పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Nirmalarani Thota లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nirmalarani Thota లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జూన్ 2014, సోమవారం

Nirmalarani Thota కవిత

శ్రీవారి ముచ్చట్లు..! కొంగుకు కట్టేసుకున్నానని ఆడిపోసుకుంటుంటే అలా మౌనంగా చూస్తావేం..? పచ్చని పందిట్లో కొంగు ముడి వేసింది మీరేగా..అని నిలదీయరాదా..! * * * పెళ్ళాం బెల్లమైందని మూతి విరుస్తుంటే ..బిగుసుకుపోతావేం ? ఇరవయేళ్ళు నువ్వు 'పెంచితే' .. అరవై ఏళ్ళు అది 'పంచాలని' చెప్పలేవా..! * * * సిగరెట్టు పాడు పొగ వద్దని చెవినిల్లు కట్టుకుంటే చిందులేస్తావేం..? పుట్టింటి ఊసెత్తొద్దదని కట్టడి చేయడం గుర్తుచేసుకోలేవా..! * * * మధ్యలో వచ్చిన మందు మానమంటే రాక్షసిని చేసి గింజుకుంటావేం..? పుట్టుకతో వచ్చిన ఇష్టాలన్నీ నీకోసం తుంగలో తొక్కానని తెలుసుకోలేవా ? * * * అలవాట్లు మార్చుకోమని బతిమాలుతుంటే అగచాట్లు పెట్టానని అపనిందలేస్తావేం ? ఇంటి పేరుతో సహా మార్చుకుంది నీ కష్టాలు పంచుకోవాలనేనని అర్ధం చేసుకోలేవా..! * * * ఏడడుగులు నీవెంట నీడలా నడిచి వస్తే ఎగతాళిగ చూస్తావేం? ఏడేడు జన్మల తోడై గుండెల్లో పెట్టుకొని గుట్టుగా చూసుకోలేవా..!

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/V5kWYE

Posted by Katta

17, జూన్ 2014, మంగళవారం

Nirmalarani Thota కవిత

ఎండ కాస్తుంది అంటే మాటవుతుంది... పేద వాడి కాలే కడుపులాగా విప్లవ వాది మండే గుండె లాగా ఎర్రటి ఎండ ప్రచండంగా నిప్పులు చెరుగుతోంది అంటే కవిత్వమవుతుంది వెన్నెల కాస్తుంది అంటే మాటవుతుంది పక్షం రోజులు పురిటి నొప్పులు పడి పున్నమి..వెన్నెలను ప్రసవించింది అంటే కవిత్వం అవుతుంది ఏమిటో ? అక్షరాల్ని లక్షణంగా లక్ష్యం దాకా తీసుకెళ్తే చాలనుకున్నా.. కాదు.. అక్షరాన్ని వంగ పెట్టి, సాగదీసి మెలిపెట్టి, వీలైతే రెండు మూడు భాషలు కలగలిపి మామూలు మనసుకు అంతుబట్టకుండా మేధావుల మెదడుకు మాత్రమే అర్ధమయ్యేలా వ్రాయగలిగితేనే గొప్ప కవిత్వం ! అమ్మ కడుపు నుంచి అపుడే పుట్టినంత స్వచ్చంగా కలం ప్రసవించిన అచ్చ తెలుగు అక్షరాలను కాగితం పొత్తిళ్ళలో పరిస్తే చాలనుకున్నా . . కాదు. . పదాలకు పదును పెట్టి, సానబెట్టి, కాసింత తేనె పూసి, సాములు చేసి అందాల్ని, ఆనందాల్ని తెర వెనక్కి తోసేసి మాంసపు ముద్దల్ని మాటలుగా చేసి రక్తపు మరకల్ని, చురకల్నీ చుర కత్తులుగా చేసి గుండెల్లో గుబుల్లూ, సెగలూ కళ్ళల్లో పొగలూ, కన్నీళ్ళూ తెప్పించగలిగితేనే గొప్ప కవిత్వం ! నేనింకా పసి కూనని అక్షరాల పొత్తిళ్ళలో హత్తుకునే మెత్తదనమే తెలుసు మాటల మాధుర్యాలను ఆలకించి చిందే మమతల బోసి నవ్వులే తెలుసు అమ్మ వేళ్ళ కదలికల కవితల కితకితలే తెలుసు రంగుల్ని, వెలుగుల్నీ చూసి కేరింతలే తెలుసు ఆకలేస్తే చీమ కుడితే ఓ క్షణం ఏడ్చి మరచిపోవడమే తెలుసు ఎదురు నిలవడం , గళమెత్తడం తెలియదు నిలదీయడం నిగ్గు తేల్చడం తెలియదు లయ బద్దంగా నవ్వడం రాగ రంజితంగా ఏడ్వడం ఇంకా నేర్చుకోలేదు . . బుడి బుడి నడకల పసి పాదాలకు ముళ్ళో, రాళ్ళో తగిలితేనో , దారులే మూసుకు పోతేనో నెమ్మది నమ్మదిగా నేర్చుకుంటా పదాల పేరడీ మాటల గారడీ..! ఎ..ద..గా..లి కదా. . . ! ! నిర్మలా రాణి తోట [ తేది: 17.06.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1ydAsQZ

