పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Kavitha Chakra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kavitha Chakra లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, జూన్ 2014, ఆదివారం

Kavitha Chakra కవిత

ఆకాశమంత ప్రేమ..!! అన్నీ గుర్తు... ఇంటి అరుగు మీద కూర్చుని చెరుకు ముక్కల బెరడు తీసి తినిపించిన లాలన .. వేలు పట్టుకుని దారి చూపించిన చెలిమి... రాసిన తప్పు చూపించి, రాత నేర్పిన తీరూ బడిలో మస్టారుకి నన్ను అప్పజెప్పి, బేలగా చూస్తున్న నన్ను... అంతకన్నా ప్రేమగా చూస్తూ వెళ్ళిన నీ చూపూ... మొదటిసారి నువ్వు నేర్పిన దేవుడి శ్లోకం... ప్రతీరొజూ యెత్తుకుని తిరుగుతూ చెప్పిన నీతి కథలూ... తీయటి గొంతులో రాగాన్ని నేర్పిన గానామృతం .... వాన పడి వెలిసాక మొక్కలు నాటుతూ చెప్పిన కబుర్లూ... అదే వానలో నువు లేవని తెలిసీ... వర్శాన్ని ఆగిపొమ్మని కన్నీటితో చేసిన అభ్యర్థన... అన్నీ గుర్తున్నాయి... నువ్వు ఇచ్చిన జీవితం ఉంది... నీ లోటూ ఎప్పుడూ ఉంది... పొగ మంచులాంటి నా అల్లరీ... ఆకాశమంటి నీ ప్రేమా... నేను వేసె ప్రతీ అడుగులో... నీ ఉనికే నాన్నా!! నాకు తెలుసు... నువ్వెక్కడున్నా... నీ శ్వాస నేనే అని!! - కవితాచక్ర

by Kavitha Chakra



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/SKyuH1

Posted by Katta

5, సెప్టెంబర్ 2012, బుధవారం

కవితాచక్ర || తిరిగిరాని క్షణం||


స్థబ్దత నిండిన గుండెలో
చప్పుడు చేస్తూ
రివ్వున దొసుకొచ్చి,
గతాన్ని తాకిన స్మర శరం!
కాలాన్ని సాయమడిగి
ఆర్తిగా బంధించబోయాను...
కలకలం రేపడమే తప్ప,
కాలానికి ఎలా చిక్కగలనంటూ..
జాలిగా చూస్తూ..
హ్రుది వాకిలి
విడిచి వెళ్ళిపోయింది!

తడి ఆరని కన్నుల కలువల్లో
పుప్పొడి అద్దుతూ
తుషారస్నాత ప్రభాత స్వప్నపు
వెన్నెల మరక!
రెప్పల తలుపుల్లో లాలనగా
బంధించబోయాను...
అందమైన నలతనవుతానే తప్ప,
తలపుల తలుపుల్లో
బందీని ఎలా అవుతానంటూ
దైన్యంగా చూస్తూ
కళ్ళ లోగిళ్లు విడిచి వెళ్ళిపోయింది!

అంతరంగపు ఆకాశంలో
మిణుకు మిణుకుమంటూ
వెలిగే స్మ్రుతి నక్షత్రం!
ఆనందపు రెక్కలు కట్టుకుని,
ఆబగా అందుకోబోయాను...
అంధకారపు ఆశల వలయంలో
మిణుక్కుమంటానే తప్ప,
పట్టు చిక్కే వెలుగునెలా
అవుతానంటూ..
అమాయకత్వాన్ని వెక్కిరిస్తూ
మది చాటు మబ్బుల పరదా దాటి
మసకబారిపోయింది!

date: 02/08/2012

28, ఆగస్టు 2012, మంగళవారం

కవితాచక్ర ||నీ ఇష్టం..||


ఉరకలేసే యెద గోదావరి
పరవళ్ళు తొక్కుతూ
ఆనకట్ట వేయలేని నా
పట్టు తప్పి,
నీ దారి మళ్లితే...
తలమునకలవుతావో..
తరలించుకుంటావో
నీ ఇష్టం!!

మౌన భాష పలికే కళ్ళు
భావపు లోగిళ్ళై
నా మనసు దాటి,
నీ చెలిమి ముందు
మరో భాష్యమై నిలిస్తే...
మనసారా ఆహ్వానిస్తావో
ఆస్వాదిస్తావో
నీ ఇష్టం!!

