పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Santhisri Santhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Santhisri Santhi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జూన్ 2014, ఆదివారం

Santhisri Santhi కవిత

శాంతిశ్రీ // ఆఖరి రాత్రి // అన్ని రాత్రుల్లానే ఈ రాత్రి గడిచిపోతుంది కానీ ఏదో బాధ గుండెల్లో మెలిపెడుతుంది గులాబీలు విరబూసాయని తోటమాలి ఒకటే మురిసిపోతున్నాడు ఒక్క పువ్వు అందుకునేలోపే ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో రక్తం కారుతోంది అప్పుడు ఇప్పుడు అదే పరిస్థితి ఇదే ఆఖరి రాత్రి మార్పు జాడ కోసం వెతికా రాత్రి మేఘాలు ఒకటే ఉరుముతున్నాయి ఆ చప్పుడు నా ఆకలి పేగుల చప్పుడల్లె అనిపించింది గబ్బుకున్న మెలకువ వచ్చింది లేచి కూర్చున్నా ఇంటిముందు రావి చెట్టు ఆకులు సందడి చేస్తున్నాయి రేపు సంబురాలు కదా అందుకే అనుకున్నా ఇంతలో కరెంటు పోయింది ఒక్కటే ఉక్కపోత వర్షం చినుకైనా రాలట్లేదు ఆకాశంలో చప్పుడు మాత్రం ఆగలేదు ఇదే ఆఖరి రాత్రి మార్పు జాడ కోసం వెతికా కంటి మీదకు కునుకు రాలేదు పక్కింటాయనకు బ్రెయిన్ స్ట్రోక్ అంటా ఆవిడ ఒకటే ఏడుస్తోంది మేము తప్ప బిల్డింగ్ లో ఎవరు లేవడంలేదు కడుపున పుట్టినోడికి ఫోన్ చేసింది "దగ్గరలోని ఆసుపత్రికి తీసికెళ్ళు అంతా వాళ్ళే చూసుకుంటారు కార్డు తీసిచ్చింది అందుకే నేను ఇప్పుడు నైట్ షిప్ట్, రేపు పొద్దుగాలే వస్తా " అంటూ ఫోన్ పెట్టేశాడు మేమిద్దరమే ఆసుపత్రికి వెళ్ళాం కార్పొరేట్ ఆసుపత్రి మర్యాదలన్నీ అయిపోయాయి ఇదే ఆఖరి రాత్రి భళ్ళున ప్రతిరోజులానే తెల్లారింది మార్పు జాడ కోసం వెతికా కనిపిస్తుందని వెతుకుతూనే ఉన్నా.. ఉంటాను.. మొహంపై కిరాణాలు పడగానే చురుక్కు మంది తలెత్తి చూశా సూరీడు ఎరుపు మోహం చూశాక ఒక ఆశ కలిగింది.. ధైర్యంగా లేచి నుంచున్నా తేది :1. 6. 2014

by Santhisri Santhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kfmdGI

Posted by Katta

4, మార్చి 2014, మంగళవారం

Santhisri Santhi కవిత

// శాంతిశ్రీ // చిలుక-గోరింక మీరిద్దరూ చిలుకా గోరింకల్లా ఉన్నారనుకున్నాం ఇన్నేళ్లల్లో నీతో ఎన్నో మధురానుభూతులు పంచుకుందా చిలుక ఎంతో భవిష్యత్తునూ ఊహించుకుంది అవేవీ నెరవేరకుండానే ఏదో అత్యవసర కార్యమేదో ముంచుకొచ్చినట్లు అర్ధాంతరంగా ఎగిరిపోయింది తిరిగి రావడం అసాధ్యమని తెలిసినా అది ఆపడం నీ తరం కాలేదు ఆ చిలుక తరం అంతకన్నా కాలేదు నీ గూడులో కువ కువలాడుతున్న బుజ్జి పక్షులకు ఇక అమ్మవూ నాన్నవూ నువ్వే వాటికి ఆహారం నీవే తేవాలి అవి ఎగరడం నేర్చుకునే వరకూ బాధ్యతంతా నీదే వాటి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో నిరంతరం తపించు.. శ్రమించు నీలో సగం లేదన్న వెలితిని మేము పూడ్చేది కాదు.. పూడ్చలేము కూడా ఆ వెలితిని మీ బుజ్జి పక్షుల కుహుకుహులతో సాహిత్య కవిత్వా కుసుమాలతో నింపుకో అప్పుడు నీవు ఎప్పటికీ ఒంటరివికావు.. కాలేవు మేమంతా ఉన్నాము నీవెంటే సాహిత్య సేద్యం ఇక మొదలుపెట్టు మేటిగా నిలిచి ఉజ్జ్వలంగా ఎదుగు అందరూ నిన్నే పలవరిస్తారప్పుడు అప్పుడు నీవు ఒంటరివెలా అవుతావు కీర్తి నీతో జతకలిసి, పెనవేసుకుని ఉంటే ఎందరిలోనో నిండుగా నీవు తేది: 10.2.2014 (భార్య చనిపోయిన వేదనలో ఉన్న గేరా కోసం)

