పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
ప్రపంచీకరణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రపంచీకరణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, అక్టోబర్ 2013, మంగళవారం

కవిత్వ విశ్లేషణ

సి.వి.శశారద గారి కవిత :









 




ప్రపంచీకరణ పర్యవసనాలవల్ల కుటుంబ జీవితాలు ఛిన్నమయ్యాయి.ఇంట్లో ఉన్న నలుగురు నలుగువైపులా వెళుతూ ఒకరికొకరు దూరంగా ఉండవలసిన పరిస్థితి.విధ్యార్థులైతే సగటుగా ఇంటర్ విద్యనుంచే కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరీస్థితి.చదువులకోసం,ఉద్యోగాలకోసం పుట్టిపెరిగిన ఊరికి,కుటుంబానికి దూరంగా ఉండటం. ఈ కాలనికి ఒకటి,రెండుతరాలనించి కనిపిస్తుంది.


ఇలాంటి సందర్భం నుంచే ఒకకూతురుగొంతుక తన తల్లితండ్రులకు దూరమౌతున్న సందర్భాన్ని కవిత్వీకరించారు సి.వి.శారద.ఇలాంటి సందర్భంలో గతంలో తండ్రిగొంతుకనించి వచ్చిన కవితలున్నాయి.శ్రీ జింబో(మంగారి రాజేందర్)"చూస్తుండగానే"లో ఇలాంటివి కనిపిస్తాయి.కూతురు/కుమారుని గొంతుకనించి కనిపించవు.వస్తుసందర్భం,దాని మూలవస్తువులో సారూప్యతలున్నప్పటికీ ఇది ఈకాలానికి సంబందించి కొత్తవస్తువే.

రచనకు సంబంధించి రచనాపరిమితి(Limiteation of a writing)ఉంటుంది.దీన్నికూడా స్థలపరిమితి(Spase Limitetion)కాల పరిమితి(Time Limitetion)అని విడదీయొచ్చు.ఆఖ్యానంలో సత్యానికి సంబంధించిన ఆకళింపు ఉంటుంది. ఈ ఆకళింపులో స్వభావం ఉంటుంది.ఈ స్వభావమే రచన గొంతుని చూపుతుంది.ఈ పరిమితిని స్వభావపరిమితి(Personal Limitetion)అంటారు.

శారద కవితలో స్థల,కాల,స్వభావాలు ప్రత్యేకంగా ఉండటంవల్లే ఈ కవిత కొత్త దనాన్నిపులుముకుంది.నిర్మాణ గతంగా చూపిన శ్రద్ధకూడా శైలిని ప్రత్యేకించి చూపుతుంది.ప్రధానంగా వస్తువుని ప్రసారం చేయడానికి వాడుకున్న ప్రశ్నా వాక్యల పద్దతి రూపముఖంగాబాగా ఉపకరించింది.


"జీవితాన్ని వెతుక్కుంటూ, లక్ష్యాల్ని మోసుకుంటూ
ఉద్యోగమూ, చదువూ అంటూ
ఊరూ ఇల్లూ దాటుతుంటే
'అప్పుడే వెళ్తున్నావా?' ప్రశ్నిస్తాయా కళ్ళు!"

"'ఇంకో రెండు రోజులుండరాదూ?'/ఉండలేను!
'పోనీ తొందరగా వచ్చేస్తావా?'/చెప్పలేను!!
యదార్థాన్ని దాచలేక తల వంచుకుంటాను
వంగి కాళ్ళన్ని తాకితున్నప్పుడు
వర్షించే ఆ కళ్ళని నేనెప్పటికీ చూడలేను
'వెళ్తానమ్మా' అంటానా?/వెళ్ళిరమ్మంటాయా కళ్ళు
'వీలైతే తొందరగా వచ్చేస్తానమ్మా' అంటానా?
అబద్ధాన్ని పట్టేస్తాయా కళ్ళు"

ప్రశ్నలకు సమాధానాలుగా మౌనంగా అనుభవిస్తున్న సంఘర్షణని చిత్రించారు.ఇదంతా మనోగతంలా ధ్వనిస్తుంది.ఈ భాగం తరువాత తానుగా ఆ సఘర్షణని కవిత్వం చేస్తారు.ఈ క్రమంలో ఈ కవిత రెండు భాగాలుగా కనిపిస్తుంది.మొదటిభాగం సందర్భంలోకి తీసుకువెళ్లటానికి ఉపయోగ పడితే రెండవభాగం ఆగొంతుకని సారవంతం చేస్తుంది.



