పేజీలు

' నువ్వొక పచ్చని చెట్టయితే పిట్టలు వాటంతట అవే వచ్చి వాలేను'..!.
Nanda Kishore లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Nanda Kishore లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, జూన్ 2014, బుధవారం

Nanda Kishore కవిత

అనుకోకుండా 32 పడిలేచిన కెరటం పాదాల్ని కడుగుతుంది. హోరెత్తిన కెరటం చేతుల్ని కలుపుతుంది. సముద్రం పిలుస్తుంది. వెన్నెలస్నేహితా! నిజం. సముద్రం పిలిచినట్టు ఎవ్వరూ పిలవరు. సముద్రం మాట్లాడినట్టు ఎవ్వరూ మాట్లాడరు.సముద్రపు హోరు అనంతం. వెన్నెలస్నేహితా! ఉన్నంతసేపు ఊపిరి నిలవదు. అయినా సరే. అక్కడే ఉంటాం.అలల్ని తడుపుకుంటూ అక్కడక్కడే సంచరిస్తాం. అక్కడే- భూమికి చివర నిలుచుని, తడితాకని కన్నులకింద ఆకాశాన్ని అదిమిపెడతాం. వెన్నెలస్నేహితా! ఆడుగులు చెరిగిపోతాయ్. ఆడుకున్న పిల్లలందరూ ఒక్కో దిక్కుకి చెదిరిపోతారు. ఇసుక మెరవదు. సూర్యుడు నవ్వీ నవ్వీ అలసిపోతాడు. ఒకానొక కల్లోలం తర్వాత- జంటగా కూర్చున్న మనుషులందరూ ఒకరిలోకి ఒకరు తప్పిపోయినా- సముద్రం తప్పిపోదు. సముద్రం సమస్తమై మనల్ని తప్పిపోనివ్వదు. వెన్నెలస్నేహితా! తీరం దాటి వెళ్ళిపోతాం. సుదూరతీరంలో దాహంతీరే చోటు ఒకటి తప్పక ఉంటదనే పిచ్చి నమ్మకంతో- ఎంతదూరమైనా కదిలిపోతాం. వెన్నెలస్నేహితా! అలలు చెలరేగడం ఆగదు. ఎంత వేడుకున్నా, సముద్రపుగాలి మన ఊపిరిలోచేరి కొట్లాడటం ఆపదు. 18-06-14

by Nanda Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1neDEmU

Posted by Katta

6, జూన్ 2014, శుక్రవారం

Nanda Kishore కవిత

*out of syllabus* అడవికి అంతే- చిగురించాలి. అల్లుకుపోవాలి.ఏదీ కనిపించనంత విస్తరించాలి. చిమ్మచీకట్లో మిణుగురుకోసం ఎందుకు వెతుకుతావో అర్ధం కాదు. హత్తుకుంటది. జోలపాట రానందుకు బాధపడ్తది. భయపడి నెగడు వేసుకుంటావా?! కోపం. పాత గుర్తులు దహించుకుపోవడం కొంచెం కూడా ఇష్టముండదు. ** పువ్వుకి అంతే- వికసించాలి.సీతాకోకల్నిపోగుచేసి మధువు పంచాలి.రాలిపోవాలి. దూరంగా నిల్చుని గాలి కోసం ఎదురుచూస్తావా?! అర్ధం కాదు. వేళ్ళతో తాకడం కూడా రాదంటూ నవ్వుకుంటది. ** ప్రతీ రక్తసంధ్యలోనూ దేహాన్ని పరిచి, హృదయం చీల్చిపొమ్మని ఒక పదునైన కత్తిని చేతిలో ఉంచుతుంది కదా అడవి పువ్వు? నమ్మకు.నవ్వుతూ బతకడం సాధ్యమని చెప్పకు.ఆమెని దగ్గరికి తీసుకో. ఆపై చేతులు కట్టుకుని అక్కడినుండి వెళ్ళిపో. రాత్రికెలాగూ నీ మరణం తప్పదు. 05-06-14

by Nanda Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1upAuSU

Posted by Katta

4, జూన్ 2014, బుధవారం

Nanda Kishore కవిత

Selected Readings: || సామాన్యులమంటే మనం || సామాన్యులమంటే మనం ప్రజలే ప్రభువులన్న ఒకే అబద్దాన్ని పదే పదే నమ్మించే అ/ప్రజాస్వామ్య రాజకీయ నాయకులు కాదు సామాన్యులమంటే మనం ఇంటి మీద హెలిపాడ్ పెళ్ళానికి చార్టర్డ్ ఫ్లైట్ ఒక్క మాట తో స్టాక్ మార్కెట్ హాం ఫట్. త్రీ పీస్ సూట్లేసుకుని సంపద పై స్వారీ చేస్తూ తమ ప్రగతే దేశ ప్రగతని నమ్మబలికే వ్యాపారవేత్తలు కాదు సామాన్యులమంటే మనం ప్రభువుల పాపాల్ని తమ విఙానం తో రాజ్యాంగ లొసుగుల్లో పాతిపెట్టి అవినీతి మూటల మేడల్లో హాయిగా వుండే బ్యూరొక్రాట్లు కాదు సామాన్యులమంటే మనం హీరొయిన్ల లిప్ స్టిక్ ధరల్ని హీరోల చీకటి రహస్యాల్ని ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల్తో అబద్దపు వార్తల్ని అందం గా అందించే వాళ్ళు కాదు సామాన్యులమంటే మనం 30 సెకన్ల ప్రకటన తో తమ విలువైన కాలాన్ని సెకన్ల కి కోట్ల చొప్పున అమ్ముకునే సెలబ్రిటిలు కాదు సామాన్యులమంటే మనం పడవల్లాంటి కార్లేసుకొచ్చి సూపర్ మార్కెట్ తోపుడుబండి నిండా సరదా కోసం షాపింగ్ చేసె వాళ్ళు కాదు సామాన్యులమంటే మనం ఒకటో తారీఖొస్తుందంటే ఒణికిపోయే వాళ్ళం ఉల్లిపాయ,టమాటా, నిత్యావసరం ఏదైనా రేటు పెరిగిందంటే బడ్జెట్ సవరణల్తో కుస్తీ పట్టేవాళ్ళం. కందిపప్పు పండక్కే వండుకునే వాళ్ళం గుక్కెడు నీళ్ల కోసం కుళాయి దగ్గర కుస్తీ పట్టే వాళ్ళం రేషన్ షాప్ క్యూ లో సహనాన్ని పరీక్షించుకునే వాళ్ళం వాన కోసం ఎదురుచూసేవాళ్ళం మట్టి వాసన పీల్చే వాళ్ళం అనుక్షణం పోరాడే వాళ్ళం..ఆశాజీవులం. (పొట్టకూటి కోసం కవిత్వాన్ని ఫుట్పాత్ మీద అమ్ముకునే ఒక ఐరిష్ కవి కవిత ని ఫ్రీ గా చదివి అనుసరిస్తూ..,అనుకరిస్తూ.. మన్నించాలి నాకు అతని కవితే కాదు కనీసం పేరు కుడా గుర్తు లేదు ) --శ్రీకాంత్ ఆలూరు

by Nanda Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1nP8Uz7

Posted by Katta

12, ఫిబ్రవరి 2014, బుధవారం

Nanda Kishore కవిత

జాతర బంగారు గింజల్ల చేనంత మెరిసింది బంగారు నవ్వుల్ల నేలమ్మ మురిసింది. సింగిడే పొడిసింది.ఎన్నెలే కాసింది. సింతదీరేరోజు ఎదురుగా వచ్చింది. ||బండిగట్టర తమ్మి పోదాము జాతర భూలోను ఎంకన్న భూమిస్తరమ్మండు. బండినడపర తమ్మి పోదాము జాతర ఇల్లంత రామన్న ఇల్లిస్తరమ్మండు|| కాయకష్టంపండి కుప్పల్లేకూసుంది. కుప్పనూర్పీనంక కునుకొకటిదీసింది. పిచుక పరిగేరింది.మంచె పడకేసింది. కల్లమే లేసింది. గడ్డిమేటేసింది. ||బండిగట్టర తమ్మిపోదాము జాతర కొండగట్టంజన్న కోతుల్నితోలిండు. బండినడపర తమ్మి పోదాముజాతర కొత్తకొండీరన్న కోళ్ళనెదెమ్మండు.|| సలసల్లగాలుల్లో సలిమంట రేగింది. గణగణలసవ్వట్లో పట్టెడే మోగింది. మంచు మసకేసింది.రేయి ముసుగేసింది. గాలి ఈలేసింది.ఎద్దు రంకేసింది. ||బండి కట్టర తమ్మి పోదాము జాతర రామప్పలో శివుడు రాగాలుదీస్తుండు. బండినడపర తమ్మి పోదాము జాతర ఐలోను మల్లన్న ఒగ్గుకధజెపుతుండు|| పగిలేటి గింజల్లో మొలకమ్మ నవ్వింది. పచ్చాటి కలగంటు నారు నీళ్ళాడింది. నాగలే అలిసింది.సాళ్ళ ముద్దాడింది. కాలువే పారింది.కండ్లు తుడిచేసింది. ||బండికట్టర తమ్మి పోదాము జాతర కోటంచ నరసిమ్మ కొలువిస్త రమ్మండు బండినడపర తమ్మి పోదాము జాతర అడవిలో జంపన్న అన్నల్లే పిలిచిండు.|| 12-02-14

by Nanda Kishore



from kavi sangamam*కవి సంగమం*(Poetry ) http://ift.tt/1bLINhu

Posted by Katta

16, అక్టోబర్ 2012, మంగళవారం

నందకిషోర్ । చక్రవ్యూహం


1

ప్రతీ అనుభవం నేర్పేదే.
ఎంతో కొంత.
కొంచెం జ్ఞానం.
అంతే అజ్ఞానం.

