పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Srinivas Reddy Peechu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Srinivas Reddy Peechu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, నవంబర్ 2012, గురువారం

పీచు శ్రీనివాస్ రెడ్డి || బంగారు తల్లి || 29-10-2012


ప్రేమగా పరిగెత్తుకుంటూ వచ్చి
ఒక్క సారిగా అలా ఆగి పోయింది అక్షరం
కౌగిట్లోకి తీసుకొని ముద్దాడితే కరిగి ముద్దయ్యింది

దానికి నేనొకప్పుడు తాతను
ఇప్పుడు మనవన్ని
దానికి నేనొకప్పుడు తండ్రిని
ఇప్పుడు ముద్దుల కొడుకును
మొత్తానికి నా తల్లి
ఇప్పుడు నా చంటి తల్లి

బంగారు తల్లి బెంగ పెట్టుకుంది
ముద్ద ముట్టదు
మెతుకు మింగదు
తన మీద ప్రేమ కరువవుతోందని

బుజ్జగించేదేలా బిడ్డని
తల్లి మనసు నాకున్నా
తల్లి లేని బిడ్డలా నా చిట్టి తల్లి
తల్లడిల్లి పోతోంది

22, అక్టోబర్ 2012, సోమవారం

పీచు శ్రీనివాస్ రెడ్డి || ప్రవాహం ||


మెదడు మొద్దు నిద్దుర పోతే 
మనసు మౌనంగా ఉంటే
మనిషి ప్రవహించడు

బురద గుంటగా మారతాడు
పరాన్న జీవులకు ఆశ్రయమిచ్చి తను ప్రశ్నార్థకం అవుతాడు

కదిలే ప్రవాహంలో కాలుష్యం బ్రతుకుతుందా
ఇసుక రాళ్ళు కొరికి చంపేస్తాయి
సర్వ సన్నిద్దుడై శ్రమిస్తే అపజయము౦టుందా

మెదడులో
ఆలోచనల విత్తనాలు చల్లి చూడు
మనసుకు
చీకటిని ప్రశ్నించే అక్షర గళాన్ని తొడిగి చూడు

నిశ్శబ్దపు బెదిరింపులకు
అబద్ధపు ఉరుములకు
నిజం భయపడదెప్పుడు
కపటపు రంగుల ముసుగును కడిగేస్తుంది
తన జడి వానలో

నువ్వు లేని నాడు
కనిపించగలిగితే
నువ్వు లేని నాడు
వినిపించగలిగితే
నువ్వొక ప్రవాహమే

పారే ప్రవాహం పచ్చదనానికి విత్తనాలు నాటుతుంది
జీవాన్ని సర్వ వ్యాప్తం చేస్తుంది

మనిషి ప్రవాహమౌతే
మౌనాన్ని చీల్చే పోరాటం అవుతాడు
చీకటిని కాల్చే వెల్గుల రాజవుతాడు










09-10-2012

పీచు శ్రీనివాస్ రెడ్డి || నా కలం ||


నేను 
ఎన్ని అక్షరాల ఇటుకలను పేర్చాలో
ఎన్ని అక్షరాల సుమాలను అల్లాలో

ఎన్ని ఘటనల భావాన్ని పంచాలో
ఎన్ని టన్నుల భారాన్ని మోయాలో
ఓ కవితని రాయాలంటే

నన్ను తనలో నింపుకున్న ' నా కలానికి ' ఎంత ఆరాటమో
దానికెప్పుడు అక్షరాల ఆకలే
దానికెప్పుడు కవితా దాహమే
దాని ఆకలి , ఆకలి తీర్చడమే
దాని దాహం , దాహం తీర్చడమే

ఊహా లోకంలో విహరిస్తుంటే ఎదుటే వచ్చి వాలుతుంది
ఎన్నో బ్రతుకుల ఆరాటాలు
ఎలా శ్వాసిస్తున్నాయో చూడమంటోంది
ఎన్నో బ్రతుకుల పోరాటాలు
ఎలా గాయ పడ్డాయో రాయమంటోంది

