పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
కవిత్వ విశ్లేషణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కవిత్వ విశ్లేషణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, నవంబర్ 2013, బుధవారం

మహేష్ కుమార్ కత్తి కవిత్వ విశ్లేషణ

కవిత యొక్క టైటిల్ చూస్తేనే తెలుస్తుంది ...లోతైన భావాన్ని ...కవిత లోని మొత్తం అర్థాన్ని ఒకే పదంలో నూతనంగా మూతబెట్టి చిత్రించిన తీరు కవి తాత్విక ధోరణికి అద్దం పడుతుంది.

తనకు తానుగా కావలని చేరుకున్న ఓ తీరం...అందులోని రసాయనంలా కవి ఎంచుకున్న వస్తువు అది మత్తు పదార్థం కావచ్చు లేదా ప్రేమకూడా కావచ్చు ఇంకేదైనా వ్యసనం కావచ్చు! తనకు తానుగా ద్రవంలా కరిగిపోయి మనసు వొలకబోసుకోవడం (మనసు పడటం)...ఆ కవితా వస్తువులో సంతృప్తి చెంది అక్కడే ఆగిపోయి తనకు తానుగా బంధీ అవడం... ఇదంతా ఒకే వాక్యంలో వర్ణించారు!

"నన్ను నేను సీసాలోకి ఒంపుకుని
బిరడా బిగించి, టైం కాప్స్యూల్ లో పడేసుకున్నాను.
అనుభవం ఉంది. జ్ఞానం ఉంది.
కానీ నేను మాత్రం ఆ సీసాలోనే మిగిలిపోయాను."

అనుభవమూ,జ్ఞానమూ అన్నీ తెలిసి కూడ కావాలని కోరుకున్న బంధంలోనే ఉండిపోయానంటారు! ఇది కవి మనస్తత్వాన్ని స్పష్టపరుస్తుంది.

తనను తాను సీసాలో వలకబోసుకునే ద్రవణంతో మరియు కవితా వస్తువును భూతంతో పోల్చడం... పీడించబడిన మనసును కవి యొక్క కళాత్మక దృష్టిని తెలియజేస్తుంది

"నన్ను నేను వృధా చేసుకున్నానా!
రాబోయేకాలానికి నమూనాగా మలుచుకున్నానా
లేక ఒక మ్యూజియం పీస్ గా మిగిలిపోతానా
అసలు గుర్తింపేలేకుండా ఇంకిపోతానో తెలీదు"

ఆ బంధం మత్తులో కాలం తెలియక గడిపాకగాని గుర్తొచ్చే విషయం...!గతించిన కాలాన్ని తలచి వృధాగ వగచి ప్రశ్నించుకోవడం....భవిష్యత్తుకు తానొక నష్టపోయిన జీవితపు నమూనాగా మిగిలిపోతానేమోనని...,అసలు గుర్తింపుకూడా లేకుండా పోతాననుకోవడం కవి పశ్చాత్తాప ధోరణితో కలవరపడుతూ ఆలోచించడం... కవి మనసు ఊగిసలాడే స్పందనను తెలియజేస్తుంది...!

"కొన్ని బిరడాలు తీస్తే భూతాలు వస్తాయి
కానీ ఈ సీసాలోంచీ భూతకాలపు అనవాళ్ళు
వర్తమానపు జ్ఞాపకాలు వస్తాయి
అవిభవిష్యత్తుకు పనికొస్తాయోలేదో తెలీదు
కానీ నన్ను కోల్పోయిన నేను కాలంగా మిగిలాను"

మనసు తలుపు తెరిచినప్పుడు కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయి కానీ కవి ఎంచుకున్న విషయం గుర్తొస్తే మాత్రం తను నస్టపోయిన కాలం గుర్తొస్తుంది అని అది వర్తమానాన్ని కూడా స్పృషిస్తుందని ....భవిష్యత్తులో అది ఒక గుణపాఠంగా పనికొస్తుందో లేదో అని.....ప్రస్తుతం ఎలా ఉన్నా గతించిన కాలం బ్యాడ్ టైం గా తనను నిలబెట్టిందని వ్యసనానికి బానిస అయి బయట పడడాన్ని చిత్రంగా చిత్రించారు!!!
సూక్ష్మంలో మోక్షం చూపించినట్టు వ్యసనానికి బానిస కావడం వల్ల అమూల్యమైన కాలాన్ని, విలువైన జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నిగూఢంగా తెలియజేసారు!

విషయం ఎలాంటిదైనా ఏర్పడకుండా చెప్పగలగడం కళాత్మకమే!
అమూల్యమైన సందేశాన్ని కవితగా చెప్పిన "మహేష్ కత్తి" గారికి ధన్యవాదాలు!

________ అరుణ నారదబొట్ల(13-11-2013)

4, నవంబర్ 2013, సోమవారం

కవిత్వ విశ్లేషణ

కెక్యూబ్ వర్మ -దుఃఖ దీపం


తొలిదశల్లో అలంకారశాస్త్రం,కొంత కాలానికి కళాతత్వశాస్త్రం.ఇంకాకొంత కాలానికి మనస్తత్వ శాస్త్రం వచ్చాక సాహిత్యంలో అనేకమైన అంశాలు చర్చకు వచ్చాయి.ప్రధానంగా అలంకార శాస్త్రం నాటికే మనస్సు కు సంబంధించిన చర్చ ఉన్నప్పటికీ,సాహిత్యంలోనూ మనస్సుకు సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ పాశ్చాత్యులు వేసిన దారులు గమనింప దగినవి.

దుఃఖానికి మూలం సుఖం పైనున్న యావేనని భారతీయ తాత్వికుల ఆలోచన.ఈ ఆశావహ జీవితాన్ని అందుకోలేక పోవడమే దుఃఖ హేతువు.అందుకోలేని అంశం ఎలా అవగాహన లోకివస్తుందనేదీ ప్రశ్న.అది ఇతరజీవితాలని గమనించటం.దాన్నించి తనని గ్రహించటం.ఈ అనుభవాన్ని కళాకారుడు ప్రకృతినించి కూడా అనుభవిస్తాడు.

మానసిక యంత్రాంగాన్ని గూర్చి ఫ్రాయిడ్ కొన్ని సూత్రీకరణలు చేసాడు.మనో యంత్రాంగం లేదా స్వప్న యంత్రాంగం(The mechnism of Dreems)సంఘర్షణకు,బాధకు ప్రతినిధి.ఒక సందర్భం నించి కలిగే అనేక భావనలకు,వికారాలకు ఇదే మూలం.ఇందులో నాలుగు భాగాల్లో వ్యత్యయీకరణం(Displacement)ఒకటి.ఇది రెండు రకాలుగా జరుగుతుంది.అవ్యక్తాలోచనకు సంబందించిన వస్తువు భాగం మాత్రమే అభివ్యక్తిలో కనిపిస్తుంది.ఒకరకంగా అలంకార శాస్త్రంలో (Synecdoche)సారోపలక్షణను పోలి ఉంటుంది.ఒక అంశాన్ని మరోదానితో ఆరో పించి చెప్పటం.

పోల్చే అంశం ప్రతీకీ కరణం(Symbolisetion)కు లోబడి జరుగుతుంది.దర్శనం వీటిని దృశ్య ప్రతిమలు(Visual images)గా స్వీకరిస్తుంది.మనవాడుకలోని అనేక పదాలు ఇలానే ఏర్పడ్డాయి.భాషాశాస్త్రం తెలిసిన వాళ్లకి ఈ విషయంకొత్త గాదు.మనం అమూర్తార్థంలో పదాలను ఉపయోగిస్తాం కాని ఇవి ఒక మూర్తార్థాన్ని ఆధారం చేసుకునే పుట్టాయి."కుశలుడు"-అంటే చేయితెగకుండా దర్భలు కోసేవాడని,"ఘటికుడు"అంటే కుండ పొట్టకింద ఉంచుకుని నదిని ఈదేవాడని ఆర్థాలు. ఇతిహాసాలలో పేర్లు ఇలా మూర్త భాగాలనించి వచ్చినవే.అందువల్ల మూర్త భాగానికి సారూప్యాన్ని పట్టుకోవడం మనసుకు బాగా అలవాటైన పని.

కెక్యూబ్ వర్మ గారు మనిషికి దీపానికి మధ్య సారూప్యాన్ని ఆధారం చేసుకుని తాత్విక పునాదులనుంచి జీవితాన్నినిర్వచించారు.జీవితంచుట్టూ జరిగే అనేక అంశాలతో ప్రతీకాత్మకంచేస్తూ జీవితాన్ని నిర్వచించారు.

"నీ చుట్టూ కొన్ని ప్రమిదలు వెలుగుతు/గాలి నిన్ను కూచోనివ్వదు"

"నీ అరచేతులు చాలనప్పుడు లోలోన/దిగాలు ఒక్కసారిగా అసహనంగా"

"ఈ ప్రమిదలలోని నూనె ఒలకనీయక/దీపపు నీడ దాపెట్టే విఫలయత్నం"

"నీ చుట్టూ ఇన్నిన్ని క్రీనీడల సయ్యాటల/భయ దృశ్యం అల్లుకుంటూ"

"నీ చుట్టూ ఓ దీప తీరం వలయంలా/అల్లుకుంటూ అచేతనంగా"

"ఈ కాంతి రేఖల రాక పోకల/వ్యవధి మధ్యలో ఎన్ని మిణుగురుల ఆశలు"

అనేకదృశ్యాలు ఇందులో కనిపిస్తాయి.ఇందులో "నీ" అనే పదం మాత్రమే కేవల వ్యక్తి వాచకం.ఇది లేకుంటే"గాలి/క్రీనిడ/నూనె ఒలకటం /కాంతి రేఖలు/మిణుగురులు/వలయం "లాంటి వన్ని అర్థపరంగా సామాన్యీకరణంచెందేవి.కాని వ్యక్తి వాచకం వల్ల ఇవన్నీ జీవితాన్ని అందులోని ఆటుపోటులని,కాపాడుకోడానికి పడే బాధని వ్యక్తం చేస్తాయి.అర్థక్షేత్ర పరిధిలో చూస్తే ఇవన్నీ దీపం అనే పరిధికి చెందినవే.