ప్రతీ మనిషిదీ స్వార్ధమే.
ఎంతో కొంత.
కొంచెం నీకోసం.
మిగతా తనకోసం.

2

అవకాశం ఉన్నన్ని రోజులు
నియమాలమీద సావాసం.

తీరికలేక,ఓపికలేక ఒకరోజు-
అన్నీ మలిపి ఆనందిస్తాం.
ఒకే జీవితమని గుర్తించేస్తాం.

ఒక్కరోజన్న గడుస్తుందో లేదో-
ముందే చేస్తే బాగుండని ఎవడో
భుజాలుపట్టి ఊపేస్తాడు.
తలలోకి దూరి గోలచేస్తాడు.

ఇంకేం!
ఓ కొత్త పత్రం తయారవుతుంది.
నువ్వెప్పుడు ఆనందించవు.

3

అభిమానం దొరికినన్ని రోజులు
మనసుల మీద వీరంగం.

పొడిబారి,పొగరు తగ్గి ఒకరోజు
ఎవరూ లేరని ఏడ్చేస్తుంటాం.
బతుకిదికాదని తేల్చేస్తుంటాం.

కన్నీటి చుక్కైనా రాల్తుందో లేదో-
హత్తుకొని తిరుగుదాం రమ్మంటు ఎవరో
తెగిపడిన చేత్తో పిలుస్తుంటారు.
పగిలిన గుండెతో పాటకడతారు.

ఇంకేం!
ఓ కొత్త భయం పరుగుతీస్తుంది.
నువ్వెప్పుడు కలిసిపోలేవు.

4

సంజాయిషీ ఇవ్వాల్సిన నిమిషాలు
ఎప్పటిలాగానే మిగిలేఉంటాయ్.
వినాల్సిన మనుషులుండరు.

ఎక్కడున్నారో తెలిసీ-
నడిచే ధైర్యం నీకూ ఉండదు.

సందేహాలు తీర్చాల్సిన మనుషులు
ఎప్పటిలాగానే మిగిలేఉంటారు.
చెప్పాల్సిన నిమిషం మిగలదు.

ఎక్కడికిపోయిందో తెలిసీ-
వెతికే కోరిక నీకూ ఉండదు.

5

ఒప్పుకుంటానంటే నిజం చెప్తా!

రోజోసారి రోజుల్ని లెక్కేస్తామేగాని
నీకు,నాకు,మనలాంటి అందరికీ-
సుఖానికి,సంతోషానికి తేడా తెలీదు.
అవసరానికి,ఆశకి గిరిగీయడం తెలీదు.

ఋతువుకోతీరుగా దుప్పట్లు మారుస్తాంగాని
నీలో,నాలో,మనలాంటి అందరిలో-
ఊహల కొత్తదనం- ప్రయత్నాలకు అంటదు.
నవ్వుల తడితనం-గుండెలకు తాకదు.

15-10-12

29, సెప్టెంబర్ 2012, శనివారం

నందకిషోర్ || నా తెలంగాణ (గేయ కవిత)

అరవైయేండ్లసంది- మనము నిండా రంది
కడుపునిండా తిని -ఎన్ని రోజులైంది?
ఎట్టెట్ల బతికినవ్ తెలంగాణ?
నువ్వు ఎట్ల గడిపినవమ్మ తెలంగాణ?

దీనమైన బతుకు-కడుపు నింపని మెతుకు
హూనమైన ఒళ్ళు-దూపకందని నీళ్ళు
చేవగలిగిన తల్లి తెలంగాణ!
నీ కధ ఎంత సిత్రామె తెలంగాణ!

వలసవాదులంత-విడుదలని ఆపేస్తే
వలవల ఏడుస్తు-రోజుల్ని లెక్కేస్తు
ఎదురుచూసే తల్లి తెలంగాణ-నీకు
ఎదురొస్త సూడమ్మ తెలంగాణ

అస్తిత్వమే నేడు ఆగమయిపోతుంటే
ఇంక ఆగేదేంది - అణిగి ఉండేదేంది
పోరు దారిలోన తెలంగాణ-నేను
పొలికేక పెడతాను తెలంగాణ
-
వనవాసమొచ్చిన సీతారామయ్యను
పర్ణశాలవయ్యి సేదదీర్చినవంట
అనుమంతుడెగరంగ తెలంగాణ-నువ్వు
కొండగట్టయ్యావ తెలంగాణ

నరసిమ్ముడేరాగ యాదగిరిగ వెలిసి
పాండవుల్నిదాచ నేలకొండల కలిసి
గోదారి తీరాల తెలంగాణ-వేదాల
నోదార్చినావంట తెలంగాణ

కంఠేశ్వరములోన కొలనుపాకలోన
ఇందురు కోటల్లో చోళెవాడల్లోన
వేలయేండ్లకుముందె తెలంగాణ-నువ్వు
విలసిల్లినావంట తెలంగాణ

కోటిలింగాలలో ఆటలాడిననాడు
నేలకొండల్లోన బుద్దినేర్చిననాడు
ఆకాశమందింది తెలంగాణ-యీ నేల
సింగిడై పూసింది తెలంగాణ

త్రిభువనగరికోట తిరుగాడినా రోజు
కాకతీయుల కలలకోకలేసినరోజు
అమ్మవైపోయావె తెలంగాణ-పచ్చాని
అడవుల్లో నడిచావె తెలంగాణ

మెతుకుదుర్గంలోన ఏకశిలలపైన
రామప్ప శిల్పాల్ల వేయి స్తంభాలల్ల
నాట్యాలు జేసావె తెలంగాణ-నువ్వు
నవ్వుతూ తిరిగావె తెలంగాణ

అబలవంటు తలచి ఆక్రమించగ వస్తె
ఆవేశమె ఎగసి మగవేషమే వేసి
ఎదురించినావమ్మ తెలంగాన-రుద్రమ్మ
చేతుల్లో కత్తివై తెలంగాణ

జంపన్నవాగులో జరిగింది ఒక తప్పు
తెలిసితెల్వని తప్పు తెచ్చె నీకు ముప్పు
గూడెంల గుడిసెపై తెలంగాణ-సమ్మక్క
సల్లటి సూపువే తెలంగాణ

అడవిబిడ్డల కప్పమడిగిన పాపమే
బంగారుసువ్వల్ల బందీగబోయింది.
వీరశైవముబోయి తెలంగాణ-యీడ
బానిసత్వము సొచ్చె తెలంగాణ

బహుమనీ మొఘలాయి సుల్తాన్లు సైతాన్లు
షాహీలు,జాహీలు దొరలు,దోపిడిదార్లు
అధికారమెవడైన తెలంగాణ-నువ్వు
అణిగి ఉన్నవె తల్లి తెలంగాణ

బమ్మెరపోతన్న పాల్కుర్కి సోమన్న
పిల్లమర్రిన పినవీరభద్రన్న
కవులగన్నా తల్లి తెలంగాణ-పాట
కట్టడం నేర్పావె తెలంగాణ

బాధనోర్చుకుంటు బతుకునీడ్చుకుంటు
బరువైన గుండెలో కండ్లల్ల నీళ్ళతో
అడవిదారులపొంట తెలంగాణ-నువ్వు
అడుగులేసావమ్మ తెలంగాణ
-
గుర్రాలపై వచ్చి గుడులు కూలగొట్టి
మతముమారమంటు కుతికపై కాలేస్తే
ఊపిరాపకుండ తెలంగాణ-మమ్ము
కాపాడిన తల్లి తెలంగాణ

తోలు చెప్పుల కింద చెయ్యి నలుగుతున్న
మరఫిరంగి గాయం గుండె సలుపుతు ఉన్న
కన్నబిడ్డల పొదివి తెలంగాణ-కడుపు
దాసుకున్నవె తల్లి తెలంగాణ

ఆడబిడ్డల చెరచి అడవిసంపద దోచి
అడ్డమొచ్చినోని కాళ్ళు చేతులు విరిచె
కాలమే కదలంగ తెలంగాణ-మమ్ము
కాసుకున్నవె తల్లి తెలంగాణ

అడవుల్ని అక్కల్ల,నదిని నాయనలాగ
తండాని తమ్మునిల,పల్లెల్ని పిల్లల్ల
సూసుకున్నవె తల్లి తెలంగాణ-కండ్లల్ల
కలుపుకున్నవె తల్లి తెలంగాణ

పంటని పల్లెని ఇంటి ఇల్లాలుని
ఏది దొరికినగాని ఎత్తుకెళ్ళిపోయి
మానాలుదోస్తుంటే తెలంగాణ-నువ్వు
మౌనంగ ఏడ్చినవె తెలంగాణ

బాంచలంటు దొరలు బతుకులాగంజేస్తే
బట్టలే ఇప్పించి బతుకమ్మలాడిస్తే
గుండె రాయిగ మార్చి తెలంగాణ-
ఏడ్చిన దైన్యమె తెలంగాణ

కరువు దాపురించి కాలువల నీళ్ళెండి
గడిలబాయికాడ నీళ్ళు తేవబోయి
దొరలసూపుకి నోచి తెలంగాణ
దాంట్ల దూకిన రోషమె తెలంగాణ

కాళ్ళ రెక్కల కష్టం శిస్తుకట్టనంటే
కన్నెర్రగాజేసి కాల్చిపారేస్తుంటే
కడుపుతీపి పొంగి తెలంగాణ-కన్నీటి
నదులపారిన తల్లి తెలంగాణ

నోటికాడి ముద్ద నైజాములాక్కుంటే
కూటికిగతిలేక కొడుకులేడుస్తుంటె
రజాకార్లను తరుమ తెలంగాణ-
రగిలిపోయిందాన తెలంగాణ

ఎండనక వాననక చేసిన కష్టాన్ని
బండెనక బండ్లల్ల నిజాం పట్టుకపోతే
నిండైన నీ గుండె తెలంగాణ-నిప్పు
కణికల్లె మండిది తెలంగాణ
-
బలిఅవుతనని ఎరిగి నాజీలకెదురేగి
బందూకుగొట్టంల బతుకురాగం పాడి
తిరగబడ్డవె తల్లి తెలంగాణ-యాదన్న
గొంతుకల పాటవై తెలంగాణ

పసులు కాసేటోన్ని పైసల్ కట్టుమంటే
పసిపిల్లలా అడివి పరేషానయితుంటే
గెరిల్లాపోరులో తెలంగాణ-భీమన్న
విల్లమ్ములయ్యావ తెలంగాణ

రాంజిగోండుతో కలిపి వెయ్యిమందిని తెచ్చి
ఉరులమర్రికి కట్టి ఉయ్యాలలూగిస్తె
ఊడల్లో వాళ్ళూగ తెలంగాణ-ఇంకింత
గట్టిపడ్డ చెట్టు తెలంగాణ

వెట్టిచాకిరి బతుకు ఆత్మగౌరవ ఘోషై
జాగీర్ల జామీన్ల ఆగడమంతుసూడ
ఆయుధం పట్టావె తెలంగాణ-కొమ్రన్న
త్యాగమే సూస్తుంటె తెలంగాణ

కొంగునడుముకి చుట్టి కొడవలి చేతబట్టి
విన్నూరు దేశ్‌ముఖ్ వెన్నుపూసలు కదల
ఉరికురుకి దూకినవె తెలంగాణ-ఐలమ్మ
సూపు పౌరుషంల తెలంగాణ

కుచ్చుటోపి అయితే నేను పెట్టనంటు
సమ్మెరాగంపాడి సర్కారునే దింపి
వెలివేస్తేబడినిండి తెలంగాణ-రంగన్న
నామంల గెలిచావె తెలంగాణ

నా తెలంగాణ కోటి రతనాల వీణంటు
తీగ తెంపి నువ్వే మంటలేసినవంటు
తిడుతుంటె దాశరధి తెలంగాణ-జైలు
గోడెక్కి ఆడినవె తెలంగాణ
-
కూలిన ఖిల్లాల బురుజుల్ల కమాన్ల
పారిపోయిన దొరల మూతపడిన గడిల
తలదాచుకున్నావె తెలంగాణ-మమ్ము
పొత్తిళ్ళ దాచావె తెలంగాణ

సర్కారు ఏలుబడి సావు తప్పించుకుని
సర్ధారు సైన్యంతో మాట నెగ్గించుకుని
మమ్ము కన్నవె తల్లి తెలంగాణ
మళ్ళ జన్మనిచ్చినవమ్మ తెలంగాణ

పుట్టిన ఘడియల్నె ఎట్ల సాదుతవంటు
పురిటిబిడ్డ నోట్ల గింజేయసూస్తుంటే
పనికిజేరినవమ్మ తెలంగాణ
దొరలపాత బాధలు మరిచి తెలంగాణ

చిందిన నెత్తురు చనుబాలుగాదాపి
రాలిన ప్రాణాల్ని గోరుముద్దలుబెట్టి
మమ్ము సాదినవమ్మ తెలంగాణ-గుండె
కెత్తుకుని సాకవె తెలంగాణ

ఒరిగిన అమరుల వీరగాధలు జెప్పి
విప్లవాలని అల్లి జోలపాటగ పాడి
నిదురపుచ్చినవమ్మ తెలంగాణ-మమ్ము
ఎండిపోయిన ఒడిల తెలంగాణ

పోరాటాల భాష మాటలే పలికించి
ఉద్యమం పలకపై అక్షరం దిద్దించి
పెత్తందార్లను తన్న తెలంగాణ-మమ్ము
పెంచినవమ్మ తెలంగాణ

కొండగాలిపాట వాగువంకల ఆట
గువ్వపిట్టలకూత గంజిగడక మేత
మాకు తెలిపినవమ్మ తెలంగాన-మా
మనసు నింపినవమ్మ తెలంగాణ
-

తెలీవిలేనోళ్ళమని సదువురానోళ్ళమని
మదరాసు బొంబాయి మనుషుల్ని పట్కొచ్చి
మనల అడుగునతోస్తె తెలంగాణ-ముల్కి
ముల్లువైగుచ్చినవ్ తెలంగాణ

కుడినుండి ఎడమకి రాసెటోడెందుకని
కొలువుల్ని సదువుల్ని కాలరాసేస్తుంటె
సిటీ కాలేజిలో తెలంగాణ-లేత
సిగురోలే పూసినవ్ తెలంగాణ

మన ఇంట్ల కుర్చేసి మనల నౌకర్‌జేసి
సాంబారు ఇడ్లీలు జొన్నరొట్టెలమేస్తే
చెయ్యి పిడికిలి బిగిసి తెలంగాణ
చెంప దెబ్బల్ల కలిసినవె తెలంగాణ

పెద్ద మనుషులుజేరి పద్దుపత్రం రాసి
కనికట్టునేజేసి తాకట్టు నినుపెడితె
పయ్య పద్దతికింద కింద తలంగాణ
నలిగిపోయిన చెయ్యి తెలంగాణ




ఢిల్లినుండి వచ్చి పెళ్ళి నాటకమాడి
అంచుల్ని చెరిపేసి ఉంచుకొమ్మన్నారు.
ఉమ్మడి రాష్ట్రమని తెలంగాణ-నిన్ను
అమ్ముకుని ఉరికిండ్రు తెలంగాణ

భాషపేరుజెప్పి పక్క ప్రాంతం కలిపి
అంధకారముదెచ్చి ఆంధ్రదేశమనిరి
కొత్త పేరు మొలిచె తెలంగాణ-నిన్ను
వేరు పురుగై తొలిచె తెలంగాణ

వాడొకడు వీడొకడు దేహి అంటు వస్తె
వాడవాడలు రాసి వాళ్ళకిచ్చినావు.
మనసున్న తల్లివే తెలంగాణ-నువ్వు
దయ ఉన్న మన్నువే తెలంగాణ

దేహి అంటు వచ్చి దేహమంతా పొడిచి
ఆంధ్ర సర్కరోడు ఆర్డర్లు వేస్తుంటే
కుత్తుకను తొక్కంగా తెలంగాణ-నువ్వు
ఎత్తుకున్న బోనం తెలంగాణ
-
వ్యవసాయమన్నారు-భూములే కొన్నారు
చీమల పుట్టల్ల పాములైపోయిండ్రు
వలసవాదులు వచ్చి తెలంగాణ-వాళ్ళె
విషనాగులయ్యిండ్రు తెలంగాణ

ముల్కిరూల్సుని వాళ్ళు మూసిల ముంచిండ్రు
గెలిచిన తీర్పుని మలిపేసి నవ్విండ్రు
ఫ్రీజోను చేసిండ్రు తెలంగాణ-వాళ్ళు
ప్రేతాల మించిండ్రు తెలంగాణ

ఇరవయ్యొక్కటి వస్తె హింది పాసన్నారు
ఇష్టమొచ్చినట్టు రాజ్యాంగం మార్చిండ్రు
దొరల రాజ్యంబోయి తెలంగాణ-యీడ
దొంగపాలన వచ్చె తెలంగాణ

వలసవాదులుమారి విషవాదమే నూరి
కొలువుల్ని భూముల్ని కొల్లగొడుతు ఉంటె
మండిపోయినదాన తెలంగాణ-గుండె
మంటలారనిదాన తెలంగాణ

పోరపొమ్మంటుంటే పాతుకునిపోయిండ్రు
రాజధాని మొత్తం మా రాజ్యమన్నారు
పాతబడ్డామంటు తెలంగాణ-నిన్ను
పాతరెబెట్టిండ్రు తెలంగాణ

పన్నెండేండ్లు ఉండి ఇల్లు మాదన్నారు
ప్రశ్నిస్తె పోలీసు బలగాల దింపిండ్రు
పసిపిల్లలను సంపి తెలంగాణ-తెల్లోల్లె
నయ్యమనిపించిండు తెలంగాణ.