Posted by Katta

6, జూన్ 2014, శుక్రవారం

Nirmalarani Thota కవిత

అద్దం... వీడని అనుబంధం .. ! దశాబ్ధాలుగా నిన్ను చూస్తూ నేను.. నిశ్శబ్ధంగా నన్ను చూపుతూ నువ్వు.. రేయంతా కలల షికారుకెళ్ళి పొద్దున్నే తీపి గురుతులు నీలోనే.. పొద్దంతా బతుకు బాటల్లో పరుగులెత్తి చీకటింట మెరుగులద్దుకొనేది నీతోనే.. నిన్ను చూస్తూ నేను.. నన్ను చూపుతూ నువ్వు..! ఊహ తెలియని పసితనంలో జాబిల్లిని చూపిన కేరింతల నెరజాణవు నువ్వు పారాడే పాపాయికి పాల పళ్ళు చూపిన బోసినవ్వుల నెలబాలవు నువ్వు పరికిణీ ఓణీ వేసుకున్న తొలిరోజున తుళ్ళింతలు రేపిన దోరవయసు కన్నె పిల్లవు నువ్వు ఆ రోజుల్లో నువ్వే నా ప్రియనేస్తానివి.. పదే పదే కనులు వెతుక్కునే ఆలంబనవి సమస్యలతో సతమతమవుతున్న నా తలలో తొలి నెరసిన వెంట్రుక చూపిన జాలిలేని బూచాడివి నువ్వు కదలిపోతున్న కాలం నింపిన కనుల కింది నీలి నీడల్ని నిర్ధాక్షిణ్యంగా చూపిన నిస్తేజపు జాడవి నువ్వు.. ముడుతలు పడుతున్న దేహంలో ముంచుకొస్తున్న మృత్యువుని కర్కశంగా చూపుతున్న కసాయి పాశానివి నువ్వు ఈరోజుల్లో నువ్వు నాకు అనివార్య నేస్తానివి పదే పదే భుజాలు తడుముకునే అభద్రతకు ఆనవాలువి.. ఋతువుల గమనాల్లో రంగులు మారే ప్రకృతిలా జీవన గమకాల్లో జారే పొంగులు . . హంగులూ ఏమీ లేని నీలో ఎన్నెన్ని కన్నుల వన్నెలో . . ఏమెరుగని నువ్వు ఎన్ని రూపుల్ని మారుస్తావో ఊసరవెల్లిలా.. ఏమీ దాచలేని నువ్వు ఎన్ని పొంగుల్ని దోచేస్తావో నంగనాచిలా.. నీలోకి ఆశగా తొంగి చూసిన పాపానికే కదా... నన్ను ఆడించి, అలరించి, మురిపించి, మరిపించి , నవ్వించి, ఏడిపించి చివరికి లాలించి అతలాకుతలం చేస్తున్నావే.. అందుకే అద్దమా.. నా మొదటి మిత్రుడివి.. చివరి శత్రువువీ నువ్వే సుమా..! నువ్వు సత్య హరిశ్చంద్రుడికి ప్రతిరూపమని ఒప్పుకుంటా గానీ.. అద్దమా... ఒక్క సారి అబద్దం ఆడరాదూ..! రాలిపోతూ ఈ శిథిలమైన తోటను నే చూడలేను.. ఒక్కసారి.. ఒకే ఒక్కసారి పరిపక్వపు జీవన పుష్పంపై తారాడే మనసు సీతాకోక చిలుక అందాల్ని చూపవా . . ! అనుభూతుల రెక్కల్తో ఆనందపు చుక్కల్లో.. ! వడలిన సడలిన తనువు మాటున దాచుకున్న వీడని పరిమళాల శ్వాసల్ని తనివితీరా ఆస్వాదించిన తృప్తితో ప్రశాంతంగా జారిపోతా జీవితపు అంచుల్లోకి ..! నిర్మలారాణి తోట [ తేది: 06.06.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pYXqpB

Posted by Katta

31, మే 2014, శనివారం

Nirmalarani Thota కవిత

చిన్నప్పుడు ఏం పండివంటలు చేసినా నాన్న రానీ.. అని అమ్మ అంటుంటే అర్ధం కాక అల్లరిచేసే పసితనం.. కాస్త పెరిగాక క్లాసు ఫస్టు రాలేదని కోప్పడుతుంటాడని ప్రోగ్రెస్ కార్డు దాచేసి తప్పించుకు తిరిగే అలవాటైన భయం కాలేజీలో చేరాక అంతులేని ఆంక్షలు పెడుతుంటే ఐదు నిమిషాలు ఆలస్యంగా ఇల్లు చేరితే అంతెంత్తున నన్నూ అమ్మను కలిపి తిడుతుంటే హిట్లరును చూసినట్టు లోలోపలి అసహనం.. ఎప్పుడూ నువ్వు నాకు అర్ధం కాలేదు.. విసుర్లు, కసుర్లు తప్ప నాకేమీ కనిపించలేదు.. కరుడు గట్టిన గాంభీర్యం రాతి విగ్రహంలాగానే తోచేది నిన్ను పూజించే అమ్మను చూస్తే జాలి వేసేది.. ఎందుకింత మౌనం నీకు? ఎందుకంత దూరం మాకు..? నీ ప్రావిడెంటు ఫండంతా మా పెళ్ళిళ్ళకు ధారబోసి పెన్షన్ డబ్బుల్లోంచి లాంఛనాలన్ని తీర్చేసి అడపాదడపా చేసిన అప్పులన్నీ కడుపుగట్టుకొని తీర్చేసి గుండె కలుక్కుమన్నప్పుడు గుట్టుగా దాచుకున్నావే.. అప్పుడైనా చెప్పాల్సింది నాన్నా..! నోరు విప్పాల్సింది నాన్నా . . ఒక్క సారి ఏడ్వాల్సింది నాన్నా..! ఒక్క సారి నిన్ను తాకాలని ఉంది నాన్నా..! కన్నతండ్రిని కూడా హత్తుకోలేని నా వయసునూ, ఆడతనాన్ని మరచి ఒక్క సారి.. ఒక్క సారి నీ చేతుల్లో ఒదిగిపోయి కడుపారా ఏడ్వాలని ఉంది నాన్నా..! నీ గుండెల్లో ఘనీభవించిన యుగాల దుఖ్ఖాన్ని కన్నీరుగా కరిగించాలని ఉంది నాన్నా..! నీ ప్రతి ఆఙ్ఞ నా భవిష్యత్ సోపానానికి సం ఙ్ఞ అని నీ ప్రతి ఆంక్ష నన్ను పదిలంగా పొదువుకోవాలనే ఆకాంక్ష అని తెలుసుకోలేక జీవితాన్ని తీర్చిదిద్దిన నీ తీర్చుకోలెని ఋణానికి ... నిన్ను గుర్తించలేని అవివేకానికి ప్రతిగా నీ పాదాలపై ప్రణమిల్లి కన్నీటి జల్లుతో ప్రక్షాళన చేయాలనుంది.. నన్ను క్షమించు నాన్నా..! అమ్మంటే ఆది దేవతని అహరహమూ ఆరాధించే మేము అమ్మకు ఆరాధ్య దైవమైన నీ అంతరంగపు విశ్వరూపాన్ని చూడలేని అవిటితనాన్ని మన్నించి మాతో మనసు విప్పి మాట్లాడు నాన్నా..! మా గుండెల్లోనే మీకు చోటు.. దరికి రానీయము ఇక ఏ గుండె పోటు. . ! ! నిర్మలారాణి తోట తేది: 31.05.2014