తీయని తలపుల కలవరం
వలపు వర్షమై
నా హ్రుది మిన్ను నుండి
నీ యెడద నేల పై
యెడతెరిపి లేకుండా కురిస్తే...
తనువారా తడుస్తావో..
మురుస్తావో
నీ ఇష్టం!!

ఏకాంత ఊహా సౌధపు
సౌందర్య దీపాల కాంతి
అడ్డు పెట్టలేని నా
చేయి దాటి దేదీప్యమై
నీ చెంత వెలిగితే...
వెలుతురవుతావో..
వెలితినే పారద్రోలుతావో
నీ ఇష్టం!!

27.08.2012

27, ఆగస్టు 2012, సోమవారం

కవితాచక్ర//తరచి చూస్తే..

నిశ్చల హ్రుదిలో
రేగిన అలజడిని
తట్టి చూస్తే..
ఉవ్వెత్తున ఎగిసిపడే
జ్ఞాపకపు అల!

నిశ్శబ్దపు మదిలో
దాగిన కలవరాన్ని
కదిపి చూస్తే...
ఝూంకరిస్తూ నినదించే.
కోటి భావాల మెళ!

నిర్నిద్ర కంటిలో
కదలాడిన ఆర్తిని
అల్లార్చి చూస్తే...
కరుగుతూ జారిపోయే
కన్నీటి కల!

నిట్టూర్పు శ్వాసలో
వదిలిన వెచ్చదనాన్ని
తాకి చూస్తే...
వగరుస్తూ విడిచిపోయే
నైరాశ్యపు హేల!!

*24.8.2012

26, ఆగస్టు 2012, ఆదివారం

కవితా చక్ర || ఆగమనం ||


నాదైన స్వాప్నిక ప్రపంచంలో
స్తబ్దత కాన్వాసు పై,
నిశ్శబ్దపు కుంచెతో..

అస్పష్టపు చిత్రానికి
సప్తవర్ణ మేళవింపు పులిమే
ప్రక్రియలోనేనుండగా,
హఠాత్తుగా...
నిశీధి నిండిన మది గూటిలో
చంద్ర కిరణాల వెలుగు
నింపుకున్న 'తను '
ప్రత్యక్షం!
సంభ్రంగా చూస్తోన్న
నా కళ్ళు
వెన్నెల వాకిళ్ళే అయ్యాయి!
తన రాకకి
గుట్టు చప్పుడు లేకపోయినా..
ఆ ఉనికి తో మాత్రం...
గుండె సడి హెచ్చింది..
సొంపైన ధ్వనిలా!!
ఆదరణకి
నిజమైన భాష్యం చెప్పే..
ఆ చెలిమి తో,
హ్రుదయ కవాటాలు
తెరుచుకుని
ప్రేమ విహంగం.
మునుపెన్నడూ
లేనంత
స్వేచ్చగా ఎగురుతోంది!
అందుకేనేమో..
చిన్న చేయూత చాలు..
అచ్చంగా స్పందించడానికి!
చల్లని చేయి తోడు చాలు..
క్లిష్టంగా ఉన్న
జీవితాన్ని
ఇష్టంగా
ఆస్వాదించడానికి..!!

26.08.2012

22, ఆగస్టు 2012, బుధవారం

కవితాచక్ర ||ఈ..క్ష ..ణం..||

ఈ క్షణం!
గుండె గూటిలో
అపురూపం..
కొంచం జారవిడిచావో..
ముత్యాల సరంలా
చేజారిపోతుంది..

ఈ క్షణం!
మనస్పుష్పంలో
అందమైన జ్ఞాపకం!
కొద్దిగా యేమరపాటుగా ఉన్నవో..
నీటి బిందువులా
జాలువారిపోతుంది..

ఈ క్షణం!
వర్ణాలు చూసే కంటిలో..
వర్ణించలేని చిత్రం..
గ 'మ్మత్తు 'లో
కనురెప్ప మూసావో..
నిశీధిలో నిస్తేజమైపోతుంది!!

ఈ క్షణం!
అనుభవాల దొంతరలో
ఒక మధురిమ..
పొందలేక తప్పుకున్నావో...
జీవితకాలంలో కరిగిపోతుంది..
తుషార బిందువులా..

