పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
JILUKARA SRINIVAS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
JILUKARA SRINIVAS లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

జిలుకర శ్రీనివాస్ కవిత


మబ్బులు అలిసిపోయి భూమ్మీదికి వొంగాయి ముత్యాలు కాలువలో పారుతున్నాయి మెరుపుల్ని చూస్తె చాలు కంటికి చీకటి తప్ప మరేదీ కనిపించని ఆ వాన రాత్రి మా బాపుని చేతిలోకి తీసుకొని కన్నా తండ్రిలా నడిపించిన నా లేత పాదాలే బురదలో మెరుస్తాయి ఒక్కసారి ఆకాశం బద్దలైన పెద్ద శబ్దం విని ఎప్పుడూ భయపడని బాపు నా చేయి పట్టుకొని వోనికిపోతూ గావుకేక పెట్టినప్పుడు నా గుండె మీద తొలిసారిగా పిడిగు రాలింది మొగులు ఉరిమిన ప్రతిసారి మా బాపు బెదురు కళ్ళే గుర్తొస్తాయి ఏం కాదు బాపు భయపడకని చెప్పిన నా మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తాయి గోరీలో నిద్దరోతున్న మహా జ్ఞానిని ఒక్కసారిగా నిద్రలేపి మాట్లాడాలనిపిస్తాది

మా తాతలు నడిచిన ముద్రలిక్కడే ఇంకా చెరిగిపోకుండా ఉన్నాయి వాటిని మా నాయిన కల్లకద్దుకొని కాపాడుకున్నాడు మా గుండెల మీద వాటిని చెరగని గుర్తులుగా చెక్కిపోయాడు తవ్వండి సమాధులను రాక్షస గుళ్లని మీరు హేళన చేసినవి మా పూర్వీకుల ఆనవాళ్ళు పురాతత్వ శాఖ మూగతనం వెనక ఎన్ని కుట్రలున్నాయో మాకు తెలుసులే. మా చరిత్ర మట్టిపోరాల కిందే మగ్గి పోవాలని కదా మీ కుతంత్రం చెరిపేస్తే చెరిగి పోవడానికి అదేమన్నా మీరు రాసిన అబద్దపు కారు కూతలనుకున్నారా? వేల ఏళ్ళ తర్వాత కూడా రంగు వెలువని మట్టి కుండలు తయారు చేసిన జాతి మాది తవ్వుకుంటాం పూర్వీకుల నెత్తురు పారిన చోట వెలిసిన మీ సింహసానాల ఒక్క తన్నుతో పడదోస్తాం! రాలుతున్నవి చినుకులు కావి తమ్ముడా మనల్ని చూసి మన తాతలు నవ్వితే తొణికిన కన్నీళ్లు

మబ్బులు తొలిగిపోక తప్పదు నల్లని బండల మీద నక్షత్ర పుంతలు చెక్కిన మూలవాసుల ఆశలు ఈ దేశ శిరస్సు మీద తలతలా మెరవక తప్పదు ఈ నేల మీద నాగరికతను నాటిన జాతి గర్వంతో పాలకులవ్వక తప్పదు మా అయ్యా కాన్షీరాం మనువు తల మీద కాలు మోపి తొక్కి చంపక తప్పదు శవాలు మాత్రమే నడుస్తున్న ఈ మనుభూమిలో మనిషి తిరిగి పుట్టక తప్పదు బుద్దుని శిగలోని చాందిని నవ్వక తప్పదు

1, సెప్టెంబర్ 2012, శనివారం

జిలుకర శ్రీనివాస్॥నిన్ను చూశాకే తెలిసింది॥

1)

సముద్రాన్ని కళ్ళలో దాచుకొని తిరగడం ఎంత కష్టమో నిన్ను చూశాకే తెలిసింది ఆగిపోయిన కాలం వెనుక దాక్కోవటం నాకు చేత కాదని తెల్సుకున్నాక గట్టు దాటి పొంగే కడలి ఎన్ని సార్లు గొంతు కోసుకుందో మరెవ్వరికీ తెలియదు ప్రియా! బతకడమే పరమావధి అయితే ఎలాగైనా బండి లాగేయోచ్చు తలలు వాలిపోయే చోట కలలు కాలిపోయే చోట మురికి నీరు మాత్రమే నరాల్లో పారే చోట ఎలాగో అలా బతికేయటం నాకు నచ్చదు మెరుపులున్న చోటు నీ మురిపాల నవ్వులున్న
చోటు ఆకాశంలో తెల్లని మల్లె వొంకలున్న చోటు నీ సమస్తమూ ఓకే ఒక దివ్య వెలుగైన చోటు కోసం వెతుకుతూ నువ్వు నడిచిన దారిలో కాంతులీనుతూ ఉంటాను