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gPMRFd

Posted by Katta

28, మే 2014, బుధవారం

Nirmalarani Thota కవిత

పదాలకై పాకులాడుతూ భావాలు మసక బారుతున్నాయ్ ఊహల దిండు అసహనానికి ఉరకలెత్తే ఊపిరులు అస్తవ్యస్తమవుతున్నాయ్ స్వప్నాలు సత్యాలు విసిరే సవాళ్ళకు సలామంటూ కళ్ళ కింది నీలి నీడల్లో చర్మపు ముడతల్లో సద్దుమాని సర్దుకుంటున్నాయ్ మబ్బు కమ్మిన ఆకాశం మూగబోయిన ఆమని రాగం దిగాలు చెట్టుకు వసివాడిన ఒంటరి జాజి మల్లి మొరాయిస్తున్న పాళీ చేత్తో పట్టుకొని నేను.. ఇంకేం రాయను? రాయగలను ?

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hdlSUu

Posted by Katta

13, మే 2014, మంగళవారం

Nirmalarani Thota కవిత

అనాదిగా ఆకాశం ఒంటరిది ముసిరి కురిసి కనుమరుగయ్యే కరిమబ్బులు మెరిసి మురిసి మాయమయ్యే తారకలు ! తరతరాలుగా తీరం ఒంటరిది పలకరించి మరలి పోయే తరగల నురగలు పులకరించి తరలిపోయే పాదచారులు ! యుగ యుగాలుగా భూమాత ఒంటరిది నింగినంటే పర్వతాల్ని సమస్త జీవకోటినీ మోస్తూ భడబాగ్నుల్నీ సునామీల్ని సహిస్తూ ! భూమ్యాకాశాలకు ప్రత్యామ్నాయాలు లేవు బంధు మిత్రులూ లేరు చీమల బారుల్లా సెకనుకు నలుగురు పుట్టుకొస్తున్నా మనిషెందుకు ఒంటరివాడయ్యాడో.. తెల్లారితే దిగిపోయే మత్తు ఏ బాధా తీర్చదని తెలిసినా పొద్దుగూకిందంటే బార్లకు లాక్కుపోయే బరువైన కాళ్ళు సీ రియల్ అని తమను తాము సమాధానపరుచుకోలేక పొద్దంతా సీరియళ్ళకు అతుక్కు పోయే అబద్దపు కళ్ళు ఎత్తుపల్లాల్ని తడుముకుంటూ ఎదిగిన శరీరాలు భుజాల్ని వెతుక్కుంటూ వెన్నుపూస వంగిన మనసులు ! ఒంటరిగా పుట్టి ఒంటరిగా పోయే వెధవ ప్రాణానికి నడిమధ్యలో ఎన్ని వెతుకులాటలో మనిషైనందుకా... మనసున్నందుకా? నిర్మలా రాణి తోట తేది: 13-05-2014