ముల్లెమూట సర్ధి ఎల్లిపోరా అంటె
మూన్నూట డెబ్బై ప్రాణాలు తీసిండ్రు
మనుషులకి సావుంది తెలంగాణ-వాళ్ళ
త్యాగం సావులేంది తెలంగాణ

సీమాంధ్రులమని మరిచి సిగ్గుశరమొదిలేసి
ముఖ్యమంత్రి కూడ మావోడె అన్నారు.
సింహాసనమే ఎక్క తెలంగాణ-నక్క
సింహంగాదు తెలంగాణ
-
ప్రజాసమితిపెట్టి పదిజిల్లలు తిరిగి
పార్లమెంటు సీట్లు పన్నెండు గెలిచిండు
పదవి ఎరకి చిక్కి తెలంగాణ-ఒకడు
పారిపోయిండమ్మ తెలంగాణ

పార్టీని కాంగ్రెస్‌ల పరువుని గోదాట్ల
కలిపి కనపడకుండ ఢిల్లీకిపోయిండు.
తల్లి తాళిబొట్టు తెలంగాణ-వాడు
తాకట్టుబెట్టిండు తెలంగాణ

కుటిల కుతంత్రాల మనలేని పిల్లల
ఒళ్ళు బాధలుజూసి తల్లడిల్లిపోయి
తండ్లాడినావమ్మ తెలంగాణ-కాళన్న
గొడవ గోడు నువ్వు తెలంగాణ

తెలుగంటె మాదంటు తెలివంతజూపిస్తె
పుంటికూరని ఆంధ్రమాతంటు పూజిస్తె
యాస బదనామైతే తెలంగాణ-యశోద
కధలబూసిన పువ్వు తెలంగాణ
-
యాస బొందలబెట్టి భాష మాదన్నారు
భోగంమేళా ఆట యోగమని అన్నారు.
తమ్ముని లెక్కజూస్తె తెలంగాణ-వాళ్ళు
ఆస్తి పంచమండ్రు తెలంగాణ

సంప్రదాయం మాది నేర్చుకొమ్మన్నారు
అమ్మతమ్ముని కూడ చేసుకోమన్నారు
పీర్ల నెత్తినెక్కి తెలంగాణ-జోడు
సవ్వారిజేసిండ్రు తెలంగాణ

హైద్రబాదు మేమె కట్టినామంటారు
చార్మినారు ప్లాను గీసినమంటారు
మోచేతుల బతికి తెలంగాణ-వాళ్ళు
మొకము నాదంటారె తెలంగాణ

అడిగి వచ్చినోళ్ళు అభివృద్ది మాదంటు
మురికంత మూసీల కలిసేలజేసిండ్రు.
కాళ్ళు మొక్కెటోడు తెలంగాణ-వాడె
కాళ్ళొత్తమంటడె తెలంగాణ
-
గోదావరి క్రిష్ణ పరవళ్ళు తొక్కిన
పంటచేనుకి నీటి సుక్క దిక్కులేదు.
నోరు తెరిచిన బీడు తెలంగాణ-నువ్వు
నల్ల రేగడి గోడు తెలంగాణ

సుక్కనీరులేక డొక్కలెండుతుంటే
సర్కారు నిధులల్ల టక్కరిచ్చె నీకు
నిండిపోయిన కరువు తెలంగాణ-నువ్వు
ఎండిపోయిన చెరువు తెలంగాణ

మానేరు మంజీర పొంగి పొరలవేంది
కిన్నెరసాని వన్నె కులుకుయేమయ్యింది
ముచికుంద యేమైంది తెలంగాణ
అది మూసి ఎందుకైంది తెలంగాణ

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టేడబాయె
సాగర్ల నీళ్ళని ఎవని పంటకిబాయె
పుట్టగతిలేనోళ్ళు తెలంగాణ-నిన్ను
పుట్టి ముంచిండ్రమ్మ తెలంగాణ

ఇచ్చంపల్లి మర్చి పోలవరమని ఒకడు
బాబ్లి కట్టి ఒకడు ఆల్మట్టి అని ఒకడు
పొరుగు రాష్ట్రపోడు తెలంగాణ-నోట్లె
మట్టి కొట్టినాడు తెలంగాణ

తుంగభద్ర కృష్ణ కళ్ళముందే ఉన్న
పాలమూరిపొలము వలస ఎందుకుబాయె
నీటిమీది లెక్క తెలంగాణ-నిన్ను
తుంగలో తొక్కింది తెలంగాణ

సిరిసిల్ల గద్వాల చేనేత యేమాయె
ఇందూరు మగ్గాలు బొంబయెందుకుబాయె
ఆప్కో అంటె అర్ధ అర్ధం తెలంగాణ-సాబ్కో
అయిపోయిందె తెలంగాణ

ఆరుగాలంజేసి పంట తీసేటోడు
బాయిల్ల పనిజేయ దుబాయి పోయిండు
ఎంత కష్టమొచ్చె తెలంగాణ-అంత
నష్టమెవడు తెచ్చె తెలంగాణ
-
ఎగురుతు ఆడేటి ఎర్రజెండేమైంది
దున్నెటోందె భూమి అన్న అన్నలేరి
చర్చలకు పోయిండ్రు తెలంగాణ-వాళ్ళు
సుక్కల్లోజేరిండ్రు తెలంగాణ

ఆంధ్రోడిపాలన అంధకారములోన
సుక్కల్లో అన్నలు దిక్కుల్లో అరుపులు
కుక్కలా పెత్తనం తెలంగాణ-నిన్ను
చిక్కుల్లో తోసెన తెలంగాణ

సూరుకు తలతగిలి రకతంకారుతుంటే
పాపాల చీకట్ల ఉద్యమ దీపంబెట్టి
తచ్చాడినవె తల్లి తెలంగాణ
సొంత తనయులని ముద్దాడ తెలంగాణ

సక్కనైన గుణము నిన్ను ఇడవకపాయె
దిక్కులేని యాల సావన్నరాదాయె
సూరీడు పొడవంగ తెలంగాణ-పొద్దు
ఎరుపులో తేలావె తెలంగాణ
-
ప్రకటించినానంటు పత్రికల మీదెక్కి
పదిరోజులకె ఒకడు మాట మార్చేసిండు
పెట్టుబడి దయ్యాన్ని తెలంగాణ-నువ్వు
మట్టుబెట్టవె తల్లి తెలంగాణ

శ్రీకృష్ణుడిపేర కుట్రజేసిండొకడు
పాండవులనిడిచేసి కౌరవులజేరిండు
ఆత్మగౌరవమంటె తెలంగాణ-అది
నాకు తెల్వదండు తెలంగాణ

మా అన్న ఒకని న్యాయమడగబోతె
రాయలతెలంగాణ రావొచ్చునన్నాడు
మతములేనిదాన తెలంగాణ-మమ్ము
సీమలో కలపొద్దు తెలంగాణ

తెలంగాణ నా ధ్యేయమన్నాడొకడు
తీరజూస్తెవాడె సమైఖ్యాండ్రన్నాడు
స్వార్ధపరులజూసి తెలంగాణ-నువ్వు
సావునెతకొద్దమ్మ తెలంగాణ

సామాజికమని ఒకడు సంకలె గుద్దిండు
విశాలాంధ్ర నేడు ఇంపుగుందంటాడు
విలువలేని మాట తెలంగాణ-నువ్వు
బలి అయ్యిపోవద్దె తెలంగాన

సెంటిమెంటుని మేము గౌరవిస్తామంటు
మాట మార్చినోడు జైళ్ళు తిరగబట్టె
తప్పుజేసినోడు తెలంగాణ-శిక్ష
అనుభవిస్తాడమ్మ తెలంగాణ

రబ్బరు బుల్లెట్లు రక్కసి నృత్యాలు
ఎదురుమాట్లాడితె ఎస్మాలు గిస్మాలు
లాఠీ దెబ్బలు తగిలి తెలంగాణ
నీ తోలంత కమిలింది తెలంగాణ

రెండుకళ్ళని ఒకడు రెండు నాలకలోడు
యీడ్నెపుట్టిన అనే హిట్లరు ఇంకొకడు
మోకాలు అడ్డేస్తె తెలంగాణ-వాని
కాళ్ళు ఇరగగొట్టు తెలంగాణ
-
సిగ్గుశరములేని బద్మాశిరాజ్యంల
ఎనిమిదొందలమని బలిదానమయ్యిండ్రు.
రాజకీయములోన తెలంగాణ-నీ
రక్తమె మరిగింది తెలంగాణ

ఒక్క పుట్టుకలోనె ఇంకెన్ని యాతనలు
మొక్కవోని దీక్షకెన్ని ఆటంకాలు
కాలిపోయిన బతుకు తెలంగాణ-నువ్వు
సావులేని ఆత్మ తెలంగాణ