2)

కలలు రావటం ఆగిపోయాయి అవి నువ్వోచ్చిన దారిలో గడ్డమూ మీసాలూ వేసుకొని ఒంటి మీద గుడ్డ లేకుండా తిరుగుతున్నాయి పిచ్చి పట్టిందని మిత్రులు ప్రకటించేశారు డాక్టరు చేతులెత్తేశాడు నాకోసం ఒక్క కంపెనీ నాలుగు మందు బిళ్ళలు తయారు చేట్లేదంటే ఎంత గర్వంగా ఉందొ తెలుసా నాకు నన్ను దోచుకొనే వీలు ఇవ్వలేదు కదా నేను! నిన్న రాత్రి పక్క వీధిలో వాళ్ళు కత్తులు నూరుకుంటున్నారు నల్లటి బాంబులు చుట్టుకుంటున్నారు కులాన్ని మాయ చేయాలంటే మతాన్ని ముస్తాబు చేయాలని పాడుకుంటున్నారు నేను నిన్నే దేవులాడుకొంటూ నీ కోసం బెంగ పడుతూ ఉరుకొచ్చాను కాళ్ళకు అడ్డుపడ్డ రెండు పెద్ద కత్తులు బొడ్లో దోపుకొచ్చాను రెండూ నీకోసమే జాగ్రత్తగా తలకింద పెట్టుకో హక్కుల గురించి నువ్వు మాట్లాడితే వినే వాడెవ్వడు? కనిపించ కుండా పోయినోళ్ళ జాబితాలో నీ పేరు ఎప్పుడు చేర్చాలా అని చూస్తున్నారు

3)

మాల్కం ఎక్స్ మాట్లాడుతూనే ఉన్నాడు నిన్ను రక్షించుకోవటం వీలు కాదు నీ సంఘమే నిన్ను కాపాడుతుందని చెప్తూనే ఉన్నాడు నల్ల జాతి ముఖాల మీద చిర్నవ్వుతో నన్ను పిలుస్తూనే ఉన్నాడు నాకు ఆయనకు అంబేద్కర్ను పరిచయం చేయాలనుంది ఇద్దరినీ ఒక్క వేదిక మీద చూడాలని ఉంది మాల్కంకు బాబాసాహెబ్ తత్త్వం తెలిస్తే ప్రపంచం చాల మారిపోయేది! ఎక్కడో జనం పిలుస్తూనే ఉంటారు వాళ్ళకిప్పుడు బాట చూపే వాళ్ళు కావాలి నువ్వేమో నాకు తప్పిపోయిన దారి చూపావు నువ్వు చూపిన దిక్కుకే అడుగులేస్తున్నానా! నా వెనుక సముద్రమేదో నడిచోస్తున్నట్టుంది

4)

చేతులు పక్క మీద నీ కోసం నిద్దర్లో తడుముకుంటాయి నువ్వోదిలేసి పోయిన తీపి చిహ్నాలు చిలిపిగా నవ్వుతూ దొర్లిపోతాయి కాళ్ళు కడుపులోకి దోపుకొని మూల్గుతూ ఉంటానా నువ్వు చదివిన పవిత్ర మంత్రం గదిని పరిశుద్ధం చేస్తుంది సమూహాల మధ్య ఒంటరిగా బతకడం ఎంత కష్టమో నీకు తెలుసునా? నీలో ధగధగా వెలిగే లోకాలను చూసినప్పుడు కళ్ళు మూతలు పడి మూగగా రోదించడం ఎంత కష్టమో తెలుసునా నీకు? నీ ప్రేమ లేకుండా నీ కమ్మని నవ్వులు లేకుండా యుద్ధం లో ముందుకురకటం అసలు ఎంత నరకమో కదా ప్రియా! నేను ప్రపంచాని జయిస్తే చూసి ఆనందించాలని నువ్వు ఆరాటపడుతున్నావు. నువ్వు హాయిగా ఆనందంతో నవ్వుల తోటవైతే చూడాలని నేను కత్తి తిప్పుతున్నాను. ఇప్పటికీ సముద్రం నా కళ్ళు దాటడం లేదు పిచ్చిది గొంతు నొక్కుకొని చచ్చిపోతుంది