"చిక్కనవుతున్న చీకటి పాట/గాలి అలలనలా కోస్తూ"

"అచేతనంగా అభావమౌతున్న/రూపం ధూప కలికమవుతూ"

"నీ ఒక్కడివే ఈ గదిలో/ఒంటరిగా ప్రమిదలో దు:ఖ దీపమౌతూ"

చివరి క్షణాలని వ్యక్తం చేస్తున్నట్టుగా అనిపించే ఈవాక్యాలు కూడా జీవితం చుట్టూ ప్రతీకాత్మకంగా అల్లుకున్నవే.దర్శనం దృశ్యాలని చేజిక్కించుకుంటే అది విఙ్ఞానం రూపంలో లోనికి వెళ్లి ఙ్ఞానం ,అనుభవం ద్వారా కళగా వ్యక్తం చేయబడుతుంది.మంచి దార్శనిక కళానుభవం ఉన్న కళాకారుడే దాన్ని అందుకో గలుగుతాడు,అందించగలుగుతాడు.మంచి కవిత అందించిన కెక్యూబ్ వర్మ గారికి ధన్య వాదాలు.
                                                                     
                                                                                                                                                        
 
 
 
 
                                                                                                                                                      __________ఎం. నారాయణ శర్మ

1, అక్టోబర్ 2013, మంగళవారం

కవిత్వ విశ్లేషణ

తిలక్ బొమ్మరాజు-చెట్టు





 


చెట్టు అనాదికాలంగా గొప్ప కవితా వస్తువు.చెట్టుని ఆదర్శమయంగా,త్యాగ శీలిగా నీతిశాస్త్రం అనేక కోణాలలో అభివర్ణించింది.సత్పురుషుడుగా చెప్పింది.

"ఛాయామన్యస్య కుర్వంతి తిష్టంతి స్వయమాతపే
ఫలాన్యపి పరార్థాయ వృక్షాః సత్పురుషా ఇవ"

(చెట్టు తను ఎండలో వుంటు ఆశ్రయించిన వారికి నీడనిస్తుంది.ఇతరుల కోసం ఫలాలను కూడా ఇస్తుంది.సత్పురుషుడిలా)

తెలుగులో మనకి"చెట్టుకవి"(ఇస్మాయిల్)ఉన్నారు.ఏ కాలానికైనా చెట్టు గొప్ప వస్తువు.అలాంటి చెట్టు వస్తువుగా రాసిన కవిత తిలక్ "చెట్టు".ఇందులో తిలక్ లో ఒక ఉద్వేగం కనిపిస్తుంది.చెట్లను నరకడం పట్ల స్పందించి,భవిష్యత్తుని ఊహిస్తున్నారు.అనేక అవసరాలకోసం చెట్లపై జరుగుతున్న పనులని తిరస్కరిస్తున్నారు.

"నా తనువునంతా/తొలిచేస్తూ/తడియారని కొమ్మలపై
మానవ త్రాచుల/గొడ్డలి వేట్లు ",

"నవ్వుతున్న/వెన్నెల పూలు
నా ఒళ్ళంతా/తుంచేసేవారే ... కాని తుమ్మేదవాలనిచేవారేవ­­రు ?"

చెట్టు తానుగా మట్లాడుతున్నట్టుగా ఉత్తమ పురుష కథనం.త్రిపురనేని గోపిచెంద్ "మాకూ ఉన్నాయి స్వగతాలు"లో ఇలాంటి శైలి కనిపిస్తుంది.అందులోనూ ఓ తుమ్మ చెట్టు కథ ఉంది.మంచి భారమైన వాక్యాలున్నాయి.గొంతుకని సమర్థవంతంగా అవి ప్రసారం చేస్తాయి.

"నా మనసంత దిగులే/రాలిపోయిన ఆకులను
చూస్తే/హృదయమే బరువవుతుంది/నా జాడే కరువైతే"

"ఒడిలిన ఆకులకన్న/రాలిన పువ్వులకన్న బాదిస్తోంది నేను లేని
నా భూమిని పరికిస్తే/కూకటి వేళ్ళతో పెకలించేసారు/నా నేస్తాలెందరినో"
రెండు స్థితుల సంఘర్షణని చూపారిక్కడ.రాలిన ఆకులు,తనులేని భూమి ఈరెంటినించి తిలక్ వచనం సాగింది.సాధరణంగా కవిత్వంపై ప్రతిఫలనాలుంటాయి.తిలక్ కవితపై సామాజిక ,వైఙ్ఞానిక ప్రతిఫలనాలున్నాయి.చెట్టులేని వాతావరణాన్ని ,ఆయా క్రమాలని ఊహించి జాగృతులని చేస్తున్నారు.


"పొదిగిన గూళ్ళు అన్ని చెదిరిపోయాయి ఇక నాలో ఒదగలేక ఆకసం సైతం అలిగింది/నా నిష్క్రమణతో"

"మేఘం ఉరమనంటుంది
నేను లేని ఈ ధాత్రిలో చినుకు కురవనంది చెంతకురానివసంతాన్ని/చూసి "

ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు "శ్రీ రామచంద్ర లఘు కావ్య సంగ్రహః"అనే గ్రంథంలో ఓ కథలో వృక్షంలేని నగరాన్ని చిత్రించారు.అందులో "రావణ నగరి లంకాయాం షడపి రుతవః "అంటూ రావణ నగరంలోని వృక్ష రక్షణ గూర్చి చెబుతారు.ఈ క్రమంలో పరోక్షంగా తిలక్ ప్రపంచీకరణని తిరస్కరిస్తున్నట్టు కనిపిస్తాడు.కాని వాక్య రూపంలో ఇది కనిపించదు.

"మానవ త్రాచులు/వెన్నెల పూలు/వొదగలేని ఆకసం"లాంటి పదబంధాలతో పాటూ "చినుకు కురవనంది చెంతకు రానివసంతాన్ని చూసి"వంటి కళాత్మక,అనుభూతి వాక్యాలున్నాయి.

కొత్తగా రాస్తున్న ప్పుడు కవిత్వాన్ని ఒక రూపంలోకి తెచ్చుకోవటం కూడా అవసరం.వాక్యాలని యూనిట్లుగా రాస్తున్నప్పుడు.ఆవాక్యాల రూపం అవగాహనని అడ్డుకోగూడదు.వాక్యాల సమగ్ర రూపమే కవిత సమగ్రతని నిలబెడుతుంది.పద బందాన్ని "వరుస"లో రాయగూడదని కాదు కానీ దానివల్ల అర్థ సంబంధంగానో,వస్తు సంబంధంగానో ఒక అవసరమో,ప్రత్యేకతో ఉండాలి.

వేరువేరుగా వరుసలు,వాక్యాలు,యూనిట్లు రాస్తున్నప్పుడు కూడా అర్థం, వ్యక్తీ కరణ ప్రధానం.ఈ విభాగాలని ,వరుసలని రాస్తున్నప్పుడు శ్రద్ధ అవసరం.

మంచికవిత అందించినందుకు తిలక్ బొమ్మరాజు గారికి అభినందనలు.ఇంకా సాధన,అధ్యయనంతో మరిన్ని మంచి కవితలకోసం తిలక్ తనను నిలబెట్టుకోడానికి దగ్గరలో ఉన్నారు.

"వృక్షోరక్షతి రక్షితః"అనే కాదు"నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను" అని మనమంతా నమ్మితే చాలు.




                                                                                                              __________ఎం. నారాయణ శర్మ   

కవిత్వ విశ్లేషణ

కట్టా శ్రీనివాస్-ఎరుక







విఙ్ఞానం రూపంలో ప్రకృతి మనిషిలోకి ప్రవేశించి అది కళ,సౌందర్యం రూపంలో వెలువడుతుందని ఆమేరకు దాని ప్రతిఫలనలుంటాయని లెనిన్ భావించాడు.ఇదే జీవితమైతే అది తత్వం రూపంలో వెలువడుతుంది.ఈ తత్వానికి అతిస్థాయి వేదాంతం.జీవితం గురించి తాత్వికంగా మాట్లాడుతున్నప్పుడు వేదాంతం ధ్వనించడం అందుకే కాబోలు.

జీవితానికి కొన్ని దశలుంటాయని అభిప్రాయముంది.వాస్తవంకూడా.వీటినే శైశవ,బాల్య,యవ్వన,కౌమార్య,దాంపత్య ,గార్హస్త్య,వార్ధక్య దశలుగా చెప్పారు.ఇవన్నీ ఒకటిగా సాగుతున్నట్టేగాని వీటన్నిటికీ కొనసాగింపు లేనట్టుగా అనిపిస్తుంది.దానికి కారణం గతం ఙ్ఞాపకంలా మిగలటం.శ్రీనివాస్ ఇలాంటి "ఎరుక"నే కవితా వాక్యాలుగా ప్రకటిస్తున్నారు.

ఈ కవితలో భార భూతమైన ఆలోచనా ధార ఉంది.అది ప్రతివాక్యంలోనూ ప్రవహిస్తుంది.

"నాకు ముందు నేనున్నాను./నా తర్వాతా నేనుంటాను."
"దారం ఉనికి తెలియనంత వరకూ
ప్రతిపూసా విడిననే మెలిపడుతుంది."
"రెండో ఇన్నింగ్స్/సెకండ్ లైఫ్
ద్విదానో, బహుదానో/అవిచ్ఛిన్న విచ్ఛిత్తి"

ఓభాగం పూర్తయ్యాక ఇంకోభాగాన్ని అనుభవిస్తున్నప్పుడు గతానికి సంబంధించి ఉండే ఉనికి సంఘర్షణ ఇక్కడ కనిపిస్తుంది.ఈ వచనంలో పరోక్ష ఆఖ్యానం(Indirect neretion)ఉంది.తాను దేని గురించి మాట్లాడుతున్నారో స్పష్టంగా ఉండదు.కాని చెబుతున్న దాన్ని ప్రతీ అక్షరమూ ప్రతిబింబిస్తుంది.సూత్రత ఉన్న దేనికదే ఒంటరిగా కనిపిస్తుంది.ఎన్నిరకాలుగా విడిపోతుందో కూడా అర్థం కాదు.

"నానుంచి వచ్చిన వాళ్ళుకాదు.
నాగుండా ప్రవహించిన వాళ్ళని తెలుసుకుంటాను.
చిన్నారి బుగ్గలు పుణికినప్పుడల్లా,
నాజ్ఞాపకాలతోనే నాకు వణుకు."

ఇందులోని ప్రతీవాక్యంలో మనోవైఙ్ఞానిక భూమిక కనిపిస్తుంది.ఫ్రాయిడ్ మనోమూర్తిమత్వ నిర్మితి(Anatomy of mental personaality)గురించి చెప్పాడు,ఇందులోని మూడు అంశాలలో మొదటిది అహం.ఈ అహం రెండు లక్షాల మేరకు పనిచేస్తుంది.1.సుఖ సంతోషాల అన్వేషణం2.బాధా దుఃఖాలకు దూరంగా ఉండటం.వ్యాకూలత(Anxeity)ప్రదర్శించడం ద్వారా రాబోయే బాధ దుఃఖాలను అహం పసిగడుతుంది."చిన్నారి బుగ్గలు పుణికి నప్పుడల్లా/నాఙ్ఞాపకలతోనే నాకు వణుకు." ఈవాక్యంలో ఆ తత్వం కనిపిస్తుంది.