by Santhisri Santhi



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1fDQsyL

Posted by Katta

24, సెప్టెంబర్ 2012, సోమవారం

శాంతిశ్రీ || బూచోడు

పశ్చిమకనుమల నుంచి బూచోడు వస్తున్నాడు
వాడు-పిచ్చోడి చేతిలో రాయి
ముందు మన అంగట్లో అడుగుపెట్టి
నట్టింట్లోకే వచ్చేస్తున్నాడు..

చిల్లర కొట్టుకు తాళం వేసేసి
ఇక అంగడ్లన్నీ డాలర్లతో నింపేస్తాడు
చివరికి, మన చింతచెట్టు మీద చిగురుకి కూడా
వాడే రేటు నిర్ణయిస్తాడు
'చిన్న'బోయిన వ్యాపారుల్ని
తన అంగడ్లలో కొలువు కుదురుస్తాడు

'సహకారం' పేరు పెట్టుకుని
కంపెనీ సేద్యం చేసేస్తాడు
మనం ఏం తినాలో ఎంత తినాలో
వాడే నిర్ణయించేస్తాడు
'బిక్క'చచ్చిన రైతన్నల్ని
వ్యవసాయ కూలీల్ని చేసేస్తాడు

'చదువుతల్లి' కన్నా 'లిబర్టీ' ముద్దంటాడు
మన ఉపాధ్యాయులకీ సీమకోర్సు నేర్పేస్తాడు
మనం ఏం చదవాలో ఏ ఉద్యోగం చేయాలో
వాడే నిర్ధారించేస్తాడు
'శోష' వచ్చిన తల్లిదండ్రులికి
డాలర్లకే విద్య నేర్పేదంటాడు

విదేశీ మీడియానే సరైనదంటాడు
మన వాటిని పక్కనబెట్టిస్తాడు
మనం ఏం చూడాలో ఏం వినాలో
వాడే ఉపదేశిస్తాడు
'తెల్ల'బోయిన ప్రజలకి
ఛానెల్‌ కనెక్షన్‌తోనే గ్యాసంటాడు

వీడితో యుగళగీతంలో ఏలికలు
వీరిద్దరిని కాదని మనదైన 'ప్రత్యామ్నాయం' రావాలి
అప్పటివరకూ వీరి వికటాట్టహాసం వినాల్సిందే
వీడి 'మోత' భరించాల్సిందే..!

తేది: 22.9.2012

11, ఆగస్టు 2012, శనివారం

శాంతిశ్రీ || చెక్కుచెదరదు.||

నా తలపుల్లో ఉండి

నీ తలపులు నా మనస్సులో
ఓ తరంగణిలా ప్రవహిస్తుంటే
ఎన్ని రోజులు గడిచినా
నీ కోసం నా మనస్సులో
నీ స్థానం అలాగే ఉంటుంది
నువ్వు దూరంగా ఉన్నా
నీవిచ్చే స్ఫూర్తి ఎంత మహత్తరంగా
ఉంటుందో నాకు అనుభవమే
మరణించే వరకూ నీ ఆకర్షణలో
ఉండటమే నిజమైన ప్రేమ
నా ప్రియుని ప్రేమ మరణించేవరకూ
చెక్కుచెదరక అలాగే ఉంటుంది

*11-08-2012

31, జులై 2012, మంగళవారం

శాంతిశ్రీ శాంతి || అయితే ఏం చేద్దాం? ||

బతుకుల నిండా కష్టాలున్నాయి
పేదలందరికీ బాధలున్నాయి
అయితే ఏం చేద్దాం?
ఓ సూర్యోదయాన నిర్ణయించేద్దాం
ఒక్కసారి పోరాటాల వెలుగులో కలబోసుకుందాం
ఆ కష్టాలన్నీ పంచుకో వెచ్చని వెలుతురులో..

పల్లెల నిండా కోకోకోలాలున్నాయి
రైతులందరికీ రుణాలున్నాయి
అయితే ఏం చేద్దాం?
ఓ వానచినుకులా ఆలోచించేద్దాం
ఒక్కసారి అందరం కలిసి చేయిచేయి కలుపుదాం
ఆ చినుకులన్నీ కలిసి ఏరులైన ప్రవాహంలో..

పట్టణాలంతా సంస్కరణలున్నాయి
ప్రజలందరికీ భారాలున్నాయి
అయితే ఏం చేద్దాం?
ఓ పసిపాపలా నిక్కచ్చిగా అడిగేద్దాం
ఒక్కసారి అడుగు ముందుకు కదుపుదాం
ఆ అడుగులన్నీ కదిలే మహౌద్యమ ప్రదర్శనలో..

