పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Sailaja Mithra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sailaja Mithra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, మే 2014, శనివారం

Sailaja Mithra కవిత

కన్నీటి బావి // శైలజామిత్ర శరీరాన్ని దాటి మనసు గుండా ప్రవహించి కళ్ళ ద్వారా బయటకు వచ్చే కన్నీళ్లు పంచేంద్రియాలను తడిపేస్తాయి.వీటికి ఎండ వాన తేడా ఉండదు. గాలికి చోటుండదు పుట్టినప్పుడు అమ్మ చేతిలోకి ఇవ్వనందుకు ఎంతగా కన్నీరు ఒలికించానొ తెలియదు కానీ అంత కంటే ఎక్కువ కన్నీళ్లు ఇప్పటికీ నా దగ్గరే ఉన్నాయి. దారి మళ్ళించాలని చేతి వేళ్ళతో ఎన్నో దారులు గీసినా ఫలితం లేదు చెట్టుపై రంగుల పిట్ట నాకు కావాలని చెట్టు మొత్తం నా ముందే ఉండాలని నేను కన్నీళ్లు పెట్టలేదు ఆకాశంపై రంగుల ఇంద్రధనుసు నా సొంతం కావాలని నేను ఎప్పుడు కన్నీళ్లు పెట్టలేదు వెన్నెల దారులన్నీ ఆపాదమస్తకం నన్ను అల్లుకోవాలని చందమామ నా ఇంటిలోనే దాచుకోవాలని నేను కన్నీళ్లు పెట్టలేదు నన్ను ముందుకు వెళ్ళనీకుండా కాసుల రాసులు అడ్డగిస్తూ అధికారాలు కాపలా కాస్తున్నందుకు నేను కన్నీళ్లు పెట్టలేదు నా శరీరంతో నేను నడుస్తుంటే నా మనసుతో మరొకరు నడిచినప్పుడు, అనుబందానికి విలువిస్తుంటే, అనురాగం మరొక దిక్కులోకి ప్రయాణిస్తున్నప్పుడు, నేను నమ్మిన నమ్మకం నర్మగర్భంగా నక్కి నక్కి దాక్కొని నవ్వుల పాలవుతున్నప్పుడు నిజం, అబద్ధం మధ్య పల్లవించే ఒక చిన్న వాహిక నిట్టనిలువునా మనవ స్వరూపాన్ని మర్చేస్తున్నప్పుడు నన్ను నేను గుర్తుపట్టలేనంతగా ఏడ్చాను అపుకోవాలనే ప్రయత్నం లో వచ్చే నవ్వులో కూడా కన్నీరు తప్పలేదు చీకటి లో వెలుగును చూడలేని నా కళ్ళు నాలోని లోపలి చిత్రాన్ని పరిశీలిస్తున్న విషయం నాకే తెలియకుండా నా హృదయంలో కన్నీటి బావి తవ్వుతోందంటే ఒక విధంగా నేను కన్నీటి సముద్రానికి రుణగ్రస్తురాలినే. భూమిని తవ్వుతుంటే నీటి జల ఊరినట్లు వేడి ఆవిరికి ఆకాశం కుంభవృష్టి కురిపించినట్లు జనన మరణాల చట్రంలో జీవితం కొట్టుమిట్టాడుతున్నట్లు నాలో వాస్తవ దృశ్యాలు నిక్షిప్తమైనందువల్లే నా ఈ కన్నీళ్ళంతా ! ఎండ ఎంత కాచినా భూమి పగిలిపోదు వర్షం ఎంత కురిసినా భూమి మునిగిపోదు ఈదురుగాలికి. ఎదురుగాలికి ప్రపంచం ఎగిరిపోదు నాకంటూ మిగిలిన నా కన్నీటి చెలమ ఎండి పోదు...

