మా తాతల్ కాలం - బహు గడ్డు కాలమనే చెప్పాలి!
పెద్దింటోళ్ళమనే పేరేకాని అది.. అంటరాని జాతిని అంటరానోళ్ళు పెట్టినదె!
యెన్ని పాబందీలు - యెన్ని అడ్డంకులు
తలచుకుంటేనే - అగ్ర వర్ణాల మీద అసహ్యం వేస్తోంది.
ఈ బామ్మర్లికి యాగ హవిస్సుకై అర్పించిన గోమాంసం కోసం
మా మాదిగోళ్ళతో పోటీపడ్డప్పుడు తగిలిన పిడిగుద్దులు యాదిలేదనుకుంటాను!
బసివిగ, మాతంగిగా, పార్వతిగా చేసి దేవుడికి పెళ్ళిచేసి
అచ్చోసినట్లు ఊరుమ్మడిగ అనిభవించి,
సామూహికంగా దోచుకున్న రోజులు గుర్తున్నాయి!
ఇప్పుడు అప్రస్తుతమైన గతచరిత్రైనా,
గతితార్కిక సూత్రాలు దీనికి వర్తిస్తాయి!
మృతకళేబరాలను వూరికి దూరంగా లాక్కెళ్ళి, చర్మం వొలిచి
తొట్టెల్లో వూరేసి, పసుపు, ఉప్పుల్తో శుభ్రపరచి
ఎండకు ఆరేసి, ఘూటంతో చదునుచేసి
చెప్పులుగానో, మోటబావి బొక్కెనకు తొండంగనో,
సవారీబండికి చర్నాకోలగానో నగిషీగ అల్లిస్తే వాడుకున్నారు!
సాలుకు యీనాంగ కంబళీ, ఓ తూముడొడ్లు, కళ్ళంలో
పరిగలేరుకొని తృప్ఫి పడినవాళ్ళం !!
వేలుముద్ర వేసేవరకు పెత్తందార్ల చెప్పుచేతల్లో నలిగినవాళ్ళం /మెలిగిన వాళ్ళం!
వేట్టోళ్ళంకద్ద భూమి శిస్తు వస్సూళ్ళకు
ఎవరిమొత్తకెళ్ళినా పరువు తక్కువ అనుకొని వెన్నులో వనుకు పుట్టెది వారికి!
కాని...
మా అవసరాల్కి గడీలముందుకెళ్ళి దొరముందు చేచాచాలంటే మాకు వనుకుట్టేది.
అది వృత్తికి, ప్రవృత్తికి వున్న తేడా!
వారు మోయమన్నజెండాల్ను మోసి,
ఎదిరివాళ్ళతో దెబ్బలు తిని
రక్తాలు చిందించి పానాలిచ్చిన వాళ్ళం!
సారాచుక్కకు, మాంసం ముక్కకు కక్కుర్తిపడి కొన్నేళ్ళుగ బానిసలైనోళ్ళం!
ఓటును రూపాయి నోటుకు తాకట్టు పెట్టం కాబట్టె - యిన్నాళ్ళు మా బతికులిట్టా తగలడ్డయి!
మాల సోదరులు నేసిం పంచెలచాపులు తేరగా దొబ్బి కులకటమే కాని,
వారిని ఆదుకున్నదిలేదు, పైపెచ్చు కరివేపాకులా వాడుకొని విసిరేసిన రోజులు,
వారి దాష్టీకాలు, గృహదహన్నలు, మానభంగాలు అన్నీయిన్ని కావు!
ఎన్నో యాదికున్నయి.!
గుళ్ళోకిరానివ్వకుండా నియంత్రించిన కార్పణ్యం యింకాగుర్తుంది!
ఆ కొట్లాటలోనే మా నాయన చచ్చింది యాదుంది!
మొసలి కన్నీళ్ళు కారుస్తూ సర్కారు చేసిన ప్రణాళికల్లో
వాడలు వేరుగా, బడులూ వేరుగ యేర్పాటుచేసినప్పుడే
వారి మనస్తత్వం, వర్గ స్వభావం విదితమయ్యింది!
ఉద్యమాల్ ఒరవడిలో కొందరు నేర్పిన చిలుక పలుకులే
అక్షర దీపం పుణ్యమా అని నేడు మా మహోన్నత ఉద్యమానికి బాటలు వేసింది!
మా లక్ష్యం యేమిటో, గమ్యం యేమిటో తెలిసింది!
యెల్లకాలం మమ్మల్ని మోసం చేయ్లేరు!
మా వాళ్ళను ఎన్నుకొని మీ చేత్తో పెత్తనం చేసే రోజులిక చెల్లవు!
బినామీ పరికరాలుగా వాడుకోటం యిక కుదరదు!
మా వాటా మాకు దక్కే వరకు, మా ఆత్మాభిమానం కాపాడుకునేందుకు
పోరుబాటలో విజయం సాధించితీరుతాం!
వర్ణవ్యవస్థ గొప్పతనం అర్థం కాని భాషలోచెప్పి ఊకదంపుడుపన్యాసాలు చెయ్యకండి!
ఎవరు ఏ పని చేస్తే వారిదాకులమని తెలుసుకోండి!
మాలో చదువుకుంటే బామ్మడు!
యుద్ధం చేస్తే క్షత్రియుడు!
వ్యాపారము, ఆర్థిక ఎదుగుదలచేస్తే వైశ్తులుగా
వ్య్వసాయము పశుపాలన చేసే శ్రామికులుగా మా జనం సర్వం సమిష్టిగా
పాటుపడితేనే సమసమాజం!
లేకుంటే వివాదమే!!
ఇక ఉదయించేది విప్లవమే!!
8/9/2012