అక్షరాలకు తను ప్రాణం పోస్తుందట
భావం నన్ను పంచమంది










16-10-2012

29, సెప్టెంబర్ 2012, శనివారం

పీచు శ్రీనివాస్ రెడ్డి || పార్టీ వార్తలు


ఒద్దికగా ఒదిగి
ఆకాశమంత ఎదిగి
ఆయుధమై కదిలే అక్షరాన్ని
రాజకీయ పక్షపాతం
కబ్జా చేసుకుంటోంది

అక్షరాలు సిగ్గు పడుతున్నాయి
అసత్య వార్తల్లో
తమకు అంగీ లాగు తొడిగినందుకు

ప్రతిపక్షానికొకటి
మిత్రపక్షానికొకటి
అధికారపక్షానికొకటి
ప్రజాపక్షానికే
దినపత్రిక కరువయ్యింది

ఎవడి పత్రికల్లో వాడు
గొప్పగానే కనిపిస్తున్నాడు
ఎవడి ఛానల్లో వాడు
మేమే గొప్పని
అరుపులు పెడబొబ్బలు

ఇది
శబ్దం నోరు పారేసుకుంటున్న
మహానగరం
ఇక్కడ
గట్టిగా నోరున్న వాడిదే రాజ్యం

అక్షరానికి పక్షపాతం పులుముతున్న
పత్రికలు, చానళ్ళు
వ్యాపారం రాజకీయంలో భాగమై
రాజకీయమే వ్యాపారమై
పార్టి ట్రేడ్ మార్క్ వార్తలు
చిలకపలుకులై కూత పెడుతున్నాయి

భయపెట్టే అక్షరం
భయపడుతోంది
ఎవడి సొంతానికి వాడు
వాడుకుంటుంటే

పార్టీలకు అమ్ముడు పోయిన పత్రికలను
నడి బజార్లో తగలబెడుదాం
పోనీలే అని కూర్చుంటే
నిజం నిశ్శబ్దంలోకి జారుకుంటుంది మరి !
26-09-2012

27, సెప్టెంబర్ 2012, గురువారం

పీచు శ్రీనివాస్ రెడ్డి || ఉచిత దొంగలు


లెక్కలింకా తేలడం లేదు

ఉన్నవి ఊడేవెన్నో

కొత్తవి వచ్చేవెన్నో

ఎవడి లెక్కలు వాడివే

ఎవడి గోల వాడిదే

ఉచితానుచితాలెంచక

ఉచితాల పేరు చెప్పి

ఎన్ని కూతలు కూసారో

ఎన్ని కోతలు కోసారో

అప్పటి ఓట్ల మరకలు

ఇంకా చెరిగిపోనేలేదు

భయంకరంగా దాడి చేస్తున్నాయి

బ్రతుకు మీద

భవిష్యత్తు మీద

ఓట్లు తెచ్చు కోవాలన్నా

కోట్లు దండుకోవాలన్నా

ఇప్పుడు " ఉచితం " ఒక ఎజెండా

అటువైపుకు వెళ్ళామా ఖర్సైపోతాం

వాళ్ళు ఖరీదైన కూలీలు

వాళ్ళు ఖరీదైన బిచ్చగాళ్ళు

ఐదేళ్ళు పనుండదు

చేతివాటం తప్పితే

వీధులన్నీ తిరుగుతూ

ముఖం నిండా చిరు నవ్వు వొలకబోస్తూ

మళ్ళీ కూలీకి వస్తారు

చేతులు జోడించి బిచ్చానికి వస్తారు

మనం మహారాజులమే

వాడు మనముందు

చేతులు జోడించిన మూడు క్షణాలవరకు

ఆపై బ్రతుకంతా బానిసలమే

దొంగలు రాబోతున్నారు జాగ్రత్త !

24-09-2012

12, సెప్టెంబర్ 2012, బుధవారం

పీచు శ్రీనివాస్ రెడ్డి || నాకింకా యాదుంది ||


నాకింకా యాదుంది
కీసలో దాచుకున్న
అమ్మ ఇచ్చిన బెల్లం ప్యాలాల లడ్డు తీపి 

***

నాకింకా యాదుంది
నా లాగు రెండు తూట్లతో
దునియా చూస్తుంటే నవ్వినా కండ్లేవో 

***

నాకింకా యాదుంది
గుడ్డి దీపం సాక్షిగా
గావురంగా నాయినమ్మ ఇచ్చిన మామిడి పండు
యెంత ప్రేమగా పండిందో .