అస్తిత్వవాదం ఒకటివచ్చకా దుఃఖాన్ని అనేకరకాలుగా వ్యక్తం చేయడం కనిపిస్తుంది.ఈ ఎరుక లోనూ అది కనిపిస్తుంది.మంచికవిత అందించినందుకు ధన్యవాదాలు కట్టా శ్రీనివాస్ గారు.


                                                                                                        _____________ఎం. నారాయణ శర్మ  

కవిత్వ విశ్లేషణ

రాళ్లబండి కవితాప్రసాద్ -ఎగిరివొచ్చిన హంస





 



"ఉదార చరితాణాంతు వసుధైక కుటుంబకం"అన్నాడు నారయణ పండితుడు.ఈ విశ్వభావన మనిషిని ఉన్నతున్ని చేస్తుంది.ఈ భావన ,దర్శనం ఋషిని చేస్తుంది."ఋషిష్చకిల దర్శనాత్"అంటే ఇదేనేమో.కవిత్వాన్ని నిర్వచించుకోటానికి అనేక నిర్వచనాలు చెబుతాం.ఒక దృష్టిలో అవన్నీ ఈ భావన లోని ఉప అంశాలే.


డా.రాళ్ల బండికవితా ప్రసాద్ గారి కవిత"ఎగిరి వొచ్చిన హంస"ఈ విశ్వ భావననే కవిత్వానికి సమాంతరంగా నిర్వచిస్తుంది.వైదిక,ఆధ్యాత్మిక అంశాలలో "హంస"శబ్దం ఙ్ఞానానికి ప్రతీక.పురాణాదులలో జీవం"పక్షి"గా చెప్పబడింది.ఈ హంసని ప్రతీకగా చూపుతూ ఈ కవిత సాగుతుంది.

ఙ్ఞానానికి సంబంధించిన గతితార్కిక చర్చ ఒకటి ఇందులో సాగింది.సాధారణ భావనకి,విశ్వభావనకి మధ్య అంతరాన్ని చూపుతూ,దాని వ్యాప్తిని నిరూపించే ప్రయత్నం కనిపిస్తుంది.

"ఒక్కసారిగా నాకు రెక్కలొచ్చి పైకి ఎగరడం మొదలెట్టాను.
నారెక్కలు విసిరిన గాలికి అక్షరాల దుమారం మొదలైంది .
నేల మీద మొలుస్తున్నకవిత్వం నాకేసి నివ్వెర పోయి చూస్తోంది .
నేను ఎగురుతున్నాను ......."

మొదటి వాక్యం ఙ్ఞాన ఆవిర్భావాన్ని,రెండవ వాక్యం దాని ప్రభావాన్ని,తార్కికతని చెబుతాయి.అదివ్యాప్తమౌతున్న తీరు తరువాతి అనేకాంశాలలో కనిపిస్తుంది.


"ఒక్కోసారి నారెక్క సముద్ర తరంగమౌతోంది .
మరోసారి మహా ద్వీపం లా విస్తరిస్తుంది .
ఇంకోసారి మేఘమవుతుంది .
నేను హిమాలయమై నదుల రెక్కలతో
పీఠ భూముల్లో ప్రవహిస్తాను "

ఙ్ఞానం విస్తరిస్తున్న దశని చెబుతాయి ఈవాక్యాలన్ని.విడివిడిగా ఉద్వేగ,సాంద్ర,ప్రవాహ దశలు కనిపిస్తాయి.


"భూమ్మీద కావ్యాలు
అక్కడక్కడా నక్షత్రాల్లా మెరుస్తున్నాయ్,
కొన్ని అగ్నిశిఖల్లా ,ఇంకొన్ని ఆకాశం లోకి దూకే జలపాతాల్లా ,"

కావ్యాల నిర్మాణం ఙ్ఞానంతోనే.అందులోని స్వభావన్ని పై వాక్యాలు చెబుతాయి.తరువాతవాక్యాలలో"ఎగరడం మాని వ్యాపిస్తున్నానని"అంటారు.అప్పుడు రెక్కలు మొలిచాయి.వ్యాపిస్తున్నపుడు మొలిచిన
రెక్కలివి.

"రెక్కకొక కొత్త కన్ను.
రెక్క కింద మెదడు "

మెదడు ఙ్ఞానగ్రాహకమే కాని ఙ్ఞానం కాదన్నాడు లెనిన్.దాన్ని ఉదాత్త వ్యవస్థిత పదార్థం (Highly Organised meter)అన్నాడు.ఇది ఙ్ఞానాన్ని అపేక్షించి,ఆకర్షిస్తుంది.కన్ను దృష్టికి ప్రతీక.దృష్టి లేదా దర్శనం ఙ్ఞాన వాహిక.ఈ దర్శనమే ఉన్నతీకరిస్తుంది.ఈ తర్కం తరువాత కవిత్వాన్ని నిర్వచిస్తారు.

"కవిత్వం వ్యక్తికి కాదు ,
ప్రపంచ హంసకు పర్యాయపదం"

అరవిందులు దివ్య జీవన ప్రస్థానం(The paath of divine life)ప్రతిపాదించారు.అలాంటి దివ్య జీవితానికి,ప్రశాంతతకు మార్గమైన దర్శనాన్ని ఈ కవిత చిత్రించింది.వస్తువుమత్రమే కాకుండా అందించిన తీరులోనూ ఈ కవిత ఉన్నత మైనది.

"ఇప్పుడు ఎగరడంమాని వ్యాపిస్తున్నాను !
శరీరమంతా హృదయం వ్యాపించింది !"

"నా భూమి ఒకకొత్త పద్యం లా కనిపిస్తోంది ."


మంచి కవితను మనందరికీ పంచి కవిత్వాన్ని కొత్తగానిర్వచించినందుకు కవితా ప్రసాద్ గారికి ధన్య వాదాలు.

"జయంతి తే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః
నాస్తియేషాం యశః కాయే జరామరనజం భయం"


                                                                                                           _____________ఎం. నారాయణ శర్మ 

21, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

షoషాద్ మహమ్మద్ గారి కవిత-మిగిలే ఈ రోజుని
 


గతకాలానికి సంబంధించిన వ్యక్తులు,భావాలు,సంఘటనలు,తిరిగి మననం చేసుకుంటూ రాయడాన్ని పునశ్చరణం(Anamnesis)అంటారు.గతాన్ని తార్కికంగా వ్యక్తం చేయడానికి ఇందులో మంచి అవకాశం ఉంటుంది.ఎక్కువగ జీవిత భావనలను వ్యక్తం చేయడానికి ఇలాంటి వాక్యాలు రాస్తారు.

షoషాద్ మహమ్మద్ గారు రాసిన కవితలో ఈ భావ జాలం ఉంది.ఈ అంశం వెనుక బలమైన స్త్రీగొంతుక వినిపిస్తుంది.అది గతాన్ని,వర్తమానాన్ని రేపటిని కూడా తార్కికంగా చిత్రించింది.ఆ రేపుని శూన్యంగా.

"ఎన్నెన్ని రాక్షస యుద్దపు చీకట్లు
ఓడిపోతున్న మనసును
ప్రతీ సారీ చంపేసుకున్నాను
నిన్నటి నా చరిత్ర

కావాల్సిందేదో
మనసుకెదురై ముసుగుతీసేసినట్టు"

ఈ వచనంలో భారమైన అనుభవశక్తి ఉంది."రాక్షస యుద్ధం""యుద్ధపు చీకటి"లలో అణచివేతని,"ఓడిపోతున్న మనసును""మనసుకెదురై ముసుగు తీసేసినట్టు"లలో కొల్పోతున్న జీవితాన్ని గూర్చి కనిపిస్తుంది.

ప్రతీ వాక్యంలోనూ ఒక అసహనం కనిపిస్తుంది.

'ప్రేమ యుద్ధానికి ఆహ్వానం
గెలుపైనా ఓటమైనా ఇద్దరిది
నిజంకాలేని రేపటి నా ఊహచిత్రం"

"చరిత్రకు సాక్షం
నా ఒడిలో
ఊహకి స్థానం నా గుండెల్లో"

తాను బందీ అవుతున్న అంశాన్ని చిత్రించిన సంధర్భాలు.వాక్యంలో గాఢతకనిపిస్తుంది.వస్తువు విషయంలో పోలిక లేదుకానీ గతంలో స్కైబాబాగారు రాసిన "దుఃఖనామా"కవితలోని వాక్యాలతో పోలికలున్నాయి.ఆ శైలి ఇందులో కనిపిస్తుంది.కొత్తగా రాస్తున్నట్టు కనిపించినా షoషాద్ గారిలో బలమైన గొంతుక ఉంది.మరిన్ని కవితలతో త్వరలోనే తానోప్రత్యేకమైన గొంతుగా కనిపిస్తుందనటానికి ఏమాత్రం సందేహపడ నవసరంలేదు.
 
 
                                                                                                               ______________ఎం.నారాయణ శర్మ
 

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కవిత్వ విశ్లేషణ


రక్షిత సుమ-అడుగులు

 





ఒక వస్తువునుంచి ప్రకృతిని వెదుక్కోవటం.ప్రకృతినించి వస్తువును చేరటం తొలినాళ్లలో రాసేవారికి ఒక కవిత్వీకరణ సూత్రం.ప్రాసను (ప్రాస కవిత్వ భాగమే ..కాని కేవలం ప్రాస గాదు)కవిత్వ మనుకోవటం అక్కడినుండే మొదలైంది. చాల కాలం క్రితం ఒక పదాన్నో ,వాక్యాన్నో ఊనికగా తీసుకుని కవిత్వం రాసే వారు.నిర్వహణకోసం ఇదొక ప్రాతిపదిక మార్గం.

నిజానికి కవితలో పద సమ్మేళనం ఒక భాగం.చలం గారికి ఈ అలవాటు ఎక్కువ.చాలామంది కవులు ఒక అచ్చుమీదో,పదం మీదో వొత్తిడి(Stress)తో కవిత్వం రాస్తారు
.కవిత్వంలో వేగం (Swift)తేవడానికి ఇదో మార్గం.

రక్షిత సుమ అడుగు అనే పదాన్ని ఊనిక చేసుకుని కవిత అందించారు.నిజానికి ఇది ఊనిక మాత్రమే.మంచి కవితాత్మకమైన వాక్యాలున్నాయి.పైన చెప్పుకున్న సూత్రం కూడా మంచి దర్శనాన్ని ప్రదర్శిస్తుంది.