"నేను వెళుతున్న దారిలో ఆ కళ్లు
దృక్కులు పరిచాయని తెలుసు
వెను తిరిగి చూడలేను!"

"నిండు శ్రావణ మాసపు మేఘాల్లా ఆ కళ్ళు
వర్షిస్తూనే ఉంటాయని తెలుసు!
వెను తిరిగి చూడలేను!!"

"ఎదగాలని పోరాటం/ఎగరాలని ఆరాటం
గూడొదిలిన పక్షుల
రెక్కల చప్పుళ్ళు గుండె నిండా వినిపిస్తాయి.."

ఈమూడువాక్యాలలో మొదటిరెండు కళాత్మకమైనవి.హృదయాన్ని చేర్చడానికి వాటిపరిధిమేరకు అవి ప్రవర్తిస్తాయి.ఈ కవితలో గమనం, స్పందన అనే పద్ధతిలో వాక్యాలను నిర్మించారు.


చాలాసార్లు కొత్తతరం కవిత్వం రాయడంవల్ల కొత్తవస్తువులు గొంతులు వినిపిస్తాయని చెప్పుకున్నాం.ఈ గొంతుక అంతే తాజాగా తనదైన ఊహలో,ఉనికిలో ఉంది.సాధరణంగా కొత్తగ రాస్తున్న వాళ్లలో పాతవారిని అనుసరించే గుణం ఉంటుంది.అది భాష,వాక్యాలకే కాని మిగత విషయాలకు కాకూడదు.ప్రధానంగా వస్తువు.ఎవరికైనా ఆయాజీవితల్లోనించే వస్తువులు రావాలి.మంచికవితనందించి నందుకు సి.వి.శారద గారికి అభినందనలు.ఈ దారిలోనే ఈతరం వస్తువుల్ని మరిన్ని పరిచయం చేయాలని ఆశిద్దాం.

శారద గారు శీర్షికని రాయడం మరచిపోయారు.శీర్షిక గొంతుని,స్వభావాన్ని ప్రదర్శిస్తున్న సారాన్ని ప్రతిబింబించాలి.రాస్తరని ఆశిస్తాను. 


                                                                                                      _____________ఎం. నారాయణ శర్మ

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

రాజేందర్ జింబో కవిత-'బిట్స్ అండ్ క్లిక్స్' 




తెలుగులో 1990కాలనికి కాస్త అటు ఇటుగా ఎక్కువ వినిపించేపదం ప్రపంచీకరణ(Globalisetion).అనేక అంశాలతో పాటు సాహిత్యాన్ని కూడా ఒక కుదుపు కుదిపిన అంశం.అనేకమంది బుద్దిజీవులు ముక్త కంఠంతో వ్యతిరేకించిన అంశం.

80వ దశకంలో ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో సంక్షోభాలు తలెత్తటంతో అప్పటివరకూ ఆచరణలో ఉన్న కీన్స్ ఆర్థిక సూత్రాలు దాన్ని పరిష్కరించ లేకపోవడంతో అప్పటి అమేరికా అధ్యక్షుడు రీగన్,బ్రిటీష్ ప్రధాని మార్గరేట్ థాచర్ "వాషింగ్టన్ కాన్సెన్సస్ పేరిట కొత్త ఆర్థిక విధానాలు తెచ్చారని నిపుణుల వివరణ.అందులో భాగంగా బహుళ జాతి సంస్థలు,ఐ.ఎం.ఎఫ్,ప్రపంచ బాంక్ సర్దుబాటు విధానాలను ప్రపంచ దేశాలపై ప్రయోగించాయి.ఇది భారత దేశ ఆర్థిక వ్యవస్థనుకూడా ఇబ్బందిలో పడేసింది.

తెలుగులో ప్రపంచీకరణ ప్రభావం సాహిత్యంలో కనిపిస్తుంది."ఇండియా ప్రైవేట్ లిమిటెడ్"పేరుతో జూకంటి జగన్నాథం.కవితా సంపుటిని తెచ్చారు.గుడిపాటి"గ్లోబలైజేషన్"పేరుతో పుస్తకాన్ని తెచ్చారు.ఈ మార్గంలోనే"గ్లోబల్ ఖడ్గం"సంకలనం వెలువడింది.కవుల వ్యక్తిగత సంపుటాలు కూడా అనేకంగా వచ్చాయి.

