పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Varnalekha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Varnalekha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, ఆగస్టు 2012, మంగళవారం

వర్ణలేఖ ||అంతులేని ప్రశ్నలు ||

ఎదగాలని ఉవ్వెత్తున
ఎగసినప్పుడల్లా

నీవు నను నిలువరిస్తూ
నాతోనే ఉంటావు పంచభూతాల్లా....

నీవులేంది నిలువలేను
నీవుంటే ఎదగలేను

గాలిలా వచ్చి
నా గమ్యాన్ని మారుస్తావు

వానవై తాకి
నా కలలను కరిగించేస్తావు

అగ్నివై నాలోని
ఆశలు ఆవిరి చేస్తావు

ఆకాశంలా మారి
నను చిన్నదాన్ని చేస్తావు

ఎంతకి నేనొదగకపోతే

భూమివై నను
నీలో కప్పెట్టేస్తావు

*** *** *** ***

ఎదగమనేదీ నీవే
ఎదురు నిలిచేదీ నీవే

వేటాడ నేర్పుతన్నవు
నన్నే వేటాడుతున్నవు

విమర్శ పేరుజెప్పి
విదిలించి కొడతావు

సలహాల పేరుజెప్పి
సచ్చుపడవేస్తావు

పాలుబోస్తె పంతవు
లేదంటె కాటేస్తవు

నేనెట్ట ఆడేది
నేనెట్ట పాడేది

నేనెట్ట ఎదిగేది
నిన్నెట్ట గెలిచేది

28-8-2012

వర్ణలేఖ || స్పందన ||


నిన్నెప్పుడూ
మనసులో నుండి
తోసేస్తూ నేను
నన్నేప్పుడూ
నీలొనే
భద్రపర్చుకుంటూ నీవు

ఎప్పుడూ నేనేనా
నీవెప్పుడూ చెప్పవా
అనే నీ బుంగమూతి
నే స్పందించనని
నీవలిగితే
నే నవ్వినపుడు

ఈ స్పందనే
నాక్కావాలని
సంతోషపడతావు
నాకో చంటిపిల్లాడు
దొరికాడని
నేనింకా నవ్వుకోవడం
నీవేమో ముత్యాలేరుకోవడం

27-8-2012

22, ఆగస్టు 2012, బుధవారం

వర్ణలేఖ || కొన్ని వాన చినుకులు ||



నీ మాటలన్నీ మధువులే
మత్తులో తేలుతూ నేను

నాతో వస్తావా
నీ జీవితానికి రంగులద్దుతాను

నీ నుండి జారిపోతున్నా
నీ మనసు నవనీతం కదూ

నీలో నన్ను వెతకడం
ఎండమావిలో నీటిని వెతకడమే

ఎన్ని ఆశల పందిళ్ళు
నీ కోపాగ్నికి దహించుకుపోతున్నాయో

నా వ్యసనం
నీ మీద వ్యామోహమే

నీ ఊహతో వచ్చిన రెక్కలు
నిను చూడగానే మాయమవుతున్నాయి

నేను అలనైన ప్రతిసారీ
నీవు తీరమై ఆపుతూనే ఉన్నావు

సడికావొద్దంటే ఎలా
నా కాళ్ళకి మువ్వలుపెట్టి

నీ నిర్దయలాగే
ఈ రాత్రి కొనసాగుతూవుంది

మనసు మసిబారిందని
చిరునవ్వురంగేసా పెదవులకి

నా అస్తిత్వాన్ని నిర్మించుకోనీ
నీ ప్రేమకు లోటు చేయను

సీతాకోక చిలుకనని
రంగులే చూస్తారు, మరి మనసు?

మూడు ముల్లేస్తారు
అమ్మాయి నోటికి మనసుకి ప్రగతికి

స్త్రీ ఓ ద్రావణం
పాత్రనిబట్టి రూపు మార్చుకుంటుంది

ఇంకా బెంగ తీరనేలేదు
బాల్యం నుండి నేను వలస వచ్చాను 
*21.8.2012

21, ఆగస్టు 2012, మంగళవారం

వర్ణలేఖ || ఒకే నాణెం ||


నాకేందే
నేను మస్తుగున్న
పెళ్ళాం ఇద్దరు పిల్లలు
బిందాసుంది లైపు

పొద్దంత పత్తర్ఘట్ల
పంజేస్త పొద్మూకి
ఇంత మందు బిర్యానీ

నెలకి మూడువేలు
నా పెళ్ళానికిస్తా
ఇల్లంత తనేజూస్కుంటది
మనకేం టెన్షన్లేవ్
పిల్లలు మంచిగజద్వుతుర్రు
ఇంకేంగావల్నే