అందుకే..
ఇప్పుడే..
భ్రమలో లేని, ఊహ కాని..
ఈ క్షణమే శాశ్వతం!!
*21.8.2012

19, ఆగస్టు 2012, ఆదివారం

కవితాచక్ర // సప్తవర్ణ సంగమం //



ఒక స్వచ్చత మనసుని
అల్లుకుంటే..
మరో సందిగ్ధత
ఉక్కిరిబిక్కిరి
చేస్తుంది...
అచ్చు యెండలో వానలా!!

ఒక స్పష్టత హ్రుదయం
పై పరచుకుంటే...
ఇంకో క్లిష్టత
పట్టి కుదిపేస్తుంది...
అచ్చు పచ్చని పచ్చికలోనే
దాగున్న ముల్లులా!!

ఆత్మీయంగా తాకే
పిల్లగాలి ఒకవైపు,
తాపం పెంచే వడగాలి
మరో వైపు...
అచ్చు నవ్వులో దాగున్న
విషాదంలా!!

ఒక వసంతం, ఒక గ్రీష్మం
బాధ, సంతోషం..
యెన్నో అనుభవాల
మిళితమైన అద్బుతమే
జీవితం...
అచ్చు సప్తవర్ణ
ఇంధ్రధనస్సులా!!

*18-08-2012

8, ఆగస్టు 2012, బుధవారం

కవితా చక్ర || విను! ||

విను!
నీ గురించి వినిపిస్తున్న
అవతలి వారి మాటలకన్నా..
నీ అంతరంగం
'నీ' గురించి యేం చెబుతోందో

వింటే..
యేం చేయాలని తెలియకున్నా..
యేం చేయకూడదో తెలుస్తుంది!!

*07-08-2012

31, జులై 2012, మంగళవారం

కవిత చక్ర॥ అద్భుతం!! ॥

జీవితంలో అన్ని హంగులూ, ఆర్భాటాలు..
సుఖాలు, సంతోషాలు...
అన్నీ ముందే అనుభవించేస్తే..
ఎదురు చూడటానికి
జీవితంలో యేమీ మిగలదు!
... అందుకే...
సిరిసంపదలున్న
రాజు కన్నా..
యేదో కావాలి, యేదో పొందాలి..
అని ఆశగ యెదురు చూసే..
నిరుపేదే మిన్న!
అందుకే...
పొందామన్న తృప్తి కన్నా..
పొందాలి అన్న తపనే
అద్భుతం!!
*31.7.2012

కవితా చక్ర || ఆశ...ఆశ...ఆశ!! ||


అరటాకు హ్రుదయం పై-
క్రుత్రిమ మాటల గునపాలు దిగినా...
మనస్పుష్పంలో విరిసిన మధురోహలు..
... ... వాస్తవిక శరములై విజయ పథంలోకి
దూసికుపోతాయనే ఆశ!

అస్పష్టపు అగాధ వేదన-
ఆషాడపు వర్ష నిశీధిలా మనోక్రుతిని అల్లుకున్నా...
ఒక ఓదార్పు మణి దీపమై
నిర్లిప్త హ్రుదిని...
ఉత్తేజపరుస్తుందనే ఆశ!!

అడియాసల పొడి ఇసుకతో కట్టుకున్న ఇళ్ళు
నిరాశల తడి తుఫానులో కొట్టుకుపొయినా...
పడిగాపుల యెడారి జీవితంలో...
ఒక అనురాగపు జడివాన
కురుస్తుందనే ఆశ..!!

అభిఖ్యాన్ని అధీష్టించుటకై-
పరుగులు తీసె జీవితగమనం..
అలసి, సొలసి సొమ్మసిల్లేనని సంకుచిత లోకం...
పరిహసించినా..
నన్ను నేను నుట్టుకుంటూ...
జీవిత సాఫల్యం సాధిస్తాననే ఆశ..!!
*30-07-2012

కవితా రక్ష || వెళ్ళిపో నేస్తమా.. ||

నీది కాని నా ప్రపంచం నుండి..
నేను నేను గా లేని నా లోకం నుండి...
ఒక స్వప్నం మధుర పుష్పంలా..
విరబూయకముందు..
... అందమైన కోరిక..కెరటంలా
వొళ్ళు విరుచుకుని,
ఉప్పెనెలా నిను ముంచేయకముందు..
నీకై నీవుగా వెళ్ళిపో..
నీ తలపు దావాగ్ని
నను దహించకముందు..
యెదలో..
అందమైన భావం
ఆవిరవ్వకముందే..
నా లోకపు మగతలో..
నేనున్నప్పుడే...
మది తీరం దాటి
వెళ్ళు నేస్తమా...
*30-07-2012