by Sailaja Mithra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iNd95f

Posted by Katta

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

Sailaja Mithra కవిత

గది దు:ఖం // శైలజామిత్ర ఒక్కసారి చూడగానే మొదటి చూపు అనుకుంటాం పరిచయం చేసుకుంటాం అనేకం మాట్లాడుకుంటాం గది గోడల్ని కొత్తగా కలియజూస్తాం నిశ్శబ్దాల్ని ఒకసారి, నిజాల్ని మరోసారి తెలుపుకుంటాం ఆ సమయం లో ఆ గది ఒక ప్రపంచంలా కనిపిస్తుంది ఒకరినొకరు ఆశాంతం చూసేందుకు తటపటాయిస్తాం పదే పదే గొంతును సరిచేసుకుంటాం. అనవసర వ్యక్తిని మధ్యవర్తిత్వం వహించమంటాం ! గుండె తలుపు చూపుల కొక్కానికి తగులుకుని విల విల లాడినట్లు శరీరాన్ని తరచి తరచి చూసుకుంటాం ! బరువైన జ్ఞాపకాలకు నిట్టూర్పుతో సరిపెట్టేస్తాం ఒక్కరి ఎదుట కుర్చుని సమూహంలో ఉన్నట్లు భావిస్తాం ! రోజు మొదలవ్వగానే బయలుదేరాలని అలొచలనలను విడివిడిగా మూటలు కట్టేస్తాం ప్రయాణం మనల్ని వదిలి పోయిందని తెలుసుకుంటాం చలనాలన్నీ సంచలనాలుగా భావించుకుని చిరునవ్వుల దుప్పటిని కప్పేస్తాం ! విహార యాత్రలన్నీ కళ్ళల్లో నింపుకుంటాం జీవన యాత్రకు మాత్రం కాళ్ళనే ఉపయోగిస్తాం గురిపెట్టిన హృదయాన్ని కడిగి కడిగి ఆరపెట్టేస్తాం చివరికి మనసును అంట్ల గిన్నెల మధ్య పడేసి ఎప్పటికప్పుడు కడుక్కుంటాం!! ఇంతే కదా జీవితం అనుకుంటాం ! ఎప్పటికప్పుడు అప్పుడే ప్రారంభం అయిందని తెలుసుకునేందుకు సమయంతో పోరాడతాం గెలుపు ఓటమిల నడుమ సన్నని రేఖ లా మిగిలిపోతాం ! 21-02-2014

by Sailaja Mithra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dU8tgc

Posted by Katta

22, సెప్టెంబర్ 2012, శనివారం

శైలజామిత్ర :ఉదయ స్వరం..


తలుపు తెరవగానే
గ్రీటింగ్ కార్డ్ లా చెట్టు
ఆహ్వానం పలికింది!
పూలన్నీ అక్షరాల్లా
ఉదయానికి ఆహ్వానం చెబుతున్నాయి!

ఉదయం ప్రతిరోజు
కొత్త ఉహల్ని జతచేసుకుని
పాత రూపాన్ని
మనకు జ్ఞాపకంగా ఇస్తూ వస్తుంది

కొత్త అద్దంలా ఆకాశం
మెరిసిపోతూ
తన చుక్కల చీరను మార్చుకుంటూ
సూర్యుని రాకకై
ఎదురు చూస్తుంటుంది..

శూన్యంలో తిరుగాడే గ్రహాలు
పాతవే అయినా
ఏరోజుకారోజు
కొత్త అర్థాల నగిషీలను
అలంకరించుకుంటుంది

కాలానికి, కలానికీ
సోదర సంభంధం ఉంది
నదికి రెండు తీరాల్లా
ప్రకృతి దృశ్యం, సమాజ చైతన్యం
జత పడి
మనిషి కొత్త కలలకు
అందమయిన రుపాన్నిస్తుంది

జీవిత పుస్తకంలో
రోజూ వారీ రహస్యాలు
కొండరాళ్ళ మధ్య దాగిన జలాల్లా
గుండె గొంతులోని స్వరాల్లా
సమయం చూసుకుని
బయటకు వస్తాయి.
గట్టును దాటలేని ఆశలు మాత్రం
ఆలోచనల నదిలోనే కొట్టుమిట్టాడుతుంటాయి..