ఉరికొయ్య తాళ్ళల్ల ఊగేటి కాళ్ళల్ల
సల్ఫాను డబ్బాల్ని మోసే చేతుల్లల్ల
పాణంల పాణమై తెలంగాణ-నువ్వు
వదిలిపోవద్దమ్మ తెలంగాణ

బీడు భూముల్లోని కోతకడుపుతోటి
ఇంకిపోయిన కాల్వ నీళ్ళ ఈపుతోటి
అట్లనే ఆగుండు తెలంగాణ-నీకు
అమృతం తెస్తున్న తెలంగాణ

అమరవీరుల స్థూపం చిట్టచివరంచులో
యెలిగేటి సుక్కల దారిలో అడుగేసి
ఇదిగిదిగో వస్తున్న తెలంగాణ
ఇంక ఏడ్వకె తల్లి తెలంగాణ

అస్సైదుల అంటు ఆటలాడుకోని
పెట్రోలు మంటల్తో తానమెపోసుకుని
నిన్ను చేరుతనమ్మ తెలంగాణ-నీ
కన్నీరు తుడిచేస్త తెలంగాణ

చేనేత మగ్గంల బట్టలే నేసుకొని
సెజ్జుభూములకాడ దర్జాగ యేసుకుని
అలయ్‌బలయ్ అంటు తెలంగాణ-తల్లి
అందర్ని కలుస్తా తెలంగాణ

తూటాలకెదురేగె ఆటలె చూపించి
బూట్ల కవాతులకి జోడురాగం పాడి
మురిపిస్తనె తల్లి తెలంగాణ-నీకు
ముద్దుబెడతానమ్మ తెలంగాణ

నాగేటి సాళ్ళల్ల నవ్వేటి బతుకుల్ల
పనిచేసెరెక్కల్ల పల్లె పాటల్లల్ల
నీతోటె నేనుంట తెలంగాణ-నిన్ను
వదిలిపోలేనమ్మ తెలంగాణ

బూరుగు చెట్లల్ల బుర్కపిట్టల్లల్ల
తంగేడు పువ్వుల్ల అడవి ఆకుల్లల్ల
కలిసిపోతానమ్మ తెలంగాణ-నిన్ను
కావలించుకుంట తెలంగాణ

తల్లిపాలుదాగి రొమ్ముగుద్దేటోల్లు
సందుల్లల్లదాగి మొకము చాటేసిండ్రు
డప్పుసప్పుడుజేసి తెలంగాణ-వాళ్ళ
ముప్పుతిప్పలుబెడత తెలంగాణ

కేంద్రమే కదిలేట్టు ఢిల్లి ఊగేటట్టు
అన్నదమ్ముల వెతలు జల్ది తీరేటట్టు
పొరుజాతరలోన తెలంగాణ-నేను
పొలికేకబెడ్తానె తెలంగాణ

రాళ్ళుపోగు చేసి ఆయుధాలుగ దాచి
అడ్డమొచ్చెటోని అంతునేసూడంగ
అడుగేసి కదులుతా తెలంగాణ
పిడుగల్లె దుంకుతా తెలంగాణ

పూలు తెంపుకోని గుండెకద్దుకోని
అమరుల త్యాగాల్ని కళ్ళల్ల నింపుకొని
ఉరికేటి సూపుతో తెలంగాణ-నేను
ఉద్యమాన్నవుతానె తెలంగాణ

గునుగు పువ్వుల్లోంచి గుండెమలుపుల్లోంచి
ఎండిపోయిన చెలక ఎరుపు చెక్కిట్లోంచి
ఎదురువస్తానమ్మ తెలంగాణ-నేను
వెలుగు సూరున్నవుత తెలంగాణ

జబ్బకు సంచేసి దబ్బుదబ్బున కదిలి
చేతిలో జెండతో నినదించె గొంతుతో
సాగరహారమై తెలంగాన-
హారతే నీకిస్త తెలంగాణ

28-09-12

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

నందకిషోర్ ||పునర్విమర్శ అభ్యాసం-4||


మరి-
ప్రేమసంగతో బుల్‌బుల్?
అదెందుకు దాస్తావ్?

పక్షిలా పాడగలిగినందుకు
పాడుతూ అరవగలిగినందుకు
ప్రేమించబడ్తావ్.

పువ్వుల్ని ఊహించనందుకు
వెన్నెల్ని మోహించనందుకు
ప్రేమించబడ్తావ్.

పొద్దుటి అడవిపిట్ట మొదలు
రాతిరి పెద్దపిట్టదాక
-నువ్వు ప్రేమించబడని
క్షణమంటూ ఉండదు

మాపటి కొంగలు మొదలు
చీకటి చకోరంవరకి
-మాట్లాడుకోని
సమయాలూ ఉండవు.

ఎందుకని ఎన్నడూ ఆలోచించవ్.
చెప్పేంత పిచ్చితనం దానికీ ఉండదు.
కొన్నిరోజులు బాగానే గడుస్తాయ్.
భారంగా మరికొన్ని-

ఎటెల్లేది, ఎందుకనేది
ఆలోచించని మత్తులో
పూలగాలికి తేలిపోతు
ఇంకొన్ని..

***

అప్పటివరకి అంతా మంచే-
అనుకోకుండ ఏదో చిక్కొచ్చి పడుతుంది.

ఋతువెలా మారేది తెలీదు!

ఎన్నోరోజుల ఏకాంతాన్ని
కాలరాసిన నీకు
శిక్షపడే కాలమొకటిరానేవస్తుంది.

వసంతపుకోయిల,వర్షపు చక్రవాకం
నీ గుండెలమీదుగా ఎగిరెళ్ళిపోతాయ్.
వగపు కోరికలు,వయసు నెమళ్ళు
దేహంనిండా పురివిప్పుతాయ్.

పూలగాలికి తేలిపోయిన నువ్వు
ఒక్కసారిగా- నేలకూలుతావ్.
వెన్నెల సిద్దాంతాలు రాసిపోసిన నువ్వు
చీకటి చివరంచుకి విసిరేయబడ్తావ్.

పొద్దుతిరుగుళ్ళ ప్రేమ
ఇదంతా పట్టనట్టే కనిపిస్తుంది.
కానీ,కాలానుగుణంగా చలించడం
దానికీ తప్పదని తెలుసు నీకు!

***

తర్వాతేమవుతుందో తెలుసుగా?

పక్కనే ఉండలేనందుకు
గూటిలో జాగలేనందుకు
ద్వేషించబడ్తావ్.

పువ్వుల్ని తెంపనందుకు,
వెన్నెల్ని తాకనందుకు,
ద్వేషించబడ్తావ్.

ఉన్నొక్క యవ్వనం తీరకముందే
తేలిగ్గా నీ కధ
చివరి మలుపు తిరుగుతుంది.

రెక్క పొడుగనో,ముక్కు పదుననో
కాళ్ళు కదల్లేదనో,గోర్లు పెరగలేదనో
కారణాలేవైతేనేం?

నువ్వు ద్వేషించబడ్తావ్.
నిర్ధయగా వెలివేయబడ్తావ్.

కధ ముగిసిపోతుంది!

***

బుల్‌బుల్-ఆగిపోకు..
విను..
కధలో చివరి సందేశాలు
విచిత్రంగా ఉంటాయ్.

మూడు కాలాల్ని విరిచి,
మూడు చావులకి ముద్దుపెట్టి,
మూడుముళ్ళు వద్దని,
ముసుగేసి పడుకున్న నిన్ను-

పాలపిట్ట రంగనీ,జిట్టంగి చూపనీ,
వడ్రంగి పట్టనీ,నిద్రలేపిన తను-

పగల్ని,రాత్రిని
వెన్నెల్ని,చీకటిని
నిర్లిప్తంగా నిర్ధారించి
నిశ్శేషంగా విభాగించి

వెన్నెల రహస్యం వెన్నెలకి,
చీకటి రహస్యం చీకటికి,
నిశ్శబ్ధంగా,నిజాయితీగా
నిష్కామంగా పంచమంటుంది.

ఇంకా..

నీరెండకు దాగిపోవడం పిరికితనమని
నిప్పులగాలికి ఎదురుపోవడం మగతనమని

చిరుజల్లుతో సర్దుకుంటే పాపమని
జడివానకి తడిసిపోవడం మోక్షమని

చలిగాలికి వణికిపోతే ఓటమని
చచ్చైనా గడ్డకట్టడం గెలుపని
నేర్చుకొమ్మంటుంది.

ఇంకా ఇంకా-

ఏం కావాలి నీకు?
గూడుకట్టే తెలివిలేక పదేపదే
ఎగిరిపోయే నీకు?
మోసపోయే నీ బతుక్కి?

అనుభవించు!

31, ఆగస్టు 2012, శుక్రవారం

నందకిషోర్||ఖబడ్దార్||


అన్నా! మాఫ్జెయ్.
నువ్వు సదివినంత మేం సదవలే.
నీకెర్కినంత మాకెర్కలె.

ఇగ్రహాలిరగ్గొడ్తం
అద్దాల్ పగలగొడ్తం
బస్సుల్ తగలబెడ్తం
నీ బాంచన్..

ఎంతజేసి గద్దె మీద
యేడిబుట్టకపోతే
బతుకుల్ భి అంటుబెట్టుకుంటం!
బాధల్ని తల్సుకుంటనె సస్తం!