14, ఆగస్టు 2012, మంగళవారం

జిలుకర శ్రీనివాస్ // వొలవొలా ఒక చేప పిల్ల కన్నీరు కార్చింది //


కమ్ముకొస్తుంది చీకటి కళ్ళ మీదికైతే ఎలాగోఒకలా తుడుచుకుకే వాణ్ణి ఎదలో పొడుసిన సన్నని నెలపొడుపును నల్లగా మింగేస్తుంది చూడు! నీ కళ్ళ కాంతులనే నమ్ముకున్న వాణ్ణి ఆ వెలుగు కింద నాలుగు రాళ్ళు కొట్టుకంటున్న వాణ్ణి

ఆ మిట్ట మధ్యాహ్నం వేళ పక్కనే వాన వరద పారుతున్న కాల్వ ఒడ్డున కూర్చొని వొలవొలా ఒక చేప పిల్ల కన్నీరు కార్చింది వొంటికి బురదంతా పూసుకొని మురుగులోకి దూకి ప్రాణం వొదిలేసింది వేటగాడి గాలానికి కూడా చిక్కలేదది ఏ ఖాకీ గుడ్డకూ దాని ఆచూకి దొరక లేదు అస్సాం గుట్టల మీద గుజరాతు మళ్ళా మొలకెత్తిందని నువ్వే చెప్పావా దానికి?

నీతో కలిసి హలీం తినాలని ఉంది గాలీబ్ కురిపించిన ప్రేమ కవితల చాంద్ తారను నీ పోనీటేల్ కురుల మీద తురుమాలని ఉంది ప్రియున్ని కొల్పోయిన అస్సాం అందగత్తె కన్నీళ్ళను నీ చేతులు తుడుస్తుంటే నీ పక్కనే నిల్చోని ఏడ్వాలని ఉంది! నీతో కలిసి రక్తపాతం లేని సమాజాన్ని ప్రసవించాలని ఉంది

అనంత కరుణామయిలా అద్భుత ప్రపంచంలా తేజోరిల్లే నా ప్రేమ కావ్యమా! చదివిన పుస్తకాలర్థం అవుతున్నాయి నువ్వు తప్ప చూడని లోకాలూ ఎరుక పడుతున్నాయి నువ్వు తప్ప! నా గుడిసె నిండా చీకటి కప్పుకుంది నీ వలపు దివ్వె ఆర్పేశావు కదా! చెట్ల పొదల మొదళ్ళలో దాక్కొని నీ అడుగుల చప్పుడు విని సంగీతం రాసుకుందామని.
*13-08-2012

11, ఆగస్టు 2012, శనివారం

జిలుకర శ్రీనివాస్ కవిత


చల్ పొ! దేహాలు మాత్రమే వున్న చోట
కేవలం జంతువుల్లాంటి రెండు కాళ్ళు మాత్రమె నడిచే చోట
ఒక్క కాంతి పుంజమైనా వెలుగులివ్వని చోట
ఎన్ని గ్నాన గింజలు నాటినా సూర్యుడు మొలవడు

యెహే! నీ తలలో ఎర్రగుడ్డ అది మా ముసల్ది విసిరేసిన ముట్టుగుడ్డ
నీ ఎద మీద వేలాడే తుపాకీ అది మా తాత విసిరేసిన వెదురు బొంగు
నెత్తురు గురించో రాలిన వెన్నెల కన్నుల గురించో చెప్పకు మాకు
అడవి ఒంటినిండా మొలిచిన వాళ్ళం మేము
మనువును వెలేసి వాడి నీడ కూడా పడకూడదని చిక్కటి అరణ్యాలను అల్లుకుంటే
ఎర్రమనువు ఎగేసుకొంటూ రానే వచ్చాడు
ఎవడి చేతిల గన్నుందో ఎవడి చేతిలో పెన్నందో ఎవడు వెచ్చని కరస్పర్శ కోసం ఎవడిని అమ్ముకున్నాడో విరసానికి తెలుసు అరసానికి తెలుసు కరపత్రాలకేం తెలుసు అక్షరాలను మనువుకెప్పుడో అంకితమిచ్చారని