"పోగుబడ్డ ప్రపంచ విషయాలను పరిశీలనకు పుస్తకాన్నడుగు
వెనక్కితిరిగి ఓ క్షణం పసితనాన్ని చూసి
వసివాడని సంతోషాల కొసరడుగు
మసిబారని ఆలోచనల మెరుపడుగు"

'పోగుబడ్డ ప్రపంచ విషయాలు""వసివాడని సంతోషాలు""మసిబారని ఆలోచనలు"మంచి ప్రయోగాలు.ప్రేరణాత్మకంగా సాగే వచనం పఠనాసక్తినికలిగిస్తుంది.

"వెలుగెక్కడుందని నీడనడుగు
గమ్యాన్ని చేరేలా నడవాలంటే,
ముళ్ళకంపల ముద్దుల్ని మందుపాత్రల హద్దుల్నీ
దాటేయాలి నీ ప్రతి అడుగు"

నిజానికి ఇందులో పై చివరివాక్యంలోని "అడుగే" కవితకు ఊనిక.ప్రశ్నించి తెలుసుకోడంలోనే అన్నీ సమకూరుతాయనే అంసాన్ని ప్రతిపాదిస్తూ ఈవాక్యాలు కొనసాగాయి.కొన్ని వాక్యాలు మంచి భారతని కూఒడా కలిగి కనిపిస్తాయి.

"పరుగెత్తడమే కాదు పడకుండని తూకం కావాలి.
ప్రవహించడమే కాదు పదునెక్కే ప్రగతి వుండాలి. "

పడకుండనితూకం,పదునెక్కె ప్రగతి ఆ భారతని కలిగిస్తాయి.మంచి కవిత రాసినందుకు అభినందనలు.కవిత్వానికి తనదైన ముద్ర రక్షిత సంపాదించుకోవాలి.తనదైన వాతావరణం కవితకి కావాలి.మరింత అధ్యయనం తోడైతే అది ఎంతో దూరంలోలేదు.నిజానికి అలాంటివాతావరణానికోసమే ఇవాళ కవిత్వం చూస్తున్నది. బహుశః కవిసంగమంకూడా ఇలాంటి తరంకోసం చూస్తుంది.మరిన్ని కవితలు "వడి"గా రక్షితనించి కోరుకుంటున్నాను.



                    
                                                                                                                                                                       ______________ఎం.నారాయణ శర్మ

17, సెప్టెంబర్ 2013, మంగళవారం

కవిత్వ విశ్లేషణ

కె.ఎన్.వి.ఎం.వర్మ-గుప్పెడు మన్ను-ఆకుపచ్చని కల




 






నైవ రాజ్యం న రాజాసి నదండ్యో నచ దండినః
ధర్మేనైవ ప్రజాస్సర్వే రక్షంతి చ పరస్ఫరం




(రాజ్యములేదు,రాజులేడు దండించేవాడు దండింప బడేవాడులేడు.ధర్మాన్నొకదాన్ని తాముగ నిర్మించుకుని ప్రజలు పరస్పరం ఒకరినొకరు రక్షించుకునేవారు)భారతం శంతి పర్వం లోని ఈశ్లోకం రాజ్యం యొక్క డొల్లతనాన్ని చెబుతుంది.ఇప్పటి పరిస్థితుల్లో నైతే పాలన,చట్టం,న్యాయం అనే అంశాలు వ్యష్టిగా పనిచేస్తాయి.అందువల్ల రాజ్యం దాని ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది.


వర్తమానంలో ప్రజాప్రతినిధులు కేవలం పార్టీనాయకులుగా ప్రవర్తించడం వల్ల ప్రజా ఉద్యమాలు అణచబడుతాయి.అందువల్ల తమ ఆకాంక్షలకోసం పోరాడేప్రజాచైతన్యం అనేక సార్లు మోసం చేయబడుతుంది.పోరాట ఫలితాలను ప్రజల ఆకాంక్ష మేరకు కాకుండా నాయకుల ఆలోచనలకు దగ్గరగా నియంత్రించ బడతాయి.అందువల్ల ఉద్యమకారుడు ఎప్పుడూ ఒక స్థితిలోనే ఉంటాడు.


కొన్ని సంఘాలని చూస్తే ఈ అంశం అర్థమౌతుంది.కొన్ని సమీకరణాల మేరకు ఒకే చింతనగలిగిన సంస్థలుకూడా వేరై పూర్వపు భాగస్వామ్య పక్షాలనే మళ్లీ నిషేదించాయి.పాలన రూపాన్ని మార్చుకుంటుందిగాని తననడవడినికాదు.

కె,ఎన్.వి.ఎం.వర్మ కవిత అలాంటి పోరాటాన్ని చేసిన వీరుని మనస్సులోని సంఘర్షణని చిత్రించింది.

'నేల తల్లిని దోసిలోకి తీసుకొని/కళ్ళ కద్దు కున్నాను,
చెమట రక్తం తడిసిన మట్టివాసనలోంచి/వనాన్ని ఆఘ్రాణిస్తిన్న కల."

"నిశబ్దాన్ని మౌనాన్ని చీల్చుకొంటూ/కెవ్వుమని నావీపు పై విరిగిన లాఠీ
పడదోసి కసితీరా తన్ని భూట్లు/వేళ్ళు నలగొట్టి అరచేతిని తెరిచాకా...
నా ఆకుపచ్చని కలని/ఆ గుప్పెడు మన్నుని
నాలుగు సిం హాల కళ్ళలోకి విసిరి/చీకటిలోకి మాయమయ్యాను."


వస్తుసంబంధంగా కవితా వచనంలో భావాభివర్గాలు(Ideological groops)ను గుర్తించవచ్చు.వస్తువు వాస్తవిక,సౌందర్య,తాత్విక మొదలైన వర్గలలో ఎవర్గానికి చెందుతుందనేది ఈ అంశం చెబుతుంది.వర్మ వాస్తవికతకి సంబంధించిన వస్తువును తీసుకున్నారు.కాని ఆఖ్యానం(Neretion)లో దాన్ని సౌందర్యనికి దగ్గరగా తీసుకువెళ్లారు."పచ్చనికల""వనాన్ని ఆఘ్రాణించడం"మొదలైన వి అందుకు ఉదాహరణ ."ఆకుపచ్చని కలని సిం హల కళ్లలోకి విసరడం"వ్యక్తిగత రక్షణని చూపుతుంది.

అకుపచ్చని కల ఆకాంక్షకి.నాలుగుసిం హాలు పోలీస్ వ్యవస్థకు ప్రతీకలుగా నిలుస్తాయి.


"ఎన్ని జెండాలు మోసినా,
యధాతదం చరిత్ర మొత్తం"

ఈ వాక్యం ఉద్యమ సంస్థల,పాలనల డొల్లతనాన్ని చెబుతుంది.ఫలాలను అందుకునే అవకాశం ప్రజకు చిక్కటం లేదనే అంశాన్ని నొక్కి చెబుతుంది.

కవిత చిన్నదైనా ,నిర్మాణం ,అభివ్యక్తి విషయంలో మంచి పరిఙ్ఞానం కనిపిస్తుంది.వస్తుగతంగా అంశం పాతదే అయినా చూసిన దర్శనంలో కొత్తదనముంది.ఇంకా మంచికవితలు వర్మ గారినుండి ఆశిద్దాం.


                                                                                                                                                      ______________ఎం.నారాయణ శర్మ

14, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

అరుణ నారద భట్ల-ఆశానగర్ అశోక్ నగర్


కారణాలు పెద్దగా తెలియవుకాని నిరుద్యోగం పై వచ్చిన కవితలు తెలుగులో చాలా తక్కువ.విద్యా సంబంధంగా కార్పోరేట్ విద్యపై సాహిత్యం చాలా సార్లు మాట్లాడింది.మిగత వ్యవస్థల గురించి మాట్లాడటం తక్కువే.ఆతరహాలోనే కోచింగ్ సెంటర్లూ
తెలుగునాట ప్రధానంగా రాజధాని హైదరబాద్ లో ఎక్కువ.అందులోనూ అశోక్ నగర్ అందుకు ఒక ప్రధాన కూడలి.

అరుణ నారదభట్ల కవిత ఇలాంటి జీవితాలను వారివెనక ఉన్న సంఘర్షణలను చిత్రించింది.ఈ జీవితాన్ని దగ్గరినించి గమనించిన సహృదయత ఈ కవితలో కనిపిస్తుంది.ప్రధానంగా ఆశకు,అవకాశానికి మధ్యన ఈ కథనం కనిపిస్తుంది.

"అది కలల సౌధమో/కాలం నేర్చిన జీవిత సత్యమో
లేక...పాలకులు పరచిన ప్రకటనల హోరో!"

"ఒక్కసారిగా సిటీ నడివొడ్డున పడి/లేవలేక కొట్టుమిట్టాడుతున్న బ్రతుకులు"

"బలీయమైన భవిష్యత్తుకై/కూడబెట్టిన సొమ్మంతా
ఆ వీధిలో ధార పోస్తున్నారు"

ఈవాక్యాల్లో ఒక అనుక్రమం ఉంది.ఆశ కలుగుతున్న స్థితిని,దానికోసం చేస్తున్న ప్రయత్నాన్ని,అందులో సఫల మౌతున్న ,కాని వారి గురించి ఈక్రమం వివరిస్తుంది.

"వులిదెబ్బకు భయపడక నిలదొక్కినవారే
సాకార ప్రపంచాన్ని చూస్తున్నారు"

"మింగుడు పడని ఓటమికి ముసుగేస్తూ
ముందేటికైనా నిలబెట్టుకుందామని
తేరుకోలేక....!?!ఒంటరిగానే ఆ గదిలో
మలివయస్సులోకి తొంగిచూస్తూ
అక్షరాలతో సహవాసం నేర్చి"

పోటీపరీక్షల్లో అనుకున్న స్థాయికి రాక,మళ్లీమళ్లీ ప్రయత్నించి ఇంకా వెదుకులాడే వాళ్లూ ఎక్కువే.కాని ఏదో ఆశ ఇంకా నడిపిస్తుంటుంది.నిజానికి ఈ జీవితాల వెనుక ఇంకా చాలా అంశాలున్నాయి.జీవితమంతా కవిత్వంలో పట్టనట్టు,అన్ని అంశాలు ఒకే కవితలో రావడమూ అసాధ్యమే.

"సాకార ప్రపంచం""చీకటి చెర""మలి వయస్సులోకి తొంగి చూస్తూ""కాలం దెబ్బ"లాంటి మంచి పద బంధాలున్నాయి.మరిన్ని మంచి కవితలు అరుణ నారద భట్ల అందిస్తారని ఆశిద్దాం.

కవిత్వంలోకి ఇంకా కొత్త వస్తువులు రావాలి.తమదైన జీవితాన్ని,తమ దైన ప్రపంచాన్ని కొత్త తరం గమనిస్తే కవిత్వీకరిస్తే కొత్త వస్తువులు,అదేవిధంగా పాతవస్తువులూ కొత్తగా తొంగిచూస్తాయి.



