వేసానండి మొత్తానికి మూడు ముళ్ళు
అమ్మ కళ్ళల్లో ఆనందం
బిడ్డ ఓ ఇంటివాడయ్యాడని..!
తాళి కట్టిన నా ఇంతి కళ్ళల్లో ఆనందం
నాకో తోడూ దొరికిందని,
ఎంత దాయాలన్న దాగని నా కనురెప్పలపై గర్వం
నచ్చిన చిన్నది అలైనందుకు
నాకంటూ ఒకరు
మనసు పంచుకునే తోడూ దొరికినందుకు ..!
పేరు పెట్టి పిలుస్తోందిరా నీ పెళ్ళాం నిన్ను
నలుగురు వింటే ఏమవ్తుంది మన గౌరవం
అంటూ కోపంగా అమ్మ ,
నిన్నే అత్తయ్య చెప్పింది
పేరుపెట్టి పిలవకోడదంట
ఈ కాలపు ఆడదాన్ని
పాతచింతకాయ్ పచ్చడిని కానంటూ పెదవి విరుస్తూ తను
మధ్య నలుగుతూ నేను ..!
జీతం వచ్చిన మొదటి రోజు
మూరమల్లెలతో పడగ్గదిలోకి వడివడిగా నేను
వయ్యారం ఒలకబోస్తూ సింగారపు చీరకట్టి
నా కోసం తను..!
ఇంతకాలం మాటేమోగాని
మిమ్మల్నే నమ్మి మీ వెంట వచ్చినందుకు
జీతమంతా నాకే కావాలంటూ చెవిలోసన్నగా ...!
మనసులోనే నవ్వుకున్నా
అమ్మ కడుపు చూస్తే ఆలి జేబు చూస్తుందని..!
భాద్యతలంటే
బంధాలతో కూడిన అనుబంధాల ముడులే కదా
నా కోసం వచ్చిన తనకోసం
నా కోసమే బ్రతుకుతున్న అమ్మకి చెప్పగలనా ఈ నిజం...!
దుప్పడి కప్పుతూ నేను , జీతం లెక్కల్లో తను ... 26-10-12