పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Sky Baaba లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Sky Baaba లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జూన్ 2014, సోమవారం

15, జూన్ 2014, ఆదివారం

14, జూన్ 2014, శనివారం

Sky Baaba కవిత

దెవులాట --------- పూలు విరగ పూశాయి ఇక సీతాకోకకు లోకంతో ఏం పని? * వెలుగులో వెతుక్కుంటున్నావేమో.. నేను కాచుకున్నచోట చీకటి అలుముకుంది! * కృత్రిమ అలంకరణ లెందుకు నీకు? ప్రకృతి పువ్వును నేను! * ఎన్ని కలల గూళ్లు అల్లాను నీ కోసం నువ్వు రాక అవి పడావు పడుతున్నాయి * నన్ను విడిచి ఉండలేనని ఎన్నెన్ని వాగ్దానాలు చేశావు ఇంతలో ఎలా మరిచిపోయావు అవన్నీ * ఇంకా అక్కడే నిలబడి ఎదురుచూస్తున్నాను నువ్వు తప్ప అందరూ నన్ను దాటివెళ్లిపోతున్నారు * నువ్వెలా ఉండాలనుకుంటున్నానో అడుగుతోంది లోకం నువ్వెలా తారసపడతావో నాకేం తెలుసు * ఎక్కడ ఎదురుపడతావోనన్న ఉద్విగ్న ఎదురుచూపులు నావి నన్ను పరీక్షించడానికే తప్పించుకుని తిరుగుతున్నావు * జగమంతా నా కాలి కింద భూగోళమై దొర్లుతున్నది ఇంతదాకా నువ్వు నాకు తారసపడనే లేదు

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1veM1VO

Posted by Katta

13, జూన్ 2014, శుక్రవారం

Sky Baaba కవిత

రెహాల్ ``````` కన్నీటి దారాల్తో జీవన వస్త్రానికి మాసికలేస్తూ తరాల చీకటి కమ్మేసిన గోషా లో పాలిపోయిన చంద్రశిలా దేహంతో అనుక్షణం 'బిస్మిల్లా ఇర్రహ్మాన్ నిర్రహీమ్' అనే కదులుతుంది అమ్మీజాన్ మొహంపై వేలాడుతున్న నైరాశ్యాన్ని 'వజూ' నీళ్ళతో పుక్కిలించి తలనిండా చిరుగుల 'దుపట్టా' కప్పుకొని నమాజ్ చదువుతున్నపుడు... మెరుపు వెలిసిన అమ్మీ దోసిలిలో రాలిన కన్నీటి తడిపై ఏ దేవుడూ సాక్షాత్కరించడు ఒక అపనమ్మకాల బొమికల గూడు ప్రతిబింబిస్తుంది అస్తమయం వైపుకు మోకరిల్లి ప్రార్ధిస్తూ మా జిందగీల్లో సుర్యోదయమౌతున్దనుకుంటుంది అమ్మీ మాకోసం 'దువా' చేసి చేసి అమ్మీ గొంతు తడారిపోతుందే తప్ప... ముందు కూర్చున్న నీడ విస్తరించి కటిక రాత్రై పరచుకుంటుందే తప్ప... ....... ......... ......... ......... .......! 'తల్లి పాదాల వద్ద స్వర్గం ఉందంటారు' మా అమ్మీ పాదాలకై వంగిన ప్రతిసారీ చెమరిన నా చూపు ఆమె పాదాల పగుళ్ళలో చిక్కుకుని గిలగిలలాడుతుంది అబ్బాజాన్ అసహాయత చెల్లిని ఎవడికో రెండో పెళ్ళాంగా అంటగడితే ఆ చిట్టితల్లి కళ్ళల్లో ఉబికిన కన్నీళ్ళ మీద వణికే దృశ్యమై తల్లడిల్లుతుంది అమ్మే కాన్వెంట్ కు బదులు కార్ఖానా కెళ్ళే తమ్ముడు సాయంత్రానికి కమిలిన దేహంతో అల్లుకుపోతే పగిలిన లేత స్వప్నం గుచ్చుకొని విలవిల్లాడేదీ అమ్మే కడుపులో మా భారాన్ని మోసి కష్టాల మా బాధ్యతలు మోసి కళ్ళ గుమ్మానికి కట్టిన పరదాల వెనక ప్రాతివత్యాన్ని మోసి తన కనుబొమ్మల నెలవంకల మీద చీకటి రాశుల్ని మోస్తున్న అమ్మ చివరకు ఖురాన్ ను మోసే 'రెహాల్' మిగిలిపోవలసిందేనా ? (రెహాల్ : వ్యాస పీఠం)

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1v8dQPi

Posted by Katta

12, జూన్ 2014, గురువారం

Sky Baaba కవిత

సూఫీ దేవుడు `````````````` అబ్బాజాన్ నవ్వుతున్నడు చిన్న పిలగాని లెక్క చిటికెన వేలందించి నాతో తప్పటడుగులు వేయించిన అబ్బా ఇయాల నా చెయ్యి పట్టుకొని అడుగేస్తానికే తడబడుతుండు పక్షవాతపు ఒళ్ళు తూలినప్పుడల్లా నవ్వుతున్నడు అబ్బాజాన్ పసి పిలగాని లెక్క * * నిండైన గడ్డం - టోపీ పెట్టి తెల్లని లాల్చీ - లుంగీ కట్టి కదిలొస్తుంటే అచ్చం ఆ సూఫీ దేవుడే ... ... ! పీర్ల ముందూ నువ్వే కందూర్ల ముందూ నువ్వే పుంజునో పోతునో హలాల్ చెయ్యాలన్నా ఫాతెహా లియ్యాలన్నా నువ్వే తేలు కరిసినా పురుగు ముట్టినా నీ మంత్రమే కావాలె పసి కందులకు నీ అంత్రమే కట్టాలె ఏ ఇంట్లో ఏ ఆపదొచ్చినా - నొప్పొచ్చినా గుర్తొచ్చే మొదటి దేవుడా ! నీ మాట చాలు - నీ ఆభయమే 'మేలు' ! సుక్క పొడవక ముందే ఎన్ని ఇండ్లల్లో పలికేదో - నీ పేరు 'మదారు సాబు కాడికి తోల్క పోవాలె ' మదారు సాబును పిల్సుక రావాలె ' మాల మాదిగలూ సూదర్ల బారు ! * చేతులెత్తి నువ్వు దువా చేస్తే ఊరందరికీ కొండంత అండనిపించేదే.. మరి మన ఇల్లెందుకు అబ్బాజాన్ పడావు పడ్డది దువా చదివి నువ్వు జుబా చేస్తే ఆ ఇంటిల్లాదులకూ కందూరు పండుగయ్యేదే.. మరి మన ఇంటోళ్ళ కెందుకు అబ్బాజాన్ ఉపాసముండని రోజు లేకుంటయ్యింది మనకు చేలేందుకు లెవ్వో - చెల్క లెందుకు లెవ్వో పొల మెందుకు లేదో - తల మెందుకు లేదో చేతిలో ఆరె ఎందుకు లేదో ఇంటి ముందు సారె ఎందుకు లేదో ఇంట్లో మగ్గం ఎందుకు లేదో ఏనాడూ చింత చెయ్యవైతివి అబ్బా రిజర్వేషన్ మాటెత్తితే సర్కారు బిచ్చం మనకెందుకురా అంటివి గొంతెత్తి పాడేటోనివి - నిర్వేదంగా.. 'యే దునియా యే మహెఫిల్ మెరే కామ్ కీ నహీ మెరే కామ్ కీ నహీ..' * చేతులెత్తి నువ్వు దువా చేస్తుంటే భూగోళమే మెల్లమెల్లగా చిన్నదై నీ కాళ్ళ కింద చేరి చిన్నబొయ్యేది ఊరందరి నోట్లో నాలుకైన నువ్వు ఇంటి పరేశాన్లకు బైటివాడివైతివి 'భద్రత' తెలియని నిరంది సొంతానికీ.. కుటుంబానికీ.. అంతా బేగం మీద వోదిలేసే బేచింత ! నువ్వే అదృష్టవంతుడివేమో అబ్బా అందరిలా ఏదో ఇంకేదో సంపాయించాలనే యావేదీ లేకుండా బేఫికర్ గా బతికినవ్ ఎవరేమనుకుంటే నీకేంది అది నీ తత్వమో - 'నసల్ ' నైజమో మాక్కూడా నీలాగే బతకాలని ఉంది జర గా ఉపాయం చెప్పరాదే ! * * అబ్బాజాన్ నవ్వుతున్నడు నిర్వేదంగా... అబ్బాజాన్ నవ్వుతనే ఉన్నడు మారని మమ్మల్ని చూసో... మారిన లోకాన్ని చూసో...

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1s7WLXM

Posted by Katta

11, జూన్ 2014, బుధవారం

Sky Baaba కవిత

గుజ్రా ````` నా వెనుకటి తరాల కొనసాగింపుకి మాతృక ఆమె ఆ గాడిలోనే కదుల్తుంటే నిశ్చింతల అలౌతుంది కంటి కొస తప్పినా ఏ కొత్త పాదం విప్పినా గుబులు దిగులైపోయి నన్నామె ప్రేమైక ఉచ్చులా అల్లుకుపోతుంటుంది ఏ ముగుతాళ్ళూ మోయలేని అసహాయుణ్ణి ఏ మాధుర్యపు కౌగిలింతల్నైనా విదిల్చేసే క్రూరుణ్ణే ఏ అంతరాల అభ్యంతరాల గోడా నన్ను నిలువరించలేదు కలకెత్తుకున్న ఆమె ఏ ఆశనూ నిజం చెయ్యలేను నా అవిశ్వాస నిర్భయత్వమూ తన విశ్వాసాల విలువల పిరికితనమూ ఘర్షణ పడే ప్రతీ - ఘటనా మా గుండె లయల మధ్య దూరాన్ని పెంచుతోంది ఏడవ శతాబ్దాల కమాన్ అవతలే ఆగిపొయ్యావంటే అర్థం కాని అజ్ఞానందే కావొచ్చు వెనుకబాటుతనం కూడా అల్లాకా దేన్ హై అని నమ్మే అమాయకందే కావొచ్చు ఆమె ప్రేమ జలపాతపు తడి ఎన్నటికీ ఆరేది కాకున్నా చిటికెన వేలొదిలి చూపుడు వేలెత్తుతున్నవాణ్ణి భావదైన్యంతో తనెంత నిలువరించబోయినా ఏ నిర్ణీత కక్ష్యలోనూ ఇక తిరగలేను ఆ గురుత్వాకర్షణలోంచి బయటపడ్డవాణ్ణి ఎంత స్వచ్ఛమైనా సరే - మతమూ అమ్మా ప్రియురాలూ... ... !

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ocMOXw

Posted by Katta

10, జూన్ 2014, మంగళవారం

Sky Baaba కవిత

దీమక్ : చెద ````````````` 'నౌకరి సంపాయించుకోలేదా? ఉద్యోగం పురుష లక్షణం' అన్నారు కొన్ని ఈకలు రాల్చి ఉద్యోగం సంపాదించుకున్నాను నాకిష్టమైనవి వదిలి - పగలంతా మా యజమానికి ఇష్టమైనదే చేయబట్టాను 'ఇంకా షాదీ చేసుకోలేదా? ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి' అన్నారు కొన్ని రూకలు పుచ్చుకొని పెళ్లి చేసుకున్నాను మిగిలిన నాకిష్టమైన వాటిల్లో సగం నా భార్య కోసం వదిలేశాను - రాత్రులతో పాటు 'ఇంకా పిల్లలు కనలేదా? ముసలోల్లయ్యేనాటికి దాచుకున్న పైసలో చేతికొచ్చిన ఔలాదొ ఉండాలి' అన్నారు కొన్ని నూకలు సంపాదించి పిల్లల్ని కన్నాను నా కిష్టమైనవి ఇంకొన్నింటిని వదులుకున్నాను 'ఇంకా ఇల్లు కట్టుకోలేదా సొంత మకాన్ లేకుండా ఎన్నాళ్ళు' అన్నారు కొన్ని అప్పులు చేసి ఇల్లు కట్టాను దాని చుట్టే తిరుగుతున్నాను మిగిలిన ఇష్టాలూ వొదులుకొని..

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oGZeV9

Posted by Katta

9, జూన్ 2014, సోమవారం

Sky Baaba కవిత

చాంద్ తార ``````````` 'చాంద్ తార' పేరు తో నేను, షాజహానా రాసిన రెండు వాక్యాల కవితలు పాకెట్ సైజ్ పుస్తకంగా వేశాం. ఒక వాక్యం చాంద్, ఒక వాక్యం తార అనుకున్నాం.. నేనూ.. షాజహానా కూడా..! ఈ పుస్తకానికి పెన్నా శివరామకృష్ణ ముందుమాట రాశారు. నేను రాసిన కొన్ని చాంద్ తార లు ఇవి. *** విహరిస్తూ చంద్ర భ్రమరం అడవి ఒక ఆకుపచ్చని పుష్పం *** చీకటంటే భయమనిపించదు చిన్నప్పుడు అమ్మీ బుర్ఖాలో తలదాచుకున్నట్లుంటుంది *** వర్షం మొదలయ్యింది గొడుగు పువ్వుకు నన్ను కాడను చేస్తూ *** ఉర్సులో రోల్డుగోల్డు హారం కొన్నది అమ్మీ అబ్బా మొఖం చిన్నబోయింది *** మా నానిమా పండిపోయింది పాన్ నమిలి నమిలి *** అటు కాకికి ఇటు నాకు నోరూరిస్తున్నది కవాబుల దండెం *** కాలువ, నేను పక్కపక్క నడుస్తున్నం అది పొలంల కలిసింది, మరి నేను? *** బస్సు కదిలింది దిగులుగా చేతులూపుతూ ఓ ఒంటరి చెట్టు *** పూలను తన్మయంతో చూస్తుంటావు ప్రపంచమూ నిన్నలా చూడొద్దూ తెలంగాణ చాంద్ తార `````````````````````` పోటీ పడేది బుడుబుంగ పిట్టా నేనూ ఇప్పుడు నీళ్ళతో పాటు అన్నీ మాయం *** ఎండిన ఏటి పక్క రైతు ఎదురుచూపులో చూపు పోయింది *** గూడు కట్టిద్దామనుకున్నానామెకు పొడి ఇసుక ఎక్కిరించింది *** ఒడ్డున నడుస్తున్నం ఏటి లెక్కనే ఎన్ని అనుమానాలో భవిష్యత్తు మీద *** ఒక రేక కల్లు పట్టిచ్చిన సూరీడు తెల్ల మొఖమేసిండు *** చేపల పులుసు తలపుకొస్తే ఎండిన చెరువుల నీళ్ళు నోట్లె ఊరబట్టె *** జాన్పాడ్ దర్గా చుట్టు జానయ్యలు సైదమ్మ లే బోసి నుదుళ్ళ జాతర *** పట్న మొచ్చి శానా ఏళ్ళయ్యింది నెల పొడుపును ఊళ్లె ఒదిలి *** చాన్నాళ్ళకు కలిసిన దోస్తు కు అలైబలై ఇవ్వబోతి త్రిశూలం గుచ్చుకుంది *** చిన్నప్పుడు గీసుకున్న బొమ్మలన్నీ అలాగే..! ఒక్క నేను తప్ప..!!

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hy6XEq

Posted by Katta

8, జూన్ 2014, ఆదివారం

Sky Baaba కవిత

పహ్‌లా గులాబ్ హీ పహ్‌లా కాంటా! ```````````````````````````````````` సైకిలేసుకొని టౌనంతా చక్కర్లు కొట్టేది నూనూగు మీసపు నా తొలి యవ్వనం కాలేజీ బెల్లవ్వగానే రోడ్డంతా గులాబీలు చూపుల దారం చాలేది కాదు... బెదురు బెదురుగా పారిపోయే ఒక కల- కాంచనమాల అలలు అలలుగా ఉబికే సెలయేటి పాట- లెనీనా పెంగ్విన్‌ పక్షిలా కదిలిపోయే ఒక జరీనా బేగం ఎన్ని జంటల కనుపాపల్లో కాపేసే వాళ్లమో...! *** నువ్వు తారసపడ్డ తొలిరోజు నీ కళ్లుండే చోట రెండు సుందర ప్రపంచాలు దొరికాయి నాకు ... ముఖం కేంద్రంగా నీ దేహం ఒక సౌర కుటుంబంలా తోచేది ... గల్లీ చివర నువ్వు - వెనుదిరిగి చూసిన రోజు మనసు మానస సరోవరమై మంచుఖండాల అంచులు దాటింది సంశయించీ.. సందేహించీ.. అధైర్యించీ.. చివరాఖరికీ నిన్ను పలకరించిన రోజు నీ నవ్వు నయాగరాలో తానమాడాను కనురెప్పకింద నా కలల పాపల్లే అల్లరి పెడుతుంటే పక్కమీద ఎంతగా దొర్లేవాడినో... తెల్లారి చూస్తే పైజమాపై రాత్రిలేని ఓ తెల్లపువ్వు ! *** కాలేజ్ రోడ్లోకి మళ్లగానే నీ కళ్లల్లో నేనో మెరుపు మొగ్గనై... కళ్ల పడగానే లయ విరిగే నా గుండెల్లో పెరిగిన శ్వాసవై... ఎన్ని కాంతి సంవత్సరాల్ని ఈదాకో పూదోట సుబూత్ గా నేనందుకున్న తొలి గులాబీ సాయంత్రం మన మధ్య ఓ నాలుగు పాలపుంతలు దొర్లిపోయాయో లేదో నా పేరు విడమర్చగానే సూర్య నక్షత్రం చప్పున ఆరిపోయి నా నిషానూ మెరుపునీ స్వప్నదరహాసాల్నీ బ్లాక్‌హోల్ లా లాక్కుని వెళ్లిపోయిన నీ చివరి చూపుకి ఛిద్రమై S..K...Y..O..U..S..U..F...B..A..B..A..

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lfx9mG

Posted by Katta

7, జూన్ 2014, శనివారం

Sky Baaba కవిత

లొంగని వీరుడికి సలాం! ````````````````````````` ఒక్కో భూమ్మీద ఒక్కో పేరుతో పుట్టుకొస్తుంటాడు లొంగనితనం వీరుడి మాతృక తన నేలను ఖబ్జా చేస్తూ తన నాలుకనే తెగ్గోస్తున్న వాడికి చివరి శ్వాస దాకా లొంగనితనం వీరుడి పోరాట రూపమే.... నీళ్ళను కొల్లగొట్టి- ఆకుపచ్చదనాన్ని కొల్లగొట్టి బీళ్ళు చెయ్యజూస్తుండు శత్రువు పెట్రోలును కొల్లగొట్టి- సకల జీవత్వాన్ని కొల్లగొట్టి ఎడారులే చెయ్యజూస్తున్నడు శత్రువు వీరుడన్నవాడు సై అంటాడా వీరుడన్నవాడు ఖామోష్‌గుంటాడా ఖబర్దార్‌ అంటూ గుండెల్లోంచి కేక వేస్తాడు భూమి తల్లికోసం బలిదానమవుతాడు ఇరాకీ పిల్లవాడి తెగిన కలల రెక్కలు చూసి చలించకుండా ఎవడుండగలడు? వేల ఒక జాతి జనాన్ని సమాధి చేయడం చూసి రగలకుండా ఎవడుండగలడు? ప్రపంచపటంమీద ఒక జాతి వతన్‌నే మాయం చేయాలనే కుట్రను చూసి ఎవడు భరించగలడు? రేపు మరొక దేశం ఖబ్రస్తాన్‌ అవబోతుండడం చూసి ఊకుండగలడా? చుట్టూరా చేతులు కట్టుకొని చూస్తున్న దునియా ఘడియకో మాటమార్చే దునియా సిగ్గూ శరం లేకుండా సాష్టాంగపడే దునియా లొంగని వీరుడిముందు బలాదూర్‌ వీరుడెప్పుడూ నిజం మీదే నిలబడతాడు వెన్నెముకే ఆయుధంగా కలబడతాడు శాంతికోసమే ఆయుధం పడతాడు ఓడిపోవచ్చు కాని లొంగిపోడు ఒక్కో భూమ్మీద ఒక్కో పేరుతో పుట్టుకొస్తుంటాడు లొంగనితనం వీరుడి చిరునామా వీరుడు బరిసెనో బాణాన్నో పట్టినప్పుడు తెల్లోడు బందుఖుతో వచ్చాడు వీరుడు బందూఖు పట్టినప్పుడు తెల్లోడు బాంబు లేశాడు వీరుడు బాంబులేద్దామంటే తెల్లోడు మిసైళ్ళు ప్రయోగిస్తున్నాడు శత్రువు గెలవొచ్చు జనంలో వీరుడే నిలుస్తాడు ఒక్కో భూమ్మీద ఒక్కో పేరుతో పుట్టుకొస్తుంటాడు లొంగి బతకడం వీరుడి నైజం కాదు రాళ్ళను పగులగొట్టే వాళ్ళల్లోంచి ఇనుమును కరగదీసే వాళ్ళల్లోంచి నీళ్ళను మండించే వాళ్ళల్లోంచి ఒక్కో వీరుడు పుట్టుకొస్తూనే ఉంటాడు ఒక్కో చోట ఒక్కో పోరాట రూపం తీసుకుంటాడు శత్రువు బలవంతుడే కావచ్చు జిత్తుల మారోడే కావచ్చు నిజం వీరుడి చేతిలోనే ఆయుధంగా నిలుస్తుంది నిజం వీరుడి చేతిలోనే ఆయుధమై మెరుస్తుంది చివరి మాట దాకా నిజమే వీరుడి నోట పలుకుతుంది 'సామ్రాజ్యవాదం డౌన్‌ డౌన్‌! అమెరికా డౌన్‌ డౌన్‌!' జడ పదార్ధాలకు రాజుకునే గుణాన్నిచ్చే ఉత్ప్రేరకం నిశ్చల నరాల్లోకి వెచ్చని ఊపిర్లూదే ప్రాణవాయువు లోకమంతా పాకుతున్న లొంగిపొయ్యే వైరస్‌ను నిలువరించే రెసిస్టెన్స్‌ ఒక్కో భూమ్మీద ఒక్కో పేరుతో పుట్టుకొస్తుంటాడు ఉరకలెత్తే ఉడుకురక్తాల ఆత్మల్లోకి ప్రవేశిస్తుంటాడు ఇజ్రాయెల్‌ యుద్ధట్యాంకుపై రాయి విసిరే బాలుడో తెల్ల రక్కసి మూక మధ్య పేలే మానవబాంబో స్వేచ్చను కోరే కశ్మీరీ గొంతుకో నిజమైన పౌరసత్వం కోసం నినదించే భారత ముస్లిమో ఒక్కో భూమ్మీద ఒక్కో పేరుతో పుట్టుకొస్తుంటాడు ఒక్కో చోట ఒక్కో రూపంలో ప్రతిఘటన ఒక్కో స్థాయిలో పోరాటం పోరాటం ఎక్కడైనా పోరాటమే కదా దురాక్రమణ ఎవడు చేసినా దుర్మార్గమే కదా వీరుడు పోరాడుతున్న భూమి ఎకరమో...రాష్ట్రమో... దేశమో... నాటి బందగీకి సలాం నేటి తెలంగాణ పోరుబిడ్డకి సలాం ఆజాదీ వీరుడికి సలాం పాలస్తీనా చిరునవ్వు అరాఫత్‌కి సలాం ఇరాకీ గర్జన సద్దాంకి సలాం భూమికోసం పోరాడుతున్న వీరుడికి సలాం! మాతృభూమి కోసం పోరాడుతున్న వీరుడికి సలాం!

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hoaaX0

Posted by Katta

6, జూన్ 2014, శుక్రవారం

Sky Baaba కవిత

ఐ -- 'సర్వేంద్రియానాం ... ... ...!' అందమైన చిన్నప్పటి కన్ను పాఠం... కన్ను బొమ్మ ఎంత ముద్దుగా గీసేటోన్నో ఇప్పటికి కళ్ళల్ల తిరుగుతున్నది చిన్నతనం పెన్సిల్ మల్లమల్ల దిద్దిన నెమలి కన్ను కన్ను అంటె సాలు- అందమైన బొమ్మే మెదిలేది పెద్దయినంక తెలిసొచ్చె- అందమైన కన్నుకు - మాకు శానా దూరమని.. అరెరే... తేరుకునే లోపల్నే కాలం కన్ను సొనకారిపాయె ఇప్పుడు కన్ను అంటె- ఎంతకు నిద్దర పట్టక జీవం లేనట్లు కదలాడే గరీబు ఖాజామియా.. పంక్చర్లు బాగుచేసే ఉస్మాన్ భాయ్ డీలాపడ్డ చూపు.. మా అమ్మీ కంటి కింద నల్లగా- పగిలిన రేగడి! ఊర్లె శానా ముస్లిం ఇండ్లల్ల పెండ్లి కాని చెల్లెల్లా- అబ్బాజాన్ పక్షవాతపు రెప్పల మధ్య అడ్డంగా.. కళ్ళద్దాలు మసకబారి కుట్టుమిషిన్ సూదిల దారం ఎక్కని నానీమా తనుకులాట.. ఇయాల కన్ను అంటె- కొడుకు గూడలు పట్టుకొని లేవాల్సింది పోయి చీకటిపడితే గోడలు పట్టుకొని నడిచే మాదిగ ఎంకయ్యతాత.. ఎద్దు కొమ్ము విదిలిస్తే కారిపోయిన నాగయ్య మామ కొడుకు ఒంటరి చూపు.. పగిలిన ఒంటి కన్ను అద్దంతో కనాకష్టాలు పడే పెరిక లచ్చువమ్మ.. చిన్నతనంలో కొడుకుని తడిమి తడిమి చూసుకున్న యాదిల వాడు తప్పిపోయిన పట్నం బాటకు అతుక్కొని చితికిపోయిన ఈదయ్య కక్కయ్య.. అయ్యో.. తల్చుకుంటే ఊరంతా పరేశాన్లతోని కళ్ళన్నీ గుంతలు పడి చూపానకుంటయ్యె కన్ను ఇప్పుడు అందమైన బొమ్మ కాదురా తమ్మీ అగాధపు లోతుల్ని చూపే గుంత.. మా ఊరే ఇప్పుడు కన్ను ఊడబెరికిన ఖాళీ బొయ్యారం !

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1lam4Dl

Posted by Katta

5, జూన్ 2014, గురువారం

Sky Baaba కవిత

ఈద్ కా చాంద్ - - - - - - - - చీకటి గుండం లా నువ్వు ఎదురుపడ్డప్పుడల్లా నీ కనుపాపల్లో నా ప్రతిబింబాల్ని తప్ప ఏం ఏరుకోగలిగాననీ... అంతా రంజాన్ కోసం ఎందుకు ఎదురుచూస్తారో గాని నేను మాత్రం నిన్ను చూడొచ్చనే ఆశతోనే... 'అస్సలామలైకుమ్' తో నువ్వు శిర్ ఖుర్మా అందిస్తుంటే జిగేల్ మన్న తారల మధ్య ఆ చాందే నా దిక్కు వొంగినట్లు... ఒఫ్ఫో... సంవత్సరం పొడుగూతా రంజానే అయితే ఎంత బాగుండో... ప్చ్... నిన్ను అలాయిబలాయి తీసుకునే అవకాశమన్న ఉంటే నా దిల్ అలజడిని నీ గుండెలకు చేర్చేటోన్ని గదా...!

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1odYB5h

Posted by Katta

29, ఏప్రిల్ 2014, మంగళవారం

Sky Baaba కవిత

A Genuine feeling of A Muslim - - - - - - - - - - సంసిద్ధతా ప్రకటన - - - - - - - - - - - - రూహీ తబస్సుం (Akkampeta Ibraheem) రక్తవర్ణ దృశ్యమొకటి కంటిపాపపై వేలాడుతూనే వుంది దగ్ధమైన బతుకుకావ్యం గుండెగూటిలో జ్వలిస్తూనే వుంది అందరూ మర్చిపోయారు నేను తప్ప ఆదమరిచి హాయిగా నిద్రపోలేని భయం వొకటి పీడకలై వెంటాడుతూనే వుంది నలుచెరుగులా కమ్ముకున్న భ్రాంతి దేశమిప్పుడు అభివృద్ధి జ్వరంతో పలవరిస్తోంది ఒకే మందు ఒక్కటే మందు తిరుగులేని మందు మార్కెట్లో వైబ్రరిట్‌గా మరి ప్రత్యామ్నాయం లేదన్నట్లుగా మందు అనుకుంటున్నది కాలకూటమది తెలిసున్న పేగులు తెగిపడుతూ.. తపిస్తున్నాయ్. ఎవరికీ ఏ భయాలూ లేవు చీమ గుడ్డంత కూడా ప్రమాద సూచనా లేదు రేపటి స్వప్నాల్ని ఇప్పుడే కలగంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నట్లుంది పడగెత్తి వస్తున్న పెనుతుఫాన్నే చూస్తూ నేనొక్కడినే సుడిగాలి ఎగరేసుకుపోయిన వగుడాకునౌతున్నా భ్రమల మేఘం ఆకాశాన్ని ఆవరించింది ఆ మూల నేలంతా పచ్చగా మారిందట ఇప్పుడన్ని మూలలూ పచ్చదనం కోసం పరితపిస్తున్నాయ్ పచ్చగా మారడంకోసం ఎర్రని చెమ్మను పీల్చడం అక్కడి ప్రయోగం కదా మూలమూలనా పచ్చబడాలంటే ఎన్ని అరుపు నదులు కావాలో అన్ని తలలూ అంగీకారంతో ఊగిపోతున్నాయ్ ఆవగింజంత అభ్యంతరం ఏ కంటిలోనూ తొంగిచూడ్డం లేదు నా కళ్ళనిండా మాత్రం పులి మీసాలకంటిన చిక్కటి నెత్తుటి వర్ణం సరే... నా భయాలు నావి వాళ్ళ ఆశలు వాళ్ళవి ఐదేళ్ళకు ఒకసారి అవకాశమొస్తే బాగుపర్చే వాణ్ని భాగమిచ్చే వాణ్ని ఎంచుకునే భాగ్యం వాళ్ళదైతే బ్రతకనిచ్చే వాడికై దేవులాడే దైన్యం నాది ***** మున్ముందు రాబందు మళ్ళీ రెక్కలు చాచినప్పుడు చెల్లాచెదురయ్యే పావురాల గుంపులో నువ్వు నన్ను తేలిగ్గానే పోల్చుకుంటావ్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నెత్తురోడుతున్న ఈ కపోతం 'నా గూటిలోదే'నని నిర్ధారించుకుంటావ్ అంతరంగంలోనైనా అశ్రుకణమౌతావ్ అప్పుడు కూడా అక్కడిలాగే పచ్చబడ్డమే నువ్వూ కోరుకుంటే ఎరుపు నదినై ప్రవహించడానికి నేనెప్పుడూ సిద్ధం

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nBbHug

Posted by Katta

27, ఏప్రిల్ 2014, ఆదివారం

Sky Baaba కవిత

మృగమూ.. దాని సేవక మందా.. - - - - - - - - - - ఇపుడంతా మృగమాయలో ఉన్నారు.. తరాల నుంచి పోతపోసుకున్న బానిస మనస్తత్వం కదా- మనిషి రక్తం తాగి బలిసిన జంతువునే మృగరాజును చేయాలనే తపన.. మృగం సకిలిస్తున్నా జూలు విదిల్చినా పంజాలు చాపినా జువాల మంద కేరింతలు కొడుతున్నది గుహలోని అస్తిపంజరాల్లో అభివృద్ధి యాంటినాలు కనిపిస్తున్నాయట! మిగిలిన కళేబరాలకు ఆశపడే తోడేళ్ల మంద ఇప్పుడు జోరుమీదున్నది బొక్కలకు ఆశపడే కుక్కల మంద కాచుకుని ఉన్నది మందలు సరే..! తలలు నెరిసిన మేధావితనం మంద బుద్ధులవడమే చిత్రం ఎర్రెర్రని చైతన్యం వి'వర్ణ'మవుతుండడమే విషాదం కలం యోధులంతా 'జీ హుజూర్ ' కొట్టే కాలమొచ్చె అప్రకటిత శాసనకర్తలంతా వీలునామా రాసుకుంటున్న రోజులొచ్చె ప్రమాదాన్ని పసిగట్టి కాకులు కావుకావు మంటున్నా కోకిలలు ఖూనిరాగాలు తీస్తున్నాయ్‌ గద్దలు సంచరిస్తుంటే పావురాలు బెదిరిపోతున్నాయ్‌ ఎంత కాని కాలమొచ్చె..! చంపుడు పందెం ఆటంటే పడి చస్తున్నది మంద ఇక లాభం లేదు.. సైతాన్ గుహలోకి పోకుండా కొంకిరి కట్టెతో మంద కాలు గుంజాల్సిందే.. నీలి నీలి దారుల్లోకి మర్లేయాల్సిందే.. * (పత్రికలు అచ్చేయని కవిత)

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1liHRZ8

Posted by Katta

Sky Baaba కవిత

http://ift.tt/1ipmBeS

by Sky Baaba



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/RWy4O3

Posted by Katta