దుఃఖ రహస్యం విప్పిన తాత్విక కవి పద్యం ఒకటి! - కోడూరి విజయకుమార్ మే 2014 పురాణ గాథ లాంటి కథ ఒకటి ప్రచారంలో వుంది. ఒకనాడు అక్బర్ చక్రవర్తి తన ఆస్థాన సంగీత విద్వాంసుడు తాన్ సేన్ ని ‘దీపక్’ రాగాన్ని ఆలపించమని కోరాడు. తాన్ సేన్ రాగాలాపనతో ఆస్థానం లోని దీపాలు వాటంతట అవే వెలిగాయి. రాగాలాపనతో తాన్ సేన్ శరీరం అంతా ఎంతగా కాలిపోయిందంటే, అతడిని వెంటనే దాపునే వున్న నది దగ్గరకు తీసుకు వెళ్ళారు. అయినా లాభం లేకపోయింది. నది లోని నీళ్ళు వేడెక్కి పోయాయి. ఇక చావు తప్ప మరొక దారి లేదనుకున్న సమయం లో ఇద్దరు అక్కచెల్లెళ్ళు ‘మల్హర్ ‘ రాగం ఆలపించారు. ఆ అక్కచెల్లెళ్ళు ఆలపించిన మల్హర్ రాగానికి ఒక్క సారిగా వర్షం కురిసి, తాన్ సేన్ శరీరాన్ని చల్ల బరిచింది. మరి, ఒక ఎల్లలు లేని ఆకలితో, తీరని దాహంతో, ఒక తెరిపి లేని పరుగులా మారిపోయిన జీవితం కాలిపోతున్నపుడు మనిషికి కావలసిన గొప్ప ఉపశమనం ఏమిటి? బహుశా, అతడిని మళ్ళీ మనిషిని చేసే ఒక స్వచ్చమైన దుఃఖం. లోకం లోకి అడుగుపెట్టిన తొలి క్షణాలలో శక్తినంతా కూడదీసుకుని బిగ్గరగా ఏడ్చిన పసి దుఃఖం లాంటి దుఃఖం! ‘వాషింగ్టన్ ఇర్వింగ్’ అంటాడు – ‘కన్నీళ్లు చాలా పవిత్రమైనవి. అవి మనిషి బలహీనతకు కాదు, అతడి శక్తికి సంకేతాలు. కన్నీళ్లు పది వేల నాల్కల కన్నా శక్తివంతంగా మాట్లాడతాయి. కన్నీళ్లు, అంతులేని విచారాన్ని, గాఢ పశ్చాత్తాపాన్ని, అవ్యక్త ప్రేమనీ చేరవేసే దూతలు’ మరి, ఇంతటి గొప్పదైన దుఃఖం గురించి పద్యం చెప్పే కవి, ఒక తాత్వికుడు కాకుండా, కేవలం కవి మాత్రమే అయితే సరిపోతుందా ? ‘తాత్వికుడు కాని వాడు, కవి కాలేడు’ అన్న మాట వాస్తవమే గానీ, ఇలా జీవితం లోని దుఃఖం గురించీ, జీవితం లో ఉండవలసిన దుఃఖం గురించీ పద్యం చెప్పడానికి ఆ ప్రాథమిక అర్హతలని మించిన అర్హత ఏదో ఆ కవిలో వుండాలి కదా! బహుశా, పాపినేని శివశంకర్ తెలుగు సాహిత్యంలో అలాంటి అరుదైన తాత్విక కవి. ఒక్కొక్క పద్యం సాధనంగా, జీవితంలోని ఒక్కొక్క భావోద్వేగాన్నీ తడిమి చూసే ప్రయత్నం చేసిన కవి. ‘జీవితానికి పరాయివాల్లమై పోయాం నీటి మీద నూనె తెట్టెలం అయిపోయాం’ అని బాధపడిన కవి. చాలా సరళంగా కనిపిస్తూనే, గొప్ప తాత్వికతతో తొణికిసలాడే పాపినేని శివశంకర్ గారి కవిత్వం చదివినపుడు, ఒక అంశం పైన విస్తృతంగా సంభాషించే సమయంలో, ‘జిడ్డు కృష్ణమూర్తి’ కీ, ‘ఓషో’ కీ నడుమ వుండే తేడాని ఉటంకిస్తూ ఎక్కడో చదివిన ఒక వ్యాసం జ్ఞాపకం వొస్తుంది. ఆ వ్యాసంలో రచయిత అంటాడూ – ‘ఓషో గొప్ప ఉపన్యాసకుడు. ఏ అంశం గురించయినా శ్రోతలని ఉత్సాహపరుస్తూ, అనర్ఘలంగా ఉపన్యసించ గలడు. కానీ, కృష్ణమూర్తి ఉపన్యాసం ఎలాంటి తొడుగులూ లేకుండా, సరళంగా, జీవితానికి అవసరమైన అంశాలనే లోతుగా విశ్లేషిస్తూ సాగుతుంది.’ బహుశా, పాపినేని గారి కవిత్వం, కృష్ణమూర్తి స్కూల్ కి చెందినదని నా అభిప్రాయం! జీవితంలో వుండవలసిన, జీవితానికి అవసరమైన దుఃఖం గురించి ఈ ‘దుఃఖ మేఘ మల్హరి’ అన్న పద్యంలో ఆయన ఏమంటున్నారో ఒక సారి ప్రశాంతంగా చదవండి ఇక్కడ! దుఃఖ మేఘ మల్హరి అప్పుడప్పుడూ శరీరం అశ్రువైతే మంచిది ఆవేదనా దగ్ధమైతే మంచిది సుఖించడమే అందరూ నేర్పారు అన్ని పరిశోధనలూ భూమ్మీద మనిషి సుఖ పడడానికే చేశారు ఏడ్పు-దిగులు-వేదన-విషాదం- విలాపం-దుఃఖం మొదలైన మాటలన్నీ అంటరానివిగా తేల్చారు ఇల్లు, ఒళ్ళు, చదువు, ఉద్యోగం, కారు, భార్య – అన్నే సుఖం కోసమే దుక్ఖమూ ఒక సత్యమేనని అందరికీ తెలీదు గుండెలకాన విలపించడమూ తెలీదు అప్పుడప్పుడూ దుఃఖాన్ని దయగా నీ పెంపుడు కుక్క పిల్లల్లే దగ్గరికి తియ్యడం మంచిది పూడిక తీసిన బావిలో నీరూరినట్లు కంట్లో నీరూరితే మంచిది దు:ఖమంటే జ్వలన జలం – జలజ్వలనం దుఃఖించే టపుడు నీ కళ్ళ వెనకాల లీలగా ఒక కటిన పర్వతం బొట్లు బొట్లుగా కరిగిపోతుంది దు:ఖాంతాన నీ కళ్ళు నిర్మలమవుతాయి నీ లోపల పరిశుభ్రమవుతుంది నువ్వు వెలిమబ్బారిన ఆకాశమవుతావు దు:ఖించిన వాడికే జీవితం అర్థమవుతుంది దుఃఖం లేని ప్రపంచం అసంపూర్ణమవుతుంది రెండు కళ్ళు రెండు అపురూప కార్యాల కోసం వున్నాయి ఒకటి నీ దుఃఖం కోసం రెండోది పరాయి దుఃఖం కోసం ఈ పద్యానికి ‘దుఃఖ మేఘ మల్హరి’ అన్న పేరు పెట్టడంలోనే, జీవితంలో ‘దుఃఖం’ అగౌరవంగా చూడవలసిన అంశం కాదనీ, జీవితాన్ని చల్లబరిచే గొప్ప శక్తి ఏదో తనలో ఇమిడ్చుకున్న అంశమనీ అన్యాపదేశంగా చెప్పారు. ‘అప్పుడప్పుడూ శరీరం అశ్రువైతే మంచిది’ అని పద్యాన్ని ఎత్తుకోవడంలోనే, అతడు ఇక్కడ ప్రస్తావిస్తోన్న దుఃఖం అలా పొడి పొడిగా నాలుగు కన్నీటి