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gjkgZ5

Posted by Katta

3, మే 2014, శనివారం

Nirmalarani Thota కవిత

ఒక్క సారి నవ్వాలని ఉంది ఒక రోజులోనే వసి వాడినా ఓడని వీడని పరిమళాల శ్వాసతో అరవిరిసిన సిరిమల్లిలా స్వచ్ఛంగా భేషజాల ముసుగు తీసి ఒక్క సారి నవ్వాలని ఉంది ! * * * ఒక్క సారి ఏడ్వాలని ఉంది ఒక పూటలో విడివడినా మలయ సమీరపు స్పర్శకు కరిగి కురిసే నీలాల నీరదంలా ఆర్ద్రంగా అస్తిత్వాల ఆనవాళ్ళు చెరిపేసి ఒక్క సారి ఏడ్వాలని ఉంది ! * * * ఒక్క సారి స్నేహించాలని ఉంది అల్లంత దూరాన ఉన్నా అందని ఆకాశపు ఆత్మీయతకై అలుపెరుగక ఎగిసే అలల జవ్వనిలా ఆత్రంగా ఓటములన్నీ ఒడ్డున పెట్టేసి ఒక్క సారి స్నేహించాలని ఉంది ! * * * ఒక్క సారి ప్రేమించాలని ఉంది తన రాకతోనే ఆవిరైపోతానని తెలిసీ ఒక్క ఘడియ తనలో నిండే వర్ణాతిశయపు అనుభూతికై సూరీడి కడగంటి చూపు కోసం వేచి చూసే మంచు బిందువులా తమకంగా కదిలే కాలపు హద్దుల్ని మరిచి ఒక్క సారి ప్రేమించాలని ఉంది ! * * * ఒక్క సారి ముద్దిడాలని ఉంది తాకుతూనే అవని గుండెల్లోకి ఇంకిపోయే స్వాతి చినుకులా వెచ్చగా తీరని తపన అణువణువూ నిండేలా ఒక్కసారి ముద్దిడాలని ఉంది ! * * * ఒక్క సారి హత్తుకోవాలని ఉంది పెను తుపానుకు వెరువక ధరణి మేను కరుచుకునే గడ్డి పరకలా ధైర్యంగా ఆలంబనై అల్లుకునే ఎదను నిశ్చింతగా ఒక్క సారి హత్తుకోవాలని ఉంది ! * * * ఒక్కసారి జీవించాలని ఉంది తను కరుగుతూ నలుదెసలా వెలుతురు నింపే కొవ్వొత్తిలా కనుమరుగవుతూ కాంతిని పంపే చీకటిలా స్వార్ధాల అర్ధాలన్నీ చిదిమేసి ఒక్కసారి తరించాలని ఉంది . . ! * * * ఒక్క సారి బ్రతకాలని ఉంది మరచిపోయిన స్పందనలన్నీ సజీవంగా ఎదురొస్తే తెరలు పొరలు . . అహాలు అడ్డుగోడలు దాటేసి మనసున్న మనిషిలా.. ఒక్కసారి.. ఒక్కసారి బ్రతకాలని ఉంది . .! నిర్మలారాణి తోట ( తేది: 03.05.2014 )

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1i4CQm2

Posted by Katta

29, ఏప్రిల్ 2014, మంగళవారం

Nirmalarani Thota కవిత

అ . . అమ్మ . . అక్షరాలు.. ! ఏం రాయను? అమ్మ గురించి చెప్పమంటే ఏం చెప్పను? నాలుగు వేల ఏళ్ళ నా భాషను ఏమని వర్ణించను? త్రిలింగ దేశాన పురుడు పోసుకున్న తెనుగు తెలంగ మై పారాడి తెలంగాణమై నడిచి తెలంగానమై తెలుగైన వైనం . .! అన్నమయ్య గళం అద్వైతమై ఆలపించిన భాష "దేష భాషలందు లెస్స" అని అందలాన అందంగా ఊరేగించి ఆముక్త మాల్యద ముక్త కంఠంతో కొనియాడిన భాష ఆష్ట దిగ్గజాల పెదాల అలరించిన పదాల తేట బమ్మెర పోతన్న పోత పోసిన పూదోట యోగి వేమన పద్యాలతో యోగిత్వం ఆపాదించుకున్న భాష సుమతి శతకమై సు మతి నేర్పిన సుస్వరాల భాష శ్రీ శ్రీ హృదయ కలమై కలకలమై నినదించిన భాష తేనె కన్న తీయనైన తెలుగు భాష మల్లె కన్న తెల్లనైన మధుర భాష ఆత్మలను పలికించే నిజమైన భాష ఆత్మీయత ఒలికించే రారాజ భాష రెండు పెదాలను ఒద్దికగా కలిపే అజంత భాష మనసు భాష . . మనసున్న భాష ! పారే సెలయేరులో పశ్చిమపు పాకురేదో తగిలినట్లు సాగే వెన్నెల వెలుగుకు గ్రహణమేదో పట్టినట్టు అరువు తెచ్చుకున్న ఆంగ్ల భాష చుట్టమై వచ్చి దయ్యమై కూర్చుంది అమృతప్రాయమైన "అమ్మ" అనే పిలుపును . . మృత కళేబరపు సమాధుల "మమ్మీ" ని చేసింది అమ్మతనాన్ని అంగట్లో పెట్టి అడుగుల్ని అమ్మ జూపింది "చిట్టి చిలకమ్మ" పలుకులను "ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్" గా మార్చింది నేల తల్లిని విడిచి నింగి వైపు సాగే చూపులకు తెలియదు ట్వింకిల్ స్టార్లు రాత్రి పూట చీకట్లోనే మెరుస్తాయని మనసులెప్పుడూ తల్లి ఒడిలోనే మురుస్తాయని.. మైమరుస్తాయనీ . . మేకప్పు వేసుకున్న ముద్దు గుమ్మ "మమ్మీ" అని వగలు పోయినా పగిలిన మోకాలి చిప్ప "అమ్మా..! " అనే తల్లడిస్తుంది . . ! ! ఆవు అంబా అనడం ఎంత సహజమో తెలుగు వాడు "అమ్మా" అనడం అంతే సహజం పులి "మ్యావ్" మన్నా.. పిల్లి గాండ్రించినా పృకృతి విరుద్దమే కదా ! సహజత్వాన్ని వీడి చలించే యే గమనమైనా నేల విడిచి సామే . . కన్న తల్లిని, పుట్టిన గడ్డను, మాతృ భాషను మరచిన నాడు పుత్ర పౌతృలున్నా పుట్టగతులు లేని పున్నామ నరకమే . . ! "పర ధర్మో భయావహ " అన్న గీతా సారమే అనుసారమైతే పరభాష ఙ్ఞాన సముపార్జనకో యానకము కావాలే గాని మాతృ భాషను కలుషితం చేసే, కనుమరుగు చేసే మహమ్మారి కారాదు ! రండి . . రండి . . తెలుగు తమ్ముల్లారా . . అన్నలారా .. అక్క చెల్లెల్లారా పాశ్చాత్యపు మోజు తుఫాను తాకిడికి వణికి పోతున్న తెలుగు భాషను తేట తెలుగు పలుకుల చేతులను అడ్డుపెట్టి గుండెలకు పొదువుకొని కల కాలం కాపాడుకుందాం ! అమ్మ కడుపు నుంచి అపుడే పుట్టినంత స్వచ్చంగా కొమ్మ చివర పూచిన వెన్నెల వన్నెల పూవంత ఇష్టంగా ఆకాశం దాక రెక్కలు చాచి ఎగిరే గువ్వంత స్వేచ్చగా . . ! ఏ దేశమేగినా ఎందు కాలిడినా నిండు మనసుతో మన తెలుగు పావురాయిని విశ్వమంతా ఎగుర వేద్దాం ! ! నిర్మలా రాణి తోట తేది: 10.04.2014