*** *** *** *** ***

ఏంజెప్పనన్నా
మా కష్టాలు
నా మొగుడిచ్చే
మూడువేలు కిరాయికి
పిల్లల తిండికేసాల్తలేవు

ఆళ్ళ ఫీజులేమాయే
బట్టలు పుస్తకాలు
యెట్టెల్తాయో జెర్రజెప్పు
రోజు పూలల్తున్న
మిషినిగుడ్తున్న
నేను పంజేయంగ
నెలకింత యేన్నన్న
బదుల్దెస్త
మా బాడల జరాలు
పిలిస్తెవల్కుతయ్
దవ్కాన్లు మందులు

ఆయ్నకెన్నడు
ఎదురడ్గొద్దనే
నా కాడుపుగట్కొని
కట్టుకున్నోన్ని
ఎనకేసుకొస్తున్న
పాపం ఆడుమాత్రం
ఏంజేస్తడు
ఐనకాడికి కస్టవడ్తుండు

మల్ల మా ఆయనకు
జెప్పకుర్రి నేను
పంజేస్తున్నా అంటే
బాదవడ్తడు

వర్ణలేఖ - 20Aug12

19, ఆగస్టు 2012, ఆదివారం

వర్ణలేఖ || నీరింకిన బావి ||


పాడుబడ్డ బాయిల
దిగుతున్నట్టే ఉంది
అత్తగారింటికివోతుంటే
అండ్లకుదోలేదాక
మేమున్నమన్నరు
అన్నలందరు
దిగినంక ఇంగ
నీ బతుకునీదనిరి

ఎట్లీదాలోదెల్వక
కొట్టుకుంటుంటే
కప్పలర్వవట్టె
అవి నా సుట్టాలంట
సంసారం సంద్రమన్నరు
అదైతే ఈదుకుంటనన్నా
ఇంకోదిక్కుకువోదు
ఈడ ఊపిరాడక సస్తున్న

బాయన్న పేరేగానీ
నీరింకె ఇంకేముంది
నా ఆశలన్నీ
వలలవడ్డ
చేపలాయె

*18-08-2012

17, ఆగస్టు 2012, శుక్రవారం

9, ఆగస్టు 2012, గురువారం

వర్ణలేఖ || అబద్దపు గోడల్లో ||


నేనూ నీతో
ఉన్నాననుకుంటున్నావు

కాని నీవు నన్ను
నన్నులా చూడనప్పుడు
నేనీతోనే ఉన్నా
నా మనసు నను విడిచి
పరిగెడుతుంది

ఈ గల్లి ఆ గల్లి దాటి
ఊరిబయట
బస్సెక్కి, రైలెక్కి
మద్యలో దిగి

కొండల్లో సంచరిస్తూ
నెమళ్ళ నాట్యానికి
పరవశిస్తూ
కుందేలు పరుగులో
లేడిపిల్ల గెంతుల్లో
చురుకుదనం
అరువు తీస్కొని
కొండ బంతిపూల
వాసన చూస్తూ

పురాతన బావిలో
మునకలేసి ఇది
ఇంకా సజీవంగానే
ఉంది దాని సొంత
అస్థిత్వం వల్లనా
అని ఆశ్చర్యపోతూ

మళ్ళీ అడవిబాటపట్టి
చెంచుల చుంచు బట్టలు
చూసి నేను
బాగానే ఉన్నాననుకుని
చెట్టెక్కి వడ్రంగి
పిట్టతో ముచ్చటెట్టి
అడవిపూల పరిమళానికి

ఆకలి దంచేస్తే
దుంపలతో పొట్టనింపుకుని
చింత చెట్టుకింద
చిరు కునుకుదీసాక
ఎత్తైన శికరమెక్కి
ఆవలివైపు దిగి
అచ్చెరువొందించే
జలపాతంలో
జలకాలాడి
చేపపిల్లలా ఈది

సముద్రంలోపడి
ఆల్చిప్పల్లో
ముత్యాలేరుకున్నా
కాని ఇవి నాకెందుకని
సాగరానికే వదిలి
ఆవలి తీరం చేరా

గడ్డకట్టుకుపోతున్న
నీటి అంచుల్లో
మంచుతో నిండిన
కొండచరియల్లో
మనుషులెవరూ లేరని
నిర్దారించుకుని
వెక్కి వెక్కి ఏడ్చి

ఒకే ఉదుటున మళ్ళీ
నీ కళ్ళముందుకొచ్చి పడ్డా
కన్నీటి జాడను వెతికా
అది అక్కడే
గడ్డకట్టుకుపోయిందని
చాలా సంతోషించా

నీతో మామూలుగా
మసులుతూనే
నా మనో విహారపు
తీపి జ్ఞాపకాలను
నెమరెసుకుంటూ
అస్థిత్వం లేకున్నా
ఆనందాన్ని
నిర్మించుకుంటున్నా
అబద్దపు గోడల్లో

* 8Aug12

4, ఆగస్టు 2012, శనివారం

వర్ణలేఖ కవిత

శాటల శెనిగెలువోశి
శెరుగుతుంటే
శకుంతల
శేరు బియ్యం
బదులడగవట్టె

పోరలకి
గంజినీళ్ళక్కూడ
దిక్కులేదనే
పొద్దున
శెనిగశేను
ఏరవోయిన

రెండు శేర్ల
శెనిగలిచ్చిర్రు
షావుకార్కాడికివొయ్యి
బియ్యంబెట్టమన్న
ఊరంత శెనిగలే ఇత్తే
నేనేంజేసుకోననే

ఇయ్యాల
పిల్లలాకలి
మాయంజేయనీకె
శెనిగలేంచి
పెడదామని
శెరుగుతున్న

అడిగినోళ్ళకి
లేదనేశెయ్యిగాకపాయే
దాని బిడ్డల
ఆకలిజూశి
శెరిన్ని శెనిగెలే
పంచుకున్నం
శకుంతల నేను.
*3.8.2012

31, జులై 2012, మంగళవారం

వర్ణలేఖ కవిత

నన్ను
ఆవహించి ఉండే
ఆనందం, ఫోనులో
ఆఖరి మాటతో
ఆవిరైపోయింది

అమ్మా
మన అమ్మను
కాపాడుతానని
పోయావుగానీ
ఈ అమ్మకు
పుట్టెడు శోకం
పంపిపోతావని
అనుకోలేదు

చితి మీద
చిరునవ్వుతో
నీవు వీరుడిలా
పడుకుంటే
నిన్ను ఆర్మీకి
పంపిన నాటి
నా దైర్యం కోసం
వెతుకుతున్నా

సేవజేయబోతే
గొప్పొడివంకున్నా
దేశం కోసం
దేహం విడిచి
అమ్మకే అందనంత
గొప్పొడివయ్యావు

నన్ను ఆవహించి ఉండే
ఆనందం
నీ ఆఖరి వీడ్కోలు
దగ్గరే దహించుకుపోయింది

దైర్యం నటించినా
దైన్యం ఎవరూ
గమనించకుండా
జాగ్రత్తపడ్డా
నీకు జోహార్లు
తెలుపుతూ
*31-07-2012

వర్ణలేఖ కవిత

ఇల్లాలు చితికెక్కితే 
చింతిస్తారు, పని ఎవడుజేస్తడ్రా అని 

28, జులై 2012, శనివారం

వర్ణలేఖ కవిత


నీవలా నావలా 
నడిచొస్తుంటే
నే నిను
అలా అలలా
తాకుతుంటే
నీవెన్ని అలలను
ఎదుర్కొన్నావో
నావన్నీ కలలేనని
కనుమరుగయ్యా
నీ నుండి నురగలా 
*28-07-2012

27, జులై 2012, శుక్రవారం

వర్ణలేఖ కవిత


నీవలా నావలా
నడిచొస్తుంటే
నే నిను
అలా అలలా
తాకుతుంటే
నీవెన్ని అలలను
ఎదుర్కొన్నావో
నావన్నీ కలలేనని
కనుమరుగయ్యా
నీ నుండి నురగలా