"The liberal virus"(samir amin),"Under standing globaliseation"(Tony sachirato),"The world is flat"(Thomas friedman)మొదలైన పుస్తకాలు.ఈ అంశాన్ని సమర్థించాయి.అంతో ఇంతో తెలుగులోనూ ఇలాంటి సందర్భాలు లేక పోలేదు.కల్లూరి భాస్కరం గారు "వార్త" ఎడిట్ పేజీలో"ప్రపంచీకరణ తెలుగు సాహిత్య స్పందన"పేరుతో వ్యాసాలు రాసారు(27.2/3.3/10.3.2006).

ప్రపంచీకరణ ప్రభావాలని చిత్రిస్తున్న సందర్భంలోనూకవిత్వంలో కొన్ని దశలని గమనించవచ్చు.
1.తొలిదశలో కమ్యూనిస్ట్,మార్క్సిస్ట్ సిద్దాంత భూమిక తో తిరస్కరించడం.2.పల్లెల విధ్వంసం3.సంస్కృతి సంప్రదాయాల క్షీణత.కొత్త సంప్రదాయాల ప్రవేశం.4.కులవృత్తుల విధ్వంసం5.వలసలతో ప్రపంచమంతా ఒక్క నీడకి రావడం.మానవీయ సంబంధాల విధ్వంసం.

రాజేందర్ జింబో గారికవిత వీటన్నిటికి భిన్నంగా క్షణాల్లో జరుగుతున్న అనేక మార్పులను కవిత్వీకరించింది.ఆయన కొత్త సంపుటి "చూస్తుండగానే.."లో ఇలాంటివి కనిపిస్తాయి.ఈ కవితలోనూ మానీటర్,క్లిక్ లతో ప్రపంచం నడుస్తున్న అంశాన్ని వివరించారు.

"అంతా ఆన్‌లైన్ ఈ మెయిల్, ఈ గవర్నెన్స్
ఈ ఫైలింగ్ అఫ్గనిస్తాన్ నుంచి లాడెన్ వరకు అంతా మానిటరే
అమ్మను చూడాలన్నా అమ్మాయితో మాట్లాడాలన్నా మానిటరే
ఆటలు ఆనందాలు అన్నీ మానిటర్‌లోనే "

రాజకీయం.తీవ్రవాదం,కుటుంబ సంబంధాలు అన్నీ ఈ అధునిక కాలంలో దేనిపై ఆధార పడుతున్నాయనే అంశం పైవాక్యంలో కనిపిస్తుంది.తొలిదశలో టి.వి.ని వ్యతిరేకించడంకనిపించేది,ఇప్పుడు ఆస్థానాన్ని "కంప్యుటర్" ఆక్రమించింది.
మనిషి తనకుతాను దూరమవుతూ,మనిషితనం వ్యర్థమౌతున్న అనేక సందర్భాలుకూడా ఇందులో కనిపిస్తాయి.

"ఇక, మట్టికి, సున్నానికి స్థానం లేదట మాంసానికి రక్తానికి విలువ లేదట"

"అంతా ఆన్‌లైన్ మనిషి మౌస్ అయి
కుంచించుకుపోయినట్టు మౌస్ మనిషై శాసిస్తున్నట్టు
మౌసే మనిషిని కాటేస్తున్నట్టు ఫీలింగ్ "

భాషా పరంగా గానీ,ఊహపరంగా కానీ,వ్యక్తీకరణ విషయంలో గానీ పెద్దగా పాఠకుడినుండి ఙ్ఞానాన్ని కోరకుండా అనేక విషయాలని మనసుకందించే శైలి రాజేందర్ జింబో గారిది."హాజిర్ హై"నుండి ఇప్పటి వరకు ఆయన కవితలో ఒక బలమైన మానవీయ స్పృహ,జీవితేచ్చ కనిపిస్తాయి.ఆయన కవిత్వాన్ని చదవడం వల్ల ఇలాంటి అనేక విషయాలు అర్థం చేసుకో వచ్చు.మంచికవితని పంచుకున్నందుకు మితృలకు కృతఙ్ఞతలు.


                                                                                                                            ______ఎం.నారాయణ శర్మ