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1pJwVZ0

Posted by Katta

26, ఏప్రిల్ 2014, శనివారం

Nirmalarani Thota కవిత

She is unseen behind tightly contained eye lids hidden deep morning sleep.. her voice is unheard while the self is lost in midst of mundane noises her soul gone invisible for u in the sky behind the crowded clouds .. u can know her existence in a frozen tear ! u could only perceive her in a passion for feminine curve she is popular in the obscenity a perfect object against male chaoism she is lost in your campaigns for respect in woman’s day she is yet lost in your laws of nirbhaya posters and poetry ! the woman is a omnipresent lost.. and the earth keeps roaming round and round ever to find traces of her identity.. and yet it fails.. just close all your outer eyes and views open the heart once for a glance atleast.. you can see the gorgeous she the woman.. the womb.. the lap.. around you.. around the world.. enfolding you in deep warmth sensitive folds embracing into heart to protect from all the coercion ! Nirmala Rani Thota Dt: 26-04-2014

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1h0BEMy

Posted by Katta

16, ఏప్రిల్ 2014, బుధవారం

Nirmalarani Thota కవిత

జీవితం ప్రతి మలుపు వద్దా సమాధి అవుతున్న ఒక్కో స్వప్నం ! వేసే ప్రతి అడుగునూ సవాలు చేస్తూ ఒక్కో సత్యం ! స్వప్నానికీ సత్యానికీ మధ్య యెడ తెగని నిరంతర సంఘర్షణ ! నిజమే.. జీవితం ఎప్పుడూ వీడని ప్రశ్నే ! బతుకు పోరులో అలసిన జీవపు శ్వాసకు ఊపిరి పోస్తూ ఒక్కో అమృత హస్తం ! జారే ప్రతి కన్నీటి బొట్టునూ ఒడిసి పడుతూ ఒక్కో బంధం ! మనిషికీ మనసుకూ మధ్య ఎల్లలు లేని అనిర్వచనీయ ఆత్మీయత ! అవును.. "ప్రేమ" ఎప్పుడూ వెచ్చని సమాధానమే ! మూకుమ్మడిగా గాయాలు రేపే గేయాలు జీవితం అయితే ఒకరికొకరుగా పెనవేసుకున్న ఆలంబనలే జీవించడం ! రెండూ నిజమే.. రెండూ మనమే . . ప్రశ్నలూ . . జవాబులూ .. చీకటి లేని చోట వెలుగుకు విలువెక్కడిది? 16.04.2014

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hKMTOc

Posted by Katta

15, ఏప్రిల్ 2014, మంగళవారం

Nirmalarani Thota కవిత

కరుణై కురుస్తావని ఆశల లోగిలిలో పరితపిస్తే కాంతి పుంజమై వచ్చి కనులు మిరుమిట్లుగొలిపి కనుమరుగయ్యావ్ ! * * * నింగికెగరేస్తే నే చుక్కనయ్యానని మురిసిపోయా మరునిమిషంలో తెలిసింది నేల రాలే నీటి చుక్కనని ! * * * ఒకటే జ్వరం.. పనిమనిషిని మందు తీసుకు రమ్మంటే అది నిన్ను తీసుకువచ్చింది.. దాని ఋణమెలా తీర్చుకోను? * * * అమితమైన ఆనందంలోను, అంతులేని దుఖ్ఖంలోనూ జారే కన్నీరు పిలవకనే పలికే నా ప్రియ నేస్తాలు ! * * * యవ్వనం తొలిరోజుల్లో అనిపించేది మనసుంటే చాలని నీవు దూరమయ్యాక తెలిసింది మరపుంటే చాలని ! * * * మహా సంద్రంలో మంచి నీటికై తపించే దాహర్తిని నేను గుండెలవిసినా గుర్తుపట్టని బాటసారివి నువ్వు ! * * * నన్ను చూసి ప్రపంచం నవ్వుతోంది ఎలా బ్రతకాలో తెలియదని నేనూ ప్రపంచాన్ని చూసి నవ్వుతున్నా ఎందుకు బతుకుతున్నారో తెలియక ! నిర్మలారాణి తోట [ తేది: 15-04-2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1eJaMzW

