Money v/s Male LOVE పదివేలు పెట్టి పట్టు చీర కొని తేలేను గాని నువ్వంటే నాకు ప్రాణమే పంకజాక్షీ ! పైసాకు కొరగాని ఈ పరాచికలేం కొదవలేదు.. హు.. మూతి తిప్పుకుంటూ విసవిసా వంటింట్లోకి... ఈమేనా కలరాకుమారుడనీ, ప్రేమ తప్ప ఇంకేం వద్దనీ ఒకనాడు బాస చేసిన ప్రియురాలు ? నిన్ను మెడిసిన్ చదివంచలేను, చెల్లికి అమెరికా సంబంధం తేలేనుగాని మీరిద్దరూ నాకు రెండు కళ్ళు రా కన్నా . . పో డాడీ . . డోంట్ టెల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ . . మొహం చిట్లించుకొని హాల్లోకి నిర్లక్ష్యంగా . . చిన్నప్పుడు నా వీపు మీద కూర్చొని గుర్రం ఆడిస్తే తెగ సంబరపడిపొయిన చిన్నారులేనా ఈ పిల్లలు ? అమ్మా.. నీకు మోకాళ్ళ మార్పిడి చేయించి కాశీ, రామేశ్వరాలు తిప్పి చూపించలేను గాని రోజూ నీ కాళ్ళు పిసుకుతూ కబుర్లు చెబుతానే . . నాన్నా.. కృత్రిమ దంతాలు పెట్టించే స్థోమత నాకు లేదు గానీ పాలు, పండ్ల జ్యూస్ తెచ్చిపెడతా.. పారాయణమూ చదివిస్తా . . అవునురా.. నీ పెండ్లాం, పిల్లలకీ డబ్బులొస్తాయిగాని ఈ ముసలోళ్ళకి మాత్రం ఉండవురా.. అవున్రా అవును ఊరికే అన్నారా.. అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు కాదనీ . . గోరు ముద్దలు తినిపించిన అమ్మ, వేలు పట్టి నడిపించిన నాన్నలేనా వీళ్ళు ..? మాటలతో మనసు నింపడం మగవాడికి చేతనవదా..? కరెన్సీ కొలమానాల్లోనే నా ప్రేమను కొలుస్తారెందుకో ? విలాసాల అద్దంలోనే నా ప్రతిబింబాన్ని చూస్తారెందుకో ? ప్రేమించడానికి డబ్బు అవసరం లేదేమో కానీ ఆ ప్రేమను ప్రదర్శించడానికి డబ్బు కావాలి . . తిరిగి ప్రేమింప బడడానికీ డబ్బు కావాలి . . ! డబ్బే కావాలి.. డబ్బే కావాలి.. స్వంత ఇంటి కోసం స్టేటస్ అంచున మిమ్మల్ని కూర్చోబెట్టడం కోసం తలకు మించిన భారాన్ని మోస్తూ సంపాదనకై పరుగులు తీస్తూ క్షణ క్షణం కలతల కణతలతో, టెన్షన్లతో స్వేద సంద్రమై లబ్ డబ్ అని పదే పదే కొట్టుకునే నా యెద సడి ఎవరికీ పట్టదా .. ఏ గుండె పోటో విత్త గునపమై పొడిచే దాకా . . ఏ పక్షవాతమో పాతమిత్రుడై పలకరించే దాక ! [ తేది: 02.04.2014 ]
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAgpVb
Posted by Katta
by Nirmalarani Thota
from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hAgpVb
Posted by Katta
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి