కవిత్వంతో ఏడడుగులు 38 . (యుక్రెయిన్ పడుచులలో ఒక ఆచారం ఉంది. పెళ్ళికి ముందు వాళ్ళు అల్లిన చేతిరుమాలు, నిశ్చితార్థంనాడు వరుడి ముంజేతికో, ఇంకెక్కడైనా ప్రస్ఫుటంగా కనిపించే చోటనో కడతారు. ) ప్రతివ్యక్తికీ కొన్ని విలువలు, కొన్ని నమ్మకాలు ఉంటాయి. అవి ఒక తరానికో, ఒక జాతికో, ఒక కాలంలో ప్రబలంగా ఉన్నప్పుడు అవి ఆ కాలపు జాతి సంస్కృతికి ప్రతీకలుగా మిగుల్తాయి. ఉత్తరకాలంలో వాటిని సెంటిమెంటు క్రింద తీసిపారేసినా, కొన్ని అచేతన వస్తువులకి విలువని ఆపాదించడం, అది మన సచేతన ప్రకృతిని ప్రభావితం చెయ్యడం సర్వసాధారణం. "కామార్తాహి ప్రకృతికృపణా చేతనా చేతనేషు" (కాముకులైనవారికి ప్రేమసందేశాన్ని పంపించడానికి వార్తాహరులు చేతన ఉన్నవా లేనివా అన్న విచక్షణ ఉండదు...) అని కాళిదాసు మేఘసందేశంలో అన్నమాటని పూర్వపక్షం చేస్తూ ఈ కవిత మనకి దర్శనం ఇస్తుంది. ఈ కవితలోని నాయకికి అప్పటికి ఇంకా పెళ్ళికాలేదు. నిశ్చితార్థం కూడా కాలేదు. కానీ వరుడికి గాలిద్వారా తన మనసులోని మాటను తెలియపరచడం ఒక ఎత్తైతే, యుద్ధానికి వెళ్ళిన వాళ్లు ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదని తెలిసినదై, చివరగా ఒకవేళ దురదృష్ట సంఘటన జరిగితే, పలికిన ఉదాత్తమైన వీడ్కోలు మరొక ఎత్తు. ఏ రుమాలు తన కాబోయే వరుడు తన ప్రేమచిహ్నంగా పదిమందికీ కనిపించేలా ధరించాలని కోరుకుంటోందో, అదే రుమాలుతో, దుర్విధివల్ల అతను మరణించి ఉంటే, అతని వదనాన్ని కప్పమని గాలిని ప్రార్థిస్తోంది. కవిత్వం ఎప్పుడూ వ్యక్తిత్వాలని పెంపొందించే దిశలో అవ్యక్తంగా కృషి చేస్తుండాలి అన్న విషయానికి నేను వోటు వేస్తాను. ఫ్లారెన్స్ రాండల్ లివ్జే (1874-1953) కెనడాలో స్థిరపడిన యుక్రేనియన్. ఆ భాషలోని ప్రేమ కవితల్నీ, యుద్ధ నినాదాల్నీ, విఫలప్రేమ వేదనలనీ, ఆ భాషకే పరిమితమైన కొన్ని నుడికారపు సొగసుల్నీ ఇంగ్లీషులోకి చక్కని శైలిలో అనువదించింది. దానికి ఈ కవిత ఒక చక్కని ఉదాహరణ. చేతిరుమాలు . సముద్రానికి ఆవలి అంచున సూర్యుడు ఎర్రగా, రక్త వర్ణంతో మునిగి ఉన్నాడు; ఆ కెంపువన్నె ప్రవాహపు వెలుగులో ఒక పడుచు మేలిమి రుమాలు అల్లింది. బంగారంలాంటి చక్కని చేతికుట్టుతో ... ఈ రేయి ఆమె చెక్కిళ్ళు తెల్లకలువల్లా కనిపిస్తున్నాయి... కన్నీట కడిగిన స్వచ్ఛమైన కలువల్లా ఆల్లిక పూర్తవగానే దాన్ని గుండెలకి గాఢంగా అద్దుకుంది; తర్వాత, కళ్ళు ఎరుపెక్కేలా ఏడుస్తూ తలుపు బార్లా తెరిచింది: ఓ బలమైన పవనమా! నా పక్షిరాజా! ఇది నీ రెక్కలతో తీసుకు పో! డునాయ్(1) అంత బలంగా వడిగా ముందుకి ఎగిరిపో! ఓ స్వేచ్ఛా పవనమా! ఇప్పుడు అతనెక్కడ పనిచేస్తున్నాడో అక్కడకి పోయి నా కోసం దీన్ని అతనికి అందించు. ఎక్కడున్నాడో నీ మనసుకి తెలుసులే. 