దెహె పో!
ఎంతగనం వినాలి మీ సోది మాటలు మీ బుదగరింపులు
రాక్షస గుళ్ళను తవ్వుతున్న దెవరు? కలకత్తా కాళికి పూజలు చేసిందెవరు? హౌరా బ్రిడ్జి మీద వేలాడుతున్న ఫ్లెక్షీ పై ఏ దీదీ మొకం ఉంది? అన్ని హక్కులిచ్చిన మా అయ్యను పట్టుకొని లిబరల్ బూర్జువా అన్నదెవడు? మనిషి హోదా ఇవ్వని మనువును కాలికింద తొక్కిపెట్టి నీకు పౌరుని స్థాయినిచ్చిందే మనీషి? భీమా కొరెగావ్ సమరం లో తెగిన తలలెవ్వరివి? గెలిచిన నా తాతలెందుకు బానిసలయ్యారు? ఓడిన నీ పూర్వీకులెలా రాచరికం ఎలగబెట్టారు చరిత్ర నీ ముడ్డి కింది కుర్చీ కాదు మీ తెల్ల పర్వతాలను కూల్చే అగ్నిపర్వతమది!
చత్ పో! మాది లొంగని మా తాతల నెత్తురు సాహూ మహారాజ్ కోరమీసం కొనసాగింపు మేము నువ్వు ఎవడి పాదాలు కడిగినా నాకినా మాకు సంవందం లేదు ఈ తరం తోనే తేలిపోవాలి రాజ్యం అశోకుడు ఏలాల్సిందే!
*11-08-2012

9, ఆగస్టు 2012, గురువారం

జిలుకర శ్రీనివాస్||కవిత||


చేపకి ఈదొద్దని నెమలికి ఆడొద్దని కోకిలకి పాడొద్దని పిట్టకి ఎగరొద్దని పిల్లాడికి ఏడ్వొద్దని నాకు నీతో మాట్లాడొద్దని షరతులు పెడితే అది ప్రక్రుతి విరుద్ధమని తెలుసు కదా!
ఎంత ఉగ్గపట్టుకున్నా గుండె సొద ఆగదు నిన్ను తలుచుకోగానే రెండు నల్లని రాత్రులు ఒక్కసారిగా వెలుగుతో మెరిసిపోతుంటాయి చాల్లే! నీ మాటలు నాకేమీ అర్థం కాటం లేదని కదా! నువ్వు నా మాటల్ని తుడిచేస్తుంటావు.

నిన్న రాత్రంతా ఒకటే నెత్తురు కన్నుల్లో! అస్సాం నిండా తెగిపడిన నా తలలే రూమీ టోపీలన్నీ కాలిపోతున్నాయి నీ ఒంటిని కప్పుకున్న బుర్ఖా చించి నీ మొహం మీద పదునైన కత్తులతో తవ్వుతున్న చప్పుడు చెవుల నిండా! తెగిపడిన నా చేతులు నీ ప్రాణాన్ని కాపాడాలని పెనుగులాడుతున్నాయి ఎక్కడి నుండి వచ్చిందో అంత తెగింపూ బలమూ నెత్తురోడుతున్న నీ దేహాన్ని ఆయుధంగా మలిచి ఒరిగిపోతున్న నన్ను కాపాడుతున్నావు! ఎంత దయగలదానివి ఎంత ప్రేమగలదానివి నిన్నెలా చంపాలనుకున్నారు? కలలింత రక్తం ఒలికితే నిద్రెట్లా పోయేది?


ఎన్ని అక్షరాలు నీ ముందు గుమ్మరించినా ఒక్కటీ అర్థవంతమైన సొగసివ్వటం లేదు
వాక్యాన్ని ఎన్ని ముక్కలు చేసినా నిన్ను చేరగల మెరుపును పుట్టించ లేకపోతున్నా
కవిత్వాన్నీ నిన్ను మెప్పించటం నా తరం అయిత లేదు సరె పో! నేను అంత వీజీగా ఓడిపోతానా మిమ్ముల వొదులుతానా!

*08-08-2012

27, జులై 2012, శుక్రవారం

జిలుకర శ్రీనివాస్||ఎహే పో! అని నువ్వు విసుక్కునే మూతి విరుపు ప్రేమ||

ఎహే పో! అని నువ్వు విసుక్కునే మూతి విరుపు ప్రేమ

స్వర్గానికి దూరంగా
నరకానికి చాలా దగ్గరగా
రోజు నేను చిక్కని చీకటిగా మాసిపోతున్నాను
దూరంగా ఉంచుతున్నవో
నువ్వే దూరం అవుతున్నవో
ఎంతకీ అర్థం కాని కవితలా మారిపోతున్నావు