ఎంత దుక్కం మా జిందగీల..
ఇంట్ల కూసుండి లైవ్ సూసెటోల్లం కాదైతిమి.
కెమెరాల మొకంబెట్టి తీసెటోళ్ళం కాదైతిమి.
సచ్చేందుకన్న భయపడే
లౌక్యం అసలేలేని దునియా..

ఉద్యమం జిందాబాద్ అనాల్నాయె.
ఉపాసం దీక్షల పండాల్నాయె.
ఎవ్వడో ఒకడొచ్చి యేల్బెట్టిపోతె
లాఠీని,తూటాని సూడాల్నాయె.

ఉరికిచ్చి కొడతాంటె ఉర్కాల్నాయె
రకతంగార్తుంటె అరవాల్నాయె
ఎందుక్కొడ్తండ్రో ఏమన్న ఒక ముక్క
సదువులో ఎక్కడా రాయకపాయె.

బాంచెత్!
మనసులిర్గితె పట్టనోళ్ళకి భి
ఇగ్రహమిర్గితే
నిగ్రహం దెంకపోతది.

గుండెల్పగిలితే సూడని సంత
అద్దాల్ పగిల్తే
యుద్దాల్జేస్తది.

బాంచెత్!
బస్సు విల్వలేదు మా బతుకులకి.
దేహాలకన్నా లోహాలె నయం.
తగలబడ్డంకన్న-
నష్టమెంతో జెప్తరు!

అన్నా! ఏం జేస్తం మేం?
ఊపిరుండి మొసతీయనోళ్ళం.
ఒక్కరోజుల్నే ఫలితం రాదని తెల్సీ
కొట్లాడి కొట్లాడి అలసిపోతం.

అన్నా! ఏం జేస్తం మేం?
ఉన్నొక్క ఆశా వదల్నోళ్ళం.
ఉబుసుపోకెవడన్న అవసరమెలేదంటే
చెప్పుల్ని మెడకేసి చెప్పేశి వొస్తం.

అన్నా!ఏం జేస్తం మేం?
ఉద్యమాన్ని ప్రాణమనుకున్నోల్లం.
ఉత్తుత్తిగ అని ఎవడన్న అంటే
ఉరుక్కుంటబోయి రైళ్ళకు గుద్దుకుంటం.

అన్నా! ఏం జేస్తం మేం?
ఊరు సస్తాందని తెల్సినోళ్ళం.
ఊర్కెనే పోరగాండ్లు అరుస్తుండ్రంటే
ఉరికొయ్యలమీద పాటలై యేలాడ్తం.

అన్నా!నీ లెక్కల్ మాక్ తెల్వయ్.
గాంధీతోటే భగత్‌సింగ్‌ని సదివినం.
నక్సలైట్లు గిదేపనిచేస్తే
ఏమంకితం జేసినవో అడగం.

అన్నా!నీ లెక్కల్ మాక్‌దెల్వయ్.
నీ దోస్తొకడు సస్తే గోదార్ని లంజన్నవ్.
అది మా అమ్మ.
బలిదానమయ్యెటోళ్ళు మా తమ్ముండ్లనుకున్నం.
వందలమందిసస్తే కోపమెంతొస్తదో
నీకసలే తెలవదని అనుకోలేం..

అన్నా!బరాబర్ ప్రజాధనమే..
కాదన!
ఏడ్వందల ఎనభైని ఎంతబెట్టి గుణిస్తవో చెప్పు.
మిగిలిన పైసల్
మా రక్తమమ్మి తెచ్చిస్తం.

అన్నా! మళ్ళొకసారిజెప్తున్న..
కత్తుల మీద కవాతుజేస్తున్నోళ్ళం.
ఖబడ్దార్..!
విధ్యార్ధులం-
విషపు గొంతుకల్ని తొక్కనీకి
ఏ సదువు అక్కర్లేనోళ్ళం.

అన్నా!నీకిష్టమొచ్చింది రాస్కో.
మమ్మల్ని మాత్రం బద్నాంజెయ్యకు.
బస్సంటే మాకు ఇష్టమే..
సచ్చిన మా తమ్ముడంటే శానా!

28, ఆగస్టు 2012, మంగళవారం

నందకిషోర్||పునర్విమర్శ అభ్యాసం-1||

గద్దలు ఆకాశం తమదంటూ
చక్కర్లుకొడ్తాయ్.
పాములు పుట్టల్లోంచి,గుట్టల్లోంచి
పైకిపాకుతాయ్.

నిజాయితీలేని ఆసరా ఏదో
మినుక్కుమనే గాలిలో మెరుస్తుంటుంది.
సంజాయిషీ కోరని అభిమానమంతా
చురుక్కుమనే నీడలో తడుస్తుంటుంది.

శిశిరాన్ని గెలిచిన పిచ్చిలో,వెర్రిలో
చెట్టుకి ఏమి పట్టకపోవచ్చు.
వసంతం చూడని కోయిలలగొంతులో
రాగం ఏది పుట్టకపోవచ్చు.

వాలే పక్షులకి ఏ చెట్టైనా ఒకటే-
గూడు కడ్తే గుండె పగిలిపోతుంది.
గాలివానొకటి గట్టిగా వీస్తే
నిజం నిక్కచ్చిగా తెలిసిపోతుంది.

ఏదైతేనేం?
ఋతువొకటి మారింది.
ప్రకృతికి,నీకు
పనికొస్తుంది.

ఎలాగైతేనేం?
ఋజువేదో దొరికింది.
వాగుకో,వలసకో
పొమ్మంటోంది.

విషాదాన్ని మింగి మూగబోయిన నీకు
పగిలిన కన్నుల్తో ప్రాణంపోయిన నీకు
మరో అకాలాన్ని కలవలేని నీకు
మరో ప్రపంచాన్ని చూడలేని నీకు

సాయం సాయంత్రమై కరిగేపూట
ఎందుకొచ్చిన వేదాంతం బుల్‌బుల్?
నిజం.. నీకెవరూ లేరు!
నీ రెక్క నువ్వే కట్టుకోవాలె.
నీలాగే నువ్వు ఎగిరిపోవాలె.

ఏం జరిగిందో,ఏం మారిందో ఆలోచిస్తూ,
ఎటెల్లావో,ఎలా చిక్కుబడ్డావో పరిశోధిస్తూ,
ఏం దాచావో,ఏం కోల్పోయావో లెక్కలువేస్తూ,
ఎక్కడికి పోవాలో,ఎలా తెంపుకోవాలో పత్రంరాస్తూ,

కాలం నిర్దయగా వెక్కిరించేవేళ
ఎవరిచ్చిన ఏకాంతం బుల్‌బుల్?
నిజం..నీకెవరు లేరు!
నీ గింజ నువ్వే సంపాయించాలె.
నీ బతుకు నువ్వే బతికిసూపాలె.

Date 28.08.12

26, ఆగస్టు 2012, ఆదివారం

నందకిషోర్ || పునర్విమర్శ అభ్యాసం-3 ||


కొన్ని స్నేహాలూ అంతే!

రెక్కలొచ్చాయని తెలిసేలోపే

ఆకాశాలవైపు ఎగరేసుకుపోతాయ్.
గూడు కట్టాలని గుర్తొచ్చేలోపు
కనపడని గుర్తేదో ముద్రించిపోతాయ్.

మొదట- ఎందుకో అడగొద్దంటూ
కొండకోనలు,వాగువంకలు తిప్పుకొస్తాయ్.
ఏ పనీ లేనందుకు
నువ్వు మౌనంగా వెళ్ళిపోవాలి.

ఆపై- ఎవరికీ చెప్పొద్దంటూ
రెక్కలెలా విప్పుకోవాలో,పూలనెలా గుర్తుపట్టాలో నేర్పిస్తాయ్.
ఏ తెలివీ లేనందుకు
నువ్వు సడిచేయకుండా అనుసరించాలి.

పచ్చని చెట్ల రంగుని,దూరపు కొండల ఎత్తుని,
పూసేపూల అందాన్ని,అవి చెప్తేనే తెలుసుకోవాలి.
వాలుగా కురిసేది వాననీ,వాగులో పారేది నీరనీ,
వచ్చిపోయేది గాలనీ,నేర్పగా నేర్చుకోవాలి.

చెట్టుకాస్తే పండ్లు పైనే ఉండాలనీ
చేనుపండితే గింజలు కిందే రాలాలనీ కోరుకోవాలి.
ఆకురాలేముందు వసంతాలకీ
పూతరాలేముందు పూర్వాహ్నాలకీ వలసపోవాలి.

పొద్దుటి పూట వెలుగనీ,సాయంకాలం చీకటనీ
ఎండపూట తిరగొద్దనీ,ఎన్నెల పూట పాడొద్దనీ
నీరు తాగాలనీ, గాలి పీల్చాలనీ,
పువ్వు రాలినట్టు ప్రాణం రాల్చాలనీ,

దేవుడా!
ఆ ఉపదేశాలకి అడ్డూ,అదుపూ ఉండదు.
ఆ నేర్పు ఎన్నటికీ చదవాలనిపించదు.