***

నాకింకా యాదుంది
పెరుగు గట్క పెట్టిన దోస్తు
పొద్దుగాల వయసుకే పోద్దీకుతే
నా కండ్లల్ల కదిలిన దుక్కం 

***

నాకింకా యాదుంది
ఇస్కూల్ల నా యాసనెక్కిరించిన
టీచరమ్మ నవ్వు 

***

నాకింకా యాదుంది
దొడ్డికాడ
బాగా సదువుకున్న బందూకు పట్టుకున్న గడ్డ పోడి ముఖం 

***

నాకింకా యాదుంది
పొలంకాడ
పాలేరు తిన్న తొక్కు మెతుకుల వాసన

***

నాకింకా యాదుంది
తాతెంబటి పోతుంటే
కులం తోకను చూసి
పక్కకు జరిగి తల దించుకున్న మనుషుల చూపు 

***

నాకింకా యాదుంది
తుమ్మ చెట్టుకు కారిన బంక
తియ్యంగ చప్పరించింది
గందుకేనేమో గురుతులన్నీ అతుకున్నై గుండెల్లో

11-09-2012

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

పీచు శ్రీనివాస్ రెడ్డి || నేను నా ప్రియురాలు ||


ఒంటరితనం
నాకీ మధ్య పరిచయమైన కొత్త ప్రియురాలు
ఒంటరిదైపోయిందో ఏమో
నా నుండి వెలివేద్దామనుకున్న ప్రతీ సారి
ఆమె నాతో మాట కలుపుతూనే ఉంది
మంతనాలు జరుపూతూనే ఉంది

జన కాలుష్యాన్ని వదిలి
ప్రకృతి ఒడిలోకి చేరుకొని
గరిక పోసతో
గడ్డి పువ్వుతో
నేను మాట్లాడుతుంటే
గమనించనే లేదు
ఆమె నా ప్రక్కనే ఉంది

ఎవరు లేని నిర్జనారణ్యంలో
వెలుతురే లేని చీకటి సందర్భంలో
భుజం తట్టింది ఆమే.
భయం పొరల తెరలను చించి
ఆమె నా ప్రక్కనే
నేనున్నానంటూ

ఆమె
నా తనువునుండి మనసును వేరుచేసి
దానికెన్ని ముచ్చట్లు చెప్పుతుందో
ఉలుకు పలుకు లేని నేను
నా ప్రియురాలిని నా మనసుని
కళ్ళప్పగించి చూస్తూనే ఉండిపోయాను
యుగాలు గడుస్తున్నాయి వాళ్ళ ఊసుల్లో
నాకు మాత్రం నెత్తి పైన ఎండ నెత్తి పైనే ఉంది
నేనక్కడ మూడో మనిషిని

విసుగొచ్చి వచ్చేసాను
మనసుని నా ప్రియురాలికి అప్పజెప్పి
మళ్ళీ జనారణ్యంలోకి నేను .

జనంలోనే నాకు బలం .

08-09-2012

పీచు శ్రీనివాస్ రెడ్డి || చావు లెక్కలు ||


దోచుకునేవాడు
దొడ్డి దారిలో వాని పని చేసుకుంటున్నాడు
దాపరికం లేకుండా!