తెల్లవారక ముందే దిగిలు ముసురు నన్ను కమ్మేస్తూంటది
పగలంతా ప్రాణం నీ మాటలను మననం చేసుకుంటూ మురిసిపోతది
రాత్రంతా కలలకు ఆహరం అవుతూ దేహం మురిగిపోతది
కులం కత్తులకు రాలిపడిన కోట్ల కొద్ది స్వప్నాలు ఎండిపోతాయి
ఎండా పొద విచ్చుకున్నాక నీ తీయటి మాటల పూలు పరిమలించాక
అస్పృశ్య హృదయమొకటి నా మెరుపుల చూపుల కోసం చిక్కని కవితొకటి రాసుకుంటది

ప్రేమంటే పత్రికా ప్రకటన కాదు
హక్కుల దేబిరింపు లేఖ కాదు
మనసును చంపుకొని బతకటం కాదు
ఎవరికోసమో నిర్జీవంగా పరిగెట్టడం అంత కంటే కాదు

నేను నీకోసం రాసిన తీయటి కవితా సంతకం ప్రేమ
నిత్యం నిన్ను స్మరిస్తూ బతకటం ప్రేమ
నిజ్జంగా నువ్వు నన్ను నిరాకరించటం ప్రేమ
నా మనో లోకం మీద నువ్వు విసిరినా నవ్వుల తునుక ప్రేమ
ఎహే పో! అని నువ్వు విసుక్కునే మూతి విరుపు ప్రేమ
ఎలా చింపి చూపేది తెంచి నీ చేతికిచ్చేది మొండి?
            .....
*27.7.2012

24, జులై 2012, మంగళవారం

జిలుకర శ్రీనివాస్॥నువ్వు॥

తొలిసారి నిన్ను చూడాలంటే భయమేసింది
రోడ్డు దాటుతున్న నల్ల పావురాన్ని తెగబలిసిన నాలుగు గిర్రలు గుద్దేసి
నెత్తురు చిమ్మి విలవిల్లాడుతున్నప్పుడు
గుండె చెదిరిన తల్లి రెండు సముద్రాలను చేతుల్లో పట్టుకొని వణికిపోయినట్టు
నిన్ను చూడాలంటే నిజంగా తొలిసారి భయం పుట్టింది

మనసుకు నీడ లేదు
ఒంటికి సేద లేదు
గాలిలో చల్ల దనమే లేదు
నీ మాటల సవ్వడి లేక్ రాత్రికి కాళ్ళు చచ్చువడ్డాయి
మరోసారి నీ నీడ సోకని ఈ వెలుగు తెరలన్నీ నలుపెక్కాయి
తెల్లారిందో లేదో రైలు పట్టాల మీద నా ప్రాణం చితికిపోవాలని పరుగెత్తింది

చివరిసారి నీతో మాట్లాడాలనే ఆశ
ఊటలా పొంగే దుక్కం తప్ప నీ కేమీ చెప్పాలని లేదు
నిన్ను వీడిపోతున్నాననే దిగులు తప్ప చావంటే అసలు భయం లేదు
నీ ప్రేమ నది నాలో పారాలనే ఆశయం తప్ప వేదించాలనే రోగం లేదు
ఎంత ఒడుపుగా నన్ను మరణ మంచం దించావు
అంతులేని వలపుతో వేయి గిర్రలను తప్పించావు
మళ్ళీ ఒకసారి నిన్ను చేరాలంటే సత్తువ ఇంకిపోయింది

నువ్వు తప్ప మరో లోకం లేదని
నీ కదలికల చిత్రాలు తప్ప నా మనో తెరమీద వేరే ఏవీ కనిపించవని
నా సమస్త జీవనాడులు నీ నవ్వుతో తప్ప మరేదానితోనూ ఉద్దీపించవని
ఎన్నిసార్లు చెప్పాను ఎన్ని నదులను నీ కాలి మడిమల మీద ప్రవహించాను
అదే నవ్వుతో అదే మాట చెప్తే నా చుక్కల ముగ్గులేసుకున్న ఆకాశం చిద్రమైపోదు
నీ తర్క తంత్రులతో పాత పాటే మీటుతావేమోనని కొత్తగా భయమేసింది

అనంత కరుణా రసధునిలా
కడలి ఒడిలో శాంతంగా నిలబడి నవ్వే తెర చాపలా
నీ కనుల భాషతో కొత్త వ్యాకరణం రాసి
నా వేదననంతా ఒక్క శబ్దంతో తుడిచేశావు
ఇప్పుడు రోజూ రైలు పట్టాలు నన్ను చూసి నవ్వుతూ సాగిపోతున్నాయి
*23.7.2012