చుక్కలు రాల్చే దుఃఖం కాదనీ, పొగిలి పొగిలి ఏడ్చే దుఃఖం అనీ అర్థం అవుతుంది. అందరూ సుఖించడమే నేర్పడం వలన, సకల పరిశోధనలూ భూమ్మీద మనిషి సుఖపడడానికే చేయడం వలన మనిషి దుఖించడం మరిచిపోయాడని వాపోతున్నాడు కవి. దు:ఖమూ ఒక సత్యమే అన్న సంగతిని చాలా మంది మరిచిపోయారని బాధపడుతున్నాడు కవి. ఇంతకీ ఈ సత్యాన్ని మరిచిపోవడం వలన జరిగిన నష్టం ఏమిటి ? మనిషి క్రమంగా లోపల కటినంగా మారిపోయాడు…. లోపల వెలి మబ్బుల ఆకాశంలా మారిపోయాడు … లోపల మకిలి ఏదో పట్టి, పరుల జీవితం మాత్రమే కాదు … తన జీవితమూ కనిపించని అంధుడై పోయాడు …. ఎందుకిలా ? జిడ్డు కృష్ణ మూర్తి అంటాడు – ‘మనలో చాలా మందిమి, ఒక స్పష్టతతో ప్రయాణం ప్రారంభించి, వయసు పెరిగే కొద్దీ అస్పష్టత వైపు అడుగులు వేసి, అంతిమంగా ఆ అస్పష్టత తోనే మరణిస్తాము’ బహుశా, అలాంటి అస్పష్టత ఏదో నిన్ను కమ్మేసినపుడు, దుఃఖం నీ గుమ్మం ముందు నుంచున్నపుడు, దానిని రెండు చేతులూ సాచి ఆహ్వానించమంటున్నాడు కవి … ‘నీ పెంపుడు కుక్కల్ని దగ్గరకు తీసినట్టు’, నీ దుఃఖాన్ని కూడా దయగా దగ్గరకు తీయమంటున్నాడు. శరీరమంతా అశ్రువుగా మారేంతలా, ఎండిపోయిన బావిలా మారిన జీవితంలో నీరు వూరేంతగా, దుఃఖాన్ని దగ్గరకు తీసుకోమంటున్నాడు. తీసుకుని నిన్ను నువ్వు శుభ్రపరచుకొమ్మని చెబుతున్నాడు … నీ లోపలి కటిన పర్వతాన్ని కరిగించమని అంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే, దుఃఖించని వాడికి జీవితం అర్థం కాదని చెబుతున్నాడు కవి. అవును … ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అర్థం కానపుడు, నీ ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తావు? నీకే అర్థం కాని నీ జీవితాన్ని ఎలా కొనసాగిస్తావు ? ఇంతకీ, జీవితానికి అర్థం ఏమిటి? … నీ ‘రెండు కళ్ళు రెండు అపురూప కార్యాల కోసం వున్నాయి / ఒకటి నీ దుఃఖం కోసం / రెండోది పరాయి దుఃఖం కోసం’ ! బహుశా, ఈ రెండు దు:ఖాలూ లేని ‘ప్రపంచం అసంపూర్ణమవుతుంది’ అందుకే, ‘దేవుడి దుఃఖం’ కూడా అతడిని ఆరాధించిన మానవాళికి ఒక అపురూపమైన సంగతి అయింది ! http://ift.tt/1kBeDUq
by Kapila Ramkumarfrom kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1kBeDUq
Posted by
Katta