చావు లెక్కలతో చావగొడుతుంటే
నువ్వు పాపపుణ్యాల లెక్కలేస్తున్నావా నేస్తం

వాడు పోతే కొందరేడ్చారని
వీడు పోతే కొందరు చచ్చారని
ఇక్కడ చావు లెక్కలూ..దొంగ లెక్కలే
ఇంటోడికి ఏమీ కాదు .
చంటోడిది చావులెక్కల సన్నాయి మేళం !
వీధి వీధి తిరిగి వాయిస్తున్నాడు , ఏ ఊరు వదలకుండా

వాళ్ళకి మరక కూడా మంచిదే
పబ్లిసిటీ పెరిగేందుకు
వాళ్ళకి చావు కూడా మంచిదే
రాజకీయంగా ఎదిగేందుకు

వాళ్ళు ఓట్ల దొంగలే
మనుషులను పంచుకుంటారు
వాళ్ళు నోట్ల దొంగలే
మనలను బికారీలను చేస్తారు
వాళ్ళు, కరువు లెక్కలు దాస్తున్నారు
వాళ్ళు, చావు లెక్కలు మోస్తున్నారు

సమాధి మీద పూచిందో శ్వేతా మందారం
తాజ్ మహల్ సింగారంలా
చావు పాటల పైనే పూస్తుంది యువ రాజకీయం
కీచక పర్వంలా

ఎవడు ఎవడికి పుట్టాడో
'లాబు'లిచ్చిన వారసత్వపు లెక్క పత్రం
రాజకీయానికి కొత్త రంగు తెస్తుందేమో!

చావు లెక్కలు చెప్పుతూ
చావు పాటలు పాడుతూ
యువరాజులు రేపటి రాజకీయాన్ని మింగకముందే
' దొంగల అడ్దాని ' శుద్ధి చేద్దాం ' ఓటు 'తో
09-09-2012

7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

పీచు శ్రీనివాస్ రెడ్డి ||దొంగల అడ్డా ||

కూడు గుడ్డ కోసం
కూలి పని కోసం
అడ్డా చేరుకునే చిరుజీవులు
కష్టానికే అంకితమైన చిరంజీవులు

ఈ బ్రతుకుల్లో

కోటి దీపాలు వెలుగుతాయనుకున్న పేదోడి ఆశకు
గండి కొడుతున్నాడు .
వాడి వృత్తి రాజకీయమే
ఆర్ధిక బంధాలే రాజకీయాల అడ్డా

ఓ చంద్రున్ని చీకటి కప్పేసింది

అమావాస్య ముసుగులో
వాడేం చేశాడో ఎవడికి తెలుసు

ఓ చంద్రుడు పున్నమి పాట పాడుతున్నాడు

జనం బ్రతుకుల్ని వేలం వేస్తూ
కొత్త దుకాణం తెరిచి దందా చేస్తున్నాడు

వేషగాళ్ళు కొత్త వేషాలేస్తున్నారు

పదవి ఫకీరులవుతున్నారు

వాళ్ళ రథానికి ఏడు గుర్రాలు ఏడు మార్గాలు

ఏ దారైనా, వెనుదిరుగితే వాళ్లకి కనిపించని జనం మనమే

ఒకడు ఎంగిలి మెతుకులు చల్లి

కల్తీ ప్రేమను చూపి
ఖజానా ఖాళీ చేసి
కాసుల శిఖరం ఎక్కి శేఖరుడై పోయాడు

అధికారం వాళ్ళ అబ్బ సొత్తే నట .

జనం
వాళ్ళ తాత ముత్తాతలు రాసిచ్చిన జాగీరట
నోట్లో ' రెండు ' మెతుకులు పెట్టి
మన జేబులు ఖాళీ చేసిన వారి వారసులోస్తారట
బ్రతుకున్న ఈ కట్టెలను పూర్తిగా కాల్చడానికి .
వాళ్ళ వృత్తే రాజకీయం .

ఉన్నోనికి ఊం కొట్టి

అవకాశాన్ని అమ్ముకుంటారు
అవసరమైతే అన్నీ అమ్ముకుంటారు
సంధులు చేసుకుంటారు
సంచులు పంచుకుంటారు
వాళ్ళ వృత్తే రాజకీయం
వాళ్లకి ' జీతం ' కంటే ' గీతం ' ఎక్కువ
లేక్కలేసినా తేలని ఆస్తులు
వాడుకుంటూనే ఏవీ మావి కావంటారు
రాజకీయం , దోచుకునే దొంగల అడ్డా