18, జులై 2012, బుధవారం

జిలుకర శ్రీనివాస్ కవిత

ఒంటి నిండా జ్వరం
మనసు నిండా మౌనం
రాత్రి గదిలోని మేకుకు నన్ను వేలాడేసుకున్నాక
వానకు తడిసిన అంగ్గి ఒకటే వణుకు
భుజం మీది కన్నీటి మరకలు ఎంతకూ ఆరవు ఏం చేయను

నీ పెదవి విరుపులైనా పర్లేదు
అవి విసిరే తుపాకీ తూటాలు తాకినా పర్లేదు
నీ కంటి కింది ఎర్రని చారలు నా ఎద మీద భగ్గున మంట పెట్టినా పర్లేదు
చేసిన నేరానికి ఎలాంటి విచారణ లేకుండానే
నీ పాదాల కింద పాతిపెట్టినా పర్లేదు
నీ మాటలు విని నిన్ను అతి దగ్గరగా చూడాలనే వచ్చాను

తాగే నీళ్ళ కుండను పలగ్గొట్టిన పిల్లోన్ని
అయ్యో ఏందిరా ఇది అని ప్రేమగా విసుక్కునే తల్లిలా నువ్వు
మట్టిలో ఆడుకుంటూ దుబ్బంతా మీద పోసుకున్న తమ్మున్ని గద్దించే అన్నలా నువ్వు
తప్పుడు గీతల న్నింటిని చెరిపి కామిక్ బొమ్మలు వేసే చిత్ర లేఖివిలా నువ్వు
నేరాల వెనక మానసిక చిత్తరువును చూసే మనో దర్శినిలా నువ్వు
కొంచెం నవ్వి చాలా మెత్తగా కోపం చేసి క్షమించేశావు నువ్వు

కొండంత కోపాన్ని భరించొచ్చు గాని
గుప్పెడు కరుణను చిటికెడు ప్రేమను భరించ లేను
ఒక్క నిమిషం కూడా నీ ముందు నిలబడ లేక
ఏడుస్తూ ఒకటే పరుగెత్తింది రోడ్డు
బోరున విలపిస్తూ కూలిపోయింది నల్లని మబ్బుల గూడు

గదిలో చద్దరు నిండా సెగలు కక్కుతున్న జ్వరం
కూర్చి కాళ్ళు చచ్చువడ్డాయి
రెక్కలు ముడుచుకు పోయి గాలిపంక జారిపోయింది
మెత్త నిండా దుక్కం గడ్డగట్టి కదలడం లేదు
పుస్తకాలన్నీ మూలక్కూర్చొని వెక్కిళ్ళు పెడుతున్నాయి
తనను తానే పూర్తి చేసుకునే కవితలా
నిన్ను పరిపూర్ణం చేసుకుని
నన్ను అసంపూర్ణ వాక్యాన్ని చేశావు నువ్వు
తల లేని చొక్క ఇంకా ఆత్మ కోసం దేవులాడుతూనే ఉంది.
*18-07-2012

10, జులై 2012, మంగళవారం

జిలుకర శ్రీనివాస్॥సాయంత్రం ఏడు దాటిందా..॥

సాయంత్రం ఏడు దాటిందా గుండె ఏదో కీడు శంకిస్తూనే చెట్ల మధ్య
దొర్లుతూ ఉంటది
ఏమి జరుగుతుందో ఏమో అక్కడ తెలీదు
ఎన్ని కలలు కూలిపోతాయో తెలీదు
ఆ రాత్రంతా మొద్దుబారి శవంలా వాసనేస్తదో తెలీదు
సాయంత్రం ఏడు దాటిందంటే చాలు ఎడమ కన్ను అదురుతూ ఉంటది

రణగొణ ధ్వనుల మధ్య మూడు గిర్రల బండి నెమ్మదిగా మాట్లాడుతూ ఉరుకుతది
అప్పటి దాకా ప్రియుని సమక్షం లో ఓలలాడిన గవ్వ కళ్ళున్న గువ్వ
చెవి జూకాల సడిలో అతడి ప్రేమ తాలూకు గుసగుసలు
ఎవరికీ వినపడకుండా దాచుకుంటూ
నాతో మాట్లాడుతూ ఎగిరిపోవాలని ఒకటే ఆరాటం దానికి
నేను మాటల పంజరాన్ని అని అప్పుడే తెలుసుకున్నట్టు
ముళ్ళ కంచెలా తన రెక్కలకు గుచ్చుకున్నట్టు
గుల్బర్గా పాత గోడల మీది తన స్వప్న సీమను నేనే కూల్చేసినట్టు
అంబర్ పేట ఆకాశాన్ని నేనే చించేసినట్టు
ఒక్కసారిగా పర్దా లోపల కొన్ని పాములు బుసకొడుతాయి
అంతే! మాటల తీరే మారిపోతుంది
చెట్లకింద చీకటిలో బిక్కుబిక్కుమని దాక్కున్న నల్ల కుందేలు పిల్లలా బెంగటిల్లుతాను
నేరం ఏమి చేశానో తెలియక వొంటినంతా తడుముకుంటాను