                                                                                                                                                 _____________________ఎం.నారాయణ శర్మ

13, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కవిత్వ విశ్లేషణ

కపిల రాంకుమార్ కవిత : కవిత్వానికి మానిఫెస్టో



కొన్నళ్ల తరువాతకావొచ్చు,తొలిదశలోనే కావొచ్చు కవులకు కవిత్వం మీదా,ఆయా రచనల మీదా,ప్రక్రియల మీదా,వస్తువుల మీద కొన్ని అభిప్రాయాలుకలుగుతాయి.నిజానికి ఇవ్వే కొన్ని సార్లు తరువాతి కాలాలకు మార్గదర్శకమౌతాయికూడా.శ్రీశ్రీ "కవితాఓ కవితా".లాంటి కవితలు అలాంటివే.

ప్రాచీన కావ్యంలో కావ్య"ముఖం"పేరుతో అవతారిక ఒకటి ఉండేది.కవులు అలాంటి వాటిలోనే తమతమ అభిప్రాయాలు చెప్పేవారు.ఈ కాలంలో కూడా కవిత్వం ఇలా ఉండాలి అంటూ ఒకటో ,అరో కవితావాక్యాలు రాయనివారుండరు.

కపిల రాంకుమార్ గారు అలాంటి అంశాన్నే కవిత్వం చేసారు.ఇందులో రాంకుమార్ కొంత పూర్వుల మాటలకు విలువనిచ్చి మాట్లాడినట్టు కనిపిస్తారు.సినారే ఒక పద్యంలో "అంత కడివెడు పాలపై ఒకింత మీగడపేరినట్లు మనకు మిగులును గతములోపలి మంచి అదియె సంప్రదాయము"అన్నారు.పాతనించి మిగుల్చుకునేది ఎంతో కొంత ఉంటుంది.

"జ్వరం తగ్గి పథ్యం చేసే వేళ/పాత చింతకాయ పచ్చడి,
నిమ్మకాయ కారం తప్పనిసరి అవుతుంది
లాలాజల వృద్ధికి, పూర్వ శక్తి కూడగట్టుకోడానికి!"

సాధరణంగా కనిపించినా ఈవాక్యాల వెనుక ఓ నేపథ్యముంది.ఈ మాటల వెనుక పరోక్షంగా ప్రాచీన సాహిత్యాధ్యయనాన్ని గూర్చి చెబుతున్నారు.

"అలాగే కావ్యేతిహాసాలను
ఎప్పుడైనా పలుకరిస్తేనే కదా
పుక్కిటి పురాణాలేవో, ప్రతీకలకు ఆధరవులేవో
ఉపయోగించాలా వద్దా అని తెలిసేది!"

ఒక వాక్యాన్ని కళాత్మకంగ,ఆలంకరికంగా ఎలాచెప్పాలో తెలియడానికి అధ్యయనం చాలా అవసరం.పురాణాలల్లోనూ ప్రతీకలని పట్టుకోడానికి మార్గాలున్నాయంటున్నారు.నిజమే. బోదెలార్ సుసన్నా లాంటి పాశ్చాత్యులుకూడా వారిపుస్తకాలలో పురుషోత్తముడిలాంటివారిగురించి చెప్పుకున్నారంటారు.ఈ అధ్యయనం ఏ కాలానికైనా చాలావసరమే కదా.

"కథకైనా, కవితకైనా
నడకనేది అవసరం!
నడతనేదీ అవసరం!"
చదివించే లక్షణం (Reedability)ఒకటి కవితకి చాల అవసరం.ఆనడక వెంటే పాఠకుడు పరిగెడతాడు.

"ఛందమను, శబ్దమను, అలంకారమను
ఉపమానమను తెలీకుండానే/తోసుకువస్తాయి వరసలోకి!
అల్లిక వదులుగానో, బిగుతుగానో అయినా/హృదయస్పందన కలిగించేలా"

పాల్ వాలరీ"కవిత్వం మేధకు కాదు హృదయానికి చేరాలి" అన్నాడు.అధ్యయనం వల్ల ఇవన్నీ పెద్దగా కష్ట పడకుండానే అలవడుతాయి.కవిత్వం ఎలా ఉన్న బిగుతుగా ,ప్రౌఢభాషతో ఎలావున్నా కవిత్వం లో కవిత్వం కనిపించాలని అంటారు.

చాలావరకు అందరికీ కవిత్వం ఎందుకురాస్తున్నామో అర్థం కాదు.పడికట్టు పదాలతో కవిత్వాన్ని నిలుపుకోలేము.వస్తువూ ఎక్కువకాలం నిలుపదు.కవిత్వమే కావాలి.అందుకోసం హృదయాన్ని ఆవిష్కరించే నేర్పుకావాలి.అందుకు అధ్యయనం, సాధన కావాలి.ఈ రెంటి గురించే రాంకుమార్ గారి కవిత మనకు సూచన లిచ్చింది.ధన్యవాదాలు రాం కుమార్ గారు మంచికవిత.
                                                                                                                                               _____________________ఎం.నారాయణ శర్మ
 

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

కవిత్వ విశ్లేషణ



పారువెల్ల శ్రీనివాస రెడ్డి -గులక రాళ్లు


 


జీవితం,మానవుల ఉనికి.ప్రకృతి,ఆధ్యాత్మకత ఉన్న కవితని తాత్విక కవిత(Phylosophical poem)అంటారు.కవిత్వానికి సమాజం జీవితం కాక మరేదీ వస్తువుగా ఉండదుకదా?అనుకోవచ్చు.జీవితాన్ని చూసే దర్శనంలోనే తాత్విక కవిత వేరవుతుంది.శ్రీనివాస రెడ్ది గతంలోని ఙ్ఞాపకలను "గులక రాళ్లు"గా అభివర్ణిస్తున్నారు.

చిన్న తనంలో ఏరుకున్న గులక రాళ్లని అత్యంత భద్రంగా దాచుకుంటుంది బాల్యం బహుశః ఇందులో ఈప్రతిఫలనముంది.
ఇందులో రెండుకాలాల మధ్యన సూత్రంలా ఒక కొనసాగింపు కనిపిస్తుంది.నువ్వు ,నేను అనే రెండు అనిర్దిష్టపాత్రలు ఉన్నాయి.

"నలుగురిలో/నవ్వుతూ నవ్విస్తూ నేను
చీకటి రాత్రుల్లో ఒక్కడినై ఏడుస్తూ నేను/నువ్వు లేకుండా"

ఇందులో సాహచర్యంలో ఉండే తత్వాన్ని చెప్పారు.బయటి ప్రవర్తనకి ,మనసుకి మధ్యన ఉండే తారతమ్యాన్ని వ్యాఖ్యానిస్తున్నారు.రెండవ వాక్యంలోనూ ఇదే అనుక్రమం కొనసాగుతుంది.ఆతరువాత వాక్యంలో అంతర్ముఖత్వాన్ని తలపించే భావన కనిపిస్తుంది.

"నీకు మాత్రం/మనసుకు విప్పలేక ముసుగు కప్పుకొని తిరుగుతూ
అలిసి , కాలంతో కలిసిపోవడమే శరణ్యమయ్యింది"

"ముసుగు నీడను మోస్తున్న మనసును విడిచి
నీకు నువ్వు కనిపించేదాకా
నువ్వెక్కడున్నావో నువ్వే వెతుకు "

అచేతనాన్ని ,సచేతనాన్ని గురించి మనోవైఙ్ఞానికవేత్తలు మాట్లాడారు.ఫ్రాయిడ్ ఙ్ఞాపకాన్ని ప్రాక్చేతనం అన్నాడు.పై వాక్యంలో సచేతనానికి ప్రేరేపించడం కనిపిస్తుంది."ముసుగు"అలాంటి పదమే.ప్రాక్చేతనలో సంసర్గ విధానాన్ని(Associative process)గురించి చెప్పాడు.అనేకాంశలని చెబుతూ ఙ్ఞాపకాన్ని తవ్వడం.

"గులక రాళ్లు""వాగు" ఇలాంటివే.ఒకసారి ఒక మిత్రుడు కవిలోని స్వరాన్ని బట్టి స్త్రీ,పురుష బేధాలని గుర్తించినట్టు,ఎదుటి పాత్రలను గుర్తించ వచ్చా అని అడిగాడు.ఐతే కవి అందుకు అవకాశమిస్తే కష్టం కాదనిపిస్తుంది.

శ్రీనివాస్ రెడ్డిగారి కవితలో "గాలి,వెన్నెల,"లాంటిపదాలు ఎదుటి పాత్రలో స్త్రీ మూర్తిని స్ఫురించేస్తాయి.అయితే ఙ్ఞాపకలను ప్రేరేపించడమే శ్రీనివాస్ గారిలో ప్రధానంగా కనిపిస్తుంది.మంచి కవితనందించినందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి కృతఙ్ఞతలు.


                                                                                                                                          _____________________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

Mehdi Ali: నీ విఙ్ఞత





 


మెహది అలిగారి కవితగురించి మాట్లాడుకున్నప్పుడు రెండువిషయాలను గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.1.అలీగారు వ్యక్తం చేసిన అంశం2.వ్యక్తం చేసిన తీరు. చాలాకాలం క్రితం బౌద్దానికి సంబంధించి"అశ్వ ఘోషుడు"మనుషుల ప్రవర్తనకు సంబంధించి "సౌందరనందం"లో ఒక వ్యాఖ్య చేసాడు.

"దృష్ట్వైకం రూపమన్యోహి రజ్యతేsన్యఃప్రదుష్యతి
కశ్చిద్భవతి మధ్యస్థఃతత్రైవాన్యో ఘృణాయతే"

ఒక రూపాన్ని చూసి ఒకడు సంతోషపడితే ఒకడు దూషిస్తాడు,ఇంకొకడు మధ్యస్థుడైతే
,వేరొకడు జాలిచూపిస్తాడు.మనుషులస్వభావన్ననుసరించి వారివారి విఙ్ఞతలననుసరించి వారి ప్రవర్తన ఉంటుంది.ఇలా వేరువేరు అభిప్రాయాలు కలగటం వారి మానసిక సంస్కారాలను బట్టే ఉంటుంది.

అలీగారు ఇలాంటి తత్వంలోనే నీవిఙ్ఞత అనివదిలేసారు.ఇందులో అనేకాంశాలని స్పర్శించడం కవికుండే సార్వత్రిక దృష్టికి నిదర్శనం.విమర్శలో సభ్యొక్తి (euphemisam)అనే పదాన్నొకదాన్ని వాడతారు.ఇది వాక్యాన్ని చెప్పే పద్దతికి సంబంధించింది.ఎదుటి వారి ప్రవర్తన గురించి మాట్లాడుతున్నప్పుడు దురుసుగా,కటువుగా కాకుండా పరోక్షంగా చెప్పడం.