వర్ణలేఖ - 

*27.7.2012

24, జులై 2012, మంగళవారం

వర్ణలేఖ

నేనక్కడే ఉన్నా
నీ నవ్వుల్లో ముత్యాలేరుతూ

నీవు రావని
నిదుర అలకపూనెను

ఊహల్లో జీవిస్తున్నా
జీవితంలో నటిస్తూ నేనే

నీవు అందకపోతే
అందని ద్రాక్ష అనుకోలేను

నీ జ్ఞాపకాల తోటలో
పూలున్నయి ముళ్ళున్నాయి 
*24.7.2012

21, జులై 2012, శనివారం

వర్ణలేఖ || మనసు బొమ్మ ||

మా తాత
తగిలించిన
గోడ మీది బొమ్మ

మా మనసులకి
గొలుసులేసి
లాగే బొమ్మ

మా అమ్మ
రాక మునుపే
వేలాడుతున్న బొమ్మ

మా మేనత్త
మారాం చేస్తే
కొన్న బొమ్మ

తుమ్మలపల్లి
జాతర గురుతు
ఆ బొమ్మ

నార తాళ్ళతో
అందమైన
అల్లిన బొమ్మ

సాదా రంగునద్దినా
సొగసులు
విరజిమ్మే బొమ్మ

మేం అన్నం
తినడానికి
అమ్మ చూపే బొమ్మ

అపురూపంగ
ఆడుకున్న
జ్ఞాపకపు బొమ్మ

మా మనసులకి
గొలుసులేసి
లాగే బొమ్మ

*20-07-2012

19, జులై 2012, గురువారం

వర్ణలేఖ కవిత

వానొస్తే
నువ్వొచ్చినట్టే
కారు మబ్బులు
కమ్ముతుంటనే
నీ జ్ఞాపకాలు
నా మదిలో
కారుతుంటవి

నేనేఇంట్లవున్నా
గండిగూట్ల నుండి
చినుకువై నను తాకుతవ్
నిను ముట్టుకోని
నా చేతిని అపురూపంగ
నేజూస్తుంటే

ఇంటెనకనుండి
అమ్మ అరుపు
నీవు నన్ను చేరకుండా
వాటిని కప్పిరమ్మని
విసుక్కుంటూనే
నీవు నన్ను చేరే
మార్గాలు మూద్దామని

గుమ్మమ్ముందో
నిచ్చెనేసుకుని
పైకెక్కుతున్నా
నీవలా నన్ను
నిలువరిస్తుంటే
నేనీలో చేరడానికి
ఎగబాకుతున్నా
నిచ్చెన మీద

నా కాళ్ళల్లజేరిన
మట్టిని నీవు
సుతారంగ కదిగేస్తావు
మిద్దెమీద.
మినుకు మినుకున
నడుస్తా నిన్ను
ఒదలబుద్దిగాక
అమ్మకుదెల్వదు
నేనొచ్చేది నీలో
తడవడానికని

నా గదిలోకి రాకుండ
మూతవెట్టినగాని
నా మదిలోకి రాకుండ
ఏంజేయాలని ఆలోచిస్తా
తలదూడుస్కుంట

చూరుకుజేరిన
నీళ్ళసుక్కల్ని
లెక్కజేస్తున్నా
నువ్వొచ్చినంక
ముట్టజెప్పొద్దు
ముచ్చట్లన్నీ

వర్ణలేఖ
*17-07-2012

17, జులై 2012, మంగళవారం

వర్ణలేఖ కవిత

షావుకారు కాడ
అప్పుదీర్సనీకె
కూలికివెడ్తే కొడుకుని
వడ్డికే సాలలే
వచ్చిన పైసలు

ఒల్సవోయిన కొడుకు
వచ్చిజూస్తడని
ఒత్తులేసుకున్న
కండ్లల్ల

పానంబోవట్టెగాని
పోరడు రాడు
ఊల్లనే వుంటె
కలో గంజో
కల్షేదాగుతుండె

దస్రకి దండంబెట్టనీకె
ఒస్తనన్నోడు
దీపాలెల్లినా
దిక్కులేడు

నా కట్టెగాలేనాటికన్నా
ఆని ఆప్పుదీర్తె
బాగుండు, నా కొడుకు
ముందల నడుస్తడని
నిమ్మలంగ
కళ్ళుమూయనీకె

వర్ణలేఖ
*16-07-2012

7, జులై 2012, శనివారం

వర్ణలేఖ - కవిత

మనసు ముందుకొస్తావే
పైర గాలికి ఊగే
ముంగురుల్లా
మాటి మాటికి
మనసు ముందుకొస్తావే
ఎంత దాచినా దాగవు

గాలికి ఊగి ఊగి
ఊరుకుంటావంకున్నా
నీవొచ్చిపోయిన
గురుతులూ
వదిలిపోయావే
చిందర వందర
చిక్కులు మనసుకి....

ఎన్ని ముడులని విప్పను
అందులో చిక్కుకున్న
నీ జ్ఞాపకలెక్కడ
జారిపోతాయోనని
జాగ్రత్తపడడం
నావంతయింది..
*6.7.2012.

వర్ణలేఖ - కవిత

అడుగుతావేం
అందివ్వలేనని తెలిసీ
అడుగుతావేం

నా పిలుపుతో
పరవశిస్తావు

నా మౌనంతో
రోధిస్తావు

నా నవ్వుతో
పులకరిస్తావు

నా నిస్సహాయతతో
నీరసిస్తావు

దరిచేరలేనని తెలిసీ
దగ్గరకొస్తావేం 
*7.7.2012