చివరగా-వచ్చే అజ్ఞానమేమంటే
వయసుతో అనుభవం రాదనీ,
అనుభవిస్తే బతుకు సరిపోదనీ,
నీ బతుకు నువ్వే బతకాలనీ!
నీలాగే నువ్వు చావాలనీ!

ఇంకా బతికే ఉన్నావా?
ఉంటే -ఏమంటావు బుల్‌బుల్?!

24, ఆగస్టు 2012, శుక్రవారం

నంద కిశోర్ ||పునర్విమర్శ అభ్యాసం-2||

కొన్ని పరిచయాలంతే!
ఊహాలోకూడా తెలియని రెక్కల్నికట్టి
రివ్వున వీచేగాలిలో
ఒక్కసారిగా ఎగరేస్తాయ్..

తేరుకుని కిందపడ్డావో
సరేసరి!
దేహం విరిగినా
ప్రాణం మిగిలించుకోవచ్చు.

సరదాగానో,సంతోషంగానో
కదలడం మొదలెట్టావో-
అంతే!
నీ ప్రయాణం,ప్రయాస
రెండూ మొదలవుతాయి.

ఆకాశం ఎప్పటికీ అందదు.
నేలమీదే జీవితం సాగదు.
గాలొచ్చిన,వానొచ్చినా భయపడాలి.
గద్దొచ్చినా,పామొచ్చినా దాక్కోవాలి.

కొమ్మపైన గూడు కడ్తే చెట్టుకి,
యేటిలో నీళ్ళు తాగితే కొండకి,
గింజలు ఏరుకుంటే చేనుకి,
ఈకలు రాల్చుకుంటే గాలికి,
సమాధానం చెప్పి తీరాలి!

ఎగరడం తప్ప ఏమితెలీదన్నా,
ఎగరడం నీ తప్పనిసరి అవసరమైనా,
ఎగరకపోతే బతుకేలేదని తెలిసినా,
సమాధానం చెప్పితీరాలి.

పూవులభాషలో మాట్లాడడం
గువ్వలభాషలో పాడుకోవడం
పిల్లలభాషలో పదాలల్లడం కాదు.
మనుషులభాషలో నటించడమూ నేర్చుకోవాలి.

ఎందుకూ పనికిరాని స్వేచ్చతో,
ఎటో ఓ దిక్కుకి ఏడ్చుకుంటూ,ఎగిరిపోతూ,
చెట్టుకి,చేనుకి,యేటికి,గాలికి
వీలైనా కాకున్నా వేగులకి,వేటగాళ్ళకి
సమాధానం చెప్పితీరాలి.

సమాధానం చెప్పేతీరాలి!

*23-08-2012

11, ఆగస్టు 2012, శనివారం

నంద కిశోర్ || సం-దేహం ||


నత్తల్ని,నావల్ని నడిపి
తీరానికి,దూరానికి తేడాలేదనీ
నవ్వుల్ని,నాణాల్ని తడిమి
ఈ రోజు,రేపు ఒకటికాదనీ

నదుల్ని,నాడుల్ని అడిగి
ఎంతపారినా ఎందుకో ఎండిపోతామనీ,
నక్షత్రాల్ని,నాగరికతల్ని చదివి
ఎంత వెలిగినా ఎప్పటికీ మిగల్లేమనీ

తమ్ముడు!ఒరేయ్!

సంపాదించిన జ్ఞానమంతా
ఎక్కడ పారేసుకున్నావ్?
ఏ మోహంతో, ఏ దేహంలో
తచ్చాడుతున్నావ్?

ప్రాణం ఇంకా మిగిలేఉన్నట్టు,
ప్రాప్తం ఏదో దొరుకునన్నట్టు,
కలల్తోటి,కధల్తోటి
కాలం జరుపుతూ

తమ్ముడు!ఒరేయ్!

ధమనులన్నీ మూసుకున్నాక,
తపనలన్నీ దారితప్పాక,
ఏ సిరలతో రక్తం తెస్తావ్?
ఏ సిరాతో కవితలు రాస్తావ్?



*10-08-2012

8, ఆగస్టు 2012, బుధవారం

నంద కిశోర్ || గమనం ||

కాలేగచ్చుపై కుంకుడు గింజలు గీకి
నాకు తెలీకుండా నువ్వు, చురుగ్గా అంటించినపుడూ-


పరికిపొదల్లో గుచ్చిన ముళ్ళని
నొప్పి తెలీకుండా నేను, సుతారంగ తీసినపుడూ-

ఎరుకే తెలీనంతగా ఎగురుకుంటుపోయి
పంటకాల్వలపై మనం పరుగెత్తినపుడు..

ఎర్రటిమధ్యాహ్నం మనం భూతద్దపుచేతుల్తో
రెండు పచ్చి అగ్గిపుల్లల్ని వెలిగింపజూసినపుడు..

కళ్ళకి తెలీని కాంతి భాషతో,
కాళ్ళకి తెలీని స్పర్శ భాషతో,
ఇద్దరం నిశ్శబ్ధంగా మాట్లాడుకున్నప్పుడు,
మాట్లాడ్తూ మరిచిపోయినప్పుడు,
మాట్లాడి మాట్లాడి కరిగిపోయినప్పుడు..

ఓహ్!
ఒక పసికాలం పరిసమాప్తమయ్యేలోపు
ఒక ఎండ మనల్ని పరిపూర్ణుల్ని చేసింది.

***
తెల్లటి మేఘాల పరిమితుల్ని దాటి
నీ హృదయాలు నాపై వర్షించినపుడూ-

కాగితప్పడవలో కదలకుండా కూర్చొని
ప్రవాహల్నిదాట నే ప్రయత్నించినపుడూ-

ముసురుపట్టిన రాత్రి, ముద్దులనిద్రలో
మురిసిపోతు నిన్ను కలగన్నపుడు..

కలగంటు,కవ్వించుకుంటు కౌగిళ్ళవాగులో
కనపడకుండానే మునిగిపోయినపుడు..

చేతులకి చెందని సంజ్ఞలసవ్వడితో,
చేతలకి అందని సందేశాలసంగీతంలో,
ఇద్దరం మధురంగా పాట పాడినపుడు,
పాడుతూ పరవశించినపుడు,
పాడి పాడి గొంతు మూగబోయినపుడు..

ఆహ్!
ఒక యవ్వనం పూర్తిగా తడపకముందే
ఒక వాన మనల్ని ఆకాశాల్ని చేసింది.

***

మంచు దారుల్లో అరచేతులు రుద్దుతు
వెచ్చటి జ్ఞాపకాలపై అడుగేసుకుంటూ-

చల్లటి శీతగాలికి దేహాల్ని అడ్డేస్తూ
మనల్ని మనంగా కాపాడుకుంటూ-

బాసలు,బాధ్యతలు లేని కొత్త లోకం ఒకటి
నాకోసం నువ్వు, నీకోసం నేను సృష్టించుకుంటూ..

మనసు హృదయం తెలియని మార్మికజ్ఞానంతో
మనల్ని మాత్రమే మిగుల్చుకుంటూ..

చరిత్రలడగని ఆలోచనల పరంపరలో,
గణితాలెరగని చీకటి మైదానాల్లో,
ఇద్దరం హాయిగా ఆడుకుంటూ,
ఆడుతూ అలసిపోతూ,
ఆడుతూ ఆడుతూ అంతమయిపోతూ..

__!
ఆశ్చర్యానికి పదాలు లేని చలిలో
ఈ జీవితం గుట్టుగా ముగించాలని ఉంది.

2, ఆగస్టు 2012, గురువారం

నందకిషోర్॥రాఖీ॥


హసన్‌పర్తి హాస్టల్లోంచి
పండక్కని పర్మిషనడిగి,
జీపుల్లల్ల ఆటోల్లల్లబడి
ఇంటిముందుదాక వచ్చి,

నేనొచ్చి లోపలికి తీస్కపోవాలని
కడపకాన్నే కూలబడ్డట్టు..
నీ కండ్లపొంట నీళ్ళు
బొటబొటా రాలుతున్నట్టు..

బట్టలుతుక్కొని ఎర్రగైన
లేత చేతుల్లల్ల కట్టెల్లసంచితో
నువ్వింకా అక్కన్నే
నిలుసున్నట్టు..

గనపడంగనే
ఉరుక్కుంట వచ్చి
కావలించుకుని
కండ్లు తుడుసుకున్నట్టు..

తెచ్చిన దారప్పోసల రాఖీకి
నీలెక్క నాలెక్క గుచ్చిపెట్టిన
రెండుపూసలూ..
మాయమయినట్టు,
మళ్ళీ తేలినట్టు..

ఏందోనే అక్కా!
రాత్రంతా ఒకటే మనాది!

***

రెండేండ్లు నువు రాలేనప్పుడు
చెల్లెనే రెండ్రెండు కట్టింది.
నువ్వు చెయ్యిపట్టుకునే తీరు
గదెప్పుడు నేర్శిందో తెల్వలే..

నాలుగేండ్లు నేను రానప్పుడైన
ఎట్లబడి నీ రాఖీ నాకుజేరేది.
పోస్టుల్నైనా పంపించి
కట్టుకొమ్మని పోన్‌జేసేదానివి..

