్కో పేరుతో పుట్టుకొస్తుంటాడు
లొంగి బతకడం వీరుడి నైజం కాదు

రాళ్ళను పగులగొట్టే వాళ్ళల్లోంచి
ఇనుమును కరగదీసే వాళ్ళల్లోంచి
నీళ్ళను మండించే వాళ్ళల్లోంచి
ఒక్కో వీరుడు పుట్టుకొస్తూనే ఉంటాడు
ఒక్కో చోట ఒక్కో పోరాట రూపం తీసుకుంటాడు
శత్రువు బలవంతుడే కావచ్చు
జిత్తుల మారోడే కావచ్చు
నిజం వీరుడి చేతిలోనే ఆయుధంగా నిలుస్తుంది
నిజం వీరుడి చేతిలోనే ఆయుధమై మెరుస్తుంది
చివరి మాట దాకా
నిజమే వీరుడి నోట పలుకుతుంది
'సామ్రాజ్యవాదం డౌన్‌ డౌన్‌! అమెరికా డౌన్‌ డౌన్‌!'

జడ పదార్ధాలకు
రాజుకునే గుణాన్నిచ్చే ఉత్ప్రేరకం
నిశ్చల నరాల్లోకి
వెచ్చని ఊపిర్లూదే ప్రాణవాయువు
లోకమంతా పాకుతున్న
లొంగిపొయ్యే వైరస్‌ను నిలువరించే రెసిస్టెన్స్‌
ఒక్కో భూమ్మీద
ఒక్కో పేరుతో పుట్టుకొస్తుంటాడు
ఉరకలెత్తే ఉడుకురక్తాల ఆత్మల్లోకి ప్రవేశిస్తుంటాడు

ఇజ్రాయెల్‌ యుద్ధట్యాంకుపై రాయి విసిరే బాలుడో
తెల్ల రక్కసి మూక మధ్య పేలే మానవబాంబో
స్వేచ్చను కోరే కశ్మీరీ గొంతుకో
నిజమైన పౌరసత్వం కోసం నినదించే భారత ముస్లిమో
ఒక్కో భూమ్మీద ఒక్కో పేరుతో పుట్టుకొస్తుంటాడు
ఒక్కో చోట ఒక్కో రూపంలో ప్రతిఘటన
ఒక్కో స్థాయిలో పోరాటం
పోరాటం ఎక్కడైనా పోరాటమే కదా
దురాక్రమణ ఎవడు చేసినా దుర్మార్గమే కదా
వీరుడు పోరాడుతున్న భూమి
ఎకరమో...రాష్ట్రమో... దేశమో...
నాటి బందగీకి సలాం
నేటి తెలంగాణ పోరుబిడ్డకి సలాం
ఆజాదీ వీరుడికి సలాం
పాలస్తీనా చిరునవ్వు అరాఫత్‌కి సలాం
ఇరాకీ గర్జన సద్దాంకి సలాం
చేగువేరా కి సలామ్! ఒమర్ మొఖ్తార్ కి సలామ్!!
భూమికోసం పోరాడుతున్న వీరుడికి సలాం!
మాతృభూమి కోసం పోరాడుతున్న వీరుడికి సలాం!

(నేటి తెలంగాణ ఉద్యమానికి.. ఉద్యమంలో అసువులు బాసిన తెలంగాణ బిడ్డలకు..)