ఉర్దూ కవిత్వ నజరానాలో గాలిబ్ కవితలను వరుసగా చూస్తూ వస్తున్నాం. ఈ రోజు మొదటి కవిత గాలిబ్ సంకలనంలోని 7వ గజల్ 6వ షేర్ అహ్బాబ్ చారాసాజీ యే వహ్షత్ న కర్ సకే జందా మేం భీ ఖయాల్, బయాబాం నవర్ద్ థా ప్రేమపిచ్చికి వైద్యమేదీ హితులు మిత్రులు కలిసికూడ చేయలేదు జైలులోనూ విరహభావం కారడవుల సంచారం ఆపలేదు ఉర్దు కవితలో ఉన్న పదాలకు అర్ధాలను చూద్దాం. అహ్బాబ్ అంటే మిత్రులు, స్నేహితులు, చారాసాజి అంటే ఉపాయం లేదా వైద్యం, వహ్షత్ అంటే పిచ్చి, ఉన్మాదం, జందాం అంటే జైలు, బయాబాం అంటే అడవి, ఎడారి, నిర్మానుష్య ప్రదేశం, నవర్ద్ అంటే తిరుగాడడం, బయాబాం నవర్ద్ అంటే నిర్మానుష్య ప్రాంతాల్లో తిరిగేవాడని భావం. ఇప్పుడు ఈ కవితకు వివరణ చూద్దాం. ప్రేమ అతిశయిస్తే, విరహంతో ఒంటరితనాన్ని కోరుకోవడం, ఏకాంత ప్రదేశాల్లో గడపడం, ఏదీ తోచకపోవడం వంటివి మామూలే. అలాగే ప్రేమపిచ్చిగా మారడంతో గాలిబ్ ని అతని మిత్రులు ఇలా ఏకాంత ప్రదేశాల్లో పిచ్చివాడిలా తిరగకుండా ఆపేశారు. ఒకవిధంగా జైలులో ఉంచారు. కాని శరీరాన్ని ఆపగలిగారే కాని మనసును ఆపలేకపోయారు. గాలిబ్ లోని ప్రేమ అతడి ఆలోచనలను అవే నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకుపోతోంది. అంటే మిత్రులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ కవితలో అంతర్లీనంగా ఉన్న భావమేమిటంటే, మనిషి ఏదన్నా సంకల్పం చేసుకుంటే అతడిని ఏ శక్తి ఆపలేదు. ఇలాంటిదే మరో కవిత – ముఝే అసీర్ కరే యా మేరే జబాన్ కాటే, మేరీ ఖయాల్ కో బేడీ పహనా నహీ సక్తే – అంటే అర్ధం, నన్ను జైల్లో పెట్టినా, నా నాలుక కోసినా, నా భావాలకు సంకెళ్ళు వేయలేరు. ఫైజ్ అహ్మద్ ఫైజ్ కూడా ఇలాంటి భావాన్నే మరోవిధంగా చెప్పాడు. కాగితాన్ని కలాన్ని లాక్కున్నా, తన వేళ్ళు రక్తంలో ముంచి రాయగలనన్నాడు. ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పే కవిత ఇది. ఇందులో మరో కోణం ఏమంటే, ప్రాపంచిక కార్యకలాపాల జైల్లో మనిషి పడి ఉన్నా, నిజమైన భక్తుడికి దేవుడిపైనే ధ్యాస ఉంటుంది. ప్రపంచంలోని ఆకర్షణల సంకెళ్ళు అతడి మనసును కట్టిపడేయలేవు. తరువాతి కవిత గాలిబ్ సంకలనం లోని 7వ గజల్ 7వ షేర్ యే లాషె బేకఫన్, అసదే ఖస్తా జాం కీ హై హఖ్, మగ్ఫిరత్ కరే, అజబ్ ఆజాద్ మర్ద్ థా శవ వస్త్రం లేని ఈ దేహం, గాయపడిన అసద్ ఆత్మది ప్రభూ సాఫల్యం ప్రసాదించు, విశిష్టమైన స్వేచ్ఛా జీవిది ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. లాషె బేకఫన్ అంటే శవవస్త్రం కప్పని పార్థీవ దేహం, ఖస్తా అంటే గాయపడిన, కూలబడిన, చిందరవందరైన వంటి అర్ధాలు చెప్పవచ్చు. అసద్ అనేది కవి పేరు. మగ్ఫిరత్ అంటే మోక్షం అన్న అర్ధం చెప్పవచ్చు. కాని ఇది జన్మజన్మల బంధనం నుంచి మోక్షం కాదు. తీర్పుదినాన దేవుడు క్షమించి సాఫల్యం ప్రసాదించడం. హఖ్ అంటే సత్యం అని అర్ధం, దేవుడే సత్యం, ఇక్కడ దేవుడని భావం. గాలిబ్ రాసిన కవితల్లో జనసామాన్యంలో అంతగా ప్రాచుర్యం పొందని గజల్ ఇది. కాని విమర్శకులు చాలా మంది దీనికి చాలా వివరణలు రాశారు. ఈ కవితలో గాలిబ్ తన పార్థీవ దేహం గురించి మాట్లాడుతున్నాడు. వీధిలో కనీసం శవవస్త్రమైన లేకుండా, గాయాలతో, చిందరవందరై, అనాధగా పడున్న శవం తనదే అంటూ, అలాంటి హీనస్థితిలో తన శవం పడి ఉందన్న బాధ మాత్రం చూపించడం లేదు. ఎంతో గర్వంగా విశిష్ట స్వేచ్చా జీవి ఆత్మ ఇందులో ఉండేదని అంటున్నాడు. తన జీవితంలో గాలిబ్ ఎలాంటి సంకెళ్లను భరించలేదు. సాంఘీక కట్టుబాట్లను లక్ష్యపెట్టలేదు. విశిష్ట స్వేచ్ఛాజీవి అన్న పదాలు గమనించదగ్గవి, వాటితో పాటు శవవస్త్రం కూడా లేకుండా అన్న పదాలు కూడా కలిపి చదవాలి. ఎందుకంటే, అంతిమసంస్కారంలో పాటించే ఈ లాంఛనాల బంధనాలకు కూడా తలొగ్గని స్వేచ్ఛ తనదని గర్వంగా చేసిన ప్రకటన ఆ పంక్తుల్లో ఉంది. గాయపడిన, చిందరవందరైన దేహంగా చెప్పడం వెనుక ఉన్న భావం కూడా గమనించదగ్గది, సామాజిక కట్టుబాట్లను ఛేదించే ఏ వ్యక్తికయినా అనేక కష్టాల గాయాలు తప్పవు. అనేక దాడులతో మనిషి చిందరవందర కాకతప్పదు. ఆ తర్వాత గాలిబ్ దేవుడిని ప్రార్ధిస్తూ తనకు సాఫల్యం ఇవ్వమంటున్నాడు. తాను పుణ్యాత్ముడు కాబట్టి సాఫల్యం కోరడం లేదు, తాను విశిష్ట స్వేచ్ఛాజీవిని కాబట్టి సాఫల్యం ప్రసాదించమంటున్నాడు. మనిషి స్వేచ్చగా జీవించడమే కాదు, మరణించిన తర్వాత కూడా లాంఛనాలు, సంప్రదాయాల సంకెళ్ళను వదిలించుకుని స్వేచ్ఛగా ఉండడమే గొప్ప సత్కార్యం అన్న భావం ఈ కవితలో ఉంది. అలా ఉన్నాను కాబట్టి సాఫల్యం ఇవ్వమంటున్నాడు. ఇది ఒకరకంగా తిరుగుబాటు కవిత. స్వేచ్చా స్వాతంత్ర్యాలకు అత్యధిక ప్రాముఖ్యం ఇచ్చే కవిత. శవవస్త్రం లేని పార్థీవ దేహాన్ని గొప్ప స్వేచ్ఛకు ప్రతీకగా వాడడం గాలిబ్ మాత్రమే చేయగలిగిన పని. తర్వాతి కవిత గాలిబ్ సంకలనంలోని 8వ గజల్ మొదటి షేర్ షుమారె సుబహ్, మర్గూబె బుతె ముష్కిల్ పసంద్ ఆయా తమాషాయే బ యక్ కఫ్ బుర్దనె సద్ దిల్ పసంద్ ఆయా చేతిలో జపమాలతో ప్రతిమలాంటి ప్రేయసి అసాధ్యాన్ని ఇష్టపడుతుంది గుప్పిట శతహృదయాలను బంధించే కళను ప్రదర్శిస్తుంది ఈ ఉర్దూ కవితను తెలుగీకరించడంలో పూర్తి భావం రాలేదు. ముందు ఉర్దూ పదాల అర్ధాలు చూద్దాం. షుమార్ అంటే లెక్కించడం, సుబ్హ్ అంటే జపమాల, సాధారణంగా ముస్లిములు ఉపయోగించే తస్బీహ్. మర్గూబ్ అంటే ఇష్టపడడం, బుత్ అంటే ప్రతిమ, ముష్కిల్ పసంద్ అంటే కష్టమైన పనిని ఇష్టపడడం, తమాషా అంటే వినోదం, బ యక్ కఫ్ అంటే ఒక్క గుప్పిటలో, బుర్దాన్ అంటే పట్టుకోవడం, సద్ దిల్ అంటే వంద హృదయాలు, పసంద్ ఆయా అంటే ఇష్టపడడం. ఇప్పుడీ కవిత వివరణ చూద్దాం. గజల్లో మొదటి కవిత కాబట్టి రెండు పంక్తుల్లోను మనకు ప్రాస కనబడుతుంది. సాధారణంగా ఉర్దూ కవితల్లో ప్రేయసిని సనమ్ లేదా బుత్ అన్న పదాలతో వర్ణించడం కనబడుతుంది. ఈ రెండు పదాలకు విగ్రహం, ప్రతిమ అన్నవి నిఘంటు అర్ధాలైతే, దేవత అన్నది భావార్ధం. ఇలా ప్రేయసిని ప్రతిమగా వర్ణించడానికి చాలా కారణాలున్నాయి. ప్రతిమలు అవి అజంతా గుహల్లో ఉన్న ప్రతిమలు కాని మరేవి కాని అందంగా ఉంటాయి. సాధారణంగా ప్రతిమలను, విగ్రహాలను అద్భుతంగా అలంకరించడం జరుగుతుంది. ప్రతిమ దేవతగా పూజలందుకుంటుంది, అనేకమంది భక్తులుంటారు. ప్రతి భక్తుడు తన దేవతను ప్రసన్నం చేసుకోడానికి జీవితాంతం ప్రయత్నిస్తాడు. ఉర్దూ కవులు ప్రేయసిని ప్ర్డతిమగా వర్ణించడానికి ముఖ్యమైన కారణం ఒకవిధమైన తిరుగుబాటు ధోరణి. ఇస్లామ్ లో విగ్రహారాధన పూర్తిగా నిషిద్ధం. కాని కవి నిరంకుశుడు. తన భావాలను కట్టుబాట్ల శృంఖలాల్లో బంధించలేడు. తాను అమితంగా ప్రేమించే ప్రేయసిని దేవతగా ప్రకటించే ఒకవిధమైన తిరుగుబాటు ఈ ఉపమానంలో ఉంది. ఈ కవితలో గాలిబ్ ఒక విచిత్రమైన ఊహాత్మక దృశ్యాన్ని చిత్రించాడు. గాలిబ్ తన ప్రేయసిని ఒక ప్రతిమగా పోల్చాడు. ఆమె కష్టమైన పనులు ఇష్టపడుతుందన్నాడు. ఆమె చేతిలో జపమాల ఉందన్నాడు. ఒక ప్రతిమ చేతిలో జపమాల పట్టుకోవడం అసాధ్యం. అలాంటి కష్టమైన పనిని తన ప్రేయసి కాబట్టి చేస్తుంది. ఇక్కడ గమనించవలసిన మరో విషయమేమంటే, విగ్రహారాధన నిషిద్ధమైన ఇస్లామీయ సంప్రదాయాల్లో ఉపయోగించే తస్బీహ్ (జపమాల అన్నది ఇక్కడ తెలుగు పాఠకులకు అర్ధం కావడానికి వాడిన పదం) ప్రతిమ తన చేతిలో పట్టుకోవడం అంటే తస్బీహ్ (రూపం, ప్రతిమ, చిత్రం లేని, మనిషి కళ్ళు చూడని ఒకే ఒక్క దేవుడైన అల్లహ్ నామస్మరణ చేయడం) ఇంకా అసాధ్యం. అలాంటి కష్టమైన పనులు ఇష్టపడే తన ప్రేయసిని ప్రతిమగా పోల్చాడు. ఈ జపమాలలో 100 పూసలున్నాయని తర్వాతి పంక్తి వల్ల తెలుస్తోంది. ఈ అసాధ్యమైన పనిని ఎందుకు చేసిందంటే, ఇదేవిధంగా ఒక్కసారిగా వంద హృదయాలనైనా తన గుప్పిట బిగించగలనని చెప్పడానికి. అలా చేయడం మరో కష్టమైన పని. అలాంటి కష్టమైన పనులే తన ప్రేయసికి ఇష్టమంటున్నాడు. ఈ కవితలో ఇష్టపడడం అన్న పదాన్ని అనేక పర్యాయపదాలతో గాలిబ్ ఉపయోగించాడు. కాని ఇక్కడ ప్రేయసి ఇష్టపడుతున్నది కష్టమైన పనులు. ఆమెను ఇష్టపడుతున్నది గాలిబ్. అది కూడా కష్టమైన పనే. ఇలాంటి కష్టమైన పనులు ఇష్టపడే ప్రేయసిని మెప్పించడం అంత తేలిక కాదు. ఈ కవితను మరింత లోతుగా చూస్తే మనిషి తనకు ఇష్టమైన పనులు చేయడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. స్వేచ్ఛ అన్నది సునాయాసంగా లభించేది కాదు. తర్వాతి కవిత గాలిబ్ సంకలనంలోని 8వ గజల్ 2వ షేర్ బ ఫైజె బేదిలీ, నౌ ఉమీదయీ జావెద్ ఆసాం హై కుషాయష్ కో హమారా అఖ్దా ముష్కిల్ పసంద్ ఆయా నిరాశల పుణ్యంతో శాశ్వత నిస్పృహను తట్టుకున్నా పరిష్కారం నా చిక్కుముడులను ఇష్టపడుతోంది ఉర్దూ పదాలకు అర్ధాలు చూద్దాం. బ ఫైజ్ అంటే అనుగ్రహంతో అని అర్ధం, బేదిలీ అంటే నిరాశ, న ఉమ్మీదీ అన్నా నిరాశే, జావేద్ అంటే శాశ్వత, కుషా అంటే తెరవడం, కుషాయష్ అంటే చిక్కుముడిని విప్పే ప్రక్రియ, ఉఖ్దా అంటే చిక్కుముడి లేదా సమస్య, ఉఖ్దాయే ముష్కిల్ అంటే కఠినమైన సమస్య. ప్రవక్త ముహమ్మద్ అల్లుడు హజ్రత్ అలీని ముష్కిల్ కుషా అనేవారు. అంటే చిక్కుముడి లాంటి సమస్యనైనా పరిష్కరించే వ్యక్తని అర్ధం. మనిషికి అనేక కారణాల వల్ల నిరాశ ఎదురుకావచ్చు. ప్రేమవైఫల్యమో మరో కారణమో. అది శాశ్వత నిస్పృహగా మారవచ్చు. దేవుడు చల్లగా చూడడం లేదని, విధి వక్రించిందని సాధారణంగా వాపోతుంటాం. కాని గాలిబ్ ఈ పరిస్థితిని మరోవిధంగా చూస్తున్నాడు. శాశ్వత నిరాశ అన్నది తనకు ప్రత్యేకమైనదని, తాను స్వయంగా ఎంచుకున్నదని అంటున్నాడు. తన చిక్కుముడి లాంటి సమస్యలను తన పరిష్కార ఆలోచనలు చాలా ఇష్టపడుతున్నాయంట, అందువల్ల ఆ చిక్కుముడులను విప్పకుండా వదిలేస్తున్నాయంట. అంటే తన ఈ స్థితి దైవికమైనదిగా మార్చేశాడు. కాబట్టి అది మారేది కాదు. మార్చడానికి అనవసరపు శ్రమ పడవలసిన అవసరమూ లేదు. ఈ ఆలోచనతో ఇక జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇదంతా నిరాశల