వ్యక్తం చేసిన తీరు గురించి మాట్లాడుకుంటే కొన్ని విషయాలు ప్రధానంగా గమనించాలి.కొత్తగా కవిత్వం రాస్తున్నవాళ్లకు ఏవిషయం రాయాలన్న దాంట్లో అనుమానం లేకున్నా.. ఎలారాయాలనేది,ఎదుటి వారికి ఎలాచేరవేయాలనేది మొదటి ఇబ్బంది.అలాంటి వారికి ఈకవితనుండి ఒక మార్గం దొరుకుతుంది.మొదట్లో చాలావరకు అందరూ పంక్తులలో పదాలనుపేరుస్తూ వెళతారు.అంటే ఒకే వాక్యాన్ని సుమారు మూడు నాలుగు పంక్తులల్లో రాయటం.ఇంకొందరు కుప్పగా ఒకేచోట రాసేస్తారు.ఇది ఒకరకంగా కవిత్వం రాసే వారిలో ప్రాథమిక దశ.ఎంత గొప్ప స్ఫూర్తి కలిగించే విషయం చెప్పినా నిర్మాణ క్రమం తెలిసి రాసే వారి వాక్యంలా చేరదు.

కొంత అధ్యయనం తరువాత ఇలాంటివారిలో పరిణత దశ కనిపిస్తుంది.అంశాలని యూనిట్లు గా రాయడం.ఈసమయంలో రెండు వాక్యాలుగా ,మూడువాక్యాలుగా రాయడం కనిపిస్తుంది.నిజాని ఈదశకి చేరడానికి కొంత కాలం పడుతుంది.ఇలాంటి కవితలు చదివి నిర్మాణాన్ని అర్థంచేసుకున్న వారికి ఆకాలం కొంత తగ్గొచ్చు.

అలీ కవితలో ప్రతి యూనిట్లోనూ వరుసగా నిర్మాణ సారూప్యత సాధించారు .

"నేనొక సముద్రాన్ని గంభీరంగా కనిపించడం నానైజం
భయపెడుటున్నానా కెరటాలతో ఆడమంటున్నానా
అర్థమెలాచేసుకుంటావో నీ విఙ్ఞత అది"

మొదటి దాంట్లో ప్రతిపాదక వాక్యం-సృజనధర్మ వర్ణన.రెండవదాంట్లో రెండు వైవిధ్యాంశాలు.మూడవది సూచన .నిర్మాణగతంగా ఇది శతకాలలో కనిపించే మకుటం లాంటిది.విమర్శ దీన్ని వాక్య నిర్మాణ పునరుక్తి(parallelism)అంది.సరళ వచనం (plain prose)లా కనిపించే కఠిన పదాల్లేని వచనం ఇందులో మరో ఆకర్షణ.అర్థ సంబంధంగా ప్రతీ పదంలోనూ కవికున్న అవగాహన కనిపిస్తుంది.ఒక అంశానికి సంబంధించి అనేక పదాలను నిర్మిస్తే అర్థ క్షేత్రం అంటాం.రెండు పదాలు ఉంటే సజాతీయాలు అంటాం.

శశి-వెన్నెల,సమీరం-చలి,సాగరం-కెరటం,రాగం-ఆహ్లాదం ఇలాంటి వన్ని అలాంటి పదాలే.ఇన్ని పంక్తుల్లోనూ మనిషి స్వభావాన్ని అంచనా వేస్తారు.రసానుభవానికి అనుకూలంగా ఏర్పడేవాటిని విభావాలు(objective correlative)అంటారు.ఇందులో ఆలంబన విభావం కారకం లాంటిది.సముద్రం,గ్రంథం,అనుభవం ఇలాంటివి ఆతాలూకే.మరోటి ఉద్దీపన విభావం ఆవేశవాతావరణాన్ని ప్రదర్శించేది.వాక్యాల్లో క్రియాగతంగా చెప్పిన వాక్యాలన్ని అలాంటివే.
ప్రకృతి గతంగా 3,భావన అనుభవాలకు సంబంధించి2,సాహిత్య సంబంధంగా3 అంశాలు కనిపిస్తాయి ఇందులో.
వ్యక్తిత్వాన్ని ప్రతీకాత్మకంగా చెప్పి సారూప్యతని ఆపాదిస్తారు.

"నేనొక అనుభవాన్ని పాఠం నేర్పడం నానైజం
అప్రమత్తత నేర్చుకోవాలా నిర్లక్షంగా వుండాలా
అర్థమెలా చేసుకుంటావో నీ విఙ్ఞత అది"

"నేనొక కవితని జాగృతం చేయడం నానైజం
కవితలో నిన్ను వెదుక్కుంటావో ఇతరులగురించి అనుకుంటావో
అర్థమెలా చేసుకుంటావో నీ విఙ్ఞత అది"

వాక్యనిర్మాణానికి సంబందించి ఆకాలనికి తగిన రచనకు దగ్గరగా ఉండే క్రమాన్ని అర్థం చేసుకోడం అవసరం.అలీగారి కవిత ఆపనిచేసింది.జయహో అలీగారు.


2.8.2013



                                                                                                                                            _____________________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

సాయికిరణ్ కుమార్ శర్మ కొండముది-ధన్యజీవితం,

           
         




ధ్యానంగురించి చాలావరకు ప్రాచీన భారతీయయానులనుంచి ఇప్పటి వరకు చెప్పని వారంటూలేరు.విమర్శలో ద్వంద్వార్థరచన(allegory)అనేపదాన్నొకదాన్ని ఉపయోగిస్తారు.పాఠకుడికి ఆసక్తి రేపడానికి ఒకవస్తువుతో ఒకటిపోల్చి చెప్పడం,ఒక స్వభావంతో మరోదాన్ని పోల్చి చెప్పటమిలాంటిదే.

పాతకాలపు నీతి శాస్త్రం నుంచి ఇప్పటిదాకా వచ్చిన సాహిత్యమంతాఈపనిచేసింది.ఇందులో ఒక మార్గం ప్రకృతిలోని అంశాలకు జీవితాన్ని ఆపాదించి చెప్పటం.ఇలాంటివాటిలో కవికి లోతైన పరిశీలనా శక్తి కావాలి.కొండముది సాయి కిరణ్ కుమార్ శర్మ ఒక చెట్టుజీవితాన్ని-వార్ధక్యంలో ఉన్న వృద్దురాలిలా దర్శించి కవిత్వీకరించారు.

ప్రకృతితో స్నేహం చేయడానికి ఒక దార్శనికపరిఙ్ఞానం కావాలి.

"దర్శనే స్పర్శణే వాపి శ్రవణే భాషనేపివా
యత్ర ద్రవత్యంతరంగః స స్నేహ ఇతికథ్యతే"

చూడటం,తాకటం,వినటం,మాట్లాదుకోటంవల్ల ఎక్కడైనా మనసు ద్రవిస్తే దాన్ని స్నేహం అంటారు.-అని నీతి శాస్త్రం.

ప్రాచీన సంస్కృత కవుల్లో వాల్మీకి,కాళిదాసు మొదలైన వారు ప్రకృతిని గూర్చి గొప్ప వర్ణనలు చేసారు.

వాల్మీకి-"నదీం పుష్పోడుపవహాం"(పూల పడవల్ని మోస్తున్న నదీ"అన్నాడు.

శూర్పనఖ రెండువైపులా ఉన్న రామలక్ష్మనులిద్దరినీ చూసి-ఎవరిని వరించాలో తెలియక అర్థం గాని స్థితిని ఇలాచెబుతారు"ఉభయ కూల సమస్థిత శాద్వలభ్రమగతా గత భిన్న గవీ దశాం"(ఇరువైపుల గడ్డి పెరిగితే ఏవైపున మేయాలో తెలియని ఆవులా ఉందన్నాడు)కాళి దాసు కూడా హిమాలయాలల్లో గాలిసవ్వడి వినిపిస్తుంటే "ఉద్గాస్యతామిచ్చతి కిన్నెరాణాం తానప్రదయిత్వమివోపగంతుం"(కిన్నెరలు పాదే పాటకు ప్రకృతి తానాన్ని పాడినట్టుగా ఉందని అన్నాడు)

ష్చెర్బీనా మాటల్ని శేషేంద్ర శర్మ ఈ సందర్భంలో ఇలా వివరించారు.
"What distingushes an artistic vision of the world from all the other froms of knowledge is its much larger content of fantasy,imaginetion,cinjecture,instinct,and sub conciousness"
భార తీయ అలంకార శాస్త్రం కూడా"ఋషిశ్చకిల దర్శనాత్"అనీంది స్థూలంగా..

"పండు ముదుసలి వగ్గులా
మడతలు పడ్డ దేహంతో/చెట్టు"
చెట్తు స్థితిని దార్శనికంగా చెప్పి,కారణాలను ఔన్నత్యాన్ని ఆవిష్కరించారు.

"ఆకలేసిన కాకిలా /ఆరో ఋతువు
ఆకులను అద్దుకు తినేసింది"
శిశిరంలో ఆకురాలిన సంధర్భాన్ని చెపుతున్నారు.ఈ కవిత లో ప్రాసపై మక్కువ కనిపిస్తుంది.భావనా వ్యక్తతలో శబ్దం పాత్రని కవి ఎక్కువగా విశ్వసించి నట్టు కనిపిస్తుంది. "అకలి,ఆరో ఋతువు,అద్దుకు తినటం,ఆకతాయిలు,అరవైచేతులు అన్నీ ఇలాంటివే.
నీడకూడ ఇవ్వలేకపొతున్నందుకు తడికళ్లతో ఉందని అంటారు.ఇందులో స్వభావాన్ని ఆపందించడం ఉంది.ధ్యానం, తో కవితను వ్యక్తం చేయటం ఇందులో కనిపిస్తుంది.
అభినందనలు.సాయి కిరణ్ కుమార్ శర్మ గారు.3.8.2013



                                                                                                       _______________ఎం.నారాయణ శర్మ


కవిత్వ విశ్లేషణ

బి.వి.వి.ప్రసాద్ కవిత-పావురాలు

 





తెలుగులో వచనకవిత వచ్చాక ఆ పరిధిలోనే మరికొన్నిమార్గాలు కనిపిస్తాయి.అనుభూతి కవిత్వం ,అంతర్ముఖీనకవిత్వం ఈదశలో కనిపించేవే.బివివి ప్రసాద్ కవిత సుమారుగా ఆకోవకు చెందిందే.నిజానికి "హైకూ"పరిచయం ఒకటి కలిగాక తెలుగులో పైన చెప్పుకున్న రెండుమార్గాలు పరవళ్లు తొక్కాయి.ధ్యానం,సమాధి లాంటివి పూర్వమే కనిపించినా వాటిని గురించి ఈ 1,2 దశాబ్దాలు మాట్లాడటం అలా ప్రారంభమయిందే.