05-09-2012

6, సెప్టెంబర్ 2012, గురువారం

పీచు శ్రీనివాస్ రెడ్డి || రాయినే, పరాయిని కాను

రాయినని పరాయిగా చూడకు
నువ్వు కొలిచే దైవానికి రూపమిచ్చింది నేనే

ఉలి దెబ్బల పురిటి నొప్పుల్లో

సౌందర్యమై పుట్టాను నేను
కనువిందు చేసాను నీకు

నువ్వు కట్టిన ఇంటికి

నువ్వు వేసిన దారికి
ఇసుక రేణువునై మారింది నేనే
నీడనిచ్చింది నేనే
నీకు దారి చూపింది నేనే

నేను పుట్టినప్పుడు లేని నువ్వు

నాకు రాగాలు నేర్పకు
నేనెప్పుడో కరిగి పోయాను
నీ గతానికి
నేను బొమ్మనై నిలిచాను

పెను గాలికి జారి నాపై నేనే పడ్డప్పుడు

తగిలిన గాయాన్ని మరిచి
నీకు ' నిప్పు'నిచ్చాను
నీ బ్రతుక్కి వెలుగునిచ్చాను

ఒంటరిని చేసి వేధించినప్పుడు

అందరూ నిన్ను అనిచివేసినప్పుడు
నీ తొలి పోరాటానికి ఆయుధాన్ని నేనే
నీ తొలి ఉద్యమానికి బలగాన్ని నేనే

రాయినని పరాయిగా చూడకు

రాజ్యానికి సరిహద్దు గురుతును నేను
నీకు రక్షణగా నిలబడ్డ
నిలువెత్తు గోడను నేను

06-09-2012

పీచు శ్రీనివాస్ రెడ్డి || ఇద్దరూ.. ఇద్దరే ||



ఒకడు
బాధను చెప్పుకుంటున్నాడు.
ఒకడు
ఆ బాధనే వెక్కిరిస్తున్నాడు .
ఒకడు
కడుపు కాలిందంటున్నాడు.
ఒకడు
ఒళ్ళు బలిసింద౦టున్నాడు.
రోడ్డు మీద రాయిని చేతపట్టి
ఇది నా ఆయుధం అంటాడొకడు .
పేపరు మీద పెన్నును పెట్టి
ఇది నా పైత్యం అంటాడొకడు .
ఆ ఒకడికి తెలియదు
రాయితో పగిలిన తల ఎవడిదోనని .
ఆ ఒకడికి తెలియదు
అక్షరంతో విరిగిన మనసు ఎవడిదోనని .
ఒకడు ధర్మాగ్రహం అంటాడు .
ఒకడు సత్యాగ్రహం అంటాడు .
జననంలోనూ ఇద్దరూ
కానీ స్థలాలే వేరు .
రంగంలోనూ ఇద్దరూ
కానీ అంతరంగాలు వేరు .
ఆరాటంలోనూ ఇద్దరూ
కానీ పోరాటమే వేరు .
మరణంలోనూ ఇద్దరూ
కానీ సమాధులే వేరు .
ఒక్కడే విడిపోయిన ఆ ఇద్దరు
కాకపోతే ' ఒకడు ' జనంలోనో .
' మరొకడు ' గద్దె పైనో .
అప్పుడప్పుడు ' ఒకడి ' స్థానంలో ' మరొకడు '
కొత్త గొంతును సవరించుకుంటారు .

04-09-2012

5, సెప్టెంబర్ 2012, బుధవారం

పీచు శ్రీనివాస్ రెడ్డి || 'మనసు' కథ ||


ఏ ఎండకో ఇది నీడనిస్తుంది
ఏ వానకో ఇది గొడుగు పడుతుంది
ఆశల రెక్కలు రాలి నేల పాలైతే
ఆకాశానికేసి చూస్తూ అర్థిస్తుంది
రంగులు మార్చే కాలం ముందు
హంగులతో ముస్తాబవుతుంది

ఏదో వెలితి వెన్నంటే ఉంటుంది
పొద్దు పోనీయక
నిద్దుర రానీయక
సద్దు చేస్తూనే ఉంటుంది
ఆశను వెంట పెట్టుకుని , మనసును గాయం చేస్తూ
ప్రతి నిత్యం తొంగి చూస్తూనే ఉంటుంది

03-09-2012

2, సెప్టెంబర్ 2012, ఆదివారం

పీచు శ్రీనివాస్ రెడ్డి !! మట్టి , సంతకం చేసిన మనిషిని !!