Posted by Katta

14, ఏప్రిల్ 2014, సోమవారం

Nirmalarani Thota కవిత

నింగి నిండా ముసురుకున్న మొయిళ్ళు గుండె నిండా మోయలేని గుబుళ్ళు కలల్లోనే కనిపించే ఆనందాల వాకిళ్ళు..! ఎగరడానికి బరువైన రెక్కల రొద . . చెప్పడానికి వీలు లేని మనస్సు సొద . . ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిధుల నిశీధి పొర . . మనసు విప్పి స్వాంతన పొందడానికి అడ్డొచ్చే అహపు తెర... ధైర్యం చేసి మనసు పరుద్దామన్నా అంతు చిక్కని మనుషుల ఆంతర్యాలు ! ఎంత వెదికినా అర్ధం కాని మోడరన్ ఆర్ట్ లాంటి జీవితాల అంతరార్దాలు ! దాటలేని వలయాల మధ్య ఎదురీతల సంఘర్షణలతో అసంతృప్త ఆవిరులను నింపుకున్న మానస మేఘం లోతు తెలియని లోకపు చిరు విమర్శనా పవనం తాకిడికి స్వచ్చంగా మెరువనూ లేక ఉక్రోషంతో ఉరమనూ లేక రావడానికి తొంగి చూస్తూ రాలడానికి బిడియ పడుతూ కను కొలుకున ఆర్తిగా నిలిచిన అశ్రుబిందువుకు భాష్యం చెప్పే సాహసం చెయ్యలేక మౌనం నిరంతర వాక్ప్రవాహం అనుకుంటూ మౌనాన్ని ఆశ్రయిస్తున్నా ! నిర్మలారాణి తోట [ తేది: 14.04.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qwU51O

Posted by Katta

13, ఏప్రిల్ 2014, ఆదివారం

Nirmalarani Thota కవిత

ఎర్ర గులాబీలు విరబూసాయి ఎవరొచ్చారో . . ? *************** నీలాకాశము అలక బూనిందేమో . . కారు మేఘాలు . . ! *************** కన్నీళ్లు ఘనీభవిస్తే మరో హిమాలయం . .! *************** విరిసినది అందాల పాప నవ్వు మరు మల్లియ. .! *************** చిలిపి గాలి బరువెక్కింది సందేశాలు మోస్తూ . . ! *************** మౌనానికి జీవం వస్తే దూకే మాటల ఝరి . . ! *************** మగువ మనసు ప్రతిబింబం విరిసే హరివిల్లు . . ! *************** ఏకాంతం ఏ కాంత తలపుకొచ్చిందో . . ? *************** ముసిరాయి చుట్టూ దోమలూ, ఆలోచనలూ ! *************** భోరున వర్షం ఆకాశం గుండె పగిలిందేమో . . ? *************** గొంగళి పురుగు సీతాకోక చిలుక మనిషి.. మనసు లా *************** ఓ జ్ఞాపకం నీలి నింగిలో నక్షత్రం తళుకులా . . *************** జనం మూగారు మొగ్గ విచ్చిందో పూవు రాలిందో . . ? *************** పాపం పతిత మసి ఎవరు పూసారో ? చందమామకు *************** కమ్మని కల తొలిగే పొగమంచులో నిజమయేలా . . ! నిర్మలారాణి తోట [ తేది: 13.04.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1oZQHPr

Posted by Katta

12, ఏప్రిల్ 2014, శనివారం

Nirmalarani Thota కవిత

Unless my finger felt it i never knew it Until my heart got lighter, I could never view it you could name it a wept I call it moist . . you could say it grief . . I will know it for past sweep ! the experiences of centuries the memories of gone lives, the pain of losses questionings of cherished briefs demands of situations agony of loneliness verdicts of merciless destiny cruelty of occurrences realities of unwished happenings you see.. now and then a tear moving out . . I see.. all those movements the aqueous YOU filling in..! Date: 12.04.2014

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1qMO0wo

Posted by Katta

11, ఏప్రిల్ 2014, శుక్రవారం

Nirmalarani Thota కవిత

ఇంటి నుండి బయలు దేరాను ఆనందాన్ని అన్వేషించుకుంటూ . . దారిలో ఎదురైంది విషాదం ! నేనూ వస్తానంది . . ఏ తోడూ లేని నేను సరే అన్నాను ఇక అదే నా శాశ్వత నేస్తమై నాతోనె ఉండిపోయింది నీడలా ! రాని వాళ్ళు ఎలాగూ రాలేదు రాక రాక వచ్చిన ఒక్క అతిథినీ ఎలా వెళ్ళిపొమ్మనగలను?

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gi2ZNj

Posted by Katta

10, ఏప్రిల్ 2014, గురువారం

Nirmalarani Thota కవిత

మసక చీకట్లు వీడి మగత బద్దకంగా ఒళ్ళు విరుచుకోగానే సూరీడి చూపులు చురుక్కుమనగానే ఒకానొక అడవిలో సిం హం లేచి జూలు విదిలిస్తుంది అదే అడవిలో ఒక లేడి పిల్ల మేలుకొని చెవులు రిక్కిస్తుంది రెండూ సాలోచనగా కమిట్ మెంట్తో కాళ్ళను కదిలిస్తాయ్ అలవోకగా తన నుండి తప్పించుకునే లేడి పిల్ల కంటే త్వరగా పరిగెత్తి పట్టుకోకపోతే ఆకలి తాళలేక చచిపొవాల్సి వస్తుంది సిం హం ! వేగంగా పరిగెత్తుతూ చాక చక్యంగా పంజా విసిరే సిం హం కంటే తెలివివిగా కనిపించకుండా పరిగెత్తకపోతే సిం హం ఆకలికి ఆహుతి అయిపోయి చచ్చిపోతుంది లేడి కూన.. రెండూ పరిగెత్తుతుంటాయ్.. పరిగెత్తుతూనే ఉంటాయ్. . నువ్వు సిం హానివా లేక లేడివా అనేది అప్రస్తుతం తూరుపు తెల్లవారగానే కమిట్మెంట్ తో పాదాలను పరిగెత్తించాల్సిందే ఈ జనారణ్యంలో నీ అస్తిత్వం కాపాడుకోవడానికి మరింత అర్ధవంతంగా జీవించడానికీ ! పరిగెత్తడం మానావో నీ బ్రతుకే తెల్లారిపోతుంది . . !! Nirmalarani Thota [ Date: 10.04.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1gbLnCA