భౌతిక ప్రపంచాన్ని విడచి అహంకారాలులేని శాంతినపేక్షించే మానసిక ప్రపంచంలోనికి అక్కడినించి సౌందర్యమైన ప్రాకృతికప్రపంచంలోనీ దాన్నించి దృశ్యమూ,శబ్దమూ,రూపమూ లేని పూర్ణ ప్రపంచంలోనికి వెళ్లడం అంతర్ముఖీనత(introspection).అలావెళ్లేకవి అంతర్ముఖీనుడు(invertor).

యోగదర్శనం పేరుతో సౌందర్యారాధకులుచెప్పినది.సమాధి అభ్యాసాలను ప్రతిభా కారకాలుగా అలంకారికులు చెప్పినది ఈ లక్షణాలకు కాస్త దగ్గరగా కనిపిస్తుంది.

రుద్రటుడు(వచనాను స్మృతి)లో-
"మనసి సదా సమాధినీ"(సమాధి సిద్దమైందే ప్రతిభ)అని వ్యాఖ్యానించాడు.సమాధికి అలాంకారికులు చెప్పిన నిర్వచనాలూగమనించదగ్గవి."సమాధిరాంతరా"అనేది ఈ అంతర్ముఖీనత్వాన్నే చెబుతుంది.తౌత భట్టు కావ్య కౌతుకం లో శాస్త్రాధ్యయనం చేత ఙ్ఞానం లభిస్తుందని అక్కడినుండి దర్శనం కలుగుతుందని ఆదర్శనం వల్ల చేసే వర్ణన కవిగాచేస్తుందని అన్నాడు.

"సతత్త్వ దర్శనాదేవ శాస్త్రేషు పఠితఃకవిః
దర్శనాద్వర్ణనాచ్చాధ రూఢాలోకే కవి శృతిః"

బివివి ప్రసాద్ సృజనని ఇలాంటి దర్శనంతో దర్శించి చిత్రించారు.మనసులోకి ఊహలు రావడాన్ని,అందులోంచి సృజనరావడాన్ని స్పందనలుగా ,పావురాళ్లుగా చిత్రిస్తున్నారు.ప్రశాంతత అనే అంశమే "పావు రాళ్ల"నితెచ్చింది.శబ్దాన్నే కొరుకుంటే బహుశః చిలుకనో,మరోదాన్నో తీసుకునే వారేమో.అంతర్ముఖీనత అనిచెప్పడానికి ఈ ప్రశాంతతని అపేక్షించడమే ఆధారం.

ప్రసాద్ గారిలో విస్త్ర్తమైన నిర్మాణ ధార ఉంది.ఇది అనేక చోట్ల కనిపిస్తుంది.ప్రేరణ కలగడాన్ని చిత్రించే ఈ భావ చిత్రం అందుకు నిదర్శనం

"పిల్లలెవరో కాగితంపై రంగులు చల్లుతున్నట్టు
ఆటలో విరామం నిండిన ప్రశాంతతలోకి
ఏవో మృదువైన స్పందనలు వచ్చిచేరుతాయి"

భావచిత్రాలను1.అలంకారాలు2.పాశ్చాత్య కళాపద్దతులు3.మనోవైఙ్ఞానిక భూమిక ద్వారా మూడురకాలుగా చిత్రిస్తారు."చల్లుతున్నట్టు"అన్నక్రియా సంబంధం లోంచి ఉపమావాచకం ద్వారా ఇది అలంకారపద్దతిలో జరిగిందని చెప్పవచ్చు.చివరి వాక్యంలోంచిచూచినా "శాంతి వృత్తంలా/నీడరూపం వచ్చినట్టు"ఇలాంటివే.

మొదటి వాక్యంలోని"వాలటం"2 లోని"క్షణాలు
నోట కరవటం"ఇలాంటివన్ని స్థితులలోని క్రమాన్ని చూపుతాయి."ఈ పావురాలు ఎగిరేందుకు వచ్చినవికావు/వాలెందుకు వచ్చినవి"అనటం.చివరి వాక్యం కవిత ప్రయోజనాన్ని,అంతర్ముఖీనతని ప్రదర్శిస్తాయి.

"ఈ పావురాలు అందుకే వస్తాయి.
ఇవి నిశ్శబ్దం పొట్లాన్ని విప్పి శబ్దాన్ని వెదజల్లవు.
శబ్దం పొట్లాన్ని విప్పి నిశ్సబ్దాన్ని పంచి పెడతాయి"

ప్రతీక,దాన్ని నిర్వచించేతీరు,అందులో చిత్రించిన భావ చిత్రాలు..అందులోని దర్శనం బివివిని ప్రత్యేకంగాచూపుతాయి.తెలుగుకవితలోని ఒక ప్రధాన మార్గాన్ని ఆవిష్కరిస్తాయి.

5.8.2013
                                                                                                          _____________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ

పెన్నా శివరామకృష్ణ-పోలిక ఒక మాధ్యమం






ఋగ్వేదంలో దశమ మండలంలో ఒక ఋచ ఉన్నది."చత్వారి వాక్ పరిమితా పదాని.తానిత్రీణి గుహితానేంగయంతి.తురీయం వాచో మనుష్యావదంతి"ఇందులో చత్వారి వాక్ అనేది గమనించదగ్గది.-వాక్కు యొక్క నాలుగు దశల్నిఈ ఋచ చూపింది."పశ్యంతి,మధ్యమ,వైఖారి నాలుగవది పరా".పశ్యంతి-చూచుచున్నది,మధ్యమ-అభివ్యక్తికి కావాల్సిన ఙ్ఞాన ,సౌందర్య,కళా,శాస్త్ర పరిఙ్ఞానాన్ని కూర్చుకునే దశ.మూడవది బయటికి చెప్పే అంశం.నాలుగవది వీటికి అతీతమైంది.

మిత్రులు పెన్నా శివరామ కృష్ణ కవిత "పోలిక ఒక మాధ్యమం"లో ఈఅంశాల్లోని మధ్యమ దశని స్పర్శించారు.సాధారణ,చర్వణ,ధారణ,మనన,సృజన అనేవి అలౌకిక వ్యాపారాలు.చూడటం,చూసినదాన్ని నెమరువేసుకోటం,దాన్ని ఙ్ఞానంలో పాదుకోటం,దాన్ని సమన్వయం చేసుకోటం,-సృజంచడం ఇవి.బుద్ది దేన్ని అనుసరిస్తుందనేది ఒక ప్రశ్న?శాకుంతలం "బుద్దిఃకర్మానుసారిని"అన్నది.బుద్దికి చేసే పనులే కారణం.

కవిత్వంలో గాని సాధారణ వ్యవహారంలో గాని పోలికలు కనిపిస్తాయి.ఈపోలికలే ఏరకమైన సంభాషణకైనా మాధ్యమం అంటున్నారు కవి.ప్రతిపదానికి యోగ,ఆయోగ,ఔపయోగిక,సమన్వయ ,ఆవృత్తమనే దశలు ఉంటాయి. ఈ కవితలో ఇలాంటివి కనిపిస్తాయి.

శివరామకృష్ణ గారి వచనంలో వేగం(swift)ఉంది.దేన్నయినా మరింత భారంగా చెప్పడానికి పోలిక ఒక మాధ్యమం.దీని ఉపయోగాన్ని.ఉనికిని,రూపాలని కవితలో వ్యక్తం చేస్తారు.

"పోలిక ఒక ఉపగ్రహం/ఆత్మ ప్రదక్షణం చేస్తూ/భూగోళం చుట్టూ తిరుగుతుంది"ఇది ఉనికిని చెప్పే వాక్యం.పోలికలకు ఎక్కడో వెతకాల్సిందిలేదు.ఈ భూమిపైనే ఉన్నది.

"సకాలానికి అస్తమించే సూర్యుడిని గుర్తుచేసుకోకపోతే/చీకటి బాహువుల్లో క్షణ క్షణం/వెలుగులజల పొంగేదెట్లా?"పోలిక యొక్క విస్తృత రూపాన్ని అనేకకోణాల్లో పరిచయంచేస్తారు.అనేకాంశాలు అందుకు ఉదాహరణగా నిలుస్తాయి.

"పోలిక ఓ విశ్వజనీన మాధ్యమం/
పోలిక దృశ్యా దృశ్యాల మధ్య పూల వారధి/
పోలిక వేదిక కొక ఆహార్యం మార్చుకునే నర్తకి/
రుతువుకొక రాగం పలికించే విచిత్ర పల్లవి"

లెనిన్ ప్రతిఫలన సిద్దాంతాన్ని (reflection theory)ప్రతిపాదించాడు.ఒక అంశంపై అనేక అంశాల ప్రతిఫలనం ఉంటుంది.నిర్మాణంలో వస్తువు ఉనికిని,అది విస్తృతమైన రీతిని అందులోని వాక్యాలే చెబుతాయి.శైలిలో వేగంతోపాటు సరళంగా కనిపించే వాక్యాల మధ్యన పేర్చిన సమాస బంధాలు కూడా ఈవేగాన్ని పెంచాయి.

"అశ్రు దరహాస తటిల్లత"
"నిక్షిప్త దరహాస మధురిమ"
"అనంత నీరవ నీరధి"-అలాంటివే..

బుద్ది అనేదానికి ఙ్ఞానం ప్రధాన ఆకరం.ఈ ఙ్ఞానంలో ప్రతిఫలనాలు అనేకం .బుద్దిజీవులు సూక్ష్మం నుంచి అనంతం లోనికి ప్రయాణం చేస్తారు.ఈ కవిత అలాంటిదే.
మంచికవితని అందించినందుకు పెన్నాశివరామ కృష్ణ గారికి,మనకు పునః పరిచయం చేసినందుకు యాకూబ్ గారికి ధన్యవాదాలు.

6.8.2013


                                                                                                         _______________ఎం.నారాయణ శర్మ

కవిత్వ విశ్లేషణ







సాహిత్యంలో మనస్సుకు,అందులోని వాతవరణానికివిలువ హెచ్చిన తరువాత కవిత్వ మార్గాలు అనేకంగవచ్చాయి.ఇవన్నీ అభివ్యక్తి మార్గాలను బలపరిచాయి.అస్పష్టత అన్న నిందకూడా కవిత్వం అప్పటినుండే మోయటం మొదలు పెట్టింది.