చీకట్లో
ఆకాశం వెలిగించిన తారా దీపాలను
లెక్క పెడుతూ నేను .

వ్రేళ్ళు మాత్రం ఏదో రాస్తున్నాయి మట్టిలో ..
" నీ మీద ఒట్టు నేను నీ వాణ్ణే " నని
స్పష్టంగా కనిపించింది
మిణుగురు పురుగులు చల్లిన వెలుగుల్లో
అది నా మనసు చెప్పిన మాట

నాలో ఉన్న నీవు , అదీ నేనే
మట్టి కూడా ఒట్టేసింది
పచ్చని మొక్కల సాక్షిగా
నిన్ను నన్ను కలిసే బ్రతకమని

మట్టి నవ్వుతుంది ఊ .. గే .. పువ్వులా
పచ్చదనంలో ప్రవహించే రక్తం మట్టే

కలిసొచ్చే కాలం మోసుకొచ్చిన బరువు బాధ్యతలన్నీ
మట్టిపైనే ..
మట్టికి మమకారం మనిషిపైనే ..

పసితనంలోనే
గోళ్ళలో మట్టి మరకలు
నోట్లో మట్టి ముద్దలు
అప్పుడే , తెంచుకోలేని బంధం
మేనులో చేరింది
పేగులో కరిగింది
గుండెలో మిగిలింది

మనసుతో గమనించు
నిలువెత్తు మనిషిలో మట్టి వాసనే వస్తుంది
అంతే మరి ,
పేగును విడిచి మొదలైన తనువు
తుదకు మట్టితోనే ముడి వేసుకుంటుంది

మట్టి, సంతకం చేసిన మనిషిని
కడవరకైనా నేను
ఖచ్చితంగా చేరుకునే పుట్టినిల్లు మట్టే

01-09-2012

1, సెప్టెంబర్ 2012, శనివారం

పీచు శ్రీనివాస్ రెడ్డి ||అ క్ష రం||



ఉప్పు కారం లేకుంటే చప్పగానే ఉంటుంది పప్పు
కేవలం , ప్రాసతో పదానికి జీవం పోసిన కవిత్వంలా
భావాన్ని పెనవేసుకున్న అక్షరాలు కవితలా కురవాలి

అక్షరాలు నిలబడాలి
యుద్ధానికి సన్నిద్ధంగా
మనిషిని భయానికి గురిచేస్తున్న చీకట్లను
ప్రశ్నించేలా ...

భావం గర్జించాలి
మనిషిని మింగుతున్న నిరాశ నిస్పృహలను
తరిమేలా ...

భావం బ్రతికించాలి
ప్రతి నిత్యం మనిషి నర నరాన కర్మ జలాన్ని
నింపేలా ...

అక్షరం నిలబడాలి
తనకు తానే సంక్షోభంలో మునుగుతున్న మనిషికి
చేయూతనిచ్చేలా...

అక్షరం తలబడాలి
పళ్ళెంలో వేసుకున్న నాలుగు మెతుకులను
ఎత్తుకుపోయే ...
బలిసిన గద్దల రెక్కలను
నరికే కత్తిలా ...

అక్షరం కురవాలి
అక్కర కోసం అవకాశాన్ని అమ్ముకునే
స్వలాభ చింతనను
కడిగేసే జడివానలా...

అక్షరం వెలుగవ్వాలి
మనిషికి
ప్రకృతి ఇచ్చిన పచ్చదనాన్ని పక్కదోవ పట్టిస్తున్న
పగటి వేషగాళ్ళ స్వార్థపు నీడలను
బయటపెట్టేలా ...

అక్షరం.
దొరలై దోచుకుంటున్న దొంగల బాగోతాన్ని
కాల్చే మంటవ్వాలి...