పుణ్యమే అంటున్నాడు. ఈ కవిత చదువుతున్నప్పుడు బాధే సౌఖ్యమనే భావన రానీవోయి అని దేవదాసు సినిమాలోని పాట గుర్తుకు రావడం సహజమే. కాని ఇక్కడ గాలిబ్ బాధను సౌఖ్యంగా మార్చుకోవడం లేదు. బాధను తట్టుకుని నిలబడుతున్నా నంటున్నాడు. పరిష్కార ప్రయత్నాలన్నీ వికటిస్తున్నప్పటికీ, అవన్నీ తన బాధలను ఇష్టపడుతున్నాయి కాబట్టే సఫలం కావడం లేదు, కాబట్టి విఫల ప్రయత్నాలకు బాధపడవలసిన పనిలేదు. ఈ కవితలో ఒక వ్యంగ్యం కూడా ఉంది. దేవుడు సత్పురుషులను, రుషులను, దైవప్రవక్తలను సృష్టించాడు. వారు పుణ్యాత్ములు, ఎల్లప్పుడు సన్మార్గానే నడుస్తారు. అది వారికి శాశ్వత లక్షణం. అలాగే దేవుడు సాతానును కూడా సృష్టించాడు. వాడు ఎల్లప్పుడు దుర్మార్గంగానే ఉంటాడు. అది వాడి శాశ్వత లక్షణం. అలాగే నిరాశా నిస్పృహలు తనకు శాశ్వత లక్షణమని వ్యంగ్యంగా చెప్పడం కూడా ఇందులో ఉంది. నిరాశలను తట్టుకోవాలన్న భావం, బాధలను తట్టుకోవాలన్న సంకల్పం ఈ కవితలో ఉంది తప్ప బాధను సౌఖ్యంగా మార్చుకుని ప్రయత్నాలను వదులుకునే నిరాశావాదం ఇందులో లేదు. గాలిబ్ జీవితాంతం ఆశాజీవిగానే బతికాడు. గాలిబ్ బతికిన కాలం అత్యంత క్లిష్టమైన పరిస్థితులు అలుముకున్న కాలం. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాతి అమానుషాలను ఆయన చూశాడు. గాలిబ్ అమితంగా అభిమానించే ముగల్ చివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్ను ఆంగ్లేయులు (ఆంగ్లేయులను గాలిబ్ అంగ్రేజ్ రూ సియా అనేవాడు అంటే నల్ల ఆత్మల ఆంగ్లేయులు) రంగూన్ జైలుకు తరలించారు. ఢిల్లీలో ఊచకోతలు జరిగాయి. ఎటు చూసినా వినాశం తాండవించిన కాలం అది. ఈ పరిస్థితులు కూడా గాలిబ్ కవిత్వంలో ప్రతిబింబిస్తాయి. ఒక కవితలో మునిగిపోతున్న మనిషిని ఉద్దేశించి, ఎందుకు అనవసరంగా కాళ్ళు చేతులు కొట్టుకుని నీటిపైకి రావాలనుకుంటున్నావు. నీళ్ళపైన మంటలున్నాయి, ఈత ఆపేస్తే సముద్రం కింద శాశ్వత శాంతి ఉండొచ్చు అంటాడు. మునిగిపోతామన్న భయం కన్నా మునిగిపోవడమే మంచిదంటాడు. ఈ గజల్లో గాలిబ్ తన విఫల ప్రేమను ప్రస్తావించాడని, నిరాశకు అలవాటు పడేలా చేసిన తన ప్రేయసి పుణ్యమే తన దృఢచిత్తానికి కారణమంటున్నాడని కొందరు వ్యాఖ్యాతలు రాశారు. వచ్చే శుక్రవారం మరిన్ని గాలిబ్ కవితలతో కలుసుకుందాం.. అంతవరకు అస్సలాము అలైకుమ్.
by Abd Wahedfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1c2QnYm
Posted by
Katta