Posted by Katta

7, ఏప్రిల్ 2014, సోమవారం

Nirmalarani Thota కవిత

నేను లలితా సహస్రనామాలు చదువుకుంటుంటా నువ్వేదో అనబోయి పూజ చూసి న్యూస్ పేపర్లో తల దూరుస్తావ్ నేనేదో చెపుతుంటా నువ్ సెల్ ఫోన్లో బాసుతో మట్లాడుతూ నోరు మూస్తావ్ నేను చంటోడిని చంకనెత్తుకొని టిఫిన్ బాక్స్ అందిస్తా నువ్ ఇయర్ ఫోన్స్ సవరించుకుంటూ వెళ్ళిపోతావ్ నువ్ ఆఫీస్ నుండి అలసిపోయి ఈడ్చుకుంటూ వస్తావ్ నేను అంట్లు తోముతూ సబ్బు చేతుల్తో తలుపుతీస్తా నువ్ నిస్సత్తువగా సోఫాలో జారగిలబడతావ్ నేను కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టి డాబాపై బట్టలు తీయడానికెళ్తా నువ్ టి.వి ముందు వార్తల్లో మునిగిపోతావ్ నేను డైనింగ్ టేబుల్ మీద భోజనం సర్దేస్తా నువ్ లాప్ టాప్ తీసి ప్రపంచంలోకి కనెక్ట్ అవుతావ్ నేను డిటాచయ్ గది తలుపు వారగా వేసుకొని బాబును జోకొడుతుంటా ఒక్కసారిగా చెవులు దద్దరిల్లేలా వినబడ్డ అరుపులకు ఇద్దరమూ బాల్కనీలోకి వచ్చి తొంగి చూస్తే . . పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో గుడారం వేసుకున్న ఒడ్డెర జంట వాడు చేత్తో సారా సీసా పట్టుకొని వీరంగం చేస్తూ చేపలకూర వండలేదని అరుస్తూ ఆమెను చితకబాదుతున్నాడు ఆమె వలవలా ఏడుస్తూ , కళ్ళు ముక్కూ తుడుచుకుంటూ అక్కసుతో నీ చేతులు పడిపోనూ, నీ జిమ్మడిపోనూ అంటూ నానా తిట్లు తిడుతోంది . . ప్లేట్లో పచ్చడి అన్నం పట్టుకొని గుక్కపట్టి ఏడుస్తూ ఓ బుడ్డోడు ! చిరాకూ అసహ్యం కలిగించే సన్నివేశం ! నీ భృకుటి ముడి పడి నా కనుబొమ్మలు పైకి లేచి . . "Cultureless country bruits.. ! నువ్ కోపంగా తిడుతూ విసుగ్గా లోపలికి " Bad for each other..." పాపం ! నేను నిట్టూరుస్తూ . . పొద్దున్నే చీపురుకట్టతో నేను.. బ్రష్ చేసుకుంటూ నువ్వు అలవాటుగా బాల్కనీలొకి వచ్చి కంటి ముందు దృశ్యం చూసి అవాక్కై. . నిన్నటి ఆలుమగలు . . . జంటగా . . పలుగు పార తట్టతో లూనాపై పనికి వెళ్తూ మధ్యలో బుడ్డొడు చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా . . భూమి రెండుగా చీలిపోతున్న ఫీలింగ్ . . అగాధాల్లో మనం ! ఒకే సారి ఇద్దరం ఒకర్నొకరం చూసుకుంటాం నిశ్శబ్ధంగా . . మనిద్దరి మధ్య మౌనం మరఫిరంగిలా పేలుతుంది గుండెలు పిక్కటిల్లేలా గోడ మీద పెళ్ళి ఫోటొ వెక్కిరిస్తుంది మంగళ వాద్యాలను గుర్తు చేస్తూ . . !