అక్షరం నిలబడాలి కత్తిలా
అక్షరం నిలబడాలి అండలా
అక్షరం నిలబడాలి వెలుగులా

అక్షరం నిలబెట్టాలి
కవితను సమోన్నత స్థానం పైన
అక్షరం నిలబెట్టాలి
మనిషిని సర్వోన్నత శిఖరం పైన

31-08-2012

31, ఆగస్టు 2012, శుక్రవారం

పీచు శ్రీనివాస్ రెడ్డి !! ఉగ్రవాదం ఉరుముతోంది !!


అప్పుడెప్పుడో అవని పుట్టకముందు
అగ్నిగుండం ఒకటి బ్రద్దలయ్యి
జీవానికి విత్తనాలు చల్లింది

ఎందుకు మోలిచిందో
ఎలా మొలిచిందో ఓ మొక్క
మహావ్రుక్షమయ్యింది
ఊపిరిని శాసిస్తోంది

అది నలు దిక్కులను తాకిన నీడ

నల్లగా నవ్వుతుంది
ఎర్రగా పాడుతుంది
ఆకాశం విరిగి పడేట్లు అరుస్తుంది

వినాడానికి భయం వేసే చప్పుడు
చెవులను కొరుకుతుంది
చాలాకాలం నుండి

అదొక ఉగ్ర నేత్రం
అంతమే దాని అంతిమ వాదం

ఆ నోటికి
ఎన్ని నాలుకలో
దాహం ఇంకా తీరినట్లు లేదు

బలి అవుతున్నవి మాత్రం మూగ జీవాలు కాదు
ఆలోచనల అల్లికలతో
ఆశల పల్లకిలో
ఎంతో కొంత ప్రేమను
ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ
కన్నీళ్లను తుడుచుకుంటూ
కలలను బ్రతికించుకుంటూ
కాలంతో కాపురం చేసుకుంటున్న
మామూలు జీవన చిత్రాలు .

వాడొక ఉగ్ర నేత్రం
అంతమే వాడి అంతిమ వాదం
పుట్టినప్పటి నుండి మెలకువతోనే
వాడు ఏ తల్లి జోల పాటను విననివాడు
ప్రపంచాన్ని జో కొడదామనుకుంటున్నాడు
జీవాన్ని మృత్యువుకు విత్తనంగా చేసుకుంటూ

నేనున్నాననే
మనం నిలబెట్టిన నీడ కూడా
ఎంగిలికే అలవాటు పడింది

ఉగ్రవాదం ఉరుముతుంటే
ఉనికే ప్రశ్నార్థకం అవుతుంటే
గురి చూసి కొడదాం ' మన ' ఆయుధంతో

30-08-2012

29, ఆగస్టు 2012, బుధవారం

పీచు శ్రీనివాస్ రెడ్డి !! చరిత్ర వాన్ని మరిచిపోయింది !!


అనాది నుండి
'నాది' అని ఏదీ లేని పేదవాడు
చరిత్ర పుస్తకం వదిలి
ఎప్పుడో పారిపోయాడు.

అయిన వాని కథ
రాతి పలకలపై నిలిచి శాసించింది
కడవాని వ్యధ
కడలి తీరంలో ఇసుక తెన్నులపై రోదించింది

చెమటోడ్చిన బ్రతుకుల రాతలన్నీ
సంద్రంలో కలిసాయి
ఎన్ని బ్రతుకులో ...
నీళ్లన్నీ ఉప్పగా .

అక్షర రాశికి వాసి పూసి
నిజానికి మసి పూసి
రాసిన రాతల్లో
పేదోడి కన్నీటి ధారలకన్న
పెద్దోడి కిరీటాల ధగ ధగలే ఎక్కువ

ఆ చరిత్ర
వరహాలు ముద్దాడిన అక్షరాల సమూహం కావచ్చు
రసిక సిఖామనుల రాజభోగాలను నెత్తిన ఎత్తుకొని
దరిద్రుడి దిన చర్యను వెక్కిరించాయి

మబ్బును చేరిన నీరు కొత్తగా కురిసినా
గతమంతా మరిచినా
గాలికి తెలుసు సంగతులన్నీ
గురుతుకొచ్చినప్పుడల్లా అరుస్తుంది