ప్రపంచమంతా ప్రకోపాలున్నాయి
విశ్వజనావళికీ వెతలున్నాయి
అయితే ఏం చేద్దాం?
ఒక్కసారి వెల్లువలా ఎగసిపడదాం
ఆ వెల్లువ ఉధృతిలో..
ఈ దోపిడీకి మూలమైన వ్యవస్థను ముంచేద్దాం..!
ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మిద్దాం..!!

*30-07-2012

30, జులై 2012, సోమవారం

శాంతిశ్రీ శాంతి || అమ్మానాన్న..! ||

మొదటి స్పర్శ అమ్మ
ఆ స్పర్శకు ప్రతిస్పర్శ నాన్న
ఆరని దీపం అమ్మ
ఆగని ప్రవాహం నాన్న
అమ్మ లాలిస్తే
నాన్న ఆడిస్తాడు
అమ్మ ఒడే నేల
నాన్న భుజమే నింగి
వారి ప్రేమ పూదోటలో
వికసించే పుష్పాలం
అమ్మ జోల అమృతం
నాన్న ఆలన విజయం
మన ఆనందమే వారానందం
దెబ్బ తగలగానే అందరూ
అనేేది 'అమ్మా! అయ్యా!'
ఏమిచ్చినా తీర్చుకోలేని ఋణం
అంత్యదశలో వారికి అమ్మానాన్నలవడం మన ధర్మం
(అమ్మానాన్నలందరికీ అంకితం..)
-29-07-2012

24, జులై 2012, మంగళవారం

శాంతిశ్రీ॥ముందుకే..॥


ఒక అడుగు వెనక్కి
నాలుగడుగులు ముందుకేసేందుకే
అందుకే..
బిగిసిన పిడికిళ్లు తెరవొద్దు
ఆశయాలు సిద్ధించేదాకా
నినదించే గొంతులు మూగపోనివ్వొద్దు
మూసుకున్న వ్యవస్థ చెవులు తెరిచేదాకా
రగిలే ఉద్యమాలు చల్లారనివ్వొద్దు
గమ్యం చేరేదాకా
ప్ర్రజాపథం కొనసాగాల్సిందే

లక్ష్యం నెరవేరేదాకా
పట్టుదల సడలనివ్వొద్దు
విజయం సాధించేదాకా
*24.7.2012

శాంతిశ్రీ॥యథార్థమే వాస్తవం!॥


తొండ ముదిరిన ఊసరివెల్లి
సామ్రాజ్యవాద ప్రపంచీకరణ రూపం
అవినీతిలో అనేక అభినయాలు నేర్చి
వినూత్న పోకడలు పోతుంది

చెట్టు తన కొమ్మలన్నింటినీ
విస్తారంగా విప్పార్చింది
అంతటా తానేనన్న అహకారం
అణువుణువునా అలుముకుంది
మెరుపులు మెరుస్తూ ఉరుములతో
గాలిదుమారం రానే వచ్చింది
పేకమేడలన్నీ కూలిపోతుంటే
కలలన్నీ చెదిరిపోతున్నాయి

సంక్షోభాల సుడిగాలి సుడుల్లో
వాల్‌స్ట్రీట్‌ అంతా బీభత్సం
'కాపిటల్‌! కాపిటల్‌!' అంటూ
కలవరింతలు.. పలవరింతలు

ఒకింత ఆలస్యమైనా యథార్థమే
వాస్తవమని నిరూపితమవుతోంది!
*23.7.2012

21, జులై 2012, శనివారం

-శాంతిశ్రీ || ‎'లక్ష్యం' పేట కావాలి..! ||


రక్తపు వాసనల్లో లక్షింపేట
మరోసారి రాబందుల రెక్కల చప్పుడు
వివక్షతా వికటాట్టహాసం
అంతరాల అగాథాలు పూడిస్తేనే
రహదారి ఏర్పడుతుంది
సూర్యుని చుట్టూ భూమిలా
ఎన్నికలప్పుడు ఆలింగనలు, సహపంక్తులు
మౌనంగా మిన్నకుంటే
దురహంకార ఊడలు పెరుగుతూనే ఉంటాయి
తక్షణం పూనుకోకపోతే మిగిలేది శూన్యం
అదనులో వర్షం లేక విత్తని విత్తనమంత సత్యం
మిత్రులెవరో శత్రువులెవరో తెలుసుకో
పక్షుల గుంపుల్లా నీ తోటివారితో పయనించు
ప్రపంచం పిక్కటిల్లేలా నినదించు
లక్ష్యం సాధించేవరకూ పిడికిళ్లు తెరవొద్దు
వివక్ష విముక్తికి లక్ష్మింపేట 'లక్ష్యం'పేట కావాలి!
*20-07-2012