సాయంత్రం ఏడు దాటిందంటే నేను అల్లుకున్న పాట పగిలిపోతది
ఆమె పిలుపు కోసం ఎదురు చూసిన కుందేలు గుండెలో విషపు ముళ్ళు గుచ్చుకుంటాయి
నల్లని చీకటిని నా మీదికి విసిరి మూడు గిర్రల బండిని ఒక్కసారిగా దిగెసి వెల్లిపోతుంది
నేను కాల్లు తెగిన కుందేలులా నెత్తురు కార్స్తూ ఎండిన కొమ్మల నడుమ పడిపోతాను
సాయంత్రం ఏడు దాటిందంటే చాలు నాకు చావు ముంచుకొస్తది
*10.7.2012

8, జులై 2012, ఆదివారం

జిలుకర శ్రీనివాస్ ॥ లిపి ॥

కూలిన హరప్పా గోడల మీద మా పూర్వీకులు రాసిన రాతల సాక్షిగా 
ఈ దేశ మట్టి మా నెత్తుటి వారసత్వం
నేల పొరల్లో దొరికిన బొమికిల సాక్షిగా మీరు హంతకులన్నది నిజం
మీ గండ్ర గొడ్డళ్ళకు మా తాతల తాతమ్మల నల్లని బంగారు మెడలు ఎన్ని తెగాయో 
మా తాత ఫూలే లెక్కగట్టాడు వాటికి బదులు చెప్పక వొదులం లే!

కరుణను సమస్త జ్ఞానాన్ని బోధించి ఈ భూమిని మనిషిని సుందరంగా మార్చిన
మా తాత బోధిసత్వున్ని బువ్వలో విషం కలిపి కడతేర్చారు
మీ అబద్దపు తత్వాన్ని నిలదీసినందుకు మా చార్వాకుల సజీవంగా పునాదుల్లో పూడ్చేశారు
సత్యం వెలుగులో బుద్ధ రాజ్యం నిర్మించిన మా బ్రుహద్ర మౌర్య చక్రవర్తిని మీ కుట్రల ఖడ్గానికి ఉత్తరించి రాజ్యం దొంగిలించారు
చినా బుద్ధ రుషితో చర్చల సాగరంలో గెలవలేక మా తాత హర్షున్ని చాటుగా
చంపాలని చూశారు
తెగిన కంఠాల మీద ప్రమాణం చరిత్ర మీ నెత్తుటి దాహానికి సమాధానం చెప్తది

శివాజి మహారజ్ కు విషమిచ్చి చంపాము కదా వీళ్ళెం చేస్తారనుకుంటున్నరా
శంబాజిని చంపి రాజ్యం మీ కాళ్ళ కిందికి తీసుకున్నట్టు అనుకుంటున్నరా
సాహు మహరాజ్ ను చంపేందుకు బాంబులు పేర్చినట్టు అనుకుంటున్నారా
అంబేద్కర్ ను హతమారినట్టు అనుకుంటునారేమో ఆర్య పుత్రులారా!
నెత్తురోడిన మా తల్లి నేల సాక్షిగా ఇక్కడే మా రాజ్యం నిర్మించికుంటాం
హరప్పా గోడల మీది లిపిని ప్రతి గుండె శిఖరం మీద లిఖిస్తాం!