ఆ సాక్షినే వెంటబెట్టుకొని నిలదీద్దాం
నఖిలీ నవ్వులు నవ్వుతున్న' అక్షర గణాన్ని'
నింగిలో తారలని తుంచి
ప్రియురాలి సిగ లో పెట్టిన
వర్ణనా పైత్యాన్ని

28-08-2012

22, ఆగస్టు 2012, బుధవారం

పీచు శ్రీనివాస్ రెడ్డి || ఆశ నడిపే దారి||


నలు దిక్కులు
నిశితంగా చూడలేక
ఏదో ఒరుగుతుందని

అతడు
వెతుక్కుంటూ వెళ్ళింది దురదృష్టాన్నే
వెలుగు కోసం
వెలుతురులోనే వేట చీకటిలోకి జారుతూ
నవ్వుల పువ్వులు పూచే తోటలో
ముని వ్రేళ్ళతో ముళ్ళను తడుముతున్నాడు
గుచ్చుకున్నా నొచ్చుకోక
ఓటమిని ఒప్పుకొని నైజం
అతడిని చీకట్లో నడిపిస్తోంది
ఆశకు అలుపన్నది ఉండదేమో
అంతమయ్యేవరకు ఆడుకుంటుంది
తొలి అడుగులో తడబాటు
పొరపాటుకది అలవాటు
నడక నేర్చిన అడుగుల
నడత మారకపోతే యెట్లా ?
వెనకటి గురుతులు
ముందుకు వెళ్ళడానికే
తను మారతూ లోకాన్ని మార్చుకుంటూ.
అతను మాత్రం ఇంకా చీకట్లోనే
ఆశలు నడిపేది చీకట్లోకే
*21.8.2012

19, ఆగస్టు 2012, ఆదివారం

పీచు శ్రీనివాస్ రెడ్డి - నిర్జీవమైన జననం


ఎన్ని కలలో
నన్ను నా హృదయంలా మలిచే మనిషి కోసం
ఫలించని కలలతో యుగాలనుండి
ఇంకా ప్రాప్తించని ఆ రోజు కోసం , నీ కోసం.
రోజూ పుడుతున్న కొత్త రోజు
కనీసం ఒక్క రోజు నా కోసం వస్తే చాలు
ఈ వికృత రూపానికి
అమృత ఘడియలను
వరంగా ఇచ్చే వారెవరో
యేవో కొన్ని కన్నులు చూసి పోతుంటాయి
యేవో కొన్ని అడుగులు తాకి పోతుంటాయి
నేను మాత్రం నన్ను నన్నుగా చూసే మనిషి కోసం.
ఫలించని కలలతో యుగాలనుండి. అంతేలే
శిల్పానికి తగని శిలా సౌందర్యం నాదైనపుడు
ఎవరు మాత్రం ఏం చేస్తారు
మరు జన్మకైనా
అదృష్టం చూడలేని స్థితిలో నేను
నిర్జీవమైన జననం నాది
శిలను కదా
నాది మరణం లేని జననం కదా!

*18-08-2012

పీచు శ్రీనివాస రెడ్డి || కరిగే అక్షరాల కావ్యం ||


కలలో కలగా
లీలగా కదలాడే సుందర దృశ్యాన్ని
ఏ చేతులతో నేను స్పృశించగలను
ఏ కన్నులతో నేను బంధించగలను

ఆవిష్కృతమైన దృశ్యాలు అదృశ్యం అవుతాయని
కను రెప్పలు కదలకుండా పడుకున్నాయి
విరిగి పోయే ఇటుకలతో పేర్చిన తరగని సంగతులెన్నో

అక్కడ గుస గుసలాడుతున్నాయి

మనోహర దృశ్యంలా
మధురమైన స్వరంలా
నిజాన్ని కవ్వించే అబద్దం , నిజంలాగే ఉంది
కన్నుల్లో దాగివున్న ఈ కావ్యాన్ని
ఆ స్వప్నం హిమాక్షరాలతో సంతకం చేసింది
చెదిరిపోయేది కాకున్నా , ఈ కల కరిగిపోయేదే కదా

*18-08-2012