ఇప్పుడిప్పుడే తల ఎత్తి నిలబడే
నా ప్రయత్నాన్ని హత్య చేసేందుకు నీ కుతంత్రం...
నీ ముందు తలపాగా చుట్టి
నిలబడినందుకు నా గుండెల్లో బల్లెం పోటు...
నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసినందుకు
నా కంట్లో కారం చల్లి కనుగుడ్డు పెరికించావు...
నీవాక్రమించుకున్న నేలలో జానెడు జాగాలో
దుక్కి దున్నినందుకు నా గొంతులో గునపం పోటు...
బానిస బతుకు వద్దనుకుని గట్టిగా
ఓ అడుగు ముందుకు వేసినందుకు నా కాళ్ళపై రోకలి పోటు...
నీ ముందు తెల్లని చొక్క తొడిగినందుకు
నా చర్మమంతా ఒలిచి రక్తం పులుముకున్నావు....
పచ్చని చీర కట్టిన నేరానికి
నా ఆలి ముఖంపై నీ ముళ్ళ పాదం ముద్ర....
మా వాటా మాకు కావాలన్నందుకు
నీ కళ్ళలో నిప్పులు పోసుకొని మా బతుకులార్పజూసావు...
తరాలుగా మా ప్రశ్నలకు బదులివ్వలేక
కారంచేడు చుండూరు పదిరికుప్పం వేంపెంట లక్ష్మీపేటలు...
యిలా శ్మశానాలు సృష్టిస్తూ భయపెట్టాలని చూస్తున్నావు!
అయినా సరే ప్రతిసారీ మేము లేచి నిలబడుతూనే వుంటాం...
(లక్ష్మీపేట దళిత మృత వీరుల స్మృతిలో)
*13-08-2012