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iksHha

Posted by Katta

Nirmalarani Thota కవిత

నేను లలితా సహస్రనామాలు చదువుకుంటుంటా నువ్వేదో అనబోయి పూజ చూసి న్యూస్ పేపర్లో తల దూరుస్తావ్ నేనేదో చెపుతుంటా నువ్ సెల్ ఫోన్లో బాసుతో మట్లాడుతూ నోరు మూస్తావ్ నేను చంటోడిని చంకనెత్తుకొని టిఫిన్ బాక్స్ అందిస్తా నువ్ ఇయర్ ఫోన్స్ సవరించుకుంటూ వెళ్ళిపోతావ్ నువ్ ఆఫీస్ నుండి అలసిపోయి ఈడ్చుకుంటూ వస్తావ్ నేను అంట్లు తోముతూ సబ్బు చేతుల్తో తలుపుతీస్తా నువ్ నిస్సత్తువగా సోఫాలో జారగిలబడతావ్ నేను కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టి డాబాపై బట్టలు తీయడానికెళ్తా నువ్ టి.వి ముందు వార్తల్లో మునిగిపోతావ్ నేను డైనింగ్ టేబుల్ మీద భోజనం సర్దేస్తా నువ్ లాప్ టాప్ తీసి ప్రపంచంలోకి కనెక్ట్ అవుతావ్ నేను డిటాచయ్ గది తలుపు వారగా వేసుకొని బాబును జోకొడుతుంటా ఒక్కసారిగా చెవులు దద్దరిల్లేలా వినబడ్డ అరుపులకు ఇద్దరమూ బాల్కనీలోకి వచ్చి తొంగి చూస్తే . . పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో గుడారం వేసుకున్న ఒడ్డెర జంట వాడు చేత్తో సారా సీసా పట్టుకొని వీరంగం చేస్తూ చేపలకూర వండలేదని అరుస్తూ ఆమెను చితకబాదుతున్నాడు ఆమె వలవలా ఏడుస్తూ , కల్లు ముక్కూ తుడుచుకుంటూ అక్కసుతో నీ చేతులు పడిపోనూ, నీ జిమ్మడిపోనూ అంటూ నానా తిట్లు తిడుతోంది . . ప్లేట్లో పచ్చడి అన్నం పట్టుకొని గుక్కపట్టి ఏడుస్తూ ఓ బుడ్డోడు ! చిరాకూ అసహ్యం కలిగించే సన్నివేశం ! నీ భృకుటి ముడి పడి నా కనుబొమ్మలు పైకి లేచి . . "Cultureless country bruits.. ! నువ్ కోపంగా తిడుతూ విసుగ్గా లోపలికి " Bad for each other..." పాపం ! నేను నిట్టూరుస్తూ . . పొద్దున్నే చీపురుకట్టతో నేను.. బ్రష్ చేసుకుంటూ నువ్వు అలవాటుగా బాల్కనీలొకి వచ్చి కంటి ముందు దృశ్యం చూసి అవాక్కై. . నిన్నటి ఆలుమగలు . . . జంటగా . . పలుగు పార తట్టతో లూనాపై పనికి వెళ్తూ మధ్యలో బుడ్డొడు చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా . . భూమి రెండుగా చీలిపోతున్న ఫీలింగ్ . . అగాధాల్లో మనం ! ఒకే సారి ఇద్దరం ఒకర్నొకరం చూసుకుంటాం నిశ్శబ్ధంగా . . మనిద్దరి మధ్య మౌనం మరఫిరంగిలా పేలుతుంది గుండెలు పిక్కటిల్లేలా గోడ మీద పెళ్ళి ఫోటొ వెక్కిరిస్తుంది మంగళ వాద్యాలను గుర్తు చేస్తూ . . !

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1iksISb

Posted by Katta

6, ఏప్రిల్ 2014, ఆదివారం

Nirmalarani Thota కవిత

పగలంతా ప్రచండుడై సాయంవేళ చల్లగా పడమటి ఒడి చేరుతాడు సూరీడు ! అమావాస్యకీ పున్నమీకీ మధ్య రోజు రోజుకీ రూపం మారుస్తాడు నెలరాజు ! ఒక సారి గ్రీష్మం . . ఒక సారి వసంతం .. మాటి మాటికీ రంగులు మారుస్తుంది కాలం ! సాగరానికి ఆటు పోట్లు ప్రతి రోజుకూ రాత్రి పగలు . . అన్నింటికీ అలవాటుపడ్డ నేను నీలో మార్పుల్నెందుకు అంగీకరించను ? బహుశా.. అవన్ని అందరివీ నువ్వు మాత్రం నా ఒక్కడివే అనే భావన కాబోలు..! అర్ధం చేసుకోవూ . . . ! !

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1hhOcEf

Posted by Katta

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

Nirmalarani Thota కవిత

వెతుకులాట..! విచ్చుకునేదాక ఒళ్ళంత కళ్ళతో తమకంగా వేచి చూస్తే విరిసీ విరియగానే నలుదెసలా తనకందకుండా పరుచుకునే తావి విరహంలో తమ తనువు చాలించే విరి కన్నియలు ! గగనాల నీడల్లో పరుచుకోవాలని సాగిపోయే గాలిని పట్టుకోవాలనే పంతమో పారవశ్యంతోనో పరుగులు తీస్తూ పరిమళం ! విశ్వమంతా వింత పోకడలతో తిరిగే నిలకడలేని మబ్బు తునకని చల్లబరచి కురిపించాలనే ప్రయత్నంలో పయనిస్తూ పలవరిస్తూ గాలి తెమ్మెరలు మబ్బేమో యెద నిండా తడి నింపుకోవాలనే తీరని దాహంతో వాగుల వెంట, సంద్రాన్ని వెతుకుతూ అగాధాల్ని ఆణిముత్యాల్ని తనలో నింపుకున్నా తనివితీరని సంద్రం ఆకాశాన్నందుకోవాలనే ఆశలో ఎగిసి పడుతూ పాలపుంతల్ని ఇముడ్చుకున్న ఆకాశం మాత్రం అందర్నీ ఊరిస్తూ ఎవరికీ అందకుండా ఆశల్ని రేపుతూ చిద్విలాసాంగా తటిల్లతై మెరుస్తూ . . ఉన్నదానిపై శీతకన్ను . . అందని మాయలేడిపై సీత కన్ను ! అసలు "మేడ్ ఫర్ ఈచ్ అదర్ " ఉత్తి ట్రాష్ ! అంతా "పెయిడ్ ఫర్ ఈచ్ అదరె . . కాసిన్ని కాసులో..ఊసులో..అందాల రాశులో కాకుంటే దోసెడు కన్నీళ్ళో గుప్పెడు నవ్వులో భూసారం తగ్గినప్పుడల్లా మనుషుల స్థావరాల స్థానచలనాలు తెలుసు పచ్చదనం మొలిపించే నేల గుండెల్ని తడుముకుంటూ ! సంద్రాలు దాటే విహంగాల విహారమూ తెలుసు మేత దొరికే చోటు కోసం గూటి కోసం రెక్కల్ని తరుముకుంటూ ! కానీ.. కానీ.. అదేంటో చిత్రంగా "మనసులు" వలస పోవడమేంటో ప్రేమను వెతుక్కుంటూ మజిలీలు మారుస్తూ ?!!! నిర్మలారాణి తోట [ తేది: 04.04.2014 ]

by Nirmalarani Thota



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1dTWa5W

Posted by Katta