భోధనలేందుకు?
త్యాగం చాలు కదా అనుకుంటూ
ఎవరు ఏమి కోరకుండానే మేఘం
అందరికీ ఆనందాన్ని ఇస్తుంది

రవి చంద్రులు
రాత్రి కవాటాల్ని తెరుస్తూ
కిరణాల అశ్వాన్ని అధిరోహించి
కవితగా మారి
కవి హృదయంలోకి చేరిపోతుంది

గాలి ప్రశ్నిస్తుంది
ప్రవాహ రూపం నిలదీస్తుంది
మానవీయ ముద్రతో
అతి సున్నితమయిన
క్షణాల్ని తట్టి లేపితే
ఈ దిశ అయినా సరే
ప్రకృతిలో ఏకమవుతుంది..

17 -09 -2012

27, ఆగస్టు 2012, సోమవారం

శైలజామిత్ర : ''నన్ను నన్నుగా..!''

ఎప్పుడో గాయపరిచి
సరాసరి గుండెలోకే దూసుకుపోయిన బాణం
ఇప్పటికి జ్ఞాపకాల
ముందు వరసలో ఉంది.
మానవీయ ప్రదర్శన అక్కడే!
నా గుర్తుగా ఉండనీయండి !

గాజు చెట్లతో నిండిన మానవారణ్యంలో
శరీరం ఒక వెదురు బద్ద లా ఉంది
అజ్ఞానం మనిషిని శిల గానో, చీకటి గానో మార్చితే
అప్పటికప్పుడు ఆయుధంలా మారింది
అనుమానపు నీడలు అక్కడే!
నా రూపం అక్కడే పాతేయ్యండి!

మనసులో ఎప్పటికీ ఒక
మరువలేని కల!
అంతా అలంకృతమే!
పుట్టుకతో రెక్కలు మొలిచినట్లు
మరణం మొక్కై నిలిచినట్లు..
గేటు ముందు బిక్షువు నిలబడేది అక్కడే!
నా మాటగా అతనికి నీడనివ్వండి!

అడుగు అడుగుకు వాడిపోయే మస్తకం
అద్వాన్నంగా నలిగిపోయే హృదయం
గతంలో మతంతో రాలేదు
జీవన్నాటకంలో ఒక పాత్రతో వచ్చింది
ఓట్లు కోరే ముఖ యంత్ర స్థానం అక్కడే!
నన్ను నన్నుగానే బతకనీయండి..!.

*24-08-2012

17, ఆగస్టు 2012, శుక్రవారం

ప్రయత్నం మరింత ముందుకు సాగాలి - Sailaja Mithra


నిన్నటి వాతావరణం అంతా కవిత్వం తో నిండిపోవడం చాల బావుంది. తెలియని వారినందరినీ కలిపి చేసిన ఈ సభ కొత్తదనంతో నిండి రొటీన్ కు బిన్నంగా నడిచింది. అతిదుల ప్రసంగం ఎన్నో విషయాలు తెలిపాయి. యాకుబ్ గారి ప్రయత్నం విజయవంతం అయ్యింది.పేరు పేరునా పలకరిస్తూ ఆదరించిన యాకుబ్ గారి ఆతిధ్యం ఎంతో నచ్చింది. వారి ప్రయత్నం మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.

15, ఆగస్టు 2012, బుధవారం

శైలజామిత్ర || తెల్లని ఆకాశం ||

గుండె ఆవిర్లు
చల్లరుతున్నాయి.
మరో మారు పంచడానికి కాదు
నన్ను నేను ఒదార్చుకోవడానికి..