* 08-07-2012

7, జులై 2012, శనివారం

జిలుకర శ్రీనివాస్ - కవిత

వాక్యం విరిగి కొత్త అర్థాన్ని ఇచ్చినట్టే

రాయాలని కూర్చున్న ప్రతిసారి వాక్యం విరిగిపొతుంది
నీ మాటల వేటుకు తెగిపడిన శత్రు స్వరంలా

కోపంతో నీకు చెప్పాపెట్టకుండా
ఇంట్లోంచి పారిపోయిన పిలగానిలా ఎటో వెళ్ళిపోవాలని బయల్దేర్తాను
తీరా చూస్తానా! నీ ముందే తచ్చాడుతూ పిల్లిలా కాళ్ళ మధ్య తిరుగుతూ ఉంటాను

వీధులు తిరుగుతూ భుజాల చివర ఒడుపుగా తప్పుకపోయే రంగుల చిలుకల్ని చూసి
లోకం ఇంత వికారంగా మారిందేమిటా అనుకుంటానా
ఒంటరి గదిలో గోడకు వెళ్ళాడే నీ నవ్వుల చిత్ర లేఖనం చూసి
ఈ ప్రపంచం ఇంత సుందరంగా నీ వల్లే వర్ధిల్లుతుందని బోధపర్చుకుంటాను

వాక్యం విరిగి కొత్త అర్థాన్ని ఇచ్చినట్టే
ఎన్నోసార్లు ముక్కలు ముక్కలుగా నిన్ను విరుచుకొని లెక్కలేనన్ని అర్థాలుగా తెరుచుకున్నావు
ఒక్కోరోజు అర్థం కాని శూన్య శబ్దానివి నువ్వు!
*6.7.2012

4, జులై 2012, బుధవారం

జిలుకర శ్రీనివాస్ కవిత

కాలానికి ఆవల వెలిగే కవితా దీపానివి

 ఆ రోజు చెట్టు నీడలో నిల్చోని నీతో మాట్లాడింది ఇంకా గుర్తే నాకు
అబ్బ! ఇవన్ని మీకెలా గుర్తుంటాయని కదా నీ ఆశ్చర్యం
నీ చూపుల లోగిలిలో కూర్చున్నాక మరో ద్యానం ఉందా నాకు
తుడిచేసుకోడానికి నువ్వో పిచ్చి గీతవి కాదు
కాలానికి ఆవల వెలిగే కవితా దీపానివి

పొద్దునే లేస్తానా! గుంజకు కట్టేసిన లేగ దూడ తల్లిని చేరేందుకు ఆరాట పడ్డట్టు
చేతులకు రెక్కలు మొలిచి ఎగురుతూ నీ దరికి చేరుకుంటాను
నీ తల వెంట్రుక జారి పడిన చోట బంగారు తీగలేరుకుంటాను
నువ్వు జాగ్రత్తగా చదివి పెట్టిన పుస్తకంలో రెండు మూడు శబ్దాలు దొంగిలిస్తాను
ఏంటి మీరు! మీ రాతలేవీ అర్థం కావటం లేదని కదా నీ ఫిర్యాదు
ఆ రోజు చెట్టు నీడలో నీతో మాట్లాడిన ఊసులే కదా నేను రాసిన వొంకర వాక్యాలు

ఆ రోజు చెట్టు కింద ఎర్రటి ఎండలో నీ పెదాల మీద పూసిన పువ్వుల సవ్వడి విని
ఒట్టేశాను నీ ప్రేమ నింగిలో ఎగిరే తావు లేని నాడు
రెక్కలు తుంచుకొని దిక్కులు కూల్చుకొని పిడాత విషంపుచ్చుకొని నేల రాలిపోతానని!
ఎందుకంత పిచ్చి అని కదా నీ రుసరుసలు
ఆసుపత్రి గోడల మధ్య నన్ను చూసి కన్నీరై పొంగిన నీలోని నదీ ప్రవాహాన్ని అడుగు
ఊపిరికి నీ కను రెప్పల మెత్తటి తడికి ఉన్న విలువను కూడా నేనివ్వనని సాక్ష్యం చెప్తది

ఆ రోజు చెట్టు నీడలో నేను పాడిన పాట నీ మెడ వొంపుల్ని ఇంకా తాకుతూనే ఉంటది
నాలో పచ్చని చెట్టు తీయటి పాటల్ని పూస్తుంది నీ తెల్లటి పాదాలను కడిగేందుకు
నీలోని చిగురాకుల చెట్టు కొమ్మలు కొత్త కలల్ని కలల మీది అలల్ని నా గుండెకు మొలిపిస్తున్నాయి
చిరాకులో అప్పుడప్పుడు కొన్ని రెమ్మల్ని తెమ్పేసి కసురుతావు కాని
ఏమై పోతానో అని ఒకటే దిగులుతో చెట్టు కిందే కూర్చొని నా జాడ కోసం దేవులాడుతావు
*****
ఆదివారం,2.7.2012