***
సాగతోల్తాంటే
అమ్మ నా చేతిల
నీ చెయ్యిపెట్టినప్పుడో
నల్ల పూసలు గుచ్చినంక
కార్ల నిన్ను తీస్కపోయేటప్పుడో
నిమిషమన్నా
దుక్కించకపోతిని!

అందర్ని సూడబుద్దైతుందిరా అని
మొన్న మాట్లాడినప్పుడన్న
ఏడ్వకపోతిని!

నువ్వు మళ్ళా
పర్మిషనడిగి
కట్టెలసంచితో
ఇంటికాడ నాకోసం
ఎదురుసూస్తున్నట్టు

వెండి రాఖీ
రెండు దారప్పోసల మధ్య
ఇరుక్కున్నట్టు

ఏందోనే అక్కా!
పొద్దున్నే పిచ్చి కల!

***

ఏదేమైనా
నీకోటిజెప్పాల్నే..

గీ దినమన్నా
నీ యాదిల గడపకుంటే
యాడాదంత
గడ్వనట్టే ఉంటది.

అక్కా..నీ బాంచన్..
యేడున్న సల్లంగుండు.
 
*2.8.2012

15, జులై 2012, ఆదివారం

నంద కిశోర్ || ‎66G ||

అరె భాయ్!
చూసావా ఎపుడన్నా?
చౌమహల్లాలోని కత్తుల్ని,తుపాకుల్ని
అందానికే అతిశయమనిపించే
అలనాటి వైభవాల్ని,
అఫ్జల్‌మహల్లోని దీపాల్ని,సోఫాల్ని,
చెదరకుండా కూర్చున్న
నవాబుల జ్ఞాపకాల్ని..

భాయ్!
విన్నావా ఎపుడన్నా?
వింటేజ్‌కారుల్లోంచి మోగేటి హారన్‌ని,
అటుగ వెళ్ళే గాలి
మోసుకెళ్ళే సంగీతాన్ని,
రాణుల గుసగుసల్ని,రహస్య భాషల్ని,
ఎవరికి వినపడని సన్నటి ఏడుపుల్ని,
అందమైన కొలనులో
హంసల గానాన్ని..

చూస్తున్నావా నువ్వు?
హైకోర్టుని,ఉస్మానియాని,
సందేశాల్లేని పావురాల్ని,
పాతబడ్డ నయాపూల్ని,నాగరికతని
మురికినీళ్ళలో తేలి
ఊపిరాడని మూసీనీ,
తీరాన్ని మిగల్చకుండా
కొట్టుకుపోతున్న చరిత్రని..

వింటున్నావా ఎపుడన్నా?
రోగుల అరుపుల్ని,
న్యాయంలేని వాదనల్ని,
ఏడ్చే గడియారాల్ని,పాడని మసీదుల్ని,
సిటికాలేజిలో
తన్నుకున్న నినాదాల్ని,
ఫుట్పాత్ దుకాన్లో
ముసల్మాన్ గొంతుని..

ఆబిడ్స్ లో చెట్ల నీడలు
అసెంబ్లీకి వలసెళ్ళాయి.
నాంపల్లి విద్యాలయంల
సురవరంకి గిరాకి లేదు.
మెహదీపట్నం అంచులో
సగం భూమి సైన్యం తింది.
లంగర్‌హౌస్లో ఆగేదెవడు?
బ్యాచులరే అయ్యుంటాడు.

గోల్కొండలో ఉన్న రాళ్ళన్ని
కూలలేక కూలబడ్డయి.
రామదాసు బందికానలో
రాముడింక బయటకి రాలె.
సప్పట్లు కొట్టినవంటే
బూతులేవో ఇనబడుతున్నయ్.
కోటపైకి ఎక్కిసూస్తివో
నగరమంత పాతబడ్తది.

గిదంతా నీకెందుకులేగాని,
'అమాయకుడా'..
నీకు నచ్చేటి పాట పాడనా?
॥పట్నంలో శాలిబండ
పేరైనా గోలకొండ
సూపించు సూపునిండా
ఫిసల్ ఫిసల్ బండ
సూపించు సూపునిండా
ఫిసల్ ఫిసల్ బండ॥

(*66G గోల్కొండ నుండి శాలిబండ పోయే బస్సు నంబరు. ఈ రూటులో చార్మినారు తాకదు.)
*15-07-2012

12, జులై 2012, గురువారం

నంద కిశోర్ || గోడు ||

పోకెటోడు పోకకపోడు
గోకెటోడు గోకకపోడు
లైకినోడు లౌక్యుడు కాడు.
మెంటనోడు మెంటలుకాడు.
చూసుకుంటు చురుక్కుమంటు
దోచుకుంటు దూరంపోతూ
కనబడుతు వినబడుతూనే
కనుమరిగైపోవాలోయి.


మెచ్చుకోనివారేకాదోయ్
నొచ్చుకునేవారువుందురోయ్.
గోడంటే గోడేకాదోయ్
రంగసాని రంగుల మేడోయ్.!


తప్పురాస్తె కిమ్మునుండుట
రైటురైటు అంటు చెప్పుట
తప్పో రైటో తెలియని చర్చల
తప్పకుండా తలని దూర్చుట
ట్యాగుచేస్తే తీసివేయుట
మెసేజొస్తె చూడకుండుట
ఆఫులైన్ల లైనుకట్టుట
ఆనులైన్ల లైనువేయుట


తికమకలు మకతికలన్ని
చూచాయగ తెలిసుండాలోయ్
గోడంటే గోడే కాదోయ్
గోసాయిల బాలశిక్షరోయ్!


తెలవకుండ గ్రూపుల్లోకి
తెలిసితెలిసి ట్రూపుల్లోకి
పోతావో,పడిపోతావో
నీకైనా వివరము తెలియదు.
కనబడేది పుస్తకమనుకుని
కధలన్ని చదివేసావో
కళ్ళనిండ కంపరమొచ్చే
అవకాశము అసలే తప్పదు.


తెలివొక్కటి ఉంటే చాలదు.
తేరిపార చూస్తుండాలోయ్.
గోడంటే గోడేకాదోయ్
కనపడని కాలహంతకోయ్!


చాటులోన కనపడగానె
చాటుగ దాక్కునేటి కర్మము
మాటువేసి పోస్టుటచూసి
దాడిచేయు కనీస ధర్మము
థ్యాంక్యూలు,హౌవ్వార్యూలు
అచ్చోట ముగించే జ్ఞానము
కంప్లైంట్లు,కాంప్లిమెంట్లని
సమానముగ చూసే హృదయము


నెట్టొక్కటి ఉంటే చాలదు
నెట్టుకొచ్చె తెలివుండాలోయ్.
గోడంటే గోడే కాదోయ్
గొడవపడే చాన్సులుండునోయ్!
*12-07-2012

నందకిషోర్॥అల్విదా-2580॥


ముల్లోకాలని గెలవలేక
ఒక చేతకాని నువ్వు
అదృశ్యంగా,నిశ్శబ్ధంగా
రెండుగా చీలిపోతున్నట్టు

ఆరుకాలాల్లోను
నలుగురితో పోటిపడలేక,పడలేక
అయిదు ప్రాణాల్ని అర్ధిస్తూ
పోపొమ్మన్నట్టు

తొమ్మిది గ్రహాల్లోంచి
ఏడుపువినపడుతుంటే
ఎనిమిది దిక్కులోకి దీనంగా
ఎతికెతికి చూస్తున్నట్టు

ఇంకా?
ఏం మిగిలింది?
ఊ..దాచుకోకు..
చెప్పు..

బూడిదవు కాలేక,
నక్షత్రంగా వెలగలేక
గుట్టుగా శూన్యంలో కలిసిపోతున్నట్టు

అచ్చు ఇలాగే అనిపిస్తుందికదా?
నీక్కూడా?
నిజంగా?

రోజోసారి ఆవేశం నింపుకొని,
వినలేక వినిపించలేక అవస్థపడుతూ,
ఎటు తిరిగినా వెంటే నడిచే బాధతో
సందేశాలపై సవారీ చేస్తూ,

గుండె మోగినప్పుడల్ల కలుక్కుమనే
ఓ సాధారణ జీవితం నీదనీ,
ఓ మధ్య తరగతి మనిషివి నువ్వనీ,
విముక్తిలేని ప్రాణివనీ..

ష్..

క్షమించాలి.
మీరు డయలు చేస్తున్న నంబరు
ప్రస్తుతము అందుబాటులో లేదు
కాసేపాగాక కూడా దయచేసి
మరలా ప్రయత్నించవద్దు!
*11.7.2012

11, జులై 2012, బుధవారం

నందకిషోర్॥మనవి॥


కుడితే కుట్టావ్ పో!
మళ్ళీ ఎందుకు
ఇక్కడే తిరుగుతావ్?

నొప్పిలేదనో,
బాగున్నాననో

తప్పిరాలేదనో,
బాగున్నావనో

నేనెపుడైనా
అబద్దం చెప్పానా?

ఆలస్యం చేయకుండా పో!
నే రాలిపోవాలి.

పుప్పొడి దారుల్లో
మళ్ళీ కలుద్దాం..
సెలవు.


*10.7.2012