సజీవ మనో స్పర్శకు
అనుభవాల మొన తగులుతుంది
జ్ఞాపకాల ఫలితానికి
మనసు పత్ర హరితాన్ని పోగొట్టుకుంటుంది

తలుపు గొళ్ళెం పడినా
రెప్ప పడని ఎదురు చూపులు
తడిని కోల్పోయిన కళ తప్పిపోయిన
మమతల మడత మజిలీ

ఎన్ని అవమానాలో ఈ జీవితానికి
దిక్కులే మనిషికి చుక్కలు
నిద్ర లేమికి ఓదార్పు ఇంటి చూరున
వేళ్ళాడే సాలె గూడే!

ప్రవాసాల ప్రకంపనల మధ్య
నిలబెట్టి గుట్టు చెప్పాలని
ఒకరినైనా నమ్మించి తరించాలని
ఒంటరి సెగలో కాలిపొతూ...

తెల్లని ఆకాశంపై
నల్లని సంతకం
రాసి పారేసిన గతం !
నేడు క్యాటరాక్ట్ పొరల మధ్య
మసకబారిన ఆత్మీయ స్వరం !
*13-08-2012

31, జులై 2012, మంగళవారం

శైలజా మిత్ర || గాలిలో దీపాలు ||

లేవండి! ... లేవండి!
మానవులారా లేవండి
మరణ సమయం మనతోనే ఉంటోంది
అందరూ తరిమి కొట్టండి!

నడుస్తున్నా! నవ్వుతున్నా!
మాట్లాడుతున్నా!ప్రయాణిస్తున్నా!
కళ్ళు విప్పే ఉండండి
నిద్రను మరచి మరీ
లేవండి! మానవులారా! లేవండి!
జీవితంలో ఎన్నో ఆశలు
ఉన్నాయని ఎప్పుడూ అంటూనే ఉన్నారు!.
అనుకున్నది సాధించేదాకా
నిద్రపోకండి..అలక్ష్యంగా ఉండకండి.

కళ్ళు విప్పాలి మరి
లేచి మీ విలువైన సంచులతో పాటు
అంతకంటే విలువైన ప్రాణాన్ని
మడతలు పెట్టుకుని మరీ
చేతులో పెట్టుకోండి
ఈ క్షణమైనా పరుగులేత్తల్సిన అవసరం రావచ్చు
ఈ నిముషమైన దుకాల్సి రావచ్చు
నిద్ర మత్తులో ఉండకండి!

కొన్నాళ్ళు మనం నిద్రపోయాము
కాస్తయినా అదృష్ట వంతులమే!
నేటి తరానికే పాపం
నిద్ర పోదామన్నా వీలుండటం లేదట!
విషయం ఏమిటంటే
మరణం రక్తానికి అలవాటు పడిందట !
కళ్ళు మూతలు పడుతుంటే
కంటిపై నీరైనా, గత౦లోని
రక్త చిత్రాల తాలుకు కన్నీరైనా
గుండెపై చిలకరించుకోండి
కాని నిద్ర పోవడానికి మాత్రం ప్రయత్నించకండి !

చెబుతుంటే వినిపించడం లేదా ?
ఓ! మనిషీ
అక్కడ మనసులన్నీ మారణ హోమాలై
మండిపోతున్నాయట !
బంధాలన్నీ బూడిదై పోతున్నాయట!

లేవండి లేవండి !
మరణం విలువ ఇప్పుడు
పెరిగిపోయింది
మరణం దారులు
క్రిక్కిరిసిపోతున్నాయట!
ఎంత పనిలో ఉన్నా
కళ్ళల్లో వత్తులు వేసుకుని
మానవులారా ! మేలుకోండి
మన పిచ్చిగానీ
ఇప్పుడు మరణానికి జననానికి
పెద్ద తేడా ఏముందని?
రెండూ గాలిలోని దీపాలే !
*31-07-2012