'అతనిపుడు ఉలాన్స్ (2)లో ఉన్నాడు' ‘సేనలు యుద్ధం చేస్తున్నాయి. వెళ్ళు, వెళ్ళు, నా బంగారమా! అతనున్న చోటు చేరేదాకా పగలల్లా గాలిలో తేలిపో! నా బంగారమా! చక్కని గువ్వలాంటి కంఠధ్వనితో, (3) ఎక్కడైనా నీకు కమ్మని పిలుపు వినిపిస్తే, అక్కడే క్రిందనెక్కడో నా ప్రియుడు ఎదురుచూస్తుంటాడు అతనికోసం ఒక్క సారి విశ్రాంతి తీసుకో. ‘అతని దగ్గర కపిలాశ్వం ఉంది. ఆయుధాలు స్వర్ణకాంతులీనుతుంటాయి. నిర్భయంగా, స్వేచ్ఛగా అతనికి ప్రదక్షిణ చెయ్యి గులాబిరేకులు రాలినట్టు అతని గుండెలమీద వాలు! ‘ఒకవేళ నిద్రిస్తుంటే, అతన్ని లేపకు; ఒకవేళ... హతవిధీ! మరణించి పరుండి ఉంటే, నీ వీడ్కోలు సూచనగా, నా బంగారు విహంగమా! అతని సుందర వదనాన్ని దీనితో ముయ్యి.’ . (Songs of Ukrain నుండి) అనువాదం: ప్లారెన్స్ రేండల్ లివ్జే (1874-1953) కెనేడియన్ (Notes: 1. డునాయ్ (Dunai): యుక్రెయిన్ లో డాన్యూబ్ నదిని ఇలా పిలుస్తారు. 2. ఉలాన్స్(Uhlans): తేలికపాటి ఆయుధాలతో యుద్ధం చేసే ఆశ్వికదళం 3. ఇది ఒక సంకేతం అయి ఉండొచ్చు. . The Handkerchief . [It is the custom among Ukrainian maidens to embroider such a kerchief for the betrothal, and then it is bound upon the arm or worn in some noticeable way on the man's person.] The sun was drowning in the ocean's brim Red, red as blood; And in the crimson flood A young girl sewed a handkerchief with gold. Embroidering in gold with stitches fine– Like lilies white Her cheeks will look to-night, Like pure-white lilies washed with tears. And as she sewed she pressed it to her heart; Then, weeping sore, She opened wide the door: 'Strong wind, my Eagle, take this on your wings!' 'Strong as the Dunai swiftly onward flows, O Wind so free Deliver this for me Where now he serves, yea, where the heart well knows! 'He in the Uhlans' ranks is fighting now– Go, Golden One, From sun to sun Float on the wind until that place you find! 'And, Golden One, when you shall hear one call Even as a dove, Rest, for my love, My loved one will be waiting there below! 'He has a bay horse, and his weapons are Shining as gold. Wind, free and bold, Fall to his heart as the rose petals fall! 'If sleeping, wake him not; and if–O God!– If slain he lie, For your good-bye O Golden One, cover his sweet dead face!' . From: Songs of Ukraina Translated by: Florence Randal Livesay (1874-1953) Canadian. Poem Courtesy: http://ift.tt/UsAp4j http://ift.tt/UsAp4j
by Nauduri Murtyfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1uPTfNW
Posted by
Katta