ఎం.ఎస్.నాయుడుగారి కవితలో "స్వాపము"అనే పదం ఒకటి ఈకవితలోకి మార్గాన్ని తెరుస్తుంది.స్వాపం-అనే పదానికి కల,పడుకోటం,నిద్ర,అఙ్ఞానం అనేఅర్థాలున్నాయి.ఇందులో గమనించాల్సింది ఇవన్నీ భౌతికాతీతాలు.

కలలు వాటికవేవస్తాయని చాలావరకు విశ్వసిస్తున్న క్రమంలో వైఙ్ఞానిక శాస్త్రంలో కొన్ని అంశాలు కనిపిస్తాయి.పూర్వం గ్రీకుల్లో అభిలషిత స్వప్నం(disired dreems)పొందే విధానం ఉండేది.ఈక్రమంలో "పొదుగుడు"(Incubetion)కేంద్రాలు వుండేవి.ఒక విషయం పై దృష్టిఉంచి,అదే వాతావరణంలో నిద్రించి స్వప్నాలనుపొందటం ఈసాధనలోని అంశాలు.ఈ కలల్ని తనకుండే ఉద్వేగ,ఉత్సాహ,ఉద్రేకాలమేరకే పొందుతాడు.సృజన కూడా అలాంటిదే.

అరిస్టాటిల్ గురువైన ప్లేటో స్వప్నంలో ఔద్వేగికాంశాన్ని (Exaitment particular)గురించి చెప్పాడుఈ సమయంలోనే మనిషిలో ఉండే వివిధ ప్రవృత్తులగురించి చర్చించాడు.థామస్ హబ్స్"అంతరంగావయవాల తాపం "(Distemper of inner parts)స్వప్నానికి మూలం అని అన్నాడు.ఫ్రాయిడ్ "స్వప్నార్థ వివరణ"(Interpredetionof dreams)వచ్చినతరువాత ఈఅధ్యయనానికి ఒక శకం మొదలైంది.

భౌతిక వాంఛలు స్వప్నాలయ్యేతీరుని,వాటి క్రమాన్ని గురించి కవిత్వీకరించడం కనిపిస్తుంది.మనస్సు ఏ మార్గంలో వెలుతున్న దనేది అంచనా వేయలేం.కవిలోని కవితాస్ఫూర్తి అందుకు కొంత అవకాశమిస్తుంది.నాయుడు గారి మొదటి వాక్యం ఓ భౌతిక క్రమాన్నించి జారుకునే అంశాన్ని చెబుతుంది.

"ఉత్త పెదాల్నే కడుక్కొనివొస్తాను
పెదాల్ని అక్కడే వదిలి"

"కాస్త నిరాకరించే పెదాలు
ఎప్పటికీలేని మౌనంలో"

సృజనసంబంధ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు 'పెదాలు 'పై విషయాలను చెక్కే భౌతికాంశాలు.వర్డ్స్ వర్త్ కవిత్వాన్ని గురించి కాకపోయినా సృజనకి వెనుక ఉండే కొన్ని అంశాలగురించి మాట్లాడారు.భ్రాంతి(Illussion)విభ్రమం(Hallucinetion)సంభ్రాంతి-మనోవిక్షిప్తి(Paranoid)సమ్మోహనిద్ర(Hypnosis)బహు మూర్తిమత్వం(Multi personaality) ఈ అంశాలు సాహిత్యంలో అనేకంగా కనిపిస్తాయి.

నాయుడుగారి పైవాక్యాల్లో ఈమనో విక్షిప్తి ఉంది.ఎ కవితలో కనిపించే ఓ కళాత్మకానుక్రమణం(Artistic succession)ఉంది."వేళ్లు-వృక్షాలు"అందుకు ఉదాహరణ.హొతికాంసాలలో ఒక క్రమం ఉన్నట్టు మానసికాంశాలలోనూ ఉంటుంది.లేదా సృజనదశలో అలా పేరుస్తారు.

మాలినోవిస్కీ స్వప్నాలను 1.(వైయ్యక్తిక)స్వేచ్చా స్వప్నాలు 2.అధికారిక స్వప్నాలు అనివిభజించాడు.వ్యక్తి జీవిత ప్రభావంతో అతని ఇష్టంతో సంబంధంలేకుండాంతర్గత శ్క్తులు మలచగ పుట్టింది మొదటిది.శుభాశుభాలను నిర్ణయించుకొని తనకోరికల మేరకు పుట్టింది రెండవది.కవులు,సృజనకారులు బహుశః రెండవ కోవకు చెందుతారు.తెలుగులో వీటిని అర్థం చేసుకోడానికి తగిన ఆకరాలు లేవనేచెప్పాలి.ఇదిసమకూరాలనికోరుకుందాం.నాయుడుగారికి అభినందనలు

9.8.2013



                                                                                                                 ____________ఎం.నారాయణ శర్మ

7, సెప్టెంబర్ 2013, శనివారం

కవిత్వ విశ్లేషణ

బాలసుధాకర్ మౌళి కవిత-అతడు ఈదేశానికి వెన్నెముక





భావకవిత్వం,అనుభూతి కవిత్వంలో లక్షం ఆనందం అని చెప్పుకున్నాం.ఈ లక్షం ప్రయోజన వంతంగా ఉండాలని భావించిన కవితాశైలి మార్క్సిస్ట్ కవితారీతి(maarxist poetical tredition).నిజానికి ఇది కవితను చూచే రీతినించి పుట్టింది.చెప్పే అంశాన్ని కాకుండా చెప్పే పద్దతిని ఎక్కువగా పట్టించుకోలేదని తొలిదశలో విమర్శలున్నాయి

తరువాతికాలాల్లో వచ్చిన మార్క్సిస్ట్ సాహిత్యం ఈరెంటినీ అన్వేషించి కవిత్వానికి అవసరం మేరకు కళ కావాలని భావించింది.ఈక్రమంలోనే మార్క్సిస్ట్ సౌందర్య శాస్త్రం కూడా అభివృద్ధి చెందింది.తెలుగులో డా.బి.సూర్య సాగర్ రచన"సాహిత్యం సౌందర్యం"ఈదశని స్థూలంగా పరిచయం చేసింది.

తెలుగులో ఈపద్ధతిని మాధ్యమంగా చేసుకుని విమర్శలో కొన్ని పదాలు కనిపిస్తాయి శ్రామిక వర్గ సంస్కృతి(Prelet cilt)-1917 నాటికి కమ్యూనిస్ట్ పార్టీలు ఈపదాన్ని తెచ్చాయి.పెట్టుబడీ దారీ ప్రభావాన్ని తిరస్కరించే విషయంలో ఈపదం ఉనికి కనిపిస్తింది.ఈ క్రమం లోనే ఉపయోగ్య కవిత్వం(Applied poetry)కనిపిస్తుంది.ఇదిశ్రామిక జీవన సమస్యలూ,రాజకీయ ,సామాజిక ,ఆర్థిక సమస్యలని గురించి రాసేకవిత.

బాల సుధాకర్ మౌళి కవిత "అతడు ఈదేశానికి వెన్నెముక"ఈ రకమైన సంస్కృతిని ప్రదర్శించింది.నిజానికి ఈకవితలో కావావలసినంత కళాత్మకత ఉంది.అంతే దృక్పథమూ కనిపిస్తుంది.అందుకు ఆధునికంగా కవితానిర్మాణంలో కనిపించే విభాగలుగా ఉండే శైలినొకదాన్ని ఎన్నుకున్నారు.

నాలుగు అంశాలలో మొదటిదాన్లో రైతు స్థితి
2లో స్వభావం3లొ పెట్టుబడిదారీ తిరస్కారం4లోపై లక్షణాలని సమీకృతం చేసారు.ఈ నిర్మాణం వెనుక కవి సాధన కనిపిస్తుంది.

ఇందులో కవి సృష్టించిన వాతవరణం ,అందులోని తీవ్రత,స్వరం అన్నిటిలోనూ తౌల్యత కనిపిస్తుంది.వాతావరణాన్ని చిత్రించ డానికి అనేకమైన భావ చిత్రాలు నిర్మించారు.

"అతని ఆకలి కడుపులో/పాముల తుట్ట
కదలక మెదలక నిద్రిస్తుంటుంది/అతని కళ్ల కుంపట్లలో
నిప్పుల సెగ/అడుగునెక్కడో అణిగి ఉంటుంది"

"అతని దేహశిలపై/సూర్యుడు సూదులకిరణాలతో
చెమటబొమ్మలను చెక్కుతుంటాడు/ఒక్కో బొమ్మా
పొలం కొలువులో చేరి/ఒక్కో వసంతమై పూస్తుంది"

ఇలాంటి భావచిత్రాలలోనూ కొంత శ్రామిక సంస్కృతి తళుక్కు మంటుంది."చెమట బొమ్మలు""ఆకలి కడుపు"వంటివ అందుకు ఉదాహరణలు."సూదుల కిరణాలతో చెమట బొమ్మలు చెక్కడం""వసంతమై పూయడం"కళకు అద్దం పడుతాయి.అంతే తీవ్రత ఉన్న స్వరమూ కొన్ని వాక్యాలలో ఉంది.


"అతని 'చేను ఆడబిడ్డల'పై/గుంటనక్కై కన్నేస్తాడొకడు
అతని 'పొలం ఇంటి'పై/ఒడ్డీ జెర్రెలనొదులుతాడొకడు
అతన్ని అధైర్యం ఉరితాడుపైకి/అశాంతి చేతులతో నెడతాడొకడు"



"పొలాన్ని శవం చేసి/పీక్కు తినాలనుకునే/
'రావణ గెద్దల అహంకారాని'కి
చెమటపూల మొక్కలతోనే/సమాధానం చెబుతాడతడు"


ఈ వాక్యాలల్లో దృక్పథం కనిపిస్తుంది.రైతు ఆత్మ హత్యదాకా వాతావరణాన్ని తీసుకెళ్లి స్ఫూర్తి దాయకమైన ముగింపునిచ్చారు.

మంచి కవితనందించారు బాల సుధాకర్ మౌళి.తెలుగులో రైతుల గురించిన సాహిత్యం వచ్చింది.వానమామలై జగన్నాథాచార్యులు "రైతు రామాయణాన్ని" రాసారు.దీనిపై డా.డింగరి నరహరి ఆచార్య పరిశోధన కూడా వచ్చింది.రైతాంగ పోరాట పాటలూవచ్చాయి.వచన కవితకు సంబంధించి"దర్భశయనం శ్రీనివాసా చార్య" వంటివారు ఇలాంటి కవితలు రాసారు.భాషా సంబందంగా "వందన కారుడు"వంటి పదాలపై మౌళి గారు పునరాలోచన చేస్తేబాగుంటుందనిపిస్తుంది.మంచి కవిత అందించినందుకు బాల సుధాకర్ మౌళి గారికి అభినందనలు.



                                                                                                


                                                            











                                                                                   ____ఎం.నారాయణ శర్మ